‘3 ఎకరాలకు’ ముచ్చెమటలు!
♦ ‘రియల్’తో భూముల రేట్లకు రెక్కలు
♦ ప్రభుత్వం ప్రకటించిన ధరలకు
♦ అందుబాటులో లేని భూములు
♦ ఈ ఏడాది 27 మందికే భూమి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దళితుల భూపంపిణీ కాగితాలకే పరిమితమవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ధరలకు భూములు అందుబాటులో లేకపోవడంతో సర్కారు ఆశయం నీరుగారుతోంది. ‘భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయాధారిత కుటుంబాల’కు కనిష్టంగా మూడు ఎకరాలను పంపిణీ చేయాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. వ్యవసాయోగ్య భూములకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించింది. ఈ మేరకు ప్రైవేటు వ్యక్తుల నుంచి భూ కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో వేయి ఎకరాల మేర దళితులకు భూ పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. ప్రభుత్వ మార్గదర్శకాలు.. చెల్లింపు ధరలపై పరిమితి విధించడంతో ఇప్పటివరకు రెండంకెలను కూడా దాటలేకపోయింది. కేవలం 77.29 ఎకరాలను మాత్రమే జిల్లా యంత్రాంగం సమీకరించి.. దళితులకు పంపిణీ చేసింది. గతేడాదితో పోలిస్తే కొంత పురోగతి ఉన్నప్పటికీ, జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా భూ కొనుగోలు సాధ్యపడదని అధికారయంత్రాంగం తేల్చేసింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లింది. పరిమితులు సడలిస్తే తప్ప ముందుకు సాగలేమని స్పష్టం చేసింది.
కేవలం 14 మండలాల్లోనే...
జిల్లాలో కేవలం 14 మండలాల్లోనే భూములను కొనాలని రాష్ట్ర సర్కారు నిర్దేశించింది. హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే 19 మండలాలను మిన హాయించి.. మిగతా మండలాల్లోనే దళితులకు భూ పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా గరిష్టంగా ఎకరాకు రూ.7 లక్షల వరకు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, రాజధాని చేరువలో ఉన్న జిల్లా కావడం.. భూముల విలువలు ఆకాశన్నంటడడంతో ప్రభుత్వం ప్రకటించిన ధరలకు భూములు లభించడంలేదు. అక్కడక్కడా భూములు దొరికినా.. వాటిలో అత్యధికం వివాదస్పద భూములే ఉంటున్నాయి.
సన్న, చిన్నకారు రైతుల నుంచి భూములను కొనుగోలు చేయకూడదనే నిబంధనలు ఒకవైపు... పట్టాదారు ఒకరయితే.. పొజిషన్‌లో మరొకరు ఉండడం కూడా భూసేకర ణకు ప్రతిబంధకంగా మారుతోంది. దీనికితోడు నీటి లభ్యత ఉండే భూములను కొనుగోలు చేయాలనే నిబంధన కూడా ఈ పథకం ముందుకు సాగ కపోవడానికి కారణంగా కనిపిస్తోంది. దళితులకు భూ పంపిణీ నుంచి మినహాయించిన మండలాల్లో వారికి ఎలా న్యాయం చేస్తారన్న దానిపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. జిల్లావ్యాప్తంగా గుర్తించిన భూముల్లో దాదాపు 659 ఎకరాలు వేర్వేరు కారణాలతో తిరస్కరించగా, దీంట్లో 108 ఎకరాలు కేవలం నీటి జాడలేదని భూగర్భ జలవనరుల శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా పక్కనపెట్టారు.
రియల్‌తో దెబ్బ
జిల్లా పశ్చిమ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడం కూడా ఈ పథకంపై ప్రభావం చూపుతోంది. వికారాబాద్ జిల్లా కేంద్రంగా మారనుందనే ప్రచారంతో ఈ ప్రాంతంలో భూముల విలువలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఈ పరిసర మండలాల్లో భూముల ధరలను ఆమాంతం పెంచేశారు. తద్వారా ప్రభుత్వం ప్రకటించిన ధరలకు భూములు అమ్మడానికి ఎవరు ముందుకు రావడంలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కొంతమంది భూ విక్రయానికి ఆసక్తి చూపినా.. అవి వ్యవసాయోగ్యానికి అనువుగా లేకపోవడంతో తోసిపుచ్చాల్సిన పరిస్థితి అనివార్యమవుతోంది. గతేడాది 16 మంది లబ్ధిదారులకు 48 ఎకరాలను అందజేసిన యంత్రాంగం.. ఈసారి ఇప్పటివరకు 27 మందికి 77.29 ఎకరాలను పంపిణీ చేసింది. మరో 60 ఎకరాలకు సంబంధించి సంప్రదింపులు జరుపుతోంది. దీంటో అధికశాతం యాలాల్, మర్పల్లిలోనే ఉన్నాయి.
కొసరు ధరలతో ఎసరు
పంటలు పండక.. గిట్టుబాటు ధరలు రాక నమ్ముకున్న భూమిని విక్రయిస్తున్న రైతాంగం పట్ల జిల్లా యంత్రాంగం కారుణ్యం ప్రదర్శించడంలేదు. ఎకరాకు గరిష్టంగా రూ.7 లక్షల వరకు కొనుగోలు చేసే వెసులుబాటు ఉన్నా.. మన అధికారులు మాత్రం భూ కొనుగోలులో పిసినారితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు భూ లభ్యత లేదని గగ్గోలు పెడుతూనే.. మరోవైపు ధరల చె ల్లింపుపై బేరం ఆడుతూ రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా గత రెండేళ్లలో రూ.4.22 కోట్లతో 125.29 ఎకరాలను కొనుగోలు చేయగా... అత్యధికంగా ఎకరాకు రూ.4.30 లక్షలను మాత్రమే వెచ్చించారు. ఇక అత్యల్పంగా రూ.2.55 లక్షలకే భూమిని కొన్నారు.
సంప్రదింపులు జరుపుతున్నాం
సాగుకు అనువైన భూములనే పరిగణనలోకి తీసుకుంటున్నాం. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా భూ కొనుగోలులో వెనుకబడ్డా.. గత రెండు నెలలుగా మంచి పురోగతిని సాధించాం. నిరంతర సంప్రదింపులు జరపడం ద్వారా సాధ్యమైనంత మందికి లబ్ధి చేకూరేలా ప్రయత్నాలు సాగిస్తున్నాం. ముందస్తు కార్యాచరణను అమలు చేయడం ద్వారా వచ్చే ఏడాది అవాంతరాలను అధిగమిస్తాం.
- చంద్రారెడ్డి, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్