దళితులను చీల్చేందుకు కుట్ర
దళితులను చీల్చేందుకు కుట్ర
Published Sun, Dec 4 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
– మాల మేధావుల ఫోరం
కర్నూలు(అర్బన్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను చీల్చేందుకు కుట్రలు పన్నుతున్నాయని మాల మేధావుల ఫోరం నాయకులు ఆరోపించారు. ఆదివారం రాత్రి స్థానిక సీక్యాంప్ సెంటర్‌లోని డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సీనియర్ దళిత నేత వై. జయరాజ్, అంబేద్కర్ యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు వి. త్యాగరాజు, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. నాగరాజు, డీఎస్‌పీ జయచంద్ర, మాల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు అశోకరత్నం, మాధవస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగాల్లో 1 శాతం మాత్రమే అభివృద్ధి చెందిన వారు ఉన్నారని, ఇంకా మిగిలిన 99 శాతం దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. ఒక శాతంలో ఉన్న తేడాలతో 99 శాతంగా ఉన్న దళిత ప్రజలను విభజించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మనువాదులు కొందరు మంద కృష్ణమాదిగతో కుమ్మక్కై దళితులను విభజించాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దళితులను ఒక రాజకీయ శక్తిగా ఎదగనీయకుండా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాదిగల ధర్మయుద్ధ సభలో అధర్మ ప్రకటన చేశారని ఆరోపించారు. సమీక్షలో పలు సంఘాలకు చెందిన నాయకులు సలోమి, హెచ్ బాలస్వామి, మునిస్వామి, యాట ఓబులేసు, సుబ్బరాయుడు, జయరాములు తదితరులు పాల్గొన్నారు.
Advertisement