దళితులపై దాడులను అరికట్టడంలో విఫలం
దాడులను అరికట్టడంలో విఫలం
Published Sun, Sep 4 2016 7:19 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జేడీ శీలం మండిపాటు
అమలాపురం రూరల్ : దళితులపై దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కేంద్ర మాజీ మంత్రి, పీసీసీ కో–ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు జేడీ శీలం తీవ్రంగా విమర్శించారు. దళితులపై ఇటీవల దాడులు ఎక్కువయ్యాయని, ఇందులో భాగంగానే సూదాపాలెంలో దళితులపై దాడి జరిగిందని పేర్కొన్నారు. సూదాపాలెం ఘటనలో గాయపడి, అమలాపురం జానికిపేటలో తమ ఇంటి వద్ద కోలుకుంటున్న బాధిత దళితులు మోకాటి ఎలీషా, మోకాటి లాజర్‌ను పీసీసీ నాయకులతో కలిసి జేడీ శీలం ఆదివారం ఉదయం పరామర్శించారు. సమాజంలో సాటి మనుషులను ఇంత అనాగరికంగా, క్రూరంగా దాడి చేయటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సూదాపాలెం ఘటన జరిగి 20 రోజులైనా, ఇంకా కొంతమంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ దాడిలో మరికొంత మందిని పోలీసులు విచారణ చేయలేదని, అందువల్ల ఘటనకు పోలీసులను కూడా బాధ్యులను చేయాలని బాధిత కుటుంబాల సభ్యులు ఆయనకుSవిన్నవించారు. దీంతో శీలం, పీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్రరాజు అక్కడి నుంచే బాధితుల సమక్షంలోనే ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి సూదాపాలెం దాడి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పది రోజుల్లోగా ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరినీ అరెస్టు చేసి, ఛార్జిషీట్ దాఖలు చేస్తామని వారికి ఎస్పీ హామీ ఇచ్చారు. పీసీసీ నాయకులు దాసు వెంకట్రావు, కోకేటి రవి, యార్లగడ్డ రవీంద్ర, అయితాబత్తుల సుభాషిణి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement