దళితులపైకి కార్యకర్తలను రెచ్చగొట్టిన చంద్రబాబు  | Chandrababu incited activists against Dalits | Sakshi
Sakshi News home page

దళితులపైకి కార్యకర్తలను రెచ్చగొట్టిన చంద్రబాబు 

Published Sat, Apr 22 2023 4:35 AM | Last Updated on Sat, Apr 22 2023 2:57 PM

Chandrababu incited activists against Dalits - Sakshi

యర్రగొండపాలెం: దళితులపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు, దళితులపై దాడులు చేసేలా తమ కార్యకర్తలను రెచ్చగొట్టారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. దీంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నేతలు, దళితులపై రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్‌ సీపీ నేతలు ముగ్గురికి  తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

తీవ్ర గాయాలైన వైఎస్సార్‌సీపీకి చెందిన జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ షాబీర్‌బాషా, పెద్దారవీడు మండలంలోని కంభాలపాడు సర్పంచ్‌ బెజవాడ ఆదాం, మరొకరిని ఆస్పత్రికి తరలించారు. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయి ఉండీ దళితులపైకి కార్యకర్తలను రెచ్చగొట్టడంపై  తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.  శుక్రవారం యర్రగొండపాలెం వస్తున్న చంద్రబాబుకు నిరసన తెలుపుతూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఆధ్వర్యంలో దళిత నాయకులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నల్లటి కండువాలు మెడలో వేసుకుని, బెలూన్లు, ప్లకార్డులతో మంత్రి క్యాంప్‌ కార్యాలయం వద్ద రోడ్డుకు ఒక పక్క నిలబడ్డారు.

దళితులనుద్దేశించి నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, గో బ్యాక్‌ చంద్రబాబు, దళిత ద్రోహి చంద్రబాబు, నారా లోకేశ్‌ అంటూ నినాదాలు చేశారు. దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ క్షమాపణ చెప్పిన తర్వాతే ఎస్సీ నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, దళితుల నిరసన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ నాయకులు కొంతమంది.. దాడులు జరపాలన్న ప్రధాన ఉద్దేశంతో మంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు ర్యాలీగా వచ్చారు. వీరిని పోలీసులు కొద్ది దూరంలోనే నిలిపివేశారు.

ఆ తర్వాత చంద్రబాబు కాన్వాయ్‌ మంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చింది. కాన్వాయ్‌ వెళ్లేందుకు ఎటువంటి ఆటంకాలు లేకపోవడం వలన సజావుగా సాగుతుందని పోలీసులు భావించారు. అయితే, చంద్రబాబు హఠాత్తుగా తన కారు డోరు తీసుకొని బయటకు వచ్చారు. నిరసన తెలుపుతున్న మంత్రి సురేష్పైన, దళితుల పైన   సీరియస్‌గా వేలు చూపిస్తూ దూషించడం మొదలుపెట్టారు. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయేలా మాట్లాడారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రాళ్లు, ఇనుప రాడ్లు, చెప్పులు మంత్రి సురేష్  పైన, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, దళితులపైన విసరడం మొదలు పెట్టారు.

పోలీసులు వెంటనే మంత్రిని క్యాంపు కార్యాలయంలోకి తీసుకెళ్లారు. టీడీపీ రాళ్ల దాడిలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ నేతలకు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితిని పోలీసులు చక్కదిద్ది, బాబు కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించారు. గాయాలైన ముగ్గురికీ స్థానిక ప్రభుత్వ వైద్యులతో మంత్రి సురేష్‌ చికిత్స చేయించారు.  

అందరినీ చదివిస్తా : చంద్రబాబు 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ మార్కాపురం: టీడీపీ అధికారంలోకి వస్తే పిల్లలందరినీ చదివిస్తానని ఆ పార్టీ  అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. అందరికీ ఉద్యోగాలు రావాలని, ఉద్యోగాలు వచ్చిన వారందరూ తనను బాగా చూసుకోవాలని అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి యర్రగొండపాలెంలో రోడ్‌ షో నిర్వహించారు. అంతకుముందు మార్కాపురంలో రైతులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి ఇంట్లో ఒకరికే అమ్మ ఒడి ఇస్తున్నారని, మిగతా ఇద్దరూ కూలి పనులకు వెళ్లాలా అంటూ ప్రశ్నించారు. పోలీసులు లా అండ్‌ ఆర్డర్‌ బాగా మెయింటైన్‌ చేస్తున్నారని చెప్పారు. వర్షం కూడా టీడీపీ అంటే భయపడింది తమ్ముళ్లూ.. వర్షమొస్తే కరెంటు పోతుందా అని కేడర్‌ను చంద్రబాబు అడగడంతో కేడర్‌ నోరెళ్లబెట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement