ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తే.. అమలు చేసే ఆలోచన
దళితులకు ఏమన్నా జరిగితే ఎన్నికల సంఘం, డీజీపీలదే బాధ్యత
మాలమహానాడు, ఏపీ ఎమ్మార్పిఎస్ నేతలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ మెజార్టీ సాధించిన తర్వాత దళితులపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నారని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి జయప్రకాష్ కెనడీ విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో దళితులు, మైనార్టీలు, బీసీల సంక్షేమం జరిగిందని, అందువల్లనే ఈ ఎన్నికల్లో ఆయా వర్గాలన్నీ వైఎస్సార్‌సీపీకే మద్దతుగా నిలిచాయని చెప్పారు.
పోలింగ్ జరుగుతున్న రోజే ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ నాయకులు పలు జిల్లాల్లో దళితులపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలు, బీసీలకు సీఎం జగన్ సంక్షేమ పథకాలతో మేలు చేశారని, అందుకు కృతజ్ఞతగా ఈ ఎన్నికల్లో దళితులు, మైనార్టీలు, బీసీలు ఆయనకు అండగా ఉన్నారని తెలిపారు. అది సహించలేని టీడీపీ.. దళితులపై దాడులు చేయాలనే ఆలోచనల్లో ఉన్నట్లుగా తమకు సమాచారం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
30 ఏళ్ల కిందటి కారంచేడు వంటి ఘటనలు పునరావృతం చేయడానికి టీడీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని జయప్రకాష్ కెనడీ ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునే హక్కు దళితులకు లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత దళితులపై దాడులు జరగకుండా ఎలక్షన్ కమిషన్, డీజీపీ పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
ఏపీ ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ మేదర సురేష్ మాట్లాడుతూ టీడీపీ నేతలు పోలింగ్ రోజున దళితులపై దాడులకు తెగబడుతున్నా ఎలక్షన్ కమిషన్ ప్రేక్షకపాత్ర వహించిందని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత దళితులపై దాడులు జరిగితే దానికి ఎలక్షన్ కమిషన్, డీజీపీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో విజయవాడ మాలమహానాడు నగర అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment