![Tuni Municipal Vice Chairperson election postponed for fourth time](/styles/webp/s3/article_images/2025/02/19/atks.jpg.webp?itok=X3F92Wdg)
తునిలో కొనసాగిన టీడీపీ మూకల అరాచకం
వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా
టీడీపీ నేతలకు కొమ్ముకాస్తూ ఎన్నిక అడ్డుకుంటున్న పోలీసులు..
మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మండిపాటు
‘చలో తుని’పై పోలీసుల ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి నేతల అరాచకాలతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక నాలుగోసారి మంగళవారం కూడా వాయిదా పడింది. ఎన్నికల్లో ఓటేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై టీడీపీ మూకలు దాడికి దిగాయి. వైఎస్సార్‌సీపీ తరఫున తొలి నుంచీ వెన్నంటి నిలిచిన 18 మంది కౌన్సిలర్లలో 10 మంది మహిళలుండగా, వీరిలో ఇద్దరు ముగ్గురు గర్భిణులు ఉన్నారు.
టీడీపీ నేతలు, ఆ పార్టీ శ్రేణులు కౌన్సిలర్లపై మూకుమ్మడిగా దాడిచేయడం, కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడంతో మహిళా కౌన్సిలర్లు భయంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు చర్చలు జరిపారు.
దాడి జరగకుండా రక్షణ కల్పిస్తామన్న డీఎస్పీ మాటలు నమ్మశక్యంగా లేవని, టీడీపీ మూకలు పోలీసుల సమక్షంలోనే అరాచకాలకు పాల్పడుతుంటే ఎలాగని రాజా నిలదీశారు. పోలీసులు టీడీపీ నేతలకు కొమ్ము కాస్తూ ఎన్నిక జరగకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల అధికారులు నిర్దేశించిన గడువు 12 గంటలకు ముగియడంతో కోరం లేక ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి, డీపీవో రవికుమార్ ప్రకటించారు.
‘చలో తుని’ని అడ్డుకున్న పోలీసులు
తునిలో టీడీపీ అరాచకాలపై మంగళవారం తలపెట్టిన ‘చలో తుని’ నిరçసన కార్యక్రమానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సిద్ధమయ్యారు. ముందస్తు సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున జాతీయ రహదారులపై మోహరించి పార్టీ నేతలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు గృహ నిర్బంధాలకు గురి చేశారు. సోమవారం అర్ధరాత్రి వరకూ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు 41 నోటీసులు అందజేశారు. అయినప్పటికీ కాకినాడ నుంచి తుని బయల్దేరిన వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పార్టీ కో–ఆర్డినేటర్లు, నేతలను గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసుల తీరుకు నిరసనగా పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.మాజీ మంత్రి, పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్‌లను పోలీసులు రాజమహేంద్రవరంలో గృహ నిర్బంధం చేశారు.
పార్టీ యువజన విభాగం గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త జక్కంపూడి గణేష్, మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, తోట నరసింహం, మాజీ ఎంపీ వంగా గీత, కో –ఆర్డినేటర్లు పిల్లి సూర్యప్రకాశరావు, దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని ముందుకు వెళ్లనివ్వలేదు.
నిలిచిన పాలకొండ చైర్మన్ ఎన్నిక
పాలకొండ: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి కూడా నిలిచిపోయింది. ఎన్నికల అ«ధికారి, పాలకొండ సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి, జేసీ శోభికలు చైర్మన్ ఎన్నికను మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించారు. కూటమికి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు, వైఎస్సార్‌సీపీ నుంచి కూటమిలో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు.
వైఎస్సార్‌సీపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు హాజరు కాలేదు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ఎన్నికల అధికారిని కోరారు. కోరం లేకపోవడంతో ఎన్నికను నిలిపివేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment