మా వీధుల్లో తిరగొద్దు.. ఊర్లోనే ఉండొద్దు..
దళితులపై రెచ్చిపోయిన టీడీపీ రౌడీమూకలు
ఎదురు తిరిగినందుకు దాడి.. ఎనిమిది బైక్‌లు దహనం
బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నేతలపైనా దాడి.. కేసులు
వైఎస్సార్‌సీపీ వారే మాపై దాడి చేశారంటూ టీడీపీ రివర్స్ గేర్
కలెక్టర్, ఎస్పీలు మాకు న్యాయం చెయ్యాలి : దళిత మహిళలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘మా వీధుల్లో మీరు తిరగకూడదు.. మా ముందు చెప్పులు వేసుకుని నడవకూడదు.. దళితులు ఊర్లోనే ఉండకూడదు.. ఖాళీచేసి వెళ్లిపోండి’.. అంటూ టీడీపీ నేతలు దళితులపై విరుచుకుపడ్డారు. సిమెంటు రోడ్డు నిర్మాణ విషయమై టీడీపీ వారికి, సర్పంచ్‌కు మధ్య వివాదం ఏర్పడడంతో ‘పచ్చ’మూకలు అధికార బలంతో ఇలా పేట్రేగిపోయారు. ఇది చినికి చినికి గాలివానగా మారి దాడులకు దారితీసింది. టీడీపీ నేతలు మండల ప్రధాన కార్యదర్శి, మరికొందరు చేసిన ఈ వ్యాఖ్యలపై దళితులూ తిరగబడ్డారు.
ఈ ఘటన చిత్తూరు జిల్లా, నగరి మండలం, తడుకుపేట గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ దాడుల్లో దళితవాడకు చెందిన విక్కీ (20), సంతోష్ (17), ప్రవీణ్‌కుమార్ (23), శ్రీధర్ (27), రమేష్ (43), శ్రీశాంత్ (18), సిద్ధు (14)తో పాటు వీరికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీకి చెందిన గోపి (45)కి గాయాలయ్యాయి. టీడీపీకి చెందిన మండల ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు, రాజేష్ కూడా గాయపడ్డారు. అయితే, గాయపడ్డ దళితులను, వైఎస్సార్‌సీపీ వారిని ఇళ్లలోనే నిర్బంధించిన టీడీపీ నేతలు.. వైఎస్సార్‌సీపీ నేతలే తమపై దాడిచేశారంటూ రాస్తారోకో చేసి వాహనాలను రోడ్డుపై ఆపేసి హంగామా చేశారు.
ఒకవైపు రాస్తారోకో చేస్తూనే మరోవైపు టీడీపీ రౌడీమూకలు దళితులకు చెందిన ఆరు బైక్‌లను కాల్చేశారు. కానీ, దళితులు, వైఎస్సార్‌సీపీ నేతలు 13 మందిపై కేసులు నమోదు చేశారు. మరికొందరిని కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, నిర్బంధంలో ఉన్న దళితులు శుక్రవారం ఉదయం బయటకు రాగానే వారికి జరిగిన అన్యాయం కూడా వెలుగుచూసింది.
మాపై దాడిచేసి వారే నిరసనలు చేస్తున్నారు : దళిత మహిళల ఆందోళన
నిజానికి.. తమపై దాడిచేసిన టీడీపీ వారే నిరసనలకు దిగడం విడ్డూరంగా ఉందని దళిత మహిళలు మండిపడ్డారు. ఊర్లో దళితులు తిరగకూడదంటూ టీడీపీ నేతలు హుకుం జారీచేస్తున్నారని.. వాళ్ల ముందు చెప్పులు వేసుకుని నడవకూడదని, చెప్పులు తలపై పెట్టుకుని వెళ్లండని దౌర్జన్యం చేస్తున్నారని మండిపడుతున్నారు.
పిల్లలకు పాల ప్యాకెట్ తీసుకురావడానికి ఊర్లోకి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉందని.. తమ పిల్లలు పాఠశాలకు వెళ్తే వారిని తిరిగి పంపేశారని, ఇదేం న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక దళితవాడకు చెందిన ఐదుగురు యువకులు కనిపించడంలేదని, వారెక్కడున్నారో తమకు తెలియాలన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి తిరిగామని టీడీపీ అధికారంలోకి రావడంతో సమస్యలు మొదలయ్యాయన్నారు.
రోడ్లపై వెళ్తుంటే చెప్పులతో కొట్టడానికి వస్తున్నారని, బూతులు తిడుతూ వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. తామేం చెయ్యలేమంటూ పోలీసులు చేతులెత్తేస్తున్నారని.. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. కలెక్టర్, ఎస్పీ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
నా కొడుకు ఏమయ్యాడో..
రాత్రి నుంచి నా కొడుకు కార్తీక్ కనిపించడంలేదు. ఏమయ్యాడో వాడిని ఏంచేశారో తెలీడంలేదు. తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతోంది. దళితులు ఈ బాధలన్నీ అనుభవించాలా? అధికారులు దయచేసి నా కొడుకును నా వద్దకు పంపండి. – నీలవేణి, తడుకుపేట దళితవాడ
ఊర్లో ఉండకూడదంటే మేం ఎక్కడికెళ్లాలి?
దళితులు ఊర్లోనే ఉండకూడదంటే మేం ఎక్కడికెళ్లాలి? నడిరోడ్డుపై కూర్చున్న టీడీపీ నేతలు దళితులు ఊర్లోనే ఉండకూడదంటూ అరుస్తూ నిరసనలు చేస్తుంటే వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వం వారిది.. మేమేమీ చెయ్యలేమని పోలీసులే చెబుతున్నారు. మా మామను కొట్టేశారు మాకు దిక్కెవరు? – సుప్రియ, తడుకుపేట దళితవాడ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ పరిస్థితిలేదు..
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు. అందరూ కలిసే ఉండేవారు. ప్రభుత్వం మారడంతో గ్రామస్తుల్లో ప్రవర్తన మారింది. మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. ఎదిరిస్తే కొడుతున్నారు. పాలప్యాకెట్ తీసుకురావడానికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉంది. పిల్లల్ని పాఠశాలకు పంపడానికి కూడా భయపడుతున్నాం. – స్వప్న, తడుకుపేట దళితవాడ
శాంతిభద్రతలు అదుపులోకి తెస్తున్నాం..
రెండువర్గాల మధ్య గొడవల్లో ఇప్పటికే ఒక వర్గం వారు ఇచి్చన ఫిర్యాదు మేరకు 13 మందిపై కేసు నమోదుచేశాం. మరో వర్గం వారు ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేశాం. అదనపు బలగాలను తీసుకొచ్చి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. – మహేశ్వర్‌రెడ్డి, సీఐ, నగరి
Comments
Please login to add a commentAdd a comment