agency area
-
ప్రకృతి పంట.. ఆదాయం ఇంట
గూడూరు: రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు అటవీ ప్రాంతాల్లో లభించే తునికాకును ప్రకృతి సంపద (పంట)గా భావిస్తారు. ప్రతీ వేసవిలో రెండు నెలల పాటు తునికాకే వారికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరు. ఏటా ఆదివాసీలు ఏప్రిల్‌లో తునికాకు సేకరణ ప్రారంభిస్తారు. అయితే ఎక్కువగా మే నెలలో సేకరించడం పూర్తి చేస్తారు. తద్వారా రెండు నెలల పాటు ఆదాయం సమకూరుతుంది. విరివిగా లభ్యం.. మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తునికాకు విరివిగా లభిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల గిరిజన కుటుంబాలు ఎండాకాలం రాగానే తునికాకు సేకరణలో నిమగ్నమవుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మహబూబాబాద్, గూడూరు అటవీశాఖ డివిజన్‌తో పాటు ములుగు, ఏటూరునాగారం, భద్రాద్రి కొత్తగూడెం, గుండాల, బయ్యారం మండలాల్లో ఏప్రిల్, మేలలో తునికాకు సేకరణ జోరందుకుంటుంది. ఒక్కో సంవత్సరం తునికాకు సేకరణ ఎక్కువగా జరిగి ప్రభుత్వ సూచన ప్రకారం ఫారెస్టు అధికారులు ప్రతీ డివిజన్లో టార్గెట్ ఎక్కువగా పెట్టుకుంటున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు వేసవిలో తునికాకు సేకరణను ఉపాధి మార్గంగా ఎంచుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏటా కూలీల ద్వారా ఆకు సేకరించి కట్టలను కొనుగోలు చేస్తోంది. గతేడాది 50 ఆకుల తునికాకు కట్టకు రూ.3 చెల్లించారు. ఈ సంవత్సరం కట్ట ధర పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలి కోడి కూతతో అడవికి పయనం.. తునికాకు సేకరణకు గిరిజనులు తొలికోడి కూతతో మేల్కొని వంటలు చేసుకుంటారు. అంబలి, గంజి తీసుకొని అడవులకు పయనమవుతారు. అడవిలో చెట్టు చెట్టుకు తిరిగి తునికాకు కోసి బస్తాల్లో నింపుకుని ఎత్తుకొస్తారు. కొందరు బస్తాల్లో తీసుకొచ్చిన ఆకులను ఇంటి వద్ద కట్టలు కట్టగా, మరికొందరు అడవిలోనే చెట్ల కింద కూర్చొని 50 ఆకుల చొప్పున కట్ట కడతారు. సాయంత్రం ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన కల్లాల వద్ద వాటిని విక్రయిస్తారు. ప్రతీరోజు ఒక్కో కూలీ రూ.450 నుంచి రూ.500 వరకు సంపాదిస్తారు. గూడూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో.. మహబూబాబాద్ జిల్లా గూడూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో మట్టెవాడ, కొంగరగిద్ద, గోపాలపురం గ్రామాలతో పాటు మరికొన్ని చోట్ల దాదాపు 10 కల్లాలను ఏర్పాటు చేస్తారు. గతేడాది గూడూరు రేంజ్ పరిధిలో 2 వేల స్టాండర్ట్ బ్యాగులు (20 లక్షల) తునికాకు కట్టల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆన్లైన్లో చెల్లింపులు.. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన తునికాకు సేకరణపై నిఘా పెడతాం. ఆకుల కట్టలు విక్రయించిన కూలీలకు ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేసి డబ్బులు చెల్లిస్తాం. ఆకులు సేకరించే వారి నుంచి ఆధార్ కార్డు, ఫొటో, బ్యాంకు ఖాతా జిరాక్స్‌లను సేకరిస్తాం. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో ఆకు సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – బత్తుల విశాల్, డీఎఫ్ఓ, మహబూబాబాద్ రెండు నెలలు ఉపాధి వేసవిలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న మాకు తునికాకు సేకరణ ఉపాధినిస్తుంది. రెండు నెలల పాటు పని దొరుకుతుంది. ప్రతీరోజు తెల్లవారు జామునే అడవికి వెళ్తాం. బస్తాల నిండా ఆకు సేకరించి, ఎండ ముదరకముందే ఇంటికి చేరుకుంటాం. మధ్యాహ్నం కుటుంబం అంతా కలిసి కూర్చొని 50 ఆకులతో కట్టలు కడుతాం. సాయంత్రం కల్లం వద్దకు తీసుకెళ్లి విక్రయిస్తాం. – మేడ సమ్మయ్య, మట్టెవాడ, గూడూరు తునికాకు ఉపాధి కల్పిపస్తుంది మండుటెండా కాలంలో కూలీ పనులు దొరకవు. దీంతో ప్రతీ సంవత్సరం తునికాకు సేకరణ ఉపాధినిస్తుంది. రోజు పొద్దున్నే అడవికి వెళ్లి ఆకు కోసుకొస్తాం. మధ్యాహ్నం కట్టలు కట్టి కల్లంలో అమ్ముతాం. రోజు రూ.450 నుంచి రూ.500 వరకు డబ్బులు వస్తాయి. – ప్రవళిక, మర్రిమిట్ట, గూడూరు వృద్ధులకు సైతం ఆదాయం తునికాకు సేకరణతో విద్యార్థులు, వృద్ధులకు డబ్బులు వస్తాయి. విద్యార్థులు బడులు మొదలయ్యే ముందు కొత్త దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు కొనేందుకు వాడుకుంటారు. వృద్ధులు తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు. – రమ్య, మర్రిమిట్ట, గూడూరు -
అరకు లోయలో 5.9 డిగ్రీలు
సాక్షి, పాడేరు/చింతపల్లి: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో శనివారం అర్ధరాత్రి నుంచి చలిగాలులు విజృంభించాయి. ఆదివారం ఉదయం 10గంటల వరకు పొగమంచు దట్టంగా అలముకుంది. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో మంచు పోయిన తరువాత కూడా చలి తీవ్రత తగ్గలేదు. అరకులోయలో 5.9 డిగ్రీలు, జీకే వీధి 6.1, పాడేరు 6.9, హుకుంపేట 6.9, డుంబ్రిగుడ 7, చింతపల్లి 7.3, పెదబయలు 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.చలితీవ్రతతో మన్యంలోని స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 10 గంటల వరకూ మంచు అధికంగా కురవడంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. సాయంత్రం 4 గంటల నుంచి చలి గాలులు వీస్తుండటంతో వృద్దులు, చిన్నారులు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. -
Andhra Pradesh: ఏజెన్సీ గజగజ
ఏజెన్సీ ప్రాంతంలో సాయంత్రం 4గంటల నుంచే చలిగాలులు విజృంభిస్తున్నాయి. పాడేరు ఘాట్‌లో చలితీవ్రత మరింత ఎక్కువైంది. శనివారం పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 10 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 14డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 14.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీవ్యాప్తంగా ఉదయం 10గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. సాయంత్రం నుంచే అన్ని వర్గాల ప్రజలు చలిమంటలను ఆశ్రయించారు. ఘాట్ ప్రాంతాల్లో చలి మరింత ఇబ్బంది పెడుతోంది.– సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) -
ఏజెన్సీ గజగజ
సాక్షి, పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలను చలిగాలులు వణికిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలిగాలులు విజృంభిస్తుండటంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో గురువారం 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 11.3, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఏజెన్సీలో అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తోంది. పాడేరులో గురువారం ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. పొగమంచుతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.2 -
మధుర ఫలం
రాజానగరం: రుచిలో సిమ్లా యాపిల్ని మరపించే చాగల్నాడు కస్టర్డ్ యాపిల్ (సీతాఫలం)కి తూర్పు గోదావరి జిల్లాలోనే కాదు దేశ రాజధాని ఢిల్లీలో కూడా మంచి పేరు ఉంది. అయితే చాగల్నాడు ప్రాంతంలో రియలెస్టేట్ విస్తరిస్తున్న నేపథ్యంలో సీతాఫలాల తోటలు అంతరించిపోతున్నాయి. ఫలితంగా చాగల్నాడు సీతాఫలాలకు డిమాండ్ పెరిగి ధర కూడా పెరిగిపోయింది. చాగల్నాడు ప్రాంతంలో తోటలు (మామిడి, జీడిమామిడితో కలసి ఉంటాయి) తరిగిపోవడంతో సీతాఫలాల దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. సీతాఫలాలు పక్వానికి రావాలంటే శీతలంతో పాటు వర్షాలు కురుస్తూ ఉండాలి. ఈ కారణంగానే ప్రస్తుతం ఈ ప్రాంతంలో అక్కడక్కడా లభిస్తున్న సీతాఫలాలతో ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా దొరుకుతున్న సీతాఫలాలను జోడించి వ్యాపారులు స్థానికంగా విక్రయిస్తున్నారు. ఇక్కడ నుంచే జిల్లాలోని పలు ప్రాంతాలకు కూడా రవాణా అవుతున్నాయి. ఈ విధంగా సీజన్లో సీతాఫలాలు క్రయవిక్రయాల ద్వారా సుమారు రూ.7.5 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అంచనా. గుర్తించడం చాలా కష్టం రెండు దశాబ్దాల క్రితం జాతీయ రహదారి విస్తరణకు ముందు ఈ ప్రాంతంలో రోడ్లకు ఇరువైపులా సీతాఫలాల తోటలు విస్తారంగా ఉండేవి. రాత్రి సమయాల్లో బస్సుల్లో ప్రయాణించే వారికి లైటింగ్‌లో సీతాఫలాలు నిగనిగలాడుతూ కనిపించేవి. అంతేకాదు సీజన్లో దివాన్‌చెరువు కూడలి క్రయ, విక్రయదారులతో కిక్కిరిసిపోయేది. ఒక్కో సమయంలో ట్రాఫిక్ జామ్ కూడా జరుగుతూ ఉండేది. అయితే నేడు ఆ పరిస్థితులు లేవు. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న సీతాఫలాలు చాగల్నాడు ఫలాలో, ఏజెన్సీవో కూడా తెలియని పరిస్థితి. వీటి మధ్య ఉన్న తేడా స్థానికులకే మాత్రమే కొంత అవగాహన ఉంటుంది. దీంతో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా ప్రయాణికులు చాగల్నాడు ఫలాలుగానే భావించి కొనుగోలు చేసుకుని, తమ ప్రాంతాలకు తీసుకెళుతుంటారు. ఎందరికో ఉపాధి సీతాఫలాల ద్వారా సీజన్లో ఎందరికో జీవనోపాధి లభిస్తుంటుంది. రాజానగరం నుంచి రాజమహేంద్రవరం వరకు జాతీయ రహదారి వెంబడి విరివిగా వెలసిన దుకాణాలతో పాటు సైకిళ్ల పైన, తోపుడు బళ్లపైన జిల్లా అంతటా వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు కొనుగోలు చేస్తున్నారు.చాగల్నాడు సీతాఫలాలు నిల్వకు ఆగవు. పక్వానికి వచ్చిన వెంటనే కళ్లు విచ్చుకున్నట్టుగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి. అయితే ఏజెన్సీ సీతాఫలాలు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ సీజన్లో సీతాఫలాల వ్యాపారం రూ.ఏడున్నర కోట్లు దాటుతుందని ఒక అంచనా. జాలై నుంచి అక్టోబరు వరకు ఏజెన్సీ సీతాఫలాలను దిగుమతి చేసుకుని, రూ.4.50 కోట్లకు పైబడి వ్యాపారం చేస్తుంటారు. ఇక తోటలు తగ్గినాగాని చాగల్నాడు సీతాఫలాల ద్వారా ఈ సీజన్లో (అక్టోబరు) రూ.రెండు కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ఏ విధంగా చూసిన ఈ సీజన్లో సీతాఫలాల ద్వారా జిల్లాలో రూ.ఏడున్నర కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా.వంద ఫలాలు రూ.2,500 పైమాటే.. తోటలు విస్తారంగా ఉన్న సమయంలో వంద సీతాఫలాలను రూ.50 నుంచి రూ.వందకు విక్రయించే వారు. కానీ నేడు ఆ ధరకు అడిగితే ఎగాదిగా చూస్తారు. ఎందుకంటే వందల లెక్కన కొనుగోలు చేసే రోజులు పోయాయి. మామిడి పండ్ల మాదిరిగా డజను, పాతిక, పరక చొప్పున కొనాల్సి వస్తుంది. గతంలో మాదిరిగా వంద ఫలాలు కొనాలంటే రూ.2500 పైనే ధర పలుకుతుంది. అంత మొత్తం పెట్టలేక చాలామంది డజన్ల లెక్కన కొనుగోలు చేస్తున్నారు. కాయల సైజులను బట్టి పరక, డజను లెక్కల్లో డజను రూ.300 నుండి రూ.500కు విక్రయిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి వీటిని కొంతమంది స్థానిక వ్యాపారులు హోల్‌సేల్‌గా తీసుకువచ్చి, జాతీయ రహదారి వెంబడి ఉన్న స్టాల్స్‌కి సరఫరా చేస్తుంటారు. అక్టోబర్ చివర్లో షోలాపూర్ ఫలాలు.. ఇదిలా ఉండగా దసరా ఉత్సవాల సమయంలో చాగల్నాడు సీతాఫలాలు అందుబాటులోకి వస్తాయి. అయితే తోటలు తక్కువగా ఉండటంతో అవి ఎప్పుడు వచ్చాయి. ఎప్పుడు అయిపోయాయనే విషయం కూడా తెలియకుండా జరిగి పోతుంటుంది. దీంతో ఈ సీజన్ ప్రారంభంతో ఏజెన్సీ సీతాఫలాలను చాగల్నాడు మార్కెట్‌కి వస్తే, ఆఖరులో (అక్టోబరు, నవంబరు) వ్యాపారులు షోలాపూర్ నుంచి కూడా సీతాఫలాలను దిగుమతి చేసుకుని తమ వ్యాపారాలు కొనసాగిస్తుంటారు.ఇవి చూడటానికి చాగల్నాడు సీతాఫలాల మాదిరిగానే నిగనిగలాడుతూ కనిపిస్తుంటాయి. దీంతో ఈ సీజన్లో షోలాపూర్ కాయల ద్వారా సుమారు రూ.కోటి వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని ఒక అంచనా. దివాన్‌చెరువు పండ్ల మార్కెట్‌కి షోలాపూర్ నుంచి వచ్చే యాపిల్, దానిమ్మల లోడులో వీటిని తీసుకువస్తుంటారు. సీజన్లో దొరికే ఫలాలను తినాలి సీజన్లో దొరికే ఫలాలను తినడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రకృతి మనకు సీజనల్‌గా వచ్చే వ్యాధుల నివారణకు ఫలాలను ప్రసాదిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్లో సీతాఫలాలను తీసుకోవడం వలన ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అందుకనే వీటికి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. – అద్దంకి సీతారామమ్మ, అచ్యుతాపురం సీజనల్ పండ్లని నిర్లక్ష్యం చేయవద్దు నేటి ఆధునిక సమాజంలో అంతా రెడీమేడ్ ఫుడ్‌కు అలవాటు పడటం వలన జనం జబ్బుల బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో చేరి, పండ్లు తిని నయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి సీజనల్‌గా దొరికే పండ్లని ఒక్కసారైనా తింటే సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు. – సత్తి త్రిమూర్తులు, ముక్కినాడపాకలు -
ఏజెన్సీ ‘నాడి’ పట్టేదెవరు
అందితే సర్కారు వైద్యం.. లేదంటే ఆకు పసర్లే ఆధారం అన్నట్టుగా బతికే గిరిజనులు వారు.. ఏదైనా జబ్బు వస్తే దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లడానికే నానా యాతన. అక్కడ డాక్టర్ లేకుంటేనో, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటేనో.. ప్రాణాల మీద ఆశలు పోయినట్టే. పట్టణాలకు వచ్చి ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేక.. దూర ప్రాంతాల్లోని పెద్దాస్పత్రులకు తరలించేలోపే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు.. ఏనాడూ ఎవరూ సరిగా పట్టించుకోని సమస్య. ప్రభుత్వాలు ఆస్పత్రులు ఏర్పాటు చేయకపోవడం.. ఆస్పత్రులు కట్టినా పోస్టులు భర్తీ చేయకపోవడం.. చేసినా ఆ వైద్యులు, సిబ్బంది ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోవడం.. పరిస్థితి మళ్లీ మొదటికి రావడం.. ఇంకా ఎన్నాళ్లిలా గోసపడాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి నెట్వర్క్: ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందించాల్సిన వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు నామ్కేవాస్తేగా మారుతున్నాయి. పీహెచ్‌సీల నుంచి వచ్చిన రోగులకు స్పెషాలిటీ సేవలు అందించాల్సింది పోయి.. బోధనాస్పత్రులకు రిఫర్ చేసేందుకే పరిమితం అవుతున్నాయి. కాదంటే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు దారి చూపిస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరతే దీనికి కారణమవుతోంది. అయితే స్పెషలిస్టు వైద్యులు లేకపోవడం, వారు ఉన్నా రేడియాలజిస్టులు, మత్తుమందు నిపుణులు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్ల వంటివారు లేకపోవడంతో.. వైద్య సేవలు సరిగా అందించలేని దుస్థితి నెలకొంది.ప్రోత్సాహక నిర్ణయాలేవీ?ఏజెన్సీ ఆస్పత్రుల్లో పనిచేయడానికి వైద్యులు, సిబ్బంది వెనకడుగు వేస్తున్న అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రోత్సాహకాలు ఇస్తే పరిస్థితి మారుతుందని, ఏపీలో వైఎస్ జగన్ హయాంలో తీసుకున్న చర్యలు బాగున్నాయని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో కాంట్రాక్టు పద్ధతిలో స్పెషలిస్టు వైద్యుల జీతభత్యాలను రూ.2.50లక్షలకు పెంచారని, బిడ్డింగ్ నెగోషియేషన్‌కు అవకాశం కల్పించారని.. దీంతో భద్రాచలం పక్కన ఉన్న అల్లూరి జిల్లాలో గైనకాలజిస్టు ఏకంగా నెలకు రూ.3.80 లక్షల జీతం అందుకోగలుతున్నారని వివరిస్తున్నాయి.డాక్టర్లు, సిబ్బంది బదిలీలతో..ఏజెన్సీ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచే సేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఇష్టపడటం లేదు. సౌకర్యాలు, సదుపాయాల లేమితోపాటు వేతనాల సమస్య కూడా దీనికి కారణమవుతోంది. వైద్యవిధాన పరిషత్‌లో మైదాన, గ్రామీణ, ఏజెన్సీ అన్ని ప్రాంతాల వారికి ఒకేవిధమైన జీతభత్యాలు అందుతున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 శాతం అలవెన్సులు, పాత జిల్లా కేంద్రాల్లో 17శాతం అలవెన్సులు అందితే.. ఏజెన్సీ ఏరియాల్లో 11 శాతమే వస్తాయని వైద్యులు, సిబ్బంది చెప్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే.. అదనంగా అందాల్సిందిపోయి, తక్కువ వేతనం ఉండటం ఇబ్బందికరమని అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఏజెన్సీ ఏరియాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల చేపట్టిన బదిలీల్లో ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు చాలా మంది వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది వెళ్లిపోవడం గమనార్హం.కొన్ని ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి..భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో నాలుగేళ్ల కింద 13 మంది వైద్యులు సేవలందించగా.. ఏటా వేల సంఖ్యలో కాన్పులు, సర్జరీలు జరిగేవి. ఒక్కొక్కరుగా వైద్యులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడంతో వైద్య సేవలు తగ్గిపోయాయి. సరిపడా గైనకాలజిస్టులు లేక కాన్పు కోసం వచ్చే గర్భిణులను ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇక ఇక్కడ ఒక్కరే నేత్ర వైద్యుడు ఉన్నారు. వారానికి ఒక రోజును పూర్తిగా సర్జరీలకే కేటాయించినా.. వచ్చే డిసెంబర్ వరకు అపాయింట్మెంట్లు ఫుల్ అయ్యాయి.⇒ నాగర్‌కర్నూల్ జిల్లా టీజీవీవీపీ పరిధిలో నాలుగు ఆస్పత్రులు ఉన్నాయి. 107 మంది డాక్టర్లు పనిచేయాల్సిన చోట 36 మందే ఉన్నారు.⇒ మహబూబాబాద్ జిల్లా గార్లలో ఇటీవలి వరకు 10 మంది వైద్యులు పని చేశారు. ఇటీవలి బదిలీల్లో తొమ్మిది మంది వెళ్లిపోగా ఒక్కరే మిగిలారు.⇒ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 173 డాక్టర్ పోస్టులకుగాను 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ఆస్పత్రిలో 15 మంది పనిచేయాల్సిన చోట ఐదుగురే ఉన్నారు.⇒ ములుగు జిల్లా ఏటూరునాగారం ఆస్పత్రిలో 17 పోస్టులకుగాను నలుగురే ఉన్నారు.⇒ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆస్పత్రిలో 33 డాక్టర్ పోస్టులుండగా 11 మందే పనిచేస్తున్నారు. ఇక్కడ గైనకాలజీ, పీడియాట్రిక్ వైద్యులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.ములుగు జిల్లా మంగపేట మండలం నర్సాపురానికి చెందిన వల్లె పోగు వినోద్‌బాబు కడుపునొప్పి తో బాధపడుతూ మణుగూరు ఆస్పత్రికి వెళ్లాడు. సర్జరీ సౌకర్యం లేనందున భద్రాచలం వెళ్లాలని వైద్యులు సూచించారు. అప్పు చేసి ఆటోలో భద్రాచలం వస్తే ఇక్కడ మరో ఇబ్బంది ఎదురైంది. ‘స్కానింగ్ చేసేందుకు రేడియాలజిస్టు లేడు. ఆపరేషన్‌కు సహకరించే మత్తు డాక్టర్ బదిలీ అయ్యాడు. కొత్తగూడెం వెళ్లాలంటూ వైద్యుల నుంచి సూచన వచ్చింది.కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం మోవాడ్‌కు చెందిన కుమురం లక్ష్మి జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు జ్వరం రావడంతో కాలేజీ సిబ్బంది పారాసిటమాల్ మాత్రలు ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పూర్తిస్థాయి వైద్యం అందే పరిస్థితి లేదని.. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. లక్ష్మి అదే రోజు రాత్రి మృత్యువాత పడింది.ఆసిఫాబాద్ మండలం మానక్గొందికి చెందిన మడావి రవి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఓ ఆటోడ్రైవర్ అతడిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. తలకు బలమైన గాయమవడం, చెవి నుంచి రక్తం కారుతుండటంతో వైద్యులు రవిని మంచిర్యాల ఆస్పత్రికి రెఫర్ చేశారు. కుమురం భీం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్ సర్జన్, న్యూరోసర్జన్, ఇతర స్పెషాలిటీ వైద్య నిపుణులు లేక.. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన నిండు గర్భిణి స్వర్ణకు రాత్రి 8 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో అమ్రాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అందుబాటులో లేక అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే.. ఆమెకు బీపీ ఎక్కువగా ఉందంటూ నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రికి పంపించారు. రాత్రి 10 గంటలకు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి వెళ్తే.. అక్కడి డాక్టర్లు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. చివరికి మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో అర్ధరాత్రి ప్రసవం చేసినా తల్లీబిడ్డ ఇద్దరూ మరణించారు. ఆరు నెలల కింద ఈ ఘటన జరిగినా.. ఇప్పటికీ ఇక్కడి ఆస్పత్రుల్లో పరిస్థితులేవీ మారలేదు. -
ప్రకృతి ఒడిలో పల్లవించే సంగీతం
వాయిద్యాలు వారికి సరిగమలు తెలియవు. శృతి లయలు అసలే తెలీదు. కానీ శ్రవణానందంగా పాడగలరు. శ్రోతలను రంజింపజేయగలరు. తకిట తథిమి అనే సప్తపదులు నేర్చుకోలేదు. కానీ లయ బద్ధంగా అడుగులు వేయగలరు. సంప్రదాయ నృత్యరీతుల్లో ఎన్ని మార్పులొచ్చినా... తరతరాలుగా అలవాటైన పద విన్యాసాలనే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ప్రకృతిని పరవశింపజేస్తున్నారు. ఇందుకోసం వినియోగించే వాయిద్య పరికరాలు కూడా వారు సొంతంగా తయారు చేసుకున్నవే. ఇంతగొప్ప నైపుణ్యం గలిగిన వీరు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో జీవిస్తున్నారు. పురాతనంగా వస్తున్న సంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిస్తూప్రకృతి ప్రసాదించిన అడవితల్లి ఒడిలో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి జీవనం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. బుట్టాయగూడెం: దట్టమైన అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా కొండ కోనల నడుమ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న కొండరెడ్డి గిరిజనుల జీవనశైలి విచిత్రంగా ఉంటుంది. సంస్కృతీ, సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. వీరికి బయటి ప్రపంచంతో పనిలేదు. అటవీ ప్రాంతమే వారికి ఆలవాలం. చుట్టూ కొండకోనలు వాగు వంకలతో అలరారే గిరి పల్లెల్లో ప్రకృతి నేరి్పన సంగీతం, నాట్యంతోనే జీవితాన్ని ఆనందంగా మలచుకుంటున్నారు.గిరిజనుల్లోనే కోయ తెగకు చెందిన వారు ‘రేరేలయ్య.. రేల... రేరేలా... రేలా..’ అంటూ పాడుకుంటే... కొండరెడ్లు ‘జొన్నకూడు.. జొన్న విల్లు.. జొన్నకూలితే.. పోతేనత్త’ అంటూ కొత్త పంటలు వచ్చిన సమయంలో పసుపు పచ్చ పండగ, మామిడి పండగ, చింత పండగ, భూదేవి పండగల్లో పాడుకుంటారు. అలాగే పెళ్లిళ్ల సమయంలో కొండరెడ్లు ‘కళ్లేడమ్మ.. కళ్లేడమ్మ.. గోగుల పిల్లకు.. కెచ్చెల పిల్లోడు’ అంటూ పెళ్లికి సంబంధించిన పాటలు పాడుతూ లయ బద్ధంగా డోలు వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. ఇప్పటికీ గిరిపల్లెల్లో పండుగలు, శుభ కార్యాల్లో ఆదివాసీ గిరిజన సంప్రదాయ డోలు, కొమ్ముల నృత్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. సొంతంగా వాయిద్య పరికరాల తయారీ కొండరెడ్డి గిరిజనులు వాయిద్య పరికరా లు సొంతంగా తయారు చేసుకుంటారు. అడవిలో లభించే ఉస్కటేకు, వేగెసా చెట్ల తో డప్పుల నమూనాలను తయారు చేసి వాటికి మేక చర్మాలను అతికించి వాయి ద్య పరికరాలను తయారు చేసుకుంటారు. అలాగే అడ్డతీగ గిల్లలతో గుత్తులు కట్టి డప్పు వాయిద్యాల నడుమ ఆ గిల్లలు ఊపుతూ చక్కటి తాళంతో మహిళలు నృత్యం చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా గ్రామాల్లో పండగ సమయాల్లో నృత్యాలు చేస్తారు. బాట పండగ, పప్పు పండగ, మామిడి పండగ నాడు వీరి ఆటపాటలతో కొండలు ప్రతిధ్వనిస్తుంటాయి. పోడు వ్యవసాయమే జీవనాధారం పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో సుమారు 11వేల మంది కొండరెడ్డి గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకునే వీరు పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప కొండ దిగి బయట ప్రపంచం వైపు రారు. ఆయా గ్రామాల్లో అందరూ కలిసి కట్టుగా ఉంటూ అన్ని శుభకార్యాలను వారి సంప్రదాయంలో ఎంతో వైభవంగా చేసుకుంటారు. పూర్వికుల నుంచి వస్తున్న సంప్రదాయం మా పూర్వీకుల నుంచి గ్రామాల్లో శుభకార్యాలకు డోలు కొయ్య నృత్యాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్నే మేం కొనసాగిస్తున్నాం. సమాజంలోని మార్పుల వల్ల ఎన్ని కొత్త రకాల వాయిద్యాలు వచ్చినా మా డోలు కొయ్యి వాయిద్యమే మాకు వినసొంపుగా ఉంటుంది. అందులోనే మాకు సంతోషం ఉంటుంది. మాకు ప్రకృతి నేరి్పన సంగీతమిది. – బొల్లి విశ్వనాథరెడ్డి ఆ నృత్యాల్లో అందరం మైమరచిపోతాం మా గిరిజన గ్రామాల్లో ఏటా వేసవిలో బాట పండగ, పప్పు పండగ, మామిడి పండగతో పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో మేం తయారు చేసుకొన్న వాయిద్య పరికరాలు వాయిస్తూ లయబద్ధంగా నృత్యాలు చేస్తాం. ఆ సమయంలో చిన్నాపెద్ద తేడా ఉండదు. అందరూ కలసి సంతోషంగా ఆనందంగా నృత్యాలు చేస్తాం. ఇది మా పూర్వికుల నుంచి వస్తున్న ఆచారం. – గోగుల గంగరాజు రెడ్డి -
నేడు ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ప్రారంభించనున్న సీఎం జగన్
-
ఏజెన్సీలో హైవే
సాక్షి, ఏలూరు ప్రతినిధి: ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నూతన జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించి ఏజెన్సీ మీదుగా ప్రధాన రహదారుల మధ్య కనెక్టివిటీ పెంచే జాతీయ రహదారికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ నుంచి ఆంధ్రా మధ్య దూరాన్ని తగ్గించేలా హైవే ప్రణాళిక ఖరారు చేశారు. మొదటిసారిగా పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన పోలవరంలో అత్యధిక భాగం నాలుగు వరుసల రహదారి నిర్మాణం కానుండటం విశేషం. ఎన్‌హెచ్ 365 బీబీ రెండో ప్యాకేజీ పనులకు రూ.367.97 కోట్లు మంజూరు కావడం, భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో వచ్చే నెలాఖరు నాటికి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సూర్యాపేట నుంచి పట్టిసీమను కలిపేలా.. సూర్యాపేట నుంచి ఖమ్మం, చింతలపూడి నియోజకవర్గం మీదుగా దేవరపల్లి జాతీయ రహదారికి ఇప్పటికే కనెక్టివిటీ పెంచేలా గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటు ఏజెన్సీ ఏరియాలో పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సమీపంలోనే జాతీయ రహదారి 365 బీబీ నిర్మాణ పనులకు ఆమోదం లభించింది. సూర్యాపేట నుంచి కూసుమంచి, ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావుపేట మీదుగా ఏపీలోని జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మీదుగా పోలవరం వద్ద పట్టిసీమ కలిపేలా రహదారిని డిజైన్ చేశారు. జీలుగుమిల్లి నుంచి పట్టిసీమ మీదుగా రాజమండ్రి వరకు మొత్తం 86.5 కిలోమీటర్ల మేర రహదారి ఉంది. ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసల రహదారిగా నిరి్మంచడానికి వీలుగా టెండర్ ఖరారు చేశారు. దీనిలో భాగంగా మొదటి విడతలో జీలుగుమిల్లి నుంచి పోలవరం వరకు 365 బీబీ నిర్మాణ పనులు మొదటి ప్యాకేజీలో భాగంగా జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం నుంచి జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం, కేఆర్ పురం, ఎల్ఎన్డీ పేట మీదుగా పట్టిసీమ వరకు 40.4 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.367.97 కోట్లు మంజూరు చేశారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో 52.89 హెక్టార్ల భూమి అవసరమవుతుందని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి గ్రామ సభ కూడా నిర్వహించారు. వచ్చే నెల రెండో వారానికి టెండర్లు పూర్తి చేసి నెలాఖరు నాటికి పనులు ప్రారంభించే అవకాశముంది. -
చింతపల్లిని వణికిస్తున్న చలిపులి
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): జిల్లాలోని ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకులోయ, చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 8.3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రోజుల వ్యవధిలోనే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో గిరిజనులు వణికిపోయారు. పాడేరు మండలం మినుములూరులో 11డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ అంతటా పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటలకు కూడా మంచు తెరలు అలుముకుంటున్నాయి. చింతపల్లితో పాటు లంబసింగి, గూడెంకొత్తవీధి ప్రాంతాల్లో ప్రయాణికులు కూడా చలి తీవ్రతకు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. -
TS: ఎన్నికలకు అంతా రెడీ.. ఏజెన్సీల్లో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. నేటితో ప్రచారానికి కూడా తెరపడనుంది. మైకులు మూగబోగనున్నాయి. తెలంగాణలోని 13 స్థానాల్లో సాయంత్రం నాలుగు గంటలకు, 106 స్థానాల్లో సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియనుంది. ఇక, ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణకు సెంట్రల్ ఫోర్స్ కూడా చేరుకుంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 30న ఎన్నికలు పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల విధుల్లో లక్ష మంది పోలీసు సిబ్భంది ఉన్నారు. రాష్ట్ర పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు కూడా విధుల్లో ఉండనున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ ఫోర్స్ కూడా తెలంగాణకు చేరుకుంది. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు ఫోర్స్‌ను కేటాయించారు. ఫుల్ అలర్ట్.. తెలంగాణ ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక.. 4,400 సమస్యాత్మక ప్రాంతాలకు అదనంగా సిబ్బందిని కేటాయించారు. ఎన్నికల విధుల్లో అస్సాం రైఫిల్స్, బోర్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ఇక, ఎన్నికల విధుల్లో 65వేల మంది తెలంగాణ పోలీసులు ఉన్నారు. 18వేల మంది హోంగార్డులు కూడా పనిచేయనున్నారు. ఇప్పటికే ఎన్నికలు బహిష్కరణకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మూడు కమిషనరేట్లలో భద్రత పెంపు.. మరోవైపు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మూడు కమిషనరేట్స్ పరిధిలో 70 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. పోలింగ్ బూత్ ఫోర్స్, రూట్ మొబైల్, పెట్రోలింగ్ టీమ్స్, బ్లూ కోట్స్‌తో పాటు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులతో క్విక్ రెస్పాన్స్ బృందాలను రెడీ చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 30వేల మందికిపైగా బందోబస్తులో ఉంటారు. అమలులోకి 144 సెక్షన్.. బుధవారం సాయంత్రం నుండి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఐదు అంచల భద్రతను ఏర్పాటు చేశారు. మూడు కమిషనరేట్స్ పరిధిలో వెయ్యి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బుధవారం సాయంత్రం నుంచి డిసెంబర్ ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకుమించి గుమ్మిగూడరాదు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచారాలు నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. -
ఏజెన్సీలో ఎలా?
సాక్షి, ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలని, ప్రచారానికి వచ్చే నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చా రు. ఇటీవల కాలంలో వరుసగా కరపత్రాలు, లేఖలు విడుదల చేస్తున్నారు. దీంతో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ యంత్రాంగానికి కత్తిమీద సాములా మారే అవకాశం కనిపిస్తోంది. గోదావరి తీరంలో.. ఒకప్పుడు ఉత్తర తెలంగాణతో పాటు నల్లమల అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉండేవి. ప్రభుత్వ ఆదేశాల కంటే మావోయిస్టుల హెచ్చరికలే పల్లెల్లో ప్రభావం చూపించేవి. రానురాను మావోయిస్టుల ప్రభావం తెలంగాణలో తగ్గిపోయింది. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం మావోయిస్టులు బలంగా తమ ఉనికి చాటుతున్నారు. ఆ ప్రభావం సరిహద్దు పంచుకుంటున్న మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దు ఉన్న గోదావరి ఏజెన్సీలో స్థానిక సంస్థలు మొదలు చట్టసభల వరకు ప్రతీ ఎన్నికల వేళ యుద్ధ వాతావరణం తలపిస్తోంది. గంట ముందుగానే సాధారణ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కానీ మావోయిస్టుల ప్రభావం ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను అక్కడి నుంచి తరలిస్తారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వచ్చే దారులు, మార్గమధ్యలో ఉన్న కల్వర్టులను పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు చేస్తారు. అయినా ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈసారి ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించారు. అప్రమత్తమైన పోలీసులు ఎన్నికల నేపథ్యంలో ఇటు పోలీసులు, అటు కేంద్ర బలగాలు సరిహద్దులో అడవులను విస్తృతంగా జల్లెడ పడుతున్నాయి. భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్ ఏజెన్సీ ఏరియాల్లో పర్యటిస్తూ పోలీసు సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహించడంతో పాటు అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు భరోసా కల్పించేలా పోలీసు కవాతు నిర్వహిస్తున్నారు. కరపత్రాల కలకలం ఈసారి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పక్షం రోజులకు మావోయిస్టుల నుంచి లేఖలు వచ్చాయి. ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీలు, నాయకులను నిలదీయండి. మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎన్నికలను బహిష్కరించండి.. అంటూ మావోయిస్టు తెలంగాణ కమిటీ పేరుతో చర్లలో కరపత్రాలు వెలువడ్డాయి. అంతకు ముందు అల్లూరి సీతారామరాజు – భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లెందు – నర్సంపేట డివిజన్ కమిటీల పేరుతోనూ లేఖలు వచ్చాయి. -
గిరిజన ప్రాంతాలకు కొత్త వెలుగులు
-
ఏజెన్సీకి వైద్యాధికారులు
సాక్షిప్రతినిధి, వరంగల్: ఏజెన్సీలో ప్రబలుతున్న విషజ్వరాలపై శుక్రవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఏజెన్సీకి ఫీవర్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వైద్యాధికారులు స్పందించారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. మహాముత్తారం మండలకేంద్రంతోపాటు అటవీ గ్రామాలైన సింగారం, పోలారం ప్రేమ్‌నగర్ తండాల్లో మండల వైద్యాధికారి సందీప్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరాల బారిన పడిన వారి వివరాలు సేకరించారు. ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెంలో వైద్యశిబిరం నిర్వహించి 100మందికి మందుల కిట్ అందజేశారు. వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ అప్పయ్య సందర్శించి రోగులను పరీక్షించారు. తాడ్వాయి పీహెచ్సీ ఆధ్వర్యంలో మేడారం, గంగారం గ్రామాల్లో, కొడిశాల పీహెచ్సీ ఆధ్వర్యంలో ఎల్బాక, పడిగాపూర్ గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించారు. మంగపేట మండలంలోని నర్సింహాసాగర్, అకినేపల్లిమల్లారంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రక్త నమూనాలు సేకరించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. -
అమ్మో పులి..!
పార్వతీపురం మన్యం: ఏజెన్సీలో పులి సంచారం అలజడి రేపుతోంది. ఏనుగుల భయం వీడిందనేసరికి పులి సంచారంతో ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. భామిని మండలం చిన్నదిమిలి–పెద్దిదిమిలి గ్రామాల సమీపంలో బుధవారం పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. చిన్నదిమి లి క్వారీ సమీపంలో మంగళవారం రాత్రి వింత జంతువు అలికిడి గుర్తించినట్టు వాచ్‌మన్ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పాలకొండ ఫారెస్ట్ రేంజర్ తవిటినాయుడు ఆధ్వర్యంలో కొత్తూరు సెక్షన్ అధికారి కృష్ణారావు, అటవీశాఖ సిబ్బంది చిన్నదిమిలి సమీపంలో పులిసంచరించే ప్రాంతాన్ని పరిశీలించారు. పులి పాదముద్రలుగా నిర్ధారించా రు. భామిని, సీతంపేట, కొత్తూరు మండలాల ప్రజలు అప్రతమత్తంగా ఉండాలని తవిటినాయు డు హెచ్చరికలు జారీ చేశారు. వేకువ జామున బయటకు వెళ్లే రైతులు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బత్తిలి పోలీసుల ఆదేశాల మేరకు వీఆర్వో వినోద్‌కుమార్, ఏఎస్సై గురుమూర్తి, సర్పంచ్ రవికుమార్‌లు గ్రామాల్లో దండోరా వేయించారు. సీతంపేటలోనూ పులిజాడ సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో పులిజాడ కనిపించడంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. దోనుబాయి–చెక్కాపురం పరిసర ప్రాంతంలో ఉన్న గుగ్గిలంతోటల గుండా పులి పాదముద్రలు కనిపించడంతో స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్బీఓ దాలినాయుడుతో పాటు సిబ్బంది చేరుకుని పులిపాదముద్రలు పరిశీలించారు. దోనుబాయిలోని అటవీశాఖ కార్యాలయం వెనుక నుంచి పుబ్బాడ గ్రామం కొండలపైకి పులి వెళ్లినట్టు పాదముద్రలు ఆధారంగా గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
‘దారి’ తోచక.. దిక్కులేక..
సాక్షి, ఆదిలాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు, వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు, కోతలు ఏర్పడ్డాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పక్కా రోడ్లు లేకపోవడంతో అక్కడి ప్రజలు తాత్కాలిక దారులను ఏర్పాటు చేసుకొని రాకపోకలు సాగించడం పరిపాటిగా మారింది. పరశురాం మృతిచెందిన బజార్హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామ రోడ్డుదీ ఇదే పరిస్థితి. ఈ రోడ్డుతో కలుపుకొని జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో 40 రోడ్ల నిర్మాణానికి గిరిజన సంక్షేమ శాఖ నుంచి గత ఏడాది నవంబర్ 14న రూ.42.29 కోట్లు మంజూరయ్యాయి. అయితే అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గిరిజన గూడేలు, తండాల గుండా రోడ్లు వేసేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు లభించకపోవటంతో పనులు ప్రారంభం కాని పరిస్థితి నెలకొంది. దీంతో మంజూరైన నిధులు ఇప్పటికీ మూలుగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. రోడ్లు దెబ్బతినడంతో ప్రజల దైనందిన జీవనం దుర్భరంగా మారింది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలు, అత్యవసరాలకు ఇబ్బందులే.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం టక్కుగూడ గ్రామ గిరిజనులు సరుకుల కోసం ఇలా వాగు దాటుతూ, బురదమయంగా ఉన్న రోడ్ల గుండా మండల కేంద్రానికి చేరుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రేషన్ సరుకులు, ఎరువులు, వైద్యం, ఇతర పనుల నిమిత్తం కార్యాలయాలకు రావాలంటే సర్కస్ ఫీట్లు చేయక తప్పదు. నేటికీ తమ బతుకులు మారడం లేదంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఉట్నూర్ మండలంలోని మారుమూల గ్రామాల రోడ్లు, వంతెనలు దెబ్బతిని కుమ్మరికుంట, వంకతుమ్మ, బాబాపూర్, రాజులగూడ, నర్సాపూర్ గ్రామాల గిరిజనులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. ఎప్పుడూ ఇబ్బందే.. భీంపూర్ మండలం కరంజి(టి) గ్రామపంచాయతీ పరిధిలోకి వచ్చే రాజుల్ వాడి గ్రామం నుంచి గ్రామ పంచాయతీకి వెళ్లేందుకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు అస్తవ్యస్తంగా తయారైంది. ఈ గ్రామ వాసులు నిత్యావసర సరుకుల కొను గోలు, ఇతర అవసరాల కోసం కరంజి (టి)కి వెళ్లాల్సిందే. ఈ రోడ్డు బాగోలేకపోవడంతో ఎప్పుడూఇబ్బందులే. రోడ్లు లేక.. డాక్టర్లు రాక.. వర్షానికి పాడైన రోడ్లు.. సమయానికి అందుబాటులో లేని డాక్టర్లు.. వెరసి ఈ నెల 3న ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలో మూడేళ్ల బాలుడు పరశురాం మృతిచెందిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. జ్వరం, వాంతులు, విరోచనాలతో ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైనప్పటికీ అతని తండ్రి పంద్ర లక్ష్మణ్.. రోడ్డు బాగాలేదనే కారణంతో అంతకు ముందు రోజు రాత్రి దూరంగా ఉన్న ఆస్పత్రికి తన బిడ్డను తీసుకెళ్లలేకపోయాడు. మరుసటి రోజు ఉదయం బురద, గుంతల రోడ్డుపై తన బిడ్డను బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళుతుండగా మధ్యలోనే బాలుడి పరిస్థితి విషమించింది. తీరా ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు వెళ్లినప్పటికీ డాక్టర్లు అందుబాటులో లేక సకాలంలో వైద్యం అందక పోవడంతో పరశురాం మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల రోడ్ల దుస్థితిని తేటతెల్లం చేస్తోంది. ప్రభుత్వానికి నివేదిక ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలి భారీ వర్షాలకు ఆర్‌అండ్‌బీకి సంబంధించి దాదాపు 87 కిలోమీటర్ల మేర రోడ్లు, వంతెనలు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రూ.28.6 కోట్ల నష్టం వాటిల్లింది. తాత్కాలికంగా వాటి పునరుద్ధరణకు రూ.74 లక్షలు, పక్కాగా బాగుచేయడానికి రూ.80 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇక పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి 111 రోడ్లు, వంతెనలు, కల్వర్టులు 144 కిలోమీటర్ల మేర అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.67 లక్షలు అవసరం కాగా, రోడ్లు, బ్రిడ్జీల పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.255 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. -
అమ్మ ప్రేమతో ‘గోరుముద్ద’
అనకాపల్లి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాన్ని ఆనుకుని ఉండే నాతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు నుంచి 10వ తరగతి వరకు 590 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంకా ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 9.30 గంటలకల్లా ఆన్లైన్లో విద్యార్థుల హాజరు పూర్తి చేశారు. ఆ వెంటనే అందుకు తగ్గ ట్టుగా నిర్దేశిత కొలత ప్రకారం మంగళవారం మెనూ అనుసరించి రాగి పిండి, చింతపండు పులిహోర కోసం బియ్యం, ఇతర సరుకులను వంట సిబ్బందికి అందజేశారు. ఉదయం 10.20 గంటలకు బెల్లంతో చేసిన రాగిజావ ఇచ్చారు. మధ్యాహ్నం 12.20కి పులిహోర, దొండకాయ చట్నీ, ఉడికించిన గుడ్డు అందించారు. ఆరోజు బడికి హాజరైన 500 మంది విద్యార్థులు బడిలో అందించిన ఆహారాన్నే తీసుకున్నారు. మండల విద్యాశాఖాధికారి అమృత కుమార్ పులిహోరను రుచి చూసి పిల్లల అభిప్రాయం తెలుసుకుని రిజిస్టర్లో నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ పాఠశాలల్లో ‘జగనన్న గోరుముద్ద’ కింద పోషక విలువలతో కూడిన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. విద్యార్థులు ఉదయం బడికి రాగానే హాజరు తీసుకుని అందుకు అనుగుణంగా ఆహారాన్ని సిద్ధం చేసేందుకు మెనూ సరుకులు అందచేసు్తన్నారు. పిల్లల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటూ అందుకు తగ్గట్టు వంట చేస్తున్నారు. వివరాలను పారదర్శకంగా రిజిస్టర్లో నమోదు చేస్తూ పిల్లలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. వారంలో ఆరు రోజులు రోజుకో మెనూ చొప్పున దాదాపు 37,63,698 మంది విద్యార్థులకు ఆహారాన్ని సమకూరుస్తున్నారు. ఉపాధ్యాయుల వద్దనున్న మొబైల్ యాప్‌లో విద్యార్థుల హాజరుతో పాటు భోజనం చేసేవారి సంఖ్యను తెలుసుకునేలా ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ స్టిస్టమ్ ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ప్రతిరోజు బడిలో ఉన్న సరుకుల స్టాక్‌తో పాటు భోజనం వివరాలను ఫొటోలతో సహా అప్లోడ్ చేస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకం అమలు కోసం ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం రూ.1,689 కోట్లు కేటాయించిందంటే పిల్లలకు పౌష్టికాహారం పంపిణీకి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యం.. పిల్లల్లో రక్తహీనతను తగ్గించేందుకు వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మరో మూడు రోజులు చిక్కీ ఇస్తున్నారు. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి. సోమవారం వేడి పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పలావ్, గుడ్డు కూర, చిక్కీ, మంగళవారం ఉదయం 10.20కి రాగిజావ, మధ్యాహ్నం 12.20కి చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు, బుధవారం వెజిటేబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ, గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్‌బాత్ లేదా నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ, శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ మెనూగా అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనతను నివారించేందుకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్నే వాడుతున్నారు. ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల, విలేజ్ క్లినిక్ సిబ్బంది పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్త హీనత నివారణ మాత్రలు అందించడంతోపాటు మోతాదు ప్రకారం తీసుకునేలా పర్యవేక్షిస్తున్నారు. రాగి జావ చాలా బాగుంటుంది వారంలో మూడురోజులు ఉదయం ఇంటర్వెల్ టైంలో బెల్లంతో చేసిన రాగిజావను వేడివేడిగా ఇస్తారు. బడిలో అందరం తీసుకుంటాం. చాలా బాగుంటుంది. ఎంత కావాలన్నా ఇస్తారు. మధ్యాహ్నం భోజనం కూడా వేడిగా కావాల్సినంత పెడతారు. మా బడిలో ఎవరూ ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకోరు. అందరూ ఇక్కడ వండిందే తింటారు. టీచర్లు కూడా ప్రతిరోజు మాతో కలిసి భోజనం చేస్తారు. – ఏ.కిరణ్‌కుమార్, రామ్‌ప్రసాద్, చిట్టినాయుడు (పదో తరగతి, సెక్షన్ ‘సి’), నాతవరం జెడ్పీహెచ్ఎస్ ఇంట్లో తిన్నట్టుగానే స్కూల్లో వండే ఆహారం ఇంట్లో ఉన్నట్టుగానే రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఇక్కడే తింటా. అన్నం తినేటప్పుడు ఎలా ఉందని మా మాస్టారు రోజు అడుగుతారు. బాగో లేకపోతే అదే విషయం చెబుతాం. దాన్ని రిజిస్టర్లో రాస్తారు. మాతో కూడా రాయిస్తారు. – వి.స్నేహశ్రీ, 9వ తరగతి బి–సెక్షన్, నాతవరం జెడ్పీహెచ్ఎస్ మా పిల్లలూ ఇక్కడే.. మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు. మా బిడ్డలకు వండినట్లే అందరు పిల్లలకు వండి పెడుతున్నాం. గతంలోనూ మధ్యాహ్నం బడిలో భోజనం పెట్టినా ఇంత చక్కగా పెట్టడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. పిల్లలు ఇష్టంగా తినడం చూస్తుంటే మాకూ ఆనందం కలుగుతుంది. – దుర్గాభవాని, మిడ్ డే మీల్స్ తయారీదారు, నాతవరం జెడ్పీహెచ్ఎస్ టీచర్లకూ అదే భోజనం.. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అద్భుతంగా ఉన్నాయి. సరిపడినంత మంది ఉపాధ్యాయులు, వసతులను ప్రభుత్వం కల్పించింది. నిజంగా ఇదో గొప్ప మార్పు. మా స్కూల్లో 590 మంది పిల్లలు, 21 మంది ఉపాధ్యాయులున్నారు. మా పర్యవేక్షణలోనే వంటలు చేస్తారు. ప్రతిరోజు ముగ్గురు టీచర్లు ఇక్కడ వండిన ఆహారమే తింటారు. ఏనాడూ బాగోలేదన్న ఫిర్యాదు రాలేదు. – ఎస్.శాంతికుమారి, నాతవరం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం నచ్చకపోతే ‘బ్యాడ్’ అని రాస్తాం స్కూల్లో వండిన ఆహారం ఎప్పుడూ బాగుంటుంది. మాకు నచ్చినట్టుగానే వంట చేస్తారు. తిన్న తర్వాత ఎలా ఉందో ప్రతి రోజు మా టీచర్లు అడుగుతారు. నిర్భయంగా చెప్పమంటారు. బాగుంటే ‘గుడ్’ అని బాగో లేకపోతే ‘బ్యాడ్’ అని రిజిస్టర్లో రాస్తాం. ఒకసారి అలా రాస్తే మెనూ మార్చారు. – కె.మహేశ్వరి, (పదో తరగతి), అల్లిపూడి జెడ్పీ హైస్కూల్ ప్రతి విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం పలు విద్యా సంస్కరణలు అమలు చేస్తోంది. ఉపాధ్యాయుల నుంచి పిల్లల చదువు, ఆహారం, ఆరోగ్యం వరకు అన్ని అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. నిజంగా ఇది ఓ విప్లవమనే చెప్పాలి. ప్రతిరోజు ఒక మెనూ అమలు చేస్తూ తిన్నాక అభిప్రాయాన్ని తెలుసుకోవడం గొప్ప విషయం. పిల్లల అభిప్రాయాల మేరకే గతంలో మెనూ మార్చారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో చెప్పడానికి ఇది చాలు. – ఎన్.వై.నాయుడు పీఎస్ టీచర్, అల్లిపూడి జెడ్పీహెచ్ఎస్ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 104 కాగా బుధవారం రోజు 86 మంది హాజరయ్యారు. మెనూ ప్రకారం కూరగాయల అన్నం, బంగాళాదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ విద్యార్థులకు ఇవ్వాలి. 10 గంటలకల్లా సరుకులు తీసుకున్న వంట సిబ్బంది పాఠశాల ప్రాంగణంలోని కిచెన్‌లో 12.15 గంటలకు భోజనాన్ని రెడీగా ఉంచారు. తెలుగు ఉపాధ్యాయుడు గోవిందు భోజనాన్ని రుచి చూసి విద్యార్థుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. వారు సంతృప్తి వ్యక్తం చేశాక మరో ఉపాధ్యాయుడు ఎన్వై నాయుడు వేడివేడి భోజనం ఫొటోను ఐఎంఎంఎస్ యాప్‌లో అప్లోడ్ చేసి విద్యార్థుల సంఖ్యను కూడా నమోదు చేశారు. - అల్లిపూడి, నాతవరం నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి -
గర్భిణుల అరిగోస
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పురిటినొప్పు లొస్తే ఇప్పటికీ ఎడ్లబండిలోనే... లేదంటే బురదలో పంటచేల మీదుగా... అడవి దారిలో నరకయాతన పడి నడుస్తూ... ఏటా వానాకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల గర్భిణుల కష్టా లివి. వాగులు, వంకలు ఉప్పొంగిన ప్పుడు, కల్వర్టులు, రోడ్డు డ్యాం, లోవల్ వంతెనలు దెబ్బతిన్న సమయాల్లో ఆసు పత్రులకు వెళ్లేందుకు నేటికీ నానాకష్టాలు పడాల్సి వస్తోంది. 108, 102 వాహనాలు వెళ్లలేక ఎడ్లబండి, ప్రైవేటు వాహనాలు, మనుషులే మోసుకుని వస్తూ ఆసుపత్రు లకు తరలిస్తున్నారు. దీంతో కొన్నిసార్లు తల్లి, బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ముంచుకొస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నార్నూరు, గాదిగూడ, ఉట్నూరు, ఇంద్రవెల్లి, జైనూర్, కెరమెరి, తిర్యా ణి, బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, వేమనపల్లి, కాసిపేట, కోట పల్లి మండలాల్లో రాకపోకలకు ఇప్పటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెల 26న మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేట గ్రామపంచాయతీ పాటి గ్రామానికి చెందిన మూడు నెలల గర్భిణి రెడ్డి మల్లక్క జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లేందుకు అరిగోస పడింది. ఎర్రవాగు ఉప్పొంగడంతో 108 వాహనం వచ్చే పరిస్థితి లేక ఎడ్లబండి, ఆటోలో వెళ్లింది. మొదట బెల్లంపల్లి, అటు నుంచి మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో గర్భస్రావం జరిగింది. నెరవేరని హామీలు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రిస్కు ఉన్న గర్భిణులను వారం ముందే ఆసుపత్రికి తరలించి డెలివరీలు చేయాలి. ఇందుకు ప్రత్యేకంగా ‘బర్త్ వెయిటింగ్ రూమ్స్’ ఏర్పాటు చేశారు. ఇది పకడ్బందీగా అమలు కావడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో 133గ్రామాలు ఉన్నాయి. ఒక్క ఆసిఫాబాద్ జిల్లాలోనే 219గ్రామాలు హై రిస్కులో ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఈ నెలలో ప్రసవమయ్యే 46మందిని గుర్తించారు. కేవలం నార్మల్ డెలివరీలకే ఈ జిల్లాలో సేవలు అందుతున్నాయి. సిజేరి యన్ చేయాలంటే ఆదిలాబాద్ రిమ్స్, మంచిర్యాలకు రిఫర్ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో వానాకాలంలో ఎయిర్ అంబులెన్సులు అందుబాటులో ఉంచుతామని హామీలు ఇచ్చినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ♦ ఇది ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం ఎంపల్లి, గోండుగూడ వెళ్లే దారి. వర్షాలు కురిసి వరదలు వస్తే నానా కష్టాలు పడాలి. అత్యవసర సమయంలో గర్భిణులు, బాధితులు ఆసుపత్రులకు వెళ్లేందుకు ఇక్కడి గిరిజనులు నరకం చూస్తున్నారు. ♦ గురువారం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నాగారానికి చెందిన నిండు గర్భిణి దుర్గం లావణ్య పురిటి నొప్పుల బాధతోనే అటవీ ప్రాంతం గుండా నడవాల్సి వచ్చింది. ఇక్కడ కల్వర్టు దెబ్బతినడంతో తిప్పలు పడాల్సి వచ్చింది. ఎందుకీ సమస్య..? ♦ అటవీ సమీప గ్రామాలకు రోడ్లు వేసేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు రావడం లేదు. అనాదిగా ఆ గ్రామాలకు మట్టి రోడ్లే దిక్కవుతున్నాయి. రిజర్వు ఫారె స్టుల్లో కొత్త రోడ్లు, విస్తరణ, కల్వర్టులు, హై లెవల్ వంతెనల నిర్మాణాలకు అనుమతుల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో ఎలాంటి అనుమతులు లేకుండానే రిజర్వు ఫారెస్టుల్లో రోడ్ల పనులు చేపట్టారు. అయితే వాటిపై కేసులు నమోదయ్యాయి. కొత్త అనుమతులు పొందాలంటే క్లిష్టంగా మారింది. కొన్ని చోట్ల టైగర్‌జోన్, రిజర్వు ఫారెస్టు గుండా వెళ్లే రోడ్లకు అనుమతులు కేంద్రం నుంచి సులువుగా రావడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు నేరుగా నిధులు మంజూరు చేయించి, పనులు చేపట్టే ప్రయత్నాలు చేస్తే, అటవీ శాఖ అభ్యంతరాలతో నిలిచిపోయిన ఘటనలు ఉన్నాయి. ♦ ఈ నెల 24న కుమురంభీం జిల్లా దహెగాం మండలం లోహకు చెందిన గర్భిణి మడే ప్రమీలను సరైన రోడ్డు సౌకర్యం లేక అష్ట కష్టాలు పడుతూ ఎడ్లబండిలో ఆసుపత్రికి తరలించారు. ఇదే మండలం రావుపల్లికి చెందిన ఆలం భాగ్యలక్ష్మికి పురిటి నొప్పులు వచ్చాయి. సిగ్నల్స్ లేక సెల్ఫోన్లు పనిచేయక 108కు సమాచారం ఇవ్వకలేకపోయారు. 30కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్సీ చేరుకునేందుకు ప్రైవేట్ జీపులో వెళ్లారు. చివరకు తల్లీబిడ్డ క్షేమం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ♦ ఈ నెల 20న ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్‌కు పరిధి చిన్నమారుతిగూడకు చెందిన ఆత్రం సావిత్రి బాయి పురిటి నొప్పులతో బాధపడుతూ అరకిలోమీటరు మేర బురదలో, పంట చేను మీదుగా నడుస్తూ వెళ్లాల్సి వచ్చింది. ఈ ఆవాసానికి సరైన రోడ్డు లేకపోవడమే ఇక్కడి వారికి శాపంగా మారింది. -
నేపాల్‌లో దాక్కున్న చైనా ‘పెంగ్’.. భారత్‌లోకి అక్రమంగా చొరబడుతూ..
భారత్- నేపాల్ సరిహద్దుల మీదుగా నకిలీ ధృవపత్రాలతో భారత్‌లోకి చొరబడేందుకు ఒక చైనా పౌరుడు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి డార్జిలింగ్ మీదుగా భారత్ సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమై ఆ వ్యక్తిని అరెస్టు చేశాయి. ఉమేష్‌గా మారిన పెంగ్ యోంగ్జిన్ మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం భారత్-నేపాల్ సరిహద్దులోగల డార్జిలింగ్ స్పెషల్ సర్వీస్ బ్యూరో(ఎస్ఎస్బీ) పానీటంకీ అవుట్‌పోస్ట్ వద్ద ఒక చైనా పౌరుడిని అరెస్టు చేసింది. అతను అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్‌ఎస్‌బీఈ చర్య చేపట్టింది. అరెస్టయిన ఆ చైనా పౌరుని పేరు పెంగ్ యోంగ్జిన్. ఇతను నేపాల్‌లో ఉమేష్ అనే నకిలీ పేరుతో నివసిస్తున్నాడు. ఇదే పేరుతో నేపాల్‌లో పాస్‌పోర్టు కూడా చేయించుకున్నాడు. ఈ పాస్‌పోర్టు ఆధారంగానే ఆ చైనా పౌరుడు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేశాడు. భారత్‌లోకి చొరబాటు వెనుక.. ఎస్ఎస్బీ తెలిపిన వివరాల ప్రకారం నేపాల్‌లో ఉంటున్న ఆ చైనా పౌరుడు అక్కడ పాస్‌పోర్ట్ పొందేందుకు స్థానికులు సహాయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఎస్ఎస్బీ అదుపులో ఉన్న ఆ చైనా పౌరుడిని విచారిస్తున్నారు. అతను అక్రమంగా భారత్‌లోకి ఎందుకు ప్రవేశించాలనుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నేపాల్‌లో ఉంటూ.. భారత్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని పానీటంకీ ప్రాంతం నేపాల్‌లోని కకర్‌వీటా పరిధిలోని డోక్లామా చికెన్ నెక్కు సమీపంలో ఉంది. ఈ సున్నిత ప్రాంతంలో ఇన్నాళ్లూ నివాసమున్న ఈ చైనా పౌరుడు అక్కడ ఎటువంటి కార్యకలాపాలు సాగించాడో తెలుసుకునేందుకు ఎస్ఎస్బీ ప్రయత్నిస్తోంది. భారత్-నేపాల్ సరిహద్దు 1850 కిలోమీటర్ల మేర ఉంది. అయితే ఆ చైనా యువకుడు తాను ఉండేందుకు డార్జిలింగ్ సమీపంలోని ప్రాంతాన్నే ఎందుకు ఎన్నుకున్నాడనేది అధికారుల ముందున్న ప్రశ్న. ఈ డోక్లామ్ రీజియన్ విషయంలో భారత్-చైనాల మధ్య వివాదం రగులుతోంది. ఏడేళ్లుగా మారుపేరుతో.. భారత్‌లోకి పాక్ నుంచి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ ఉదంతం సంచలనంగా మారిన నేపధ్యంలో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. రక్షణ బలగాలు తనిఖీలు మరింత ముమ్మరం చేశాయి. కాగా పెంగ్ తన పేరు, గుర్తింపును మార్చుకుని నేపాల్‌లో అక్రమంగా గడచిన ఏడేళ్లుగా ఉంటున్నాడు. తాజాగా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన అతనిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ సర్వీస్ బ్యూరో అతనిని సుదీర్ఘంగా విచారిస్తోంది. ఇది కూడా చదవండి: ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి -
డబుల్ పేరిట డబ్బులు దండుకుని
సాక్షి, మహబూబాబాద్/ ఇల్లందు/ గూడూరు: ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలు, గిరిజనుల అమాయకత్వం, పేదరికాన్ని ఆసరా చేసుకుని స్వచ్ఛంద సంస్థ ముసుగులో తక్కువ ధరకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని వారి నుంచి రూ.20 కోట్ల మేర డబ్బులు దండుకున్నారు. ఇళ్లు కట్టేస్తున్నామని ఐరన్, సిమెంట్ పంపిణీ చేసి ఉడాయించేశారు. ఇంటిసామగ్రి తెస్తామని చెప్పి వెళ్లిన వారు రెండేళ్లుగా పత్తా లేకపోవడంతో బాధితులు చివరికి పోలీసుల్ని ఆశ్రయించగా అసలు విషయం బయటకొచ్చింది. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు జిల్లాల్లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థ పేరుతో వచ్చి... పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పి హోలీవర్డ్ సొసైటీ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ 2020లో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు జిల్లాల్లో కొంతమంది ఏజెంట్లను నియమించుకుంది. కేవలం రూ.4,50,000లకే 693 చదరపు అడుగుల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏజెంట్లను ఏజెన్సీ ప్రాంతాల్లోకి పంపించి ప్రచారం చేయించింది. వీరి మాటల్ని నమ్మేందుకుగాను పలుచోట్ల స్వచ్ఛంద సంస్థకు చెందిన అనుచరుల ఇళ్లను చూపించేవారు. తాము నిర్మించబోయే ఇళ్లకు 120 గజాల స్థలం ఉంటే చాలని, మొదటి కిస్తీగా రూ.1,65,000 చెల్లిస్తే సరిపోతుందని ప్రచారం చేయడంతో వీరిని నమ్మి డబ్బులు కట్టేందుకు మూడు జిల్లాల నుంచి గిరిజనులు ముందుకొచ్చారు. ఇలా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15వేల నుంచి రూ.1,80,000 వరకు కట్టించుకున్నారు. ఇలా డబ్బులు చేతికిరాగానే ఇళ్లు కట్టేస్తున్నామని చెబుతూ కొంతమందికి ఐరన్, సిమెంట్ తెచ్చి పిల్లర్లు వేసి మిగతా వారిని కూడా నమ్మించారు. దీంతో మిగిలిన వారూ డబ్బులు చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ విధంగా మూడు జిల్లాల్లో మొత్తం రూ.20 కోట్ల మేర వసూళ్లు చేశారు. రెండో కిస్తీ కట్టాకే మిగతా నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పి సంస్థకు చెందిన ఏజెంట్లను ఉద్యోగాల నుంచి తీసేశారు. తర్వాత సంస్థ అడ్రస్‌ను కూడా మార్చేశారు. సంస్థకు చెందిన ఫోన్లను కూడా స్విచ్ఛాఫ్ చేసేశారు. రెండేళ్లుగా వీరంతా పత్తా లేకుండాపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన కొంతమంది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిగిలినవారు కూడా ఆయా జిల్లాల్లో ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారు. -
నర్సీపట్నంలో జీసీసీ కాఫీ యూనిట్!
సాక్షి, విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కాఫీ గింజలు సేకరిస్తున్నా.. క్యూరింగ్, ప్రాసెసింగ్ కోసం ప్రైవేట్ సంస్థల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సొంతంగానే ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేదిశగా జీసీసీ అడుగులు వేస్తోంది. నర్సీపట్నంలో ఈ యూనిట్ నెలకొల్పేందుకు చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీ ఎఫ్డీసీ) ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి. ఈ ఎస్టేట్స్‌లోని కాఫీ గింజల్ని క్యూరింగ్ చేసిన తర్వాతే జీసీసీకి సంబంధించిన క్యూరింగ్ పనులు ప్రారంభిస్తారు. క్యూరింగ్, ప్రాసెసింగ్ ప్రక్రియల్ని ఇతర ప్రాంతాల్లో నిర్వహించడం వల్ల మార్కెటింగ్‌కు తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు సొంతంగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని జీసీసీ నిర్ణయించింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు నర్సీపట్నంలో ఉన్న జీసీసీ పెట్రోల్ బంక్ వెనుక ఉన్న 0.73 ఎకరాల్లో ఈ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మించాలని భావిస్తోంది. ఇక్కడ ప్రస్తుతం జీసీసీకి సంబంధించిన మూడు ఖాళీ గోదాములు ఉన్నాయి. ఒక్కో గోదాము 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించారు. దీంతోపాటు డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఉన్నాయి. మొత్తం రూ.3.50 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ని ప్రాధమికంగా ఏర్పాటు చేయవచ్చనే ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి అధికారులు పంపించారు. ఈ యూనిట్‌కు అవసరమైన యంత్రాలకు సంబంధించి మంగుళూరుకు చెందిన అంతర్జాతీయ కాఫీ ప్రాసెసింగ్ సంస్థలతో సంప్రదింపులు జరిపిన అధికారులు దేశంలో ఉన్న యూనిట్స్‌లో దీన్ని కూడా నాణ్యమైన ప్రాసెసింగ్ యూనిట్‌గా తీర్చిదిద్దాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గోదాముల్ని యూనిట్‌కు అనుగుణంగా మార్పులు చేస్తే వీలైనంత త్వరగా ప్రాసెసింగ్ చేసేందుకు అవకాశం ఉంటుందని జీసీసీ భావిస్తోంది. గిరిజనులకు మేలు జరుగుతుంది.. కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. మెషినరీకి దాదాపు రూ.3 కోట్లు అవుతుందని అంచనా వేశాం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే వీలైనంత త్వరగా యూనిట్ పనులు ప్రారంభిస్తాం. ఇది పూర్తయితే వీలైనంత త్వరగా కాఫీ రైతులకు పేమెంట్ చేసేందుకు అవకాశం కలుగుతుంది. ప్రాసెసింగ్ చేసిన కాఫీని త్వరితగతిన మార్కెట్‌కు పంపించేందుకు మార్గం సుగమమవుతుంది. – సురేష్‌కుమార్, ఎండీ, జీసీసీ -
నవజాత శిశువుల ఆరోగ్యంపై శ్రద్ధచూపాలి
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌కు నవజాత శిశువులను చికిత్సకు తీసుకొచ్చేటప్పుడు వారి ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు. ఆమె శుక్రవారం మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు, పాడేరు ఐటీడీఏ, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు వైద్యసేవలు పూర్తిగా అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య ఆరోగ్యశాఖను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు. చింతూరు వంటి మారుమూల గిరిజన ప్రాంతానికి 40 ఏళ్ల తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్‌ను నియమించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతల సచివాలయం పరిధిలోని కిండ్లం గ్రామంలో ఇటీవల ఆరుగురు మరణించడంపై గిరిజనులు భయాందోళనలు చెందాల్సిన పనిలేదన్నారు. ఈ సందర్భంగా వీరంతా హైబీపీ, ఖైనీ నమలడం, మూఢనమ్మకాలతో నాటువైద్యం చేయించుకోవడం వంటి కారణాలతో చనిపోయినట్లు వైద్యాధికారులు చెప్పారు. సికిల్‌సెల్ ఎనీమియా, తలసేమియా వ్యాధులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అరకు, పాడేరు ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, భాగ్యలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర తమ ప్రాంత వైద్య అవసరాల కోసం విన్నవించగా వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, వైద్యవిద్య సంచాలకుడు వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
విప్పపువ్వు.. గిరిజనుల కల్పతరువు
బుట్టాయగూడెం: ఆదివాసీ గిరిపుత్రులకు అక్కడ లభించే ఉత్పత్తులు జీవనాధారం కల్పిస్తున్నారు. అడవిలో లభించే అటవీ ఉత్పత్తులు సేకరించి వాటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతుంటారు. కొందరు అడవిలో ఉండే వెదురుతో బుట్టలు, చాటలు వంటివి నైపుణ్యంలో తయారు చేసి విక్రయిస్తారు. మరి కొందరు తేనె సేకరణ, తునికాకు, అడ్డాకుతో పాటు పలు రకాల ఉత్పత్తులు సేకరిస్తారు. కాలానికి అనుగుణంగా ఉపాధిని ఇచ్చే వృక్షాల్లో ఇప్పచెట్లు ప్రధానమైనవి. వేసవిలో వీటి ద్వారా గిరిజనులు ఉపాధి పొందడానికి అనేక అవసరాలు ఉన్నాయి. విప్పపువ్వును గిరిజనులు తెల్లవారుజామునే అడవిలోకి వెళ్ళి సేకరిస్తారు. తెల్లవారుజామున చెట్లపై నుండి కిందపడిన ఇప్పపువ్వును మధ్యాహ్నానికి సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడతారు. మూడు నెలల పాటు ఉపాధి మన్యం ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు విప్పచెట్ల ద్వారా మూడు నెలల పాటు ఉపాధి దొరుకుతుంది. ఖరీఫ్, రబీ పనులు ముగిసే సమయానికి విప్ప చెట్లు విరగపూస్తాయి. వీటి పువ్వులు గాలికి నేలరాలుతుంటాయి. ఈ పువ్వులను గిరిజనులు సేకరిస్తారు. వీటితోపాటు మొర్రి పండ్లు సేకరించి ఇంటికి తీసుకువస్తుంటారు. వీటిని సేకరించి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విక్రయించి ఉపాధి పొందుతుంటారు. విప్పపువ్వుతో ఔషధాలు తయారీ గిరిజనులు సేకరించిన ఇప్పపువ్వును జీసీసీల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పపువ్వులో ఎన్నెన్నో ఔషధ విలువలు ఉండడంతో ఈ పువ్వును ఔషధాల తయారీకి విక్రయిస్తారు. ఇప్పపువ్వు నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. విప్పపువ్వుతో దంతాలను శుభ్రం చేసుకోవడంతో దగ్గుకు, దంతాలకు సంబంధించిన వ్యా«ధులుకు ఔషధంగా పనిచేస్తుంది. సచ్ఛమైన విప్పపువ్వుతో తయారు చేసిన సారాను సేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని గిరిజనులు అంటున్నారు. వైద్యశాస్త్రంలోనూ ప్రాధాన్యం వైద్యశాస్త్రంలోనూ విప్పపువ్వు ప్రాధాన్యతను సంపాదించుకుంది. అడవిలో లభించే ఇప్పపువ్వుల గింజల నుంచి తీసిన నూనెలో ఎన్నో పోషక విలువలున్నట్లు శాస్త్రీయంగా నిరూపించారు. భారత శాస్త్రీయ సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయంతో 1999లో నిర్వహించిన పరిశోధనలో ఎండిన ఇప్పపువ్వుల నుంచి పంచదారను తయారు చేసి జామ్, కేక్‌లు, చాక్లెట్లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. విప్పపువ్వు ఎక్కువకాలం నిల్వ ఉండడానికి మధ్యమధ్యలో ఎండిన వేప ఆకును వేస్తే నిల్వ ఉంటుందని తెలుసుకున్నారు. పశ్చిమ మన్యంలో 20 వేలకు పైగా విప్ప చెట్లు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంతో పాటు పాపికొండల అభయారణ్యంలో ఇప్పచెట్లు దాదాపుగా 20 వేలకు పైగా ఉండవచ్చని అంచనా. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈ ఇప్పచెట్లు ఆధికంగా ఉన్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 5 వేల చెట్ల వరకూ అటవీప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో నాటి వాటిని పెంచుతున్నారు. గిరిజనులు సేకరించిన ఈ ఇప్పపువ్వులను జీసీసీ అధికారులే కాదు బయటి నుండి అనేక మంది వ్యాపారులు కూడా కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. ఇప్పపువ్వులో పోషకాలు ఎక్కువగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నట్లు గిరిజనులు చెప్తున్నారు. ప్రస్తుతం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గుత్తుకోయలు, బుట్టాయగూడెం మండలంలో కొండరెడ్లు ఈ పువ్వులను సేకరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. 5 వేల ఇప్ప మొక్కలు నాటాం పశ్చిమ అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా పెరిగిన ఇప్పచెట్లే కాకుండా అడవిలో ఉండే ఖాళీ ప్రదేశాల్లో సుమారు 5 వేల వరకూ విప్పమొక్కలను నాటి పెంచుతున్నాం. ఇప్పచెట్ల నుంచి వచ్చే పువ్వుల ద్వారా గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో గుత్తుకోయలు, బుట్టాయగూడెం మండలాల్లో కొండరెడ్లు ప్రస్తుతం విప్పపువ్వు సేకరణలో ఉపాధి పొందుతున్నారు. – దావీదురాజు నాయుడు,అటవీ శాఖ డీఆర్ఓ, పోలవరం జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి మా గ్రామ సమీపంలోని అడవుల్లో విప్పపువ్వుతోపాటు పలు ఉత్పత్తులు లభిస్తున్నాయి. విప్పపువ్వుతోపాటు పలు ఉత్పత్తులను గతంలో కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం జీసీసీ అధికారులు ఇప్పపువ్వు కొనుగోలు చెయ్యడంలేదు. ప్రస్తుతం ఇప్పపువ్వు సీజన్ ప్రారంభమవుతుంది. జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నాం. – కెచ్చెల బాలిరెడ్డి, కొండరెడ్డి గిరిజనుడు– మోదేలు -
ఏజెన్సీలో మరో 32 గర్భిణీ వసతి గృహాలు
సాక్షి, అమరావతి: కొండలు, కోనల్లో ఉండే గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ పలు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 159 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు) ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులను అత్యవసర సమయాల్లో డోలీలు, మంచాలపై మోసుకెళ్లకుండా వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించి, ముందుగానే ఆస్పత్రులకు తరలించేందుకు గిరిజన ప్రాంతాల్లో గర్భిణీ వసతి గృహాలు (బర్త్ వెయిటింగ్ హోమ్స్–బీడబ్ల్యూహెచ్) ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి 45 ఉన్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనల మేరకు మరో 32 గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నారు. వీటితో మొత్తం వీటి సంఖ్య 77కు పెరగనుంది. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులకు తక్షణ వైద్య సేవలు అందించి తల్లీ బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో ఈ వసతి గృహాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో 1818 మారుమూల ప్రాంతాలున్నాయి. కొండలు, గుట్టలు, అడవులు, సెలయేరులు తదితర మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు గతంలో వైద్యం గగనమే అయ్యేది. దీంతో మరణాలూ అధికంగానే ఉండేవి. గర్భిణుల అవస్థలు చెప్పనలవి కాదు. సరైన వైద్యం అందక, ప్రసవ సమయానికి ఆస్పత్రికి వెళ్లలేక మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గిరిజనులకు ఈ అవస్థలు తప్పించి, వారికి మంచి వైద్య సేవలను వైఎస్ జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఆ ప్రాంతాల్లో తల్లీ బిడ్డలను క్షేమంగా ఉంచేందుకు గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేస్తోంది. గిరి రక్షక్ పేరుతో ఏర్పాటు చేయనున్న బైక్ అంబులెన్స్‌లు నెలలో 25 రోజులపాటు ప్రతి మారుమూల ప్రాంతాన్ని సందర్శించి గర్భిణుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంటారు. స్థానిక ఏఎన్ఎం దగ్గర్నుంచి మండల స్థాయి వైద్యాధికారి, మండల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గర్భిణులతోపాటు అక్కడి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి తగు చర్యలు చేపడుతుంటారు. ప్రతి గురువారం గ్రామ సచివాలయ బృందం అన్ని మారుమూల (డోలీపై ఆధారపడిన) ప్రాంతాలను సందర్శిస్తుంది. ప్రతి శనివారం (పలకరింపు) వైద్య బృందం వెళ్లి అక్కడి వారికి ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రతి మంగళవారం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లి క్షేమ సమాచారం తెలుసుకుంటారు. డోలీ మరణాల నివారణకు మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులను డాక్టర్ నిర్ధారించిన ప్రసవ సమయానికి నెల రోజుల ముందుగానే సురక్షిత రవాణా వ్యవస్థ (108 అంబులెన్స్, ఫీడర్అంబులెన్స్, బైక్ అంబులెన్స్) ద్వారా బర్త్ వెయిటింగ్ హోమ్‌కు తరలిస్తారు. ఈ గృహాల్లో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు నిరంతరం గర్భిణుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటారు. నిత్యం పోషకాహారాన్ని, మందులను అందిస్తారు. మెరుగైన వైద్యం అవసరమైతే సమీపంలోని ప్రాథమిక, సామాజిక, జనరల్ ఆసుపత్రులకు తరలిస్తారు. -
‘పరివర్తన’ ఫలించేలా
సాక్షి, అమరావతి: గంజాయి సాగు, అక్రమ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టి కేసుల నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎస్ఈబీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు నిర్మూలన చర్యలు చేపడుతూనే ఉపాధి మార్గాలు చూపాలని అధికార యంత్రాంగానికి సూచించారు. పన్ను చెల్లింపుదారులకు ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు. ఎక్సైజ్, అటవీ, గనులు, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. అటు ఉక్కుపాదం.. ఇటు ఉపాధితో ఊతం పరివర్తన కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. చేయూత, ఆసరా లాంటి పథకాల ద్వారా వారికి ఊతమివ్వాలని, ఆదాయం సమకూరే దిశగా ఉపాధి చూపాలని నిర్దేశించారు. అప్పుడే అక్రమ మద్యం తయారీ లాంటి వాటికి దూరంగా ఉంటారన్నారు. ఏజెన్సీలో గంజాయి నిర్మూలనతోపాటు ఉపాధి మార్గాలు కల్పించాలని సూచించారు. ఇంకా ఎక్కడైనా, ఎవరైనా అర్హులు మిగిలిపోతే తనిఖీ చేసి వారికి కూడా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించాలని ఆదేశించారు. తద్వారా పట్టాలు అందుకున్న రైతులకు రైతు భరోసా సాయం లభిస్తుందన్నారు. వారికి విత్తనాలు, ఎరువులు అందించే కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచించారు. అప్పుడే ఆశించిన స్ధాయిలో మార్పు వచ్చి అక్రమ మద్యం, గంజాయి సాగు నుంచి దూరం అవుతారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరింత సౌలభ్యంగా పన్ను చెల్లింపులు పన్ను చెల్లింపులకు సంబంధించి వాణిజ్య పన్నులశాఖ అధికారులు మరింత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉందన్న విషయాన్ని పన్ను చెల్లింపుదారులకు వివరించాలన్నారు. చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు. అవగాహన పెంపొందించి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి కూడా చక్కటి సేవలు అందుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడే ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలపై.. రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తూ శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న చోట్ల సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలపై విస్తృత అవగాహన కలిగించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సచివాలయాల పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎలాంటి డాక్యుమెంట్లును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించారు. నిర్వహణలో లేని గనులపై దృష్టి గనుల శాఖ కార్యకలాపాలపై సమీక్ష సందర్భంగా నిర్వహణలో లేని గనులపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని సూచించారు. సమీక్షలో విద్యుత్, అటవీ పర్యావరణ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మద్యం అమ్మకాలు తగ్గాయి గతంతో పోల్చి చూస్తే మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని సీఎం జగన్ వెల్లడించారు. బెల్టు షాపులను తొలగించడం, పర్మిట్ రూమ్‌ల రద్దు లాంటి పలు చర్యల వల్ల మద్యం విక్రయాలు తగ్గాయని చెప్పారు. దీంతో పాటు మద్యపానాన్ని నిరుత్సాహ పరిచేందుకు షాక్ కొట్టేలా రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందన్నారు. అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. పరివర్తన కార్యక్రమం అమలు తీరుపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరా తీశారు. -
తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!
అప్పటి వరకూ ఎవరూ ప్రవేశించని చోట– ‘లోపలికి వెళ్లడం’ అనేసరికి, ఒక్కొక్క ప్రభుత్వం తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రధా నంగా వాటి దృక్పథంపై అది ఆధారపడి ఉంటుంది. ఆ ప్రకారమే, అది తనతో– ‘రాజ్యాన్ని’ అంటే– ‘ఎగ్జి క్యూటివ్’ ‘జ్యుడీషియరీ’ వంటి వ్యవస్థలను, అవి ఇంకా చేరని మారుమూలల ఉన్న మానవ సమూహాల వద్దకు తనతో తీసుకు వెళుతోంది. ప్రజా స్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఒక్క– ‘లెజిస్లేటి వ్’కు మాత్రమే అటువంటి గమన శక్తి ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత, తూర్పు కనుమలలోని మన్యం – ‘లోపలికి వెళ్లడం’ అనే విషయంలో, అక్కడ మొదటి పదేళ్ల కాలంలో ఏమి జరుగుతున్నది అనేది లోతైన సమీక్ష అవసరమైన అంశం. వామపక్ష తీవ్రవాద సిద్ధాంత కార్యాచరణకు తూర్పు కనుమల మన్య ప్రాంతం నాలుగు దశాబ్దాల పాటుగా క్రియాశీల స్థావరం కావడంపై, ఇప్పుడు ప్రభుత్వ– ‘ఫోకస్’ తప్పనిసరి అయింది. అయితే అది– ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కో తీరుగా అర్థమయింది. ఒకరు అంటారు– ‘విదేశాల నుంచి పోలీస్ శాఖ కొనాల్సిన ‘కమ్యూనికేషన్’ ఉపకరణాలు సకాలంలో ప్రభుత్వం కొని ఉంటే, ఒక గిరిజన ఎమ్మెల్యే నక్సల్స్ చేతిలో చనిపోయేవాడు కాదు’ అని. మరొక ప్రభుత్వ దృష్టి, అందుకు భిన్నంగా– ఆ ప్రాంతాన్ని... అక్కడ భూమిలోని ఖనిజ నిక్షేపాలను విలువైన ఆదాయ వనరుగా చూడ్డంగా కాకుండా, ఆ ప్రాంత ప్రజా ప్రయోజనాల దృష్టి నుంచి దాన్ని చూడాలి అని అనుకోవచ్చు. వామపక్ష తీవ్రవాద చర్యల్ని కట్టడి చేయడానికి 1989లో ఏపీ పోలీస్‌లో– ‘గ్రే హౌండ్స్’ విభాగం మొదలయింది. ప్రస్తుతం విశాఖపట్టణం వద్ద తాత్కాలిక ‘క్యాంపు’ల్లో ఉండి పనిచేస్తూ ఉంది. అయితే సాయుధ దళాల దన్నుతో కాకుండా... పౌరపాలన దృష్టితో ఈ ప్రాంత అభివృద్ధిని చేపట్టాలి అనే– ‘దార్శనికత’ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అది మునుపటికి భిన్నంగా ఉంటుంది. ఇలా భిన్నమైన దృక్పథాల మధ్య 2022 నాటికి ఇప్పటి యువ నాయకత్వానికి ఉన్న కొత్త చూపు నుంచి వచ్చినవే– పాడేరు కేంద్రంగా ‘అల్లూరి సీతారామరాజు’ జిల్లా, పార్వతీపురం కేంద్రంగా ‘మన్యం’ జిల్లాలు. అంటే– ‘లోపలికి వెళ్లడం’ అనేది చిన్న పరిపాలనా యూనిట్ల ద్వారా... సూక్ష్మ స్థాయికి పరిపాలన తీసుకు వెళ్లడం వల్లనే సాధ్యమని ఈ ప్రభుత్వం నమ్మకం. నిజానికి ఇది– ప్రపంచ దేశాల చరిత్రలో కాలపరీక్షకు నిలిచిన సత్యం. అలా చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో– గ్రామ సచివాలయాల ఏర్పాటు, విద్య–వైద్య రంగాల్లో సంస్కరణలు, ఉత్తర్వులు వెలువడిన వెంటనే కొత్త జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏజెన్సీ ప్రాంతంలో పని మొదలు పెట్టడం, ప్రతి సోమవారం జరిగే– ‘స్పందన’ ప్రజా ఫిర్యాదులకు రద్దీ పెరగడం, పాడేరులో కొత్తగా మెడికల్ కాలేజీ నిర్మాణం చురుగ్గా జరగడం, రోడ్లు, వంతెనల నిర్మాణం, ఇవన్నీ అమలవుతున్న సంక్షేమ పథకాలకు అదనంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులుగా కనిపిస్తున్నాయి. గతంలో ప్రాంతమూ–ప్రజల మధ్య పెనవేసుకుపోయి ఉండే బంధాన్ని విస్మరిస్తూ రూపొందించే అభివృద్ధి నమూనాలు, వీరి పక్షాన మావోయిస్టులు – ‘రాజ్యాన్ని’ వ్యతిరేకించడానికి బలమైన కారణమైంది. కానీ– ఇప్పుడు ప్రభుత్వ దృక్పథం మారింది. అప్పటి వరకు ఉన్న పట్టు జారిపోతున్నప్పుడు, వ్యూహాలు మార్చుకోవడం ఎవరికైనా తప్పదు. విభజన తర్వాత, ఇంత త్వరగా ఇటువంటి కొత్త వాతావరణం ఏజెన్సీ గ్రామాల్లో ఏర్పడుతుందని వారు కూడా అనుకుని ఉండక పోవచ్చు. దాంతో– ముఖ్యులైన మావోయిస్టుల లొంగుబాట్లు మొదలయ్యాయి. కొత్తగా వచ్చి చేరుతున్నవారు లేరు అంటున్నారు. ఈ జూన్ నెలలో జరిగిన నాయకుల అరెస్టు సందర్భంగా 33 మంది మావోయిస్టులు, 27 మంది మిలీషియా సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. రూ. 39 లక్షల నగదు, అత్యంత విలువైన ఆయుధాలు స్వాధీనం అయ్యాయి. మళ్ళీ మరొకసారి ఈ సెప్టెంబర్ 7న పెదబయలు వద్ద మరొక అత్యంత భారీ ఆయుధాలు, కమ్యూనికేషన్ సిస్టం, స్కానర్లు సీఆర్పీఎఫ్ పోలీస్ దళాలు వెలుపలికి తీశాయి. ఈ జిల్లాలో రెండు నెలల వ్యవధిలో రెండవసారి ఛేదించిన ఆయుధాల నిల్వలివి. ఈ మొత్తం వ్యవహారంలో ఆసక్తికరమైన అంశం ఏమంటే– ఇప్పట్లో ఇక్కడ వీటి అవసరం ఉండదని, వారు వీటిని జక్కిని అటవీ ప్రాంతంలో భూమిలో పూడ్చిపెట్టి, ఛతీస్‌గఢ్‌లో భద్రత వున్న రహస్య ప్రాంతాలకు వెళ్లిపోయారు. (క్లిక్ చేయండి: విద్యారంగంలో దూసుకుపోతున్న ఏపీ) జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పర్యావరణాన్నీ, జీవవైవిధ్యాన్నీ పరిరక్షిస్తూనే స్థానిక ఆదివాసుల ఆవాసాల మధ్య పర్యాటక రంగం అభివృద్ధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు పాడేరులో– ‘ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్’ 7 స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక మారు మూల ప్రాంత అభివృద్ధి కోసం పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పడ్డంతో ఇక్కడి – కురికుట్టి వద్ద 1200 మెగావాట్లు, కర్రివలస వద్ద 1,000 మెగా వాట్లు సామర్థ్యం గల అదానీ గ్రీన్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇవి పూర్తి అయ్యాక, ఒకప్పుడు – గ్రే హౌండ్స్ పోలీసులతో ‘ఏఓబీ’గా పిలవబడిన ఆంధ్ర–ఒడిస్సా సరిహద్దున, ఒక్కొక్క పవర్ ప్రాజెక్టు వల్ల 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఏదేమైనా–ఏటిట్యూడ్ ఈజ్ ఎవ్రిథింగ్ (దృక్పథమే సమస్తమూ) అనేది, అన్ని కాలాలకు వర్తించే పాత సూక్తి. - జాన్సన్ చోరగుడి అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
ఏజెన్సీ టు ఢిల్లీ.. వయా కందుకూరు
కందుకూరు: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మీదుగా ఢిల్లీకి అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.10 లక్షల విలువజేసే 105 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటనలో పరారీలో ఉన్న ఇద్దరిని కందుకూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ కండె శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లాకు చెందిన పాములపాటి శ్రీనివాస్ వృత్తిరీత్యా సెకండ్‌హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తుంటాడు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేసేవాడు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకురావడం.. దేశ రాజధాని ఢిల్లీకి తరలించి అక్కడి ఏజెంట్లకు అప్పజెప్పడం వంటి పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో 2016లో రాజమండ్రి పోలీసులు అరెస్టు చేయడంతో మూడేళ్ల జైలుశిక్ష అనుభవించాడు. తరువాత 2021లో మరోసారి ఢిల్లీ పోలీసులకు చిక్కి ఇటీవలే జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన పాల రవితేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో ఇద్దరూ కలిసి మళ్లీ గంజాయి అక్రమ రవాణాకు తెరతీశారు. కాగా, గత నెల 24వ తేదీ కందుకూరు ఓవీ రోడ్డులోని పలుకూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో కారులో గంజాయి తరలిస్తున్న వీరిద్దరూ పోలీసులను చూసి కారు వదిలేసి పారిపోయారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు పరిశీలించి చూడగా.. కారు సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. 51 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కందుకూరులోని శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీనివాస్, రవితేజను సోమవారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మరో 20కేజీల గంజాయిని, రూ.20 లక్షల విలువైన మూడు కార్లను, రూ.20వేల విలువజేసే 8 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
అభివృద్ధే అందరి లక్ష్యం
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని, జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కష్టపడి పనిచేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశం హాల్లో సోమవారం ఎస్పీ సతీష్, జేసీ ధనంజయ్, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలంతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీలో పనిచేసే అధికారులు, సిబ్బంది వారి ప్రధాన కేంద్రాల్లో నివాసముండాలని ఆదేశించారు. మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. జిల్లాలో 200 నుంచి 300 గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమశాఖ ఇంజినీర్లతో ఏజెన్సీలోని రోడ్ల పరిస్థితిపై సమీక్షించారు. ఏజెన్సీలో ఆస్పత్రులు, వాటిలో అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. రేషన్‌కార్డు, పింఛన్ల సమస్యలు ఉంటే పూర్తిస్థాయిలో పరిష్కరించే బాధ్యత ఆయా శాఖ అధికారులపై ఉందన్నారు. ప్రతి వారం నిర్వహించే స్పందనకు అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు.ఏజెన్సీలో లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు.గిరిజనులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులకు కలెక్టర్ సూచించారు. గిరిజనులకు సేవ చేయడం అదృష్టం జిల్లా ఎస్పీ సతీష్ మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజనులకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు.సమావేశంలో ఏపీవో సీఎస్ నాయుడు, డీడీ ముక్కంటి, ఈఈ డేవిడ్‌రాజు, ఐ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
గిరిసీమలో ప్రకృతి సాగు
సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రకృతి వ్యవసాయాన్ని ఏజెన్సీలోని అన్ని గ్రామాలకూ దశలవారీగా విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం మూడేళ్ల పాటు పక్కా ప్రణాళికను అమలు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రోత్సాహంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలు సహజసిద్ధమైన సాగు పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఈ ఐదు జిల్లాల్లోని 42 ఏజెన్సీ మండలాల్లో ఉన్న 424 గ్రామాల్లో ఇప్పటికే 1.64 లక్షల ఎకరాల్లో 76,329 మంది గిరిజన రైతులను ప్రభుత్వం ప్రకృతి సేద్యం వైపు ప్రోత్సహించింది. తాజాగా చేపట్టిన మూడేళ్ల ప్రణాళికతో మరో 530 గిరిజన గ్రామాల్లో 1.75 లక్షల మంది రైతులు పూర్తిస్థాయి ప్రకృతి సేద్యం చేయనున్నారు. తద్వారా 4.25 లక్షల ఎకరాల్లో రసాయన ఎరువులు, పురుగుమందుల సాగుకు చెల్లుచీటి పలకనున్నారు. వీరిని ప్రకృతి సేద్యం వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.187 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రకృతి సేద్యం ఏజెన్సీకి వరం.. విపత్తులు, పర్యావరణ మార్పుల వల్ల సున్నితమైన గిరిజన ప్రాంతాల్లో పంటలు దెబ్బతింటుంటాయి. దీనికితోడు రసాయన ఎరువులు, పురుగు మందులకు అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే.. గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిని తగ్గించే ప్రకృతి సేద్యం వీరికి నిజంగా వరమేనని ప్రకృతి సాగు నిపుణులు చెబుతున్నారు.. సీఎం జగన్ దార్శనికతకు ఇదో నిదర్శనం ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించి గిరిజన రైతులను పంట నష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా మేలైన ఉత్పత్తులు సాధించేలా చర్యలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్ దార్శనికతకు ఇది మరో నిదర్శనం. ఏజెన్సీలోని వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ ప్రాంతంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గిరిజన ప్రాంతాల్లోని వ్యవసాయ ఉత్పత్తులకు కూడా మరింత క్రేజ్ ఏర్పడుతుందనడంలో సందేహంలేదు. – పాముల పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి ప్రకృతి సేద్యంతో మేలైన ఫలితాలు రైతులను రసాయన ఆధారిత సాగు నుంచి ప్రకృతి సేద్యం వైపు ప్రోత్సహించడంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో 7.50 లక్షల ఎకరాలకు సంబంధించి సుమారు 6,50,000 మంది రైతులు ప్రకృతి సేద్యం చేసేందుకు నమోదు చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లోనూ ప్రకృతి సేద్యం విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రైతు సాధికార సంస్థ, ఆర్బీకేలు, స్థానిక సంస్థలను సమన్వయం చేసి ఏజెన్సీ గ్రామం, మండలం, జిల్లా యూనిట్లుగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. ప్రకృతి సేద్యానికి గిరిజన రైతులను సన్నద్ధం చేసేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిధులను ఖర్చు చేయనున్నాం. – టి.విజయకుమార్, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ -
శరవేగంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ
-
పేర్లు, జిల్లా కేంద్రాలపైనే ప్రధానంగా సూచనలు
సాక్షి, అమరావతి: నూతన జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు 7,500 ప్రజాభిప్రాయాలు అందగా జిల్లా కేంద్రాలు, జిల్లాల పేర్లపైనే ఎక్కువ సూచనలు వచ్చాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా నుంచి 4,500కిపైగా అభిప్రాయాలు వచ్చాయి. అందులో ఒక అంశంపైనే 4 వేలకుపైగా ఉండడం గమనార్హం. సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలం ప్రస్తుతం విజయనగరంలో ఉండగా పునర్వ్యవస్థీకరణలో దాన్ని పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటవుతున్న మన్యం జిల్లాలో ప్రతిపాదించారు. పార్వతీపురం తమకు బాగా దూరమవుతుంది కాబట్టి విజయనగరంలోనే ఉంచాలనే అభిప్రాయాలు పెద్దఎత్తున వచ్చాయి. ఎస్ కోట నియోజకవర్గం కొత్తవలస మండలాన్ని విజయనగరంలో కాకుండా విశాఖలో కలపాలని కొన్ని సూచనలు వచ్చాయి. పార్వతీపురం జిల్లాకు మన్యం జిల్లాగా పేరు పెట్టడంపైనా ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయి. మన్యం అంటే ఏజెన్సీ ప్రాంతంగా మారుతుందని, దానివల్ల 1/77 చట్టం పరిధిలోకి వెళ్లిపోయి భూముల క్రయ విక్రయాలకు ఇబ్బందికరంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మన్యం అని కాకుండా పార్వతీపురం పేరుతో కొనసాగించాలని కోరుతున్నారు. కృష్ణా జిల్లాలో పేర్లు అటు ఇటు మార్చాలని.. కృష్ణా జిల్లాలో 2,900 అభ్యంతరాలు రాగా జిల్లా కేంద్రాల పేర్లు మార్చాలనే సూచనలు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాను వంగవీటి జిల్లా, కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా చేయాలని సూచనలు అందాయి. మైలవరం డివిజన్ ఏర్పాటు చేయాలని 2 వేల వరకు సూచనలు వచ్చాయి. టీడీపీ నేత దేవినేని ఉమా నేతృత్వంలో రాజకీయ కోణంలో వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాలను కోనసీమ జిల్లాలో కలపవద్దని, రాజమండ్రి లేదా కాకినాడలో కలపాలనే సూచనలు వచ్చాయి. ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం, ఎటపాకలను పాడేరులో కాకుండా రాజమండ్రిలోనే ఉంచాలని, లేదంటే ప్రత్యేక జిల్లాగా చేయాలని పలు అభిప్రాయాలు అందాయి. విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గాన్ని అనకాపల్లిలో కాకుండా విశాఖలోనే ఉంచాలనే సూచనలు ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. విజయనగరంలో జామి, శ్రీకాకుళంలో పాతపట్నం మండలాలను ఇప్పుడున్న డివిజన్లో కాకుండా వేరే డివిజన్‌లోకి మార్చాలనే సూచనలు వచ్చాయి. జిల్లా కేంద్రాలపై మూడు చోట్ల అభ్యంతరాలు.. జిల్లా కేంద్రాలుగా అనంతపురం జిల్లాలో హిందూపురం, వైఎస్సార్ కడపలో రాజంపేట, పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పట్టణాలను చేయాలని సూచనలు వచ్చాయి. భీమవరం, రాయచోటి, పుట్టపర్తిని వ్యతిరేకిస్తూ అభ్యంతరాలు అందాయి. ద్వారకా తిరుమల మండలాన్ని రాజమండ్రిలో కాకుండా ఏలూరు జిల్లాలో కలపాలని భారీగా సూచనలు వచ్చాయి. కోనసీమకు అంబేడ్కర్, కర్నూలుకు దామోదరం సంజీవయ్య, కృష్ణాకు పింగళి వెంకయ్య, ఏలూరుకు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేర్లు పెట్టాలనే సూచనలూ అందాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చిరంజీవి జిల్లాగా పేరు పెట్టాలని కొన్ని సూచనలు అందడం విశేషం. ఐదు కేటగిరీలుగా.. సూచనలు, అభ్యంతరాలను ఐదు కేటగిరీలుగా విభజించి పరిశీలిస్తున్నారు. డివిజన్ కేంద్రం మార్పు, జిల్లా కేంద్రం మార్పు, కొత్త డివిజన్ ఏర్పాటు, ఆ డివిజన్లో కాకుండా మరో డివిజన్‌లోకి మార్చడం, నియోజకవర్గాల్లోని మండలాలను విభజించడం... ఇలా 5 విభాగాలుగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను విభజించారు. 9 జిల్లాల్లో ముగిసిన గడువు.. సూచనలు, అభ్యంతరాల స్వీకరణ గడువు దాదాపు ముగింపు దశకు వచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి 30 రోజులు అభ్యంతరాలకు గడువు ఇవ్వగా ఫిబ్రవరి 24వ తేదీకే 9 జిల్లాల్లో గడువు ముగిసింది. ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ నెల 3వ తేదీ వరకు, అనంతపురం జిల్లాలో 5వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికే సూచనలు, అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటైన రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ల కమిటీ ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించి అధ్యయనం జరిపి ఒక అభిప్రాయానికి వచ్చింది. వచ్చిన వినతులన్నింటినీ క్రోడీకరించి తమ సిఫారసులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి గడువు ముగిసిన వారం రోజుల్లో సమర్పించనుంది. అనంతరం ప్రభుత్వ స్థాయిలో వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త జిల్లాలకు ప్రజామోదం ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ కొత్త జిల్లాల ప్రతిపాదనలను ప్రజలు ఆమోదించినట్లు తమ అధ్యయనంలో కనిపించిందని ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ చెప్పారు. విజయవాడలోని ప్రణాళికా శాఖ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 13 జిల్లాల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలపై అధ్యయనం జరిపి క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించామని తెలిపారు. అభ్యంతరాలు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నా కేవలం 60 అంశాలకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు అందినట్లు గుర్తించామన్నారు. జనాభా, ఏరియా సైజును బట్టి కొన్ని కలపడం, మార్చడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అని ముందే తాము ఆలోచించామని, అలాంటి చోట్లే అభ్యంతరాలు, సూచనలు వచ్చాయన్నారు. పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా ఉండాలనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకోగా దాని చుట్టూ ఉన్న నియోజకవర్గాలను రెండో లెవల్‌గా, ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా అలాగే ఉంచాలని, ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండాలనే నియమాల ఆధారంగా చేసిన పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు. సూచనలపై కలెక్టర్ల నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మార్చి ఆఖరి వారంలో తుది నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించి ఆర్డర్ టు సర్వ్ ఇస్తారని చెప్పారు. కొత్తగా నియమించే కలెక్టర్లను ముందుగా ఓఎస్డీలుగా నియమించి ఆ తర్వాత నోటిఫైడ్ తేదీ నాటికి కలెక్టర్లుగా మారేలా ఆదేశాలు ఇస్తారని తెలిపారు. -
గిరి సీమల్లో సిరుల సేద్యం
కొండవాలు ప్రాంతాల్లో సంప్రదాయ పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న అడవి బిడ్డలు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సమగ్ర వ్యవసాయ విధానంలో పంటలు పండిస్తూ తమ సుస్థిరాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ పరిశోధనా ఫలితాలను పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం తరఫున వారికి అవసరమైన ఆర్థిక తోడ్పాటునిస్తోంది. దీంతో వారు సాగులో మెళకువలు, సాంకేతిక శిక్షణ పొందుతూ సంతృప్తికర స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకుంటూ పిల్లలనూ బాగా చదివించుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సాగులో సాధిస్తున్న విజయాలపై ప్రత్యేక కథనం.. సాక్షి, అమరావతి: సమగ్ర వ్యవసాయ విధానంలో వరి ఆధారిత పంట–పాడి–మత్స్య సాగు చేసేందుకు కృషి విజ్ఞాన కేంద్రం అడవి బిడ్డలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా జీడి మామిడి అంటు కట్టు విధానం, అపరాలు, చేపల సాగు, రబ్బర్, చిరు ధాన్యాలు, జీడి మామిడి ప్రాసెసింగ్, మేకలు, గొర్రెలు, పెరటి కోళ్లు, తేనెటీగలు, పుట్ట గొడుగులు, నర్సరీ పెంపకంతో పాటు పనసతో సహా వివిధ రకాల పంటల విలువాధారిత ఉత్పత్తులు, వర్మీ కంపోస్ట్ తయారీపై గడిచిన మూడేళ్లుగా గిరిజనులకిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఇప్పుడు సత్ఫలితాలిస్తున్నాయి. ఎంతలాగంటే.. మత్స్య సంపద ద్వారా 57 శాతం, వరి సాగు ద్వారా 24 శాతం, ఉద్యాన పంటల ద్వారా 5.13 శాతం, మేకల పెంపకం ద్వారా 4.8 శాతం ఆదాయాన్ని వీరు ఆర్జిస్తున్నారు. రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న శిక్షణతో ఏజెన్సీలో చిరుధాన్యాల సాగు రెండేళ్లలో గణనీయంగా పెరిగింది. వీటిని ప్రాసెస్ చేసి అమ్మడం ద్వారా గిరిజనులు ఏటా రూ.27వేల ఆదాయాన్ని అదనంగా ఆర్జించగలుగుతున్నారు. అలాగే.. ► రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు కేవీకే ద్వారా సాగులో మెళకువలపై అధికారులు రెండేళ్లుగా శిక్షణనిస్తూనే రబ్బర్ టాపింగ్, ప్రాసెసింగ్ పరికరాలు సమకూర్చుతున్నారు. దీంతో నేడు ఎగుమతి చేయదగ్గ నాణ్యమైన రబ్బర్ షీట్లను ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఆరునెలల పాటు సేకరించే రబ్బర్ పాల ద్వారా ఒక్కో రైతు రూ.2.5 లక్షలు ఆర్జిస్తున్నారు. తేనెటీగల పెంపకం యూనిట్లో ఉత్పత్తిని పరిశీలిస్తున్న గిరిజన రైతులు ► అటవీ ప్రాంతంలో విరివిగా లభించే అడ్డాకుల ద్వారా గిరి మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలన్న సంకల్పంతో మారేడుమిల్లి మండలం బోధగండి పంచాయతీ మంగంపాడు గ్రామంలో విస్తరాకుల పరిశ్రమను ఏర్పాటుచేశారు. ఫలితంగా నేడు ఒక్కో మహిళ రూ.3వేల పెట్టుబడితో నెలకు రూ.18వేలు ఆర్జిస్తోంది. ► పెరటి కోళ్ల పెంపకం ద్వారా మరింత ఆదాయం ఆర్జించేందుకు వీలుగా హైదరాబాద్‌లోని జాతికోళ్ల పరిశోధనా కేంద్రం నుంచి శ్రీనిధి, వనశ్రీ, వనరాజా, గాగస్, అశీల్, కడక్‌నాథ్ వంటి మేలు జాతి కోడి పిల్లలను అధికారులు తెప్పించి పంపిణీ చేస్తున్నారు. వీటి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. ఇలా ప్రతిఏటా 2వేల కోళ్లను 200 గిరిజన మహిళలకు అందజేస్తుండడంతో ఇళ్ల వద్దే ఉంటూ గిరిజన మహిళలు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ► మేకలు, గొర్రెల పెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు హింగోలిలో కేవీకే అభివృద్ధి చేసిన అధిక వ్యాధి నిరోధకశక్తి కలిగిన ఉస్మానాబాది రకం మేకలను ఒక్కొకరికి మూడు చొప్పున ఇస్తున్నారు. 10–12 నెలల వయస్సు వరకు పెంచిన తర్వాత ఒక్కోదాన్ని రూ.8వేల నుంచి రూ.10వేల విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ► ఇక పనస విలువాధారిత ఉత్పత్తుల తయారిపైనా శిక్షణనివ్వడంతో గిరిజనులు ప్రతినెలా రూ.12వేల అదనపు ఆదాయం పొందుతున్నారు. ► తేనెటీగల పెంపకంపైనా శిక్షణనివ్వడంతో సొంత పొలాలతో పాటు అటవీ ప్రాంతంలో కూడా విలువాధారిత తేనె ఉత్పత్తును తయారుచేస్తున్నారు. తద్వారా ఏటా రూ.40 వేల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ► అంతేకాదు.. పుట్ట గొడుగుల పెంపకం యూనిట్లను ఏర్పాటుచేసి పాల పుట్ట గొడుగులు, గులాబీ, తెలుపు ముత్యపు చిప్ప పుట్ట గొడుగుల పెంపకంపై తర్ఫీదు ఇస్తున్నారు. గిరిజన రైతులకు మేకల యూనిట్‌ను అందజేస్తున్న అధికారులు పెట్టుబడి పోనూ 50వేలు మిగులుతోంది నేను పదో తరగతి చదువుకున్నా. నాకున్న రెండున్నర ఎకరాల్లో వర్షాధారంపై ఆధారపడి కొర్రలు, రాగులు పండించి సంతలకుపోయి అమ్ముకుంటే పెట్టుబడి పోను రూ.17,500 మిగిలేది. ప్రభుత్వం మినీ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను అందించింది. ప్రాసెసింగ్ చేసి ఎలా అమ్మాలో స్థానిక కేవీకే ద్వారా శిక్షణ పొందాను. ఇప్పుడు అదనంగా మరో రూ.32,300 ఆదాయం వస్తోంది. మొత్తం మీద రూ.49,800 మిగులుతోంది. – పల్లలబొజ్జ్డి నారాయణరెడ్డి, బొద్దగుంట, వై.రామవరం మండలం మేకల పెంపకంతో అదనపు ఆదాయం గతంలో నాలుగు ఎకరాల్లో వరి, మినుము, కందులు సాగుచేసేవాడిని. పంట పండితే నాలుగు డబ్బులు లేకుంటే పస్తులుండాల్సి వచ్చేది. స్థానిక కేవీకే ద్వారా ఉస్మానాబాదీ రకానికి చెందిన రెండు మేకలు, ఓ మేకపోతు తీసుకున్నా. ఈతకు రెండు పిల్లల చొప్పున ఏడాదికి నాలుగు పిల్లలు వస్తున్నాయి. మరోవైపు.. వ్యవసాయం ద్వారా ఏటా రూ.55వేల ఆదాయం.. ఏటా 3–4 మేకలను అమ్ముకోవడం ద్వారా అదనంగా మరో రూ.24వేలు వస్తోంది. – కంగల రామస్వామి దొర, ఐ.పోలవరం, రంపచోడవరం మండలం నెలకు రూ.11,500 ఆదాయం రెండేళ్ల క్రితం మాకు శ్రీనిధి, వనశ్రీ, గఘస్ కోళ్లను అందించారు. పొలం పనులు చేసుకుంటూ వాటిని పెంచుకుంటున్నా. ఏడాది వయస్సున్న కోడిని రూ.500 నుంచి రూ.600లకు అమ్ముతున్నా. గుడ్లు, కోళ్ల అమ్మకాల ద్వారా నెలకు రూ.11,500 నికర ఆదాయం వస్తోంది. – కాలుం రామతులసి, ఐ.పోలవరం, రంపచోడవరం మండలం సొంతంగా మార్కెటింగ్ మూడేళ్ల క్రితం తేనెటీగల పెంపకాన్ని చేపట్టా. శిక్షణ, సాంకేతిక సలహాలతో సొంత పొలంతో పాటు అటవీ ప్రాంతంలో తేనెటీగల పెంపకం యూనిట్లు పెట్టా. 3 నెలలకోసారి 60 కేజీల తేనె, 20 కేజీల మైనం తీస్తున్నా. వాటి ద్వారా నెలకు రూ.16వేల చొప్పున ఆర్జిస్తున్నా. గతేడాది నుంచి తేనె విలువా«ధారిత ఉత్పత్తులైన మురబ్బ, అల్లం తేనె, విప్పపువ్వు తేనేలతో పాటు మైనంతో తయారుచేసిన క్రాక్‌క్రీమ్, లిప్‌బామ్ వంటి ఉత్పత్తులను తయారుచేసి ‘గిరిమధుర నేచురల్ ప్రొడక్టŠస్’ పేరిట మార్కెటింగ్ చేస్తున్నా. – జగతా భావన కృష్ణ, రంపచోడవరం సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం ప్రభుత్వాదేశాల మేరకు గిరిజనుల్లో ఆదాయ వనురులను పెంపొందించడమే లక్ష్యంగా ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున విస్తరణ కార్యక్రమాలు అమలుచేస్తున్నాం. మైదాన ప్రాంతాల్లో మాదిరిగానే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులను సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు శిక్షణతో పాటు ఆర్థిక తోడ్పాటునూ అందిస్తున్నాం. – డాక్టర్ టి. జానకీరామ్, వైస్ చాన్సలర్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, తాడేపల్లిగూడెం ఇంటి వద్దే జాతి కోళ్లు పెంచుకుంటున్న గిరిజనులు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం మర్రివాడ గ్రామానికి చెందిన ఎం. సావిత్రి కుటుంబ సభ్యులు 13మంది సంఘంగా ఏర్పడి వరి, జీడి మామిడి పంటలు సాగుచేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో స్థానిక సామాజిక చెరువులో బొచ్చు, గడ్డిమోసు, శీలావతి వంటి చేçపలను సాగుచేస్తున్నారు. ఇలా ఏటా ఆహార ధాన్యాల ద్వారా రూ.34వేలు, కూరగాయల సాగు ద్వారా రూ.24 వేలు, మత్స్యసాగు ద్వారా రూ.73వేలు ఆర్జిస్తున్నారు. కడక్‌నాథ్, గాఘస్ కోళ్ల పెంపకం ద్వారా మరో రూ.16,800 ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి మండలం పందిరిమామిడి గ్రామానికి చెందిన కత్తుల సోమిరెడ్డి. గతంలో వీళ్లు 70మంది కలిసి కూరగాయలు పండిస్తే ఒక్కొక్కరికి రూ.7వేలకు మించి వచ్చేది కాదు. కానీ, ఇప్పుడు వీరంతా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రబ్బరు సాగు, ప్రాసెసింగ్‌లో శిక్షణ పొంది ప్రాసెసింగ్ యూనిట్ తీసుకున్నారు. ఇప్పుడు నాణ్యమైన రబ్బరును ఉత్పత్తి చేస్తూ ఓ సంఘంగా ఏర్పడ్డారు. కేరళ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఫలితంగా.. గడిచిన ఆర్నెల్లలో 1,200 కేజీల రబ్బరును ప్రాసెస్ చేసి ఎగుమతి చేయడంద్వారా ఒక్కొక్కరం రూ.2.5 లక్షలు ఆర్జించామని.. ఖర్చులు పోనూ ఒక్కో రైతుకు రూ.1.50 లక్షలు మిగులుతోందని సోమిరెడ్డి చెబుతున్నాడు. -
బొంగులో బిర్యానీ.. చికెన్, బాస్మతి రైస్‌తో అబ్బ! ఏమి రుచి..! ధరెంతో తెలుసా?
అనంతగిరి(విశాఖ జిల్లా): మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో బొంగు చికెన్ దొరకని ప్రదేశమే ఉండదు. బొంగు చికెన్‌కు అంత డిమాండ్ ఉంది. దీంతో పాటుగా ప్రస్తుతం బొంగు బిర్యానీకి కూడా అంతే డిమాండ్ పెరిగింది. మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలను సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులకు, బొర్రా హోటల్ నిర్వహకులు బొంగు బిర్యానీని రుచి చూపిస్తున్నారు. బొంగుచికెన్ మాదిరిగానే బొంగు బిర్యానీ కూడా ఫేమస్ అయింది. మన్యంలోని పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. బొర్రా హోటల్లో తయారుచేస్తున్న బొంగు బిర్యానీ మన్యంలో దొరికే ఆహారంపై మొగ్గు చూపుతుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని, స్థానికంగా ఉన్నవారు పర్యాటకులకు కొత్త రుచులను పరిచయం చేస్తున్నారు. బొర్రా గుహలను తిలకించేందుకు భారీగా తరలివచ్చే పర్యాటకుల కోసం హోటల్స్ వద్ద బొంగుచికెన్తో పాటుగా బొంగు బిర్యానీని అందుబాటులో ఉంచుతున్నారు. హోటల్లో ఇచ్చే ఒక బొంగు బిర్యానీ ఇద్దరికి సరిపోతుంది. దీని ధర రూ.500 నుంచి రూ. 600 వరకు ఉంది. చికెన్, బాస్మతి రైస్‌తో కలిపి ఎంతోరుచిగా దీనిని తయారు చేస్తున్నారు. బిర్యానీలో ఎన్నోరకాలు ఉండగా, పర్యాటక ప్రాంతాల్లో దొరికే బొంగు బిర్యానీ రుచే వేరంటూ పర్యాటకులు లొట్టలేసుకుని తింటూ కితాబు ఇస్తున్నారు. బొంగు బిర్యానీని రుచి చూడాలంటే మరెందుకు లేటు బొర్రా రావలసిందే. చదవండి: 20 సినిమాలకు పైగా షూటింగ్.. జానకిరాముడు, ప్రేమదేశం తీసింది అక్కడే.. -
ఇక కష్టాలు దూరమండి.. కొండ కోనల్లో ఆపద్బాంధవి
బుట్టాయగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): మారుమూల కొండకోనల్లోని ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల అత్యవసర వైద్యానికి బైక్ అంబులెన్స్‌లు అపర సంజీవనిలా మారాయి. 108, 104 వాహనాలు వెళ్లలేని అటవీ ప్రాంతాలకు సులభంగా చేరుకుంటూ అడవిబిడ్డలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. దీంతో జోలికట్టి భుజాలపై మోసుకొచ్చే కష్టాలు గిరిజనులకు తప్పాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లాలో ఐటీడీఏ, వైద్యారోగ్యశాఖ అధికారులు ఎనిమిది బైక్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. 2019 నుంచి ఈ వాహనాల ద్వారా విశేష సేవలు అందుతున్నాయి. (చదవండి: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..) ఐదు మండలాల పరిధిలో.. కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలో బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు, జీలుగుమిల్లి మండలాలు ఉన్నాయి. వీటిలో 152 గ్రామాలు, 405 శివారు గ్రామాలు ఉండగా సుమారు 1,20,000 వరకూ గిరిజన జనాభా ఉంది. దాదాపు 40 గ్రామాలకు ఇప్పటికీ సరైన రహదారి సదుపాయం లేదు. భౌగోళిక స్వరూపం దృష్ట్యా బస్సులు, 108, 104 వాహనాలు ప్రయాణించలేని పరిస్థితి. ఆయా గ్రామాల్లో గిరిజనులు అనారోగ్యాలపాలైతే జోలి కట్టి మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకువచ్చేవారు. చదవండి: రైతన్నకు తోడుగా 'ఏపీ ఆగ్రోస్' ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గిరిజనుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. మారుమూల ప్రాంతాల్లో సేవలందిచేలా రాష్ట్రవ్యాప్తంగా బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటుచేశారు. జిల్లాలో 40 గ్రామాలకు సే వలందించేలా ఎనిమిది వాహనాలను సమకూర్చగా.. మరో ఏడు వాహనాల కోసం వైద్యారోగ్యశాఖ అధికారులు ఇటీవల ప్రతిపాదనలు చేశారు. ఇవి త్వరలో రానున్నాయని సమాచారం. రెండేళ్లు.. 11,255 కేసులు రెండేళ్ల నుంచి జిల్లాలో బైక్ అంబులెన్స్‌ల ద్వారా 11,255 అత్యవసర కేసులకు సేవలు అందించారు. 2019–20లో గర్భిణులు 824, జ్వర పీడితులు 3,012, పాయిజన్ కేసులు 160, ఆర్టీఏ 118, ఇతర కేసులు 1,020 మొత్తం 5,134 కేసులకు బైక్ అంబులెన్స్‌ల ద్వారా సేవలందించారు. 2020–21, 2021–22లో ఇప్పటివరకూ గర్భిణులు 558, ఆర్టీఏ 99, జ్వరపీడితులు 4,059, పాయిజన్ కేసులు 149, ఇతర కేసులు 956 మొత్తంగా 6,121 మందికి సేవలు అందించారు. ప్రయోజనాలు ఎన్నో.. ►పరిమాణం, పనితీరు కారణంగా బైక్ అంబులెన్స్‌లు గిరిజన ప్రాంతాల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులను కాపాడేందుకు సాధారణ అంబులెన్స్ కంటే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ►దీని ద్వారా ఎక్కువ మంది ప్రాణాలను రక్షించగలుగుతున్నారు. గర్భిణులను వేగంగా ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ►కుక్కునూరు మండలంలో అమరవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో కొయిదా, తొట్కూరుగొమ్ము, పోలవరం మండలంలో కొరుటూరు, మేడేపల్లి, బుట్టాయగూడెం మండలంలో అలివేరు, చింతపల్లి తదితర గ్రామాల్లో బైక్ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని సేవలు అందించేలా.. గిరిజన గ్రామాల్లో ప్రతిఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా కృషి చేస్తున్నాం. మారుమూల కొండ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో వైద్యసేవలు అందించేందుకు ప్రస్తుతం ఎనిమిది బైక్ అంబులెన్స్‌లు వినియోగిస్తున్నాం. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మరో ఏడు బైక్ అంబులెన్స్‌లకు ప్రతిపాదనలు పంపించాం. వీటి ద్వారా గిరిజనులకు మరిన్ని సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం అత్యవసర వైద్యం బైక్ అంబులెన్స్‌లలో అత్యవసర వైద్యానికి సంబంధించిన మెడికల్ కిట్‌ను అందుబాటులో ఉంచాం. అలాగే చిన్నపాటి ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంటుంది. సెలైన్ పెట్టే సౌకర్యం కూడా అంబులెన్స్‌లో ఉంది. అనారోగ్యం పాలైన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాథమిక వైద్యం అందించడంతో పాటు మెరుగైన వైద్యం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశాం. బైక్ అంబులెన్స్ సేవలు మరింత విస్తరిస్తాం. – జి.మురళీకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, కేఆర్‌పురం -
టీడీపీ డ్రగ్స్ రాజకీయాలకు రాష్ట్ర ప్రతిష్టే బలిపశువు
ఏవోబీలో భౌగోళిక స్థితిగతుల దృష్ట్యా దశాబ్దాల తరబడి గంజాయి సాగవుతోందన్నది బహిరంగ రహస్యం. అలాంటిది రెండేళ్లుగా గంజాయి సాగు.. రవాణాపై కేసులు పెరుగుతున్నాయంటే అర్థం ఏమిటి? ప్రత్యామ్నాయ పంటల సాగు పెరగడాన్ని ఏ విధంగా చూడాలి? మారు మూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఊపందుకోవడాన్ని ఏమని విశ్లేషించాలి? ఈ దందాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందనే కదా! ఈ వాస్తవాన్ని టీడీపీ ఎందుకు అంగీకరించడం లేదు? అబద్ధాలు, కుట్రలు, బూతులతో విషం చిమ్మడం దేనికి సంకేతం? ఏజెన్సీలో గంజాయి సాగు, రవాణాకు తమ నిర్వాకమే కారణమని బయటకు చెప్పుకోలేక రాష్ట్ర ప్రతిష్టను పణంగా పెట్టడం రాజకీయ దిగజారడుతనమా.. లేక దింపుడు కల్లం ఆశలా!? సాక్షి, విశాఖపట్నం: ఐదు దశాబ్దాలుగా ఏజెన్సీ (ఏఓబీ) ప్రాంతంలో అక్కడక్కడ గంజాయి సాగవుతోందన్నది రాష్ట్రంలో అందరికీ తెలుసు. ప్రధానంగా 2014 తర్వాత అది ఏజెన్సీలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఈ విషయాన్ని గమనించిన వైఎస్ జగన్ ప్రభుత్వం రెండేళ్లుగా ప్రత్యేక కార్యాచరణతో మూడు అంచెల్లో గంజాయి సాగు, రవాణా అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి రోజూ సివిల్ పోలీసులతో పాటు సెబ్ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ తనిఖీల సంఖ్య బాగా పెరిగింది. అందువల్లే కేసుల సంఖ్య పెరగడం అనేది సహజం. వాస్తవంగా ఇది ఆహ్వానించదగిన పరిణామం. గతంలో తూతూ మంత్రపు తనిఖీలతో ఎక్కువ కేసులు నమోదయ్యేవి కావు. ఒక్క విశాఖపట్నం జిల్లాలో గంజాయి సాగు, రవాణాపై గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 300 మంది పోలీసులు మాత్రమే తనిఖీలు చేపట్టేవారు. ఇప్పుడు ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. తద్వారా విశాఖ ఏజెన్సీ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 2021లో ఇప్పటి దాకా 1,445 కేసులు నమోదయ్యాయి. 81,096 కేజీల గంజాయి పట్టుబడింది. 2017లో కేవలం 244 కేసులు నమోదయ్యాయి. ఇది విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలం బొండవల్లి సమీపంలోని గొడిపుట్టు రోడ్డులో ఉన్న పొలం. ఇక్కడ 2018లో పూర్తిగా గంజాయి సాగు చేసిన దృశ్యం. ఇప్పుడు ఇదే పొలంలో వరి, ఇతర పంటలు సాగైన దృశ్యం. డ్రోన్ల ద్వారా నిఘా కట్టుదిట్టం ► గ్రామ సచివాయాల ఏర్పాటు వల్ల ప్రత్యేకంగా మహిళా పోలీసుల నియామకంతో నిఘా పెంచింది. దీంతో అధికారులు గంజాయి సాగు ప్రాంతాలను సులువుగా గుర్తించగలుగుతున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ తనిఖీలు జరుగుతుండటంతో గంజాయి రవాణా ముఠాలకు రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతోంది. ► ఏజెన్సీ ప్రాంతాలో ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా సర్వే చేపట్టి గంజాయి సాగును గుర్తించడానికి చర్యలు తీసుకుంది. ► గంజాయి స్మగ్లర్ల బ్యాంకు అకౌంట్లపై నిఘా పెట్టడంతో పాటు.. రైతుల్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్జీవోల ద్వారా అవగాహన కల్పించే చర్యలకూ శ్రీకారం చుట్టింది. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంపు ► గంజాయి సాగు చేస్తూ పట్టుబడిన వారిలో అత్యధికులు పొట్ట కూటి కోసమే ఆ పని చేస్తున్నారనే వాస్తవాన్ని గ్రహించిన ఈ ప్రభుత్వం గత రెండేళ్లలో వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను విస్తృతం చేసింది. ► గిరిజనుల్లో అనేక మందికి సొంత భూములు లేవు. దీంతో రికార్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ (ఆర్వోఎఫ్ఆర్) పట్టాల ద్వారా భూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. ► ఇప్పటి వరకు ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో 2021 జూలై నుంచి 64,834 మందికి 93,574.17 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. ఈ భూమి పొందిన రైతులకు రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి కలిగిస్తోంది. ఈ విధంగా గిరిజనులకు కేటాయించిన భూమిని సాగుకు యోగ్యంగా మలిచేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా అండగా నిలుస్తోంది. ► గ్రామ సచివాయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ భవనాల నిర్మాణం చేపడుతోంది. తద్వారా స్థానిక గిరిజనులకు ఎక్కడికక్కడ ఉపాధి లభిస్తోంది. మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి లభిస్తోంది. ► ప్రస్తుతం ఏజెన్సీ పరిధిలో 1,46,003 మందికి జాబ్ కార్డులున్నాయి. ఇందులో 2,99,181 మంది ఉపాధి కూలీలుండగా.. ఈ ఏడాదిలో ఇప్పటికే రూ.200 కోట్ల వరకు వారికి చేరింది. ఊపందుకున్న కాఫీ, పండ్ల తోటల పెంపకం ► గంజాయి సాగును నిరుత్సాహ పరిచేందుకు ప్రభుత్వం కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. మొత్తం లక్ష ఎకరాల్లో కాఫీ తోటల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. రెండేళ్లలో 22 వేల ఎకరాల్లో కాఫీ తోటలను పెంపకాన్ని చేపట్టారు. ఈ ఏడాది మరో 15 వేల ఎకరాల్లో కాఫీ తోటల పెంపకాన్ని చేపట్టారు. మరోవైపు ఉద్యాన పంటల సాగును కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ► మూడేళ్లలో రూ.84.76 కోట్లతో 5 వేల ఎకరాల్లో పసుపు పంట సాగు చేసేలా ప్రణాళిక రచించారు. 2020–21 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం 2023 వరకూ కొనసాగనుంది. ఇప్పటికే 1,384 ఎకరాల్లో 3,341 మంది రైతుల ద్వారా రూ.4.64 కోట్లతో పసుపు పంట సాగు పథకం అమలవుతోంది. ► సీతాఫలం, ఫైనాపిల్, అల్లం, మిరియాలు, స్ట్రాబెరీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్ల సాగును కూడా ప్రోత్సహిస్తోంది. అన్ని ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని 2021–22లో 7,700 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ► ఉద్యాన పంటలను విక్రయించేందుకు ప్రత్యేకంగా విశాఖపట్నంలోని రైతు బజార్లలో గిరిజనులకు కొన్ని నెలల క్రితమే కార్డులు ఇప్పించారు. ఏజెన్సీ నుంచి ప్రత్యేక రవాణా సదుపాయం కూడా కల్పించారు. ఏజెన్సీలో అభివృద్ధి పరుగులు ► రూ.150 కోట్లతో మారుమూల ప్రాంతాలకు శరవేగంగా రోడ్లు వేస్తున్నారు. ► నాడు–నేడు కింద ఏజెన్సీ పరిధిలో మొదటి విడతలో రూ.110.91 కోట్లతో 367 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. రెండో విడతలో మరో 502 పాఠశాలల్లో పనులు చేపట్టనున్నారు. ► రూ.24 కోట్లతో రెండు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారు. ► రూ.84.80 కోట్లతో 212 గ్రామ సచివాలయ భవనాలు, రూ.45.56 కోట్లతో 209 రైతు భరోసా కేంద్రాలు, రూ.18.78 కోట్లతో 125 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం చేపడుతున్నారు. ► జలజీవన్ మిషన్ కింద రూ.76.57 కోట్లతో 1,937 పనుల ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా పనులు చేపట్టారు. ► ఐఐటీ, ఐఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఏజెన్సీ విద్యార్థులను సిద్ధం చేసేందుకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గంజాయి మొక్కల ధ్వంసం శనివారం విశాఖ జిల్లా అరకులోయ మండలం బస్కి సమీపంలో, బొండం పంచాయతీ పరిధిలో అరకులోయ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. గిరిజనులతో అవగాహన ర్యాలీ నిర్వహించి, గంజాయిని సాగు చేయబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసులు పాల్గొన్నారు. – అరకులోయ 1970 కి ముందు నుంచే గంజాయి సాగు! ఏజేన్సీలో 1970కి ముందు నుంచే గంజాయి సాగు ఉంది. అయితే అప్పట్లో ఇది రెండు మూడు మండలాలకే పరిమితమై ఉండేది. మొట్టమొదటి సారిగా 1970లో సీలేరు పోలీసు స్టేషన్ పరిధిలో 4 బ్యాగుల గంజాయిని పట్టుకున్నారు. 2002 నాటికి నాణ్యత చూసి నేరుగా కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా 2014 తర్వాత గంజాయి సాగు, రవాణా బాగా పెరిగిపోయింది. ఇందుకు కారణం అప్పటి అధికార పార్టీ టీడీపీ నేతల హస్తం ఉండటమేననేది బహిరంగ రహస్యం. గతంలో గంజాయి సాగు చేసేవాళ్లం గతంలో నీరు పారే గెడ్డెల వెంట గంజాయి సాగు చేసేవాళ్లం. ఇప్పుడు వేరే పంటలు వేసుకుంటున్నాం. అధికారులు వచ్చి గంజాయి సాగు వద్దని, కేసుల్లో ఇరుక్కోవద్దని చెప్పారు. వేరే పంటలు వేసుకునేందుకు సాయం చేస్తున్నారు. అందుకే గంజాయి సాగుకు దూరంగా ఉంటున్నాం. – కొర్ర కేశవరావు, గొద్దిపుట్టు గ్రామం, విశాఖ జిల్లా మాకు ఊర్లోనే పని దొరుకుతోంది రెండేళ్ల క్రితం వరకు గంజాయి సాగు చేసేవాడిని. ఇప్పుడు ఆ పని చేయడం లేదు. ఊర్లోనే పనులు దొరుకుతున్నందున్న ఆ పనులు చేసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి మాకు పనికి ఇబ్బంది లేదు. మా ఊర్లో కూడా గంజాయి సాగు తగ్గిపోయింది. – కిల్లో వంశీ, కొదువలస, లక్ష్మీపేట పంచాయతీ, విశాఖపట్నం జిల్లా సరిహద్దుల్లో పటిష్ట చర్యలు రెండేళ్లలో దాడులు పెరగడం వల్లే కేసులు పెరిగాయి. 2017లో విశాఖపట్నం రేంజ్లో కేవలం 244 దాడులు, 2018లో 174 దాడులు మాత్రమే నిర్వహించాం. 2019లో 247, 2020లో 315, ఈ ఏడాది ఇప్పటి వరకూ 465 దాడులు చేసి కేసులు నమోదు చేశాం. 2017 కాలంలో 883 మంది గంజాయి రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేయగా, 2021లో ఇప్పటి వరకూ 1003 మందిని అదుపులోకి తీసుకున్నాం. తద్వారా రవాణాను చాలా వరకూ అరికట్టగలిగాం. ప్రతి ప్రాంతంలో పటిష్ట నిఘా అమలు చేస్తూ.. సరిహద్దులు దాటకుండా గట్టి చర్యలు తీసుకున్నాం – రంగారావు, విశాఖ రేంజ్ డీఐజీ -
వరద లో చిక్కుకొన్న జీప్
-
అడవి 'బిడ్డ'లకు ఆయుష్షు
సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకప్పుడు నవజాత శిశు మరణాలు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే ఇటీవల కాలంలో వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఎస్ఎన్సీయూ(స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్)లు నిర్వహణలోకి వచ్చాకే మరణాలు నియంత్రణలోకి వచ్చాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరలో ఆస్పత్రి ఉండటమంటేనే కష్టం. పీహెచ్సీ ఉన్నా అక్కడ చిన్న పిల్లలకు వైద్యం ఉండేది కాదు. ఇదంతా గతం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎస్ఎన్సీయూలు గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని నవజాత శిశువుల ప్రాణానికి రక్షణగా నిలుస్తున్నాయి. సీతంపేట, రంపచోడవరం, పాడేరు, శ్రీశైలం తదితర కొండ ప్రాంతాల్లోని చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే.. 24 గంటల వైద్యంతో ఇవి అండగా నిలుస్తున్నాయి. లక్ష మంది చిన్నారులకు ఔట్ పేషెంట్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో ఐదేసి పడకలతో 23 ఎస్‌ఎన్‌సీయూలున్నాయి. ఇవి 2018, ఆగస్ట్‌లో ఏర్పాటుకాగా, బాగా నిర్వహణలోకి వచ్చింది మాత్రం 2019 జూన్ తర్వాతే. ఇప్పటి వరకూ ఈ కేంద్రాల్లో లక్ష మంది శిశువుల దాకా ఔట్ పేషెంట్ సేవలు పొందారు. శిక్షణ పొందిన నర్సులతో పాటు పీడియాట్రిక్ వైద్యులు, ఐసీయూ పడకలుండటంతో మెరుగైన వైద్యం లభిస్తోంది. చింతూరు ఏజెన్సీలోని కూనవరం ఎస్‌ఎన్‌సీయూలో అత్యధికంగా 10,806 మంది శిశువులకు ఔట్ పేషెంట్ సేవలందగా, మంచంగిపుట్టు ఎస్‌ఎన్‌సీయూలో 8,619 మందికి వైద్య సేవలందాయి. త్వరలోనే మరో 10 కేంద్రాలను ఒక్కొక్కటి 10 పడకలతో ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణకు ఇప్పటికే టెండర్లనూ పిలిచారు. స్పెషాలిటీ సేవలు.. ఎస్‌ఎన్‌సీయూలో అత్యాధునిక రేడియంట్ వార్మర్‌లుంటాయి. వీటితో పాటు ఫొటోథెరపీ యూనిట్లూ ఉంటాయి. శ్వాస సంబంధిత వ్యాధుల నియంత్రణకు సీ–పాప్ యంత్రం ఉంటుంది. ఐదుగురు శిక్షణ పొందిన నర్సులు షిఫ్ట్‌ల వారీగా ఉంటారు. డాక్టర్లు 9 గంటల పాటు కేంద్రంలో ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడు అవసరమొచ్చినా ఫోన్ చేయగానే వచ్చేస్తారు. ఎంత ఖరీదైన మందులైనా ఎస్ఎన్సీయూల్లో శిశువులకు ఉచితంగా ఇస్తారు. ఒక్కో సెంటర్లో ఐదు పడకలుంటే వాటిలో ఒకటి ప్రత్యేక సెప్సిస్ (ఇన్ఫెక్షన్లు సోకని) బెడ్ ఉంటుంది. ఈ విధమైన కార్యాచరణతో శిశు మరణాల నియంత్రణకు కుటుంబ సంక్షేమ శాఖ కృషిచేస్తోంది. శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం ఎస్ఎన్సీయూల వల్ల శిశు మరణాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ కోసం ఏర్పాటు చేస్తున్న పీడియాట్రిక్ వార్డులను కూడా కోవిడ్ తగ్గాక నవజాత శిశువుల వైద్యానికి ఉపయోగిస్తాం. దీనివల్ల పుట్టిన ప్రతి శిశువునూ కాపాడుకునే అవకాశం ఉంటుంది. – కాటమనేని భాస్కర్, కమిషనర్ కుటుంబ సంక్షేమశాఖ -
కాలినడకన అటవీ గ్రామానికి..
గూడూరు: మహబూబాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన గూడూరు మండలంలోని అటవీ గ్రామం దొరవారి తిమ్మాపురానికి సరైన దారిలేదు. 20 కుటుంబాల్లోని 80 మంది గిరిజను లు పోడు వ్యవసాయం చేస్తుంటారు. రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం బుధవారం కొత్తగూడ పర్యటనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి వచ్చింది. దీంతో ఆమె స్పందించి ఊరి సమస్యలపై నివేదిక అందజేయాలని కలెక్టర్ గౌతమ్‌ను ఆదేశించారు. ఆయన అక్కడికక్కడే తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఇతర అధికారులతో సమావేశమై గ్రామ సమస్యల గురించి ప్రశ్నించగా.. తామంతా కొత్తగా వచ్చినందున అవగాహన లేదని చెప్పారు. దీంతో గురువారం అందరూ గ్రామానికి వెళ్లాలని ఆదేశించా రు. ఈ మేరకు ఉదయమే తహసీల్దార్ శైలజ, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ ప్రసాదరావు ఊట్ల మీదుగా 6 కి.మీ. వాహనాలపై వెళ్లారు. అక్కడి నుంచి సుమారు కాలినడకన 8 కి.మీ. వెళ్తూ మార్గమధ్యలో వాగు దాటి ముందుకుసాగారు. దొరవారి తిమ్మాపురానికి చేరుకుని గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చదవండి: ఐదు రోజుల పెళ్లి, అక్కడ వరుడు తాళి కట్టడు! -
శభాష్ మెడికోస్
-
ఐదు రోజుల పెళ్లి, అక్కడ వరుడు తాళి కట్టడు!
బుట్టాయగూడెం: బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి తల్లి ఒడిలో.. గిరి శిఖర ప్రాంతాల్లో నివసించే కొండరెడ్ల గిరిజనుల జీవనం.. వారు పాటించే సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. వారి వివాహ తంతు సైతం ప్రత్యేకమే. కొండరెడ్ల వివాహ సమయంలో కుటుంబ పెద్దలే పురోహితులుగా వ్యవహరిస్తారు. వీరి పెళ్లిళ్లకు పిలుపులు ఉండవు. పిలవలేదు కదా అని వివాహాలకు ఎవరూ హాజరు కాకుండా ఉండరు. కుటుంబ సమేతంగా అందరూ హాజరవుతారు. పెళ్లి పనుల్లో గ్రామస్తులంతా విధిగా పాల్గొంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 1.25 లక్షల మంది గిరిజనులు ఉండగా.. వీరిలో సుమారు 10 వేల మంది కొండరెడ్డి తెగకు చెందిన వారు. కొండరెడ్డి గిరిజనుల్లో అత్యధికులు బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ఎత్తైన కొండల నడుమ గిరి శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తున్నారు. కొన్ని పద్ధతులు మారినా ఆచారం ప్రకారమే.. కొండరెడ్డి గ్రామాల్లో పెళ్లి విషయంలో 1980 తరువాత కొన్ని పద్ధతులు మారినా.. పూర్వ ఆచారాలనే కొనసాగిస్తున్నారు. 1980వ సంవత్సరానికి ముందు ఏ యువకుడైనా యువతిని ఇష్టపడితే.. ఆ విషయం పెద్దలకు చెప్పేవారు. తర్వాత ఆ అమ్మాయి బయటకు వెళ్లినప్పుడు ఆమె చెయ్యి పట్టుకుని ఆ యువతిని తాను పెళ్లాడుతున్నానని బహిరంగంగా చెప్పేవాడు. అతడిని పెళ్లాడటం ఆ యువతికి ఇష్టం లేకపోయినా ఊరి పెద్దలు వారిద్దరికీ వివాహం చేసేవారు. మొదట ఊరి పెద్దలు వరుడు, వధువు తలపై నీళ్లు పోస్తే.. ఆ తరువాత వరుడు ఆ యువతి మెడలో నల్లపూసల దండ వేసేవాడు. ఇలా పెళ్లి తంతు పూర్తయ్యేది. పెళ్లికి పెద్దలే పురోహితులు. మంత్రాలు ఉండవు. వారిద్దరూ సుఖంగా ఎలా కాపురం చేసుకోవాలో నాలుగు మాటలు చెప్పటం ద్వారా తంతు ముగిసేది. ఇటీవల ఈ పద్ధతుల్లో కొంత మార్పు వచ్చింది. ఏ యువకుడైనా యువతిని ఇష్టపడితే ఇంట్లో పెద్దలకు చెప్పాలి. వారు, ఊరి పెద్దలు కలిసి యువతి, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధం ఖాయం చేస్తారు. ఈ మధ్య కాలంలో తాళి కట్టే సంప్రదాయం కూడా మొదలైంది. పతాణాలు తప్పనిసరి పెళ్లి అనంతరం వధూవరులకు పతాణాల కార్యక్రమం జరుగుతుంది. ఆ సమయంలో పెళ్లి కూతురు వైపు వారు వధువును గ్రామంలో ఎవరికీ తెలియకుండా దాచేస్తారు. వరుడు, అతని తరఫు వారు వధువును వెతికి పట్టుకోవాలి. ఆ తరువాత వధూవరులు ఇంటికి వచ్చే సమయంలో గ్రామస్తులంతా వారిద్దరి కాళ్లకు అడ్డుపడుతూ బురదలో దొర్లుతారు. ఆ సమయంలో కింద దొర్లే వారికి పెళ్లికొడుకు డబ్బులు ఇవ్వడం ఆనవాయితీ. ఐదు రోజుల పాటు విందు తప్పనిసరి పెళ్లి చేసిన కుటుంబాలు తప్పనిసరిగా గ్రామస్తులందరికీ ఐదు రోజులపాటు సహపంక్తి భోజనాలు పెట్టవలసిందే. అందులో మాంసం తప్పనిసరి. మొదటి మూడు రోజులపాటు బంధువులు, చుట్టుపక్కల వారు భోజనాలకు వస్తారు. మూడో రోజున శోభనం జరిపిస్తారు. నాలుగో రోజున ఊరందరికీ భోజనాలు (ఊర బంతి) పెట్టి తీరాలి. దీనికి గ్రామంలో ఎవరైనా హాజరుకాకపోతే.. పెళ్లి వారింటి నుంచే వారికి భోజనం పంపిస్తారు. ఐదో రోజున మాత్రం పెళ్లి జరిగిన రెండు కుటుంబాల వారు, బంధువులకు భోజనాలు పెడతారు. ఇలా ఐదు రోజుల పెళ్లి సందడిగా.. సంప్రదాయబద్ధంగా సాగిపోతుంది. మా పెళ్లికి పెద్దలే పురోహితులు మా తెగల్లో కుటుంబ పెద్దలే పురోహితులుగా వ్యవహరిస్తారు. మంత్రాలు ఉండవు. తాళి»ొట్టు ఉండదు. నా పెళ్లి అలాగే జరిగింది. నేను ఓ అమ్మాయిని ఇష్టపడ్డాను. అదే విషయాన్ని పెద్దలకు చెప్తే వారు అమ్మాయివైపు వారితో మాట్లాడి వివాహం చేశారు. మెడలో నల్లపూసల దండ వెయ్యడంతో నా పెళ్లి అయిపోయింది. – కెచ్చెల బుల్లిరెడ్డి, కొండరెడ్డి గిరిజనుడు, అలివేరు, బుట్టాయగూడెం మండలం పెద్దల మాటకు విలువిస్తాం పెళ్లి సమయంలో పెద్దల మాటకే విలువ ఇస్తాం. వారు చెప్పిందే వేదం. అదే ఆచారం. గ్రామ దేవతలు మా కుల దేవతలు. వారినే పూజిస్తాం. పంటలు చేతికి వచ్చే సమయంలో చేసే పండుగలో తప్పనిసరిగా గ్రామ దేవత పూజలు విధిగా చేస్తాం. – కెచ్చెల పద్మ, కొండరెడ్డి మహిళ, రేగులపాడు, బుట్టాయగూడెం మండలం -
త్వరలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పట్టణాలు, నగరాలకే పరిమితమైన ఇంజనీరింగ్ విద్య త్వరలో ఏజెన్సీ ప్రాంతంలోనే గిరిజనులకు అందుబాటులోకి రాబోతోంది. గిరిజనులు కూడా తమ ప్రాంతంలోనే మెరుగైన ఉన్నత విద్య అభ్యసించేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కాలేజీ భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే 105.32 ఎకరాల భూమిని, రూ.153 కోట్లను కేటాయించారు. వీలైనంత వేగంగా పనులు జరిగేలా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ గిరిజన కాలేజీని జేఎన్టీయూ కాకినాడకు అనుబంధం చేస్తూ ఇటీవలే రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. ఈ నెలలోనే మంత్రుల చేతుల మీదుగా ఈ కాలేజీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. భవన నిర్మాణాలకు ఇప్పటికే ప్లానింగ్ పూర్తి చేశామని జేఎన్టీయూకే రిజిస్ట్రార్ డాక్టర్ సత్యనారాయణ చెప్పారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి ఐదు బ్రాంచ్‌లలో తరగతులు ప్రారంభిస్తామని రిజిస్ట్రార్ సత్యనారాయణ పేర్కొన్నారు. -
భయంగుప్పిట్లో ఏజెన్సీ
సాక్షి, కుక్కునూరు: ఏజెన్సీ గ్రామాలు పులి భయంతో వణుకుతున్నాయి. సోమవారం కుక్కునూరు మండలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ అటవీప్రాంతం నందిపాడు సమీపంలో ఎద్దును చంపిన పులి మంగళవారం మండలంలోని ఇసుకపాడు గ్రామానికి చేరింది. ఈ గ్రామంలోని కంటిపల్లి నాగులు అనే గిరిజన రైతుకు చెందిన పొలం వద్ద ఉన్న పశువుల కొట్టంపై దాడి చేసి ఒక ఎద్దును చంపింది. అనంతరం ఆ ఎద్దును కిలోమీటరు దూరంలోని అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లింది. ఉదయాన్నే పశువుల కొట్టంలో ఉన్న పశువులు లేకపోవడాన్ని రైతు గమనించాడు. ఆ ప్రాంతంలో రక్తం, పులి పాదగుర్తులు ఉండటంతో ఆ ప్రాంతాన్ని గ్రామస్తులంతా గాలించి ఎద్దు కళేబరాన్ని కనుగొని పోలీసులకు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఎద్దుపై దాడి జరిగినట్లు నిర్ధారించారు. పాదముద్రలను సేకరించారు. అయితే దాడి చేసి జంతువు పులా లేక చిరుత పులా అన్నది నిర్ధారించాల్సి ఉందని అటవీశాఖాధికారులు తెలిపారు. ఈ విషయమై కుక్కునూరు రేంజర్ ఎం.ఏడుకొండలను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ ఘటనా స్థలం వద్ద పాదముద్రలు సేకరించి పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. బుధవారం నుంచి అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఏజెన్సీ గ్రామ ప్రజలు 15 రోజుల పాటు అటవీ ప్రాంతంలోకి వెళ్లరాదని, పశువులను అడవుల్లోకి వదిలిపెట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు. త్వరలోనే ఉన్నతాధికారులతో మాట్లాడి బోనులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అమ్మో పులి.. జంకుతున్న జనం
తెల్లవారకముందే నిద్ర లేచే పల్లె.. ఇప్పుడు సూరీడు నడినెత్తికొచ్చినా గడప దాటట్లేదు. పొద్దుగూకే వరకు పంట చేలల్లోనే గడిపే శ్రమజీవులు.. ఇప్పుడు పెందళాడే ఇంటికి చేరుకుంటున్నారు. పులి భయం పల్లెల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఇద్దరిని పొట్టన పెట్టుకుని.. రోజుకోచోట బయటపడుతున్న పులి జాడ అలజడి రేపుతోంది. ఏ క్షణంలో ఏ మూల నుంచి పంజా విసురుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. రైతులు, రైతుకూలీలు బయటకు అడుగుపెట్టలేని పరిస్థితుల్లో చేతికందిన పత్తి పంట ఇంటికి చేరనంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని అటవీ సమీప గ్రామాల్లో పులిదెబ్బకు ప్రజలదినచర్య, రోజువారీ కార్యకలాపాలు మారిపోయాయి. గుంపులుగా వెళ్లడం, పొలంలో పనిచేసే చోట డప్పు చప్పుళ్లు చేయడం, పులి బారిన పడకుండా ‘ముఖం మాస్కు’లు ధరించడం.. ఇంకా మరెన్నో జాగ్రత్తలతో బయట అడుగుపెడుతున్నారు. ఈ పరిస్థితులపై‘సాక్షి గ్రౌండ్ రిపోర్ట్’.. చేలల్లో పత్తి విచ్చుకున్నవేళ.. రైతుల్లో ఆనందం అలముకోవాలి. కానీ, వారిలో భయాందోళన నెలకొంది.. చేతికొచ్చిన పంట ఇంటికి చేరాలి. కానీ, చేలల్లోనే రైతుల కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. అడవిలో సంచరించాల్సిన పులి చేనుచెలకల్లో తిరుగుతోంది. కనబడినవారినల్లా పొట్టనపెట్టుకుంటోంది. కూలీలు వేకువజామునే బయలుదేరి ఉదయం ఆరుగంటలకల్లా పొద్దుతో పోటీపడి పత్తి చేలల్లో కనిపించేవారు. కానీ, పులి సంచారానికి భయపడి ఉదయం 10 గంటల తర్వాతే ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. చీకటి పడిందంటే.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని అటవీ సమీప ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పులి సంచరించిన ప్రాంతాల్లో ‘సాక్షి’ పర్యటించింది. అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు స్థానికులతో మాట్లాడింది. సమయం ఉదయం పది గంటలు.. ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామంలో దిగాం. ఇక్కడే నవంబర్ 11న పులి దాడి చేసి సిడాం విగ్నేష్(21)ను పొట్టనబెట్టుకుంది. గ్రామ శివారులో కూలీలు గుంపులు, గుంపులుగా దారిలో మాకు ఎదురొస్తూ కనిపించారు. ఇంకొందరి చేతుల్లో ఉన్న డప్పులు అదేపనిగా మోగుతున్నాయి. మరికొందరు ప్లాస్టిక్ డబ్బాలతో చప్పుళ్లు చేస్తున్నారు. అసలు విషయమేమిటో కనుక్కుందామని.. అక్కడే ఉన్న కనక సాంబయ్య అనే కూలీని పలకరించగా... ‘పత్తి ఏరడానికి చేన్లకు పోతున్నాం. కా>నీ, పులి ఏడ నుంచి వచ్చి మీదపడ్తదో తెల్వక హడలిపోతున్నాం. సిడాం విగ్నేష్‌ని పొట్టనబెట్టుకుంది. అందుకే పులిని బెదరగొట్టడానికి డప్పుచప్పుళ్లు చేసుకుంటూ పొలాలకు పోతున్నం. మామూలుగానైతే వేకువజామున పత్తిచేలకు పోతం ’అని భయాందోళనతో చెప్పాడు. అక్కడ వారితో కొద్దిసేపు ముచ్చటించి మరో ఊరికి వెళ్లగా ఒక వ్యక్తి ఓ కుక్కను వెంటబెట్టుకొని వెళ్తూ కనిపించాడు. మరిచోట కొందరు యువకులు చేను చుట్టూ కాపాలా కాస్తుండగా కూలీలు పత్తి తీస్తున్న దృశ్యాన్ని ‘సాక్షి’గమనించింది. మాస్క్‌తో మస్కా.. మిట్ట మధ్యాహ్నం.. సూరీడు నెత్తిమీదికొచ్చా డు. ఎండ చురుక్కుమంటోంది. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లికి ‘సాక్షి’ చేరుకుంది. నవంబర్ 29న ఈ ఊరుకు చెందిన పసుల నిర్మల పత్తి చేనులో ఉండగా పులి దాడి చేసి చంపేసింది. గ్రామానికి దూరంగా ఉన్న పత్తి చేనులో ఓ చోట గుమిగూడి పత్తి తీస్తున్న కూలీలు కనిపించా రు. కొందరి తలలకు వెనుకభాగంలో మాస్కులు కనిపించాయి. ఎందుకలా అని అడిగితే, ‘రెండుకాళ్ల జీవాల మీద పులి సాధారణంగా దాడి చేయదు. నాలుగు కాళ్ల జంతువుల మీదే ఎక్కువగా పంజా విసురుతుంది. అయితే, మేం చేలల్లో వంగి పనిచేస్తున్నప్పుడు నాలుగు కాళ్ల జంతువని భ్రమించి దాడిచేసే ప్రమాదం ఉంది. తలలకు వెనుక వైపు మాస్కు ధరించి కనిపిస్తే.. అక్కడున్నది మనిషి అనుకొని దాడి చేయదు’ అని ఓ కూలీ చెప్పాడు. పులి.. కెమెరా ‘కంట’బడేనా? మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కళ్లంపల్లిలో పత్తి చేనులో ప్లాస్టిక్ డబ్బాతో శబ్దం చేస్తూ ఓ యువకుడు కనిపించాడు. పులి జాడలను కనిపెట్టేందుకు కాటేపల్లి, ముక్కిడిగూడెం, బుడుగుఒర్రె, సుంపుటం, పాసినీళ్ల రోడ్ల వెంట ఏర్పాటు చేసిన కెమెరాలు కనిపించాయి. తాంసి(కె) శివా రు ప్రాంతాల్లో ఐదుచోట్ల అమర్చిన కెమెరాలను కనిపించాయి. ఈ పల్లె పెన్‌గంగా నదికి ఆనుకు ని ఉంటుంది. నదికి అవ తలి వైపు మహారాష్ట్ర భూ భాగం. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం(టైగర్ జోన్) నుంచి తరచూ ఇటువైపు పులులు వస్తున్నాయని గ్రామస్తులు భయంభయంగా చెప్పారు. నెలకు ఒకటి రెండుసార్లు పులి కన్పిస్తోందని చెప్పారు. మంచె మీద మొనగాడు మామూలుగానైతే కూలీలు కాలినడకన పొలం పనులకు వెళ్తుంటారు. కానీ, కొత్తగూడం జిల్లా గుండాల మండలం జగ్గయ్యగూడెంలో మాత్రం అందరూ కట్టకట్టుకుని ఒకే ట్రాక్టర్లో పొలం పనులకు వెళ్తుండటాన్ని ’సాక్షి‘గమనించింది. పాల్వంచ మండలం పాండురంగాపురంలో రైతులు ఊరేగింపు తీస్తున్నట్టుగా వెళ్తున్నారు. అందరి చేతుల్లోనూ కర్రలు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్లగా దారిలో పెంపుడు కుక్కను వెంటపెట్టుకుని పొలం వద్దకు వెళ్తున్న ఓ రైతు కనిపించాడు. మరోచోట చేనులో మంచె మీద ఒక యువకుడు చురుకుగా అటు, ఇటు చూస్తున్నాడు. పులి రాకను గమనించి కూలీలను అప్రమత్తం చేయడానికి ఇలా మంచె మీద ఉన్నట్టు ఆ యువకుడు ‘సాక్షి’కి వివరించాడు. గుండెలో దడను కళ్లల్లో కనిపించకుండా ఎంతో దైర్యంగా ఉన్నాడతడు. అదిగో పులి.. పోదాం ఇంటికి సాయంత్రం నాలుగు గంటల వేళ.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తాంసి(కె) శివారులో కొందరు కూలీలు పత్తి చేలను వీడి అరుపులు, కేకలు వేస్తూ ఇళ్లకు వెళ్తుండటం ‘సాక్షి’కి గమనించింది. ప్రజ్వల్ అనే యుకుడిని పలకరించగా.. ‘ఒకసారి మా పశువుల మందపై పులిదాడి చేసి ఆవును చంపేసింది. అప్పటి నుంచి మందను అటవీలోకి తీసుకువెళ్లడం లేదు. పంట చేల సమీపంలోకే పశువులను మేత కోసం తీసుకెళ్తున్నాం’అని చెప్పాడు. చెబుతున్నప్పుడు అతడి కళ్లల్లో భయం స్పష్టంగా కనిపించింది. సీతాయిగూడెంలో తాజాగా.. చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతాయిగూడెం సమీపంలో గురువారం మిషన్ భగీ రథ వాటర్ ట్యాంక్ వద్ద పులి పాదముద్రలు కనిపించాయి. పులి అన్నపురెడ్డిపల్లి వెళ్లే రోడ్డు వరకు వచ్చి, తిరిగి అటవీ ప్రాంతం లోకి వెళ్లినట్లు భావిస్తున్నారు. పులుల సంఖ్య అధికం కావడం వల్లే... ఒక్కసారిగా పులుల సంచారంతో కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం అభయారణ్యాన్ని టైగర్ రిజర్వ్‌గా చేస్తారంటూ ఆయా జిల్లాల్లో చర్చలు జరుగుతున్నాయి. సహజంగా పులి దట్టమైన అడవి దాటి బయటకు రాదు. పులుల సంఖ్య పెరగడంతోనే అవి తమకు అనువైన ప్రాంతా న్ని వెతుక్కునేందుకు కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి, మహారాష్ట్రలో ని చంద్రపూర్, తాడోబా, ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌ల నుంచి మం చిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల మీదుగా ఈ పులులు కిన్నెరసాని అభయారణ్యానికి వచ్చినట్లు తెలుస్తోంది. భయం గుప్పిట ఉన్న ప్రాంతాలివే ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసి(కె), గొల్లఘాట్, పిప్పల్‌కోఠి గ్రామాలు ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ, లోహా, కర్జి, రాంపూర్ పరిసర ప్రాంతాలు.. పెంచికల్పేట్ మండలం కొండపల్లి, గుండెపల్లి, అగర్‌గూడ, మెరెగూడ, లోడుపల్లి, కొండపల్లి, దరోగపల్లి, బొంబాయిగూడ పరిసర ప్రాంతాలు.. బెజ్జూర్ మండలం చిన్నసిద్దాపూర్, పెద్దసిద్దాపూర్, పాపన్నపేట, ఏటిగూడ, గబ్బాయి గ్రామాలు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముక్కిడిగూడెం, కల్లెంపల్లి, సుంపుటం, రాజారాం, నాగారం, కాటేపల్లి, నీల్వాయి సమీప అటవీ ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో అటవీ ప్రాంతాలకు ఆనుకుని వందల గ్రామాలు ఉన్నాయి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కిన్నెరసాని అభయారణ్యంలో ప్రవేశించాక మొదట గుండాల, ఆళ్లపల్లి, అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ, మణుగూరు, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి మండలాల్లో పులి సంచారం అధికంగా ఉంది. రోజుకో చోట పులి సంచారం వెలుగుచూస్తోంది. -
అదుపులో 'డెంగీ'!
సాక్షి, అమరావతి: తొలకరి జల్లులు మొదలయ్యాయంటే డెంగీ జ్వరాలు కోలుకోలేని దెబ్బతీస్తాయి. గత ఏడాది వరకు ఎక్కడ చూసినా డెంగీ బాధితులే. అలాంటిది ఈ ఏడాది డెంగీ జ్వరం కాస్త అదుపులోకొచ్చింది. గతంతో పోలిస్తే జ్వరాల తీవ్రత చాలా తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఈ ఏడాది ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదు కాలేదని తేలింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం కేసులు కూడా నమోదు కాలేదు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఏడాది డెంగీ తీవ్రత బాగా తక్కువగా ఉంది. నవంబర్ 30 వరకూ ఇదే తరహాలో నియంత్రణ చేయగలిగితే ఈ ఏడాది డెంగీ బారి నుంచి క్షేమంగా బయటపడే అవకాశాలున్నాయి. నవంబర్ చివరి వరకు కార్యాచరణ ► నవంబర్ నెలాఖరు వరకు డెంగీ నియంత్రణకు కార్యాచరణ చేపట్టారు. ప్రతి గ్రామాన్ని మున్సిపాలిటీ, ఆరోగ్య, పంచాయతీ రాజ్ శాఖలు జల్లెడ పడుతున్నాయి. ► కాలనీల్లో, ఇంటి ముందర గుంటలు లేకుండా చూడటం, నీరు నిల్వ లేకుండా చేయడం, ప్రతి ప్రాంతంలో ఎంఎండీసీ (మొబైల్ మలేరియా, డెంగీ సెంటర్స్)ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ► డెంగీ లార్వా (గుడ్డు) దశలోనే విచ్ఛిన్నం చేసేందుకు పాత టైర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, టైర్లు వంటి వాటిని పరిసరాల్లో లేకుండా చేస్తున్నారు. ► అన్ని ఆస్పత్రుల్లో డెంగీని నిర్ధారించే ఎలీశా టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచారు. డెంగీ వలన వచ్చే ప్రమాదంపై కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. నియంత్రణకు మరిన్ని చర్యలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు బాగా తగ్గాయి. నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా లార్వా దశలోనే దీన్ని నియంత్రించడం వల్లే కేసులు తగ్గాయి. రానున్న నెల రోజులు కీలకం. ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చేసుకుంటే డెంగీ దోమలు వృద్ధి అయ్యే అవకాశం తక్కువ. – డా.అరుణకుమారి, ప్రజారోగ్య శాఖ సంచాలకులు -
రెండవ సారి ఏజెన్సీ ప్రాంతాల్లో తెలంగాణ డీజీపీ పర్యటన
-
విశాఖ మన్యంలో హైఅలర్ట్
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా విశాఖ మన్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే క్రమంలో దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో యాక్షన్ టీమ్‌లు కూడా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో మన్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో అరకు, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు మండల కేంద్రాల్లో ప్రతి ఇంటిని సోదా చేశారు. కొన్ని ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. వారం రోజులపాటు కొనసాగే ఈ వారోత్సవాల్లో కొంత అలజడి చేసుకునే అవకాశాలు ఉన్నట్టు మన్యం ప్రజలు భయపడుతున్నారు. (పచ్చని అడవికి నెత్తుటి మరకలు) -
తెలంగాణ ఏజెన్సీలో అలజడి
-
సంస్మ‘రణం’
సాక్షి, హైదరాబాద్ : రెండువారాలుగా మన్నెంలో అలజడి మొదలైంది. మావోల రాక, పోలీసుల వేటతో ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ పేరుతో కొత్త దళం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు రాష్ట్రంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా గ్రీన్ టైగర్స్, కోబ్రా తదితర పేర్లతో కొన్ని దళాలు ఉండేవి. నక్సలైట్ల సానుభూతి పరులు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలు లక్ష్యంగా పనిచేసేవి. ఇపుడు దాదాపు రెండు దశాబ్దాల తరువాత రాష్ట్రంలో తిరిగి అలాంటి పరిస్థితులే పునరావృతమవుతుండటం గమనార్హం. దీంతో ఏజెన్సీలోని గిరిజనులు, ఆదివాసీలు భయాందోళనలో గడుపుతున్నారు. నిత్యం మావోయిస్టులు, వారి వెనక కూంబింగ్ దళాల బూట్ల చప్పుళ్లతో భయభయంగా గడుపుతున్నారు. అప్పుడలా..ఇప్పుడిలా..! దండకారణ్యంలో జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను మావోయిస్టులు ఈసారి మునుపెన్నడూ లేని స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న సమాచారం నిఘా వర్గాల వద్ద ఉంది. ఇందుకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల మావో అగ్రనేతలు, మిలీషియా సభ్యులు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి తాజాగా విడుదలైన లేఖ కలకలం రేపుతోంది. దండకారణ్య ప్రత్యేక మండల కమిటీ కార్యదర్శి రామన్న అనారోగ్యకారణాలతో గతేడాది మరణించారు. ఈయన స్థానాన్ని ఇంతవరకు భర్తీ చేయలేదు. ఈసారి వార్షికోత్సవాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న నేపథ్యంలో రామన్న స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఎన్కౌంటర్లలో మరణించిన మావోయిస్టు సభ్యుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేశారు. అందుకే కీలకమైన ఈ సమావేశాలను విజయవంతం చేసేందుకు కావాల్సిన నిధులు, కొత్తవారి రిక్రూట్మెంట్ కోసం ఈసారి తెలంగాణలోకి మావోయిస్టులు అడుగుపెట్టారు. లాక్డౌన్ కాలంలో పోలీసులు కోవిడ్ విధుల్లో ఉండగా.. మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు జనారణ్యంలోకి వచ్చారు. అందులో భాగంగానే బెదరింపులు, వసూళ్లు, రిక్రూట్మెంట్ యత్నాలు చాపకింద నీరులా చేసుకుంటూ పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆటలు సాగనివ్వం.. తెలంగాణలో పదేళ్లుగా పెద్దగా మావోయిస్టుల కదలికలు లేవు. అలాంటిది లాక్డౌన్ కాలంలో పుంజుకోవడంపై హోంశాఖ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఆసిఫాబాద్‌లో భాస్కర్ దళం సంచారంతో అప్రమత్తమైన పోలీసులు వారి కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి అరాచకాలు ఇక్కడ సాగనిచ్చేది లేదని ఇప్పటికే పలుమార్లు డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండటం మంగ్లి, ములుగు జిల్లాల అటవీ ప్రాంతాల్లో స్వయంగా ఆయనే కూంబింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మరో కారణం కూడా చెప్పుకోవాలి. పదేళ్ల నుంచి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో మావోల కార్యకలాపాలు లేవు. అదే సమయంలో స్పెషల్‌పార్టీ, గ్రేహౌండ్స్ పోలీసుల్లో కొత్తగా చేరిన అధికారుల్లో మెజారిటీ మంది సుశిక్షితులేగానీ... వారికి ఎన్కౌంటర్లు ఎదుర్కొన్న అనుభవం లేదు. అందుకే, వారిలో ఉత్సాహం నింపి, మావోయిస్టులను తరిమికొట్టాలన్న వ్యూహంతో పోలీసు బాసు పర్యటనలు చేస్తున్నారని సమాచారం. -
ఏజెన్సీలో మంత్రి ఆళ్ల నాని పర్యటన
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి ఏజెన్సీ విలీన మండలాల్లో, మారుమూల గిరిజన ప్రాంతాల్లో సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటించారు. చింతూరు మండలం సీతనపల్లి గ్రామంలో కాళ్లవాపు వ్యాధితో రెండు నెలల్లో 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సోమవారం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. దీంతో మంత్రి ఆళ్ల నాని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. మరణించిన గిరిజన కుటుంబాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. (నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎంపీ సవాల్) ఈ సందర్భంగా మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ... ‘చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిని 60 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్ది, డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. విలీన మండలాల్లో ప్రతి గిరిజన గ్రామానికి ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. కాళ్ల వాపు వ్యాధితో మరణించిన ప్రతి కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. మండంలోని సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తా’మని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి ఆళ్ల నానితో పాటు కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ధనలక్ష్మి, జక్కంపూడి రాజా, డీసీసీబీ చైర్మన్ అనంతబాబు పాల్గొన్నారు. (ఆ సమస్య పునరావృతం కాకూడదు: సీఎం జగన్) -
కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్: మంగళవారం విశాఖ ఏజెన్సీలో విషాదం చోటు చేసుకుంది. హఠాత్తుగా కొండచరియలు విరిగి పడటంతో అక్కడ రైలు పట్టాలపై చేస్తున్న తొమ్మిది మంది కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని దగ్గరలో ఉన్న ఎస్‌కోట ఆసుపత్రికి తరలిస్తుండగా ముగ్గురు మార్గమధ్యంలోనే మృతి చెందారు. కెకె లైన్లో టైడా- చిముడు పల్లి రైలు మార్గంలో మంగళవారం అనుకోకుండా కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ సమయంలో అక్కడ తొమ్మిది మంది కార్మికులు పట్టాలపై పనిచేస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో వారంతా తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంలోనే ముగ్గురు మరణించగా మిగిలిన వారికి ఎస్‌కోట ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న గూడ్స్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కార్మికుల మరణంతో విశాఖ ఏజెన్సీలో విషాద ఛాయలు అలముకున్నాయి. (వలస కార్మికులను పంపిస్తాం : కానీ...!) -
ఏజెన్సీ ప్రాంతాల్లో శిశు సంరక్షణ భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నవజాత శిశువుల కోసం ఏర్పాటుచేసిన ఎస్ఎన్సీయూ (స్పెషల్ న్యూకేర్ బార్న్ యూనిట్స్) సేవలు అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటి విధానాన్ని తాము కూడా అనుసరిస్తామని ఇథియోపియా బృందం ప్రశంసించింది. ఈ దేశానికి చెందిన వైద్య బృందం సోమ, మంగళవారాల్లో ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయగూడెంతో పాటు పలు నవజాత శిశువుల వైద్య కేంద్రాలను సందర్శించింది. ఇథియోపియాలోని వొలైటా సొడు యూనివర్సిటీకి చెందిన ముగ్గురు వైద్యుల బృందం ఈ కేంద్రాల సందర్శనకు వచ్చింది. ఇందులో డా.మెస్ఫిన్ బిబిసొ, డా.ఇయోబ్ ఎషెటు, డా.లూకాస్ డింగాటో ఉన్నారు. శిశు సంరక్షణ కేంద్రాల్లో అందుతున్న సేవలను ఈ బృందం పరిశీలించి ఇక్కడ అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడింది. ఈ కేంద్రాల్లో సాంకేతిక పరిజ్ఞానం, వైద్యులు అనుసరిస్తున్న వైద్య విధానాలను అడిగి తెలుసుకున్నారు. తమ దేశంలో కూడా ఈ విధానాన్ని అనుసరిస్తామని, సాంకేతిక సహకారాన్ని అందించాలని కోరారు. నవజాత శిశువుల కోసం ఇక్కడ 24 గంటలూ సేవలు అందుతుండటం గొప్ప విషయమని.. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి సేవలు అందుబాటులో ఉండటం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని వారు చెప్పారు. ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానాలను తమ దేశంలోనూ అమలుచేసేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామని బృందం తెలిపింది. కాగా, జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో రాష్ట్రంలోని ఏడు ఏజెన్సీ ప్రాంతాల్లో 21 ఎస్ఎన్సీయూలు నడుస్తున్నాయి. 2018 మేలో ప్రారంభమైన వీటిల్లో 2019 డిసెంబర్ 20 నాటికి 7,500 నవజాత శిశువులకు వైద్యమందినట్లు ఇథియోపియా బృందానికి అధికారులు వివరించారు. ట్రాకింగ్ విధానంతో మెరుగైన సేవలు గర్భిణిని ఆస్పత్రికి తీసుకురావడం, సకాలంలో వైద్య పరీక్షలు చేయించడం, సుఖ ప్రసవానికి ప్రోత్సహించడం వంటి విషయాల్లో ట్రాకింగ్ విధానాన్ని అమలుచేస్తున్నాం. ప్రసవానికి గర్భిణి పుట్టింటికి వెళ్లినా అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో సమన్వయం చేసుకుని ప్రసవానికి అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నాం. కేఆర్ పురం ఏజెన్సీ పరిధిలో మరో ఎస్ఎన్సీయూ పెడితే బాగుంటుంది. – ఆర్వీ సూర్యనారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ, కేఆర్ పురం -
గిరిజనులకు మాతృభాషలో పాఠాలు
సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలోనే పాఠాలు బోధించడం సత్ఫలితాలను ఇస్తోంది. స్కూళ్లలో హాజరు శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 8 జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 920 పాఠశాలల్లో సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ‘మాతృభాష ఆధారిత బహు భాషా విద్య’ (మదర్ టంగ్ బేస్డ్ మల్టీ లింగ్విల్ ఎడ్యుకేషన్–ఎంటీఎంఎల్‌ఈ) పేరుతో ఇది అమలవుతోంది. ఒకటి, రెండు, మూడు తరగతుల్లోని దాదాపు 18,975 మంది గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలో పాఠాలు బోధిస్తున్నారు. సవర, కొండ, ఆదివాసీ, కోయ, సుగాలి పిల్లలు సొంత భాషలోనే పాఠాలు చదువుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సవర భాషలో.. విజయనగరం జిల్లాలో కొండ, కువి, ఆదివాసీ ఒడియా భాషల్లో.. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కోయభాషలో.. కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో సుగాలి, లంబాడి భాషల్లో బోధన జరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల స్కూళ్ల గిరిజన విద్యార్థులకు ఆయా భాషల్లో రూపొందించిన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ టీచర్లకు స్థానిక భాషల్లో బోధనకు సహకరించేందుకు మల్టీ లింగ్విల్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా(ఎంఎల్ఈ) ఆయా భాషలు వచ్చిన వారిని పాఠశాలల్లో నియమించారు. విద్యావంతులైన స్థానిక గిరిజన యువతనే ఎంఎల్‌ఈలుగా ఎంపిక చేశారు. ఎంఎల్‌ఈలుగా ఉపాధ్యాయ శిక్షణ పొంది, ఆయా గిరిజన భాషలు మాట్లాడగలిగే 1,027 మందిని ప్రభుత్వం నియమించింది. వీరికి నెలకు రూ.5 వేల వరకు వేతనం ఇస్తున్నారు. గిరిజన భాషల్లో బోధనకు ప్రభుత్వం రూ.42 లక్షలతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తోంది. సంప్రదాయాలు, పొడుపు కథలు గిరిజన విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాల్లో ఆయా గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే అంశాలను, పొడుపు కథలను చేర్చారు. విద్యార్థులు వాటిని ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. గిరిజన భాషల్లోనే బాలసాహిత్యాన్ని అభివృద్ధి పర్చడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకు ఒక్కో భాషకు రూ.13.33 లక్షల చొప్పున రూ.80 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆరు గిరిజన భాషల్లో పొడుపు కథలు, బాలల కథలు, బొమ్మలతో కూడిన నిఘంటువులను, పదకోశాలను రూపొందిస్తున్నారు. సత్ఫలితాలు వస్తున్నాయి ‘‘ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషల్లో బోధన సాగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నాం. ఇందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. అందులో భాగంగానే ఆయా భాషల్లో బాలసాహిత్యం, ఇతర అంశాలతో కూడిన పుస్తకాలు సిద్ధం చేస్తున్నాం’’ – వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ గిరిజన విద్యార్థుల్లో కొత్త వెలుగులు ‘‘గిరిజన విద్యార్థులకు వారి సొంత భాషలోనే పాఠాలు బోధించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. గతంలో వారికి ఆయా పాఠాలు అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు సులభంగా నేర్చుకుంటున్నారు. బిడ్డలకు తల్లిపాలు ఎంత ప్రయోజనకరమో తల్లిభాషతో బోధన కూడా అంతే ఉపయోగకరం. ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థుల్లో మార్పు గమనిస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం గిరిజన విద్యార్థుల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆకాంక్షిస్తున్నాం’’ – పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు, విజయనగరం జిల్లా మా పిల్లలకు ఎంతో మేలు ‘‘మా పిల్లలు గతంలో బడులకు వెళ్లినా పాఠాలు అర్థంకాక ఏమీ నేర్చుకోలేకపోయేవారు. తరగతులకు వెళ్లకుండా ఆటల్లో మునిగిపోయేవారు. ఇప్పుడు మా సవర భాషలోనే పాఠాలు చెబుతుండడంతో ఉత్సాహంగా స్కూల్‌కు వెళ్తున్నారు. మా సొంత భాషలోనే పాఠాలు చెబుతుండడంతో మా పిల్లలకు ఎంతో మేలు జరుగుతోంది’’ – పత్తిక సుశీల, గుమ్మలక్ష్మీపురం, విజయనగరం జిల్లా -
విశాఖలో భారీ ఎన్కౌంటర్
సాక్షి, విశాఖపట్నం: ఆదివారం ఉదయం 11 గంటలు దాటింది... ఎత్తైన కొండలు.. దట్టమైన అటవీ ప్రాంతం...15 నుంచి 20 మంది మావోయిస్టులు కిందకి దిగుతున్నారు. ఇదే క్రమంలో కూంబింగ్ పార్టీలు కొండ ఎక్కేందుకు సిద్ధమవుతున్నాయి. అంతే ఒక్కసారిగా కాల్పులమోతతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ హఠాత్పరిణామానికి మిగతా మావోయిస్టులు చెల్లాచెదురైపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నట్లు సమాచారం. ఈ ఘటన గుమ్మిరేవుల పంచాయతీ అన్నవరం, మాదిగమల్లు అటవీ ప్రాంతం బొడ్డమామిడి కొండల్లో జరిగింది. మృతుల్లో గాలికొండ ఏరియా కార్యదర్శి హరి, మావోయిస్టు చలపతి భార్య అరుణ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏవోబీలో యుద్ధమేఘాలు పాడేరు: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాలు ఏ క్షణంలో రాజుకుంటాయో తెలియని నిప్పు రవ్వల్లా ఉన్నాయి. ఓవైపు మావోయిస్టుల సంచారం కొనసాగుతూ ఉంటే.. మరోవైపు వారి ఏరివేతే లక్ష్యంగా కేంద్ర పోలీసు బలగాల గాలింపు ఉధృతంగా సాగుతూ ఉండడంతో ఏవోబీలో గ్రామాలు, అటవీ ప్రాంతాలు లోలోన రగులుతున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా మన్యంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పోలీసు పార్టీలు అధికంగా సంచరిస్తున్నప్పటికీ మావోయిస్టులు తమ కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఏవోబీలోని మూడు చోట్ల మావోయిస్టులు గిరిజనులతో భారీ బహిరంగ సభలు నిర్వహించి, పోలీసు బలగాలకు సవాల్ విసిరారు. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలు, స్థానిక పోలీసు దళాలు కూంబింగ్లను మరింత మమ్మురం చేశాయి. పోలీసు పార్టీలు, మావోయిస్టుల సంచారంతో సరిహద్దు గ్రామాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పచ్చని అడవులు ఇరువర్గాల బూట్ల చప్పుళ్లతో ప్రతిధ్వనిస్తున్నాయి. అడవిలో పోలీసులు, మావోయిస్టులు ఎదురుపడితే తుపాకుల మోత మోగుతోంది. తాజాగా ఆదివారం జి.కే.వీధి మండలం, గుమ్మిరేవుల పంచాయతీలోని మాదిమల్లు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల ఘటనలో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. ఈ ప్రాంతంతో పాటు, ఏవోబీ వ్యాప్తంగా పోలీసుల కూంబింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముందస్తుగానే పోలీసుల వ్యూహం మావోయిస్టు పార్టీ ఆవిర్భావ ఉత్సవాలతో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ, ఒడిశా,ఆంధ్రా రాష్ట్రాల పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఏవోబీ వ్యాప్తంగా విస్తృత కూంబింగ్ ఆపరేషన్లలో కేంద్ర పోలీసు బలగాలు నిమగ్నమయ్యాయి. విశాఖ ఏజెన్సీలోని కొయ్యూరు, జి,కే.వీధి, చింతపల్లి, జి.మాడుగుల, అన్నవరం, ముంచంగిపుట్టు, పెదబయలు పోలీసు స్టేషన్లతో పాటు, అవుట్ పోస్టులు ఉన్న రాళ్లగెడ్డ, నుర్మతి, రూడకోట ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పోలీసు పార్టీలను రంగంలోకి దింపారు. ప్రత్యేక పోలీసు పార్టీలు వారం రోజుల నుంచి ఏవోబీ వ్యాప్తంగా కూంబింగ్‌ను విస్తృతం చేశాయి. నిర్బంధం బేఖాతరు ఏవోబీలో కాస్త పుంజుకున్న మావోయిస్టు పార్టీ, పోలీసు నిర్బంధాన్ని ఖాతరు చేయడం లేదు. ఇటీవల కాలంలో తమ కార్యక్రమాలను మరింత విస్తృతపరిచింది. ఏవోబీలోని మావోయిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర నాయకత్వం యువకులను రంగంలోకి దింపినట్లు సమాచారం. మావోయిస్టు ఉద్యమాన్ని విస్తృతం చేస్తున్న యువరక్తం ఆధ్వర్యంలో ఇటీవల ఏవోబీ వ్యాప్తంగా ప్రజలతో కీలక సమావేశాలు నిర్వహించినట్టు పోలీసుశాఖ దృష్టికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మావోయిస్టు పార్టీలో కీలకమైన క్యాడర్ గత మూడు నెలల కాలంలో పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసింది. మావోయిస్టుల వరుస లొంగుబాట్లతో పోలీసు యంత్రాంగం సంతోషపడింది. అయితే బలమైన క్యాడర్ ఏవోబీలో లేనప్పటికి స్థానిక క్యాడర్‌తో మావోయిస్టు పార్టీ బలం పుంజుకుంటుందన్న సమాచారంతో పోలీసుశాఖ భారీ కూంబింగ్‌లకు వ్యూహత్మంగా వ్యహరిస్తోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. మృతుల్ని గుర్తించాల్సి ఉంది జీకేవీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిని గుర్తించాల్సి ఉంది. మృతదేహాలను కొండ కిందకు తీసుకువచ్చాక వారిని గుర్తించి అప్పుడు వారు ఎవరనేది ప్రకటిస్తాం. – సతీష్‌కుమార్, ఏఎస్పీ, చింతపల్లి -
కన్నీరు పెట్టుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే!
కాకినాడ సిటీ: గిరిజనులు ఏం పాపం చేశారు. ప్రతి తల్లీ ప్రసవ వేదన అనుభవిస్తోంది. ఓవైపు పురిటి నొప్పులు పడుతూనే పుట్టే బిడ్డ సజీవంగా పుడతాడా లేదా అనే ఆందోళనతోనే ఉంటోంది. కొద్దిపాటి అనారోగ్యంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ వందల సంఖ్యలో చిన్నారులు మృతి చెందారు. దీనికి తోడు కాళ్ల వాపు కబళిస్తోంది. అసలు ఏజెన్సీలో ఏం జరుగుతోంది? నివారణా చర్యలేమిటనే కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. శుక్రవారం కాకినాడలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ పనితీరును జిల్లా ఇన్చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గర్భిణి తనకు పుట్టిన బిడ్డ బతుకుతుందో లేదోనన్న ఆందోళనతో ఉన్నారని, వీరికి సరైన వైద్యం అందకపోవడంతో పుట్టిన బిడ్డలు చనిపోవడం, ఒక్కొక్కసారి తల్లీ, బిడ్డా కూడా మరణిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అసలు పుట్టిన బిడ్డలు ఎందుకు చనిపోతున్నారో అర్థం కావడంలేదని, పౌష్టికాహార లోపమా లేక, మరే ఇతర సమస్యా అన్నది ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. రానున్న రెండేళ్లలో అందరికీ ఆరోగ్యం: ఆళ్ల నాని రానున్న రెండేళ్లలో వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలు చేసి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఉద్ఘాటించారు. శుక్రవారం కాకినాడలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్యాధికారులు, వైద్యులతో నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ పనితీరును ఆయన సమీక్షించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేదలందరికీ నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు వీలుగా బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. నవరత్న పథకాల్లో భాగంగా ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తామన్నారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబాన్నీ కవర్ చేసేందుకు వీలుగా హెల్త్ కార్డులు అందిస్తున్నామన్నారు. ఈ పథకాన్ని జనవరి 1, 2020న పశ్చిమగోదావరి జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తామని మంత్రి నాని తెలిపారు. అన్ని ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకుని సీఎం జగన్మోహన్రెడ్డితో సమీక్షించిన అనంతరం పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేస్తామని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తామని, ప్రస్తుతం 1070 వ్యాధులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తుండగా మరో వెయ్యి వ్యాధులను యీ పరిధిలోకి తీసుకువస్తామని అన్నారు. ప్రతి మండలానికి 108, 104 వాహనాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సెప్టెంబర్ నాటికి 108 వాహనాలు 676 , 104 వాహనాలు 773 కొనుగోలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు. ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ జిల్లాలో డయాలసిస్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని, ఇప్పటికే 32 మంది డయాలసిస్ రోగులు ఉన్నారని, ఏరియా ఆస్పత్రుల్లో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ, సహకారశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం దారుణంగా ఉంటోందని, ఈ ప్రాంతంలో కాళ్లవాపు వ్యాధి వచ్చి అనేక మంచి మరణించారని అన్నారు. ఇప్పటికీ ఆ వ్యాధి ఎందుకు వస్తుందో వైద్యులు తెలుసుకోలేదన్నారు. జిల్లాలో 24 ్ఠ7 గా పీహెచ్‌సీలు నడుస్తున్నా, 7 గంటలు కూడా అవి పనిచేయడం లేదని అన్నారు. కరపలో నర్సింగ్ ట్రైనింగ్ సెంటర్‌ను తీసుకువచ్చి భవనం నిర్మిస్తే గత ప్రభుత్వంలో ఆ భవనాన్ని బీసీ హాస్టల్‌కు ఇచ్చారని అన్నారు. జిల్లాలో లెప్రసీ మళ్లీ విజృంభిస్తున్నట్లు సాంకేతికాలు అందుతున్నాయని, దీనిపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సాంఘిక సంక్షేమశాఖామంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ కోనసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంతంలో వైద్యాన్ని మెరుగుపర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌రెడ్డి మాట్లాడుతూ నవరత్నాల పథకంలో పేదల ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండలాల్లో ఉన్న ఆస్పత్రులను 2020 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఆధునికీకరించి మౌలికసదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతీ పీహెచ్సీలో డయాగ్నోస్టిక్ సెంటర్‌తో పాటు చిన్న, చిన్న ఆరోగ్య పరీక్షలు అన్ని అక్కడే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందేవారి సంఖ్యను 60 శాతానికి పెంచేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ తుని ఆస్పత్రిలో 20 మంది సిబ్బంది అవసరం ఉన్నారని, అనస్థీషియా వైద్యుని, గైనకాలజిస్ట్‌లను నియమించాలన్నారు. ఎంపీ గీత మాట్లాడుతూ తీరప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అలాగే జిల్లాలో చాపకింద నీరులా హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని దీనికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ రావులపాలెంలో ట్రామాకేర్, డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, దీనికి కావల్సిన స్థలాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలా గైనకాలజిస్ట్‌లను, సివిల్ సర్జన్లను, ఆర్థోపెడిక్ వైద్యులను నియమించాలన్నారు. జగ్గంపేట ఏజెన్సీ ముఖద్వారంగా ఉండడం వల్ల బైపాస్ రోడ్డులో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, జగ్గంపేటలో ట్రామాకేర్ సెంటర్, 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఏలేశ్వరం ఆస్పత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చాలని, ప్రత్తిపాడు పీహెచ్‌సీని వంద పడకల ఆస్పత్రిగా మార్చాలన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ పిఠాపురం ఆస్పత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలన్నారు. ఆసుపత్రిలో వైద్యులను డిప్యూటేషన్ ఇవ్వకుండా చూడాలని, అవసరమైన చోట్ల వైద్యులను, నర్సులను, ఆస్పత్రి సిబ్బందిని నియమించాలన్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఆస్పత్రిని 500 పడకల ఆస్పత్రిగా మార్చాలని అన్నారు. ట్రామాకేర్ సెంటర్ ఉన్నా సిబ్బంది లేరన్నారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ నగరంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాంతంలో గ్యాస్ లీకైన సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతుంటే వారిని కాకినాడ తరలించాల్సి వస్తోందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కాకినాడ జీజీహెచ్‌లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల పోస్టులు భర్తీ చేయాలన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మాట్లాడుతూ తమ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉందని, ఈ ప్రాంతంలో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కిడ్నీ రోగులకు అందించినట్టే పెరాలసిస్ రోగులకు కూడా రూ.10వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు తమ ప్రాంతాల్లో ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని, వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆయుష్ కమిషనర్ రమ్యశ్రీ, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, డీఎంఅండ్‌హెచ్‌వో బి.సత్యసుశీల, జేసీ–2 జి రాజకుమారి, మేయర్ సుంకర పావని పాల్గొన్నారు. -
ఏజెన్సీలో నిఘా..
సాక్షి, కొత్తగూడెం: సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో యుద్ధవాతారణం నెలకొంది. పోడు భూముల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ మావోయిస్టులు క్షేత్రస్థాయిలో ప్రచార పర్వానికి దిగారు. దీంతో ప్రతిగా పోలీసు బలగాలు గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల్లో భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని భద్రాచలం, పినపాక, ఇల్లెందు, ములుగు నియోజకవర్గాల్లో వేలాది మంది సాయుధ బలగాలతో జల్లెడ పడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆదివాసీలు తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఆ భూముల నుంచి వారిని వెళ్లగొట్టేందుకు కోర్టులు, చట్టాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని మావోయిస్టులు కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు గత మూడు రోజులుగా భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని పూజారిగూడెం, లెనిన్‌కాలనీ, గోగుబాక, ఆర్.కొత్తగూడెం, చింతగుప్ప, దుమ్ముగూడెం మండలం బండిరేవు, సీతానగరం ప్రాంతాల్లో చర్ల–శబరి ఏరియా కమిటీ పేరుతో ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో వెంకటాపురం–వాజేడు కమిటీ పేరుతో పోస్టర్లు, కరపత్రాలు వేశారు. ఆదివాసీలను అడవుల నుంచి పంపించేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీనికి తోడు కొన్ని రోజుల క్రితం మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ అలియాస్ లక్ష్మ ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని సరిహద్దు అటవీ ప్రాంతంలో సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఉద్యమాల ద్వారానే తెలంగాణలో పునర్ వైభవం సాధించాలని ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం గిరిజనుల పోడు భూముల అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 40 మంది సభ్యుల ప్రచారం..! గత 20 రోజులుగా భద్రాద్రి జిల్లాలోని కరకగూడెం, పినపాక, మణుగూరు, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో హరిభూషణ్, దామోదర్, లచ్చన్న, రీనా, రాజిరెడ్డి అలియాస్ వెంకన్న, భద్రు, మంగు, మంగ్లు ఆధ్వర్యంలో సుమారు 40 మంది మావోయిస్టులు పోడు భూముల అంశంపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులకు సమాచారం అందజేశాయి. దీంతో ఈ మండలాల్లో ఎస్పీ సునీల్‌దత్ ఆధ్వర్యంలో సుమారు 3 వేల మంది సాయుధ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అణువణువూ జల్లెడ పడుతున్నారు. గత వారం రోజులుగా ఏజెన్సీ పరిధిలోని మారుమూల గ్రామాల్లో గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ బలగాలు శోధిస్తున్నాయి. మరోవైపు ఆయా మారుమూల ప్రాంతాల్లో సైతం మావోయిస్టు నాయకుల ఫొటోలతో కూడిన పోస్టర్లు వేస్తున్నారు. వారి గురించి ఖచ్చితమైన సమాచారం ఇస్తే రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. సమాచారం ఇచ్చినవారి వివరాలు రహస్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. గత కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కార్యకలాపాలు పెంచుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తుండగా, తాజాగా పోడు భూముల అంశంపై ఉద్యమాలు చేసేందుకు సిద్ధమవుతుండడంతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కూంబింగ్ ద్వారా భద్రతా బలగాలు ఏజెన్సీ జల్లెడ పడుతుండడంతో గిరిజన పల్లెల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. -
లయ తప్పిన బీఎస్ఎన్ఎల్
పాడేరు: బీఎస్ఎన్ఎల్ సేవలు ఏజెన్సీలో లయ తప్పాయి. పాడేరు ప్రాంతంలో ఆరు రోజులుగా ఈ సేవలకు అంతరాయం ఏర్పడింది. మొబైల్ ఫోన్లు మూగనోము పట్టాయి. ఈ ప్రాంతంలోని 8 మండలాలకు బీఎస్ఎన్ఎల్ సేవలే ఆధారం. మొబైల్ ఫోన్లు మోగకపోవడంతో వినియోగదారులు విసుగెత్తిపోతున్నారు. ఫోన్ కాల్స్ వెళ్లకపోగా తప్పుడు సంకేతాలతో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఫోన్ చేస్తే కాల్ ఫార్వడ్ చేయబడుతోంది అనే సంకేతం వినిపిస్తోంది. ఈ నెల 5వ తేదీ రాత్రి నుంచి 6వ తేదీ సాయంత్రం 7గంటల వరకు సేవలు పూర్తిగా స్తంభించాయి. నెట్ కూడా పనిచేయలేదు. అయితే అంతకు ముందురోజే పాడేరు ఏజెన్సీలో జియో సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఆరోజు నుంచి బీఎస్ఎన్ఎల్ సేవలు మొరాయిస్తుండడంతో వినియోగదారుల్లో పలు సందేహలు వ్యక్తమవుతున్నాయి. జియో మొబైల్ నుంచి ఫోన్‌చేస్తే బీఎస్ఎన్ఎల్ లైన్ దొరుకుతోందని వినియోగదారులు చెబుతున్నారు.ఈ నెల 12నుంచి పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు తక్షణం స్పందించి బీఎస్ఎన్ఎల్ సేవలకు అంతరాయం లేకుండా మెరుగపరచాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. -
ఓటు మరింత దూరం
పెదబయలు (అరకు): ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయడమంటేనే కష్టం. అటువంటిది మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలంటూ అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 14 పోలింగ్ కేంద్రాలను రోడ్డుకు ఆనుకుని ఉన్న వాటిలో విలీనంతో ఓటేయడానికి ఆదివాసీలకు అవస్థలు తప్పవన్న వాదన వ్యక్తమవుతోంది. అధికారుల చర్యలపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓటర్లను ఇబ్బంది పెట్టడమేనని మారుమూల ప్రాంత ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదబయలు మండలం ఇంజరిలోని 71, 72 నంబర్ల పోలింగ్ బూత్‌లను ఇదే పంచాయతీలోని చీకుపసనలో విలీనం చేశారు. అలాగే గిన్నెలకోట పంచాయతీకి చెందిన 58, 59 పోలింగ్ కేంద్రాలను 25 కిలో మీటర్లు దూరంలో ఉన్న 55వ నంబరు పోలింగ్ కేంద్రం కొరవంగిలో కలిపేశారు. జామిగుడ, గుంజివాడ 56, 57 పోలింగ్ బూత్‌ల పరిధిలోని వారు 20 కిలో మీటర్లు దూరం నడిచి వెళ్లి ముంచంగిపుట్టు మండలం మద్దిలబందలో ఇప్పుడు ఓటేయాలి. ఇంజరి పోలింగ్ బూత్ పరిధిలో 1101 మంది ఓటర్లు, గిన్నెలకోట 58, 59 పోలింగ్ బూత్‌ల్లో వరుసగా 805, 626 మంది ఓటర్లు, 56, 57 కేంద్రాల్లో 981, 1033 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఐదు పోలింగ్ కేంద్రాల్లో 4552 మంది 20 నుంచి 30 కిలో మీటర్లు నడిచి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఇంత దూరం వచ్చి ఓటు వేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంచంగిపుట్టు మండలం బుంగాపుట్టు, కుసంపుట్టు పోలింగ్ కేంద్రాలను బాబుసాల పంచాయతీ మచ్చపురానికి, భూసిపుట్టు, సరియాపల్లి, కెందుగుడ కేంద్రాలను మద్దుల బందలో విలీనంతో ఆయా ప్రాంతాల ఓటర్లు కూడ 25 నుంచి 30 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. ఎన్నడూ లేని విధంగా పోలింగ్ కేంద్రాల విలీనం దారుణమని, వృద్ధులు, పెన్షన్‌దారులు ఓటు వినియోగం కష్టమవుతుందని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగానికి ఎన్నికల అధికారులు కనీసం వాహన సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
మాతృత్వం కోసం గిరి మహిళ.. అమ్మా అనే పిలుపు వినకుండానే
మాతృత్వం కోసం ఆ తల్లి ఎంతో పరితపించింది. నాలుగు సార్లు గర్భం దాల్చగా రెండు సార్లు అబార్షన్ అయింది. మూడో సారి బిడ్డపుట్టి చనిపోయింది. నాల్గో సారి గర్భం దాల్చడంతో ఎన్నో కలలుకంది. తనకు పుట్టబోయే బిడ్డకోసం ఎన్నో ఊహించుకుంది. బోసి నవ్వులు చూడాలని పరితపించింది. తన చేయి పట్టుకుని బిడ్డ బుడిబుడి అడుగులు వేస్తుంటే అడుగులో అడుగు కలిపి మళ్లీ నడకనేర్చుకోవాలని ఆశపడింది. అమ్మా అనే మాటను చెవులారా వినాలని ఎదురుచూసింది . అయితే ఆమె ఆశను పురిటిలోనే తుంచేసింది మృత్యుదేవత. అమ్మా అనే పిలుపునకు నోచుకోకుండానే ఆ ఆభాగ్యురాలు మృత్యువాత పడింది. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ కురుకూరుకు చెందిన ఓ బాలింత ఆడ బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. మరిది పెళ్లి సమయంలో ఈ విధంగా జరగడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. కొయ్యూరు(పాడేరు): మండలంలో బూదరాళ్ల పంచాయతీ కునుకూరుకులో ఏడో నెలలో ఆడబిడ్డను ప్రసవించిన జర్త పద్మ(29) అనే బాలింత ప్రసవ సమయంలో కన్నుమూయడంతో గ్రామంలో విషాదం అలముకుంది. ఇది వరకు మూడుసార్లు గర్భం దాల్చిన ఆమెకు రెండుసార్లు అబార్షన్ అయింది. మరోసారి బిడ్డ పుట్టి మరణించింది.నాల్గో ప్రసవంలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చి మరణించింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి మృతురాలి మరిదికి వివాహం జరిగింది. దీంతో తీరిక లేకుండా పెళ్లి పనులు చేసింది. ఆదివారం తెల్ల్లవారు జాము వరకు పనిచేసింది. తరువాత ఆమెకు తీవ్రమైన తలనొప్పి వచ్చింది. అనంతరం ప్రసవ నొప్పులు రావడంతో ఇంటి వెనుకకు వెళ్లింది. అక్కడ ఎవరి సహాయం లేకుండానే ఆడబిడ్డను ప్రసవించింది. ఆమెకు ప్రసవం జరిగిన విషయం ఎవరికీ తెలియలేదు. చివరకు బిడ్డ ఏడుపు గమనించిన ఆమె నాన్నమ్మ వెళ్లి చూడగా తల్లీబిడ్డ పక్క పన్కనే ఉన్నారు. బంధువులంతా ఆమెను బిడ్డతో సహా ఇంటిలోకి తీసుకువచ్చారు. అలా తీసుకువచ్చిన కొద్దిసేపటికే పద్మ మరణించింది.బిడ్డ క్షేమంగా ఉంది. పద్మ మరణించడంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. అంతవరకూ ఎంతో హుషారుగా తిరిగిన ఆమె అంతలోనే మృత్యువాత పడడాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు తట్టుకోలేకపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పద్మ మృతి సమాచారం తెలుసుకున్న వైద్యాధికారి శ్యామల సోమవారం కునుకూరు వెళ్లారు. వివరాలు తెలుసుకున్నారు. నెలలు నిండక ముందు ప్రసవం జరగడం, మేనరికపు వివాహం వల్లే ఈ విధంగా జరిగిందని ఆమె తెలిపారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మన్యంలో మాతా శిశు మరణాలు ఆగకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. -
చొరవ చూపండి సమానత్వం వస్తుంది
మహిళలు తమ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకుని లబ్ధి పొందడానికి మాత్రమే పరిమితం కాకుండా, అభివృద్ధిని సాధించడానికీ చొరవ చూపాలని దివ్య దేవరాజన్ పిలుపునిస్తున్నారు. ఏడాది క్రితం బదిలీపై ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన కలెక్టర్ దివ్య దేవరాజన్ మహిళా సాధికారత, మహిళల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఆదివాసీ – లంబాడాల మధ్య నెలకొన్న వివాదాలను సద్దు మణిగించేందుకు ప్రభుత్వం దివ్యను ఆదిలాబాద్‌కు బదిలీ చేసింది. వివాదాలను తొలగించడమే కాదు, ఇరువర్గాలకున్న సమస్యలను దగ్గరుండి తెలుసుకొని పరిష్కరించడంలో ఆమె సఫలమయ్యారు. దివ్యకు ఆదివాసీలు మాట్లాడే భాష అర్థమైనా, తిరిగి వారికి అదే భాషలో విషయాన్ని వివరించేందుకు మొదట్లో కాస్త ఇబ్బంది పడినమాట వాస్తవమే. అయితే ఆ క్రమంలో గోండు భాష నేర్చుకున్నారు. అలా ఆదివాసీ మహిళలతో వారి భాషలోనే మాట్లాడి అంతర్గతంగా ఉన్న సమస్యలను తెలుసుకోవడంతో మహిళలకున్న సమస్యలను పరిష్కరించేందుకు మార్గం సులువైంది. మరోవైపు ఈ యేడాది ఏజెన్సీ ఏరియాలో మహిళా సంఘాల ద్వారా కలెక్టర్ పత్తి కొనుగోళ్లు జరిపించారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలంటే భయాలను పక్కనపెట్టి చొరవగా ముందడుగు వేస్తేనే ఫలితం ఉంటుందని, గౌరవం దక్కుతుందని కలెక్టర్ దివ్య అంటున్నారు. ‘‘మహిళల మనసు సున్నితం. కరుణ, జాలి ఎక్కువగా ఉంటాయి. అలాగే మహిళల్లో బిడియం, భయం కూడా ఉంటాయి. వాటిని పక్కనపెట్టి మనోబలంతో ముందడుగు వేయాలి. అప్పుడే సమాజంలో మహిళలకు సమాన గుర్తింపు లభిస్తుంది. మహిళలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు జీడీపీ (స్థూలజాతీయోత్పత్తి) కూడా పెరుగుతుంది. అలా దేశాభివృద్ధి కూడా జరుగుతుంది. తమ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. జిల్లాలో సగం మంది మహిళలు సర్పంచులుగా ఉన్నారు. భర్త సహకారంతోనో, బంధువుల ద్వారానో కాకుండా స్వయంగా వారే విధులను నిర్వహించాలి. మహిళా సర్పంచులు ఉన్న అనేక గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం చూశాను’’ అని దివ్య దేవరాజన్ అన్నారు. – సాక్షి, ఆదిలాబాద్ -
అరణ్య రోదన
శ్రీకాకుళం, సీతంపేట: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అన్ని జీవరాసులకు జీవనాధారం జీవగెడ్డలే. సాధారణంగా ఏజెన్సీలో గెడ్డలు మే నెల వరకు అడుగంటవు. ఏదో ఒక గెడ్డలో నీరు ఉంటుంది. ఈ ఏడాది మార్చి వచ్చే సరికే గెడ్డలు అడుగంటుతున్నాయి. మనుషులతోపాటు మూగజీవాలకు రోదన తప్పదు. ఏజెన్సీలో కొండమేకలు, జింకలు, కుందేళ్లు, అడవి పందులు వంటివి కొండల్లో ఉంటాయి. గెడ్డల వద్దకు వచ్చి నీరు తాగుతాయి. ఒకేసారి అన్ని గెడ్డలూ.. ఏజెన్సీలో 465 గిరిజన గ్రామాలున్నాయి. గెడ్డలకు ఆనుకుని ఉన్నవి దాదాపు 500 వరకు ఉంటా యి. వీటిలో 300లకు పైగా అడుగంటినట్టు గిరిజనుల అంచనా. ఒకేసారి ఇన్ని గెడ్డలు అడుగంటడం చూస్తే ఈ ఏడాది నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. ఇప్పటికే దోనుబా యి, తంకిడి, సీతంపేట, గొయిది, కుడ్డపల్లి, పొల్ల, కుశిమి, శంబాం, కోడిశ తదితర ప్రాంతా ల్లో ఉన్న గెడ్డలు ఇంచుమించూ అడుగంటిపోయాయి. కొండపై ఊటబావులు 150 నుంచి 200ల వరకు ఉంటాయి. వీటిలో సగం వరకు అడుగంటినట్టు సమాచారం. కొన్ని గ్రామాల గిరి జనులు తాగునీటికి ఊటబావులు, గెడ్డలపై ఆధారపడేవారు. ఇప్పుడు భూగర్భజలాలు పూర్తిగా అడుగంటడంతో ఏంచేయాలో తెలియని పరిస్థితి. ఏనుగుల పరిస్థితి ఏంటి? ఏజెన్సీ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్ధకమే. రోజుకు ఒక్కొ ఏనుగు 200 నుంచి 600 లీటర్ల వరకు నీటిని తీసుకుంటుంది. ఏనుగులన్ని కొండ దిగువ ప్రాంతా ల్లో ఉన్న ఊట గెడ్డల వద్ద వాటికి కావాల్సిన నీటిని తీసుకుని సంచరించేవి. గెడ్డలన్నీ అడుగంటడంతో ఇవి నీటిని వెతుక్కుంటూ గ్రామాల వైపు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో ఇలాగే గ్రామాల వైపు వచ్చేవి. ఇప్పుడు కూడా గ్రామాలకు సమీపంలోకి వచ్చేస్తే ఏం చేయాలోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రతరమవుతున్న సమస్య... ఏజెన్సీలో 50కు పైగా గ్రామాల్లో ఇప్పటికే నీటి ఎద్దడి నెలకొంది. చాలా గ్రామాల్లో నీటి కోసం గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే రాత్రంతా నీటికోసం జాగారం చేస్తున్నట్టు గిరిజనులు చెబుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో గతంలో ఏర్పాటు చేసిన గ్రావిటేషన్ ఫ్లోలు ఎండిపోయాయి. బోర్లులో నీరు ఎంతకొట్టినా పడడం లేదు. బావుల కోసం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ వారం జరిగే గిరిజన దర్బార్‌కు సైతం నీటి సమస్య ఉందని వినతులు వస్తూనే ఉన్నాయి. ప్రతి ఏటా సమస్య తప్పడం లేదు ప్రతి ఏటా నీటి సమస్య తప్పడం లేదు. గెడ్డలు అడుగంటడంతో మూగ జీవాలకు అవస్థలు తప్పడం లేదు. కొన్ని గ్రామాల్లో జీవగెడ్డలు అడుగంటడంతో మహిళలు కిలోమీటర్ల దూరం నీటి కోసం నడిచివెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి ఎద్దడి తీర్చాలి.– ఎస్.మహేష్, అక్కన్నగూడ గ్రామాల్లో నీటి సమస్య ఉంది ముందస్తు చర్యలు లేకపోవడంతో గిరిజన గ్రామాల్లో నీటి సమస్య ఉంది. గెడ్డలు, వాగులన్నీ ఎండిపోయాయి. పలు గ్రామా ల గిరిజనులు అధికారులకు వినతులు కూడా ఇవ్వడం జరిగింది.– బి.అప్పారావు, గిరిజన సంఘం నాయకుడు -
ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా?
సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పుడు ఎక్కడ చూసినా ఔట్‌సోర్సింగే. ఆఖరికి హైకోర్టులో కూడా. శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయకుండా ఇలా ప్రతీ శాఖలోనూ ఔట్సోర్సింగ్ పద్ధతిని అనుసరిస్తూ పోతుంటే సగం పాలన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. అవసరాన్ని బట్టి ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను నియమించుకోవడం బాగానే ఉంది. మరి ఆ ఉద్యోగుల బాగోగులు, చట్ట నిబంధనల ప్రకారం వారికి దక్కాల్సిన ప్రయోజనాల గురించి మాట్లాడని ఔట్సోర్సింగ్ ఏజెన్సీల సంగతేంటి.. వారిని ప్రశ్నించే వారెవరు.. ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బు తీసుకుని, ఔట్‌సోర్స్ ఉద్యోగులకు చాలీచాలని జీతాలిస్తుంటే నిలదీసే వారెవరు.. గొప్పగొప్ప కార్మిక నేతలంతా కన్నుమూశారు. ఔట్‌సోర్స్ ఉద్యోగుల విషయంలో ఏజెన్సీల వ్యవహారశైలిని చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా.. అన్న అనుమానం కలుగుతోంది..’ హైకోర్టు ధర్మాసనం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు, వారికి చట్ట ప్రకారం దక్కాల్సిన ప్రయోజనాలు తదితర విషయాలపై పూర్తిస్థాయిలో వాదనలు వినాల్సిన అవసరముందని హైకోర్టు అభిప్రాయపడింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఓ విధానాన్ని రూపొందించాల్సిన అవసరముందంది. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రప్రభుత్వ వైఖరి కూడా తెలుసుకుంటామని, అందువల్ల ఈ వ్యాజ్యంలో కేంద్ర కార్మికశాఖను కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏమేమి చేయొచ్చో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఏజెన్సీలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని, కనీస వేతనాలు, సెలవులు ఇవ్వడం లేదని, అలాగే పెద్ద ఎత్తున ఆ ఏజెన్సీలు ఆదాయ పన్ను ఎగవేస్తున్నాయని, వీటన్నింటిపై విచారణ జరిపి, తప్పు చేసిన ఏజెన్సీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర టూరిజం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఇది చాలా విస్తృతమైన అంశమని తెలిపింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేదంది. ఏజెన్సీలు చేతులెత్తేస్తే పరిస్థితేంటి? ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఏజెన్సీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా.. అన్న సందేహం కలుగుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఔట్సోర్సింగ్ ఇప్పుడు ఓ పెద్ద వ్యాపారంగా మారిపోయిందని, ఉద్యోగులను సరఫరా చేసినందుకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని, అందులో నామమాత్రపు మొత్తాన్ని ఆ ఉద్యోగులకు ఇస్తున్నారంది. ఆస్పత్రి, ప్రభుత్వ కార్యాలయం, హైకోర్టు.. ఇలా ఎక్కడ చూసినా ఔట్సోర్సింగ్ ఉద్యోగులే కనిపిస్తున్నారంది. వీరికి జీతాలు చెల్లించకుండా ఏజెన్సీలు చేతులెత్తేస్తే పరిస్థితి ఏమిటనే దానిపై ఎవ్వరూ ఆలోచన చేయడం లేదని తెలిపింది. ఇటువంటి వాటి గురించి ప్రశ్నించేందుకు గతంలో గొప్ప గొప్ప కార్మిక నేతలు ఉండేవారని, వారిలో ఇప్పుడు ఎవరూలేరంది. నిచ్చెనలుండవు.. కోరలు చాచిన పాములే ‘వైకుంఠపాళి ఆటలోలాగా ఈ ఔట్‌సోర్స్ ఉద్యోగులు నిచ్చెన ఎక్కాలని చూస్తుంటారు. కానీ ఏజెన్సీలు పాముల్లా మింగేసేందుకు కాచుకుని ఉంటాయి. వాస్తవానికి ఈ ఔట్‌సోర్స్ వైకుంఠపాళిలో నిచ్చెనలు అసలే ఉండవు. కోరలు చాచిన పాములు తప్ప..’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఔట్‌సోర్స్ ఉద్యోగుల విషయంలో జరుగుతున్న చట్ట ఉల్లంఘనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, వీరి సంక్షేమం కోసం ఓ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిస్థాయి వాదనలు వినాల్సిన అవసరం ఉందన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వాయిదా వేసింది. -
ఏజెన్సీలో మలేరియా జ్వరాల విజృంభణ
పశ్చిమగోదావరి ,బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా జ్వరాలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ఒక్క వారంలోనే అంతర్వేదిగూడెం, దొరమామిడి పీహెచ్‌సీల పరిధిలో 3 మలేరియా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మలేరియా ప్రబరిల్లకుండా గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులు చేపట్టారు. మండలంలోని కోర్సవారిగూడేనికి చెందిన గురుగుంట్ల మమత అనే 5 ఏళ్ల బాలిక మలేరియా బారిన పడింది. ఈమెకు అంతర్వేదిగూడెం పీహెచ్సీ పరిధిలో చికిత్స అందిస్తున్నారు. కెచ్చెల శ్రీనివాసరావు, పాయం నీరజ కూడా మలేరియా బారిన పడుతూ వైద్యం పొందుతున్నారు. కాగా బుధవారం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ పెద్దిరాజు ఆధ్వర్యంలో కోర్సవారిగూడెం, బూరుగువాడ, అంతర్వేదిగూడెం హాస్టల్లో స్ప్రేయింగ్ పనులు చేశారు. డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మురళీధర్ గ్రామాల్లో పర్యటించి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగించారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్ప్రేయింగ్ పనులు చేయించుకోవాలని కోరారు. -
ఏవోబీలో పోలీసులు అప్రమత్తం
విశాఖపట్నం ,సీలేరు (పాడేరు): విశాఖ ఏజెన్సీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఛత్తీస్గడ్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన స్థలంలో ఆయుధాలు, సామగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు 60 మంది వరకు సమావేశమై శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ఎన్కౌంటర్ జరగడంతో పదుల సంఖ్యలో మావోయిస్టులు తప్పించుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గడ్ నుంచి ఆంధ్రా, ఒడిశా బోర్డర్లోకి మావోయిస్టులు వచ్చి ఉంటారన్న సమాచారం మేరకు భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఒడిశా సరిహద్దులో బీఎస్ఎఫ్, ఎస్‌వోజీ, సీఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తుండగా, ఆంధ్రాలో స్పెషల్ పార్టీ బలగాలతో ముమ్మర గాలింపులు జరుపుతున్నారు. ఈ మధ్యకాలంలో ఒడిశా రాంగుడ ఎన్కౌంటర్ తరువాత మళ్లీ ఛత్తీస్‌గడ్‌లో ఎన్కౌంటర్ జరగడంతో ఇరు రాష్ట్రాల పోలీసు అధికారుల సీరియస్‌గా తీసుకున్నారు. ఏజెన్సీలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఇలా ఉండగా సరిహద్దు ప్రాంతాల్లో సీలేరు, చిత్రకొండ, డొంకరాయి, తదితర ప్రాంతాల్లో స్థానిక పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దులో పహారా కాస్తున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం వివరాలు సేకరిస్తున్నారు. వారం కిందట ఒడిశా, తూర్పుగోదావరిలో ఒక్కరోజులో బస్సులను కాల్చివేసిన సంఘటనలు జరిగిన నాటి నుంచి కూంబింగ్ ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌తో ఈ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. -
మధ్యాహ్న భోజన చార్జీలు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 24 లక్షల మం ది విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజ న ధరలు త్వరలో పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థులకు వండి పెట్టే కూరగాయ లు, నూనె, ఉప్పు, పప్పులకు ఒక్కో విద్యార్థి పై వంట ఏజెన్సీలకు చెల్లించే మధ్యాహ్న భోజనం ధరలను 2016లో పెంచిన కేంద్రం రెండేళ్ల తర్వాత మళ్లీ పెంచింది. 5.35 శాతం ధరలను పెంచి 2018 ఏప్రిల్ 1 నుంచి వాటిని వర్తింపజేయాలని అన్ని రాష్ట్రాలను ఇటీవల ఆదేశించింది. ఇందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. ఎన్నికల కోడ్ ముగిశాక వీటికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయనుంది. రోజూ రూ.7 లక్షల అదనపు భారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28,621 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా కూరగాయలు, ఉప్పు, పప్పు, నూనె తదితర వంట సామగ్రి కోసమే రోజూ రూ.1,23,05,648 వెచ్చిస్తోంది. తాజాగా 5.35 శాతం పెంపుతో నిత్యం రూ.1,29,67,108 వెచ్చిం చాల్సి ఉంది. అంటే దాదాపు రూ.7 లక్షలు అదనంగా వెచ్చించాలి. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని దాదాపు 19 లక్షల మందికి పైగా విద్యార్థులకు అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం భరిస్తుండగా, రాష్ట్రం 40 శాతం భరిస్తోంది. 9, 10 తరగతుల్లోని 4,73,883 మంది విద్యార్థులకు అయ్యే మొత్తంలో కేంద్రం వాటా లేనందున రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం వెచ్చిస్తోంది. -
ఆ ‘వైరస్’ పేరు ప్రభుత్వం!
కేంద్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం పది దర్యాప్తు సంస్థలు నేరుగా మీ పర్సనల్ కంప్యూటర్లోకి చొరబడవచ్చు. ఇక పౌరుల గోప్యత హక్కు ప్రభుత్వం దయాభిక్ష మాత్రమే. తాను తలిస్తే ఎవరి కంప్యూటర్లో అయినా, ఏ సమయంలో నైనా సమాచారం కోసం ఎలాంటి అనుమతులు లేకుండానే బలవంతంగా తీసుకోవచ్చు. సుప్రీంకోర్టుకు చెందిన తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం వ్యక్తిగత గోప్యతని ప్రాథమిక హక్కుగా గుర్తించి, ప్రకటించి ఏడాది నిండకుండానే ఈ వైపరీత్యానికి ప్రభుత్వం పాల్పడింది. పౌరుని జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కులలో అంతర్భాగమే గోప్యత అని చాటిన ధర్మాసనం తీర్పును అనుసరించి ఆధార్ లింకింగ్ తప్పనిసరి కాకుండా పోయింది. ఇప్పుడు పది దర్యాప్తు సంస్థలు ఎవరికీ జవాబుదారీగా ఉండకుండానే ఏకాఏకీ ఎవరి కంప్యూటర్ డేటా నైనా పొందవచ్చు అనేది సుప్రీం కోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధం. పోనీ ఈ ప్రభుత్వాలకు పౌరుల హక్కుల్ని పవిత్రంగా చూసే అలవాటు ఉందా అంటే అదీ లేదు. అందుకు ఎన్నో ఉదాహరణలు. మణిపూర్‌లో ఒక జర్నలిస్ట్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించాడన్న సాకుతో ఆయన్ని దేశ ద్రోహ నేరం క్రింద జాతీయ దర్యాప్తు సంస్థ జైల్లో పెట్టింది. పోనీ దేశ భద్రతకు భంగం అనుకున్నప్పుడు ఆయా కేసుల్లో కోర్టు అనుమతి తీసుకొని చర్యలు తీసుకోవచ్చు. లేదా అన్ని కోణాల్లో ఆలోచించి, పార్లమెంట్లో సరైన చట్టం తీసుకువచ్చి, ఆ చట్టం పరిధిలో దర్యాప్తు జరపొచ్చు. మిగతా ప్రజాస్వామ్య దేశాలు పాటిస్తున్న పద్ధతులివి. పౌరుల హక్కుల్ని గౌరవించడంలో అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన మన దేశం అందుకు విరుద్ధంగా ఇలాంటి ఆదేశాలు జారీ చెయ్యడం అన్యాయం. రాజ్యాంగ విరుద్ధం. ఎవరింట్లోకైనా తలుపు బద్దలుకొట్టి వెళ్లడం ఎంత అక్రమమో, ఎవరి వివరాలనైనా లాక్కోవడం అంతే అక్రమం. దేశ భద్రతను కాపాడే పేరుతో నిఘా రాజ్యం తేవడం సమంజసం కాదు. పౌరుల హక్కుల ఉల్లంఘన ఉదంతాలను చూస్తుంటే భారతీయ రాజ్యవ్యవస్థ ఇప్పుడు ఎంతమాత్రం ‘సాప్ట్ స్టేట్’గా లేదని అది ‘బ్రూటల్ స్టేట్’గా అడుగడుగునా నిరూపించుకుంటోందని శేఖర్‌గుప్తా వంటి సీనియర్ పాత్రికేయులు చెబుతున్నది అక్షరసత్యమేనని భావించాల్సి ఉంటుంది. వ్యాసకర్త: డా‘‘ డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ -
‘ఏజెన్సీ’ రహదారుల్లో నిధుల మేత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు లేక గిరిజనులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా గిరిజన గ్రామాలకు పూర్తిస్థాయిలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. పూర్తి చేశామని చెబుతున్న రోడ్లపై మట్టిపోసి వదిలేశారు. కల్వర్టులు ధ్వంసమైనా పునర్నిర్మించిన దాఖలాలు లేవు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజవర్గంలో గిరిజన ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే కళావతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికార టీడీపీ నాయకులు ఈ రోడ్ల కనెక్టివిటీ పేరుతో ప్రభుత్వ నిధులను దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ముక్కలు చేసి.. పనులు పంచి ఏజెన్సీలో గిరిజన గ్రామాలను కలుపుతూ లింక్ రోడ్ల(గ్రావెల్ రోడ్లు) నిర్మాణానికి ప్రభుత్వం రూ.734.96 కోట్లు కేటాయించింది. నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లకు పనులను అప్పగించాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. నామినేషన్ విధానంతో ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికే రోడ్ల నిర్మాణ పనులను కట్టబెట్టారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) స్థాయిలోనే పనులను ఆమోదించే విధంగా రోడ్ల పనులను ముక్కలు ముక్కలు చేశారు. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం బల్లుగూడ నుంచి పెదబెడ్డ మీదుగా గుమ్మ గిరిజన గూడెం వరకు 28.1 కిలోమీటర్ల రహదారి పనులను నాలుగు ముక్కలు చేసి, తెలుగుదేశం పార్టీ నాయకులకు నామినేషన్ విధానంలో అప్పగించారు. 7.9, 7.9, 2.4, 9.9 కిలోమీటర్లు.. ఇలా నాలుగు భాగాలుగా విభజించారు. 10 కిలోమీటర్ల లోపు రహదారుల పనులను మంజూరు చేసే అధికారం ఈఈకి ఉంటుంది. ఈ వెసులుబాటును అధికార పార్టీ నేతలు ఉపయోగించుకున్నారు. ఏజెన్సీలో రహదారుల నిర్మాణం కోసం విడుదల చేసిన రూ.734.96 కోట్ల నిధుల్లో 50 శాతానికి పైగా నిధులను కాంట్రాక్టర్ల ముసుగులోని టీడీపీ నేతలు, అధికారులు పంచుకుని తిన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులన్నీ నాసిరకం రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాలో మొత్తం 1,224 లింక్ రోడ్ల పనులను చేపట్టి, 2,396.69 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించనున్నట్లు టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ప్రకటించింది. ఇప్పటివరకు 584 పనులను పూర్తిచేశామని, 1012.19 కిలోమీటర్ల పొడవున రహదారుల నిర్మాణం పూర్తయినట్లు చెబుతోంది. ఇందులో సగం రోడ్లు పనికి రాకుండా పోయాయని గిరిజనులు తెలిపారు. వర్షాకాలంలో పనులు చేపట్టారని, కొండ ప్రాంతాలు కావడం వల్ల చాలావరకు రోడ్లు కొట్టుకుపోయాయని వెల్లడించారు. ఇంకా 640 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటివరకు పూర్తయిన రోడ్లకు రూ.149.05 కోట్లు ఖర్చుచేశారు. ఈ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. నాసిరకం రోడ్లు గిరిజనులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. కొన్ని రహదారులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇప్పటికీ మొదలుపెట్టని రోడ్ల పనులు 151 ఉన్నాయి. 328.35 కిలోమీటర్ల మేర ఈ రోడ్లు వేయాల్సి ఉంది. ఇందుకోసం రూ.95.55 కోట్లు ఖర్చు చేయనున్నారు. రూ.25 కోట్లు ‘బ్లాస్టింగ్’ అధికార పార్టీ నాయకులు ఏజెన్సీలో బ్లాస్టింగ్ల పేరుతో ప్రజాధనం దోపిడీ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 50 చోట్ల రోడ్ల మధ్యన పెద్ద రాళ్లు ఉన్నాయని, వాటిని తొలగించాలంటే బ్లాస్టింగ్ చేయాల్సి ఉందని అధికారులపై ఒత్తిడి తెచ్చి, ప్రతిపాదనలు తయారు చేయించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బ్లాస్లింగ్ల కోసం రూ.25 కోట్లు కేటాయించింది. రోడ్ల మధ్య ఎక్కడా పెద్దపెద్ద రాళ్లు లేవని గిరిజనులు పేర్కొంటున్నారు. బ్లాస్టింగ్లు చేయాల్సిన అవసరం లేదని, ప్రొక్లెయినర్లతో వాటిని తొలగించవచ్చని అంటున్నారు. అంటే రాళ్ల తొలగింపు పేరిట రూ.25 కోట్లు మింగేయడానికి అక్రమార్కులు స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతోంది. -
ఉనికి కోసమే అలజడులు
విశాఖక్రైం: ఏజెన్సీ ప్రాంతంలో తమ ఉనికిని కాపాడుకోడానికే మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తూ అలజడి సృష్టిస్తున్నారని ఎస్పీ అట్టాడ బాబూజీ అన్నారు. మావోయిస్టు వారోత్సవాల వల్ల గిరిజనులకు ఒరిగేది ఏమి లేదని చెప్పారు. అమాయక గిరిజన యువతను బలవంతంగా తమ వైపు తిప్పుకోవడానికి, వారిని భయపెట్టి బలిచేయడానికి మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహిస్తుంటారని చెప్పారు. ఈ మధ్య కాలంలో అత్యంత కీలకమైన వ్యక్తులను మావోయిస్టు పార్టీ కోల్పోయిందని, పలువురిని అరెస్టు చేశామని తెలిపారు. మావోయిస్టు ఉదయ్ భార్య మీనా ఎదురుకాల్పుల్లో చనిపోవడం, మావోయిస్టునేత నూనే నర్సింహరెడ్డి (అలియాస్ గోపాల్) భార్య బూతం అన్నపూర్ణ, పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడు ముదలి సోనా(అలియాస్ కిరణ్)తో పాటు పలువురు అరెస్టు అయిన నేపథ్యంలో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలిందని తెలిపారు. దీంతో బలాన్ని పెంచుకోడానికి వారోత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అమాయక గిరిజనులను మాయ మాటలు, పాటలతో ఆకట్టుకుని పార్టీలో చేర్చుకుంటున్నారని, పోలీసుల సమాచారం చేరవేయడానికి, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపిస్తున్నారని తెలిపారు. మావోయిస్టులు నిత్యం రకరకాల పేర్లతో వారోత్సవాలను నిర్వహిస్తున్నారని, దీంతో గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వారోత్సవాల పేరుతో ప్రభుత్వ ఆస్తులైన సమాచార వ్యవస్థలు, కార్యాలయాలను ధ్వంసం చేయడం, ప్రజల ఆస్తులపై కరువుదాడులు చేస్తున్నారని తెలిపారు. తమ మాట వినని గిరిజనులను ఇన్ఫార్మర్ల పేరుతో హత్యలు చేస్తున్నారని చెప్పారు. వారోత్సవాలపై పూర్తి స్థాయిలో నిఘా కొనసాగిస్తున్నామన్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరించినా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలిసినా దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నుర్మతి ఔట్‌పోస్టును సందర్శించిన ఎస్పీ విశాఖక్రైం,జి.మాడుగుల: జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలో పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చిన ప్రాంతాన్ని ఎస్పీ అట్టాడ బాబూజీ సందర్శించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నుర్మతి పంచాయతీ గాదిగుంట రోడ్డులో నిర్మాణదశలో ఉన్న వండ్రంగుల బ్రిడ్జి సమీపంలో బుధవారం ఉదయం మావోయిస్టులు రెండు చోట్ల మందుపాతరలను పేల్చారు. ఈ ఘటనలో కేంద్ర బలగాలకు చెందిన ఇద్దరు పోలీసులు, ఒక గిరిజనుడు గాయపడిన విషయం తెలిసిందే. సమాచారం తెలిసిన వెంటనే బుధవారం సాయంత్రం నుర్మతి ఔట్‌పోస్టును ఎస్పీ సందర్శించారు. ఏ ప్రాంతంలో మందుపాతర పేల్చారు, ఆ సమయంలో ఎంతమంది పోలీసులు ఉన్నారు తదితర వివరాలను తెలుసుకున్నారు. నుర్మతి ఔట్‌పోస్టు వద్దే ఎస్పీ, నర్సీపట్నం ఓఎస్డీ రాత్రి బస చేశారు. గురువారం ఉదయం మందుపాతర పేలిన ప్రదేశాన్ని పరిశీలించారు. స్థానిక గిరిజనులతో మాట్లాడారు. మావోయిస్టుల దాడులను తిప్పికొట్టే విధంగా పోలీసుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. గురువారం మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు. నుర్మతి పోలీస్ ఔట్‌పోస్టుకు మరింత భద్రత పెంచినట్టు తెలిసింది. -
పవన్ సినిమా డైలాగులు చేప్తే గిరిజనులు నమ్మరు
సాక్షి, తూర్పు గోదావరి: ఏజన్సీ ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గిరిజనుల సమస్యలు ప్రస్తావించకుండా కేవలం ప్రతిపక్ష నాయకుడిని విమర్శించటం దారుణమని రంపచోడవరం వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ అనంత ఉదయ్ భాస్కర్ అన్నారు. ఏజన్సీలో ఉన్న ప్రతీ సమస్య మీదా జగన్ స్పందించి, బాధితులకు సహాయం కూడా అందించారన్నారు. గిరిజనులు ప్రాణాలు కోల్పోయిన ఏ సందర్భంలోనూ పవన్ కల్యాణ్ పట్టించుకోలేదని విమర్శించారు. 2014 ఎన్నికల్లో తాను మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీని విమర్శించకుండా, ఆవేశంతో నాలుగు సినిమా డైలాగులు చెప్పి వెళ్ళిపోతే గిరిజనులు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఏజెన్సీలో గిరిజనులు పడుతున్న బాధలు పవన్ కళ్యాణ్‌కు తెలియవా ? చాపరాయి మాతా శిశు మరణాలు, లాంచీ ప్రమాదం వంటి సంఘటనలు జరిగిన సమయాల్లో స్పందించని పవన్ కళ్యాణ్ గిరిజనులను ఉద్ధరిస్తాడా అని ప్రశ్నించారు. -
మళ్లీ ఏ మొహం పెట్టుకొని వచ్చావ్?
ఏన్కూరు: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీఆర్ఎస్ వైరా అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్‌కు ఒకచోట పరాభవం ఎదురైంది. ఆయన ప్రచార రథాన్ని ఓ పల్లె వాసులు అడ్డుకున్నారు. ‘‘మా రోడ్డు అధ్వానంగా ఉంది. రోడ్డు లేని మా ఊరి అబ్బాయికి అమ్మాయిని కూడా ఇవ్వడం లేదు. మా ఊరి అమ్మాయిని ఎవరూ చేసుకోవడం లేదు. ఆటో రావలంటే ఏన్కూరు నుంచి ఐదొందలు అడుగుతున్నారు. పండగలకు, శుభకార్యాలకు బయటి నుంచి మా బంధువులు కూడా రావడం లేదు. వీటన్నింటికీ కారణం.. రోడ్డు లేకపోవడమే. గత ఎన్నికల్లో ఇప్పటిలాగా మా ఊరికొచ్చి.. రోడ్డు వేయిస్తానన్నారు. మళ్లీ ఇప్పుడొచ్చారు. రోడ్డు వేయిస్తామని చెప్పి వేయించకుండా.. మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగటానికి మా ఊరొచ్చారు..?’’ అంటూ, టీఆర్ఎస్ వైరా అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్‌పై మండలంలోని పైనంపల్లి తండా వాసులు విరుచుకుపడ్డారు. ఆయన ప్రచార రథాన్ని అడ్టుకున్నారు. దీంతో, మదన్‌లాల్ అనుచరులకు.. తండా వాసులకు మధ్య తోపులాట జరిగింది. ఇది, బుధవారం రాత్రి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జన్నారం, ఏన్కూరు, గార్లఒడ్డు, తూతకలింగన్నపేట, పికెబంజర, పైనంపల్లి తండాలో మదన్‌లాల్ ప్రచారం నిర్వహించారు. పైనంపల్లితండాలో ప్రచారం ముగిసిన తరువాత తిరిగి వెళుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. వారిని మదన్‌లాల్ అనుచరులు పక్కకు లాగేశారు. ఈ దశలో తోపులాట జరిగింది. కొద్దిసేపటి తరువాత మదన్‌లాల్ వెళ్లిపోయారు. శంకుస్థాపన చేద్దామనుకునేసరికే ప్రభుత్వం రద్దయింది... ‘‘తిమ్మారావుపేట రోడ్డు నుంచి పికెబంజర, పైనంపల్లితండా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. శంకుస్థాపన చేద్దామని అనుకుంటుండగగానే.. ఏడు నెలల ముందే ప్రభుత్వం రద్దయింది. ఎలక్షన్ కోడ్ కారణంగా శంకుస్థాపన చేయలేకపోయాను’’ అని, మదన్‌లాల్ చెప్పారు. పికెబంజరలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు. -
అందని ‘మధ్యాహ్న’ బిల్లులు
సాక్షి, గుర్రంపోడు : మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలకు బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగు నెలలుగా బిల్లులు అందక పోవడంతో అప్పులు చేసి వంట సామగ్రి తేవాల్సి వస్తుందని ఏజెన్సీ మహిళలు వాపోతున్నారు. మండలంలో 58 పాఠశాలలకుగాను 58 భోజన ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఒకటవ తరగతి నుంచి ఐదవతరగతి వరకు వంట వండినందుకుగాను ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.13, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.6.18 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. వంట చెరుకుతో పాటు కూరగాయలు, నూనె, పప్పు, ఉప్పు ఇతర వంట సామగ్రిని ఏజెన్సీలు సమకూర్చుకోవాలి. బియ్యం మాత్రం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు వంద గ్రాములు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రోజుకు 150 గ్రాముల చొప్పున ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈ పరిమాణం కూడా సరిపోక తాము నింద మోయాల్సి వస్తుందని వంట ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సోమవారం గుడ్డు, అన్నం, కూరగాయల కర్రీ, మంగళవారం అన్నం, ఆకుకూరల పప్పు, బుధవారం గుడ్డు, అన్నం, కూరగాయల కర్రీ, గురువారం అన్నం, సాంబారు, కూరగాయల కర్రీ, శుక్రవారం గుడ్డు, అన్నం, పప్పు కూర, శనివారం బఠానీ, ఆలు, క్యారెట్లతో వెజ్ బిర్యాణీ లేదా బగార అన్నం వండాల్సి ఉంది. ఏజెన్సీలు తప్పనిసరిగా ఈ మెనూ ప్రకారమే వండాల్సి ఉంటుంది. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ తదితర అధికారులు తరుచూ ఆకస్మిక తనిఖీలతో మధ్యాహ్న భోజన మెనూను పరిశీలిస్తారు. వారానికి మూడు గుడ్ల చొప్పున తప్పనిసరిగా అందించాల్సి ఉంది. గుడ్డుకు నాలుగు రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుండగా ఒక్కోసారి ఐదు రూపాయల వరకు గుడ్డు ధర ఉండి నష్టపోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. వంట సామగ్రితోపాటు గుడ్లకు బిల్లులు అందక గ్రామాల్లో వ్యాపారులు తమకు ఉద్దెరగా సామాను ఇవ్వడం లేదని అంటున్నారు. బిల్లులు అందక వంట చేయలేక, మధ్యలో మానుకోలేక అవస్థలు పడాల్సి వస్తుందని మహిళలు వాపోతున్నారు. ఎప్పుడు బిల్లు అడిగినా ఎస్టీఓకు వెళ్లిందని, బ్యాంకు వెళ్లిందని చెబుతున్నారని వారు వాపోతున్నారు. కొన్ని చోట్ల వంట గదులు లేవు మండలంలో 31 పాఠశాలలకు మాత్రమే వంట గదులు ఉన్నాయి. ఇంకా 20 పాఠశాలలకు వంట గదుల అవసరం ఉంది. వంట గదులకు గతంతో మండల పరిషత్ నిధుల నుంచి, ప్రస్తుతం ఉపాధిహామీ నిధుల నుంచి మంజూరు చేస్తున్నా అసంపూర్తి నిర్మాణాలతోనే ఉన్నాయి. కొన్ని బేస్మెంట్ స్థాయిలో, మరికొన్ని స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. గతంతో నిర్మించిన వంట గదులు ఇరుకుగా ఉండి ఆరుబయటే వండాల్సి వస్తుందని, ఉన్నత పాఠశాలల్లో వంట గది నిర్మాణం విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా విశాలంగా లేవు. కొన్ని చోట్ల ఇంటివద్దనే వండుకుని తీసుకుని వస్తున్నారు. ఏజెన్సీలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. వర్షాకాలంలో వంట చెరుకు తడిసి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయమై ఎంఈఓ నోముల యాదగిరిని ప్రశ్నించగా జూలై, ఆగస్టు బిల్లు ఎస్టీఓ నుంచి బ్యాంకుకు వెళ్లిందని, ఒకటి, రెండు రోజుల్లో ఏజెన్సీల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. బిల్లులు ప్రతినెలా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిల్లులు అందక తిప్పలు మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతినెలా అందించాలి. నాలుగు నెలలుగా బిల్లులు అందక ఇప్పటికే ఎన్నో అప్పులు చేశాం. బిల్లు అందక సకాలంలో డబ్బులు ఇవ్వక అప్పు కూడా పుట్టడం లేదు. బిల్లు రానిదానికి వారానికి మూడు గుడ్లు పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది. – పెరిగ జంగమ్మ, పిట్టలగూడెం -
రాళ్లు, రప్పలపైనే నడుచుకుంటూ.. గర్భిణి ప్రసవం
శ్రీకాకుళం, కాశీబుగ్గ: రాజకీయ నాయకులకు ఐదేళ్లకోమారు వచ్చే ఎన్నికల్లోనే గిరిజన గ్రామాలు గుర్తుకు రావడంతో ఇప్పటికీ సరైన రహదారికి నోచుకోవడంలేదు. ఫలితంగా అత్యవసర సమయంలో ఆస్పత్రికి చేరాలంటే గిరిజనుల అగచాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. తాజాగా పలాస మండలం లొత్తూరు పంచాయతీ గిరిజన గ్రామం చిన్నపల్లియలో ఓ గిరిజన గర్భిణికి శనివారం అర్ధరాత్రి పురిటినొప్పులు రావడంతో 108 వాహనం వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు రాళ్లు, రప్పలపై కిలోమీటరు దూరం నడుచుకుంటూ ఈ వాహనం వద్దకు తీసుకొస్తుండగా స్ట్రెచర్‌పైనే ప్రసవించింది. గ్రామానికి చెందిన సవరకుమారి(23) రెండో కాన్పులో పండంటి పాపకు జన్మనిచ్చిందని ఈఎంటీ దేవాది శ్రీనివాసరావు తెలిపారు. గ్రామస్తులు సహకారంతో స్ట్రెచర్‌పై తీసుకొచ్చి 108 వాహనంలో తల్లీబిడ్డలను క్షేమంగా పలాస సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఈఎంటీతోపాటు పైలట్ టీ ఢిల్లేశ్వరరావు, అంగనవాడీ కార్యకర్త సవర నిర్మల సహాయ సహకారాలు అందించారు. -
గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాలు
తూర్పుగోదావరి, చింతూరు (రంపచోడవరం): ఏజెన్సీలో గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయనడానికి మంగళవారం ఓ గిరిజన మహిళ మృతి చెందిన సంఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. ఆమె పరిస్థితి విషమంగా వుండగా పెద్దాసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు అందుబాటులో లేక సొంతంగా తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యుల వద్ద సొమ్ములు లేక చివరకు ఆమె ప్రాణం గాల్లో కలిసిపోయింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... చింతూరు మండలం నేలకోట గ్రామానికి చెందిన వెట్టి కన్నమ్మ(45) ఐదు రోజులుగా వ్యాధితో బాధపడుతోంది. ఆమె పరిస్థితి విషమించడంతో చిన్న కొడుకు మహేష్, పెద్ద కోడలు సీతమ్మ స్థానిక ఆశ వర్కర్ సాయంతో సోమవారం మధ్యాహ్నం ఆటోలో చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలు పాడయ్యాయని చికిత్స నిమిత్తం వెంటనే భద్రాచలం లేదా కాకినాడ తీసుకెళ్లాలని రిఫర్ చేసి లేఖ రాసి ఇచ్చారు. ఆసుపత్రికి చెందిన అంబులెన్సు రిపేరులో ఉందని సొంత ఖర్చులతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పినట్లు మహేష్ తెలిపాడు. పెద్దాసుపత్రికి తీసుకెళ్లేందుకు తమ వద్ద చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో చింతూరు ఆసుపత్రిలోనే ఉంచేశామని, దీంతో మంగళవారం ఉదయం ఏడు గంటలకు తన తల్లి మృతి చెందిందని అతను వాపోయాడు. అంబులెన్సు ఏర్పాటు చేస్తే కాకినాడ పెద్దాసుపత్రికి తీసుకెళ్దామని భావించామని, అది లేకపోవడంతోనే ఇక్కడే ఉవచేశామని అతను తెలిపాడు. కాగా మృతదేహం తరలించేందుకు ఆసుపత్రిలో ఎలాంటి అంబులెన్సు లేకపోవడంతో మధ్యాహ్నం ఒంటిగంట వరకు కన్నమ్మ మృతదేహం ఆసుపత్రిలోని వరండాపైనే ఉండిపోయింది. కనీసం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా సొమ్ములు లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులకు ఏమి చేయాలో పాలుపోలేదు. మరోవైపు గతంలో వ్యాధితో కన్నమ్మ పెద్దకొడుకు మృతి చెందగా, గత నెలలో వ్యాధితోనే భర్త కూడా మృతి చెందగా ప్రస్తుతం కన్నమ్మ కూడా మృతి చెందింది. ఈ విషయాన్ని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు, విలేకరులు ఐటీడీఏ ఏపీఓ పిచుక వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి మృతదేహాన్ని స్వగ్రామం తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్యకు సూచించారు. దీంతో ఆయన ఆటో ద్వారా మృతదేహాన్ని వారి స్వగ్రామం పంపించారు. కిడ్నీలు పాడైన కన్నమ్మ పరిస్థితి విషమంగా వుండడంతో భద్రాచలం లేదా కాకినాడ తీసుకెళ్లాలని రిఫర్ చేశామని, టైర్లు బాగాలేవని డ్రైవర్ అంబులెన్సును నిలిపి వేయడంతో ఆమెను పంపేందుకు వాహనం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. టైర్లు బాగా లేకపోవడంతో అంబులెన్సును కేవలం లోకల్ వరకే పంపిస్తున్నామని, దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుంటానని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పుల్లయ్య తెలిపారు. -
పోలవరం ప్రాజెక్టు వద్ద అకస్మాత్తుగా నెర్రలుబాసిన రోడ్డు
-
పోలవరం ప్రాజెక్టు వద్ద కలకలం
సాక్షి, పోలవరం/ పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చింది. రోడ్డంతా పెద్ద పెద్ద నెర్రెలు బాసింది. దీంతో భూకంపం వచ్చిందన్న భయంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి ఆ రోడ్డు గుండా రాకపోకలు నిలుపుదల చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంజనీరింగ్ అధికారులు అధికారులు పగులు తీసిన ప్రాంతాన్ని పరిశీలించారు. భూ వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకోవడం వల్లనే రోడ్డు పైకి చొచ్చుకుని వచ్చిందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. రోడ్డు పక్కన ఉన్న పోలవరం డంపింగ్ కారణంగానే భూమి నెర్రలు తీసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. రహదారిని మూసివేయడంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదమేమీ లేదు.. పోలవరం ప్రాజెక్టుకు ప్రమాదమేమీ లేదని ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిశోధన మరియి హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాంతంలో ఎలాంటి భూ ప్రకంపనలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. మట్టిలో తేమశాతం తగ్గడం, వాతావరణంలో మార్పుల వల్లే రహదారిపై పగుళ్లు ఏర్పడ్డాయని పేర్కొంది. పోలవరం ప్రాంతాన్ని సమీక్షిస్తున్న ఆర్డీజీఎస్ అధికారులు ఈ మేరకు తెలిపారు. -
గిరులపై పచ్చని సిరి
విజయనగరం, కురుపాం: గిరి శిఖరాలన్నీ చదును అవుతున్నాయి. పచ్చని సీమలుగా మారుతున్నాయి. వ్యవసాయ క్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. ఊటనీటితో దాహం తీర్చుకుంటున్నారు. సాగునీటిగా మార్చి సస్యశ్యామలం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన పంటల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు. మైదాన ప్రాంత రైతుల కంటే అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఊటనీరే సాగు.. తాగునీరు కురుపాం నియోజకవర్గంలో గిరి శిఖరాల నుంచి వస్తున్న ఊటనీటినే సాగునీటిగా, తాగునీటిగా వినియోగించడంలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. అక్కడి ప్రకృతి సాగు గిరిపుత్రులకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యకరమైన పంటలను అందిస్తున్నాయి. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లో గిరిశిఖరాలపై ఉన్న గిరిజనులకు సాగునీరు, తాగునీటి కష్టాలు ఎక్కువే. అదే సమయంలో ఊటనీటినే పైపులైన్ల ద్వారా గ్రామాలకు రప్పించుకొని మైదాన ప్రాంత రైతుల కంటే మెరుగైన దిగుబడులు సాధించి ఔరా అనిపిస్తున్నారు. కొండలను తవ్వి.. ఏజెన్సీలో పల్లపు భూములంటూ ఉండవు. పెద్ద పెద్ద డెప్పులు, రాళ్ల దిబ్బలు మాత్రమే ఉంటాయి. అలాంటి కొండలపై ఇంటిల్లిపాదీ కలిసి కొండరాళ్లను పేర్చి చిన్న చిన్న పంట పొలాలుగా తీర్చి దిద్ది వరి సాగు చేస్తుంటారు. దీనికి ఊటనీటినే సమయానుకూలంగా తరలిస్తారు. ఎలాంటి పురుగు మందులు వాడకుండా వ్యవసాయాధికారుల సూచనలు.. సలహాలనే పాటిస్తూ ప్రకృతి సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఆరోగ్యకర పంటలైన వరి, చోడి, కందులు, ఉలవలు, పెసలు, జనుములు, వలిశెలు తదితర చిరుధాన్యాలు పండించుకుంటున్నారు. -
కొండంత కష్టం
బుట్టాయగూడెం: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఆదివాసీ గిరిజనుల బతుకుల్లో మార్పులు రావడంలేదు. కష్టాలు తీరే మార్గంలేక వారి బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. ఇప్పటికీ రహదారి సౌకర్యాలు లేక అనారోగ్యాల పాలయితే వాహన సౌకర్యాలు లేక తరాలుగా జోలు కట్టి ఆస్పత్రికి తీసుకువస్తున్నారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలాంటి సంఘటన పశ్చిమ ఏజెన్సీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేలేరుపాడు మండలం మోదేలుకు చెందిన కెచ్చెల లత అనే గర్భిణి ఆదివారం రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ఉదయం ఆమెకు ఫిట్స్ రావడంతో గ్రామస్తులు హుటాహుటిన మం చంపై ఆమెను 25 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో కొండలు దాటుకుంటూ బుట్టాయగూడెం మండలం డోలుగండి సమీపంలోని గానుగమామిడి చెట్ల సమీపం వరకు మోసుకువచ్చారు. రేపల్లెలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వారిని చూసి సమాచారాన్ని దొరమామిడి పీహెచ్సీ సిబ్బందికి అందించారు. బాలింత ప్రమాద పరిస్థితిలో ఉందని వెంటనే అంబులెన్స్ పంపాలని సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే బాలింతకు దొరమామిడి ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు అక్కడి నుంచి విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని లత దగ్గర ఉన్న ఏఎన్ఎం మంగ తెలిపారు. ఆమెకు వైద్య పరీక్షలు అందేలా అలివేరు ఏఎన్ఎంలు రాధ, మల్లిక చూస్తున్నారన్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. అయ్యో.. ఎంత కష్టం బాలింతను మంచంపై మోసుకుంటూ 25 కిలోమీటర్లు నడవడం చాలా కష్టం. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుంటూ ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వైద్యం సకాలంలో అందించి బతికించుకోవాలనే గ్రామస్తుల తçపన పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. వేలేరుపాడు మండలంలోని మోదేలు గ్రామం వేలేరుపాడుకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో, బుట్టాయగూడెం మండలానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆ గ్రామానికి సంబంధించిన గిరిజనులు రేషన్ బియ్యాన్ని బుట్టాయగూడెం మండలంలోని అలివేరు గ్రామంలో తీసుకునేలా ఏర్పాటుచేశారు. త్వరలోనే వైద్య సేవలను దొరమామిడి పీహెచ్సీలో అందించేలా ఏర్పాటు చేస్తున్నారు. మోదేలుకి చెందిన గిరిజనులు ప్రతి శుక్రవారం కాలిబాటన బుట్టాయగూడెం మండలానికి నడిచివస్తూ రెండు రోజుల తర్వాత తిరిగి వెళ్తుంటారు. బాలింతను మాత్రం గంటల్లో మోసుకుంటూ సకాలంలో వైద్యం అందించేందుకు చాలా కష్టపడ్డారు. లంకపాకల నుంచి రేపల్లె వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టినా ఇటీవల వర్షాలకు రోడ్డు బాగా దెబ్బతింది. కనీసం ఆ రోడ్డు మరమ్మతులు చేపట్టినా 10 కిలో మీటర్ల వరకూ వాహనాలు వెళ్తాయని గిరిజనులు అంటున్నారు. -
ఆశ్రమ పాఠశాలల్లో గిరిపోషణ
సాక్షి, హైదరాబాద్: గిరిపుత్రుల్లో పౌష్టికాహార లోపాల్ని అధిగమించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైన ‘పోషణ్ అభియాన్’పథకాన్ని మరింత విస్తృతం చేస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతం పోషణ్ అభియాన్ పథకాన్ని ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్నారు. ఈ మూడు జిల్లాల్లోని దాదాపు 15వేల మంది చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సంఖ్య తక్కువగా ఉండడంతో పౌష్టికాహార లోపాల్ని అధిగమించడం కష్టమని భావించిన యంత్రాంగం... ఏజెన్సీలోని అన్ని ప్రాంతాల్లోనూ పౌష్టికాహారం పంపిణీ చేపట్టాలని భావించింది. గిరిపోషణ పేరిట చేపట్టే ఈ కొత్త కార్యక్రమానికి సంబంధించి ఆ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో మైదాన ప్రాంతాల్లో కంటే గిరిజన ప్రాంతాల్లోనే పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ముందుగా గిరిపోషణ కార్యక్రమాన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనే అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో గిరిపోషణను అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల్లో పిల్లలకు పూర్తిస్థాయిలో వసతి, భోజన సౌకర్యాన్ని కల్పిస్తుండగా... ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం మధ్యాహ్న భోజన పథకాన్నే అమలు చేస్తున్నారు. తాజాగా గిరిపోషణతో ఆయా విద్యార్థులకు అదనంగా చిరుతిళ్లను అందిస్తారు. చిరుతిళ్ల కింద తేనె, పల్లీపట్టి, బిస్కట్లు, చాక్లెట్లు, చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను ఇవ్వనున్నారు. జీసీసీ ఉత్పత్తులే... గిరిపోషణ ద్వారా పంపిణీ చేసే పదార్థాలన్నీ సహజసిద్ధంగా ఉండాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖలో భాగంగా ఉన్న గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) పలు రకాల ఉత్పత్తులు చేస్తోంది. ఇందుకు సంబంధించి తయారీ యూనిట్లు సైతం ఉన్నాయి. దీంతో గిరిజన విద్యార్థులకు పంపిణీ చేసే పౌష్టికాహారమంతా జీసీసీ ద్వారా సరఫరా చేయాలని యంత్రాంగం భావిస్తోంది. గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలను జీసీసీ విజయవంతంగా సరఫరా చేస్తోంది. మరోవైపు ఆహార ఉత్పత్తులు, తృణ ధాన్యాలతో కూడిన పదార్థాలను కూడా తయారు చేస్తుండడంతో గిరిపోషణ బాధ్యతలను జీసీసీకి ఇవ్వనుంది. -
‘ముందస్తు’ అలర్ట్
సాక్షి, ఆసిఫాబాద్: ముందస్తు ఎన్నికలకు జిల్లా పోలీసు యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. ఎటువంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత పది రోజుల నుంచి జిల్లా సరిహద్దు ప్రాం తాలైన ప్రాణహిత, పెన్‌గంగ, పెద్దవాగు పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో స్థానిక పోలీసులతోపాటు గ్రేహౌండ్స్, స్పె షల్ ప్రొటెక్షన్ పోర్స్ దళాలతోపాటు శిక్షణ కోసం వచ్చిన దళాలు రంగంలోకి దిగా యి. ఈ బలగాలు అటవీ ప్రాంతాలన్నింటి ని రోజు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల ఎవరైనా సంచరిస్తున్నారనే అనుమానంతో నిత్యం రాత్రింబగళ్లు గస్తీ కాస్తున్నాయి. జిల్లాకు సరిహద్దు గ్రామాలైన పెంచికల్‌పేట మండలం లోని నందిగాం, కమ్మర్గాం, దహెగాం మండలం మొట్లగూడ, రాంపూర్, చింతలమానెపల్లి గూ డెం, ప్రాణహిత పరిసరాలు, వాంకిడి మండలం సర్కపల్లితోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతా లు, కెరమెరి అడవులు, తిర్యాణి మండలం మంగి, గుండాల తదితర ప్రాంతాలపై గట్టి నిఘా జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం తో సహా కాగజ్‌నగర్ పట్టణంలో తనిఖీలు ము మ్మరం చేశారు. బాంబ్ స్క్వాడ్‌తో రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేబీఎం కమిటీపై ప్రత్యేక దృష్టి గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో రెండు దళాలు చురకుగా పనిచేసేవి. అందులో ఒకటి ఇంద్రవెల్లి ఏరియా దళం, రెండోది మంగి ఏరియా దళం. అయితే కాలక్రమేణా మావోల ప్రబల్యం తగ్గిపోవడంతో ప్రస్తుతం ఇంద్రవెల్లి దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఎక్కడా ఉమ్మడి జిల్లా పరి«ధిలో ఈ దళాల సారధ్యంలో ఎటువంటి ఘటన జరగలేదు. ఇక రెండోది తిర్యాణి మండలంలోని అత్యంత మారుమూల ప్రాంతమైన మంగి ఏరియా కమిటీ. ఈ దళం కూడా పూర్తిగా తన ఉనికి కోల్పోయింది. అయితే మావోయిస్టులు ప్రస్తుతం మంగి ఏరియా కమిటీ స్థానంలో కేబీఎం(కుమురంభీం, మంచిర్యాల) కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కమిటీకి ఇన్‌చార్జీగా మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, అలియాస్ నర్సన్న, అలియాస్ క్రాంతి పని చేస్తున్నారు. ఈయన స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామం. ఈయనతోపాటు బండి ప్రకాశ్ అలియాస్ బీపీ అలియాస్ ప్రభాకర్ అలియాస్ బండి దాదా ఈ కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈయన స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. వీరిద్దరూ సెంట్రల్ కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు. వీరివురు ప్రస్తుతం చత్తీస్ గడ్‌లో దండకారణ్యంలో ఉన్నట్లు నిఘా వర్గాల అంచనా. మైలారపు అడెల్లు ‘దండకారాణ్యం స్పెషల్ జోన్ కమిటీ’ (డీకేఎస్జెడ్సీ)ని ఏర్పాటు చేసి కొత్తవారిని మావోయిస్టు పార్టీలోని నియమిస్తూ రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలపై తమ ప్రతాపం చూపాలని ఆరాటపడుతున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. అంతేకాక ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాల్లో జిల్లా నుంచి మావోయిస్టు సానుభూతిపరులు, విప్లవ సాహితీవేత్తలు, విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కేబీఎం కమిటీ పేర ఓ ప్రకటన వెలువడింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు తెరలేపిన సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందే జిల్లా పోలీసు అప్రమత్తమైంది. గిరిజన యువత, ఆవాసాల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ ఆవాసం నుంచి పోలీసులకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశారు. కొత్తవారు ఎవరూ వచ్చిన తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు. అంతేకాక గతంలో జరిగిన సంఘటనలు, మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అధికారులు ఇతర అంశాలతో ఓ కరపత్రికను విడుదల చేయనున్నారు. అంతేకాక గోడప్రతుల ద్వారా గిరిజన గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు రూపొందించారు. పది రోజులుగా కూంబింగ్ జిల్లా అటవీ ప్రాంతాల్లో సమీప పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్సై సహా అందరూ వివిధ ఆపరేషన్లలో పాలుపంచుకుంటున్నారు. నక్సల్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, స్టేట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతోపాటు జిల్లా స్పెషల్ బ్రాంచితో ఎప్పటికప్పుడు సమచారం సేకరణ పనిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో మినహా దాదాపు మండల అన్ని కేంద్రాల్లోనూ సెల్ ఫోన్ పనిచేసేలా నెట్వర్క్ ఉంది. ఆయా మండల పోలీసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ గత పది రోజులుగా నిత్యం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. రోడ్ ఓపెనింగ్ పార్టీ(ఆర్వోపీ)తో రోడ్లకు ఇరువైపు ఉన్న ప్రాంతాలను, కల్వర్టులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బాంబ్ డిస్పోజబుల్ పార్టీ కూడా పనిచేస్తోంది. జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో తిర్యాణి మండలం దేవాపూర్ ప్రాంతంలో, మంగి మండలం పంగిడి మాదర ప్రాంతంలో పోలీసులకు తారసపడ్డారు. చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిపై నిర్మిస్తున్న గూడెం, అహెరి బ్రిడ్జి పనులు అడ్డగిస్తూ అక్కడ పొక్లెనర్లను, ఇతర వాహనాలు తగలబెట్టారు. అంతకు ముందు మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ 2010 జూలై 1న వాంకిడి మండలం సర్కపల్లి వద్ద పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలో ఆస్థాయిలో ఘటనలు ఎప్పుడు జరగలేదు. రాష్ట్రమేర్పడినప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోనే మావోయిస్టుల ఉనికి పెద్దగా కనిపించలేదు. అయినప్పటి ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్స్టేషన్లను గుర్తించారు. వామపక్ష ప్రభావం ఉన్న పోలింగ్స్టేషన్లు 58, వామపక్ష ప్రభావం ఉన్న ప్రాంతాలు 53 వరకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటికి ఎన్నికల సమయంలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. కూంబింగ్ కొనసాగుతోంది జిల్లాలో ముందస్తు ఎన్నికల సందర్భం గా ఎటువంటి అ వాంఛనీయ ఘటనలు జరగకుండా గత పది రోజులుగా ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రాణహిత నది పరిసర ప్రాంతాలతోపాటు మంగి ఏరియాలో తనిఖీలు విస్తృతంగా సాగుతున్నాయి. ఎన్నికలు సజావుగా సాగేందుకు ముందుస్తుగా భద్రతపరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.– మల్లారెడ్డి, ఎస్పీ -
మారణకాండలో.. మూడు దళాలు!
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కిడారి, సివేరిల హత్యాకాండ వెనుక ఏం జరిగందన్న విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మావోలు వారినే ఎందుకు టార్గెట్ చేశారు?.. ఎప్పటినుంచి పథక రచన చేశారు?.. వ్యూహం అమలులో ఎవరు సహకరించారు?.. తదితర అంశాలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ హత్యాకాండలో స్థానిక మావోయిస్టు కమిటీల ప్రమేయం ఏమీ లేదని వార్తలు వచ్చినా.. అందులో వాస్తవం లేదని తేలుతోంది. అరకు ఏజెన్సీలో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న పెదబయలు కమిటీ కూడా మావోయిస్టు మిలటరీ కమిషన్‌కు సహకరించిందని తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలను రాష్ట్రం బేఖాతరు చేయడం వల్లే ఈ ఉపద్రవం సంభవించిందనీ.. చర్చల పేరుతోనే మావోయిస్టులు కిడారిని రప్పించి మరీ వేటు వేశారని విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తోంది.మారణకాండ నుంచి ఇంకా పూర్తిగా తేరుకోని లివిటిపుట్టు గ్రామంలోని పలువురిని విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లడం.. ఆ గ్రామస్తులను వణికించింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మట్టుబెట్టడం ద్వారా ఏవోబీలో తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు మావోయిస్టులు రెండు నెలల క్రితం నుంచే ప్రత్యేక ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరిం చిన ఆంధ్ర ఒడిశా బోర్డర్ కమిటీ, నందాపూర్ దళానికి పెదబయలు ఏరియా కమిటీలోని ముఖ్య నాయకులు పూర్తి సహకారం అందించినట్టు తెలుస్తోంది. నందా పూర్ దళానికి పెదబయలు దళ కమండర్ సుధీర్, అశోక్‌లతో పాటు ఆంధ్ర ఒడిశా సరిహద్దు కమిటీలో మంచి పట్టున్న కిరణ్ కూడా ఈ ఆపరేషన్‌లో కీలకంగా పాల్గొన్నట్టు సమాచారం. నేతలిద్దరి హత్యతో కలకలం సృష్టిం చడంతో పాటు ఏవోబీలో తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు మావోలు పక్కా ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డుంబ్రి గూడ మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని లివిటిపుట్టు గ్రామాన్ని ఆపరేషన్‌కు ఎంచుకున్నట్టు చెబు తున్నారు. వాస్తవానికి కిడారి ఇటీవలి కాలంలో ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పర్యటించారు. గ్రామదర్శిని కార్యక్రమానికి గత శుక్రవారం మావోల అడ్డాగా పేరొందిన పెదబయలు మం డలం పెదకోడాపల్లితోపాటు అంతకుముందు పర్రెడ పంచాయతీలో కూడా పర్యటించారు. ఆ పర్యటనల్లో ఒకింత బందోబస్తు ఉన్నప్పటికీ మావోలను నిలువరిం చే సంఖ్యలో మాత్రం పోలీసులు లేరు. అయి తే ఆయా ప్రాంతాల్లో మావోలు దాడి చేయకుండా వ్యూహాత్మకంగానే లివిటిపుట్టును ఎంచుకున్నట్టు అర్ధమవుతోంది. డుంబ్రిగూడ మండల కేంద్రానికి సమీపంలో ఉండటం తో పాటు ఒడిశాకు దగ్గరగా ఉండటం, ఈ ప్రాంతంపై పోలీసులు ఏమాత్రం దృష్టి పెట్టని పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న మావోలు వ్యూహాత్మకంగానే లివిటిపుట్టులో ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మావోల అదుపులో ఇన్ఫార్మర్లు పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమాలకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, సోమాలు వచ్చినప్పుడు ఎంత మంది పోలీసులు భద్రతగా వస్తున్నారనే దానిపై పిన్ పాయింట్‌గా తెలుసుకునేందుకు మావోలు ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక గ్రామాల్లో పోలీసు ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నవారిని ముందుగానే గుర్తించి వారందరినీ ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టడి చేసినట్లు తెలుస్తోంది. ఆ విధంగా తమ కదలికల సమాచారం బయటకు పొక్కకుండా మావోయిస్టులు పక్కా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెబుతున్నారు. పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ తదితర ఏవోబీ సరిహద్దు మండలాల్లోని జామిగుడ, గిన్నెలకోట, ఇంజరి, భూషి పుట్టు, రంగబయలు తదితర ప్రాంతాల్లోని పోలీసు ఇన్ఫార్మర్లను అన్ని వైపుల నుంచి కట్టడి చేశారు. ఇన్ఫార్మర్లను హతమారిస్తే పోలీసులు అప్రమత్తం అవుతారని.. అప్పుడు ఆపరేషన్ కిడారి అమలు చేయడం సాధ్యం కాదని గుర్తించే.. ఇన్ఫార్మర్లను కట్టడి చేయడానికే పరిమితయ్యారని తెలుస్తోంది. ఇలా రెండు నెలల నుం చి అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే అనుకు న్న ఆపరేషన్‌ను పక్కాగా అమలు చేశారని తెలుస్తోంది. -
అక్కడ ఫార్మసిస్టే వైద్యుడు
తూర్పుగోదావరి, రంపచోడవరం: ఐటీడీఏ పరిపాలన కేంద్రం రంపచోడవరంలో ఒక ఎంబీబీఎస్ వైద్యుడిగా పేర్కొన్న ఒక వ్యక్తి రెండేళ్ల పాటు యథేచ్ఛగా గిరిజనులకు వైద్యం చేశాడు. ఎంబీబీఎస్, ఎండీ (న్యూరాలజీ) అంటూ బీ ఫార్మసీ చేసిన ఆర్.శివప్రసాద్ అనే వ్యక్తి బోర్డు పెట్టుకుని మరీ క్లినిక్ నిర్వహించాడు. ట్రాన్స్‌కో లైన్ ఇన్స్పెక్టర్ హత్య కేసులో ఇరుక్కోవడంతో శివప్రసాద్ పోలీసు విచారణలో ఈ విషయాన్ని బయటపడ్డాడు. ఆ కేసు ఎలా ఉన్నా. ఆ వ్యక్తి ఉదంతంతో ఏజెన్సీలో వైద్య సేవల పరిస్థితి ఏమిటనేది వెల్లడైంది. ఎలాంటి విద్యార్హతలు లేకుండానే వైద్యం చేస్తున్న వారు ఏజెన్సీలో కోకొల్లలుగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోకపోవడం, గిరిజనుల అమాయకత్వం నకిలీ వైద్యులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రోగం ఒకటైతే వైద్యం ఒకటి చేస్తుండడంతో గిరిజనుల ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని అసలైన వైద్యులు అంటున్నారు. మెడికల్ షాపుల్లో అమ్మకాల కోసం... మెడికల్ షాపుల యజమానులు మందులు అమ్మకాల కోసం వైద్యులతో మాట్లాడి క్లినిక్‌లు ఏర్పాటు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వచ్చిన వారికి ఎడాపెడా మందులు రాయించి వైద్యుడికి పర్సంటేజీలను షాపుల వారు ఇస్తున్నారు. విశాఖ జిల్లా నాతవరం నుంచి వచ్చిన ఆర్.శివప్రసాద్‌తో స్థానికంగా ఉన్న మెడికల్ షాపు యజమానులు క్లినిక్ ఏర్పాటు చేయించారు. బీ ఫార్మసీ చదివిన అతడు ఎంబీబీఎస్, ఎండీ న్యూరాలజీ అంటూ బోర్డు పెట్టుకుని వైద్యం పేరుతో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడాడన్న విషయం బయట పడినప్పుడు.. ఏజెన్సీలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రైవేటు వైద్యులు కొంతమంది అధిక డోసుల్లో మందులు వాడిస్తున్నందున గిరిజనుల ప్రాణాలకు ముప్పు తెస్తోంది. వారితో స్టెరాయిడ్ మందులను వాడిస్తున్నారని, వాటి వల్ల సైడ్ ఎఫెక్టుల వల్ల గిరిజనుల ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటాయని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానరాని డ్రగ్ ఇన్స్పెక్టర్లు ప్రైవేట్ క్లినిక్‌లపై పర్యవేక్షణ చేయాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానరావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అడపాదడపా ఏజెన్సీకి వచ్చే డ్రగ్ ఇన్స్పెక్టర్లు మెడికల్ షాపుల యజమానులతో కాసేపు కాలక్షేపం చేసి వెళ్లిపోతున్నారు. ఏజెన్సీలో మెడికల్ షాపులపై కేసులు రాసి దాఖాలాలే లేవంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అర్హత లేకుండా ల్యాబ్‌ల నిర్వహణ ఏజెన్సీలోని పలు ల్యాబ్‌లను కూడా విద్య అర్హత లేనివారే నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ప్రైవేట్ ల్యాబ్‌ల వైపు కన్నెత్తి చూడడం లేదు. రక్త పరీక్షలకు సైతం అధిక సొమ్ము వసూలు చేస్తున్నారు. వారి పరీక్షల నిర్ధారణపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటి ఆధారంగా కొంతమంది ప్రైవేట్ వైద్యులు మందులు భారీగా రాసేస్తున్నారు. వాటిని వాడిన తరువాత ప్రాణాల మీదకు వచ్చేసరికి రోగులు రాజమహేంద్రవరం, కాకినాడ పరుగులు పెడుతున్నారు. చేతకాని వైద్యం చేసి రోగి పరిస్థితి చేయి దాటిపోయాక ప్రైవేట్ వైద్యులు చేతులెత్తేస్తున్నారు. ఏజెన్సీలో గిరిజనులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ వైఫల్యం చెందడంతో.. అక్కడ నకిలీ వైద్యులు గిరిజనుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. కొండకోనల్లోంచి రోగులను మోసుకుంటూ ఆస్పత్రులకు తీసుకువెళుతుంటే అక్కడ వైద్యం అందడం లేదు. దీంతో వారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అలాంటివారిలో నకిలీ వైద్యులు కూడా ఉన్నట్టు ఇటీవల బట్టబయలైంది. శరీరం పులపరింపుగా ఉంటే మెడికల్ షాపుల్లో మందులను కొనుక్కొని సొంతంగా వాడేస్తున్నారు. ఆ మందులు నకిలీవి కావన్న గ్యారంటీ లేదు. ఈ పరిస్థితిని అనువుగా తీసుకున్న కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు నకిలీ వైద్యులను తయారుచేసి గిరిజనుల సొమ్మును పిండుకుంటున్నారు. ట్రాన్స్‌కో లైన్‌మన్ హత్య కేసులో ఇరుకున్న వ్యక్తి.. నకిలీ వైద్యుడన్న విషయం బయటపడింది. దీంతో ఆరోగ్యపరంగా గిరిజనులు ఎంత దగాకు గురవుతున్నారనేది బయటపడింది. అయితే ఈ విషయంపై మాత్రం వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవడం లేదు. స్టెరాయిడ్లు వాడుతున్నారు కొంతమంది ప్రైవేట్ వైద్యులు స్టెరాయిడ్లు వాడుతున్నారు. ఈ మందు ప్రభావం వల్ల రోగం తీవ్రత తాత్కాలికంగా తగ్గినా.. దీర్ఘకాలంలో అవయవాలకు నష్టం ఏర్పడుతుంది. తరువాత ఏ రోగం వచ్చినా ఏ మందులు వాడిన తగ్గని పరిస్థితి ఏర్పడుతుంది. ఏజెన్సీలో ప్రైవేట్ క్లినిక్‌లపై పర్యవేక్షణ లేదు. – కార్తిక్ రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, రంపచోడవరం -
అగమ్య గోచరం భోజన పథకం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల కోసం రాష్ట్రప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టినమధ్యాహ్న భోజన పథకం నిర్వహణను బాలారిష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. జిల్లాలోని 33 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని 7,361 మంది విద్యార్థులకు ప్రభుత్వం భోజనం అందించేందుకు నిర్ణయించింది. ఆశయం మంచిదే అయినా ప«థకం నిర్వహణ తీరు అగమ్యగోచరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. పశ్చిమగోదావరి, నిడదవోలు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి 996 క్యాలరీలు, 27.85 గ్రాముల ప్రొటీన్లతో కూడిన ఆహారాన్ని మధ్యాహ్నం అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. కళాశాలల సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల మధ్నాహ్న భోజన పథకం వంట ఏజెన్సీల నిర్వాహకులు వండి పెట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా అక్కడే వండి కళాశాలలకు అందించాలని సూచించింది. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పెడుతున్న మెనూ ప్రకారం రోజుకు రూ.6.18 చొప్ను మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఇస్తున్నారు. జూనియర్ కళాశాల విద్యార్థికి కూడా హైస్కూల్ విద్యార్ధికి కేటాయించిన 150 గ్రాముల బియ్యాన్ని మాత్రమే కేటాయించడంతో భోజనం సరిపోవడం లేదని ఆ విద్యార్థులు వాపోతున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు కూడా పిల్లలకు పావు కేజి బియ్యాన్ని అందించాలని కోరుతున్నారు. ఇంటర్ విద్యార్థులకు ఎంత కూటాయించాలలో విధి విదానాలు ఇప్పటి వరకు అధికారులకు అందలేదు. మరో వైపు కళాశాలల ప్రిన్సిపాల్స్ రోజూ విద్యార్థుల హాజరు వివరాలను భోజనం వచ్చే స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి అందించాలి. హెచ్ఎం భాద్యత వహించి రుచిగా, వేడిగా వంటకాలు ఉండేట్లు జాగ్రత్త వహించి కళాశాలలకు చేరవేయించాలి. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల్లో రోజుకు సుమారు 300 నుంచి 400 మందికి వంట చేస్తున్నారు. జూనియర్ కళాశాలలకు కూడా పాఠశాలల్లో వండించడం భారంగా ఉందని హెచ్ఎంలు వాపోతున్నారు. సరైన గదులు, వంట పాత్రలు లేకపోవడం, గ్యాస్, వంట సరకులు కొనుగోలుకు పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని వంట ఏజెన్సీలు హెచ్‌ఎంలపై ఒత్తిడి తెస్తున్నాయి. సకాలంలో బిల్లులు అందక కిరాణా షాపుల్లో అప్పులు చేసి పథకాన్ని నిర్వహించడంవల్ల తమకు నష్టమే కానీ ఎటువంటి లాభదాయకం కాదని నిర్వాహకులు చెబుతున్నారు. ఉన్నత పాఠశాలల్లో రోజుకు 400 మందికి భోజన విరామ సమయానికి వండి పెట్టడం తలకు మించిన భారంగా మారిందని, కళాశాల విద్యార్థులతో కలుపుకుని రోజుకు 500 నుంచి 600 మందికి వండి పెట్టడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం తరలించడంలో జాప్యం ఇంటర్ విద్యార్థులకు ఆగస్టు నుండి మధ్యాహ్న భోజన వసతి కల్పించారు. కనీసం వంట సామాన్లు, పెట్టుబడులు ఇవ్వక పోవడంతో నిర్వాహకులు వండటానికి ససేమిరా అంటున్నారు. ఇ ది ఎన్నికల హంగామా అని పలువురు విమర్శిస్తున్నారు. హైస్కూల్లో వండి కళాశాలకు చేర్చేం దుకు అవస్థలు పడుతున్నారు. కొన్ని కళాశాలలకు దగ్గరలోనే హైస్కూల్స్ ఉన్నా, మరి కొన్ని కళాశాలకు హైస్కూల్స్ రెండు కిలోమీటర్ల దూరం ఉండటంతో వండిన భోజనాలు కళాశాలలకు చేర్చడానికి మధ్యాహ్నం 2 గంటలు అవుతోంది. అప్పటి వరకు విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. భోజనాలు వడ్డించడానికి సిబ్బంది లేకపోవడంతో పలు కళాశాలల్లో అధ్యాపకులే వడ్డిస్తున్నారు. కళాశాలలకు ఏజెన్సీలు నియమించాలి జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్నాహ భోజన పథకం వంట చేయడానికి ఏజెన్సీలను నియమించాలి. అన్ని కళాశాలకు పూ ర్తిస్థాయి ప్రిన్సిపాల్స్‌ను నియమించాలి. బయో మెట్రిక్ అమలు బాధ్యత చూసే ప్రిన్సిపాల్స్ ఈ పథకం నిర్వహణ బాధ్యత చూస్తే అవకతవకలకు అవకాశం ఉండదు. ఖాలీగా ఉన్న ప్రిన్సిపాల్స్ పోస్టులు భర్తీచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మరో పక్క బయోమెట్రిక్ అమలు చేయకపోతే భోజన పథకంలో అవకతవకలు జరిగే అవకాశం ఉంది. అరకొర జీతాలు ఏ మూలకు.. ప్రభుత్వం మధ్యాహ్నం భోజన పథకంలో పనిచేస్తున్న మహిళలకు నెలకు రూ.1000 మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారు. నాలుగేళ్ల నుంచి జీతాలు పెంచుతారనే ఆశతో ఉన్నాం. అంగన్వాడీ సిబ్బందికి జీతాలు పెంచారు. మండు వేసవిలో వేడిని తట్టుకుని వంట చేస్తున్నాం. కళ్లు మండిపోయి కంటి చూపు కూడ దెబ్బతింటోంది. నెలకు కనీసం రూ.3,000 అయినా ప్రభుత్వం ఇవ్వాలి . – మానే అమలేశ్వరి,ఏజన్సీ నిర్వహకురాలు, నిడదవోలు -
మంచంపట్టిన ఏజెన్సీ
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో వ్యాధులు ముసురుకున్నాయి. గత 2 నెలలుగా అధిక వర్షాలు కురవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఎక్కడికక్కడ మురుగునీరు గుంటల్లో దర్శనమిస్తున్నాయి. దీంతో దోమలు పెరిగి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గ్రామాల్లో తాగునీరు వనరుల్లో క్లోరినేషన్ పనులు నామమాత్రంగానే ఉండడంతో ప్రజలు మలేరియా, టైఫాయిడ్, డయేరియా, కామర్లు వంటి వ్యాధులతో బాధపడుతూ మంచాన పడుతున్నారు. టైఫాయిడ్, మలేరియా, కామర్లు, డయేరియాతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా తలపోటు, దగ్గు, జలుబు బాధపడేవారి సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఏజెన్సీలోని 5 మండలాల్లోని 14 పీహెచ్‌సీలు జ్వరపీడితులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా వ్యాధులబారిన పడ్డవారు క్యూ కడుతున్నారు. గ్రామాల్లో మురికినీరు కాల్వల్లో చెత్తాచెదారం నిండి దుర్గంధం వెదజల్లుతుంది. దోమల బెడద ఎక్కువగా ఉండడంతో రాత్రిపూట ప్రజలు కంటిమీద కునుకుకూడా తీయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి విడత గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులు చేశామని చెబుతున్న అధికారులు రెండో విడతలో కొన్ని గ్రామాల్లోనే పనులు చేసి చేతులు దులుపుకున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఏడాదిలో 45 వేల మంది జ్వరపీడితులు ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో 14 ప్రభుత్వాసుపత్రులు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది సుమారు 45 వేల మందికి పైగా జ్వరపీడితులు నమోదయ్యారు. అదేవిధంగా 181 మలేరియా, 270 కామెర్లు, 5 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది ప్రభుత్వ వైద్యాధికారులు వెల్లడిస్తున్నవి. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అనేకమంది జ్వరపీడితులు నమోదయ్యారు. ఆ ప్రకారం బాధితులు రెండురెట్లు ఉంటారని అంటున్నారు. ఈ ప్రాంతంలో 262 మలేరియా సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. వాటిలో తొలివిడత స్ప్రేయింగ్ పనులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రెండో విడత ఇప్పటివరకూ 120 గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులు చేస్తున్నామని చెప్పారు. మిగిలిన గ్రామాల్లో వర్షాల కారణంగా స్ప్రేయింగ్ పనులు ఆలస్యమైనట్టు వైద్య శాఖ సిబ్బంది తెలిపారు. అయితే గ్రామాల్లో మాత్రం పారిశుద్ధ్యలోపం వల్ల దోమలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వ్యాధులతో బాధపడేవారికి మెరుగైన వైద్యసేవలకు ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని ఏజెన్సీ ప్రాంతవాసులు కోరుతున్నారు. -
మన్యంలో... మృత్యు ఘోష
రంపచోడవరం: తూర్పు ఏజెన్సీలో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో గిరిజనుల పరిస్ధి తి దయనీయంగా మారుతోంది. ఆగస్టు నెలలో వర్షాలతోపాటు సీజనల్ వ్యాధులు విజృంభించి లోతట్టున ఉన్న ప్రతి గ్రామంలో ప్రజలు రోగాలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో ఇప్పటి వరకూ ఏజెన్సీలో వైద్య సేవలు అందించిన తొమ్మిది మంది వైద్యులు రాజీనామా చేసి వెళ్లిపోవడంతో పరిస్ధితి దయనీయంగా మారింది. గత ఏడాది ఇదే సీజన్లో వై రామవరం మండలం చాపరాయిలో నెల రోజుల వ్యవధిలో16 మందికి పైగా గిరిజనులు మృత్యువాత పడినప్పటికీ వైద్య సేవలు మెరుగుపరచడంలో ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపించకపోవడం పట్ల గిరిజనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజెన్సీలో గైనకాలజిస్ట్లతోపాటు చిన్న పిల్లల వైద్యులు కూడా లేకపోవడంతో మాతాశిశు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక్కడ ఏజెన్సీలో గత ఆరేళ్లు కాలంలో దాదాపు వెయ్యికిపైగా శిశు మరణాలు సంభవించాయంటే ఆధ్వాన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 40 మంది వరకు తల్లులు మృత్యువాత పడ్డారు. మలేరియా జ్వరాలు బారిన పడ్డవారి సంఖ్య తక్కువేమీ లేదు. వ్యా«ధిని గుర్తించి సకాలంలో చికిత్స అందించకపోవడం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ఇద్దరే రెగ్యులర్ వైద్యులు... రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వాటిలో 42 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్స్ పనిచేయాలి. కానీ 33 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు మాత్రమే రెగ్యులర్ వైద్యులు ఉన్నారు. మిగిలిన వారు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇటీవల తొమ్మిది మంది పీహెచ్సీ వైద్యులు తమ పోస్టులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆరేళ్లు కాలం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యులను రెగ్యులర్ చేసి బదిలీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడంతో వైద్యులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఏజెన్సీలో పీహెచ్‌సీల పనితీరును పర్యేవేక్షించే ఏజెన్సీ డీఎంహెచ్ఓ పోస్టు ఖాళీగా ఉంది. పీహెచ్సీ పరిధిలో వైద్యులు ఉండేందుకు ఎటువంటి వసతులు కల్పించడం లేదు. ఆగని శిశు మరణాలు... ఏజెన్సీలో శిశు మరణాలు ఆగడం లేదు. తాజాగా రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన పూసం రాము రెండు నెలల పసిపాప సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడింది. గత ఆరేళ్లు కాలంలో ఏజెన్సీలో మతాశిశు మరణాలు పరిశీలిస్తే ఏజెన్సీలో వైద్య సేవల దుస్థితి ఎలా ఉందో అద్దం పడుతుంది. ఏజెన్సీలో గర్భిణులను గుర్తించి వారిని సకాలంలో కాన్పు కోసం పీహెచ్‌సీలకు తరలించాలనే ఐటీడీఏ అధికారి ఆలోచన కార్యరూపం దాల్చడం లేదు. ప్రధానంగా గర్భిణీలకు పౌష్టికాహారం అందకపోవడం శాపంగా మారుతోంది. ఏజెన్సీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటలు ఆసుపత్రులుగా స్ధాయి పెంచిన వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఫలితంగా రాత్రి సమయంలో అత్యవసర వైద్యం కోసం వచ్చిన రోగులకు అక్కడ ఉన్న సిబ్బంది సేవలే గతి. ఇంకా పూర్తికాని మలేరియా మందు పిచికారీ... ఏజెన్సీలో దోమలు, లార్వా నివారణకు గ్రామాల్లో మలేరియా మందు పిచికారీ రెండో దశ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే రెండు రౌండ్లు మలేరియా మందు పిచికారీ పూర్తికావాలి. ఏజెన్సీలో 931 గ్రామాల్లో పిచికారీ పూర్తికా వాల్సి ఉండగా ప్రస్తుతం 636 గ్రా మాల్లో పూర్తి చేశారు. రంపచోడవ రం ఐటీడీఏ పరిధిలో గంగవరం, చవిటిదిబ్బలు, గుర్తేడు, వాడపల్లి, మారేడుమిల్లి పీహెచ్‌సీల పరిధి లోని కొన్ని గ్రామాల్లో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాడపల్లి పీహెచ్సీ పరిధిలో వాడపల్లి గ్రామంలో 602 మంది జ్వరాలు బారిన పడితే రక్త పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. బూసిగూడెంలో 274 మందికి జ్వర పీడితులకు రక్త పరీక్షలు నిర్వహించగా పది మందికి మలేరియా ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు విభృంజించే అవకాశం ఉంది. పంచాయతీలకు మలేరియా నిర్మూలనకు ఫాగింగ్ యంత్రాలు ఇచ్చినా నిరుపయోగంగా మారాయి. యంత్రాలు వినియోగించేందుకు పంచాయతీలకు ఎటువంటి డబ్బులు ఇవ్వకపోవడంతో వాటిని వాడేందుకు పెట్రోల్ కొనుగోలు చేయలేకపోతున్నారు. గిరిజనులకు వైద్యం అందడం లేదు... పీహెచ్సీ ద్వారా గిరిజనులకు వైద్యం అందడం లేదు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో కనీసం కాన్పులు కూడా చేయడం లేదు. ప్రతి కేసు రిఫర్ చేస్తున్నారు. గైనిక్ సేవలు అందడం లేదు. పూర్తిస్ధాయిలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. పీహెచ్‌సీలను 24 గంటల పీహెచ్‌సీలుగా ఆప్‌గ్రేడ్ చేసినా ఫలితం లేదు. అత్యవసర సమయంలో వైద్యం కోసం వెళ్లిన గిరిజనులకు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు.– జుత్తుక కుమార్, సీపీఐ డివిజన్ కన్వీనర్, రంపచోడవరం వైద్య పోస్టుల భర్తీకి చర్యలు... ఏజెన్సీ పరిధిలో పీహెచ్సీలో ఖాళీగా ఉన్న తొమ్మిది సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటాం. మంగంపాడు, గుర్తేడు, కొండమొదలు, జడ్డంగి, పెదగెద్దాడ, లాగరాయి, బోదులూరు, వాడపల్లి పీహెచ్‌సీల్లో ఒక్కో పోస్టు నింపేందుకు అన్ని చర్యలూ తీసుకున్నాం. గిరిజన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలు మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపడతాం. – నిషాంత్‌కుమార్, రంపచోడవరం ఐటీడీఏ పీవో -
విజృంభిస్తున్న విష జ్వరాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు డెంగీ జ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే రోగుల సంఖ్య మరింత పెరిగి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్‌తో పాటు చికున్‌గున్యా, డెంగీ వంటి విష జ్వరాలు సోకడంతో ఇప్పటికే అనేక మంది ఆస్పత్రి పాలయ్యారు. పట్టణ ప్రాంతాల్లో కూడా రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మహిళలు, చిన్నారులు, విద్యార్థులు అంతా విషజ్వరాల బారినపడుతున్నారు. కొన్ని జిల్లాల్లో విషజ్వరాలతో పాటు ఇతర సీజనల్ వ్యాధుల కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రికి వచ్చే ఔట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్య తీవ్రం.. ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో విషజ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 6,210 కేసులు నమోదయ్యాయి. జిల్లా ఆస్పత్రిలో 123 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఆదిలాబాద్ జిల్లాలో డయేరియా బారిన పడి నలుగురు మృతి చెందారు. మరో 35 డెంగీ కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో ఇటీవల విషజ్వరాల తో 11 మంది, డెంగీతో మరో ఇద్దరు మృతి చెందా రు. యాదాద్రి జిల్లాలో ఇప్పటికే 4 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చి పరీక్షలు చేసుకున్న వారిలో 99 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 28 డెంగీ కేసు లు, 27 చికున్‌గున్యా కేసులు నమోదైనట్లు తెలిసింది. వరంగల్ జిల్లాలోనూ డెంగీ లక్షణాలతో పిల్లలు అధిక సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపించడంతో జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేక రోగులను వెనక్కి పంపేస్తున్నారు. పరిస్థితి చేయిదాటిపోతే.. డెంగీ మరణాలతో జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జిల్లాల్లో వందలాది మంది రోగులు డెంగీ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. ఇప్పటికే 10 మంది దాకా మృత్యువాత పడ్డారు. డెంగీ రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. సరైన వైద్యం అందక చాలా మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు ఆస్పత్రులు పరీక్షల పేరిట వేల రూపాయలు దండుకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నా యి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీ కేంద్రాల్లో వైద్యుల కొరతతో రోగులు తప్పనిసరై ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో చెత్తా చెదారం పేరుకుపోయింది. దీనికి వర్షం తోడు కావటంతో రోగాలు ప్రబలుతున్నాయి. అధికారికంగా జిల్లాలో ఇప్పటివరకు సుమారు 10 వరకు డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు చెబుతున్నారు. గత గణాంకాల్లోకి వెళ్తే.. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు దేశ వ్యాప్తంగా 78,691 డెంగీ కేసులు నమోదు కాగా.. 122 మంది చనిపోయినట్లు కేంద్రం తన నివేదికలో వెల్లడించింది. 2016లో 1,29,166 కేసులు నమోదైతే 245 మంది చనిపోయారు. మలేరియా కేసులు గత నెల వరకు 4,10,141 నమోదు కాగా, సాధారణ మలేరియా కేసులు 5,92,905 రికార్డయ్యాయి. 75 మంది ప్రాణాలు కోల్పోయారు. 2015లో 99,913 డెంగీ కేసులు నమోదుకాగా.. 220 మంది మృతి చెందారు. 2013లో 75,808 డెంగీ కేసులు నమోదు కాగా.. 192 మంది చనిపోయారు. 2011 కంటే 2012లో ఏకంగా 50,222 మందికి డెంగీ సోకగా 242 మంది మృత్యువాతపడ్డారు. 2010లో 28,292 డెంగీ కేసులు నమోదుకాగా.. 110 మంది మృతి చెందారు. ఈ ఏడాది కూడా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జ్వరాలు ఎక్కువగా సోకే అవకాశముందని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. -
శవానికీ కావడే దిక్కు!
గుండాల: రోడ్డు, సరైన రవాణా సౌకర్యం లేక ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు పడుతున్న ఇబ్బందులకు ఈ ఘటనే నిదర్శనం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామంటూ పాలకులు ఎంత గొప్పలు చెబుతున్నా.. గిరిజనుల అవస్థలు మాత్రం వర్ణనాతీతం. కనీసం ఆటోలు కూడా వెళ్లలేని పరిస్థితిలో ఎంతో మంది జ్వర పీడితులను, నిండు గర్భిణులను జెట్టీలు కట్టి మైళ్ల దూరం నడిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ మృతదేహానికీ ఈ తిప్పలు తప్పలేదు. ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువకుడిని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించేందుకు అతడి కుటుంబ సభ్యులు కావడి ద్వారా మోసుకురావాల్సిన పరిస్థితి ఎదురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం పాలగూడెంకు చెందిన కొడెం నరేష్ (20) కుటుంబ కలహాలతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గుండాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో కొడవటంచ వరకు వాహనంలో, అక్కడి నుంచి ఎడ్లబండి ద్వారా ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత కేసు నమోదు కావడంతో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఇల్లెందుకు తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎడ్లబండి కూడా అందుబాటులో లేకపోవడం, ఇటీవల వర్షాలకు రోడ్డు ఛిద్రమై కనీసం ఆటోలు కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కావడి ద్వారా మూడు కిలోమీటర్ల దూరంలోని కొడవటంచ వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి వాహనం ద్వారా ఇల్లెందుకు తరలించారు. చినుకు పడితే తమకు కావడి తిప్పలు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఏజెన్సీలోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. -
మన్యంలో కుండపోత
మన్యాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో గెడ్డలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీలోని అరకులోయ, పాడేరు నియోజకవర్గాలలోని దాదాపు అన్ని మండలాలలోను ఇదే పరిస్థితి. పెదబయలు (అరకులోయ): మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ డ్యాం నీటి మట్టం బుధవారం ప్రమాద స్థాయికి చేరుకుంది. రెండు రోజుల నుంచి ఆంధ్ర ఎగువన ఉన్న గిరిజన ప్రాంతాల్లో, అలాగే ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల్లో విస్తా్తరంగా వర్షాలు కురుస్తుండడంతో అధికంగా నీరు డ్యావ్‌ుకు నీరు వచ్చి చేరుతోంది. దీంతో డుడుమ జలశాయానికి నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. డుడుమ డ్యాం 2590 అడుగుల సామర్థ్యం ఉండగా, బుధవారం 2590.9 అడుగుల నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో డ్యావ్‌ు ఐదు గేట్లు ద్వారా 18 వేల క్యూసెస్సుల నీటికి బలమెల రిజర్వాయర్‌కు దిగువన విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ సిబ్బంది తెలిపారు. నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తు అప్రమత్తంగా ఉన్నామని సిబ్బంది తెలిపారు. అరకులోయ: ఏజెన్సీలోని అరకులోయ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను మంగళవారం రాత్రి నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రధాన గెడ్డలు, వాగులలో వరదనీటి ఉధృతి ప్రమాదకరంగా ఉంది. మత్స్యగెడ్డలో వరదనీరు పోటెత్తడంతో నాటుపడవల ప్రయాణాన్ని నిలిపివేశారు. జోలాపుట్టు రిజర్వాయర్‌లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో మూడు గేట్ల నుంచి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. డుడుమ డ్యామ్‌లోను ఇదే పరిస్థితి నెలకొంది, మారుమూల గ్రామాలకు పోయే దారుల్లో గెడ్డలు పొంగి ప్రవహిస్తుండడంతో రవాణా సౌకర్యాలు నిలిచిపోయి, మారుమూల గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.హుకుంపేట,డుంబ్రిగుడ,అనంతగిరి,అరకులోయ ప్రాంతంలోను బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుండపోతగా వర్షం కురిసింది.ప్రధాన గెడ్డలన్ని ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సమీప గ్రామాల గిరిజనులు తమ గ్రామాలకే పరిమితమయ్యారు. వర్షాలతో అనంతగిరి, బొర్రా, అరకులోయ,చాపరాయి వంటి పర్యాటక ప్రాంతాలు బోసిపోయాయి. హుకుంపేట మండలంలోని మత్స్యగుండం మీదుగా మత్స్యగెడ్డ నీరు పొంగి ప్రవహిస్తుండడంతో మత్స్యదేవతల దర్శనాన్ని రెండు రోజులుగా నిలిపివేశారు. పాడేరు: మన్యం జలమయమైంది. అల్పపీడన ప్రభావం మన్యంలో అధికంగా ఉంది. మంగళవారం సాయంత్రం నుంచి వర్షం కుమ్మరిస్తోంది. రెండు రోజులుగా తెరిపివ్వకుండా వర్షం కురుస్తుండడంతో గెడ్డలు, వాగులు, పంట పొలాలు జలం నిండుగా మారాయి. రహదారులు, లోతట్టు ప్రదేశాలు జలమయమయ్యాయి. ఆగకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. కాస్తంత కూడా వాన తెరిపివ్వకపోవడంతో బుధవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కూడా అంతరాయం కలిగింది. రాయిగెడ్డ, కోడాపల్లి, పెదకోడాపల్లి, మత్స్యగెడ్డ పరీవాహక ప్రాంతాల్లో వాన జోరు వల్ల గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వంతెన పైనుంచి కూడా నీరు ప్రవహిస్తోంది. ముంచంగిపుట్టు, హుకుంపేట, పెదబయలు మండలాల్లో వానజోరు ఎక్కువగా ఉంది. ముంచంగిపుట్టు మండలంలో 74.2 మిల్లీమీటర్లు, పెదబయలు 54.6 మి,మీ, హుకుంపేట 68.8మి.మీ, డుంబ్రిగుడ 48.0మి,మీ, జి.మాడుగుల 36.4మి,మీ, జీకే వీధి 30.2మి,మీ, అరకు 32.6మి,మీ, పాడేరు 29మిమీ, చింతపల్లి 22.4మిమీ కొయ్యూరు 9మి,మీ, అనంతగిరి 20.4 మిమీ.ల వర్షపాతం నమోదైంది. మన్యం అంతటా ముసురు వాతావరణం అలముకుంది. బుధవారం రాత్రి వర్షం కొంత తెరిపిచ్చింది. -
అన్నం పెట్టినోళ్లకు ఎసరు
ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా..కనీస వేతనం లేకపోయినా.. అప్పులు చేసి అన్నం తయారు చేశారు.. విద్యార్థుల కడుపునింపి ఆకలి తీర్చారు.. అలాంటి మధ్యాహ్న భోజన పథకం కార్మికులను తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఎన్నికలప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే భోజనపథకం నిర్వాహకులను ఆదుకుంటాం అంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబు వారి పొట్టకొట్టేందుకు ఈ పథకాన్ని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టేస్తున్నాడు. ఫలితంగా వీరు రోడ్డున పడనున్నారు. దీనిపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డక్కిలి (నెల్లూరు): ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న ఏజెన్సీలను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజనం అందిస్తున్న నిర్వాహకులను ఒక్కసారిగా తొలగించేందుకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన జీఓలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థానిక అధికారులకు చేరాయి. 2018 సెప్టెంబర్ 15 నుంచి మధ్యాహ్న భోజనం నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు గత నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా అందుకు సంబంధించిన విధి విధానాలతో అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. ఎలాంటి ముందుస్తు నోటీసులు ఇవ్వకుండానే ఒక్కసారిగా మహిళలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్న తమని రోడ్డున పడేస్తే ఎలా, ఇన్నేళ్లుగా కష్టపడి చేసిన దానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఫలం ఇదేనా అంటూ మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కార్మికులు మండిపడుతున్నారు. జీఓ విడుదల ఇప్పటికే జిల్లాలోని ముత్తుకూరు, ఇందుకూరుపేట, మనుబోలు, వెంకటాచలం, గూడూరు, నెల్లూరుటౌన్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల పరం చేసింది. జిల్లాలోని మరో 19 మండలాల్లోని ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను ఢిల్లీకి చెందిన నవ ప్రయాస్ సంస్థకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులకు, స్థానిక ఎంఈఓ కార్యాలయాలకు ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని పైవేట్ సంస్థకు ఇవ్వడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి కోల్పోతున్న మహిళలు జిల్లాలో వెంకటాచలం, నాయుడుపేట, వెంకటగిరి, కావలి, ఆత్మకూరు ప్రాంతాల్లోని 19 మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఢిల్లీకి చెందిన నవ ప్రయాస్కు అప్పగించింది. డక్కిలి మండలంలో 71 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 60 ప్రాథమిక, 5 ప్రాథమికోన్నత, 6 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు సంబంధించి 70 మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలలో 123 మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరంతా సెప్టెంబర్ నెల నుంచి ఉపాధి కోల్పోనున్నారు. నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు తెలుసుకొన్న నిర్వాహకులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది నుంచే.. గతేడాది మొదటి దశగా జిల్లాలో ముత్తుకూరు, ఇందుకూరుపేట, మనుబోలు, వెంకటాచలం మండలాల్లో మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు. నెల్లూరు టౌన్లో ఇస్కాన్ సంస్థకు అప్పగించారు. అయితే రెండో విడతగా నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు, దొరవారిసత్రం, వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, కావలి, కావలి రూరల్, బోగోలు, జలదంకి, కలిగిరి, ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం, సంగం మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. మొదటి విడతగా మధ్యాహ్న భోజన నిర్వహణను పొందిన సంస్థలు నిర్వహణ వ్యవహారంలో ఆదిలోనే కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా యి. ఉదయం 10 గంటలకు తయారు చేసిన అన్నం, కూరలను మధ్యాహ్నానికి పాఠశాలలకు చేరవేయడంతో విద్యార్థులు తినేందుకు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం తాజాగా జిల్లాలో 19 మండలాల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసి పాఠశాలలకు చేరవేయడం సాధ్య కాదనే అభిప్రాయం తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వ్యక్తమవుతోంది. వేళకు అందేనా.. పాఠశాల ప్రాంగణంలోనే మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి వేడిగా విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి రూ.కోట్లు ఖర్చు చేసి పాఠశాలల ప్రాంగణాల్లోనే వంట గదులు నిర్మించి గ్యాస్ పంపిణీ చేశారు. అయితే ప్రస్తుతం ఈ పథకం నిర్వహణను పైవేట్ సంస్థకు అప్పగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవో విడుదల చేయడంతో విద్యార్థులకు భోజనం వేళకు అందుతుందా అనే సందేహ వ్యక్తమవుతోంది. స్థానిక ఏజెన్సీల పాత్ర నామమాత్రం ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న స్థానిక ఏజెన్సీలు నామమాత్రంగా మిగలనున్నాయి. ఈ ఏజెన్సీల ఆధారంగా ప్రతి రోజూ ముగ్గురు ఉపాధి పొందేవారు. అయితే ప్రస్తుతం విడుదల చేసిన జీఓతో వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న నిర్వాహకులు ఆహారం వడ్డించడం, పాఠశాలలను శుభ్రం చేయడం, విద్యార్థుల ఆలనాపాలనా చూడడం వంటి పనులకే పరిమితం కావాల్సిఉంది. అయితే నిర్వాహకులకు మాత్రమే నెలకు రూ.1000 ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాల ప్రాంగణంలోనే భోజనం తయారీ మంచిది పాఠశాల ప్రాంగణంలోనే వంటను తయారు చేసి విద్యార్థులకు అందిస్తే బాగుంటుంది. ఎక్కడో తయారు చేసి పాఠశాలకు తీసుకురావడం వల్ల విద్యార్థులకు అసౌకర్యంగా ఉంటుంది. స్థానికంగా తయారు చేస్తే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుంది. – గువ్వల రాధ, మహసముద్రం, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు ఎంతో కాలంగా పనిచేస్తున్నాం 2003 నుంచి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నాం. కనీస వేతనం లేకపోయినా కష్టపడి పనిచేసిన నిర్వాహకులను తొలగించడం అన్యాయం. రాబోయే రోజుల్లో ప్రైవేట్ ఏజీన్సీల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది. – కట్లా శివరావమ్మ, ఏజెన్సీ నిర్వాహకురాలు, ఆల్తూరుపాడు -
మన్యంలో మృత్యుఘోష!
మన్యసీమ మృత్యు సీమగా మారింది. ఏ పల్లె చూసినా, ఏ ఇల్లు చూసినా ఏదో విషాదంతో ముడిపడే ఉంటోంది. ఈ లోకంలోకి కన్ను తెరిచేలోగా కొందరు.. తెరిచాక మరికొందరు చిన్నారులు కన్ను మూస్తున్నారు. అమ్మ పొత్తిళ్లలోనే అసువులు బాస్తున్న శిశువులు.. వారిని చూడకుండానే తనువు చాలిస్తున్న తల్లులు విశాఖ మన్యంలో కోకొల్లలు.. ఇలా గడచిన ఐదున్నరేళ్లలో విశాఖ ఏజెన్సీలో 2,210 మంది నవజాత శిశువులు, 150 మంది గర్భిణులు, బాలింతలు మృత్యువాత పడటం అక్కడ దయనీయ పరిస్థితికి దర్పణం పడుతోంది. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ బారినపడి ఏటా వందల సంఖ్యలో గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. సాక్షి, విశాఖపట్నం/పాడేరు: వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం విశాఖ ఏజెన్సీలోని 3,574 గ్రామాల్లో 6,04,047 మంది గిరిజన జనాభా ఉంది. వీరికి వైద్య సేవలందించేందుకు పాడేరు, అరకుల్లో ఏరియా ఆస్పత్రులు, 36 పీహెచ్‌సీలు, 199 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిలో పూర్తి స్థాయిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది లేకపోవడంతో గిరిజనులకు అరకొర వైద్యమే అందుతోంది. మంజూరైన పోస్టుల్లో 10 శాతానికి మంచి రెగ్యులర్ వైద్యులు, సిబ్బంది లేరు. దీంతో ప్రభుత్వం ఆ ఖాళీల్లో కాంట్రాక్టు వైద్యులు, సిబ్బందిని నియమించి కాలక్షేపం చేస్తోంది. ఈ ఏరియా ఆస్పత్రులకు పీహెచ్‌సీల మాదిరిగా ఒక్కో అంబులెన్స్ మాత్రమే ఉంది. దీంతో అత్యవసర రోగుల తరలింపులో జాప్యం జరిగి ప్రాణ నష్టం వాటిల్లుతోంది. మారుమూల గ్రామాల నుంచి వైద్యం కోసం కేజీహెచ్‌కు వెళ్లేందుకు గిరిజనులు చాలా వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. రవాణా సేవలు విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. కొండకోనల్లో రోగులను కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రులకు తరలించేందుకు ఇప్పటికీ డోలీ మోతే శరణ్యమవుతోంది. చాలా గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు అందుబాటులో లేవు. దీనివల్ల గిరిజనులకు గెడ్డ నీరే గతి అవుతోంది. ఫలితంగా టైఫాయిడ్, డయేరియా, చర్మవ్యాధులకు గురవుతున్నారు. పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేసినా.. 2018 జనవరి నుంచి ఏజెన్సీలోని 36 పీహెచ్‌సీలను 24–7 ఆస్పత్రులుగా ప్రభుత్వం మార్పు చేసింది. వీటిలో చాలా పీహెచ్‌సీలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పీహెచ్‌సీల చెంతన డాక్టర్లు, వైద్య సిబ్బందికి నివాస గృహాలు లేవు. దీంతో నామమాత్రంగానే ఈ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలోని పాడేరు కేంద్రం గా జిల్లా మలేరియా శాఖతో పాటు అదనపు వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయాలు ఉన్నాయి. వీటికి జిల్లా మలేరియా అధికారి, జిల్లా అదనపు వైద్యాధికారిని కూడా నియమించారు. కానీ ఏజెన్సీలో వైద్య సేవల పర్యవేక్షణకు వీరికి వాహనాల్లేవు. పాడేరులో మలేరియా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు 2014లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. పిట్టల్లా రాలిపోతున్నా.. మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ప్రసవ వేదనకు గురవుతున్న గర్భిణులు తీవ్ర నరకయాతను ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు పరిస్థితి విషమంగా ఉన్న సమయాల్లో నెలలు నిండని గర్భిణులను చివరి నిమిషాల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ఐదున్నరేళ్ల వ్యవధిలో ఏజెన్సీలో 2210 మంది నవజాత శిశువులు, మరో 155 మంది గర్భిణులు, బాలింతలు మృతి చెందారు. ఈ ఏడాది మే నుంచి జూలై వరకు డెంగ్యూ లక్షణాలతో 8 మంది చనిపోయారు. కానీ వైద్య ఆరోగ్యశాఖ ఒక్కటి కూడా నమోదు చేయడం లేదు. వైద్యనిపుణులులేకపోవడమూ శాపమే.. ఏజెన్సీ వ్యాప్తంగా పీహెచ్‌సీలు, ప్రాంతీయ ఆస్పత్రుల్లోనూ నేటికీ పూర్తి స్థాయి వైద్య నిపుణులు (గైనకాలజిస్టు, పిల్లలు, మత్తు వైద్య నిపుణులు) లేకపోవడంతో శాపంగా మారింది. ఏజెన్సీ 11 మండలాలకు సంబంధించి ఒక వంద పడకల ఆస్పత్రి, ఒక ఏరియా ఆస్పత్రి, రెండు సామాజిక ఆస్పత్రులు, 36 పీహెచ్‌సీల పరిధిలో 202 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు పాడేరు, అరకు, చింతపల్లి, జి.మాడుగుల, హుకుంపేట మండలాల్లో ప్రసూతి కేంద్రాలు, పాడేరులో ఒక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలున్నాయి. గర్భిణులు, బాలింతలతో పాటు మిగిలిన గిరిజనులు వైద్య చికిత్సల కోసం ఆయా ఆస్పత్రులకు వస్తారు. -
ముంచెత్తిన వాన
కొవ్వూరు/నిడదవోలు: అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా జనజీవనం స్తంభిస్తోంది.రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునగడంతో ప్రజలు అల్లాడుతున్నారు. దీనికితోడు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద కూడా పోటెత్తుతోంది. ఉప నదులైన ప్రాణహిత , ఇంద్రావతి నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆనకట్ట వద్ద పాండ్ లెవెల్ 13.11 మీటర్లకు చేరింది. దీంతో ఆనకట్ట మొత్తం 175 గేట్లను 1.2 మీటర్ల ఎత్తులేపి 3,90,192 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 7,700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. తూర్పు డెల్టాకు 4,200, సెంట్రల్ డెల్టాకు 1,500, జిల్లాలోని పశ్చిమ డెల్టాకు 2,000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. పశ్చిమడెల్టా పరిధిలోని ఏలూరు కాలువకు 769, నరసాపురం కాలువకు 1,501, తణుకు కాలువకు 656, ఉండి కాలువకు 507 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా.. అత్తిలి కాలువకు నీటిని విడుదల నిలిపివేశారు. గోదావరి ఎగువ ప్రాంతంలో నీటిమట్టాలు క్రమేణా పెరుగుతుండటంతో సోమవారం సాయంత్రానికి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృ తి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖా«ధికారులు అంచనా వేస్తున్నారు. 11.3 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం గత 24 గంటల్లో జిల్లాలో 11.3 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. వేలేరుపాడులో గరిష్టంగా 70 మిల్లీమీటర్లు, కుక్కునూరులో 58.2 మిల్లీమీటర్ల చొప్పున నమోదైంది. ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం, కోపల్లి వద్ద కొవ్వాడ, అరసుల వాగు జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జీలుగుమిల్లి మండలంలోని సంగం వాగు, అశ్వారావుపేట వాగులు కూడా పొంగుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయంలో నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. గంటకు 3,183 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎర్రకాలువ జలాశయం గరిష్ట సామర్థ్యం 83.50 మీటర్లు కాగా, ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 80.30 మీటర్లకు చేరింది. -
పశ్చిమగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు
-
నీరవ్ మోదీకి మరో షాక్
సాక్షి,న్యూఢిల్లీ: డైమండ్ వ్యాపారి, ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్ల రుణాలను ఎగవేసిన కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌మోదీకి మరోషాక్ తగిలింది. అతి పెద్ద పీఎన్బీ కుంభకోణంలో (రూ.13,600 కోట్లు) ముంచేసి విదేశాల్లో చక్కర్లుకొడుతున్న నిందితుడు నీరవ్ మోదీకి సంబంధించి తాజాగా మరింత కీలక సమాచారాన్ని దర్యాప్తు బృందం అధికారులు సేకరించారు. కనీసం ఆరు భారతీయ పాస్‌పోర్ట్ లతో వివిధ దేశాలలో తిరిగుతున్నట్టు కనుగొన్నారు. ఈ నేరానికి మోదీపై తాజా ఎఫ్ఐఐఆర్ నమోదు చేయాలని దర్యాప్తు బృందాలు కోరుతున్నాయని సీనియర్ అధికారులు ధృవీకరించారు. ఒకటి కంటే ఎక్కువ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉండటం, అలాగే రద్దు చేయబడిన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించడం నేరమని పేర్కొన్నారు. అధికారుల సమాచారం ప్రకారం నీరవ్ మోదీ మొత్తం ఆరు ఇండియన్ పాస్ట్‌పోర్టులను కలిగివుండగా రెండింటిని తరచుగా వాడుతున్నాడు. మిగిలినవి ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాయి. ఒక దానిలో మోదీ పూర్తి పేరు ఉండగా, మరొకటి, 40 ఏళ్ళ యూకే వీసాలో ఫస్ట్‌నేమ్‌తో ఉంది. పీఎన్బీ స్కాంలో వెలుగులోకి వచ్చిన అనంతరం ఈ ఏడాది ప్రారంభంలో తన మొదటి పాస్‌పోర్టును, ఆ తరువాత రెండవదాన్ని ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ, వాటిని ఇంకా వినియోగించడం చట్టరీత్యా నేరమని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతోపాటు బెల్జియం పాస్‌పోర్ట్ కూడా ఉంది. ఈ వ్యవహారంపై ఒక కొత్త నేరారోపణ కింద మోదీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, అంతర్గత విచారణ పూర్తయిన తర్వాత విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని సీనియర్ అధికారి చెప్పారు. అలాగే ఇతర దేశాలు జారీ చేసిన పాస్‌పోర్టులను మోదీ ఉపయోగించినట్లయితే, దానిపై కూడా దర్యాప్తు జరుగుతుందని ఆయన చెప్పారు. కాగా పీఎన్బీ స్కాంలో ఇప్పటికే మోదీపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తమ ఛార్జిషీట్ల ఆధారంగా మోదీతోపాటు ఇతర నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి. మరోవైపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా నీరవ్ పాస్‌పోర్ట్ రద్దు గురించి ప్రభుత్వం ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించింది. అరెస్టు వారెంట్ జారీ చేయాలని కోరిన సంగతి తెలిసిందే. -
మూత‘బడి’..
డేరు మండలంలోని పనసపల్లి గ్రామంలోని జీపీఎస్ (టీడబ్ల్యూ) ఏకోపాధ్యాయ పాఠశాల ఇది. ఈ పాఠశాలలో 1 నుంచి 5 తరగతులున్నాయి. గతేడాది ఈ పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయిని పదవీ విరమణ చేశారు. దీంతో ఈ పాఠశాలకు టీచర్ కొర త ఏర్పడింది. వేసవి సెలవుల అనంతరం మంగళవారం పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ ఏకోపాధ్యాయ పాఠశాల కావడంతో ఉపాధ్యాయుడు లేక మంగళవారం ఈ పాఠశాల తెరుచుకోలేదు. ఈ పాఠశాలలో గతేడాది 16 మంది విద్యార్థులున్నారు. ఈ ఏడాది మరో ఆరుగురు బాలలు చేరవలసి ఉంది. పాఠశాల తెరుచుకోకపోవడంతో విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. సాక్షి, పాడేరు : గిరిజన ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం ఏజెన్సీ 11 మండలాల్లో గిరిజన సంక్షేమశాఖ ద్వారా 670 (జీపీఎస్) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే మారుమూల గిరిజన గ్రామాల్లో బాలలకు ప్రాథమిక విద్యను అందించేందుకు 30 ఏళ్ల క్రితం గిరిజన సంక్షేమశాఖ ఏజెన్సీ 11 మండలాల్లో గిరిజన విద్యా వికాస కేంద్రాలు (జీవీవీకే) పేరుతో ఏకోపాధ్యాయ పాఠశాలలను ప్రారంభించింది. జీపీఎస్ పాఠశాలలుగా పేరుమార్చి నేటికీ ఏకోపాధ్యాయులతోనే ఈ పాఠశాలలను నిర్వహిస్తోంది. 1 నుంచి 5 తరగతులుంటున్న ఈ పాఠశాలల్లో 30 నుంచి 50 వరకూ విద్యార్థులుంటున్నారు. విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నా ఒక్క ఉపాధ్యాయుడే తరగతులలో బోధనతో నెట్టుకొస్తున్నారు. ఇదే మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అయితే అదనంగా టీచర్లను నియమిస్తున్నారు. కానీ జీపీఎస్ పాఠశాలల్లో మా త్రం 2వ ఉపాధ్యాయుడు నియామకమన్న ప్రశ్నే లేకుండా పోయింది. ఈ జీపీఎస్ పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడి వల్ల విద్యాబోధన కుంటుపడుతోంది. ప్రస్తుతం ఏజెన్సీలో 77 జీపీఎస్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటా ఈ పాఠశాలల్లో వలంటీర్లుగానీ, సీఆర్టీలను గాని నియమించే వరకూ ఈ పాఠశాలలు తెరుచుకోవడం లేదు. ప్రతి ఉపాధ్యాయుడికి ఏటా 22 వ్యక్తిగత సెలవులు ఉంటాయి. అదీగాక ప్రతీ నెల 2 రోజులు హెచ్ఎంల మీటింగ్, కాంప్లెక్స్ మీటింగ్‌లతోపాటు విద్యా ప్రణాళికలకు సం బంధించి అత్యవసర సమావేశాలు, ఉపాధ్యాయుల వ్యక్తిగత సెలవులు అన్నీ కలిపి ఏడాదికి కనీసం 40 రోజులు పాఠశాల మూతపడుతున్నా యి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ పాఠశాలకు ఇద్దరు టీచర్లు ఉండాలనే నిబంధన ఈ జీపీఎస్ పాఠశాలలకు వర్తిం చడం లేదు. తరచూ పాఠశాలలు మూతపడుతుం డటం వల్ల గిరిజన ప్రాథమిక విద్య గాలివాటంగా మారింది. నేడు పాఠశాలలు పునః ప్రారంభమైనా ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట ప్రాథమిక పాఠశాలలు మూతపడివున్న పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏజెన్సీలోని 955 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 61 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు 175 ఉన్నాయి. ఏజెన్సీలో ఉపాధ్యాయుల కొరత వల్ల గిరిజన ప్రాథమిక విద్యాభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. -
ఓఎన్జీసీలో ఉద్యోగాలంటూ గోల్మాల్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఓ ఏజెన్సీ ఓఎన్జీసీలో ఉద్యోగాల పేరుతో దేశ వ్యాప్తంగా నిరుద్యోగులకు ఎర వేసింది. దీనికి హైదరాబాద్‌లోనూ సబ్ ఏజెన్సీ ఉంది. కొందరు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, మెడికల్ టెస్ట్‌లు సైతం పూర్తి చేసింది. ఈ గ్యాంగ్ జారీ చేసిన బోగస్ నియామక పత్రాలతో అనేక మంది ఢిల్లీలోని ఓఎన్జీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఇలా విషయం బయటకు రావడంతో అక్కడి వసంత్‌కుంజ్, క్రైమ్ బ్రాం చ్ల్లో కేసులు నమోదయ్యాయి. పోలీసులు గుర్తించిన బాధితుల్లో ఏడుగురు హైదరాబాద్‌కు చెందిన వారూ ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఓ ప్లేస్ మెంట్ ఏజెన్సీ దేశంలోని ప్రధాన నగరాల్లో సబ్ ఏజె న్సీలు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. దీనిలో సత్బీర్ కీలకంగా వ్యవహరించారు. తమకు రాజకీయ, అధికార వర్గాల్లో భారీ పలుకుబడి ఉందంటూ ప్రచారం చేసుకున్నారు. ఓఎన్జీసీలో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మినిస్ట్రీ కోటా పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయరంటూ నమ్మించాడు. వీటిని రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు మాత్రమే భర్తీ చేస్తారంటూ ప్రచారం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న సబ్ ఏజెన్సీ సైతం ఇలానే చెప్పింది. ఆకర్షితులైన వారి నుంచి తొలుత కొంత మొత్తం అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ఆపై వీరికి ప్రాథమిక మౌఖిక పరీక్షలు పూర్తి చేసి ఢిల్లీకి తరలించారు. అక్కడి కృషి భవన్లో తుది దశ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆ కార్యాలయం లాబీలో ఉన్న మోసగాళ్ల ఏజెంట్లు తామే ఓఎన్జీసీ అధికారులమని నమ్మించి, అక్కడే తతంగం పూర్తి చేశారు. ఇది జరిగిన తర్వాత వారికి గ్రేటర్ నోయిడాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేయించి సర్టిఫికెట్లు జారీ చేశారు. తర్వాత మిగిలిన మొత్తం వసూలు చేసి ఓఎన్జీసీ లోగోతో కూడిన బోగస్ నియామక పత్రాలు జారీ చేశారు. ఒక్కో ప్రాంతానికి చెందిన వారికి ఒక్కో తేదీ ఇస్తూ, ఢిల్లీలో ఉన్న ఓఎన్జీసీ కార్యా లయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించారు. అక్కడకు వెళ్లిన బాధితుల్లో ఏడుగురు నగరానికి చెందిన వారున్నారు. ఒక్కొక్కరూ రూ.10 లక్షల చొప్పున మోసగాళ్లకు చెల్లించారు. ఈ లేఖలు చూసిన ఓఎన్జీసీ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న ముఠా చేసిన స్కాంగా తేల డంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. -
పోలీస్ ఉద్యోగాలకు మూడేళ్ల వయో సడలింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగా లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రభు త్వం తీపి కబురు అందించింది. ఈ ఉద్యోగా లకు మరో మూడేళ్లపాటు వయో పరిమితిని పెంచుతూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్‌రావు గురువారం ఆదేశాలు జారీ చేశారు. నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హత వయసుకు మూడేళ్లు సడలింపు కల్పించినట్టు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోలీస్, ఫైర్, జైళ్ల శాఖలోని ఉద్యోగాలన్నింటికి ఈ సడలింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 9న ఉదయం 8 నుంచి 30వ తేదీ రాత్రి 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి ఇంగ్లిష్, తెలుగు/ఉర్దూ లాంగ్వేజ్ పరీక్షలో స్వల్ప మార్పులు చేసినట్టు తెలిపారు. ఈ సబ్జెక్టు ప్రశ్నల్లో 25 శాతం మార్కులు ఆబ్జెక్టివ్ పద్ధతిలో, మిగిలిన 75 శాతం వివరణ్మాతక ప్రశ్నలుంటాయని తెలిపారు. -
ఆంత్రాక్స్‌పై యాక్షన్ ప్లాన్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యంలో మహమ్మారిలా మారిన ఆంత్రాక్స్ నివారణకు ప్రభుత్వం ఐదేళ్ల సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు వీలుగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖ ఏజెన్సీలో ఏటా ఆంత్రాక్స్ కలకలం రేపుతున్న నేపథ్యంలో పశుసంవర్థక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి ఆమోదం తెలుపుతూ నిధుల విడుదలకు ప్రభుత్వం జీవో నంబరు 21ని జారీచేసింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. పాడేరు కేంద్రంగా ఇతర కార్యక్రమాల అమలుకు ఏటా గిరిజన సంక్షేమ శాఖ నుంచి అవసరమైన నిధులు కేటాయిస్తారు. రాష్ట్రంలో ఆంత్రాక్స్ వ్యాక్సిన్ తయారీ కేంద్రం లేదు. దీంతో వ్యాధి నివారణకు అవసరమయ్యే 3 లక్షల డోస్‌ల ఆంత్రాక్స్ డోస్‌ను సరఫరా చేయాలని పశుసంవర్థకశాఖ జేడీ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పాటు మృత పశువుల బ్యాక్టీరియా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా సరిగా ఖననం చేస్తారు. ఇంకా 500 పశుమిత్రలను ఎంపిక చేసి, శిక్షణ ఇస్తారు. వీరు ఏజెన్సీ 11 మండలాల్లోని 3700 శివారు గ్రామాలను కవర్ చేస్తారు. వీరికి కిట్లను అందజేస్తారు. ఇందుకు రూ.1.48 కోట్లు, గిరిజనులకు గొర్రెలు, మేకల పెంపకానికి రూ.1.72 కోట్లు కేటాయించారు. వ్యాక్సినేషన్ ఇన్సెంటివ్‌లకు రూ.49 లక్షలు, గిరిజనుల్లో అవగాహనకు రూ.15.40 లక్షలు, ప్రచారానికి రూ.25.50 లక్షలు, పశువుల గుర్తింపునకు రూ.1.25 కోట్లు, పశువుల బీమాకు రూ.19.36 కోట్లు వెరసి రూ.25 కోట్లు మంజూరు చేశారు. దీర్ఘకాలిక ప్రణాళిక కింద గోకులంలు, వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు రూ.104 కోట్లు వెచ్చించనున్నారు. -
పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు!
-
పదేళ్లు సడలింపు
సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), గ్రూప్–4, మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ తదితర పోస్టులకు ప్రభుత్వం పదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ శనివారం రాత్రి జారీ చేసిన నోటిఫికేషన్లలో పేర్కొంది. వయోపరిమితి లెక్కింపునకు 2018 జూలై 1వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది. జనరల్ అభ్యర్థులకు సాధారణ గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుకాగా.. తాజా సడలింపుతో 44 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి వర్తిస్తుంది. దీనికి ఆయా రిజర్వేషన్ల మేరకు అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మన్‌లకు మూడేళ్లు, ఎన్సీసీ వారికి మూడేళ్లు, వికలాంగులకు పదేళ్ల మేర అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. అయితే ఆర్టీసీలోని 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం సాధారణ గరిష్ట వయోపరిమితికి, ప్రభుత్వం ఇచ్చిన సడలింపు కలుపుకొని జనరల్ అభ్యర్థులకు 40 ఏళ్లు గరిష్ట వయోపరిమితి ఉంటుందని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. దీనికి అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మన్‌కు మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుందని వెల్లడించింది. మొత్తంగా ఆర్టీసీలోని పోస్టులకు 45 ఏళ్లు దాటినవారు మాత్రం అనర్హులని స్పష్టం చేసింది. -
వయో సడలింపు లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో త్వరలో భర్తీ కానున్న 18 వేల పోస్టులకు సంబంధించి వయో పరిమితి సడలింపుపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి రిక్రూట్మెంట్లో సడలింపునిచ్చిన ప్రభుత్వం.. ఈ సారి నియమకాలకు ఇవ్వకపోవచ్చన్న అభిప్రాయం ఆ శాఖ నుంచి వ్యక్తమవుతోంది. వయో పరిమితి సడలింపు విషయమై ప్రభుత్వానికి రిక్రూట్మెంట్ బోర్డు ప్రతిపాదన పంపి రెండున్నర నెలలు గడిచినా ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. సడలింపు మినహా మిగిలిన అంతర్గత నిబంధనలకు రెండ్రోజుల క్రితమే ప్రభుత్వం జీవోలు జారీ చేసినట్లు బోర్డు అధికారులు చెప్పారు. కాబట్టి నోటిఫికేషన్ జారీ ప్రక్రియ మొదలుపెట్టామని, మరో 10 రోజుల్లో నోటిఫికేషన్ జారీకి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ‘ఇంగ్లిష్, తెలుగు’లకు వెయిటేజీ.. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పోలీస్ శాఖతో పాటు జైళ్లు, అగ్నిమాపక శాఖ పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఫిజికల్ టెస్టుల్లో మార్పులు చేశామని, వాటిపై ఉన్నతాధికారుల కమిటీతో చర్చించి నోటిఫికేషన్లో పేర్కొంటామన్నారు. రిజర్వేషన్ల కేటగిరీలో మార్పులుండవని చెప్పారు. గత నోటిఫికేషన్లో ఇంగ్లిష్‌కు వెయిటేజీ ఇచ్చారని.. ఈసారి తెలుగు, ఇంగ్లిష్ రెండింటికీ వెయిటేజీ ఉంటుందన్నారు. నోటిఫికేషన్ జారీ చేసేలోపు వయోసడలింపుపై జీవో వస్తే చేరుస్తామని, లేదంటే యథావిధిగా నోటిఫికేషన్ జారీ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు. -
ఉపాధికి ఊతం
ఏటూరునాగారం : రాష్ట్రంలోని ఏజెన్సీ మండలాలు, గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే స్థానిక పంటలతో ఆహార వస్తువులను తయారు చేసే యూనిట్లను పెట్టేందుకు ట్రైకార్, గిరిజన సహకార సంస్థ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఉట్నూరు. భద్రాచలం, ఏటూరునాగారం ఐటీడీఏల పరిధిలో అక్కడ ఉన్న గిరిజనులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మినీ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని ప్రణాళికలను సిద్ధం చేయడానికి ట్రైకార్ స్టేట్ మిషన్ మేనేజర్ లక్ష్మీప్రసాద్, జీసీసీ డీజీఎం విజయ్‌కుమార్, ఇతర అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఎక్కువగా లభించే పప్పు ధాన్యాలు, పసుపు, తేనేను ఆసరాగా చేసుకొని అక్కడ ఉన్న ఉప్పత్తులను బట్టి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల పెట్టుబడితో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఏ పంట పండుతుందని అక్కడ ఉన్న హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులతో ట్రైకార్, జీసీసీ అధికారులు సమావేశమై ఇన్‌పుట్స్‌ను సేకరిస్తున్నారు. సమగ్రంగా నివేదికను తయారు చేసి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు అందజేయనున్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోమిర్చి, పసుపు యూనిట్లు ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాంతంలో ఏటా సుమారు 17,500 క్వింటాల మేర మిర్చి ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మిర్చితో కారం పొడిని తయారు చేసి స్థానిక గిరిజన విద్యాసంస్థలకు జీసీసీ ద్వారా సరఫరా చేస్తే బాగుటుందని ప్రణాళికలను రూపొందించారు. దీనిద్వారా స్థానిక గిరిజన ప్రజలకు ఉపాధి లభించే అవకాశం ఉందని, ఆర్థికంగా అభివృద్ధి కూడా చెందుతారని చర్చించారు. కారం పొడిని నాణ్యంగా తయారు చేసి ఈ ఉత్పత్తిని ప్రైవేటు మార్కెట్లోకి జీసీసీ ద్వారా ప్రవేశపెడితే మరింత డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడ జిల్లాలోని ఇల్లందులో జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన కారం, పసుపు యూనిట్లు ఉన్నాయి. దీనిద్వారా మూడు ఐటీడీఏల పరిధిలోని గిరిజన విద్యాసంస్థలు, సహకార సంస్థలకు కారం, పసుపు రవాణా చేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. ఇదే తరహాలో ఐటీడీఏ ప్రాంతాల్లో కూడా ఇలాంటి యూనిట్లు పెట్టి గిరిజన ప్రజలకు ఉపాధి కల్పించాలని గిరిజన సంక్షేమ కమిషనర్ క్రిస్టియానా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో సుమారు ఆరు వేల మంది గిరిజనులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని అధికారులు టార్గెట్లను కూడా రూపొందించారు. ట్రైకార్ ద్వారా గతంలో ఎకానమికల్ సపోర్ట్ స్కీమ్(ఈఎస్ఎస్) కింద 175 రకాల యూనిట్లను అందజేసేవారు. ఇప్పుడు నేరుగా ట్రైకార్ యూనిట్‌ను ఏర్పాటు చేసి గిరిజన మహిళలతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి ఆ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ కొనసాగించాలనే ఉద్దేశంతో అర్హులైన మహిళా సంఘాల జాబితాను కూడా పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పితే గిరిజన ప్రజలకు ఉపాధి లభించి ఆర్థికంగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
ఏజెన్సీలో మావోయిస్టుల బంద్ సంపూర్ణం
చర్ల: ఏజెన్సీలో మావోయిస్టుల బంద్ సంపూర్ణంగా జరిగింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లకు నిరసనగా శుక్రవారం మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉత్కంఠ నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం–వెంకటాపురం మధ్యలో జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టును మావోయిస్టులు గురువారం రాత్రి మందుపాతరలతో పేల్చివేశారు. ఈ సంఘటనతో సమీప ఆర్. కొత్తగూడెం, సత్యనారాయణపురం, కుదు నూరు, కలివేరు, పెద్దిపల్లి, శివలింగాపురం, దానవాయిపేట గ్రామాలకు చెందిన జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన మినహా బంద్ ప్రశాంతంగా జరిగింది. పేల్చివేత ఘటన జరిగిన ప్రాంతానికి అర కిలోమీటరు దూరంలో సీఆర్పీఎఫ్ 151వ బెటాలియన్‌కు చెందిన ఒక క్యాంపు, మరో అర కిలోమీటరు దూరంలో కలివేరులో మరో బేస్ క్యాంపు ఉన్నాయి. బంద్ పాటించాలంటూ పోస్టర్లు పేల్చివేతకు ముందు ఈ ప్రాంతానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో గోగుబాకలో ప్రధాన రహదారిపై, మావోయిస్టులు బంద్ పాటించా లంటూ వాల్‌పోస్టర్లు వేసినట్లు తెలుస్తోంది. మహా రాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు 42 మంది విప్లవకారులకు విషాహారమిచ్చి హత్య చేశారని అందులో పేర్కొ న్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌ను ఖండించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్టుల ఏరివేత పేరు తో ప్రభుత్వాలు చేపట్టిన ఆపరేషన్ సమాధాన్‌ను ఓడించాలంటూ ప్రజలను కోరారు. బ్యాంకులు, పెట్రోల్ బంకులు మూత ఏజెన్సీలో మావోయిస్టుల బంద్ సంపూర్ణంగా జరిగింది. భద్రాద్రి జిల్లా చర్ల, భూపాలపల్లి జిల్లాల్లో వెంకటాపురం, వాజేడు మండలాల్లో సంపూర్ణంగా బంద్ కొనసాగగా, దుమ్ముగూడెం (భద్రాద్రి) మండలంలో పాక్షికంగా జరిగింది. బ్యాంకులు, పెట్రోల్‌బంక్‌లు, హోటళ్లు, సినిమా హాళ్లు మూతబడ్డాయి. దుకాణాలు, మొబైల్ షాపులు తెరుచుకోలేదు. భద్రాచలం–వెంకటాపురం మధ్య ఆర్టీసీ బస్సు లు యథావిధిగా తిరిగాయి. ఆటోలు, ప్రైవేటు వాహనాలు తిరగలేదు. మీ సేవ కేంద్రాలు మూతబడ్డాయి. -
కొత్త జిల్లాలా? పాత జిల్లాలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న పోలీసు పోస్టుల భర్తీపై అయోమయం నెలకొంది. అసలు పోలీసు నోటిఫికేషన్‌కు కొత్త జిల్లాలను ప్రాతిపదికగా తీసుకోవాలా?, పాత జిల్లాల ప్రాతిపదికనా..? అన్న దానిపై సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో 80 శాతం మంది పోలీసు సిబ్బంది ఆర్డర్ టు సర్వ్ కింద పనిచేస్తున్నారు. వారి బదిలీలపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికితోడు కొత్తగా నియామకాల అంశం తెరపైకి వచ్చింది. పాత జిల్లాల పద్ధతికే డిమాండ్.. కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తోంది. పునర్విభజన వల్ల కొత్తగా ఏర్పడిన జిల్లాకు వేల సంఖ్యలో కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని భర్తీ చేసేందుకు ఇప్పుడు ప్రక్రియ మొదలు పెట్టాలని పోలీస్ శాఖ భావిస్తోంది. అయితే ఇక్కడ కానిస్టేబుల్ పోస్టు జిల్లా క్యాడర్ పోస్టు కావడంతో కొత్త జిల్లా పరిధిలోని ఆశావహులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా పాత జిల్లాల హెడ్క్వార్టర్లు, వాటి శివారు ప్రాంతాలు, వాటి కింద రూరల్ ప్రాంతాల్లోని వారు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుం దని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి చేస్తారా? కానిస్టేబుల్ పోస్టులను రాష్ట్ర స్థాయి పోస్టుగా చేస్తే ఎక్కడి వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనిపై పోలీస్ శాఖకు ఇప్పటివరకు స్పష్టత రాలేదని తెలిసింది. అదే విధంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త రేంజ్‌లు కూడా ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని వల్ల పాలన సులభతరం అవడంతో పాటు శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత పటిష్టంగా ఉంటుందని భావిస్తున్నారు. కొత్త రేంజ్‌లు ఏర్పాటు తప్పనిసరి అయితే కానిస్టేబుల్ పోస్టును రాష్ట్ర స్థాయి పోస్టుగా గుర్తించి వారి బదిలీలు, పోస్టింగులు రేంజ్‌ల పరిధిలోనే ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ రెండు అంశాలపై స్పష్టత వస్తే ఇక జిల్లాల వారీగా నోటిఫికేషన్ అనే వాదన అవసరం లేదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నియామక ప్రక్రియ మారుస్తారా? 2015లో నూతన నియామక ప్రక్రియను పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ముందుగా ప్రిలిమ్స్ నిర్వహించి తదనంతరం ఈవెంట్స్, తుది దశలో ఎంపికైన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. అయితే ఇందులో ఈవెంట్స్‌పై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో నియామక ప్రక్రియను మార్చేందుకు రిక్రూట్మెంట్ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ నియామక ప్రక్రియను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. 1,600 మీటర్ల(మైలు) పరుగు పందెం పెట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 800 మీటర్ల పరుగు పందెం ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. వయోసడలింపుపై ప్రతిపాదన.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత నోటిఫికేషన్‌కు ప్రభుత్వం వయోసడలింపు కల్పించింది. ఓపెన్ కేటగిరీకి మూడేళ్లు, రిజర్వేషన్ కేటగిరీలకు ఐదేళ్ల చొప్పున సడలింపు కల్పించింది. ఈసారి కూడా వయోసడలింపు కల్పించాలని కొందరు నిరుద్యోగులు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోలీస్ శాఖ నుంచి కూడా వయోసడలింపునకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే యోచన ఉన్నట్టు సమాచారం. మరోవైపు గతంలో రిజర్వేషన్ల అమలుపై పొరపాట్లు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది -
గంజాయ్.. ఎంజాయ్
పినపాక : ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంతంగా ఉండాల్సిన గ్రామాలు గంజాయి మత్తులో ఊగుతూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. జిల్లాలో రోజురోజుకు పరిశ్రమల నిర్మాణాలు పెరుగుతుండడంతో వాటి పనులు చేసేందుకు పలు రాష్ట్రాల నుంచి కూలీలు వలస వస్తున్నారు. కాగా ఆయా ప్రాంతాల్లో గంజాయికి అలవాటు పడిన కార్మికులు.. ఇక్కడ కూడా వారు పని చేసే ప్రాంతాల్లో గంజాయి వినియోగానికి మార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్న మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, టేకులపల్లి ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా పినపాక నియోజకవర్గంలో భద్రాద్రి పవర్‌ప్లాంట్, సీతారామ, మిషన్ భగీరథ ప్రాజెక్టులు నిర్మించే ప్రాంతాలతో పాటు అశ్వాపురం మండల కేంద్రం, ఐటీసీ పరిశ్రమ ఉన్న సారపాక, భద్రాచలం తదితర ఏరియాల్లో గంజాయి వాడకం పెరుగుతోంది. వారం రోజుల వ్యవధిలోనే బూర్గంపాడు మండలంలో రెండు సార్లు గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేసి, ఇంట్లో నిల్వ చేసిన గంజాయిని పట్టుకోవడం గమనార్హం. పారిశ్రామిక ప్రాంతాలే ప్రధాన అడ్డాలు... జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలే ప్రధాన అడ్డాలుగా గంజాయి వ్యవహారం సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుని గంజాయి అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం. భద్రాద్రి, పాల్వంచ పవర్ ప్లాంట్ విస్తరణ పనుల్లో పాల్గొనేందుకు ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కార్మికులు వేల సంఖ్యలో వచ్చి మణుగూరు, పాల్వంచ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు తెలిసింది. చింతూరు, భద్రాచలం మీదుగా పాల్వంచకు తరలిస్తుండగా, అక్కడి నుంచి భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం నుంచి పినపాక మండలానికి రవాణా చేస్తున్నట్లు సమాచారం. బానిసవుతున్న యువకులు... గంజాయి అమ్మకాలు ఎక్కువ కావడంతో జిల్లాలోని విద్యార్థులు, యవకులు, కార్మికులు బానిసలుగా మారుతున్నారు. గ్రామాల్లోకే గంజాయి అందుబాటులోకి వస్తుండటంతో యువకులు గంజాయి పీల్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. వలస కార్మికులే లక్ష్యంగా రవాణా చేస్తున్నప్పటికీ.. స్థానిక విద్యార్థులు, యువకులు కూడా ఈ మత్తుకు అలవాటుపడుతున్నారు. అన్ని ధరల్లో ప్యాకెట్లు లభ్యం... ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉండే కొందరిని ఎంచుకొని వారికి కొంత కమీషన్ ఇస్తూ గంజాయి రవాణా, అమ్మకాలు సాగుతున్నాయి. భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణ ప్రాంతాల్లో గల లేబర్ కాలనీల్లో, పాల్వంచ పవర్‌ప్లాంట్ విస్తరణ పనులు చేస్తున్న కాలనీల్లో గుట్కా ప్యాకెట్లలో పెట్టి గంజాయిని హోటళ్లు, కిరాణా దుకాణాల్లోనూ విక్రయిస్తున్నారు. ఖైనీ ప్యాకెట్ల రూపంలో గంజాయిని ప్యాక్ చేసి అమ్ముతున్నారు. రూ.20, 30, 60, 120, 200, 300, 500 ఇలా అన్ని ధరల్లో అందుబాటులో ఉండేలా ప్యాకెట్లు తయారుచేసి విక్రయిస్తున్నారు. ఏటూరునాగారం నుంచి మణుగూరు, పినపాకకు, భద్రాచలం నుంచి పాల్వంచ, సారపాకకు వారానికి ఒకసారి ఆటోల ద్వారా గంజాయి తరలిస్తున్నారు. కాగా ఈ అమ్మకాలు రోజువారీగా గ్రామాల్లో సాగుతున్నా సంబంధిత అధికారులు నిఘా ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా యి. దీనిపై మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబాను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ సి.నర్సింహారెడ్డిని వివరణ కోరగా గంజాయి రవాణాపై రెండు నెలలుగా నిఘా పెట్టామని చెప్పారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రవాణాను అరికడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వివరించారు. -
పాస్ పుస్తకాల టెండర్లలో గోల్మాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ భూములకిచ్చే పాస్‌పుస్తకాల ముద్రణ టెండర్లలో గోల్మాల్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా కనీసం సాంకేతిక బిడ్‌లో అర్హత కూడా సాధించని ఏజెన్సీలకు, ఏపీ ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టిన ఏజెన్సీకి ముద్రణ బాధ్యతలివ్వడం విమర్శలకు తావిస్తోంది. అత్యంత పకడ్బందీగా, సెక్యూరిటీ ఫీచర్లతో ఇవ్వాల్సిన పాస్ పుస్తకాల ముద్రణకు టెండర్లను ఇటు అర్హత, అటు అనుభవమూ లేని కంపెనీలకు ఇష్టారాజ్యంగా కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఎడాపెడా కట్టబెట్టారు రాష్ట్రంలో 65 లక్షల కమతాలకు పాస్ పుస్తకాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రెండుసార్లు టెండర్లు పిలిచినా ఏ కంపెనీ ముందుకు రాకపోవడంతో నామినేషన్ విధానంలో కేంద్ర అధీనంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌కు బాధ్యతలిచ్చింది. అయితే అన్ని లక్షల పుస్తకాలను తాము హడావుడిగా ముద్రించలేమని, ఏప్రిల్ నెలాఖరుకల్లా వీలవుతుందని ప్రెస్ అధికారులు చెప్పడంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. మళ్లీ టెండర్లు పిలవగా 9 ఏజెన్సీలు టెండర్లు వేశాయి. వీటి ఖరారులో నిబంధనలను పాటించలేదనే ఆరోపణలొస్తున్నాయి. 9 టెండర్లు వస్తే అందులో 8 ఏజెన్సీలకు ముద్రణ బాధ్యతలివ్వడం గమనార్హం! టెండర్ నిబంధనల ప్రకారం ఎల్1 ఏజెన్సీకి 50 శాతం ముద్రణ బాధ్యతలివ్వాలి. మిగతా 50 శాతం పుస్తకాలను 20:20:10 నిష్పత్తిలో మరో మూడు ఏజెన్సీలకు ఎల్1 కోట్ చేసిన ధరకే ఇవ్వాలి. కానీ ఎల్1గా వచ్చిన మద్రాస్ సెక్యూరిటీ ప్రింటర్స్‌కు కేవలం 10.70 లక్షల (15 శాతం) పుస్తకాల ముద్రణ అప్పగించారు! పైగా సాంకేతిక బిడ్‌లో అర్హత పొందని వాటికీ టెండర్ ఖరారు చేశారు. అంతేగాక మీసేవల విషయంలో ఏపీ బ్లాక్‌లిస్టులో పెట్టిన మరో ఏజెన్సీని పట్టించుకోకుండా ఎంపిక చేశారు! పైగా దానికి ఎల్1తో సమానంగా పుస్తకాల ముద్రణ బాధ్యతలిచ్చారు! సాంకేతిక బిడ్‌లో బోర్లా పడ్డ మరో ఏజెన్సీకి ఓ మంత్రి, మరో ఎమ్మెల్సీ సిఫార్సుతో ఒక జిల్లాలోని 1.5 లక్షల పుస్తకాల ముద్రణ అప్పగించారు. ఇలా 8 ఏజెన్సీలకు పాస్ పుస్తకాల ముద్రణ అప్పగించి, ఏ జిల్లాలో పుస్తకాలను ఎవరు ముద్రించాలో జాబితా తయారు చేశారు. మంగళవారం నుంచే ముద్రణ మొదలైనట్టు తెలుస్తోంది. ‘సెక్యూరిటీ’ ప్రధానం కాదట! ఇదిలా ఉంటే, పాస్ పుస్తకాల ముద్రణ బాధ్యతల నుంచి తామెందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే దానిపై కేంద్ర అధీనంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ముందుగా అనుకున్న ధరకు కాకుండా ఒక్కో పుస్తకానికి రూ.250 అడిగినందుకు ఒప్పందం రద్దు చేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. కానీ, సెక్యూరిటీ విషయంలో రాజీ పడకూడదనే ఆలోచనతోనే ముద్రణ బాధ్యతల నుంచి తాము తప్పుకున్నామని ప్రెస్ జనరల్ మేనేజర్ రమాకాంత్ దీక్షిత్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి మార్చి 24న ఆయన లేఖ కూడా రాశారు. అంతేకాదు, ‘‘పాస్ పుస్తకాల ముద్రణలో మాకు సెక్యూరిటీ ప్రధానం కాదు. అవసరమైతే కొన్ని సెక్యూరిటీ ఫీచర్లను తగ్గించుకుని వీలైనంత త్వరగా పుస్తకాలను మాకు అందుబాటులోకి తెండి’’ అని ఫిబ్రవరి 22న జరిగిన సమావేశంలో టీఎస్టీఎస్ ఎండీ చెప్పారంటూ ఆ లేఖలో ఆయన పేర్కొనడం గమనార్హం!! -
ఏజెన్సీలో ఉగ్రమూలాలు!
మణుగూరు : మావోయిస్టు æప్రభావిత ప్రాంతంగా పేరున్న మణుగూరు సబ్ డివిజన్లో గత సంవత్సర కాలంలో ఉగ్రవాద మూలాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఈ ప్రాంత వాసులకు పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు కేంద్ర, రాష్ట్ర పోలీసులు గుర్తించడం గమనార్హం. ఈనెల 12న రాత్రి జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందినట్లు కేంద్ర పోలీసులు ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గుగూ తమ సంస్థకు చెందిన వారేనని అన్సార్ గజ్వతుల్ హింద్(ఏజీòహెచ్) అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కాగా, ఈ ముగ్గురిలో ఒకరు అశ్వాపురానికి చెందిన యువకుడు మహ్మద్ తౌఫిక్(27) కావడంతో జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. ఈ వార్త మణుగూరు సబ్‌డివిజన్‌లో సంచలనం రేకెత్తించింది. తౌఫిక్ అశ్వాపురంలోని భారజల కర్మాగార ఉద్యోగి రజాక్ చిన్న కుమారుడిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో యువత ఉగ్రవాద భావాలపై మొగ్గు చూపుతున్నట్లు మరోసారి రుజువైంది. సబ్‌డివిజన్‌లో పెరుగుతున్న ఉగ్రభావాలు మణుగూరు సబ్ డివిజన్లో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, పరిచయాలు ఎక్కువగా కలిగిన వ్యక్తులు క్రమంగా పెరుగుతున్నట్లు సమాచారం. 5 నెలల క్రితం మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్న సోమేశ్వరరావు అనే మత ప్రవక్తను హైదరాబాద్ పోలీసులు రామానుజవరం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. తీవ్రవాదిగా మారిన యువకుడు... మహ్మద్ తౌఫిక్ హెవీ వాటర్‌ప్లాంట్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. డిప్లొమా చదివేందుకు వనపర్తి వెళ్లి.. మధ్యలోనే చదువు మానేసి వచ్చాడు. ఆ తర్వాత అశ్వాపురంలోనే ఉంటూ దొంగతనాలు చేస్తూ 2009లో పోలీసులకు పట్టుబడ్డాడు. తర్వాత కాలనీలో ఆకతాయిలతో కలిసి పలు అల్లర్లకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. 2016 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ అక్కడే చదువుకుంటున్నట్లు తల్లిదండ్రులను నమ్మించాడు. ఈ క్రమంలో తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పడ్డాయి. కాగా, తౌఫిక్ అన్సార్ గజ్వతుల్ హింద్ అనే తీవ్రవాద సంస్థలో కీలకంగా పనిచేశాడని ఎన్కౌంటర్ అనంతరం వెలుగులోకి వచ్చింది. తన కొడుకు సమాజంలో పరువుపోయే పని చేశాడని, వాడి శవం కూడా తనకు వద్దని మృతుని తండ్రి రజాక్ ‘సాక్షి’కి తెలిపారు. మణుగూరు సబ్‌డివిజన్‌పై పెరిగిన నిఘా తీవ్రవాద భావాలు గల వ్యక్తులు మణుగూరు సబ్ డివిజన్లో పెరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ పోలీసులు ఇక్కడి తీవ్రవాద మూలాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మహ్మద్ తౌఫిక్ కదలికలపై ముందుగానే సమాచారం తెలుసుకొని అతనిపై నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అతడి ఆచూకీ కోసం 3 నెలల క్రితం కేంద్ర ఇంటెలిజెన్స్ పోలీసులు అశ్వాపురం హెవీవాటర్ ప్లాంట్‌లో, సెక్యూరిటీలో, అశ్వాపురం పట్టణలో పలు వివరాలు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. తౌఫిక్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులు, స్నేహితులు, అతనితో కలిసి సోషల్ మీడియాలో భావాలు పంచుకున్న వ్యక్తులపై కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ పోలీసులు, రాష్ట్ర పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అశ్వాపురం, మణుగూరు ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశారు. ఇలా చేస్తాడని ఊహించలేదు : మహ్మద్ రజాక్, తౌఫిక్ తండ్రి తౌఫీక్ మృతిపై అతడి తండ్రి రజాక్‌ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా తన కుమారుడు ఇలా చేస్తాడని అనుకోలేదని అన్నారు. హైదరాబాద్‌లో ప్రైవేటు జాబ్ చేస్తున్నానని చెప్పాడని, వ్యాపారం చేస్తానంటూ ఆరు నెలల క్రితం రూ.30,000 తీసుకెళ్లాడని తెలిపారు. తన కుమారుడు ఇలా చేస్తాడని ఊహించలేదన్నారు. అతడి మృతదేహానికి తనకు ఏ సంబంధం లేదని చెప్పారు. -
సరిహద్దులో టెన్షన్.. టెన్షన్..
వాజేడు: ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం నెలకొంది. నాలుగు రోజుల క్రితం చర్ల, వెంకటాపురం సమీపంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని తడపలగుట్ట వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్యన జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతిచెందిన విషయం తెలిసిందే. మావోయిస్టులకు తీవ్ర నష్టం జరగడంతో ఆ పార్టీ ప్రతీకార చర్యలకు పూనుకోవచ్చని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ కూడా టీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీంతో పోలీసులు సరిహద్దులో ముమ్మర తనిఖీలను నిర్వహిస్తున్నారు. వాజేడు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ మండల పరిధిలోని గుమ్మడిదొడ్డి వద్ద, పేరూరు ఎస్సై స్వామి చండ్రుపట్ల క్రాస్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం పెద్దఎత్తున తనిఖీలు చేపట్టారు. వాహనాలను, అందులోని వస్తువులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొత్త వ్యక్తులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడంతోపాటు అపరిచిత వ్యక్తులు, కొత్తవ్యక్తుల సంచారం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. దీనికితోడు ఉన్నతాధికారుల ఆదేశానుసారం టీఆర్ఎస్ నాయకులతోపాటు ప్రజాప్రతినిధులను పోలీసులు ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిసింది. కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు తరలివెళ్లారు. ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
కన్ను మూస్తున్నా..కళ్లు తెరవరేం..
రంపచోడవరం: ఏజెన్సీలో పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా రంపచోడవరం ఐటీడీఏ మొద్దు నిద్ర వదలడం లేదు. ప్రతిరోజూ వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. శుక్రవారం సైతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వచ్చిన మారేడుమిల్లి మండలం శ్రీపురానికి చెందిన తొమ్మిది నెలల మడకం వెంకన్నదొర విగతజీవిగా మారాడు. ప్రాణాలు పోయిన పసివాడి తల్లిదండ్రులు కన్నీటితో తల్లడిల్లినా ఐటీడీఏ అధికారులు కనీసం కన్నెత్తి చూడలేదు. మూడు రోజులు నుంచి అనారోగ్యంతో.. మారేడుమిల్లి మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మడకం పండుదొర, రాజమణిల తొమ్మిది నెలల కుమారుడు వెంకన్నదొర మూడు రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్నాడు. స్థానిక వాడపల్లిలో జరిగే సంతలో ఆర్ఎంపీ వైద్యం చేయించారు. ఫలితం లేకపోవడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చిన తరువాత వైద్య సేవలు అందేలోపే మృతి చెందాడు. దీంతో తండ్రి బాలుడు మృతదేహాన్ని భుజంపై వేసుకుని తమ ఊరుకు వెళ్లే ఆటో స్టాండ్‌కు చేరుకున్నాడు. అయితే ఇక్కడ గ్రామస్థాయిలో ప్రభుత్వ వైద్య సేవలు సక్రమంగా లేకపోవడంతో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. పిల్లల ఆరోగ్యంపై కానరాని శ్రద్ధ గత ఏడాది రాజవొమ్మంగి, గంగవరం మండలాల్లో గిరిజన చిన్నారులు అనేక మంది మృత్యువాత పడినా ఐటీడీఏ నేటికీ సరైన కార్యచరణ ప్రణాళిక రూపొందిచలేదు. పౌష్టికాహారం అందించి చిన్నారుల ఆరోగ్యం మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోలేదు. గిరిజన చిన్నారులుకు పౌష్టికాహారమే ప్రధాన శుత్రువుగా మారింది. -
మన్యం మనగలిగేనా
తూర్పుగోదావరి, రంపచోడవరం: పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న జిల్లా ఈ ఏడాదీ ఆ స్థానాన్ని పదిలం చేసుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తోంది. కానీ ఏజెన్సీలో పరిస్థితి ఆ స్థాయిలో లేదు. అక్కడి విద్యా వ్యవస్థ తీరు పరిశీలిస్తే గత ఏడాది ఏజెన్సీలో 91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఆ స్థాయి ఉత్తీర్ణతకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఉంది. రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో నాలుగు రకాల యాజమాన్యాలకు చెందిన 73 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 11 మండలాల పరిధిలో జెడ్పీ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 3647 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరిలో సగం మంది సి, డి గ్రేడుల్లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా అన్ని యాజమాన్య పాఠశాలల్లో దాదాపు 44 శాతం మంది పదో తరగతి విద్యార్థులు చదువులో బాగా వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో పదో తరగతి ఉత్తీర్ణత శాతం పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఏడాది జిల్లా ఉత్తీర్ణత శాతం కంటే తక్కువగా ఉన్న ఏజెన్సీ ఫలితాలు ఈ విద్య సంవత్సరంలోనైనా మెరుగు పరిచేందుకు ఐటీడీఏ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు ఎలా సమాయత్తం అవుతున్నారో అనే దానిపై పాఠశాల స్థాయిలో ఐటీడీఏ విద్యా శాఖ ఎలాంటి సమీక్షా నిర్వహించలేదు. రంపచోడవరం ఐటీడీఏ ఏజెన్సీ విద్యాఖాధికారి పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్నప్పటికీ అటు గిరిజన సంక్షేమ శాఖ కానీ, ఇటు విద్యా శాఖ కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక అంతా పరీక్ష కాలమే.. పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 24 నుంచి మార్చి 8వ తేదీ వరకూ ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం మార్చి 15 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతాయి. అన్ని యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. వారిని పరీక్షలకు సిద్ధం చేసేందుకు సమయమూ లేదు. మెటీరియల్ సరఫరా చేశాం ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ సరఫరా చేశాం. రెండు మార్కులు, ఒక మార్కు, మ్యాప్ పాయింటింగ్, సైన్సు డ్రాయింగ్‌పై ఎక్కువ శ్రద్ధ చూపేందుకు చర్యలు తీసుకున్నాం. సబ్జెక్టు రివిజన్ ప్రారంభమైంది. టెస్ట్‌లు పెడుతున్నారు. నూరు శాతం ఫలితాల కోసం కృషి చేస్తున్నాం. – సరస్వతి, జిల్లా గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ -
కోర్టు ఉద్యోగాలకు అభ్యర్థుల కొరత
నల్లగొండ : కోర్టు ఉద్యోగాల్లో కోలాహలం మొదలయ్యింది. అవుట్ సోర్సింగ్ కింద ఉమ్మడి జిల్లాకు 175 పోస్టులు మంజూరయ్యాయి. అటెండర్ 119, జూనియర్ అసిస్టెంట్ (టైపిస్ట్) 39, స్టెనో పోస్టులు 17 కలిపి మొత్తం 175 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని న్యాయ స్థానాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అవుట్ సోర్సింగ్ కింద భర్తీ చేసేందుకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసే అధికారాన్ని జిల్లాలోని త్రిసభ్య కమిటీకి అప్పగించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల మాటెత్తగానే ముందుగా బేరసారాలతోనే రంగంలోకి దిగే ఏజెన్సీలకు చెక్ పెట్టేందుకు అధికారులు ఈసారి కొత్త పద్ధతి పాటించారు. కలెక్టర్ ఎంపానల్మెంట్ చేసిన 14 ఏజెన్సీలనే న్యాయాధికారులు ఎంపిక చేశారు. ఈ 14 ఏజెన్సీలు..ఒక్కో ఏజెన్సీ 175 మంది అర్హులైన అభ్యర్థులతో జాబితా సమర్పించాలని సూచించారు. దీంతో ఒక్కో ఏజెన్సీ 175 మంది చొప్పున 14 ఏజెన్సీలు 2,450 దరఖాస్తులను సోమవారం జిల్లా కోర్టు అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. అభ్యర్థుల కొసం కొత్త ఉద్యోగాల ప్రకటన జారీ చేసే అవకాశాన్ని ఏజెన్సీలకు ఇవ్వలేదు. ఏజెన్సీల వద్ద పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల దరఖాస్తులనే సమర్పించాలని అధికారులు సూచించారని ఏజెన్సీలు తెలిపాయి. అయితే దీంట్లో ఎన్ని ఏజెన్సీలు పారదర్శకంగా వ్యవహారించాయనే దానిపైనే అనుమానాలు తలెత్తున్నాయి. అంతా పారదర్శకమేనా..! కోర్టుల్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ సారి అలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే 14 ఏజెన్సీల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారుల ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఎంపిక చేసిన 14 ఏజెన్సీల్లో కొన్ని ఏజెన్సీలు గతంలో నిరుద్యోగులను నట్టేట ముచ్చినవే. కానీ ఇప్పుడలా కాకుండా కేవలం దరఖాస్తులు పంపడం వరకే ఏజెన్సీలను పరిమితం చేశారు. ఎంపిక చేసే అధికారం త్రిసభ్య కమిటీ సభ్యులదే. ఈ ఎంపిక విధానం ఎట్లా ఉంటుదనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏజెన్సీల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఒక్కో పోస్టుకు 1ః3 ప్రకారం మెరిట్ జాబితా తయారు చేస్తారని అంటున్నారు. మరోవైపు రాతపరీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల కొరత.. అటెండర్ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉందని ఏజెన్సీలు తెలిపాయి. స్టెనో, టైపిస్ట్ పోస్టులకు అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉందన్నారు. దీంతో ఆ పోస్టులకు దరఖాస్తులు స్వల్పంగానే వచ్చాయని తెలిపారు. అయితే అటెండర్ పోస్టులకు పదో తరగతి అర్హతతో పాటు, అదనంగా స్కిల్ వర్కర్ నిబంధన కూడా జోడించారు. దీన్ని ముందుగానే పసిగట్టిన కొన్ని ఏజెన్సీలు అభ్యర్థులతో లోపాయికారిక ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఉద్యోగం వస్తే మొదటి నాలుగు మాసాల వేతనం ఏజెన్సీకి ఇవ్వాలనే ఒప్పందం ఒకటికాగా..డిపాజిట్ల రూపంలో ముందుగానే ఏజెన్సీలు తమ నుంచి డబ్బులు వసూలు చేశారని నిరుద్యోగులు చెబుతున్నారు. ఒకవేళ ఉద్యోగం రాకుంటే తిరిగి డబ్బులు వాపస్ ఇచ్చేలా మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కోర్టు ఉద్యోగాలు మరోసారి వివాదస్పదం కాకుండా అధికారులు పాటించిన కొత్త విధానం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే. -
మన్యంలో దాహం..దాహం!
వేసవి ప్రారంభానికి ముందే మన్యంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. నీటి వనరులు రోజురోజుకూ అడుగంటుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్ముం దు ఎలా ఉంటుందోనని కలవరపడుతున్నారు. వివిధ గ్రామాలకు నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ఊట బావుల్లో కొన్ని ఇప్పటికే అడుగంటాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో 150కి పైగా గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ప్రమాదం పొంచిఉందని గిరి పుత్రులు చెబుతుండగా.. మండువేసవిలో కూడా నీటి సమస్య లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అధికారులంటున్నారు. సీతంపేట: రానున్న వేసవిలో ఏజెన్సీ గ్రామాల వాసులకు నీటి కష్టాలు వెంటాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల గిరిజనులు గుక్కెడు నీటి కోసం ఆపసోపాలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఊటబావులు (గ్రావిటేషన్ ఫ్లో) అడుగంటడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కురసింగి, బర్నగూడ, ఎగువదరబ, గుడ్డిమీదగూడ, మండదీసరిగూడ తదితర గ్రామాల్లో ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రత పెరిగితే ఎగువ లోవగూడ, గాలికుప్పగూడ, దబరగూడ, రామానగరం, చింతలగూడ, నాయుడుగూడ, పెద్దగూడ, వెంకటిగూడ, పెద్దగూడ, కారిమానుగూడ, చింతమానుకాలనీ, జగ్గడుగూడ తదితర గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీపీఎంయూ మండలాలైన భామిని, మందస, మెళియాపుట్టి, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు తదితర మండలాల్లోని గిరిజన గ్రామాల్లో కూడా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే సూచనలున్నాయి. నీటి కొరతను ఎదుర్కొంటున్నామని ఇప్పటికే గిరిజన దర్బార్‌లో పలువురు వినతులు అందించారు. 150 గ్రామాలపైనే... ఐటీడీఏ పరిధిలోని 20 మండలాల్లో 1250కి పైగా గ్రామాలుండగా.. వీటిలో సగానికి పైగా కొండపైనే ఉన్నాయి. 4 వేలకు పైగా బోర్లు, 2 వేల బావులు, 200 గ్రావిటేషన్ ఫ్లో (ఊటబావుల ట్యాంకులు), 250 వరకూ రక్షిత పథకాలతోపాటు 48 సోలార్ రక్షిత పథకాలు ఉన్నాయి. వీటిలో చాలా నీటి వనరులు ఇప్పటికే అడుగంటడంతో ప్రస్తుతం వీరంతా గెడల్డపై ఆధారపడుతున్నారు. మరికొద్దిగా ఎండలు తీవ్రమైతే 150కు పైగా గ్రామాల్లో నీటి కష్టాలు ప్రజలను వెంటాడే అవకాశాలున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో రావాల్సిన నీటి ఎద్దడి ఇప్పటినుంచే ఆరంభమవ్వడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఎత్తైన కొండలపై ఉన్న గ్రామాల గిరిజనులు గుక్కెడు నీటికోసం తహతహ లాడుతున్నారు. కారణం ఆయా గ్రామాలకు బోర్లు వేయడానికి రిగ్గులు వెళ్లకపోవడం, ఏదో ఒకలా వెళ్లినా నీరు పడక పోవడం, నీటి ఊటలు అడుగంటడం వంటి కారణాలతో నీటి ఎద్దడి ఉంటుంది. నీరు లభ్యంకాక.. ఊటగెడ్డల్లోని కలుషిత జలాలను గిరిజనులు తెచ్చుకొని వ్యాధులబారిన పడిన సందర్భాలు గతంలో చోటుచేసుకున్నాయి. ఈసారి ముందే జల వనరులు అడుగంటుతుండడంతో గిరిజనులు పరిస్థితిని చూసి బెంబేలెత్తిపోతున్నారు. వేసవికి ముందే నీటి ఎద్దడి ప్రారంభం కావడానికి ఈ సంవత్సరం మన్యంలో సరైన వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటడమే కారణంగా అధికారులు విశ్లేషిస్తున్నారు. -
ఏజెన్సీలో గంజాయి గుస్సా!
ఏజెన్సీలో అమాయక గిరిజనులు విష సంస్కృతికి అలవాటుపడుతున్నారా...అంటే! అవుననే సమాధానం వస్తోంది. గంజాయి మత్తులో తమకు తెలియని పోకడలకు అలవాటుపడుతున్నట్టు పెద్దలు ఆందోళన చెందుతున్నారు. బెట్టింగ్, పేకాట, మద్యానికి ఏజెన్సీ యువత బానిసలై చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారా? అంటే అవుననే సమాధానం చెప్పాలి. కురుపాం: ప్రశాంతమైన ఏజెన్సీలో యువత పెడమార్గాన పయనిస్తూ కొద్ది నెలలుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆందోళన వ్యక్తమవుతోంది. కురుపాం పరిసర గ్రామాల్లో గిరిజన యువత గంజాయి, పేకాట, మద్యం మత్తులో తూగుతున్నట్టు ఏజెన్సీ ప్రాంత పెద్దలు ఆందోళన చెందుతున్నారు. వీరికి ఒడిశా ప్రాంతం నుంచి గంజాయిని కొందరు సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఈ మత్తుకు యువత ఎక్కువగానే అలవాటుపడ్డట్టు తెలుస్తుంది. స్థానిక కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు సైతం గంజాయికి అలవాటు పడినట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. క్రికెట్ బెట్టింగ్, పేకాట వైపు కూడా వీరి చూపు మరలుతున్నట్టు పలువురు పేర్కొంటున్నారు. ఈ చెడు వ్యసనాల నేపథ్యంలోనే చిల్లర దొంగతనాలకు సైతం అలవాటు పడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. వరుస దొంగతనాలతో బేజారు... ఇటీవల నాలుగు నెలల కిందట అఫీషియల్ కాలనీలో ఓ గృహిణి చేతిగాజులు మెరుగుపెడతామని చెప్పి గాజులతో ఓ వ్యక్తి ఉడాయించాడు. మూడు నెలల కిందట శివ్వన్నపేటకు చెందిన ఓ వృద్ధురాలు పూలను ఏరేందుకు వెళ్లగా ఆమె చెవిలో బంగారు దుదుద్లను ఓ యువకుడు తెంపేసి పారిపోయాడు. తాజాగా మూడు రోజుల కిందట కేజీబీవీలో ఉద్యోగం చేస్తున్న మరో మహిళ విధులకు ఒంటరిగా వెళ్తుండగా కురుపాం ఆస్పత్రి సమీపంలో ఆమె కంట్లో కారం చల్లి పుస్తెలతాడును లాక్కొని పారిపోయాడు. ఇలా వరుస సంఘటనలు చోటు చేసుకుంటుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇటువంటి సంఘటనలు తామెరుగమని యువతే చెడుమార్గం పట్టి ఇలా చేస్తున్నారన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో పోలీసులు చొరవ తీసుకొని వీటికి అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. లేకుంటే ప్రమాదమేనని పేర్కొంటున్నారు. -
ఐసీయూ అలంకారప్రాయం..
ఉట్నూర్(ఖానాపూర్) : ఏజెన్సీ గిరిజనులకు అత్యవసర వైద్యం అంద ని ద్రాక్షగానే మిగిలింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు లక్ష్మారెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి గత నెల 21న ఉట్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అట్ట హాసంగా ప్రారంభిం చిన ఐసీయూ, డయాలసిస్ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని ఆశపడ్డ ఏజెన్సీవాసులకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా ఐసీయూ, డయాలసిస్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిన ఏంబీబీఎస్లను నియమించినట్లు తెలిసింది. గిరిజనులకు వైద్య సౌకర్యాల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వైద్య సేవలు అందించే వైద్యాధికారులపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా అత్యధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నా గిరిజనులకు మెరుగైన వైద్యం అందడం లేదు. ఐసీయూలో ఎంబీబీఎస్‌లే దిక్కు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సదుపాయాలు మరింత చెరువ చేసేందుకు ప్రభుత్వం తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద్వారా ఏప్రిల్‌లో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యునిట్)ను రూ. 22 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసింది. ఐసీయూలో విధులు నిర్వహించేందుకు యూనిట్ హెడ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(అనస్థీషియా), ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (జనరల్ మెడిసిన్), ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (పాల్మనరీ మెడిసిన్)లను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు ఆరుగురు స్టాఫ్ నర్సులు, ఒక్కొక్కరి చొప్పున ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలాజీ టెక్నీషీయన్, వెంటిలేటర్ టెక్నీషియన్, ఎనిమిది మంది ఎమ్ఎన్వో, ఏఫ్ఎన్వోలు, మూగ్గురు సెక్యూరిటీ గార్డులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేలా చర్యలు చేపట్టింది. ఐసీయూ కేంద్రంలో సెంట్రలైజ్డ్ ఏసీ సౌకర్యం, సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టం ఏర్పాటు చేశారు. పది పడకల సామర్థ్యం గల యూనిట్ ఆస్పత్రి పర్యవేక్షకుడికి సంబంధం లేకుండా పూర్తిగా స్వయం ప్రతిపత్తి యూనిట్లుగా ఇన్చార్జీల పర్యవేక్షణలో ఉండేలా జాతీయ ఆరోగ్య మిషన్ చర్యలు చేపట్టింది. అయితే ఉట్నూర్ ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉన్నతాధికారుల సూచనలతో ఐదుగురు ఏంబీబీఎస్ వైద్యాధికారులను ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేలా నియమించినట్లు ఆస్పత్రి సుపరింటెండెంట్ పేర్కొంటున్నారు. అత్యవసర వైద్య సేవలు ప్రత్యేక వైద్యాధికారుల పర్యవేక్షణలో నిర్వహణ సాగితే మేలు జరుగుతుంది తప్ప ఎంబీబీఎస్ వైద్యులు నిర్వహణ కొనసాగిస్తే ప్రయోజనం ఉండదని గిరిజనులు వాపోతున్నారు. నెప్రాలజీ లేక.. కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తశుద్ధి కోసం ప్రభుత్వం సామాజిక ఆరోగ్య కేం ద్రంలో ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేసింది. ఒకేసారి ఐదుగురు బాధితులకు రక్తశుద్ధి చేసేలా ఐదు డయాలసిస్ యునిట్లు ఏర్పాటు చేసి కేంద్రం నిర్వహణ బాధ్యతలను ‘డీమెడ్’ అనే సంస్థకు అప్పగించింది. డయాలసిస్ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ఇద్దరు టెక్నికల్ అధికారులు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు ఉన్నప్పటికీ డయాలసిస్ సమయంలో బాధితులను అన్ని విధాలా పర్యవేక్షించే అతి ముఖ్యమైన వైద్యాధికారి నెప్రాలజిస్ట్ లేక పోవడంతో కేంద్రం అలంకారప్రాయంగా మారింది. కీడ్నీ బాధితులకు డయాలసిస్ చేసేటప్పుడు అత్యవసరంగా రక్తం అవసరం పడుతుంది. కానీ సామాజిక ఆరోగ్య కేం ద్రంలో ఉన్న బ్లడ్ బ్యాంక్ ఎప్పుడో మూలకు పడింది. కొత్తగా నిర్మిస్తున్న భవనంలో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నా అది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో బాధితులకు ఎలా డయాలసిస్ నిర్వహిస్తారో అధికారులకే తెలియాలి. ప్రత్యేక వైద్యాధికారులను నియమించి వైద్యం అందించాలని ఏజెన్సీ గిరిజనులు కోరుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో సేవలు.. సీహెచ్‌సీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులు ఎవరూ ముందుకు రాక ఉన్నతాధికారులు ఐదుగురు ఏంబీబీఎస్ వైద్యులను ఐసీయూలో విధులు నిర్వహించేందుకు నియమించింది. అయితే వీరికి త్వరలో విడతల వారీగా ఐసీయూలో విధుల నిర్వహణపై శిక్షణ నిర్వహించనున్నారు. కేంద్రం నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు రాగానే ఐసీయూ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. డయాలసిస్ కేంద్రంలో విధులు నిర్వహణ కోసం త్వరలో నెప్రాలజిస్ట్ను ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. – వేణుగోపాల్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ ఉట్నూర్ -
ఏజెన్సీలో కలకలం
మణుగూరు:ఏజెన్సీ ప్రాంతంలో అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు సేవ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో మణుగూరు ఏజెన్సీలో ఒక్కసారిగా కలకలం రేగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో ప్రత్యేక కేంద్రంగా ఇస్లాం మత మార్పిడులు జరుగుతున్న విషయాన్ని నేషనల్ ఇన్విస్టిగేషన్ అధికారులు గుర్తించి.. హైదరాబాద్ పోలీసుల ద్వారా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో మతమార్పిడిల బాగోతం బయటపడింది. రామానుజవరం గ్రామం కేంద్రంగా అనాథ పిల్లలు, పేద కుటుంబాలకు డబ్బు ఆశ చూపి మత మార్పిడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అనాథాశ్రమం పేరుతో... అనాథ పిల్లలకు సకల సౌకర్యాల ఏర్పాటుతోపాటు ఉన్నత విద్యను అందిస్తామనే ప్రచారంతో హైదరాబాద్ ముఖ్య కేంద్రంగా మణుగూరు మండలం రామానుజవరం, విజయనగరం గ్రామాలతోపాటు వరంగల్, ఖమ్మం నగరాలను అనుకూల ప్రాంతాలుగా ఎంపిక చేసుకొని మత మార్పిడుల బృందం కార్యకలాపాలు కొనసాగించింది. ఏపీలోని రాజమండ్రికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి కొన్నేళ్ల కిత్రం ఇస్లాం మతం స్వీకరించి వరంగల్, హైదరాబాద్‌లలో తనకంటూ ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాగా.. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్, ఎర్రగుంటలో పీస్ ఆర్గనైజేషన్ పేరుతో ప్రత్యేకంగా కార్యాలయం నడుపుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి, హిందువులను ఇస్లాం మతం స్వీకరించేలా ప్రచారం చేయడం ముఖ్య ఉద్దేశం. అన్ని ప్రాంతాల్లో ఉండే అనాథ పిల్లలను, పేదరికం అనుభవిస్తున్న పిల్లలను దగ్గరకు తీసి చదువు పేరుతో హైదరాబాద్ ముఖ్య కేంద్రానికి తరలించడమే కార్యాచరణగా పీస్ ఆర్గనైజేషన్ కార్యాలయాన్ని నడుపుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. 17 మంది పిల్లల గుర్తింపు... మల్కాజ్గిరి పోలీసులు ప్రత్యేక నిఘాతో విచారణ చేపట్టడంతో పీస్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో 17 మంది అనాథ పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మత మార్పిడులకు పాల్పడుతున్న సత్యనారాయణ అలియాస్ సిద్దిఖీని ముందుగా అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేంద్రాలు, పీస్ ఆర్గనైజేషన్‌లో పని చేస్తున్న సభ్యుల పేర్లు బయటకు రావడంతో మణుగూరు మండలంలో గల మత మార్పిడుల కేంద్రం వార్తల్లోకి వచ్చింది. మండలంలోని రామానుజవరం గ్రామానికి చెందిన బత్తిని సోమేశ్వరరావు అలియాస్ అబ్దుల్లాతోపాటు ఇదే మండలం విజయనగరం గ్రామానికి చెందిన సాగర్‌ను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. పీస్ ఆర్గనైజేషన్ కార్యాలయంతో 10 మందికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించగా, అందులో 9 మందిని అరెస్ట్ చేశారు. రామానుజవరం గ్రామానికి చెందిన ఒక పాప, ఒక బాబును సోమేశ్వరరావు ఉచిత విద్య పేరుతో హైదరాబాద్ కేంద్రానికి తరలించినట్లు సమాచారం. గ్రామాల్లో చెరగని నమ్మకం... కాగా.. మత మార్పిడుల విషయం బహిర్గతం కావడంతో పాటు కీలకంగా పని చేస్తున్న బత్తిని సోమే శ్వరరావు, సాగర్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించినా.. ఆయా గ్రామాలకు చెందిన కొన్ని కుటుంబాలు మాత్రం ఇప్పటికీ వారు అదే మతంపై పూర్తి నమ్మకంతో ఉన్న ట్లు సమాచారం. సుమారు 35 కుటుంబాలు రహస్యంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నట్లు తెలు స్తోంది. ఈ మత మార్పిడుల విషయంపై ఎన్ఐఏ(నేషనల్ ఇన్విస్టిగేషన్ అధికారులు) రాష్ట్రవ్యాప్తంగా గల పీస్ ఆర్గనైజేషన్ కార్యాలయాలు, వాటి పనులు, నిధుల సేకరణ, నిర్వహణ తీరుపై క్షుణ్ణంగా వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇస్లాం మత మార్పిడి, పిల్లలకు ఉచిత విద్య పేరుతో ఉర్దూ, అరబిక్ భాషలు నేర్పడంతోపాటు ఇస్లాం మత సిద్ధాంతాలను నూరిపోయడంపై కూడా ఎన్ఐఏ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు జరుపుతున్నారు. -
ఏజెన్సీలో పునుగు పిల్లి ఆనవాలు
కురుపాం: అరుదుగా కనిపించే పునుగు పిల్లి ఆనవాలు కురుపాం ఏజెన్సీలో ప్రత్యక్షమయ్యాయి. అదీ కూడా ఏదో వాహనం ఆ పునుగు పిల్లిని గురువారం రాత్రి ఢీకొట్టడంతో ఆర్‌ఆండ్‌బీ రహదారిపై మృత్యువాత పడి కనిపించింది. ఈ పునుగు పిల్లులు శేషాచలం అడవుల్లో గతంలో ఎక్కువగా ఉండేవి. రానురాను అవి అంతరించి పోతున్నట్లు చెబుతున్నారు.పునుగు పిల్లి చమురుతోనే తిరుపతిలో ఉన్న వేంకటేశ్వరస్వామికి దీపారాధన చేయటం ఆనవాయితీ. ఈ పిల్లులు సంతతి కనుమరుగవుతున్న తరుణంలో టీటీడీ ఇప్పటికే పునుగు పిల్లుల సంరక్షణకు చర్యలు కూడా చేపట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో కురుపాం నియోజకవర్గం పరిధిలో ఉన్న గరుగుబిల్లి మండలం సంతోషపురం సమీపంలో ఉన్న రహదారిపై ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ పునుగు పిల్లి మృతి చెందింది. ఈ ప్రాంతంలో కూడా చినతిరుపతిగా పేరొందిన తోటపల్లి దేవస్థానం సమీపంలో ఉండటం మరో విశేషం. ఏది ఏమైనా అంతరించిపోతుందనుకుంటున్న పునుగు పిల్లి సంతతి ఇలా ప్రత్యక్షం కావడంతో ఇక వెంకన్న నైవేద్యానికి పునుగు పిల్లుల కొరత లేనట్లేనని భావిస్తున్నారు. -
ఉప్పొంగిన కొండ వాగులు
ఇసుక కాల్వకు గండి ముంపునకు గురైన పంటచేలు పొంగిపారుతున్న కొత్తూరు కాల్వ ఏజెన్సీలో రాకపోకలకు అంతరాయం పోలవరం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాంతంలో కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షపాతం 77.8 మిల్లీమీటర్లుగా నమోదు అయ్యింది. కొత్తూరు, కొవ్వాడ, ఇసుక కాలువ, పేడ్రాల, నక్కలగొయ్యి కాలువలు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తూరు కాలువ ఉధృతంగా ప్రవహించటంతో తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం వరకు ఏజన్సీ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగు దాటేందుకు ఏజన్సీ వాసులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. కొత్తరామయ్యపేట పునరావాస కేంద్రం సమీపంలో ఇసుక కాలువ కుడి గట్టుకు 15 నుంచి 20 మీటర్ల పొడవున గండి పడింది. దీంతో పంట చేలు ముంపునకు గురయ్యాయి. కొంతమేరకు పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఇసుక కాలువకు గండి పడటంతో రామయ్యపేట వాసులు బిక్కు,బిక్కు మంటూ కాలం గడిపారు. కాలువ నీరు గ్రామంపైకి వస్తుందని భయపడ్డారు. పేడ్రాల, నక్కలగొయ్యి, కొవ్వాడ కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నీరంతా పట్టిసీమ అవుట్‌ఫాల్ స్లూయిస్ ద్వారా గోదావరి నదిలో కలుస్తుంది. ఇసుక కాలువ గండిని పోలవరం తహసీల్దార్ ఎం.ముక్కంటి ఆర్ఐ ఆర్.నాగరాజు పరిశీలించారు. గండిని తాత్కాలికంగా పూడ్చి వేయాల్సిందిగా నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించినట్లు తహసీల్దార్ తెలిపారు. -
స్వాతంత్య్రపోరులో విజయనగరం
విజయనగరం... విప్లవాలకు... ఉద్యమాలకు... విజయాలకు ఆలవాలం. నాటి స్వాతంత్య్ర సంగ్రామంలో విజయపథాన నిలిపిన పౌరుషం ఇక్కడి ప్రత్యేకం. బ్రిటిష్ పాలకులపై కణకణమండే నిప్పుకణికలై ఉద్యమించి... నాటి కుతంత్రాలపై అలుపెరుగక పోరాడిన సాయుధులు... త్యాగధనుల పురిటిగడ్డ ఈ నేల. కలాన్ని చురకత్తిగా మలిచి బానిస బతుకులపై అక్షరయుద్ధం చేసిన యోధులకు... తెల్లవారి నిరంకుశ విధానాలపై ఎదురొడ్డి నిలిచిన సాహసికులకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఈ విజయనగరం. అల్లూరి ఆశ్రమ పేరుగా, స్వేచ్ఛా వాయువు లు సాధించుకున్న విజయనగరం నాటి స్వాతంత్య్రోద్యమ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను ఏర్పరచుకుంది. ఏడు దశాబ్దాల కాలంలో ఎన్నో ఒడిదొడుకులను, ఆటుపోట్లను తట్టుకుని నేటికీ ప్రత్యేక గుర్తింపుకోసం పరితపిస్తోంది. స్వాతంత్య్రదినోత్సవం సంద్భంగా ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి, విజయనగరం: క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాటికే కటక్ నుంచి పిఠాపురం వరకూ విస్తరించిన కళింగ రాజ్యంలో అంతర్భాగంగా ఉండే విజయనగర ప్రాంతం బలమైన నాగరికత పునాదులపై నిర్మితమైంది. 1565లో కళ్లికోట యుద్ధంతో గోల్కొండ నవాబుల ఏలుబడిలోకి వెళ్లింది. ఫౌజిదారుల కాలంలోనే విజయనగరం, బొబ్బిలి సంస్థానాలు పుట్టుకొచ్చాయి. నిజాం మరణం తర్వాత ఫ్రెంచ్ సేనాని బుస్సీ సాయంతో సలాబత్‌జంగ్ అధికారంలోకి వచ్చాడు. దానికి ప్రతిగా శ్రీకాకుళం నుంచి కొండపల్లి సర్కారు వరకూ నాలుగు సర్కార్లను ఫ్రెంచ్ వారు రాయించుకున్నారు. కానీ తర్వాత ఈ ప్రాంతమంతా తూర్పు ఇండియా వర్తక సంఘం ద్వారా ఆంగ్లేయుల వశమైంది. 1757 జనవరి 24న జరిగిన బొబ్బిలి యుద్ధం చరిత్రలో నేటికీ ఓ సంచలనం. ఈ యుద్ధం తర్వాత మొదలైన చిన విజయరామరాజు పాలనపై ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనం చెలాయించింది. దానికి ఆయన ఎదురు తిరిగారు. 1794లో తిరుగుబావుటా ఎగురవేశారు. అదే పద్మనాభ యుద్ధం. ఈ యుద్ధంలో విజయనగర రాజులు ప్రాణాలు వదిలారు. కానీ అప్పటి మద్రాసు గవర్నర్ విజయనగరం కోటను చివరి విజయరామరాజు తనయుడు గజపతికి అప్పగించారు. అప్పుడే విజయనగర సాంస్కృతిక శకం మొదలైంది. నిజానికి జాతీయోద్యమ కాలంలోనే విజయనగరాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలనే డిమాండ్ ఉండేది. కానీ బ్రిటీష్ పాలకులు దానిని పట్టించుకోలేదు. దీంతో 1979 వరకూ విశాఖ జిల్లాలో అంతర్భాగంగానే ఉండిపోయింది. సిపాయిల తిరుగుబాటులో చేయికలిపి బ్రిటిష్ పాలనపై తొలి స్వతంత్ర సంగ్రామంగా పేరుగాంచిన 1830 సిపాయిల తిరుగుబాటునుంచే ఈ జిల్లాలో విప్లవం రాజుకుంది. ముఖ్యంగా గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. గిరిజన ప్రాంత ప్రత్యేక పాలన (ఏజెన్సీ అడ్మినిస్ట్రేషన్) ఉద్యమం చెలరేగింది. సాలూరు ప్రాంతానికి చెందిన గిరిజన నాయకుడు కొర్రా మల్లయ్య 1900లో విప్లవ జెండా ఎగురవేశారు. ఈ విప్లవాన్ని బ్రిటిష్ పాలకులు దారుణంగా పోలీస్ చర్యతో అణచివేశారు. ఎంతో మంది గిరిజనుల ప్రాణాలు తీశారు. కొర్రా మల్లయ్య, అతని కుమారుడిని అరెస్ట్ చేసి చనిపోయేంత వరకూ జైలు శిక్ష విధించారు. 1905లో బెంగాల్ విభజన, 1920లో సహాయ నిరాకరణోద్యమం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమాల్లో జిల్లా ప్రజలు కీలక భూమిక పోషించారు. దండి సత్యాగ్రహంలో పిడికిలి బిగించి... 1930 మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో ప్రారంభమైన మహాత్మా గాంధీ నేతృత్వంలో సత్యాగ్రహయాత్ర 375 కిలో మీటర్లు సాగి ఏప్రిల్ 6న దండి గ్రామం చేరింది. 24 రోజుల పాటు సాగిన ఉప్పు సత్యాగ్రహంలో విజయనగరం పాలుపంచుకుంది. గాంధీజీతో అడుగులు కలపకపోయినా దండి యాత్రకు మద్దతుగా విజయనగరంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటైంది. అక్కడ గాంధీజీ సత్యాగ్రహం చేస్తున్న సమయంలోనే ఇక్కడా సత్యాగ్రహం జరిగేలా అప్పట్లో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి నాటి పాలకులు జిల్లా వ్యాప్తంగా అనేక అడ్డంకులు కల్పించారు. అయినప్పటికీ మన జిల్లాలోని స్వాతంత్య్ర సమరయోధులు విజయవంతం చేసి గాంధీజీకి బాసటగా నిలిచారు. అల్లూరి ఆశ్రమ నామం తెల్ల దొరల గుండెల్లో సింహ స్వప్నమై... గిరిజనం గుండెల్లో ప్రత్యక్ష దైవమై... స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవ జ్యోతియై... వెలిగిన మన్యం వీరుడు అల్లూరి సీతామరామరాజు నాడు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల మన్యం ప్రాంతంలో గిరిజనుల స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించాడు. ఆయన మదిలో విజయనగరం పేరు మెదలడం గొప్ప విశేషం. విద్యాభ్యాసం అనంతరం 1921లో చిట్టగాంగ్ వెళ్లి బెంగాల్ విప్లవకారులతో చర్చలు జరిపి కృష్ణదేవిపేట సమీపంలో తాండవ నది ఒడ్డున నీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ‘శ్రీరామ విజయనగరం’ అనే ఆశ్రమాన్ని అల్లూరి ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాతే ఆంగ్లేయుల ముత్తదారీ పద్ధతి, అటవీ నిబంధనలతో పాటు చింతపల్లి తహసీల్దార్ సెబాస్టియన్, అతని కాంట్రాక్టర్ సంతానం పిళ్లై దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. -
గిరిజనుల అభివృద్ధికి కృషి
మంత్రి నక్కా ఆనందబాబు చాపరాయి బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ రంపచోడవరం : గిరిజనుల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో బుధవారం చాపరాయి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెక్కుల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. మారుమూల గ్రామాలకు ఎనిమిది కిలోమీటర్లు మేర అనుసంధాన రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. దశల వారీగా నిర్మాణ కార్యక్రమాలు చేపడతామన్నారు. చాపరాయి లాంటి సంఘటన పునరావృతం కాకుండా ఇదోక గుణపాఠంగా తీసుకుని అన్ని మారుమూల ఆవాసాలకు అనుసంధాన రోడ్లు నిర్మించేందుకు 8వేల కిలోమీటర్ల మేర గుర్తించినట్లు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఒక్కో బాధితుని కుటుంబానికి రూ.5 లక్షలు చెక్కులను మంత్రి అందజేశారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు ఒక్కో సంఘానికి రూ. 2లక్షలు చొప్పున స్త్రీనిధి, బ్యాంకులింకేజీ ద్వారా అందించారు. చాపరాయిలో మంజూరు చేసిన సామాజిక భద్రతా పింఛన్లు వచ్చే నెల నుంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ టీ రత్నబాయి, ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్, ఎంపీపీ కర్రా వెంకటలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు పల్లాల రవణమ్మ, మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నంబాబు రమేష్, ఆర్డీఓ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మాటలు కలిపి..మత్తు మందు ఇచ్చి ...
వృద్ధులే టార్గెట్ పట్టుబడ్డ నిందితుడు రూ.ఆరు లక్షల సొత్తు స్వాధీనం అమలాపురం టౌన్ : బంగారు నగలు కాజేసేందుకు అతడి టార్గెట్ ఎప్పుడూ వృద్ధురాళ్లపైనే ఉంటుంది. బస్ స్టేషన్లలో, ఆటో స్టాండ్‌ల్లో 70 ఏళ్లు వయసు దాటి ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధులు ధరించే బంగారు నగలపై అతడి కన్ను పడుతుంది. ముందు మాటలు కలపి...తర్వాత బంధుత్వాలు చెప్పి...ఆపై మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్‌లు ఇచ్చి మత్తులోకి వెళ్లాక వారి ఒంటిపై బంగారు నగలు కాజేసి అదృశ్యమయ్యే కిలాడీ అతడు. అమలాపురం డివిజన్లో ఈ తరహాలో గత ఆరేళ్ల నుంచి అనేక నేరాలు చేస్తూ ఎందరో వృద్ధరాళ్ల నుంచి బంగారు నగలు కాజేసిన అయినవిల్లి మండలం విలస గ్రామానికి చెందిన కంఠంశెట్టి శ్రీనును అమలాపురం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో అతను చేసిన నేరాల చిట్టాను చెప్పించటమే కాకుండా రూ.ఆరు లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో సోమవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ అరెస్ట్ చేసిన నిందితుడు శ్రీనును ప్రవేశపెట్టి అతను నుంచి స్వాధీనం చేసుకున్న 203.5 గ్రాములు బంగారు నగలు, 67 గ్రాముల వెండి వస్తువులు, 83 మత్తు బిళ్లలను చూపించారు. నిందితుడు జిల్లాలోని అంబాజీపేట, రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం, ముమ్మిడివరం, కొత్తపేట, అమలాపురం ఇలా అనేక ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్టు తెలిపారు. సోమవారం ఉదయం అమలాపురంలోని నల్లా సూర్యచంద్రరావు ఘాట్ వద్ద శ్రీను బంగారు నగలు, మత్తు బిళ్లలతో అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతడిని అరెస్ట్ చేసి విచారించగా నేరాలు అంగీకరించాడని తెలిపారు. రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్సు ఆరేళ్ల నుంచి నేరాలు చేస్తున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసి అతడి నుంచి బంగారు నగలు రికవరీ చేసిన పట్టణ సీఐ శ్రీనివాస్, ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుళ్లు అయితాబత్తుల బాలకృష్ణ, బత్తుల రామచంద్రరావు, హోంగార్డు సుందర అనిల్‌ను డీఎస్పీ ప్రసన్నకుమార్ అభినందించారు. వీరికి రివార్డులు ప్రకటించేందకు జిల్లా ఎస్పీ విశాల్ గున్నికి సిఫార్సు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
ఏజెన్సీకి జ్వరం
♦ ‘ముసురు’కున్న వ్యాధులు ♦ 25 రోజుల్లో 8,300 మంది జ్వర బాధితులు ♦ జనవరి నుంచి జ్వరాలు, వ్యాధులతో 51 మంది మృతి ఉట్నూర్(ఖానాపూర్): జ్వరాలు, అతిసార, రక్తహీనత, ఇతర వ్యాధులతో ఏజెన్సీ తల్లడిల్లుతోంది. కేవలం 25 రోజుల్లో 8,300 మంది జ్వరాల బారిన పడడం వ్యాధుల తీవ్రతకు అద్దం పడుతోంది. వర్షాకాలం కావడంతో ‘ముసురు’కుంటున్న వ్యాధులకు గిరిజనులు ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. ఇంద్రవెల్లి మండలంలో సోమవారం ఒక్క రోజే ఇద్దరు జ్వరాలతో మృతి చెందడం గిరి గ్రామాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఉట్నూర్(ఖానాపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 44 పాత మండలాలు ఏజెన్సీ పరిధిలో ఉన్నాయి. వర్షాకాలంలో గిరిజన గ్రామాల్లో పారిశుధ్యం లోపించి, బావుల్లో క్లోరినేషన్ చేయకపోవడం కారణంగా ఏటా వ్యాధులు ప్రబలుతున్నాయి. ఐటీడీఏ, అధికార యంత్రాంగం తాత్కాలిక ఉపశమన చర్యలే గానీ శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ) పరిధిలో జ్వరాలు, అతిసార, రక్తహీనత, తదితర వ్యాధులతో 51 మంది గిరిజనులు మృతిచెందారు. వెలుగులోకి రాని గిరిజన మరణాలు ఈ సంఖ్యకు మూడింతలు ఉంటుందని గిరిజనులు చెబుతున్నారు. గత నెల 21 నుంచి ఏజెన్సీ పీహెచ్‌సీల్లో చేపట్టిన ర్యాపిడ్ ఫీవర్ సర్వేల్లో చేదు నిజాలు బయటపడుతున్నాయి. 31 పీహెచ్‌సీలు.. 2,262 వైద్య శిబిరాలు.. ఏజెన్సీలోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జూన్ 21 నుంచి ఈ నెల 20 వరకు ర్యాపిడ్ ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని ఐటీడీఏ చేపట్టింది. ఇందులో భాగంగా వైద్యాబృందాలు నిత్యం గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ గిరిజనుల ఆరోగ్య స్థితిగతులపై నివేదికలను ఎప్పటికప్పుడు ఐటీడీఏకు అందిస్తున్నాయి. సర్వే ప్రారంభం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు.. అంటే 25 రోజుల్లో 31 పీహెచ్‌సీల పరిధిలో 2,262 వైద్య శిబిరాలు నిర్వహించారు. వైద్యబృందాలు 1,17,368 మందికి వైద్య పరీక్షలు చేశారు. 8,300 మంది జ్వరాలు, 14 మంది మలేరియా, 51 మంది టైఫాయిడ్ బారిన పడ్డారని, 1,573 మంది అతిసారతో మంచం పట్టారని గుర్తించారు. సర్వే ముగిసే నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వైద్య బృందాలు చెబుతున్నాయి. ఈ సర్వే లెక్కలు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేవేనని, అధికారిక లెక్కలకు మించి మూడొంతుల మంది వ్యాధుల బారిన పడ్డారని గిరిజనులు అంటున్నారు. ఏటా తాత్కాలిక చర్యలే.. వర్షాకాలం వచ్చిందంటే చాలు గిరిజన ప్రాంతంలో వ్యాధులు, జ్వరాలు గిరిజనులను చుట్టుముడుతుంటాయి. గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం, తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ చేపట్టకపోవడం వారి పాలిట శాపంగా మారుతోంది. ఏజెన్సీలోని 235 గ్రామ పంచాయతీల్లో క్లోరినేషన్, పారిశుధ్యం నివారణకు ఎన్ఆర్హెచ్ఎం ద్వారా సబ్‌సెంటర్ ఏఎన్ఎం, పంచాయతీ వీఆర్వోల ఖాతాలోకి ఏటా వచ్చే రూ.20 వేలు గత రెండేళ్లుగా రావడం లేదు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం, క్లోరినేషన్ చర్యలు చేపట్టడం లేదు. సబ్‌సెంటర్లకు వచ్చే రూ.10 వేలు అన్‌టైడ్ నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. సబ్సెంటర్లో అత్యవసరంగా మందుల కొనుగోలు, ఇతర ఖర్చులకు చిల్లిగవ్వ లేదని సిబ్బంది వాపోతున్నారు. ఏటా అధికార యంత్రాంగం తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకోవడమే గానీ శాశ్వత నివారణ మార్గాలు అన్వేషించడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో 986 ప్రభావిత గ్రామాలను గుర్తించి దోమల నివారణకు చర్యలు చేపట్టినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. మొదటి విడతలో ఇప్పటి వరకు 211 గ్రామాల్లో దోమల నివారణకు ఐఆర్ఎస్(ఇండోర్ రెసిడెన్షియల్ స్ప్రే) పూర్తి చేశారు. మిగతా గ్రామాల్లో ఎప్పటి వరకు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఖాళీలతో సతమతం ఏజెన్సీలోని సమస్యాత్మక మండలాలకు ఉట్నూర్ కేంద్రంగా ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్ర(సీహెచ్‌సీ)మే పెద్ద దిక్కు. వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండడంతో నలుగురు కాంట్రాక్టు వైద్యాధికారులు సేవలు అందిస్తున్నారు. ఏజెన్సీ పరిధిలోని 31 పీహెచ్‌సీల్లో 841 మంది వైద్య సిబ్బంది వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. 717 మంది మాత్రమే ఉన్నారు. 124 ఖాళీలు ఉన్నాయి. ఇటీవల ఉన్నత విద్య కోసం కొందరు వైద్యాధికారులు వెళ్లిపోవడంతో 34 వరకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఐటీడీఏ కాంట్రాక్ట్ పద్ధతిన 18 మందిని నియమించగా.. ఇంకా 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీహెచ్‌సీల్లో 73 వైద్యాధికారులకు గాను 57 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 10 మంది మాత్రమే ప్రభుత్వ వైద్యాధికారులు కాగా మిగతా వారు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. రోజుకు 300పైగా ఓపీ కేసులు.. ఉట్నూర్‌లోని సీహెచ్‌సీకి సమస్మాత్మక మండలాల నుంచి జ్వర, అతిసార బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రోజుకు 300 పైగా వైద్య పరీక్షల కోసం వస్తుండగా.. వీరిలో 30 మందికి పైగా ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు.. నా కొడుకు మారుతిరావుకు నాలుగు రోజుల నుంచి విపరీతంగా జ్వరం వస్తంది. ఉట్నూర్ ఆసుపత్రికి తీసుకు వస్తే ఇక్కడే ఉండమనడంతో నాలుగు రోజులుగా ఉంటున్నాం. అయినా కొడుకు జ్వరం తగ్గడం లేదు. గ్రామాల్లో ఇంటికి ఒక్కరిద్దరికి జ్వరాలు వస్తున్నాయి. గ్రామాల్లో జ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. – అడ మాన్కుబాయి, గ్రామం :రాంనగర్, మం : ఉట్నూర్ మూడు రోజులుగా జ్వరం, వాంతులు మా బాబు అభికృష్ణకు మూడు రోజులుగా తీవ్ర జ్వరం రావడంతోపాటు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నా తగ్గడం లేదు. గ్రామాల్లో ఎక్కడికక్కడ బురద ఏర్పడడంతో దోమలు పెరుగుతున్నాయి. జ్వరాలు, వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవుతున్నాయి. అధికారులు గ్రామాల్లో చర్యలు చేపట్టి జ్వరాలు తగ్గుముఖం పట్టేలా చూడాలి. – సుద్దమల్ల మల్లీశ్వరి, గ్రామం : కొమ్ముగూడెం, మం : ఉట్నూర్ తేదీ ఇన్‌పేషెంట్లు జూలై 03 40 04 53 05 54 06 49 07 32 08 41 09 50 10 78 11 50 12 36 13 36 14 20 15 36 16 26 17 23 18 20 -
ఏజెన్సీ మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంగా జిల్లాలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, జనజీవనానికి విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో ముందుగానే అప్రమత్తమై జిల్లా యంత్రాంగం కంట్రోలు రూంలను ఏర్పాటు చేసినట్లు కలెక్టరు కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లా అంతటా చెదురుమదురు జల్లులతో వర్షం కురుస్తున్నదని రేపటికి వర్షపు నీరు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యగా వీఆర్ఓలను, వీఏఓలను, ఆయా ప్రాంతాల్లోని ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని, ఇతర సిబ్బందిని అవసరమైతే ఆ ప్రాంతాలలో ఉండి వరద నివారణ చర్యలు తక్షణం తీసుకోవాలని, సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వారికి నిత్యావసర వస్తువులు కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. మండలాల్లో కంట్రోల్ రూంలు ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు సిబ్బంది షిప్టులు వారీగా 24 గంటలూ వరద నిరోధక చర్యలు చేపడతారని కలెక్టరు చెప్పారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు: జీలుగుమిల్లి తహశీల్దార్ కార్యాలయం సెల్ నెంబర్లు 9959967184, 8464840551, బుట్టాయిగూడెం తహశీల్దార్ కార్యాలయం సెల్ నెంబర్లు 809627466, 9912759993, కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం సెల్‌నెంబర్ 9492362623, వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయం సెల్‌నెంబర్ 9492360603. వర్షపాతం వివరాలు... జిల్లాలో గత 24 గంటల్లో ఆచంట మండలంలో అత్యధికంగా 53.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా వీరవాసరంలో 52.6, జీలుగుమిల్లి 21.6, బుట్టాయగూడెం 24.0, పోలవరం 32.8, తాళ్ళపూడి 35.6, గోపాలపురం 27.2, కొయ్యలగూడెం 36.4, జంగారెడ్డిగూడెం 24.6, కుక్కునూరు 14, వేలేరుపాడు 41.8, టీ.నర్సాపురం 39.6, చింతలపూడి 31.4, లింగపాలెం 25.6, కామవరపుకోట 41.2, ద్వారకాతిరుమల 18.2, నల్లజర్ల 20.8, దేవరపల్లి 26.8, చాగల్లు 19.2, కొవ్వూరు 22.2, నిడదవోలు 23.8, తాడేపల్లిగూడెం 22, ఉంగుటూరు 41, భీమడోలు 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
మన్యంలో కుండపోత
మారేడుమిల్లిలో అత్యధికంగా 56.0 మి.మీ. వర్షపాతం పొంగిన వాగులు, వంకలు చింతూరు, వీఆర్‌పురం మధ్య నిలిచిన రాకపోకలు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో పడిన చెట్లు ఏడు గంటలు నిలిచిన ట్రాఫిక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు సగటు వర్షపాతం 11.0 మి.మీ. సాక్షి, రాజమహేంద్రవరం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం వర్షాలు కురిశాయి. మెట్ట, డెల్టాల కన్నా ఏజెన్సీ ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. ఫలితంగా ఏజెన్సీలోని పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా విలీన మండలాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీలోని మారేడుమిల్లిలో అత్యధికంగా 56.0 మిల్లీ మీటర్ల వర్షపాత నమోదైంది. విలీన మండలాలైన వీఆర్‌పురంలో 46.6 మి.మీ, ఏటపాకలో 33.3, చింతూరులో 30.0, కూనవరంలో 24.4 మి.మీ వర్షపాతం నమోదైంది. చింతూరు మండలం తిమ్మిరిగూడెం వద్ద అత్తాకోడళ్ల వాగు పొంగి రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండడంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య పలుమార్లు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద పెరుగుతూ, తగ్గుతూ ఉండడంతో వాహనదారులు అప్రమత్తంగా వ్యహరించారు. విలీన మండలాల్లో విస్తారంగా వర్షాలు పడి వరదలు వస్తుండడంతో చింతూరు ఐటీడీవో కార్యాలయంలో కంట్రోల్ రూం, హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఐటీడీవో పీవో చినబాబు వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు నాలుగు మండలాల తహసీల్దార్లతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 08748–285259 నంబరు ద్వారా సంప్రదించాలని కోరారు. భద్రాచలం వెళ్లి గోదావరి వరద పరిస్థితిని తెలుసుకున్నారు. అకస్మాత్తుగా వచ్చే సబరి వరదపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మారేడుమిల్లి, చింతూరు మధ్య ఘాట్‌రోడ్డులోని టైగర్ క్యాంప్ వద్ద చెట్లు కూలి రహదారిపై పడ్డాయి. మధ్యాహ్నం నుంచి ఇరువైపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. రాత్రి తొమ్మిది గంటలకు చెట్లను తొలగించారు. . మైదాన ప్రాంతంలోనూ నిరంతరం వర్షం... జిల్లాలోని మైదాన ప్రాంతాల్లో కూడా సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కొద్దిపాటి వర్షం పడుతూనే ఉంది. మధ్య మధ్యలో తెరపిస్తున్న వరుణుడు మళ్లీ వర్షం కురిపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేదు. స్కూలు పిల్లలు పాఠశాల రాకపోకలు సమయంలో ఇబ్బందులు పడ్డారు. వ్యాపారులు లేక దుకాణాలు బోసిపోయాయి. చిరు వ్యాపారులు రోడ్లపైకి రాలేకపోయారు. ఏజెన్సీ తర్వాత జిల్లాలో అత్యధికంగా రాజమహేంద్రవరం నగరంలో 26.2 మి.మీ, సీతానగరంలో 25.2, రాజమహేంద్రవరం రూరల్‌లో 20.2, ఆత్రేయపురం మండలంలో 13.0, పెద్దాపురంలో 15.8, ముమ్మిడివరంలో 7.4, అమలాపురం, కాకినాడల్లో 7.0 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా తునిలో 1.0 మి.మీ వర్షపాతం నమోదవగా జిల్లా సగటు వర్షపాతం 11.0 మిల్లీ మీటర్లగా నమోదైంది. -
కామినేనీ ... కానరాలేదా...
నవమాసాలు పెంచి ... పురుటి నొప్పులు భరించి జన్మనిచ్చిన ఆ బిడ్డ కన్నుమూస్తే ... ఆ కన్నతల్లికి ఏదీ ఊరడింపు...? . తొమ్మిది నెలలు అమ్మ గర్భంతో అనుబంధం పెంచుకొని పేగు తెంచుకొని బాహ్య ప్రపంచంలోకి బయటపడిన రోజుల్లోనే ... అమ్మ ఒడి చవిచూడకుండానే... ఆ తల్లి కన్నుమూస్తే... ఆ బిడ్డకు రక్షణేదీ...? . పౌష్టికాహారలోపం... వాతావరణ కాలుష్యం... దోమల స్తైర విహారం... రక్త హీనత ... కారణాలేమైతేనేం అనుబంధాలు...ఆత్మీయతలు అంతలోనే అదృశ్యమైతే ఆ పాపం ఎవరిదీ...? ప్రశ్నిస్తోంది గిరిజనం . పాలకుల పరామర్శల సాక్షిగా చావులు నిజం... ముసురుతున్న దోమల సాక్షిగా మలేరియా లేదట...! లెక్కలు పక్కాగా చెబుతున్నా... పక్కతోవ పట్టించే యత్నం... ఇదేమి విచిత్రం... -
దోమా...దోమా...ఇది నిజమా...
శాస్త్రీయ లెక్కలు నిర్థారిస్తున్నా బుకాయింపులే మన్యంలో మలేరియా లేదని మంత్రి కామినేని ప్రకటన పచ్చని పల్లెలు జ్వరాలతో వణుకున్నాయి పసిమొగ్గలపై పంజా విసురుతున్న జ్వరాలు తీవ్రత లెక్క ఇదీ... - స్లైడ్ పాజిటివ్ రేట్ (ఎస్పీఆర్) 2 దాటితే మలేరియా తీవ్రత ఎక్కువైందని భావించవచ్చు. - ఏజెన్సీలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 13 పీహెచ్‌సీల పరిధిలో ఎస్పీఆర్ స్థాయి రెండుకంటే ఎక్కువగా నమోదైంది. - ఏడుగురాళ్ల పల్లి పీహెచ్సీ పరిధిలో ఎస్పీఆర్ 9.8గా నమోదైంది. - మంగంపాడు పీహెచ్సీలో 8.3, గౌరిదేవీపేట 4.1, బోదులూరు 3.6, తులసిపాకలు 3.8గా నమోదయింది. - ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రక్త పూతలు సేకరిస్తే 3,265 మందికి మలేరియా జ్వరాలు ఉన్నట్లు నిర్ధారణయింది. . రంపచోడవరం: ఏజెన్సీ గ్రామాలు జ్వరాలతో వణుకున్నాయి. హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నా జ్వరాలు బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గడం లేదు. తాజాగా వాడపల్లి గ్రామానికి చెందిన రెండో తరగతి చదువుతున్న కోట చినబాబుదొర (6) అనే విద్యార్థి జ్వరంతో మృతి చెందాడు. గుర్తేడు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న చంద్రరెడ్డి అనే మరో విద్యార్థి అనారోగ్యంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి కాకినాడ రిఫర్ చేశారు. మన్యంలో విష జ్వరాలు, మలేరియా గిరిజనులను కుదిపేస్తుంటే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఏజెన్సీలో అసలు మలేరియా మరణాలు సంభవించలేదని చెప్పడం విశేషం. స్థానిక ఏరియా ఆసుపత్రిలో పసిపాపలు జ్వరాలు బారిన పడి చికిత్స పొందుతున్నా బుకాయింపులకు దిగడం పట్ల సంబంధిత వైద్య సిబ్బందే ముక్కున వేలేసుకుంటున్నారు. . మన్యంలో ప్రమాద ఘంటికలు... మన్యంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జ్వరాల కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. స్లైడ్ పాజిటివ్ రేట్ (ఎస్పీఆర్) 2 దాటితే ఆయా పీహెచ్‌పీ పరిధిలోని గ్రామాల్లో మలేరియా తీవ్రత ఎక్కువైందని భావించవచ్చు. ఏజెన్సీలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 13 పీహెచ్‌సీల పరిధిలో ఎస్పీఆర్ స్థాయి రెండుకంటే ఎక్కువగా నమోదయింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఎస్పీఆర్ ప్రమాదకర రీతుల్లో నమోదవుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా మంత్రివర్యులు మాత్రం అసలు మలేరియా కేసులే లేవనడం విడ్డూరంగా ఉంది. ఏడుగురాళ్ల పల్లి పీహెచ్సీ పరిధిలో ఎస్పీఆర్ 9.8గా నమోదైంది. మంగంపాడు పీహెచ్సీలో 8.3, గౌరిదేవీపేట 4.1, బోదులూరు 3.6, తులసిపాకలు 3.8గా నమోదయింది. ఎస్పీఆర్ 2 దాటిన గ్రామాలను హైరిస్క్ గ్రామాలుగా గుర్తించి మలేరియా నివారణకు పటిష్టమైన చర్యలు తీసకోవాలి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 1,39,622 మంది జ్వర పీడితుల నుంచి రక్త పూతలు సేకరిస్తే 3,265 మందికి మలేరియా జ్వరాలు ఉన్నట్లు నిర్ధారణయింది. . పాసిమొగ్గలపై జ్వరాలు పంజా... ఏజెన్సీలో అనారోగ్య పరిస్ధితుల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ గ్రామల్లో ౖౖవైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ నెల 4వ తేదీ నుంచి పది రోజులుపాటు నిర్వహించిన ఈ శిబిరాల్లో 4 వేల మందికి జ్వరాలు ఉన్నట్లు నిర్థారణ చేశారు. అలాగే వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులు 200 మందిపైనే జ్వరాలు ఉన్నట్లు గుర్తించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో నెలలులోపు చిన్నారులు జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ సక్రమంగా జరగకపోవడంతో దోమలు సంఖ్య పెరిగిపోయింది. నిల్వ నీటిలో సకాలంలో స్ప్రేయింగ్ జరగకపోవడం దోమ లార్వాలు అభివృద్ధికి దోహదం చేసింది. అలాగే దోమల నివారణకు పిచికారీ చేసే మందు సకాలంలో సరఫరా కాకపోవడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. -
వైద్యం అందకే మృత్యువాత పడుతున్న గిరిజనం
రాజవొమ్మంగి (రంపచోడవరం): ఏజెన్సీ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలపై జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అదుపులోకి రాని ఏజెన్సీ మరణాలకు క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణాలోపమే కారణమని సంఘం సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని రాష్ట్రమానవహక్కుల సంఘం దృష్టికి తీసుకొనివెళతామన్నారు. బుధవారం సాక్షిలో వచ్చిన మలేరియా మరణాల వార్తకు స్పందించిన పరిరక్షణ సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు నూతనపాటి అప్పలకొండ, మాచరి నాగమృత్యుంజయ మరికొంత మంది సంఘం సభ్యులు మంగళవారం రాజవొమ్మంగి మండలం సింగంపల్లి గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. జీజీహెచ్‌లో సెలిబ్రల్ మలేరియాకు చికిత్స పొందుతూ సింగంపల్లి గ్రామానికి చెందిన లోతా వెంకటరెడ్డి మరణించారు. ఈ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన సంఘ సభ్యులకు మృతుని భార్య కుమారి (21)కూడా మలేరియాతో మంచానడి మృత్యువుతో పోరాడుతూ కనుపించడం కలిచివేసింది. సింగంపల్లి గ్రామంలో నెలకొన్న అనారోగ్యకర పరిస్థితులపై వెంటనే జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ స్పందించాలని డిమాండ్ చేశారు. గత వారంరోజులుగా నాలుగు మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కాగా చికిత్స పొందుతున్నారని గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తున్న ఎంపీడీఓ కేఆర్ విజయ, జిల్లా పారా మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్రావు విలేకరులకు తెలిపారు. మృతుని భార్య కుమారిని మెరుగైన చికిత్సకోసం ఎంపీడీఓ రాజవొమ్మంగి తరలించారు. స్థానిక సీఐ వెంకటత్రినా«థ్, ఎస్సై రవికుమార్ తమ సిబ్బందితోపాటు సింగంపల్లి తరలివచ్చారు. స్థానిక సర్పంచి ఆగూరి శుభలక్ష్మి వారివెంట ఉన్నారు. . -
జిల్లాపై జ్వరాల పంజా
♦ జ్వర పీడితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు ♦ ఏజెన్సీ పరిధిలోని వారికి సోకుతున్న మలేరియా ♦ పలు చోట్ల నమోదవుతున్న డయేరియా కేసులు ♦ జ్వరాలతో సతమతమవుతున్న హాస్టల్ విద్యార్థులు సాలూరు/కురుపాం: జిల్లాపై జ్వరాల పంజా విసురుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా జ్వరాలు విజృంభిస్తుండగా... మైదాన ప్రాంతాల్లో డయేరి యా సైతం విస్తరిస్తోంది. పల్లెలు.. పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ఏ ఆస్పత్రికి వెళ్లినా జ్వరాలతో బాధపడుతున్నవారే దర్శనమిస్తున్నారు. ఇక వివిధ గిరిజన, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు చెందిన విద్యార్థులు సైతం జ్వరాలతో సతమతమవుతూ రోజూ ఆస్పత్రి బాట పడుతున్నా రు. సాలూరు ఆస్పత్రిలో రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఒక్కో మంచానికి ఇద్దరు, ముగ్గురు వంతున సర్దుకుపోవాల్సి వస్తోంది. అయినా సరిపడకపోవడంతో ఆస్పత్రి వార్డుల్లోనున్న బల్లలపైనా కూడా వైద్యసేవలందిస్తున్నారు. ఇక్కడ ఒక్క బుధవారమే ఆస్పత్రికి వచ్చినవారు 64మంది కాగా, వారిలో 25మంది జ్వరాల బారినపడి చికిత్స పొందుతున్నారు. వీరిలో 10మందికి మలేరియా సోకినట్టు వైద్యులు నిర్థారించారు. హాస్టళ్లలో విస్తరిస్తున్న జ్వరాలు ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు రోజూ అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుతుండడం గమనార్హం. సాలూరు మండలంలోని కొత్తవలస హాస్టల్ విద్యార్థి మువ్వల మనీష, పాచిపెంట మండలంలోని పి.కోనవలస హాస్టల్‌కు చెందిన కట్టెల సింహాచలంతోపాటు సాలూరు మండలం డి వెలగవలసకు చెందిన కూనేటి కీర్తన, బట్టివలసకు చెందిన గమ్మెల సింహాద్రి, వి.సంతు, రామభద్రపురం మండలం కొండగుడ్డివలసకు చెందిన నల్లజొన్న చిన్నమ్మ బుధవారం ఆస్పత్రిలో చేరారు. పెరుగుతున్న మలేరియా బాధితులు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజు రోజుకూ మలేరియా జ్వరపీడితుల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా ఏజెన్సీ మండలాలైన కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలసకు చెందిన గిరిజనులే జ్వరాలతో బారులు తీరుతున్నారు. బుధవారం ఒక్క రోజే పదుల సంఖ్యలో మలేరియా జ్వర పీడితులు ఆస్పత్రిలో చేరడం ఇక్కడి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం కురుపాం సీహెచ్‌సీలో ఏజెన్సీ గ్రామాలకు చెందిన తోయక కృష్ణారావు, చంటి, తోయక నీలయ్య, పువ్వల రోజా, గిరిజన సంక్షేమ వసతిగృహానికి చెందిన మండంగి హరీష్, వాటక రోహిత్ తోపాటు మరో పది మంది వరకు చేరారు. గతేడాది కంటే ఎక్కువే... కురుపాం సీహెచ్‌సీలో 2016 జనవరి నుంచి జూన్ వరకు 210 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 606 మలేరియా పాజటీవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మార్చి నెలలో 158 కేసులు, మేలో 123, జూన్‌లో 151 కేసులు నమోదవ్వడం చూస్తుంటే రోజురోజుకూ మలేరియా విస్తరిస్తోందనే చెప్పాలి. ఒకే ల్యాబ్ టెక్నీషియన్‌తో రోగుల అవస్థలు కురుపాం సీహెచ్‌సీలో ఒకే ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ ఉండటంవల్ల నాలుగు గిరిజన మండలాల నుంచి వస్తున్న జ్వరపీడితులు రక్తపరీక్షకోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ముగ్గురు వైద్యాధికారుల్లో రోజుకొకరు చొప్పున షిఫ్ట్ డ్యూటీలు నిర్వహిస్తుండటతో వైద్య సేవలు కూడా అరకొరగానే అందుతున్నాయని గిరిజన వాపోతున్నారు. కానరాని నివారణ చర్యలు మలేరియా నివారణే లక్ష్యంగా ఏజన్సీలోని గ్రామాల్లో మలాథియన్ పిచికారి కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ చెబుతున్నప్పటికీ అది వాస్తవ రూపం దాల్చట్లేదని ప్రస్తుతం నమోదవుతున్న కేసులే చెబుతున్నాయి. -
ఇదో ‘ఐడి’యా
ముంపు పరిహారం కోసం...ఓటరు కార్డుల పరిహాసం రోజుల వ్యవధిలో ఓటరు ఐడీ కార్డుల జారీ పోలవరం ముంపు పరిహారం కోసం ‘నకిలీ’ సృష్టి టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్న దందా వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని పలు మీసేవా కేంద్రాల్లో జారీ పరిహారం సొమ్ము కొట్టేందుకు నేతల కుట్ర సాక్షి ప్రతినిధి, కాకినాడ: – ఈ ఓటర్ గుర్తింపు కార్డు చూడండి. వర రామచంద్రపురం మండలం రాజుపేటకు చెందిన ఖండవల్లి శివాజీది. దరఖాస్తు చేసుకున్న రోజుల వ్యవధిలోనే ఓటర్ ఐడీ కార్డు వచ్చేసింది. ఇదొక్కటే కాదు టీసీలో (పుట్టిన తేదీ 2001ఫిబ్రవరి 10) ఉన్న ప్రకారం 18 సంవత్సరాలు నిండలేదు. కానీ...1998 జనవరి ఒకటో తేదీన పుట్టినట్టు చూపించి ఓటర్ ఐడీ కార్డు జారీ చేసేశారు. ఒక్క శివాజీయే కాదు వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని అనేక మందికి ఈ రకంగా ఓటరు గుర్తింపు కార్డులు జారీ అయిపోయాయి. నిజానికైతే వీటిని నకిలీగా గుర్తించాలి. 18 సంవత్సరాలు నిండితేనే ఓటర్ గుర్తింపు కార్డు ఇవ్వాలి. కానీ ఇక్కడ అనేక మందికి వయస్సు తక్కువ ఉన్నప్పటికీ పుట్టిన తేదీలు మార్చి కార్డులు జారీ చేసేశారు. టీడీపీ నేతల కనుసన్నల్లో కొన్ని మీసేవా కేంద్రాలు ఈ రకమైన కార్డులు జారీ చేసేస్తున్నాయి. పోలవరం ముంపు గ్రామాల పరిహారం కోసం టీడీపీ నేతలు వేసిన ఎత్తుగడ ఇది. . దరఖాస్తు చేసిన ఒక్క రోజులోనే... పోలవరం ముంపు మండలాలైన వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని మీసేవా కేంద్రాల్లో ఓటర్ ఐడీ కార్డులను బస్‌పాస్ తరహాలో దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే ఇచ్చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండా ఓటర్ ఐడీ కార్డులను దరఖాస్తు చేసుకున్న రోజులోనే ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మండలాల్లోని పలు గ్రామాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ముంపునకు గురి కానున్నాయి. తొలివిడతగా వీఆర్‌పురం మండలంలోని పది గ్రామాల్లోను, కూనవరం మండలంలోని ఒక గ్రామంలో ఆర్అండ్ఆర్ సర్వే ప్రక్రియను అధికారులు చేపట్టారు. మిగిలిన గ్రామాల్లో కూడా ఈ సర్వే ప్రక్రియ త్వరలో జరగనుంది. 18 సంవత్సరాలు నిండిన యువతీ,యువకులను ఒక కుటుంబంగా గుర్తించి వారికి కూడా ప్యాకేజీ ఇవ్వనున్నారని ప్రచారం జోరుగా సాగుతున్న నేప«థ్యంలో పలువురు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గంలో డబ్బులు చెల్లించి మీసేవ కేంద్రాల ద్వారా ఓటర్ ఐడీ కార్డులను పొందుతున్నారు. . ఒక్కరోజులోనే కార్డు సిద్ధం... వాస్తవానికి 18 సంవత్సరాలు నిండిన యువతీ,యువకుడు నూతనంగా ఓటు గుర్తింపు కార్డు పొందాలంటే ముందుగా బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ) వద్ద ఫాం–6 దరఖాస్తు పూర్తి చేసి దానికి ఆధార్‌కార్డ్, రేషన్ కార్డు జిరాక్స్‌లతోపాటు చదువుకు సంబంధించి టీసీ జిరాక్స్‌ను కూడా జతపరచి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును తహసీల్దార్ పరిశీలిస్తారు. రిమార్క్‌లు లేకుంటే ఆర్డీఓకు పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత అనంతరం ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో దరఖాస్తుదారుడికి ఒక ఓటర్ ఐడీని కేటాయిస్తారు. ఈ ప్రకియకు సుమారు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. కానీ ఇవేవీ కాకుండా ఇక్కడ కొన్ని మీసేవా కేంద్రాల్లో సుమారు రూ.500 నుంచి రూ.1000 తీసుకుని అక్రమంగా ఓటరు ఐడీ కార్డులు జారీ చేస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతీ,యువకులకులు ఓటు హక్కు పొందేందుకు అర్హులు. కానీ వీఆర్‌పురం, కూనవరం మండలాలకు చెందిన పలువురు 18 ఏళ్లు నిండకపోయినా పోలవరం ప్యాకేజీ వర్తిస్తుందనే అత్యాశతో అక్రమంగా మీసేవా కేంద్రాల ద్వారా ఓటర్ ఐడీ కార్డులు పొందుతున్నారు. టీడీపీ నేతల కనుసైగల్లోనే ఇక్కడంతా జరుగుతోంది. ముఖ్యంగా వీఆర్ పురంలోని టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తన బంధు గణమంతటికీ ఈ రకంగా కార్డులు సమకూర్చినట్టు తెలుస్తోంది. పరిహారం సొమ్మును కొట్టేసేందుకు నేతలు ఈ రకమైన కుట్రకు పాల్పడుతున్నారు. ఆ కార్డులు చెల్లవు. నిబంధనలకు విరుద్ధంగా మీసేవా కేంద్రాల ద్వారా ఓటర్ ఐడీ కార్డులు పొందారని నా దృష్టికి వచ్చింది. రెవెన్యూ శాఖ పరిశీలన లేకుండా ఓటర్ ఐడీ కార్డులు పొందడం నేరం. అక్రమంగా పొందిన కార్డులు ఆన్లైన్లో ఎంటర్ అయ్యే అవకాశం లేదు .ఇవి కేవలం స్థానికంగా సృష్టించినవి మాత్రమే. ఇలా పొందిన కార్డులను కొన్ని గుర్తించడం జరిగింది వాటిపై విచారణ చేపడుతున్నాం. బాధ్యులైన వారిపై చర్యలు చేపడతాం –జీవీఎస్ ప్రసాద్ ,తహసీల్దార్, వీఆర్‌పురం. -
ఆపదవేళ.. ఆప్తబంధువులా..
- చాపరాయి బాధితులను పరామర్శించిన జగన్ - గిరిజనుల్లో భరోసా నింపిన వైఎస్సార్ సీపీ అధినేత - అభయారణ్యం, ప్రమాదకర ఘాట్‌లో 70 కిలోమీటర్లు సాగిన ప్రయాణం సాక్షి, రాజమహేంద్రవరం : ఎవరిని కదిపినా కన్నీళ్లే. ఏ ఒక్కరిని పలుకరించినా కష్టాలే. తమకు జరిగిన అన్యాయాన్ని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తలచుకొని ఆ అడవి బిడ్డలు కొండలు ప్రతిధ్వనించేలా రోదిస్తున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన అభాగ్యులు.. తల్లీబిడ్డలను కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న బాధితులు.. ఇలా ఒకరేమిటి? అనేకమంది బాధిత గిరిజనుల కన్నీళ్లు తుడిచే సదాశయంతో వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏజెన్సీలో పర్యటించారు. బాధిత గిరిజన కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు ఎంత కష్టమైనా వెనుకాడలేదు. దట్టమైన అభయారణ్యంలో.. ఘాట్ రోడ్డు మీదుగా.. సాహసోపేతంగా పయనించి గిరిజనుల చెంతకు వెళ్లారు. కొండంత కష్టాల్లో ఉన్న వారిని అక్కున చేర్చుకుని ఓదార్చారు. ఆదుకుంటానని చెప్పి కొండంత ధైర్యం ఇచ్చారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి బాధితులను శనివారం ఉదయం పరామర్శించిన జగన్.. అనంతరం మారేడుమిల్లి మీదుగా చాపరాయి గ్రామానికి వెళ్లారు. మారేడుమిల్లి నుంచి దట్టమైన అడవి, ఘాట్ రోడ్డులో ప్రయాణించి మధ్యాహ్నం రెండు గంటలకు ఆ గ్రామానికి చేరుకున్నారు. మార్గం మధ్యలోని గ్రామాల్లో తనకోసం ఎదురు చూస్తున్న గిరిజనుల సమస్యలు వింటూ, వాటి పరిష్కారానికి భరోసా ఇస్తూ తన పయనం సాగించారు. ఆకుమామిడికోట, బొడ్డుమానివీధి, విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం బొడుగుమామిడి, పోతవరం, రంపచోడవరం నియోజకవర్గం దారగడ్డ, యొడ్లకొండ గ్రామాల్లో తనకోసం రోడ్డుపైకి వచ్చిన గిరిజనులు చూసిన ఆగిన జగన్.. వారిని ఆప్యాయంగా పలుకరించారు. ఆయా గ్రామాల్లో మహిళలు, వృద్ధులు, యువకులు తమ సమస్యలను జగన్‌కు మొర పెట్టుకున్నారు. తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. తాగడానికి కనీసం గుక్కెడు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వాగుల్లో నీరు తాగుతున్నామని, స్నానానికి వర్షపు నీటిని వాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఆస్పత్రికి వెళదామన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బోరుమన్నారు. నీరు నిలిచి ఉండడంతో దోమలు పెరిగిపోతున్నాయని వాపోయారు. పాకల్లో ఉంటున్న తమకు ప్రభుత్వం తమకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. 70 ఏళ్లు వచ్చినా పింఛన్ ఇవ్వడం లేదని వాపోయారు. మాకు మీరే దిక్కు ‘‘ఇవే సమస్యలతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. మాకు మంచినీరు, తిండి, రోడ్లు వేయించండి. మీరే మాకు దిక్కు. మా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి’’ అంటూ ఆయా గ్రామాల గిరిజనులు జగన్‌కు విన్నవించారు. వారి కష్టాలను, సమస్యలను సావధానంగా విన్న జగన్.. అందరం కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని చెప్పారు. తోలు మందం చంద్రబాబుకు సమస్యలు చెప్పినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అయినా విడవకుండా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేద్దామని భరోసా ఇచ్చారు. స్థానికంగా పరిష్కారమయ్యే పింఛన్లు, రేషన్ కార్డులవంటి వాటిని పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరిలకు సూచించారు. ఆయా గ్రామాల ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలను తీసుకున్నారు. ప్రతిపక్షంగా సమస్యల పరిష్కారంపై పోరాడదామని, మన ప్రభుత్వం వచ్చాక అందిరికీ మంచి చేస్తామని హామీ ఇచ్చారు. చేయి ఇచ్చి నడిపించిన గిరిజనులు గ్రామాల్లో వాగులు, వంకలు దాటేందుకు స్థానిక గిరిజనులు జగన్‌కు సహాయం చేశారు. తమ చేతిని అందించి జగన్‌ను తమ ఊరి నుంచి సాగనంపారు. కటారికోట గ్రామంలో కర్రెల వంతెనను ఓ మహిళ జగన్ చేయిపట్టుకుని దాటించింది. కటారికోట దాటిన తర్వాత చాపరాయి గ్రామానికి మధ్య ఏడు కిలోమీటర్లు కొండలు ఎక్కి దిగాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో వాహనాలు కొండలు ఎక్కలేకపోయాయి. జగన్ కాన్వాయ్‌లో సెక్యూరిటీ వాహనాలు చాపరాయికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాయి. స్థానికంగా సమకూర్చిన వాహనంలో జగన్ చాపరాయి గ్రామం వెళ్లారు. వాగులు, వంకలు దాటి గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. వారిలో ధైర్యం నింపారు. అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. జగన్ పర్యటనతో ఏజెన్సీ ప్రజల మోముల్లో తమ సమస్యలు ఇకనైనా తీరతాయన్న ఆనందం కనిపించింది. ఒక్కొక్కరి తలపై నిమురుతూ వారిని ఆప్యాయంగా పలుకరించడంతో ఆయా గ్రామాల్లో గిరిజనులు ఆనందంతో కంటతడిపెట్టారు. సీతమ్మ కొడుకు వైఎస్ జగన్ చాపరాయి గ్రామానికి వచ్చిన వై.రామవరం మండలం బొడ్డగండి నుంచి సీతమ్మ అనే వృద్ధురాలు వచ్చింది. దాదాపు ఎనిమిది కిలోమీటర్లు నడిచి వచ్చిన సీతమ్మ.. చాపరాయి గ్రామంలో తమ పంచాయతీ సమస్యలను చెప్పుకొంది. జగన్‌తో ఆమె మాట్లాడుతూ ‘‘మా ఊరిలో తాగడానికి నీరు లేదు. రోడ్లు లేవు. ఎవ్వరూ పట్టించుకోవడంలేదు’’ అంటూ తమ సమస్యలు పరిష్కరించేందుకు సీతమ్మ కొడుకు వైఎస్ జగన్ వచ్చాడని ఆనందం వ్యక్తం చేసింది. ‘‘మాకు నీవే దిక్కు కొడుకా.. ఏమి చేస్తవో’’ అంటూ ఆప్యాయంగా మాట్లాడింది. సీతమ్మ కొడుకు జగన్ అని ఆమె అనగానే అక్కడ ఉన్న గిరిజనులు చప్పట్లతో హోరెత్తించారు. -
ధైర్యం చెబుతూ... భరోసానిస్తూ...
- చాపరాయి బాధితులకు జగన్ ఓదార్పు - అధినేత రాకతో పార్టీ శ్రేణుల్లో సందడి - తరలివచ్చిన వెస్సార్సీపీ నేతలు కాకినాడ, కాకినాడ క్రైం: అధైర్యపడవద్దని ధైర్యం చెబుతూ... త్వరలోనే కోలుకుంటారని భరోసానిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి చాపరాయి విషజ్వరాల బాధితులకు ఓదార్పునిచ్చారు. ఏజెన్సీలోని చాపరాయి విషజ్వరాలు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ శుక్రవారం రాత్రి పరామర్శించారు. పీడియాట్రిక్ వార్డులో ఉన్న చిన్నారులు విజయ, కనకమ్మ, కె.స్వామిరెడ్డి, పల్లాల చిట్టెమ్మతో వైఎస్ జగన్ మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. ప్రభుత్వాస్పత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న వైద్యులతో కూడా మాట్లాడి మెరుగైన సేవలు అందించాల్సిందిగా కోరారు. దాదాపు 30 నిమిషాలపాటు అక్కడ గడిపిన జగన్ నలుగురు బాధితులతోనూ మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితులతోపాటు చాపరాయి ప్రాంతంలో రేషన్ సరుకులు, మంచినీరు, వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకునే విధంగా రోగులకు పౌష్టికాహారాన్ని, ఇతర సేవలను అందించాలని ఇన్చార్జ్ సూపరింటెండెంట్ జీఎస్‌ఎన్‌మూర్తి, సీఎస్‌ఆర్‌ఎంవో శ్రీరామచంద్రమూర్తి, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ మాణిక్యాంబ, వైద్యులు డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ గిరిధర్‌లకు సూచించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన బాధితులను జగన్ స్వయంగా జీజీహెచ్‌కు వచ్చి ధైర్యం చెప్పడంతో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఊరటనిచ్చినట్లయిది. జగన్‌కు ఘన స్వాగతం... పశ్చిమగోదావరి జిల్లా నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పాముల రాజేశ్వరిదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, రాష్ట్ర, జిల్లా యువజన విభాగాల అధ్యక్షులు జక్కంపూడి రాజా, అనంత ఉదయ భాస్కర్‌తోపాటు వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లాకమిటీ నాయకులు ఘనస్వాగతం పలికారు. జగన్ వస్తున్న సమాచారం తెలియజేయడంతో పార్టీ శ్రేణులతోపాటు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున జీజీహెచ్‌కు తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగాను, పార్టీ శ్రేణుల నినాదాలతో కోలాహలంగా మారింది. కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న నర్సులు తమ సమస్యలను జగన్‌కు విన్నవించగా రాజమహేంద్రవరం ప్రాంతంలో వైఎస్ హయాంలో ఇచ్చిన నివాసాలను జన్మభూమి కమిటీ సభ్యులు బలవంతంగా తొలగించి తమకు అన్యాయం చేస్తున్నారంటూ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాలరాజు, వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, గిరిజాల బాబు, కొండేటి చిట్టిబాబు, ముత్తా శశిధర్, పర్వత ప్రసాద్, పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండకుదిటి మోహన్, సంగిశెట్టి అశోక్, ఎన్.ఎస్.రాజు, ముదునూరి మురళీకృష్ణంరాజు, రాష్ట్ర ప్రచారకమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, రాష్ట్ర బీసీసెల్ క్యాదర్శి అల్లిరాజబాబు, రాష్ట్ర యువజన విభాగం సభ్యులు వాసిరెడ్డిజమీలు, జిల్లా అనుబంధ విభాగాల కన్వీనర్లు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, జిన్నూరి వెంకటేశ్వరరావు, హరినా«ద్, ముమ్మిడివరం ప్లోర్‌లీడర్ కాశి మునికుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా అధికార ప్రతినిధులు సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, కె.ఆదిత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మన్యం పట్టని మంత్రులు
► కొడుకు సినిమా ప్రమోషన్లో ఒకరు ► వ్యక్తిగత పనుల్లో మరొకరు ► పట్టించుకోని జిల్లా ప్రజాప్రతినిధులు ► ముఖం చాటేసిన అరకు ఎంపీ, ఎమ్మెల్యేలు ► ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్షకు హాజరు కాని వైనం ► ఏజెన్సీలో పర్యటిస్తున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి సాక్షి, విశాఖపట్నం: ఆంత్రాక్స్..ఇప్పటికే 10 మంది ఈ మహమ్మారి బారిన పడి విలవిల్లాడిపోతున్నారు. ఇక విషజ్వరాలతో మన్యం మంచంపట్టింది. రక్తహీనత, సికిల్‌సెల్ వంటి వ్యాధులతో వందలాది మంది అల్లాడిపోతున్నారు. ఏజెన్సీలో పరిస్థితి రోజురోజుకు దయనీయంగా ఉంటోంది. జిల్లా మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు మాత్రం ఇది పట్టడం లేదు. ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్ర మానవ వనరులశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తన కొడుకు రవితేజ సినిమా ప్రమోషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఏజెన్సీవాసుల ఆరోగ్యం పట్ల ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. రవితేజ నటించిన జయదేవ్ సినిమా శుక్రవారం విడుదల కానుండడంతో ఆ సినిమా ప్రమోషన్ కోసం గంటా నానా హైరానా పడుతున్నారు. మరో సీనియర్ మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు కూడా ఇదే రీతిలో ముఖం చాటేశారు. ఆంత్రాక్స్‌తో ఏజెన్సీ అల్లాడి పోతున్నా అయ్యన్న అటువైపు చూడకపోవడం పట్ల ఏజెన్సీ వాసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరే కాదు..అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఏ ఒక్కరూ అటు వైపు తొంగి చూడకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. చివరకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులు సైతం సొంత నియోజకవర్గం పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా చీమకుట్టినట్టయినా లేకపోవడం గమనార్హం. ఏజెన్సీలో పరిస్థితి ఎలా ఉంది? ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయడం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పూనం మాలకొండయ్య మన్యంలో పర్యటించి జిల్లా అధికారులతో సమీక్షించినప్పటికీ మంత్రులు, ప్రజాప్రతినిధుల్లో ఏ ఒక్కరూ హాజరుకాకపోవడం ఏజెన్సీ వాసుల ఆరోగ్య పరిరక్షణ పట్ల వీరికి ఏపాటి శ్రద్ధ ఉందో తేటతెల్లమవుతోంది. గిడ్డి ఈశ్వరి ఒక్కరే వైఎస్సార్సీపీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఒక్కరే ఏజెన్సీలో కలియతిరుగుతున్నారు. ఆంత్రాక్స్ విజృంభించిన అరకు నియోజకవర్గంతో పాటు పాడేరులో నియోజకవర్గంలోని మారుమూల పల్లెల్లో సైతం పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. బాధితులకు ధైర్యం చెబుతున్నారు.ఆంత్రాక్స్ లక్షణాలున్న వారినే కాదు..జ్వరపీడితులు ఎçక్కడెక్కడ ఉన్నారో గుర్తించి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించే కార్యక్రమాన్ని ఆమె దగ్గరుండి చూస్తున్నారు. -
వైద్య ఖాళీలు భర్తీ చేయండి.. షరతులు వర్తిస్తాయి
– ఏజెన్సీలో వైద్యులు, సిబ్బంది భర్తీపై సర్కారు నాటకం – కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయాలంటూ సీఎం ఆదేశం – ఉద్యోగ భద్రత లేకుండా ఏజెన్సీలో పని చేసేందుకు వైద్యుల విముఖత – రెగ్యులర్ విధానంలో ఎందుకు భర్తీ చేయరు? – గత ఏడాది చింతూరు సభలో సీఎం ఇచ్చిన హామీ ఏమైంది? – చాపరాయి ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాలని అధికారులకు హితవు – కాళ్లవాపు మృతుల ఘటనతో నేర్చుకోలేదా..? – ప్రాణాలు పోతున్నా ప్రకటనలతో సరిపెడతారా..? సాక్షి, రాజమహేంద్రవరం: వైద్య, ఆరోగ్యశాఖలో తక్షణమే ఖాళీలను భర్తీ చేయండి. కాంట్రాక్టు పద్ధతిలో చేయండి. శాశ్వత నియామకాల వరకు వేసి చూడొడ్డు. చాపరాయి ఘటనతో అధికారులు పాఠాలు నేర్చుకోండి. వైద్య ఆరోగ్యశాఖలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను నీరుగారిస్తే సహించం. ఇదీ క్లుప్తంగా మంగళవారం వివిధ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలు. చేసిన సూచనలు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేయండం, అధికారులపై చిందులు తొక్కడం... ఆ తర్వాత షరా మామూలే. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు చూసిన వారు ఆయన గిరిజనుల ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ చూపుతున్నారోనని ప్రజలు అనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది ఏప్రిల్‌లో విలీన మండలాల్లో పర్యటన సందర్భంగా చింతూరు బహిరంగ సభలో మన్యంపై వరాల జల్లు కురిపించారు. ఏరియా ఆస్పత్రి ఏర్పాటు చేసి అవసరమైన అన్ని సదుపాయాలు, వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తామన్నారు. పీహెచ్‌సీల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేస్తామని చెప్పారు. జూన్, జూలై నెలల్లో అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధితో 16 మంది గిరిజనులు మృతి చెందినప్పుడు ఇలాంటి ప్రకటనలే చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరుగకుండా గట్టి చర్యలు చేపడతామన్నారు. చింతూరులో డయాలసిస్, ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ చంద్రబాబు మాటలు కోటలు దాటినా పనులు గడప దాటలేదు అన్న విషయం ఏడాది క్రితం ఆయన చేసిన హామీలు, ప్రకటనలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. చింతూరు సభ జరిగి ఏడాది రెండు నెలలు, కాళ్ల వాపు ఘటన జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. ఆ రెండు సమయాల్లో సీఎం చంద్రబాబు వైద్య పోస్టులను తక్షణమే భర్తీ చేస్తామన్నారు. ఆ మేరకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు కూడా పంపారు. కానీ రెగ్యులర్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు అవసరమైన జీవో ఇవ్వకుండా నాన్చుతున్నారు. ఉద్యోగ భద్రత లేకుండా ఎవరు వస్తారు..? కాంట్రాక్టు పద్దతిలో వైద్య పోస్టులను భర్తీ చేయాలని సీఎం చెబుతున్నారు. పట్టణాల్లో అన్ని సౌకర్యాలున్నా కూడా కాంట్రాక్టు విధానంలో పని చేసేందుకు స్పెషలిస్ట్ డాక్టర్లు, కనీసం ఎంబీబీఎస్ చదవిన డాక్టర్లు కూడా రారు. అలాంటిది ఎలాంటి సౌకర్యాలు లేని ఏజెన్సీలో పని చేయడానికి ఎలా వస్తారు?. వైద్య విధానంలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు ఏజెన్సీలోని ఆస్పత్రుల్లో పోస్టులను రెగ్యులర్ విధానంలో ఎందుకు భర్తీ చేయడంలేదు. వైద్యులు ఇక్కడ ఉండడానికి నివాసం, మంచి ఆహారం చింతూరు, రంపచోడవరంలలో కూడా లభించదు. ప్రస్తుతం నాలుగు రోజుల నుంచి చాపరాయి బాధితులను పరామర్శించడానికి వెళుతున్న అధికారులకు తినడానికి తిండి కూడా దొరకడంలేదు. కొంత మంది అధికారులు అక్కడికి వెళ్లే సమయంలో రాజమహేంద్రవరం నుంచి భోజనం పార్శిళ్లు తీసుకెళుతున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడాలంటే చింతూరు, రంపచోడవరంలలో ఐటీడీఏ ఆధ్వర్యంలో క్యాంటిన్లు నిర్వహించాలి. వైద్యాధికారులు, సిబ్బంది ఉండేందుకు నివాసాలు నిర్మించాలి. కానీ ఇవ్వన్నీ చేయరు. ఘటన జరిగినప్పుడు మాత్రం ఏదో చేసినట్లు ప్రకటనలతో కాలాన్ని నడిపిస్తారు. కాలంతోపాటు సమస్య కూడా సమసిపోతుంది. కాళ్లవాపుతో పాఠాలు నేర్చుకోలేదా...? చాపరాయి ఘటనతో అధికారులు పాఠాలు నేర్చుకోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి గత ఏడాది జరిగిన కాళ్లవాపు మరణాలతో ఏం నేర్చుకున్నారో ఆ ఘటనపై అనేక మార్లు ప్రకటనలు చేసిన ఆయనకే తెలియాలి. ఏజెన్సీలో పోస్టుల భర్తీకి, కొత్తగా గత ఏడాది చింతూరు సభలో సీఎం ఇచ్చిన హామీల పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు పంపినా అవి చెత్త బుట్టలకే పరిమితమయ్యాయి. ఏడాది అవుతున్నా భర్తీకి సంబంధించిన జీవో ఎందుకు విడుదల చేయలేదో ముఖ్యమంత్రి చంద్రబాబుకే తెలియాలి. 11 మండలాలు, 1180 గ్రామాలు, 4.5 లక్షల మంది ప్రజల ఆరోగ్యంపై సర్కారు నిర్లక్ష్యాన్ని చాపరాయి ఘటన మరోమారు ఎత్తి చూపుతోంది. -
ఇదో కేసు స్టడీ
చాపరాయి మరణాలపై మంత్రి కామినేని ఏజెన్సీలో ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన కాళ్లవాపు మరణాలతో ఏం గుణపాఠం నేర్చుకున్నారు? ఏజెన్సీలో అంటువ్యాధుల బారినపడి 16 మంది గిరిజనులు నెల్లాళ్ల వ్యవధిలో మరణిస్తే ఆ ౾అంశాన్ని మంత్రి కామినేని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. గిరిజనులకు మౌలిక వసతులు కల్పించడం సాధ్యం కాదని ఆరోగ్యశాఖ మంత్రి స్వయంగా వ్యాఖ్యానించడమే దానికి అద్దం పడుతోంది. రంపచోడవరం: చాపరాయిలో గిరిజనుల మరణాలు ఒక కేసు స్టడీలాంటివని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వాఖ్యానించారు. మారుమూల లోతట్టు గ్రామాల్లోని గిరిజన పల్లెలకు రోడ్లు, మౌలిక వసతులు కల్పించడం సాధ్యం కాదని అమరావతిలో మంగళవారం వ్యాఖ్యానించిన మంత్రి కామినేని బుధవారం రంపచోడవరం పర్యటనలో సైతం అదే ధోరణిని ప్రదర్శించారు. అంతుచిక్కని వ్యాధులతో, అంటురోగాలతో గిరిజనులు పిట్టల్లా రాలిపోతుంటే మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. రంపచోడవరంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంత మంది చనిపోతే నేర్చుకుంటారు? గత ఏడాది విలీన మండలంలో కాళ్లవాపు వ్యాధితో 14 మంది గిరిజనులు మృతి చెందారు. అప్పుడు చింతూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. నేటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కనీసం వచ్చిన రోగులకు వైద్య సేవలందించేందుకు పూర్తి స్ధాయిలో వైద్య సిబ్బంది నియమించలేదు. ఒక పక్క గిరిజనుల ప్రాణాలు పోతుంటే కంటితుడుపు చర్యలతో సరిపెట్టారు. ఇప్పటికీ కాళ్లవాపు వ్యాధికి మూలాలను తెలుసుకోలేకపోయారు. గ్రామాల్లో రక్షిత మంచినీరు ఇచ్చేందుకు ఆర్ఓ ప్లాంట్లును ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించడం లేదు. గైనిక్ సేవలు అందక మాతాశిశు మరణాలు రాజవొమ్మంగి, గంగవరం మండలాల్లో 50 వరకు మతాశిశు మరణాలు సంభవించాయి. దీనిపై ప్రభుత్వం నేటికీ సీరియస్‌గా పరిగణించలేదు. గైనిక్ సేవలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోలేదు. గిరిజన మహిళలకు పౌష్టికాహారం అందడం లేదు. పీహెచ్సీ పరిధిలో క్షేత్రస్ధాయిలో పనిచేసే సిబ్బంది పోస్టుల భర్తీపై దృష్టి సారించడం లేదు. ఆశల సేవలకు ఏదీ గుర్తింపు? ఏజెన్సీలో గ్రామస్ధాయిలో పనిచేసే ఆశ వర్కర్లకు వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చే అతి కొద్దిపాటి జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదు. వారు గ్రామాల్లో వ్యాధినిరోధక కార్యక్రమాల అమలుకు పనిచేస్తున్నారు. వైద్య ఆరోగ్య పరిస్ధితులపై పీహెచ్సీ సిబ్బందికి సమాచారం ఇవ్వడం వంటి కీలకమైన పనులు చేస్తున్నారు. అలాంటి వీరికి నెల నెలా చెల్లించాల్సిన రూ. 400 కూడా సక్రమంగా చెల్లించడం లేదు. ఏడాది కాలంగా ఆశవర్కర్లుకు చెల్లించాల్సిన రూ. 6 లక్షలు నేటికీ విడుదల కాలేదు. 2007 నుంచి 2014 వరకు ఎనిమిదేళ్లు పాటు సంవత్సరానికి మూడు నెలలు చొప్పున 24 నెలలు గౌరవ వేతనం రూ.19 లక్షల 20 వేలు నేటికి అందలేదు. విడుదలైన ఈ డబ్బు ఎవరి దగ్గర ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. -
ఆ హామీ ... ఆచరణలో లేదేమీ...?
- ‘తూర్పు’ ఏజెన్సీలో వరుస మరణాలు - ప్రతి ఏడాది పునరావృతమవుతున్నా ప్రభుత్వ చర్యలు శూన్యం - ప్రతిపాదనలు దాటని సీఎం చంద్రబాబు హామీలు - విలీన మండలాల్లో పరిస్థితి మరింత దారుణం - ప్రసవం కోసం తెలంగాణ వెళ్లాల్సిందే సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఏటా మలేరియా, టైఫాయిడ్, అంతుచిక్కని వ్యాధులతో గిరిజనులు మరణిస్తున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదు. సకాలంలో వ్యాధిని గుర్తించి, చికిత్స అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బందితోపాటు మౌలిక వసతులు ఇక్కడ కరువయ్యాయి. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు వచ్చి ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోవడంలేదు. గత ఏడాది ఏప్రిల్ 13వ తేదీన సీఎం చంద్రబాబు విలీన మండలాల పర్యటనకు వచ్చారు. చింతూరులో నిర్వహించిన బహిరంగ సభలో వరాల జల్లు కురిపించారు. అయితే ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటినా పనులు గడప దాటనివిధంగా ఉన్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన వీఆర్ పురం, ఎటపాక, చింతూరు, కూనవరం మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చింతూరు ప్రాథమిక వైద్యశాలను ఏరియా ఆస్పత్రిగా మారుస్తామని, స్పెషలిస్ట్ వైద్యులను నియమించి పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు అందిస్తామని ప్రజల సాక్షిగా అప్పట్లో సీఎం ప్రకటించారు. ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మూడు నెలల్లో ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, ఆ హామీలేవీ ఇప్పటికీ అమలుకు నోచలేదు. ఏరియా ఆస్పత్రి కోసం ప్రకటించినా, ఆ భవనం ఇంకా పునాదుల దశలోనే ఉంది. ఆపరేషన్ థియేటర్‌ను పక్కనే ఉన్న స్కూలు భవనంలో ఏర్పాటు చేశారు. కానీ అది బోర్డులకే పరిమితమైంది. అక్కడ ఎలాంటి పరికాలు, సౌకర్యాలు లేవు. సీఎం హామీ ఇచ్చి 14 నెలలవుతున్నా భవనం పూర్తి కాలేదు. ఇక వైద్య పోస్టుల భర్తీకి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేయాల్సిన ఉత్తర్వులను ఇప్పటివరకూ విడుదల చేయలేదు. మరణాలకు అడ్డుకట్ట ఎప్పుడు? గత ఏడాది విలీన మండలాల్లో అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధితో 16 మంది మరణించారు. మాతాశిశు మరణాలతోపాటు టైఫాయిడ్, మలేరియా, విషజ్వరాలతో తరచూ చనిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఏటా వర్షాకాలంలో జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలుతుంటాయి. గత ఏడాది జరిగిన మరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం మిన్నకుంది. ఫలితంగానే వై.రామవరం మండలం చాపరాయిలో 16 మంది మలేరియాతో మరణించారు. తాజాగా చింతూరులో మడివి దేవుడమ్మ (3) అనే గర్భిణి, వీఆర్ పురం మండలంలో తొమ్మిదేళ్ల చిన్నారి జశ్వంత్ మలేరియాతో సోమవారం మరణించారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడానికి వైద్యులు ఆసక్తి చూపడంలేదంటూ ప్రభుత్వం సాకులు చెపుతోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో రూ.1.30 లక్షలు ఇస్తామన్నా ఎవ్వరూ రావడం లేదని జిల్లా వైద్యాధికారులు అంటున్నారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, ఇతర సిబ్బంది పోస్టులను ప్రభుత్వమే నేరుగా భర్తీ చేస్తే ఎందుకు రారన్న ప్రశ్నకు వారివద్ద సమాధానం లేదు. ముందుగా గుర్తిస్తేనే సమస్యలకు పరిష్కారం... బాహ్య ప్రపంచానికి దూరంగా ఎలాంటి రహదారి సౌకర్యం లేని ఏజెన్సీ గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలినప్పుడు వైద్యాధికారులు తక్షణమే గుర్తించి వైద్యసేవలు అందిస్తే ప్రాణాలు దక్కుతాయి. గర్భిణులకు ప్రారంభం నుంచి మంచి పౌష్టికాహారం అందిస్తూ తరచూ వైద్య పరీక్షలు నిర్వహిస్తే మాతాశిశు మరణాలను అరికట్టవచ్చు. కానీ ఇక్కడ ఉన్న వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో అవేమీ జరగడం లేదు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 95 సబ్‌సెంటర్ల పరిధిలో 486 పోస్టులున్నాయి. వీటిలో 139 పోస్టులను భర్తీ చేయలేదు. ఇక విలీన మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చింతూరు పీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా మార్చినా వైద్య పోస్టులను భర్తీ చేయలేదు. ఏరియా ఆస్పత్రిలో నలుగురు సివిల్ సర్జన్లు, డెంటిస్ట్, గైనకాలజిస్ట్, మత్తు వైద్యుడు వంటి స్పెషలిస్టు పోస్టుల భర్తీ చేపట్టలేదు. స్టాఫ్‌నర్సులను నియమించలేదు. వరరామచంద్రపురం మండలం రేఖపల్లి, కూటూరు పీహెచ్‌సీల్లో వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కూనవరం సీహెచ్‌సీలో 25 మంది సిబ్బందికిగాను 15 మంది మాత్రమే ఉన్నారు. ఫలితంగా గిరిజనులకు కనీస వైద్య సేవలు అందడం లేదు. దీంతో రంపచోడవరం పరిసర ప్రాంతాల గిరిజనులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి, విలీన మండలాల గిరిజనులు భద్రాచలం ఆస్పత్రికి వెళుతున్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు చింతూరులో ఏరియా ఆస్పత్రి నిర్మాణం పూర్తయి, వైద్యాధికారులను నియమించి ఉంటే భద్రాచలం ఆస్పత్రిలో నిండు గర్భిణి మడివి దేవుడమ్మ మలేరియా వల్ల సోమవారం మరణించి ఉండేది కాదు. సిజేరియన్ చేయాలని వైద్య పరీక్షలు నిర్వహించగా మలేరియా సోకినట్టు వైద్యులు గుర్తించారు. అదే ప్రారంభంలోనే గుర్తించి ఉంటే వైద్యం అందించి ఉంటే దేవుడమ్మతోపాటు, నెలలు నిండిన గర్భస్థ శిశువు కూడా ప్రాణాలతో ఉండేవారు. సీఎం హామీల మేరకు ప్రతిపాదనలు పంపాం... ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. చింతూరులో రెగ్యులర్ పోస్టు ఒక్కటే ఉంది. ఏరియా ఆస్పత్రికి అవసరమైన వైద్య పోస్టులు, సిబ్బంది, యంత్రాల కోసం ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి జీఓ రావాల్సి ఉంది. - డాక్టర్ టి.రమేష్ కిశోర్, జిల్లా ప్రభుత్వాస్పత్రుల సమన్వయ అధికారి -
ఏజెన్సీలో జగన్ పర్యటన ఖరారు
జూలై 1న చాపరాయిలో పర్యటన జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు వెల్లడి కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏజెన్సీ పర్యటన ఖరారైందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మంగళవారం రాత్రి వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ రాత్రికి జిల్లాకు చేరుకుంటారని, జూలై 1వ తేదీన విష జ్వరాలతో అల్లాడుతున్న చాపరాయి, ఇతర గ్రామాలను సందర్శించి మృతుల కుటుంబాలను జగన్ పరామర్శిస్తారని తెలిపారు. అక్కడి పరిస్థితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నెలకున్న సమస్యల్ని బాధిత కుటుంబాలు, స్థానికులతో జగన్ మాట్లాడి తెలుసుకుంటారన్నారని జిల్లా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు అనంతబాబు తెలిపారు. చాపరాయి ఘటనపై జగన్ ఆరా... వై.రామవరం మండలం చాపరాయి ఘటనపై జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుతో మాట్లాడారు. మృతుల కుటుంబాలు, బాధితులకు న్యాయం జరిగేలా పార్టీ అండగా నిలవాలని జగన్ ఆదేశించారు. -
మంచమెక్కిన మన్యం
ఏజెన్సీలో ఏ పల్లె చూసినా జ్వరపీడితులే ప్రతీ ఇంటా ఇద్దరు... ముగ్గురు బాధితులు సర్కారు మందు బిళ్లలతో నయం కాని వైనం ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్న గిరిజనం వ్యాధి ముదిరితే ఇక మరణమే శరణ్యం సాలూరురూరల్:జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతీ ఇంటా రోగులు దుప్పట్లు ముసుగేసుకుని మూలుగుతున్నారు. ముఖ్యంగా సాలూరు మండలం గంజాయిభద్ర పంచాయతీ ధూళిభద్ర, పనికి, ఎగువశెంబి తదితర గిరిశిఖర గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా ఈ జ్వరాలతో బాధపడుతున్నారు. ధూళిభద్ర గ్రామంలో చోడిపల్లి శామియేలు, చోడిపల్లి దాసయ్య, లుంబే, గమ్మెల ఆనంద్, గమ్మెలసుకరి, గమ్మెలవట్రి, గమ్మెల అజయ్. గమ్మెల దన్ను, తాడంగి బిరుమ, తాడంగి సోమి, గమ్మెల బిహును తదితరులు, పనికి గ్రామంలో కొర్ర గాసి, కొర్ర హిందు, కొర్ర గిత్త, గమ్మెల రుపిణి తదితరులు, ఎగువశెంబిలో తాడంగి చిరంజీవి, తాడంగి రంజి, తాడంగి సితాయి, తాడంగి టికామో, తాడంగి కామేష్ తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు. చలిజ్వరాలతో దుప్పట్లు కప్పుకొని ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్కోఇంటిలో ఇద్దరి నుంచి నలుగురు జ్వరాలతో బాధపడుతున్నారు. వీరిలో అధికంగా చిన్నారులే ఉన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్లు, హెల్త్ అసిస్టెంట్లు తరచూ గ్రామానికి వచ్చి రోగులకు పారాసిట్మాల్ మాత్రలు ఇచ్చి వెళ్తున్నారనీ.. అయినా తగ్గుముఖం పట్టడంలేదని బాధితులు చెబుతున్నారు. ఇక తప్పని సరి పరిస్థితుల్లో స్థానిక ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నామని వారు చెబుతున్నారు. కేవలం జ్వరం తగ్గడానికే సుమారు మూడువేల వరకు ఖర్చుచేస్తున్నట్టు వారు పేర్కొంటున్నారు. కష్టంగా మారిన జీవనం రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద గిరిజనులకు వైద్యంకోసం పెద్ద మొత్తం వెచ్చించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనికి వెళ్తేనే రోజు గడుస్తుందనీ లేకపోతే పస్తుతో ఉంటున్న తమ జీవితాలను ఈ జ్వరాలు అతలాకుతలం చేస్తున్నాయని వాపోతున్నారు. వారాల తరబడి మంచమెక్కడంతో పనులు చేసుకోలేక ఇల్లు గడవడం లేదని బాధపడుతున్నారు. జ్వరం తగ్గిన తరువాత కూడా దాదాపు నెలరోజులపాటు కాళ్లు... ఒళ్లు నొప్పులు తగ్గడం లేదని చెబుతున్నారు. చిన్నారులతో తల్లడిల్లుతున్న తల్లులు చంటి బిడ్డలు జ్వరాలతో బాధపడడంతో వారి కన్నతల్లులు తల్లడిల్లుతున్నారు. పిల్లలు తమను అంటిపెట్టుకునే ఉండటంతో ఏ పనికీ బయటకు వెళ్లలేకపోతున్నట్టు చెబుతున్నారు. అధికారులు స్పందించి జ్వరాలతో బాధపడుతున్న సమయంలో తమకు ఖరీదైన మందులు అందించడంతోపాటు ఆ రోజుల్లో జీవనం గడిచేందుకు ఏమైనా ఆర్థిక సహాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. -
ప్రభుత్వ వైఫల్యం వల్లే మరణాలు
ఏజెన్సీలో మలేరియా వ్యాప్తి వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కాకినాడరూరల్ / కరప : ప్రభుత్వం వైఫల్యం వల్లే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆకలి చావులు సంభవిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాఅధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. కరప మండలం నడుకుదురులో ఈ నెల 29న జరిగే జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా మంగళవారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏజెన్సీలోని గిరిజనులు నేటికీ పనస గింజల జావతో కడుపు నింపుకుంటున్నారంటే ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఏజెన్సీ అంతా మలేరియా వ్యాపించి ఉంటే, ప్రభుత్వం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. కలుషిత ఆహారం తినడం వల్ల, కలుషితమైన నీరు తాగడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని అధికారులు చెప్పడం పూర్తిగా బాధ్యతారాహిత్యమంటూ మండిపడ్డారు. పౌష్టికాహార లోపం, రక్తహీనత వల్ల బలహీన పడిపోయి చిన్నపాటి జ్వరానికి కూడా మరణాలు సంభవిస్తున్నాయని కన్నబాబు ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడి వ్యక్తుల్లో మూడు, నాలుగు శాతానికి మించి రక్తం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యుద్ధప్రాతిపదికన వైద్యపరీక్షలు చేయించి, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కన్నబాబు డిమాండ్ చేశారు. గిరిజనుల ఆరోగ్య సమస్యలను పరిశీలించేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే ఏజెన్సీలో పర్యటించనున్నట్టు తెలిపారు. ఎప్పుడు పర్యటించేదీ త్వరలోనే ప్రకటిస్తామని కన్నబాబు వివరించారు. మంత్రి వాఖ్యలు బాధ్యతారాహిత్యం చాపరాయి మరణాలపై మంత్రి కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని కన్నబాబు విమర్శించారు. అక్కడ నివశించే ప్రజలు పౌరులు కాదా అని ప్రశ్నించారు. గ్రామంలో 60 మంది ఉంటే ప్రజలకు ఏం సేవలు అందిస్తామని మంత్రి ప్రకటించడం దారుణమన్నారు. తక్కువ ప్రజలు ఉన్న గ్రామాలకు ప్రభుత్వ సేవలు అందించదా అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కామినేని గిరిజన ప్రజలను చులకన చేసి మాట్లాడడం తగదన్నారు. ప్రజలు బాధల్లో ఉంటే మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని కన్నబాబు అన్నారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా యువజన అధ్యక్షులు అనంత ఉదయ్‌భాస్కర్, పెద్దాపురం, రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, గిరజాల బాబు, రాష్ట్ర ప్రచారవిభాగం ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు కర్రి పాపారాయుడు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీ మరణాలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి
కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి జాతీయ రహదారిపై రాస్తారోకో, ర్యాలీ రావులపాలెం(కొత్తపేట) : ఏజెన్సీ ఏరియాలో 16 మంది గిరిజనులు విషజ్వరాలు, వాంతులతో మృత్యువాత పడితే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ఈ మరణాలకు సమాధానం చెప్పాల్సింది సీఎం చంద్రబాబు నాయుడే నని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏజన్సీ ఏరియాలో మరణాల పట్ల ప్రభుత్వ వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు ధోరణిని వ్యతిరేకిస్తూ సోమవారం కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పదహారో నంబర్ జాతీయ రహదారిపై రావులపాలెం కళా వెంకట్రావు సెంటరులో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇంత మంది మృత్యువాత పడినా ప్రభుత్వం కంటి కనిపించకుండా గుడ్డిగా ఉందని కళ్లకు గంతలు కట్టుకుని జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రాణాలను కాపాడలేని ప్రభుత్వం గద్దె దిగాలని ఈ మరణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. అలాగే స్థానిక సెంటరులో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఏజన్సీలో ఇంత మంది మరణిస్తే ఇటీవల కాలంలో రెండు సార్లు జిల్లాకు వచ్చిన చంద్రబాబు కనీసం ఏజన్సీ వైపు కన్నెత్తి చూడలేదన్నారు. మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తే సరిపోతుందన్న తీరుగా వ్యవహరించడం దారుణం అన్నారు. వెంటనే ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. సంబంధిత మంత్రి అధికారులు మొద్దునిద్ర పోతున్నారని, వారు ఈ ప్రాంతాన్ని సందర్శించాలన్నారు. గత కలెక్టర్ ఆ ప్రాంతంపై సక్రమంగా పని చేయాలేదని, వైద్య ఆరోగ్యశాఖ మొద్దు నిద్రపోతూ నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుందన్నారు. వెంటనే వైద్య ఆరోగ్య శాఖలో అక్కడ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతోపాటు ప్రత్యేక బృందాలను పంపి పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరు నెలల కిత్రం ఈ ప్రాంతంలో పర్యటించి అక్కడ పరిస్థితులను సమీక్షించారని, ఆ ప్రాంతంలో ఏడు స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలిచిందని ప్రభుత్వం ఈ విధంగా వ్యవహిరస్తుందని జగ్గిరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, ఎంపీపీ కోట చెల్లయ్య, మండల కన్వీనర్లు దొమ్మేటి అర్జునరావు, తమ్మన శ్రీను, ఎంపీటీసీ బొక్కా ప్రసాద్, కె.రామకృష్ణ, కముజు సత్యనారాయణ, తోరాటి లక్ష్మణరావు, యనమదల నాగేశ్వరరావు, ఆనెం వెంకన్న, దియ్యన పెదకాపు, తోటకూర సత్యనారాయణ, పమ్మి చంటి తదితరులు పాల్గొన్నారు. -
‘భోజనం’ భారం
- మండుతున్న ధరలతో ఏజెన్సీల నిర్వాహకుల బెంబేలు ధర్మవరం : నలుగురున్న కుటుంబం కూడా కూరగాయలు కొనాలంటే ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తోంది. ఈ పరిస్థితుల్లో పాఠశాలల్లో విద్యార్థులందరికీ కూరలు వండి పెట్టడం మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులకు తలకు మించిన భారంగా మారుతోంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. దీంతోపాటు మధ్యాహ్న భోజన పథకం కూడా మొదలైంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అధికారులు ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశిస్తున్నారు. అయితే మార్కెట్లో ఏ కూరగాయలు కొందామన్నా కిలో రూ.30 నుంచి రూ.50కి తక్కువ కాకుండా ఉన్నాయి. మిర్చి కిలో రూ.70 పలుకుతోంది. సరుకుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అంతంత ధరలు పెట్టి కొని సగటున 50 నుంచి 100 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టాలంటే ఏజెన్సీల నిర్వాహకులకు భారమవుతోంది. అదే ఉన్నత పాఠశాలల్లో అయితే ఈ భారం మరింత ఎక్కువగా ఉంది. అక్కడ కనీసం 500 మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పెంచిన ధరలు(1 - 5 వ తరగతి వరకు రూ.6.30 పైసలు, 6 - 10వ తరగతి వరకు రూ.8.13 పైసలు) సరిపోవడం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని ఏజెన్సీల నిర్వాహకులు కోరుతున్నారు. రూ.లక్షల్లో గతేడాది బకాయిలు గత ఏడాది మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సంబంధించిన వేతనాలు, బిల్లులు ప్రభుత్వం ఇప్పటిదాకా చెల్లించలేదు. 2017 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన బిల్లులు, వేతనాలు చెల్లించాల్సి ఉంది. సగటున వందమంది విద్యార్థులకు భోజనం అందిస్తున్న ఏజెన్సీకి నెలకు రూ.15 వేల దాకా బిల్లులు అందాల్సి ఉంది. మూడు నెలలకు కలిపి రూ.45 వేలు చొప్పున రావాలి. అవి అందకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు భోజనం పెట్టేందుకు డబ్బులు వడ్డీలకు తెస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,043 ప్రాథమిక, 1,003 ప్రాథమికోన్నత, 988 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 5,034 పాఠశాలల్లో 5,61,495 విద్యార్థులు చదువుతున్నారు. 5034 ఏజెన్సీల æద్వారా మొత్తం విద్యార్థులకు రోజూ అన్నం పెడుతున్నారు. ఇందుకుగానూ ఆయా ఏజెన్సీలకు నెలకు రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన గత ఏడాది బిల్లులే రూ.21 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మధ్యాహ్న భోజన పథకం మెనూ సోమ, గురువారం : అన్నం +కూరగాయలతో కూడిన సాంబారు మంగళవారం, శుక్రవారం : ఏదైనా ఒక కూర+రసం బుధవారం, శనివారం : పప్పు, ఆకు కూర పప్పు దీంతోపాటు వారానికి మూడురోజులు(రేట్లు పెంచిన తర్వాత పెంచారు) కోడిగుడ్డు ఇవ్వాలి -
మదినిండుగా భూమిపండుగ
ఏజన్సీలో అడవిబిడ్డల ఆనందహేల విల్లంబులతో పురుషులు వేటకు పయనం ఆటపాటలతో మహిళల నృత్యాలు చింతూరు (రంపచోడవరం): ఆదివాసీలకు ఎంతో ప్రాముఖ్యం కలిగిన భూమిపండుగ వేడుక ఏజెన్సీ వ్యాప్తంగా కోలాహలంగా సాగుతోంది. తొలకరి ప్రారంభంలో మూడు రోజులపాటు ప్రతి పల్లెలో ఈ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి తమ భూముల్లో సిరులు పండాలని కోరుకుంటూ కులదేవతలతో పాటు విత్తనాలకు, భూమికి పూజ నిర్వహించడమే ఈ పండుగ ప్రాముఖ్యత. మూడు రోజులపాటు నిర్వహించే పండుగ వాతావరణం ముగియగానే అందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. సంప్రదాయ వేట, ఆటాపాటా మూడు రోజులపాటు పురుషులంతా కలసి విల్లంబులు చేతబూని సంప్రదాయ వేట నిమిత్తం అడవిబాట పడతారు. ఇదే సమయంలో మహిళలు పండుగ నిర్వహణ కోసం గ్రామ సమీపంలోని రహదారుల వద్దకు చేరుకుని రేల నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ, వచ్చీ, పోయే వాహనాలను ఆపుతూ డబ్బులు అడుగుతారు. కొన్ని గ్రామాల మహిళలు మండల కేంద్రాలకు వచ్చి దుకాణాల వద్ద కూడా డబ్బులు అడుగుతారు. ఇలా మూడు రోజులపాటు వసూలైన డబ్బులతో పూజలకు కావల్సిన సామగ్రి కొనుగోలు చేసి పండుగ నిర్వహిస్తారు. ఇక ఉదయం వేటకు వెళ్లిన పరుషులు సాయంత్రానికి ఇళ్లకు చేరుకుంటారు. వేటలో భాగంగా ఏదైనా జంతువును వేటాడితే దానిని గ్రామస్తులంతా సమానంగా పంచుకుంటారు. ఏ జంతువును వేటాడకుండా ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన పురుషులపై సంప్రదాయంలో భాగంగా మహిళలు పేడనీళ్లు జల్లి స్వాగతం పలుకుతారు. -
ఆగమేఘాల మీద ‘63’ ఏళ్ల ఫైలు
♦ చీఫ్ సెక్రటరీ చెంతకు వైద్య ఆరోగ్యశాఖలో పదవీ విరమణ వయసు పెంపు ఫైలు ♦ గుంటూరు పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ కోసమే ఇదంతా! ♦ ఆయన కోసం ఆస్పత్రికి విరాళమిచ్చిన పారిశ్రామికవేత్త ఒత్తిడి ♦ కొత్త నియామకాలు, పదోన్నతులు చేయకుండా ఎలా పెంచుతారు ♦ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసిన ప్రభుత్వ వైద్యుల సంఘం సాక్షి, అమరావతి రిటైర్ కాబోతున్న ఓ ఉద్యోగిని పదవిలో కొనసాగించేందుకు పదవీ విరమణ వయసునే ప్రభుత్వం పెంచాలనుకోవడం ఆ శాఖ ఉద్యోగుకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దేశ చరిత్రలోనే ప్రప్రథమమని భావిస్తున్న ఈ చర్య రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో చోటుచేసుకుంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 ఏళ్లకు పెంచింది. అయితే నాలుగు రోజుల క్రితం బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయసును 63 ఏళ్లకు పెంచాలని మళ్లీ ఫైలు సిద్ధం చేశారు. ఆగమేఘాల మీద ఈ ఫైలును రెడీ చేసి ఈనెల 26న చీఫ్ సెక్రటరీకి పంపించారు. పదవీ విరమణ వయసు పెంచాలని ఎలాంటి విజ్ఞప్తులూ లేవు, లేఖా రాయలేదు, పైగా వైద్య సంఘాలు వ్యతిరేకిస్తున్నా ఒక వ్యక్తిని పదవిలో మరింతకాలం కూర్చోబెట్టేందుకు తీసుకున్న నిర్ణయమంటూ వైద్య వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పెంపు వెనుక అసలు కథ ఇదీ ఈ నెల 31న గుంటూరు పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ డా. రాజునాయుడు రిటైర్ కాబోతున్నారు. ఆయనను మరింత కాలం కొనసాగించాలని అదే ఆస్పత్రికి రూ. 20 కోట్లు పైగా విరాళం ఇచ్చిన ఓ పారిశ్రామిక వేత్త నిర్ణయించి.. ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో తక్షణమే 63 ఏళ్ల పెంపు ఫైలు రెడీ చేసి పేషీకి పంపించాలని వైద్య విద్యా సంచాలకులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించారు. ఈ ఆదేశాలతో ఫైలును ఒక్కరోజులో రెడీ చేసి పంపించారు. దీనికి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆమోద ముద్ర వేసి ఈనెల 26న చీఫ్ సెక్రటరీకి ఫైలు పంపించారు. నేడో రేపో జీవో వస్తుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. నియామకాలు, పదోన్నతుల సంగతేమిటి? ప్రస్తుతం బోధనాసుపత్రుల్లో 600కు పైగా ఖాళీలున్నాయి. వీటిని రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ప్రభుత్వం సుముఖత చూపడం లేదు. అలాగే ఏళ్ల తరబడి ప్రభుత్వ వైద్యుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. కనీసం సీని యర్ రెసిడెంట్లకు సకాలంలో గౌరవ వేతనం కూడా ఇవ్వకపోవడంతో సమ్మె నోటీసు ఇచ్చారు. ఇక హౌస్ సర్జన్లకు, పీజీ స్టూడెంట్లకు ఇచ్చే స్టయిఫండ్ గత మూడేళ్లుగా పెంచలేదు. ఇలాంటి సమస్యలు బోధనాసుపత్రుల్లో ఉండగా పదవీ విరమణ పెంపుపై నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పాత సమస్యలు పరిష్కరించకుండా ఇదేంటి? పదవీ విరమణ వయసు 63 ఏళ్లకు పెంపు నిర్ణయంపై ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ నిర్ణయంపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు ఈనెల 25న సంఘం లేఖ రాసింది. ముందుగా రోగులకు సరిపడా యూనిట్లు లేవని, వాటిని ఏర్పాటు చేయకుండా, సకాలంలో పదో న్నతులు ఇవ్వకుండా, పేస్కేళ్లు ఇవ్వకుండా 60 ఏళ్లు దాటినా తిరిగి వారినే కొనసాగించడమేమిటని లేఖలో ప్రశ్నించారు. పదవీ విరమణ వయసు పెంచాలని ఏ ప్రభుత్వ డాక్టరు అడగడం లేదని, గతంలో ఉన్న సమస్యలను ముందు పరిష్కరించాలని లేఖలో కోరింది. లేదంటే ఆందోళనకు సిద్ధం కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
గిరిజనులు భక్తిభావంతో మెలగాలి
చిన జీయర్‌స్వామి రంపచోడవరం : ఏజెన్సీలోని గిరిజనులు భక్తి భావంతో మెలగాలని, వారి సంస్కృతి, సంప్రదాయాలను పాటించి రానున్న తరాలవారికి ఆదర్శంగా నిలవాలని త్రిదండి శ్రీమన్నారా యణ చిన జీయర్‌స్వామి అన్నారు. స్థానిక నారాయణగిరిపై శుక్రవారం జరిగే ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిమిత్తం రంపచోడవరం వచ్చిన ఆయన గురువారం స్థానిక వాల్మీకిపేటలోని వా ల్మీకి విగ్రహం వద్ద కొబ్బరికాయ కొ ట్టి పూలమాలలు వేశారు. రామాయణం రచించిన వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థానిక సర్పంచ్ వై.నిరంజనీదేవిని అభినందించారు. వాల్మీకి ప్రపంచానికే రాముని గురించి చాటి చెప్పిన మహర్షి అన్నారు. స్థానికులు చినజీయర్‌స్వామికి ఘన స్వాగతం పలికారు. న్యాయవాది ఎంవీఆర్ ప్రకాష్, సాదిక్ మాస్టారు, భవానీశంకర్, భూచక్రం ,ప్రియబాబు, దేవీ, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
తూర్పు మన్యంలో ప్రకృతి సేద్యం
జిల్లాలోనే ముందంజ సత్ఫలితాలు సాధిస్తున్న రంపచోడవరం వ్యవసాయశాఖ రంపచోడవరం : తూర్పు ఏజెన్సీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టి సత్ఫలితాలు సాధిస్తోంది. జిల్లాలోనే ప్రకృతి సేద్యంలో అందరికంటే ముందంజలో ఇక్కడి వ్యవసాయశాఖ ఉంది. 2016–17 సంవత్సరంలో ఎటపాక డివిజ¯ŒSలో రికార్డు స్థాయిలో ఎకరాకు 45 క్వింటాళ్ల వరకు మిర్చి పండించారు. క్వింటాకు రూ. 15 వేలు రైతులు మార్కెట్ చేసుకున్నారు.దీంతో ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో రైతులు ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాంతంలో మిర్చి పంటలో రసాయనాల వాడకం వల్ల తెల్ల దోమ పెరిగి వైరస్ తెగుళ్లు అధికమై దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఎకరానికి 4 క్వింటాళ్లకు దిగుబడి పడిపోయింది. ఇలాంటి పరిస్థితిలోనే మిర్చి రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు పరిస్థితి మారి పురుగు మందుల నుంచి తేరుకుని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. దీనికి కారణం కొండ ఆవుల సంపద వేల సంఖ్యలో ఉండడం, గోమూత్రం, గోమయం సుమారుగా 70 రెట్లు జెర్సీ ఆవుకంటే పురుగులు, తెగుళ్లు నివారించడంలో ముందుంది. ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం డివిజ¯ŒSలో జీడిమామిడిపై ప్రకృతి వ్యవసాయాన్ని ప్రస్తుతం ఆరు గ్రామాల్లో ప్రారంభించారు. గిరిజన రైతులకు గోమయం, గోమూత్రం ద్వారా జీవామృతం తయారు చేసుకోవడంపై శిక్షణ ఇచ్చారు. జీడిమామిడి కాపు గుత్తులుగా కాయడం, గింజ పెద్దదిగా ఉండడం, టీదోమ మటుమాయం కావడం, తెగుళ్లు దరిదాపునకు రాకపోవడం వంటి అంశాలు గిరిజన రైతాంగం ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి కారణమైయింది. ఇటీవల ఏజెన్సీలో పర్యటించిన ప్రభుత్వ రైతు సాధికారత సంస్థ వైస్ చైర్మన్, రాష్ట్రప్రభుత్వ వ్యవసాయశాఖ ప్రత్యేక సలహాదారు పి.విజయకుమార్ ప్రకృతి సేద్యం చేస్తున్న క్లస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏజెన్సీలో ప్రకృతి సాగుకు ప్రోత్సహించేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు ఏజెన్సీలో దాదాపు 75 శాతం వ్యవసాయం వర్షాధారంపైనే ఆధారపడుతున్నదని వ్యవసాయశాఖ ఏడీఏ దల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రంపచోడవరం డివిజ¯ŒSలో భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అవీ ఇంకా పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. ఇలాంటి పరిస్థితిలో వ్యవసాయ అభివృద్థికి ఆటంకం లేకుండా రైతులకు 135 ఆయిల్ ఇంజన్లు, 195 స్ప్రింక్లర్లు పైపులను 2016 సంవత్సరంలో రైతులకు అందించి ప్రోత్సహించాం. ఇలాంటి చర్యల ఫలితంగా మొక్కజొన్న 1825 హెక్టార్లు, పత్తి 1660 హెక్టార్లు, వరి 10330 హెక్టార్లలోను, మినుము 3009, పెసర 1900 హెక్టార్లలో సేద్యం చేస్తున్నారన్నారు. పూర్తిగా వర్షాధారంతో జొన్న 1692 హెక్టార్లు, నువ్వులు 2000 హెక్టార్లు, కంది 600 హెక్టార్లు, జీడిమామిడి 40 వేల హెక్టార్లు సాగు చేయడం జరిగిందన్నారు. రికార్డుస్థాయిలో మొక్కజొన్న, మినుములు దిగుబడి వచ్చిందన్నారు. ఈ రబీలో కొత్త వంగడాలతో నువ్వుల పంటలో భారీ దిగుబడి సాధించాం. కందులు 584 హెక్టార్లకు ఉచితంగా ఇచ్చి పోడు వ్యవసాయంలోను, మిశ్రమ పంటకు ప్రోత్సహించినట్టు తెలిపారు. వీటితో పాటు ఏజెన్సీలో కనుమరుగవుతున్న చిరుధాన్యాలు కొర్రలు, జొన్న, సామా, రాగి, సజ్జలను పెద్ద ఎత్తున ప్రభుత్వ సహకారంతో అభివృద్థి చేస్తున్నామన్నారు. చిరుధాన్యాలను మూడు వేల ఎకరాల్లో సాగు చేసేందుకు కోవెల ఫౌండేషన్, శక్తి, ఏఎస్‌డీఎస్ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో మారుమూల గ్రామాల్లో కూడా వ్యవసాయాభివృద్థిలో ప్రగతి సాధించాలని కార్యచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. -
బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అదేశాలు జారీ చేసింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 దాకా బ్యాంకులు పనిచేయాలని ఆదేశించింది. దీంతో అన్ని ఏజెన్సీ బ్యాంకులు ఈ రోజుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రయివేటు బ్యాంకులు ఎనిమిది రోజులూ తెరిచే ఉంచాలని ఆదేశించింది. కొన్ని ఎంపిక చేసిన ఆర్బిఐ కార్యాలయాలు కూడా పనిచేయనున్నాయి. పన్నుల వసూళ్లు సహా, ప్రభుత్వ రసీదులు, చెల్లింపు విధులను సులభతరం చేసేందుకుగాను ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని ఏజెన్సీ బ్యాంకులు, వారి శాఖలను మార్చ 25-ఏప్రిల్ 1 వ తేదీ మధ్య తెరిచి ఉంచాలని ఆదేశించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1, 2017 దాకా (శనివారం, ఆదివారం మరియు అన్ని సెలవులు సహా) పనిచేయాలని ఆర్బీఐ జారీ చేసిన ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే రిజర్వ్‌బ్యాంక్ ఆధ్వర్యంలోని సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా తెరిచే ఉంటాయని తెలిపింది. -
అగ్ని కీలలు
బుట్టాయగూడెం :అడవిలో కార్చిచ్చు రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అగ్ని కీలలు అరణ్యాన్ని భస్మీపటలం చేస్తున్నాయి. మూడు రోజులుగా దొరమామిడి, అలివేరు, పందిరి మామిడిగూడెం, కామవరం, గొట్టాలరేవు, చింతకొండ, ముంజులూరు, పులిరామన్నగూడెం, గోగుమిల్లి తదితర గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో అగ్నికీలలు ఎగసి పడుతున్నాయి. పచ్చదనంతో కళకళలాడే ఎత్తైన కొండలను సైతం మంటలు చుట్టుముడుతున్నాయి. బయటి ప్రాంతం నుంచి చూస్తే కొండలు, గుట్టల మీదుగా తెల్లటి పొగలు మేఘాలు కమ్మే శాయి. రాత్రి వేళ మంటలు కనిపిస్తున్నాయి. విలువైన అటవీ సంపద దహనమవుతున్నా అటవీ, అగ్నిమాపక శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా.. వేసవిలో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణమని చెప్పుకొస్తున్నారు. వెదురు తోపుల్లోని బొంగులు రాసుకోవడం వల్ల మంటలు రేగాయని అంటున్నారు. ఫైర్ వాచర్స్ ఏరీ ! బుట్టాయగూడెం మండలంతోపాటు జీలుగువిుల్లి, పోలవరం మండలాల్లో అటవీ ప్రాంతం ఉంది. ఏటా వేసవిలో ఏదో ఒక మూల అగ్నికీలలు చెలరేగి అడవిని కాల్చేస్తున్నాయి. విలువైన అటవీ సంపద తుడిచిపెట్టుకుపోవడంతోపాటు మూగజీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. అడవిని పరిరక్షించేందుకు ఫైర్ వాచర్స్‌ను నియమించాల్సి ఉండగా.. అటవీ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. -
ఆగని మృత్యుగీతం
ఏజెన్సీ ఆశ్రమ వసతిగృహాల్లో గిరిజన విద్యార్థుల మరణాలు ఆగటం లేదు. ఆదివాసీ చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఏడాదిలో 23 మంది రక్తహీనత, పచ్చకామెర్లు, మలేరియా, డయేరియా లక్షణాలతో చనిపోయారు. ఒక్క మార్చి నెలలో రెండు వారాల వ్యవధిలో ఏకంగా ఎనిమిది మంది మరణించారు. పరిస్థితి చేయిదాటిపోతున్నా..ఐటీడీఏ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్ట లేదు. వ్యాధుల కాలం కార్యాచరణను అమలు చేయకపోవడం, ఆశ్రమాలు, గురుకులాల్లో పిన్‌పాయింట్ ప్రోగ్రాం లేకపోవడం ఇందుకు కారణమన్న వాదన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ► ఆశ్రమాలు, హాస్టళ్లలో అనారోగ్యంతో రాలిపోతున్న చిన్నారులు ► తాజాగా రక్తహీనతతో ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి ► నియంత్రణ చర్యలు చేపట్టని ఐటీడీఏ, వైద్య, ఆరోగ్యశాఖ పాడేరు/డుంబ్రిగుడ: మరో పసిమొగ్గ రాలిపోయింది. డుంబ్రిగుడ ఆశ్రమ పాఠశాలలో గురువారం ఓ విద్యార్థి అనారోగ్యంతో చనిపోయిన సంఘటనను మరిచిపోక ముందే ఇదే మండలం జాముగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని శెట్టిఅశ్విని రక్తహీనతతో బాధపడుతూ అరకులోయ ఏరియా ఆసుపత్రిలో గురువారం రాత్రి చనిపోయింది. ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల్లో సంభవిస్తున్న గిరిజన విద్యార్థుల ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 15 ఏళ్లలోపు వీరు ఏటా మృత్యువాత పడుతున్నారు. చదువు కోసం పిన్నవయస్సులో తల్లిదండ్రుల ఆలనా, పాలనలకు దూరంగా ఆశ్రమాల్లో చేరుతున్న వీరికి సరైన పోషణ, సంరక్షణ కల్పించడంలో అలక్ష్యం చోటుచేసుకుంటోంది. తమ అనారోగ్య సమస్యలను వారు వ్యక్తపరచలేకపోతున్నారు. అది విషమంగా పరిణమిస్తోంది. గుర్తించి ఆస్పత్రిలో చేర్చేసరికి కాలాతీతమై పరిస్థితి చేయిదాటుతోంది. విద్యార్థుల ప్రాణాలు నిలవడం లేదు.15 రోజుల వ్యవధిలో 8 మంది విద్యార్థులు అనారోగ్య పరిస్థితుల వల్ల మృతి చెందారు. ఇలా ఏటా ఆశ్రమాల్లో విద్యార్థుల మరణాలు వెలుగు చూస్తున్నాయి. ఇందుకు తార్కాణాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల బందవీధి ఆశ్రమ విద్యార్థిని జవ్వాది శైలజ, సూకూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థిని రేగం జానకి, అరడకోట ఆశ్రమ విద్యార్థి నాయుడు శివాజీ మృతి చెందారు. ఇదే నెలలలో పెదబయలు గురుకుల విద్యార్థి హరిశ్చంద్ర ప్రసాద్, రింతాడ పాఠశాల విద్యార్థిని తలుపులమ్మ, చింతపల్లి పాఠశాలలో ఎన్.గీత, డుంబ్రిగుడ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న మాదెల విష్ణువర్ధన్, జాముగూడ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని మృతి చెందారు. పచ్చకామెర్లు, రక్తహీనత, జ్వరం వంటి అనారోగ్య పరిస్థితుల వల్ల వీరంతా చనిపోతున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి: డీఎం హెచ్‌వో సరోజిని డుంబ్రిగుడ: హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య సమస్యల పట్ల నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఎంహెచ్‌వో సరోజిని ఆదేశించారు. డుంబ్రిగుడ బాలుర వసతిగృహంలో గురువారం విద్యార్థి మాదల విష్ణువర్ధన్, శుక్రవారం జాముగుడ పాఠశాల విద్యార్థిని శెట్టి అశ్విని మృతి చెందడంతో ఆమె శుక్రవారం డుంబ్రిగుడ వచ్చారు. విష్ణువర్ధన్ మృతికి కారణాలకు హెచ్ఎం విజయరావుతో పాటు ఆరోగ్యకార్యకర్త చిట్టిబాబును అడిగి తెలుసుకున్నారు. జాముగుడ బాలికల పాఠశాలకు వెళ్లి విద్యార్థిని అశ్విని మృతికి కారణాలను హెచ్ఎం మంగమ్మను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు చిన్నపాటి అనారోగ్యానికి గురైనా సమీప ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించాలన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. హాస్టళ్లలో పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం స్థానిక పీహెచ్‌సీకి వెళ్లి విద్యార్థులకు వైద్యసేవలపై ఆరా తీశారు. ఆమె వెంట వైద్యాధికారి శాంతికిరణ్ ఉన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: మాజీ ఎమ్మెల్యే రవిబాబు పాడేరు: ఏజెన్సీ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి విద్యార్థులందరికీ ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహించాలని ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు నెలల్లో 11 మంది విద్యార్థులు మృతి చెందారన్నారు. పౌష్టికాహారం, వైద్య, ఆరోగ్య సమస్యలను విద్యార్థులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. హాస్టళ్లలోని గిరిజన విద్యార్థులకు అనుబంధ పోషకాహారం సరఫరా చేయాలన్నారు. రోజుకొకరు చనిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని విమర్శించారు. దీనికి అధికారులే బాధ్యత వహించాలన్నారు. గిరిజన విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్య అందడం లేదన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ ఎస్వీ రమణ, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు జంపరంగి ప్రసాద్ పాల్గొన్నారు. -
‘నీట్’ ఎంబీబీఎస్‌కు వయసు నిబంధన సడలింపు!
రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు సాక్షి, అమరావతి: నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లకు పోటీ పడే అభ్యర్థులకు ప్రస్తుతమున్న వయసు నిబంధనను సడలించనున్నట్టు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) వర్గాలు తెలిపాయి. రెండు మూడు రోజుల్లో దీనిపై నిర్ణ యం వెలువడే అవకాశముందని అధికార వర్గాలు తెలి పాయి. ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్లకు పోటీ పడే అభ్య ర్థులు 17 ఏళ్ల వయసు నిండి.. 24 ఏళ్ల లోపు వారై ఉండా లి. అలాగే 3సార్లు మాత్రమే ఈ అర్హత ప్రవేశ పరీక్ష రాసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వైద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో ఈ నిబంధనలను సడలించాలని ఎంసీఐ నిర్ణయించింది. 17 ఏళ్ల వయసు లేకపోయినా అత్యంత ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశమిస్తే బాగుంటుం దని ఎంసీఐ కమిటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే గరిష్ట వయోపరిమితితో పాటు ఎన్ని సార్లు ఈ అర్హత పరీక్ష రాసుకోవచ్చు అనేది ఇంకా నిర్ణయించలే దని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పీజీ వైద్య విద్య కోసం పోటీ పడే విద్యార్థులకు మాత్రం ఎలాంటి వయసు సడలింపు లేదని ఎంసీఐ వర్గాలు తెలిపాయి. ఎస్హెచ్యూఏటీఎస్ చాన్స్‌లర్‌గా జెట్టి సాక్షి, హైదరాబాద్: సామ్ హిగ్గిన్బాటమ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్, టెక్నాలజీ, సైన్సెస్ (ఎస్హెచ్యూఏటీఎస్) చాన్స్‌లర్‌గా ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్ జెట్టి ఎ ఒలీవర్ వరుసగా రెండోసారి ఎంపికయినట్లు యూనివర్సిటీ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ సంబంధిత కోర్సుల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా మంచి కోర్సులపై దృష్టి సారించినట్లు జెట్టి తెలిపారు. ఆహార భద్రతకు బయో సైన్స్ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. -
డిజిటల్ దోపిడీ
⇒ కరెంట్ మీటర్ల ఏర్పాటులో వసూళ్ల పర్వం ⇒ మీటర్ల బిగింపును ఏజెన్సీకి అప్పగించిన ఎన్పీడీసీఎల్ ఖమ్మం: డిజిటల్ మీటర్ల ఏర్పాటులో ఏజెన్సీ నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో మీటర్‌కు రూ.200 వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యుత్ శాఖలో ముడుపులు ముట్టజెప్పనిదే పని జరగదనడానికి ఈ వ్యవహారం నిదర్శనంగా నిలుస్తోంది. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్ మీటర్ల స్థానంలో స్కానింగ్ ద్వారా రీడింగ్‌ను తీసుకునే డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మీటర్ల ఏర్పాటును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఎన్పీడీసీఎల్ నగదు ఇచ్చినా, సదరు సిబ్బంది వినియోగదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్ల ద్వారా రీడింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని ఎన్పీడీసీఎల్ గుర్తించింది. ఈ మీటర్లనుంచి విద్యుత్ విని యోగం రీడింగ్ చేస్తున్న సమయంలో ఎక్కువ విద్యుత్ వాడినప్పటికీ.. తక్కువ రీడింగ్ చూప డం.. మరికొన్ని చోట్ల తక్కువ రీడింగ్ చూపి నా.. ఎక్కువ బిల్లులు రావడం తదితర ఘట నలు చోటుచేసుకుంటున్నాయి. ఏసీ,ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్న వారు.. ఎక్కువ బిల్లు వచ్చిన నెలలో ప్రైవేట్ ఆపరేటర్‌తో మా ట్లాడుకుని బిల్లు తక్కువ వచ్చేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఇటువంటి అవకతవకలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఎన్పీడీసీఎల్ కొత్తగా డిజిటల్ మీటర్లను అమర్చాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఖమ్మం సర్కిల్ పరిధిలోని రెండు జిల్లాలో డిజిటల్ మీటర్ల ఏర్పాటును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఒక్కో మీటర్ ఏర్పాటుకు రూ.500 చొప్పున ఇస్తున్నారు. ప్రతి ఇంటికి డిజిటల్ మీటరు విద్యుత్ బిల్లులు సక్రమంగా వచ్చేందుకు ప్రస్తు తం ఖమ్మం సర్కిల్ పరిధిలోని ఖమ్మం, భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ఐఆర్డీఏ డిజిటల్ మీటర్లను అమరుస్తున్నారు. మొత్తం 6,61,737 డిజిటల్ మీటర్లను అమర్చాల్సి ఉంది. ఈ పనిని కూడా ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. వీరు ప్రస్తుతం డిజిటల్ మీటర్లను అమర్చే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు 3,17,737 డిజిటల్ మీటర్లను అమర్చారు. మరో 3.44లక్షల డిజి టల్ మీటర్లను అమర్చాల్సి ఉంది. వీటిని కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. మీటర్ల ఏర్పాటులో చేతివాటం ప్రతి ఇంటిలో డిజిటల్ మీటర్‌ను అమర్చే పనులను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డిజిటల్ మీటర్‌ను అమర్చిన తర్వాత ప్రతి ఒక్కరి నుంచి డిమాండ్ చేసి మరీ రూ.200 వసూలు చేస్తుండటంతో విద్యుత్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్ దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పుడు తామెందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ప్రైవేట్ ఏజెన్సీల వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. వారు మాత్రం తాము పని చేసినందుకు డబ్బులు ఇవ్వాల్సిందేనని కరాఖండిగా చెబు తూ వసూలు చేస్తున్నారు. ఈవిషయంపై ఖమ్మం సర్కిల్ ఎస్ఈ రమేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. డిజిటల్ విద్యుత్ మీటర్ల ఏర్పాటును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించామని, వీరు ఉచితంగానే డిజిటల్ మీటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా మీటర్ అమరిస్తే డబ్బులు అడిగితే తమకు సమాచారం అందించాలని సూచించారు. -
ఏజెన్సీ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి చర్యలు
బుట్టాయగూడెం (పోలవరం) : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో కె.కోటీశ్వరి చెప్పారు. బుధవారం బుట్టాయగూడెం మండలంలోని కేఆర్ పురం ఐటీడీఏలో జిల్లా మలేరియా కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. శుక్రవారం నులిపురుగుల నివారణకు పంపిణీ చేసే మాత్రల నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెంలో ప్రభుత్వ ఆస్పత్రి మంజూరైం దని, సిబ్బందిని నియమించాల్సి ఉందన్నారు. అదేవిధంగా వేలేరుపాడులోని ప్రభుత్వ ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో ఎస్.షణ్మోహన్ ఆదేశాలు జారీ చేశారని ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫార్మసిస్ట్, ఎల్టీ పోస్టుల భర్తీకి కూడా కృషి చేస్తున్నామన్నారు. గిరిజన గ్రామాల్లో మలేరియా వ్యాప్తి చెందకుండా మలాథియాన్ స్ప్రేయింగ్ చేయిస్తున్నామని చెప్పారు. అన్ని పీహెచ్‌సీల్లో టైఫాయిడ్‌కు సంబంధించిన పరీక్షలు జరిపే విధంగా ఏర్పాటు చేశామన్నారు. మాతాశిశు ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో కొత్తగా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 17 కేంద్రాలను సిద్ధం చేశామని, మరో 14 కేంద్రాలు సిద్ధం చేస్తున్నామన్నారు. డీ వార్మింగ్ డేను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా 6 లక్షల 400 మంది పిల్లలకు మాత్రలు అందిస్తామని చెప్పారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో వంశీలాల్ రాథోడ్ పాల్గొన్నారు. -
‘భరోసా’తో క్రూర పరిహాసం
పింఛన్ల ప్రక్రియలో ‘పచ్చ’పార్టీ ‘కక్ష’తనం జన్మభూమిని బహిష్కరించినందుకు శిక్ష ఏజెన్సీలో ఐదు గ్రామాల్లో పంపిణీ నిలిపివేత పశువుల్లంకలో పింఛన్ సొమ్ములో ఇంటిపన్ను కోత ఒంటి సత్తువ ఉడిగి, కంటిచూపు క్షీణించిన వృద్ధులు, విధివంచితులైన వికలాంగులు, వితంతువులు ఎన్టీఆర్ భరోసా పేరుతో ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కోసం తహతహతో ఎదురు చూస్తుంటారు. ఇచ్చే ఆ పింఛన్ మొత్తం కలిగిన వారు తమ బిడ్డలకు రోజువారీ జేబుఖర్చుకు ఇచ్చేంత కాకపోయినా ..అదే వారి చిరుజీవితాలకు కొండంత వెలుగు. జిల్లాలో ప్రతి నెలా నాలుగు లక్షల 75వేల మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సామాజిక భద్రతా పింఛన్ తీసుకుంటారు. అయితే వారంతా పైన పేర్కొన్న అభాగ్యులూ, ఆ ఆసరాకు నూరు శాతం అర్హులేనా అంటే కొందరు కాదనే చెప్పాలి. కారణం అధికారపార్టీ నేతలు, జన్మభూమి కమిటీల నిర్వాకంతో లబ్ధిదారుల ఎంపికలో పచ్చచొక్కాలకే ప్రాధాన్యం ఇవ్వడం. అంతేకాదు.. జన్మభూమి కమిటీల నిర్వాకంతో పింఛన్ లబ్ధిదారుల ఎంపికలో, పంపిణీలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : సమస్యలను పరిష్కరించాలంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో జన్మభూమిని బహిష్కరించినందుకు మన్యప్రాంతంలోని ఆరు గ్రామాల్లో పింఛన్ల పంపిణీ నిలిపివేశారు. రాజవొమ్మంగి మండలంలో 19 పంచాయతీలుంటే అందులో లాగరాయి, లబ్బర్తి, తంటికొండ, వాతంగి, జడ్డంగి పంచాయతీల్లో పింఛన్ల పంపిణీని జన్మభూమి కమిటీలు చెప్పాయని అధికారులు అడ్డగోలుగా నిలిపివేశారు. ఆ గ్రామాల వారు వాల్మీకి కులస్తులకు కులధృవీకరణ పత్రాలు ఇవ్వాలని, కిర్రాబువాగుపై ఆనకట్ట కట్టాలనే డిమాండ్లతో జన్మభూమిని బహిష్కరించడం అధికారపార్టీ నేతలకు, అధికారులకు తప్పుగా కనిపించింది. అవే కారణాలతో ఆ ఐదు గ్రామాల్లో మంజూరైన సుమారు 120 పింఛన్లను నిలిపివేశారు. ఇందుకు భిన్నంగా పిఠాపురంలో పింఛన్ల కోసం బతికున్న వారిని చనిపోయినట్టుగా చూపించి, వారి భార్యలకు పింఛన్లు మంజూరుచేసి పంపిణీ చేసేశారు. సుమారు 22 మందిని పింఛన్ల కోసం రికార్డుల్లో మృతి చెందినట్టుగా చూపించారని తెలిసింది. ఈ పింఛన్లు అన్నీ తెలుగుతమ్ముళ్ల ఆధ్వర్యంలో ఏర్పాౖటెన జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసినవే కావడం గమనార్హం. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం సాకుతో.. అధికారపార్టీ నేతల మాదిరిగానే క్షేత్రస్థాయిలో పింఛన్లు పంపిణీచేసే కొందరు ఉద్యోగులు కూడా కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. కుడిచేత్తో పింఛన్లు ఇచ్చి ఎడమచేత్తో పన్నుల రూపంలో తిరిగి లాగేసుకుంటున్నారు. ఏడెనిమిది నెలల క్రితం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునిలో తెలుగుతమ్ముళ్లు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు కోసం పింఛన్ల సొమ్ము నుంచి సగం సొమ్మును బలవంతంగా లాగేశారు. ఇప్పుడు ముమ్మిడివరం నియోజకవర్గంలో పంచాయతీ ఉద్యోగులు పింఛన్ల సొమ్ము నుంచి ఇంటి పన్నులు జమ చేసుకుంటూ వికృతంగా వ్యవహరిస్తున్నారు. ఐ.పోలవరం మండలం పశువుల్లంకలో ఈ దురన్యాయం చోటు చేసుకుంటోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి పశువుల్లంక పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పింఛన్ల కోసం వస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ ఇలా ఇచ్చి అలా అదే సొమ్ము నుంచి ఇంటి పన్నును మినహాయించేసుకుంటున్నారు. గత వారం రోజులుగా ఆ పంచాయతీలో పింఛన్ల సొమ్ము నుంచి ఇంటి పన్నులను పంచాయతీ గుమాస్తా, సిబ్బంది మూటగట్టుకుపోతున్నారు. అడిగితే అసలుకే మోసమని.. పింఛన్ల కోసం వెళుతుంటే ఇంటి పన్నులు చెల్లించాలంటూ రూ.300, రూ.400 వంతున సొమ్ము మినహాయించుకుంటున్నారని వృద్ధులు, వితంతువులు ఆవేదన చెందుతున్నారు. అదేమని గట్టిగా అడిగితే పింఛన్ ఎక్కడ లేకుండా చేస్తారనే భయంతో వారు మారుమాటాడకుండా ఇచ్చేస్తున్నారు. ఒకరు ఇద్దరు కాదు పంచాయతీలో ఇంటి పన్ను ఉన్న అందరి దగ్గర నుంచీ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏ పంచాయతీ అయినా ఇంటి పన్ను వసూలు చేయాలంటే ముందు ఇంటి యజమానికి డిమాండ్ నోటీసు ఇవ్వాలి. ఇచ్చిన 10 రోజుల తరువాత పన్ను వసూలుకు వెళ్లాలి.అటువంటి ప్రక్రియ ఏమీ లేకుండానే ‘కడుపులో నీళ్లు కదలకుండా..’ అన్న సామెత మాదిరిగా పంచాయతీ కార్యాలయం వద్దే పింఛన్ల సొమ్ము నుంచి పన్ను వసూలుకు తెగబడటం విస్మయాన్నీ, ఏహ్యతనూ కలిగిస్తోంది. పశువుల్లంకలో ఇంటి పన్ను ఏడాదికి రూ.3లక్షల 19వేలు కాగా ఇందులో ఇప్పటి వరకూ 40 శాతం పన్ను వసూలు చేశారు. జిల్లా యంత్రాంగం స్పందించి ఈ తరహా బలవంతపు వసూళ్లను నియంత్రించాల్సి ఉంది. -
మూడే నెలలన్నారు 9 నెలలైంది
విలీన మండలాల్లో వైద్యం గగనం ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత మూడు నెలల్లో పూర్తి స్థాయిలో వైద్యులను నియమిస్తానన్న సీఎం తొమ్మిది నెలలైనా ఇప్పటికీ కాంట్రాక్ట్ వైద్యుడే దిక్కు సకాలంలో చికిత్స అందక ప్రాణాలు విడుస్తున్న గిరిజనులు చింతూరు ఏరియా ఆసుపత్రిగా పేరు మార్చారు.. సౌకర్యాలు మరిచారు హామీలకే పరిమితమైన డయాలసిస్ సెంటర్ రక్తనిధి కేంద్రం ఏర్పాటు బాబు గారి హామీలు ‘నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను...మూడు నెలల్లో ఏరియా ఆస్పత్రిని చింతూరులో మంజూరు చేస్తాను ... అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తాను... వైద్య నిపుణుల కొరత లేకుండా చూస్తాను ... రోగాలకు భయపడకండ’ం టూ ఏజెన్సీలో గత ఏడాది ఏప్రిల్‌లో సీఎం చంద్రబాబు పర్యటించిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన భరోసా ఇది... కూనవరం సీహెచ్‌సీలో 25 మంది సిబ్బందికిగాను 15 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 14 పోస్టులను భర్తీ చేయకపోవడంతో రోగులకు నాణ్యమైన సేవలు అందడంలేదు. ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, వైద్యులు లేకపోవడంతో అక్కడుండే నర్సులే రోగులకు చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అమలు ఇలా... చింతూరును ఏరియా ఆసుపత్రిగా మార్చారు... మరి వసతులు...సిబ్బంది.. వైద్య నిపుణులు మాట... అదీ చూద్దాం. ∙ఏరియా ఆసుపత్రిగా మార్చి ఆరు నెలలైనా నలుగురు సివిల్ సర్జన్లు, డెంటిస్ట్, గైనకాలజిస్ట్, అనస్థీషియన్ వంటి ప్రత్యేక వైద్య నిపుణులను ఇంతవరకూ నియమించలేదు. స్టాఫ్ నర్సులనూ నియమించలేదు. ∙చింతూరు ఏరియా ఆసుపత్రిలో కనీసం ఒక్కరు కూడా రెగ్యులర్ వైద్యులు లేకపోవడం గమనార్హం. ఏరియా ఆస్పత్రితోపాటు ఇతర మండలాల్లో ఉన్న పీహెచ్సీ, సీహెచ్సీలలో కూడా వైద్యులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వర రామచంద్రాపురం మండలం రేఖపల్లి, కూటూరు పీహెచ్‌సీల్లో వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆస్పత్రులకు జీడిగొప్ప పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులను డిప్యూటేష¯ŒSపై నియమించడంతో అక్కడ వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. వైద్యులతోపాటు జీడిగొప్ప పీహెచ్సీలో ఇద్దరు స్టాఫ్ నర్సులు, కూటూరు పీహెచ్సీలో ఓ స్టాఫ్‌నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సాక్షి, రాజమహేంద్రవరం : విలీన మండలాల్లో వైద్య సేవలు గగనంగా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత వల్ల నాలుగు విలీన మండలాల ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. అరకొరగా ఉన్న వైద్యులు, సిబ్బంది ఆస్పత్రులకు వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించలేకపోతున్నారు. గత ఏడాది ఏప్రిల్ 13న ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా విలీన మండలాల్లో పర్యటించారు. ఆ రోజు జరిగిన చింతూరులో బహిరంగ సభలో మాట్లాడుతూ చింతూరు ప్రాథమిక వైద్యశాలలో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో వైద్యులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు ప్రత్యేక చర్యల ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తామని ప్రకటించారు. సీఎం హామీ ఇచ్చి తొమ్మిది నెలలవుతున్నా ఇప్పటి వరకూ ఆ హామీకి దిక్కులేదు. విలీన మండలాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత వల్ల సకాలంలో వైద్యం అందక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యం కోసం గిరిపుత్రులు తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి వెళుతున్నా ఇతర రాష్ట్రం వారికి ఇక్కడ వైద్యం చేయబోమని తిప్పి పంపేస్తున్నారు. ఏరియా ఆస్పత్రిగా మార్చారు.. సౌకర్యాలు మరిచారు... ఆగస్టు నెల నుంచి విలీన మండలాల్లో గిరిజనులు అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధి బారినపడి ప్రాణాలు వదులుతుందడడంతో ప్రభుత్వం హడావుడిగా చింతూరు ప్రాథమిక వైద్యశాలను ఏరియా ఆస్పతిగా మార్చింది. పేరు మార్చారుగానీ ఇప్పటికీ ఏరియా ఆస్పత్రికి తగినట్లు వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయలేదు. నలుగురు సివిల్ సర్జన్లు, డెంటిస్ట్, గైనకాలజిస్ట్, అనస్థీషియన్ వంటి స్పెషలిస్టు పోస్టుల భర్తీ చేపట్టలేదు. స్టాఫ్ నర్సులనూ నియమించలేదు. ఏరియా ఆస్పత్రిగా మార్చి ఆరు నెలలు కావస్తున్నా కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం విలీన మండలాల ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఒక్కరు కూడా రెగ్యులర్ వైద్యులు లేకపోవడం గమనార్హం. ఏరియా ఆస్పత్రితోపాటు ఇతర మండలాల్లో ఉన్న పీహెచ్సీ, సీహెచ్‌సీ ఆస్పత్రుల్లో కూడా వైద్యలు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీహెచ్‌సీల్లో రెగ్యులర్ వైద్యాధికారులను నియమించకపోవడంతో వైద్యసేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వరరామచంద్రాపురం మండలం రేఖపల్లి, కూటూరు పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆస్పత్రులకు జీడికుప్ప పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులను డిప్యూటేష¯ŒSపై నియమించడంతో అక్కడ వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. వైద్యులతోపాటు జీడిగుప్ప పీహెచ్సీలో రెండు స్టాఫ్ నర్సులు, కూటూరు పీహెచ్సీలో ఒక స్టాఫ్‌నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా కూనవరం సీహెచ్‌సీలో 25 మంది సిబ్బందిగాను 15 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 14 పోస్టులను భర్తీ చేయకపోవడంతో రోగులకు నాణ్యమైన సేవలు అందడంలేదు. ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, వైద్యులు లేకపోవడంతో ఆయా ఆస్పత్రుల్లో ఉండే నర్సులు రోగులకు చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అత్యవసర సమయాల్లో కూడా నర్సులు, సిబ్బందే ప్రజలకు వైద్యం చేస్తుండడంతో విలీన మండలాల్లో వైద్య సేవలు ఏవిధంగా అందుతున్నాయో తెలియజేస్తోంది. డయాలిసిస్ కేంద్రమేదీ? విలీన మండలాల్లో గత ఆగస్టు నుంచి అంతుచిక్క ని కాళ్లవాపు వ్యాధితో 14 మంది మరణించారు. ఈ మరణాలకు ముత్రపిండాలు విఫలమవడం కూడా ఓ కారణమని వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. సురక్షితమైన తాగునీరు అందక గిరిజనులు కొండకోనల్లో దొరికే నీటినే తాగుతున్నారు. ఫలితంగా ముత్రపిండాలు దెబ్బతింటున్నాయి. దీంతో ప్రభుత్వం చింతూరు ఏరియా ఆస్పత్రిలో ముత్రపిండాల డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఏజెన్సీలోని గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందక రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రసవ సమయంలో రక్తం చాలక ప్రాణాపాయం ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా రంపచోడవరంలో రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వహామీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. కొరత ఉంది.. డిప్యూటేష¯ŒSపై నియమించాం చింతూరు ఏరియా ఆస్పత్రికి నూతనంగా బిల్డింగ్ నిర్మింస్తున్నాం. ప్రస్తుతం పక్కనే ఉన్నత పాఠశాలలో ఆపరేష¯ŒS థియేటర్ ఏర్పాటు చేశాం. అక్కడ రెగ్యులర్ వైద్యులు లేరు. కాంట్రాక్ట్ పద్ధతిపై ఒక డాక్టరును నియమించాం. నలుగురు వైద్యులను డిప్యూటేష¯ŒSపై పంపాం. రేఖపల్లి, కూటూరు పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. కూనవరంలో ముగ్గురు వైద్యాధికారులు ఉన్నారు. – డాక్టర్ టి.రమేష్ కిశోర్, డీసీహెచ్ఎస్. వైద్య సేవలు మెరుగుపరచాలి చింతూరు పీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా మార్చినా ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. డాక్టర్లు కొరత ఉంది. సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే అన్ని పోస్టులను భర్తీ చేయాలి. వైద్యసేవలు మెరుగుపరచాలి. డయాలసిస్ సెంటర్‌ను త్వరితగతిన ఏర్పాటు చేయాలి. – సోయం అరుణ, జెడ్పీటీసీ, చింతూరు. -
లంబసింగి @గజగజ
అరకు: మన్యం ప్రాంతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. మన్యం ప్రాంతంలో చలితీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరీ స్వల్పంగా నమోదవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి లంబసింగిలో 5.5 డిగ్రీలు, చింతపల్లిలో 8.5 డిగ్రీలు, మినుములూరు, అరకులో 9 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొగమంచు వల్ల వాహనదారులు ప్రతిరోజు వేకువజామున రోడ్డు స్పష్టంగా కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
వడివడి అడుగులు
జిల్లాలో జల రవాణా పునరుద్ధరణపై ఏజీన్సీని నియమించిన ప్రభుత్వం జిల్లాలో కాలువపై ఉన్న వంతెనలన్నీ తొలగింపు 200 వందల ఎకరాలకు పైగా భూ సేకరణ తాడేపల్లిగూడెం : జిల్లాలో జల రవాణా మార్గాన్ని పునరుద్ధరించే దిశగా వడివడి అడుగులు పడుతున్నాయి. విజ్జేశ్వరం నుంచి ఏలూరు వరకు గల గోదావరి ప్రధాన కాలువ విస్తరణ, టెర్మినల్స్ పనులకు సంబంధించి సర్వే నిమిత్తం ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీని నియమించింది. గోదావరి ప్రధాన కాలువతోపాటు దానికి అనుబంధంగా ఉన్న కాలువల విస్తరణ, ఇతర పనుల కోసం ఎంత భూమిని సేకరించాలి, ఏయే భూములను సేకరించాలనే దానిపై కాంట్రాక్ట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో త్వరలోనే సర్వే పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రెవెన్యూ, జల వనరుల శాఖల అధికారులు ఏలూరులో సమావేశమై కీలకాంశాలపై చర్చించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కాలువల్ని విస్తరించాలి, ఎన్ని వంతెనల్ని తొలగించాల్సి ఉంటుంది, ఎంత భూమి అవసరం అవుతుంది, అందులో రైతులు, ఇతరుల నుంచి సేకరించాల్సిన భూమి ఎంత, జల వనరుల శాఖకు చెందిన భూమి ఎంత ఉందనే విషయాలపై సమీక్షించారు. సర్వే.. మార్కింగ్ బాధ్యతలు కాంట్రాక్ట్ ఏజెన్సీకే.. కాలువను ఏ మేరకు వెడల్పు చేయాలి, ఎక్కడ వంతెనలు తొలగించాలి, ఎక్కడెక్కడ భూముల్ని సేకరించాల్సి ఉందనే విషయాలపై సర్వే చేయాల్సిన బాధ్యతన కాంట్రాక్ట్ ఏజెన్సీకి అప్పగించారు. కాలువ వెంబడి మార్కింగ్ ఇచ్చే పనిని కూడా ఆ సంస్థే చేపట్టాల్సి ఉంటుంది. సర్వే నివేదిక అందిన అనంతరం రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగుతారు. సరిహద్దుల ఆధారంగా ఏ భూమి ఎంత ఉంది, ఏయే సర్వే నంబర్లలో ఉంది, రైతుల నుంచి ఎంత భూమి సేకరించాలనే దానిపై రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిస్తారు. అనంతరం అసలు పనులు మొదలవుతాయి. ఊరి వెలుపల కాలువ వెడల్పు 110 మీటర్లు జల రవాణా నిమిత్తం కాలువలో గర్భం వెడల్పు 25 మీటర్లు ఉంటే సరిపోతుందని భావించారు. ప్రస్తుతం ఆ కొలతలు మారాయి. కాలువ గర్భంలో వెడల్పు 40 మీటర్లు ఉండాలని, కాలువ పైభాగంలో 60 మీటర్ల వెడల్పు ఉండాలని నిర్దేశించారు. పట్టణాలు, గ్రామాల బయట మాత్రం కాలువ వెడల్పు 110 మీటర్లు ఉండేలా చర్యలు చేపట్టబోతున్నారు. ఏలూరులో కాలువను విస్తరించడానికి అనువైన పరిస్థితులు లేనందువల్ల అక్కడి నుంచి బైపాస్ కెనాల్ తవ్వాలని తొలుత భావించారు. అయితే, తూర్పు లాకులు దాటిన తరువాత ఉన్న కాలువను అవసరమైన మేరకు విస్తరించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. బైపాస్ కెనాల్ తవ్వకానికి పెద్ద ఎత్తున భూసేకరణ చేయడం ఆర్థికంగా భారమవుతుందని, న్యాయపరమైన ఇబ్బందులూ తలెత్తే అవకాశం ఉందన్న ఆలోచనకు వచ్చిన అధికారులు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు సమాచారం. అన్ని వంతెనల్ని తొలగించాల్సిందే విజ్జేశ్వరం నుంచి ఏలూరు వరకు 74.514 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న గోదావరి ప్రధాన కాలువపై ఉన్న వంతెనలన్నింటిని తొలగిస్తారు. చిన్నాపెద్దా కలిసి 46 వంతెనలు తొలగించాల్సి ఉంటుందని జల వనరుల శాఖ ప్రాథమికంగా అంచనా వచ్చింది. కాలువ వెడల్పు చేసిన అనంతరం పాత వంతెనల స్థానంలో కొత్త వంతెనలు నిర్మిస్తారు. రవాణాకు ప్రతిబంధకంగా లేకుండా వంతెనలకు అటుఇటు మాత్రమే పిల్లర్లు ఉండేలా నిర్మాణాలు చేపడతారు. జిల్లాలో రెండే టెర్మినల్స్ కార్గో బోట్ల ప్రయాణం, జెట్టీల నిర్మాణం, సరుకులు ఎగుమతి, దిగుమతులు, గోదాముల నిర్మాణాలకు అనువైన స్థలాల విషయమై రైట్స్ (రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్) సంస్థ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం తాడేపల్లిగూడెం, నిడదవోలు పట్టణాల్లో మాత్రమే టెర్మినల్స్ ఏర్పాటు చేస్తారని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఏలూరులోనూ టెర్మినల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని గతంలో అనుకున్నారు. ఇందుకు అవసరమైన స్థలం, మౌలిక వసతుల కల్పన కష్టతరంగా ఉండటంతో జిల్లాలో రెండు టెర్మినల్స్ ఏర్పాటు చేస్తారు. మార్కింగ్ తర్వాత రాళ్లు వేస్తాం జల రవాణాకు సంబంధించి జిల్లాలో సర్వే నిమిత్తం ఏజెన్సీని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ ఏజన్సీ ఆధ్వర్యంలో మార్కింగ్ ఇచ్చాక ఆ ప్రాంతంలో రాళ్లను పాతిస్తాం. ఈ వివరాలను రెవెన్యూ అధికారులకు తెలియచేస్తాం. గోదావరి ఏలూరు కాలువపై ఉన్న అన్ని వంతెనలను తొలగించాలి. తాడేపల్లిగూడెం, నిడదవోలులో మాత్రం టెర్మినల్స్ ఏర్పాటు చేస్తారు. జేబీ నాయక్, జల వనరుల శాఖ , తాడేపల్లిగూడెం సబ్ డివిజన్, డీఈఈ భూముల వివరాలు సేకరిస్తాం జల రవాణా పునరుద్ధరణకు అవసరమైన భూమిని సేకరించేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. జల వనరుల శాఖ అధికారులు రాళ్లుపాతి సరిహద్దులు నిర్ణయించిన అనంతరం ఈ పని చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. పాశం నాగమణి, తహసీల్దార్. తాడేపల్లిగూడెం