స్వాధీనం చేసుకున్న సామగ్రి
విశాఖపట్నం ,సీలేరు (పాడేరు): విశాఖ ఏజెన్సీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఛత్తీస్‌గడ్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన స్థలంలో ఆయుధాలు, సామగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు 60 మంది వరకు సమావేశమై శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరగడంతో పదుల సంఖ్యలో మావోయిస్టులు తప్పించుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గడ్ నుంచి ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌లోకి మావోయిస్టులు వచ్చి ఉంటారన్న సమాచారం మేరకు భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
ఒడిశా సరిహద్దులో బీఎస్‌ఎఫ్, ఎస్‌వోజీ, సీఆర్‌పీఎఫ్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తుండగా, ఆంధ్రాలో స్పెషల్ పార్టీ బలగాలతో ముమ్మర గాలింపులు జరుపుతున్నారు. ఈ మధ్యకాలంలో ఒడిశా రాంగుడ ఎన్‌కౌంటర్ తరువాత మళ్లీ ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్ జరగడంతో ఇరు రాష్ట్రాల పోలీసు అధికారుల సీరియస్‌గా తీసుకున్నారు. ఏజెన్సీలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఇలా ఉండగా సరిహద్దు ప్రాంతాల్లో సీలేరు, చిత్రకొండ, డొంకరాయి, తదితర ప్రాంతాల్లో స్థానిక పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దులో పహారా కాస్తున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం వివరాలు సేకరిస్తున్నారు. వారం కిందట ఒడిశా, తూర్పుగోదావరిలో ఒక్కరోజులో బస్సులను కాల్చివేసిన సంఘటనలు జరిగిన నాటి నుంచి కూంబింగ్ ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌తో ఈ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Comments
Please login to add a commentAdd a comment