పసుపు సాగుకు సిరుల ఛాయ | There is a great demand for Madugula turmeric | Sakshi
Sakshi News home page

పసుపు సాగుకు సిరుల ఛాయ

Published Sun, Mar 16 2025 3:46 AM | Last Updated on Sun, Mar 16 2025 3:46 AM

There is a great demand for Madugula turmeric

మాడుగుల పసుపునకు భలే గిరాకీ     

రంగు, నాణ్యతలో టాప్‌ 

ఏజెన్సీలో విరివిగా పసుపు సాగు 

మాడుగుల, ఎస్‌.కోట, నర్సీపట్నం కేంద్రాలకు  లక్షలాది టన్నుల సరఫరా  

ఏటా 1100 కుటుంబాలకు జీవనోపాధి ∙రూ.96 కోట్ల టర్నోవర్‌  

గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో విశాఖ ఏజెన్సీలో పూర్తి స్థాయిలో గంజాయి సాగును అరికట్టడంతో రెండేళ్లుగా ఏజెన్సీ రైతులు పసుపు, పిప్పలి సాగుపై దృష్టి సారించారు. ప్రస్తుతం పసుపు సాగు సులువుగా ఉండడంతో పాటు అధిక లాభాలు వస్తుండడంతో ఏజెన్సీలో 11 మండలాల్లో పలువురు రైతులు గంజాయి వదిలి పసుపు సాగుపై దృష్టి సారించారు. మూడేళ్లుగా ధరలు పెరుగుతూ వస్తుండడంతో పసుపు సాగు పెరుగుతూ వస్తోంది. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో మాడుగుల పసుపునకు మంచి డిమాండ్‌ ఉంది.  

మాడుగుల : ఉమ్మడి విశాఖ జిల్లాలో మన్యం ముఖద్వారమైన మాడుగుల పసుపు వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఏజెన్సీలో 11 మండలాల్లో పండించిన పసుపు మాడుగుల పసుపు ప్రాసెసింగ్‌ కేంద్రాలకు సరఫరా అవుతుంది. గతంలో 3 వేల ఎకరాలకు పరిమితమైన పసుపు సాగు నేడు 6 వేల ఎకరాలకు పైగా పెరిగింది. ఏజెన్సీ 11 మండలాల నుంచి 80 కిలోలున్న బస్తా లు 80 వేల బస్తాలు వచ్చేవి. ఈ ఏడాది సుమారు లక్షా 70 వేల బస్తాలు సరఫరా అవుతాయని రైతు లు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు.  

పసుపు ప్రాసెసింగ్‌ ఇలా... 
విశాఖ ఏజెన్సీలో పండించిన పసుపు దుంపలు మాడుగుల చేరాక, అక్కడ డ్రమ్ముల్లో వేసి ఉడక బెట్టి ప్రాసెసింగ్‌ చేస్తారు. అనేకమైన ప్రాసెసింగ్‌ తరువాత ఆరెంజ్‌ ఎల్లో రంగుకు మారిన తరువాత ఆకర్షణీయమైన ప్యాకింగ్‌ చేసి ఎగుమతులు చేస్తారు. పంట పండించే దగ్గర నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పసుపు వ్యాపారంపై సుమారు 1100 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారు. 

అంతర్జాతీయంగా గుర్తింపు  
దక్షిణ భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నర్సీపట్నం, పాలకొండ, రాజమండ్రి, వరంగల్, నిజామాబాద్, దుగ్గిరాల, తమిళనాడు, కేరళ, ఒడిశా, కురుపాం, ఈరోడ్డు, బరంపురంలో పసుపు పరిశ్రమలున్నాయి. ఉత్తరాంధ్రాలో మాడుగుల, ఎస్‌.కోట, తుని, నర్సీపట్నం, సాలూరుల్లో పసుపు ప్రాసెసింగ్‌ కేంద్రాలున్నాయి. కానీ మాడుగుల పసుపునకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. 

విశాఖ మన్యంలో పండించే పసుపులో అధిక కుర్కుమిన్‌తో పాటు, చర్య సౌందర్యానికి ఉపయోగపడే, ఓలంటయిల్‌ ఉండడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మిగతా ప్రాంతాల పసుపులో 2 శాతం కుర్కుమిన్‌ ఉంటే మాడుగుల పసుపులో మాత్రం 5 శాతం కుర్కుమిన్‌ ఉండడంతో పాటు రంగు ఆరంజ్‌ ఎల్లో కావడంతో మంచి క్రేజ్‌ ఉంది. నాణ్యమైన పసుపు కావడంతో సౌందర్యానికి, వివిధ రకాల వంటకాల్లోనూ ఈ పసుపు విరివిగా వినియోగించడం వల్ల డిమాండ్‌ బాగుంటుంది. 

పసుపు ఎగుమతులు ఇలా 
ఈ ప్రాంతంలో పండించే దుంప పసుపు సుమారు 300 ఏళ్ల నుంచి వ్యాపారుల ద్వారా మాడుగుల చేరుకుంటుంది. మాడుగులలో సుమారు 10 పసుపు ప్రాసెసింగ్‌ కేంద్రాల ద్వారా ఛాయ పసుపు తయారు చేస్తున్నారు. ఏటాç సుమారుగా 800 లారీల పసుపు డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు మాడుగుల ప్రాసెసింగ్‌ కేంద్రాలకు చేరుకుంటుంది. ఇక్కడ అనేక రకాలుగా ప్రాసెసింగ్‌ చేసిన తరువాత గ్రేడింగ్‌ చేసి మేలిమి పసుపు, నార పసుపు విడివిడిగా ప్యాకింగ్‌ చేసి ఎగుమతులు చేస్తారు. 

సుమారు 500 లారీల వరకు చెన్నైకి ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తారు. మరో 200 లారీల వరకు కొచ్చిన్‌కు ఎగుమతులు చేస్తారు. 100 లారీల వరకు స్థానికంగా శుభకార్యాలతో పాటు వంటకాల కోసం వ్యాపారులకు విక్రయాలు జరుగుతాయి. బస్తా 80 కిలోల చొప్పున ఒక్కో లారీకి 125 బస్తాలు ఎగుమతులు చేస్తారు. ఈ లెక్కన 800 లారీలకు కిలో పసుపు రూ.125 చొప్పున ప్రతి ఏటా సుమారుగా రూ.96 కోట్ల టర్నోవర్‌ ఉంటుంది. 

అధిక కుర్కుమిన్‌తో గిరాకీ 
కుర్కుమిన్‌ అధికంగా ఉండే పసుపు ఎక్కువగా తమిళనాడు లో ఉపయోగిస్తున్నారు. ఔషధ తయారీలో కూడా ఉపయోగించడంతో మాడుగుల పసుపునకు మంచి గిరాకీ ఉంది. గతంలో కిలో పసుపు ధర రూ.70 నుంచి రూ.90 వరకు పలికేది. రెండేళ్లుగా రూ. 120 నుంచి రూ.140 వరకు ధరలు పలుకుతున్నాయి.

ఈ ఏడాది సీజన్‌ తొలినాళ్లలోనే రూ.125 పలకడం విశేషం. దీంతో అటు రైతులకు, ఇటు  వ్యాపారులకు లాభాలు వస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గంజాయి అరికట్టడంతో ఏజెన్సీలో అందుకు ప్రత్యామ్నాయంగా పసుపు సాగు పెరిగింది.  
– నూతిగట్టు నాగశంకర్, పసుపు వ్యాపారి, మాడుగుల    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement