బలపడతారేమో! | District police sakhakumavola angst | Sakshi
Sakshi News home page

బలపడతారేమో!

Published Thu, Sep 4 2014 12:19 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

బలపడతారేమో! - Sakshi

బలపడతారేమో!

  •  జిల్లా పోలీసు శాఖకుమావోల బెంగ
  •  ఏజెన్సీపై పట్టు సాధించే దశలో సర్కార్ జర్‌‌క
  •  బాక్సైట్ తవ్వకాలకు సీఎం పచ్చజెండాతో గుబులు
  •  ఉద్యమం పేరుతో మళ్లీ పుంజుకుంటారని ఆందోళన
  • కష్టపడి పోలీసులు సాధించిన పట్టు సడలిపోతోంది. రెండేళ్లపాటు శ్రమించి అనుకున్నది సాధించే దశలో ప్రభుత్వం పోలీసుశాఖను దెబ్బతీసే నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీలో మావోయిస్టులపై దాదాపుగా పైచేయి సాధించిన దశలో సర్కార్ బాక్సైట్ తేనెతుట్టెను కదపడంతో పోలీసు అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు.  బాక్సైట్ ఉద్యమం పేరుతో మావోలు మళ్లీ బలపడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తుండడంతో కంగారు పడుతున్నారు.
     
    సాక్షి, విశాఖపట్నం : జిల్లా ఏజెన్సీ సరిహద్దులో మావోల ప్రాబల్యం అధికం. ఒకప్పుడు నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ద్వారా మా వోయిస్టులను దాదాపు అరికట్టారు. దీంతో మావోలు సురక్షిత స్థావరంగా ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతాన్ని ఎంచుకుని ఇక్కడ పాగా వేసుందుకు ప్రయత్నించి చాలావరకు సఫలమయ్యారు. ఏఓబీలో అత్యధిక ప్రాంతం విశాఖ ఏజెన్సీ కూడా ఉండడంతో ఈ ప్రాంతంలో ఆయుధ సంపత్తిపరంగాను బలోపేతమయ్యారు.

    ఈ నేపథ్యంలో ఏఓబీలో మావోల ఏరివేతకు ప్రభుత్వం ప్రత్యేకంగా విశాఖలో మావోయిస్టు నిరోధక ప్రత్యేక ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. గ్రేహౌండ్స్‌లో అత్యధిక అనుభవం ఉన్న పోలీసు ఉన్నతాధికారులను గ్రూప్ కమాండర్ హోదాలో నియమించింది. గత రెండున్నరేళ్లుగా ఈ విభాగం జిల్లా పోలీసుశాఖతో కలిసి ప్రత్యేక దళాలతో విశాఖ ఏజెన్సీలో నిరంతరం సుమారు 250 మందికి పైగా సిబ్బందితో కూం బింగ్ జరిపి పట్టుసాధించే దశకు ఎదిగింది.

    ఒకప్పుడు మన్యంలో నిరంతరం మావోయిస్టు విధ్వంసాలు కొనసాగగా, ప్రస్తుతం వాటిని దాదాపుగా నియంత్రించింది. జిల్లాలో పనిచేసిన ఎస్పీలంతా ఏజెన్సీపై ప్రత్యేక దృష్టిసారించి గిరిజన యువతను అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించేలా నడుంకట్టారు. రోడ్లు, సోలార్ విద్యుత్, ప్రభుత్వ పథకాలు.. ఇలా అన్నీ అం దించేందుకు కసరత్తు చేశారు. అప్పట్లో బాక్సైట్ తవ్వకాలు కూడా లేకపోవడంతో మావోయిస్టులు ఏజెన్సీలో నిలదొక్కుకునేందుకు సరైన అవకాశం కూడా దొరకలేదు. దీంతో ఏజెన్సీపై పోలీసుశాఖ దాదాపు పట్టుసాధించింది.
     
    బాక్సైట్ తుట్టె కదిలించిన బాబు

     
    కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు చేపడతామని ప్రకటించింది. ఆగస్టు 10న విశాఖలో నిర్వహించిన గిరిజన సదస్సులో సీఎం చంద్రబాబు దీనిపై స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటివరకు ఏజెన్సీలో నిరసన జ్వాలలు మిన్నంటుతూనే ఉన్నాయి. గిరిజన సంఘాలు, వైఎస్సార్‌సీపీతోపాటు కమ్యునిస్ట్ పార్టీలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నాయి.

    అయితే ఇంతకాలం స్తబ్దుగా ఉన్న మావోలు మళ్లీ ఇప్పుడు గిరిజనుల బాక్సైట్ తవ్వకాల వ్యతిరేకపోరు పేరుతో తెరవెనుక చురుగ్గా కదులుతుండడంతో పోలీసులకు కునుకుపట్టడం లేదు. ఇటీవల ఆయుధాలతో కొందరు మావోలు ఓ ఉద్యమానికి నాయకత్వం వహించడాన్ని పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లూ జాడ లేని వీళ్లు ఇప్పుడు ఉద్యమం పేరుతో మళ్లీ బలోపేతం అయ్యే ప్రయత్నాలను చూసి తట్టుకోలేకపోతున్నారు.

    మున్ముందు పరిస్థితి ఇలా ఉంటే ఏజెన్సీలో తీవ్రస్థాయిలో బలపడిపోతారని కంగారు పడుతున్నారు. ఇంటెలిజెన్స్ సైతం అదేపనిగా హెచ్చరికలు చేస్తుండడంతో ఇన్నాళ్ల శ్రమ బూడిదలోపోసిన పన్నీరే అని మథనపడుతున్నారు. దీంతో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీలతో కూంబింగ్ మళ్లీ ముమ్మరం చేస్తున్నారు. త్వరలో మరిన్ని బృందాలను దించేందుకు రంగం సిద్ధంతో మళ్లీ వేడెక్కబోతోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement