టీడీపీ డ్రగ్స్‌ రాజకీయాలకు రాష్ట్ర ప్రతిష్టే బలిపశువు | TDP Drugs Politics In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘మత్తు’ వదలరా? 

Published Sun, Oct 24 2021 8:29 AM | Last Updated on Sun, Oct 24 2021 8:46 PM

TDP Drugs Politics In Andhra Pradesh - Sakshi

విజయనగరం జిల్లా కేంద్రంలో ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి

ఏవోబీలో భౌగోళిక స్థితిగతుల దృష్ట్యా దశాబ్దాల తరబడి గంజాయి సాగవుతోందన్నది బహిరంగ రహస్యం. అలాంటిది రెండేళ్లుగా గంజాయి సాగు.. రవాణాపై కేసులు పెరుగుతున్నాయంటే అర్థం ఏమిటి? ప్రత్యామ్నాయ పంటల సాగు పెరగడాన్ని ఏ విధంగా చూడాలి? మారు మూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఊపందుకోవడాన్ని ఏమని విశ్లేషించాలి? ఈ దందాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందనే కదా! ఈ వాస్తవాన్ని టీడీపీ ఎందుకు అంగీకరించడం లేదు? అబద్ధాలు, కుట్రలు, బూతులతో విషం చిమ్మడం దేనికి సంకేతం? ఏజెన్సీలో గంజాయి సాగు, రవాణాకు తమ నిర్వాకమే కారణమని బయటకు చెప్పుకోలేక రాష్ట్ర ప్రతిష్టను పణంగా పెట్టడం రాజకీయ దిగజారడుతనమా.. లేక దింపుడు కల్లం ఆశలా!? 

సాక్షి, విశాఖపట్నం: ఐదు దశాబ్దాలుగా ఏజెన్సీ (ఏఓబీ) ప్రాంతంలో అక్కడక్కడ గంజాయి సాగవుతోందన్నది రాష్ట్రంలో అందరికీ తెలుసు. ప్రధానంగా 2014 తర్వాత అది ఏజెన్సీలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఈ విషయాన్ని గమనించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రెండేళ్లుగా ప్రత్యేక కార్యాచరణతో మూడు అంచెల్లో గంజాయి సాగు, రవాణా అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.  ఇందులో భాగంగా ప్రతి రోజూ సివిల్‌ పోలీసులతో పాటు సెబ్‌ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ తనిఖీల సంఖ్య బాగా పెరిగింది. అందువల్లే కేసుల సంఖ్య పెరగడం అనేది సహజం. వాస్తవంగా ఇది ఆహ్వానించదగిన పరిణామం. గతంలో తూతూ మంత్రపు తనిఖీలతో ఎక్కువ కేసులు నమోదయ్యేవి కావు. ఒక్క విశాఖపట్నం జిల్లాలో గంజాయి సాగు, రవాణాపై గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 300 మంది పోలీసులు మాత్రమే తనిఖీలు చేపట్టేవారు. ఇప్పుడు ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. తద్వారా విశాఖ ఏజెన్సీ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 2021లో ఇప్పటి దాకా 1,445 కేసులు నమోదయ్యాయి. 81,096 కేజీల గంజాయి పట్టుబడింది. 2017లో కేవలం 244 కేసులు నమోదయ్యాయి. 


ఇది విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలం బొండవల్లి సమీపంలోని గొడిపుట్టు రోడ్డులో ఉన్న పొలం. ఇక్కడ 2018లో పూర్తిగా గంజాయి సాగు చేసిన దృశ్యం. ఇప్పుడు ఇదే పొలంలో వరి, ఇతర పంటలు సాగైన దృశ్యం.

డ్రోన్ల ద్వారా నిఘా కట్టుదిట్టం

► గ్రామ సచివాయాల ఏర్పాటు వల్ల ప్రత్యేకంగా మహిళా పోలీసుల నియామకంతో నిఘా పెంచింది. దీంతో అధికారులు గంజాయి సాగు ప్రాంతాలను సులువుగా గుర్తించగలుగుతున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ తనిఖీలు జరుగుతుండటంతో గంజాయి రవాణా ముఠాలకు రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతోంది.  
 ఏజెన్సీ ప్రాంతాలో ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా సర్వే చేపట్టి గంజాయి సాగును గుర్తించడానికి చర్యలు తీసుకుంది.
 గంజాయి స్మగ్లర్ల బ్యాంకు అకౌంట్లపై నిఘా పెట్టడంతో పాటు.. రైతుల్లో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌జీవోల ద్వారా అవగాహన కల్పించే చర్యలకూ శ్రీకారం చుట్టింది.
ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంపు
► గంజాయి సాగు చేస్తూ పట్టుబడిన వారిలో అత్యధికులు పొట్ట కూటి కోసమే ఆ పని చేస్తున్నారనే వాస్తవాన్ని గ్రహించిన ఈ ప్రభుత్వం గత రెండేళ్లలో వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను విస్తృతం చేసింది. 
► గిరిజనుల్లో అనేక మందికి సొంత భూములు లేవు. దీంతో రికార్డ్స్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌ (ఆర్‌వోఎఫ్‌ఆర్‌) పట్టాల ద్వారా భూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది.
 ఇప్పటి వరకు ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో 2021 జూలై నుంచి 64,834 మందికి 93,574.17 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. ఈ భూమి పొందిన రైతులకు రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి కలిగిస్తోంది. ఈ విధంగా గిరిజనులకు కేటాయించిన భూమిని సాగుకు యోగ్యంగా మలిచేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా అండగా నిలుస్తోంది.  
 గ్రామ సచివాయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణం చేపడుతోంది. తద్వారా స్థానిక గిరిజనులకు ఎక్కడికక్కడ ఉపాధి లభిస్తోంది. మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి లభిస్తోంది. 
► ప్రస్తుతం ఏజెన్సీ పరిధిలో 1,46,003 మందికి జాబ్‌ కార్డులున్నాయి. ఇందులో 2,99,181 మంది ఉపాధి కూలీలుండగా.. ఈ ఏడాదిలో ఇప్పటికే రూ.200 కోట్ల వరకు వారికి చేరింది. 

ఊపందుకున్న కాఫీ, పండ్ల తోటల పెంపకం 

 గంజాయి సాగును నిరుత్సాహ పరిచేందుకు ప్రభుత్వం కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. మొత్తం లక్ష ఎకరాల్లో కాఫీ తోటల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. రెండేళ్లలో 22 వేల ఎకరాల్లో కాఫీ తోటలను పెంపకాన్ని చేపట్టారు. ఈ ఏడాది మరో 15 వేల ఎకరాల్లో కాఫీ తోటల పెంపకాన్ని చేపట్టారు. మరోవైపు ఉద్యాన పంటల సాగును కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
 మూడేళ్లలో రూ.84.76 కోట్లతో 5 వేల ఎకరాల్లో పసుపు పంట సాగు చేసేలా ప్రణాళిక రచించారు. 2020–21 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం 2023 వరకూ కొనసాగనుంది. ఇప్పటికే 1,384 ఎకరాల్లో 3,341 మంది రైతుల ద్వారా రూ.4.64 కోట్లతో పసుపు పంట సాగు పథకం అమలవుతోంది.
 సీతాఫలం, ఫైనాపిల్, అల్లం, మిరియాలు, స్ట్రాబెరీ, డ్రాగన్‌ ఫ్రూట్‌ వంటి పండ్ల సాగును కూడా ప్రోత్సహిస్తోంది.  అన్ని ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని 2021–22లో 7,700

ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
 ఉద్యాన పంటలను విక్రయించేందుకు ప్రత్యేకంగా విశాఖపట్నంలోని రైతు బజార్లలో గిరిజనులకు కొన్ని నెలల క్రితమే కార్డులు ఇప్పించారు. ఏజెన్సీ నుంచి ప్రత్యేక రవాణా సదుపాయం కూడా కల్పించారు.  

ఏజెన్సీలో అభివృద్ధి పరుగులు
రూ.150 కోట్లతో మారుమూల ప్రాంతాలకు శరవేగంగా రోడ్లు వేస్తున్నారు.  
► నాడు–నేడు కింద ఏజెన్సీ పరిధిలో మొదటి విడతలో రూ.110.91 కోట్లతో 367 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. రెండో విడతలో మరో 502 పాఠశాలల్లో పనులు చేపట్టనున్నారు. 
 రూ.24 కోట్లతో రెండు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేశారు. 
► రూ.84.80 కోట్లతో 212 గ్రామ సచివాలయ భవనాలు, రూ.45.56 కోట్లతో 209 రైతు భరోసా కేంద్రాలు, రూ.18.78 కోట్లతో 125 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం చేపడుతున్నారు.
  జలజీవన్‌ మిషన్‌ కింద రూ.76.57 కోట్లతో 1,937 పనుల ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా పనులు చేపట్టారు.  
 ఐఐటీ, ఐఐఐటీ, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు ఏజెన్సీ విద్యార్థులను సిద్ధం చేసేందుకు కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

గంజాయి మొక్కల ధ్వంసం


శనివారం విశాఖ జిల్లా అరకులోయ మండలం బస్కి సమీపంలో, బొండం పంచాయతీ పరిధిలో అరకులోయ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో గంజాయి మొక్కలను  ధ్వంసం చేశారు. గిరిజనులతో అవగాహన ర్యాలీ నిర్వహించి, గంజాయిని సాగు చేయబోమని ప్రతిజ్ఞ చేయించారు.  ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసులు పాల్గొన్నారు.
– అరకులోయ

1970 కి ముందు నుంచే గంజాయి సాగు!
ఏజేన్సీలో 1970కి ముందు నుంచే గంజాయి సాగు ఉంది. అయితే అప్పట్లో ఇది రెండు మూడు మండలాలకే పరిమితమై ఉండేది. మొట్టమొదటి సారిగా 1970లో సీలేరు పోలీసు స్టేషన్‌ పరిధిలో 4 బ్యాగుల గంజాయిని పట్టుకున్నారు.  2002 నాటికి నాణ్యత చూసి నేరుగా కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా 2014 తర్వాత గంజాయి సాగు, రవాణా బాగా పెరిగిపోయింది. ఇందుకు కారణం అప్పటి అధికార పార్టీ టీడీపీ నేతల హస్తం ఉండటమేననేది బహిరంగ రహస్యం. 

గతంలో గంజాయి సాగు చేసేవాళ్లం
గతంలో నీరు పారే గెడ్డెల వెంట గంజాయి సాగు చేసేవాళ్లం. ఇప్పుడు వేరే పంటలు వేసుకుంటున్నాం. అధికారులు వచ్చి గంజాయి సాగు వద్దని, కేసుల్లో ఇరుక్కోవద్దని చెప్పారు. వేరే పంటలు వేసుకునేందుకు సాయం చేస్తున్నారు. అందుకే గంజాయి సాగుకు దూరంగా ఉంటున్నాం.
– కొర్ర కేశవరావు, గొద్దిపుట్టు గ్రామం, విశాఖ జిల్లా

మాకు ఊర్లోనే పని దొరుకుతోంది 
రెండేళ్ల క్రితం వరకు గంజాయి సాగు చేసేవాడిని. ఇప్పుడు ఆ పని చేయడం లేదు. ఊర్లోనే పనులు దొరుకుతున్నందున్న ఆ పనులు చేసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి మాకు పనికి ఇబ్బంది లేదు. మా ఊర్లో కూడా గంజాయి సాగు తగ్గిపోయింది. 
– కిల్లో వంశీ, కొదువలస, లక్ష్మీపేట పంచాయతీ, విశాఖపట్నం జిల్లా

సరిహద్దుల్లో పటిష్ట చర్యలు
రెండేళ్లలో దాడులు పెరగడం వల్లే కేసులు పెరిగాయి. 2017లో విశాఖపట్నం రేంజ్‌లో కేవలం 244 దాడులు, 2018లో 174 దాడులు మాత్రమే నిర్వహించాం. 2019లో 247, 2020లో 315, ఈ ఏడాది ఇప్పటి వరకూ 465 దాడులు చేసి కేసులు నమోదు చేశాం. 2017 కాలంలో 883 మంది గంజాయి రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేయగా, 2021లో ఇప్పటి వరకూ 1003 మందిని అదుపులోకి తీసుకున్నాం. తద్వారా రవాణాను చాలా వరకూ అరికట్టగలిగాం. ప్రతి ప్రాంతంలో పటిష్ట నిఘా అమలు చేస్తూ.. సరిహద్దులు దాటకుండా గట్టి చర్యలు తీసుకున్నాం
– రంగారావు, విశాఖ రేంజ్‌ డీఐజీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement