వైట్‌హౌస్‌కు చేరుకున్న ట్రంప్‌.. స్వాగతం పలికిన బైడెన్‌ | United States 47th President Donald Trump Inauguration Live Updates Telugu, Highlights, Photos And Videos | Sakshi
Sakshi News home page

Donald Trump Inauguration Updates: వైట్‌హౌస్‌కు చేరుకున్న ట్రంప్‌.. స్వాగతం పలికిన బైడెన్‌

Published Mon, Jan 20 2025 7:48 PM | Last Updated on Mon, Jan 20 2025 9:03 PM

US President Donald Trump Inauguration Live Updates

Donald Trump Inauguration Live Updates..

వైట్‌హౌస్‌కు  ట్రంప్‌..   స్వాగతం పలికిన బైడెన్‌

 👉కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ సాదర స్వాగతం పలికారు.

 

👉రిపబ్లికన్‌ పార్టీ డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. 78 ఏళ్ల వయసులో అగ్రరాజ్యాధినేతగా మరోసారి బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ సందడి నెలకొంది. 

వైట్‌హౌస్‌లో బైడెన్‌ సెల్ఫీ..
👉కొద్ది గంటల్లో ముగియనున్న జో బైడెన్‌ అధ్యక్ష పదవీ కాలం. అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ సెల్ఫీ. అంతకుముందు వైట్‌హౌస్‌కు చేరుకున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ దంపతులకు స్వాగతం పలికిన జో బైడెన్‌, జిల్‌.

 

 ట్రంప్‌కు పుతిన్‌ అభినందనలు..

👉అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం వేళ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుభాకాంక్షలు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన పుతిన్‌. డొనాల్డ్ ట్రంప్ రాబోయే అమెరికా ప్రభుత్వంతో ఉక్రెయిన్ వివాదంపై చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.  ఏదైనా పరిష్కారం శాశ్వత శాంతిని నిర్ధారిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రజల చట్టబద్ధమైన ప్రయోజనాలను గౌరవించడం ఆధారంగా శాశ్వత శాంతి నెలకొల్పాలన్నారు.

 👉చర్చీలో డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తన నివాసం వద్ద ఉన్న సెయింట్ జాన్స్ చర్చికి చేరుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌, మెలానియా ట్రంప్

👉ప్రపంచదేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్‌ భవంతి లోపలే నిర్వహించనున్నారు. రొనాల్డ్‌ రీగన్‌ 1985లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఇలాగే చేయాల్సి వచ్చింది. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతోంది.

 తొలిరోజే భారీగా సంతకాలు! 
👉మొదటి రోజే తనదైన ముద్ర కనిపించేలా ట్రంప్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన బృందం రంగం సిద్ధం చేసింది. ఎన్నికల వాగ్దానాల మేరకు ఇవి జారీ అవుతాయని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసి వెనక్కి పంపించడం, ట్రాన్స్‌జెండర్ల హక్కులు కాలరాయడం, చమురు వెలికితీత పెంచడం, క్యాపిటల్‌ భవంతి వద్ద రగడకు సంబంధించి దోషులుగా తేలిన సుమారు 1,500 మందికి క్షమాభిక్ష ప్రసాదించడం వంటివాటిని తొలిరోజే మొదలుపెట్టాలని ట్రంప్‌ పట్టుదలతో ఉన్నారు.

 

ఫలితాల అనంతరం..
👉ఫలితాల అనంతరం కూడా ట్రంప్‌ పలు కీలక ప్రకటనలు చేశారు. కెనడాను 51వ రాష్ట్రంగా చేయడం, గ్రీన్‌ల్యాండ్‌, పనామాలను స్వాధీనం చేసుకోవడం, గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోను గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా మార్చడం వంటి ప్రకటనలు చేసిన ట్రంప్‌.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే కీలక ఆదేశాలపై సంతకాలు చేస్తానని ప్రకటించారు. ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిపార్టేషన్‌ ఆపరేషన్‌ చేపడతామని చెప్పారు.

 

కుటుంబ నేపథ్యం..
👉న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో మేరీ, ఫ్రెడ్‌ దంపతులకు జూన్‌ 14, 1946న డొనాల్డ్‌ ట్రంప్‌ జన్మించారు. తండ్రి ఫ్రెడ్‌ ట్రంప్‌ ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ఐదుగురు సంతానంలో ట్రంప్‌ నాలుగోవాడు. యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలోని వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అండ్‌ కామర్స్‌లో 1968లో డిగ్రీ పట్టా పొందారు.

👉తండ్రి కంపెనీలో 1971లో బాధ్యత స్వీకరించిన ట్రంప్‌.. అనంతరం ట్రంప్‌ ఆర్గనైజేషన్‌గా పేరు మార్చారు. హోటల్స్‌, రిసార్టులు, నిర్మాణ రంగం, క్యాసినోలు, గోల్ఫ్‌ కోర్స్‌ల్లో అడుగుపెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. 2004లో ‘ది అప్రెంటిస్‌’ రియాల్టీ టీవీ షోతో దేశమంతా పాపులర్‌ అయ్యారు.

👉క్రీడాకారిణి, మోడల్‌ ఇవానా జెలింకోవాను తొలుత వివాహం చేసుకున్న ట్రంప్‌.. 1990లో ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరికి డొనాల్డ్‌ జూనియర్‌, ఇవాంకా, ఎరిక్‌లు సంతానం. ఆ తర్వాత నటి మార్లా మార్పెల్స్‌ను 1993లో పెళ్లి చేసుకున్న ట్రంప్‌.. 1999లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. వీరి కుమార్తె టిఫానీ ట్రంప్‌. స్లొవేనియాకు చెందిన మాజీ మోడల్‌ మెలానియాను 2005లో ట్రంప్‌ వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు బారన్‌ విలియమ్‌ ట్రంప్‌.

👉రిపబ్లికన్‌ పార్టీ తరఫున 2016 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ట్రంప్‌.. డెమోక్రటిక్‌ నేత హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించారు. 2020 ఎన్నికల్లో బైడెన్‌ చేతిలో ఓటమి చెందిన ట్రంప్‌.. 2024లోనూ బరిలోకి దిగారు. డెమోక్రట్‌ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై విజయం సాధించి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement