తల్లి మృతదేహం వద్ద ఆందోళనతో వున్న మహేష్
తూర్పుగోదావరి, చింతూరు (రంపచోడవరం): ఏజెన్సీలో గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయనడానికి మంగళవారం ఓ గిరిజన మహిళ మృతి చెందిన సంఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. ఆమె పరిస్థితి విషమంగా వుండగా పెద్దాసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు అందుబాటులో లేక సొంతంగా తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యుల వద్ద సొమ్ములు లేక చివరకు ఆమె ప్రాణం గాల్లో కలిసిపోయింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... చింతూరు మండలం నేలకోట గ్రామానికి చెందిన వెట్టి కన్నమ్మ(45) ఐదు రోజులుగా వ్యాధితో బాధపడుతోంది. ఆమె పరిస్థితి విషమించడంతో చిన్న కొడుకు మహేష్, పెద్ద కోడలు సీతమ్మ స్థానిక ఆశ వర్కర్ సాయంతో సోమవారం మధ్యాహ్నం ఆటోలో చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలు పాడయ్యాయని చికిత్స నిమిత్తం వెంటనే భద్రాచలం లేదా కాకినాడ తీసుకెళ్లాలని రిఫర్ చేసి లేఖ రాసి ఇచ్చారు. ఆసుపత్రికి చెందిన అంబులెన్సు రిపేరులో ఉందని సొంత ఖర్చులతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పినట్లు మహేష్ తెలిపాడు.
పెద్దాసుపత్రికి తీసుకెళ్లేందుకు తమ వద్ద చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో చింతూరు ఆసుపత్రిలోనే ఉంచేశామని, దీంతో మంగళవారం ఉదయం ఏడు గంటలకు తన తల్లి మృతి చెందిందని అతను వాపోయాడు. అంబులెన్సు ఏర్పాటు చేస్తే కాకినాడ పెద్దాసుపత్రికి తీసుకెళ్దామని భావించామని, అది లేకపోవడంతోనే ఇక్కడే ఉవచేశామని అతను తెలిపాడు. కాగా మృతదేహం తరలించేందుకు ఆసుపత్రిలో ఎలాంటి అంబులెన్సు లేకపోవడంతో మధ్యాహ్నం ఒంటిగంట వరకు కన్నమ్మ మృతదేహం ఆసుపత్రిలోని వరండాపైనే ఉండిపోయింది. కనీసం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా సొమ్ములు లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులకు ఏమి చేయాలో పాలుపోలేదు. మరోవైపు గతంలో వ్యాధితో కన్నమ్మ పెద్దకొడుకు మృతి చెందగా, గత నెలలో వ్యాధితోనే భర్త కూడా మృతి చెందగా ప్రస్తుతం కన్నమ్మ కూడా మృతి చెందింది. ఈ విషయాన్ని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు, విలేకరులు ఐటీడీఏ ఏపీఓ పిచుక వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి మృతదేహాన్ని స్వగ్రామం తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్యకు సూచించారు. దీంతో ఆయన ఆటో ద్వారా మృతదేహాన్ని వారి స్వగ్రామం పంపించారు. కిడ్నీలు పాడైన కన్నమ్మ పరిస్థితి విషమంగా వుండడంతో భద్రాచలం లేదా కాకినాడ తీసుకెళ్లాలని రిఫర్ చేశామని, టైర్లు బాగాలేవని డ్రైవర్ అంబులెన్సును నిలిపి వేయడంతో ఆమెను పంపేందుకు వాహనం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. టైర్లు బాగా లేకపోవడంతో అంబులెన్సును కేవలం లోకల్ వరకే పంపిస్తున్నామని, దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుంటానని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పుల్లయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment