వైద్యం కోసం రోగిని మోసుకువెళుతున్న బంధువులు
తూర్పుగోదావరి, రంపచోడవరం: ఐటీడీఏ పరిపాలన కేంద్రం రంపచోడవరంలో ఒక ఎంబీబీఎస్ వైద్యుడిగా పేర్కొన్న ఒక వ్యక్తి రెండేళ్ల పాటు యథేచ్ఛగా గిరిజనులకు వైద్యం చేశాడు. ఎంబీబీఎస్, ఎండీ (న్యూరాలజీ) అంటూ బీ ఫార్మసీ చేసిన ఆర్.శివప్రసాద్ అనే వ్యక్తి బోర్డు పెట్టుకుని మరీ క్లినిక్ నిర్వహించాడు. ట్రాన్స్‌కో లైన్ ఇన్‌స్పెక్టర్ హత్య కేసులో ఇరుక్కోవడంతో శివప్రసాద్ పోలీసు విచారణలో ఈ విషయాన్ని బయటపడ్డాడు. ఆ కేసు ఎలా ఉన్నా. ఆ వ్యక్తి ఉదంతంతో ఏజెన్సీలో వైద్య సేవల పరిస్థితి ఏమిటనేది వెల్లడైంది. ఎలాంటి విద్యార్హతలు లేకుండానే వైద్యం చేస్తున్న వారు ఏజెన్సీలో కోకొల్లలుగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోకపోవడం, గిరిజనుల అమాయకత్వం నకిలీ వైద్యులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రోగం ఒకటైతే వైద్యం ఒకటి చేస్తుండడంతో గిరిజనుల ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని అసలైన వైద్యులు అంటున్నారు.
మెడికల్ షాపుల్లో అమ్మకాల కోసం...
మెడికల్ షాపుల యజమానులు మందులు అమ్మకాల కోసం వైద్యులతో మాట్లాడి క్లినిక్‌లు ఏర్పాటు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వచ్చిన వారికి ఎడాపెడా మందులు రాయించి వైద్యుడికి పర్సంటేజీలను షాపుల వారు ఇస్తున్నారు. విశాఖ జిల్లా నాతవరం నుంచి వచ్చిన ఆర్.శివప్రసాద్‌తో స్థానికంగా ఉన్న మెడికల్ షాపు యజమానులు క్లినిక్ ఏర్పాటు చేయించారు. బీ ఫార్మసీ చదివిన అతడు ఎంబీబీఎస్, ఎండీ న్యూరాలజీ అంటూ బోర్డు పెట్టుకుని వైద్యం పేరుతో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడాడన్న విషయం బయట పడినప్పుడు.. ఏజెన్సీలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రైవేటు వైద్యులు కొంతమంది అధిక డోసుల్లో మందులు వాడిస్తున్నందున గిరిజనుల ప్రాణాలకు ముప్పు తెస్తోంది. వారితో స్టెరాయిడ్ మందులను వాడిస్తున్నారని, వాటి వల్ల సైడ్ ఎఫెక్టుల వల్ల గిరిజనుల ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటాయని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కానరాని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు
ప్రైవేట్ క్లినిక్‌లపై పర్యవేక్షణ చేయాల్సిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కానరావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అడపాదడపా ఏజెన్సీకి వచ్చే డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మెడికల్ షాపుల యజమానులతో కాసేపు కాలక్షేపం చేసి వెళ్లిపోతున్నారు. ఏజెన్సీలో మెడికల్ షాపులపై కేసులు రాసి దాఖాలాలే లేవంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
అర్హత లేకుండా ల్యాబ్‌ల నిర్వహణ
ఏజెన్సీలోని పలు ల్యాబ్‌లను కూడా విద్య అర్హత లేనివారే నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ప్రైవేట్ ల్యాబ్‌ల వైపు కన్నెత్తి చూడడం లేదు. రక్త పరీక్షలకు సైతం అధిక సొమ్ము వసూలు చేస్తున్నారు. వారి పరీక్షల నిర్ధారణపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటి ఆధారంగా కొంతమంది ప్రైవేట్ వైద్యులు మందులు భారీగా రాసేస్తున్నారు. వాటిని వాడిన తరువాత ప్రాణాల మీదకు వచ్చేసరికి రోగులు రాజమహేంద్రవరం, కాకినాడ పరుగులు పెడుతున్నారు. చేతకాని వైద్యం చేసి రోగి పరిస్థితి చేయి దాటిపోయాక ప్రైవేట్ వైద్యులు చేతులెత్తేస్తున్నారు.
ఏజెన్సీలో గిరిజనులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ వైఫల్యం చెందడంతో.. అక్కడ నకిలీ వైద్యులు గిరిజనుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. కొండకోనల్లోంచి రోగులను మోసుకుంటూ ఆస్పత్రులకు తీసుకువెళుతుంటే అక్కడ వైద్యం అందడం లేదు. దీంతో వారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అలాంటివారిలో నకిలీ వైద్యులు కూడా ఉన్నట్టు ఇటీవల బట్టబయలైంది. శరీరం పులపరింపుగా ఉంటే మెడికల్ షాపుల్లో మందులను కొనుక్కొని సొంతంగా వాడేస్తున్నారు. ఆ మందులు నకిలీవి కావన్న గ్యారంటీ లేదు. ఈ పరిస్థితిని అనువుగా తీసుకున్న కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు నకిలీ వైద్యులను తయారుచేసి గిరిజనుల సొమ్మును పిండుకుంటున్నారు. ట్రాన్స్‌కో లైన్‌మన్ హత్య కేసులో ఇరుకున్న వ్యక్తి.. నకిలీ వైద్యుడన్న విషయం బయటపడింది. దీంతో ఆరోగ్యపరంగా గిరిజనులు ఎంత దగాకు గురవుతున్నారనేది బయటపడింది. అయితే ఈ విషయంపై మాత్రం వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవడం లేదు.
స్టెరాయిడ్లు వాడుతున్నారు
కొంతమంది ప్రైవేట్ వైద్యులు స్టెరాయిడ్లు వాడుతున్నారు. ఈ మందు ప్రభావం వల్ల రోగం తీవ్రత తాత్కాలికంగా తగ్గినా.. దీర్ఘకాలంలో అవయవాలకు నష్టం ఏర్పడుతుంది. తరువాత ఏ రోగం వచ్చినా ఏ మందులు వాడిన తగ్గని పరిస్థితి ఏర్పడుతుంది. ఏజెన్సీలో ప్రైవేట్ క్లినిక్‌లపై పర్యవేక్షణ లేదు. – కార్తిక్ రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, రంపచోడవరం
Comments
Please login to add a commentAdd a comment