డబుల్‌ పేరిట డబ్బులు దండుకుని  | Collection of Rs 20 crores in four districts in the name of charity | Sakshi
Sakshi News home page

డబుల్‌ పేరిట డబ్బులు దండుకుని 

Published Thu, Jun 22 2023 3:45 AM | Last Updated on Thu, Jun 22 2023 4:09 PM

Collection of Rs 20 crores in four districts in the name of charity - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌/ ఇల్లందు/ గూడూరు: ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలు, గిరిజనుల అమాయకత్వం, పేదరికాన్ని ఆసరా చేసుకుని స్వచ్ఛంద సంస్థ ముసుగులో తక్కువ ధరకే డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని వారి నుంచి రూ.20 కోట్ల మేర డబ్బులు దండుకున్నారు.

ఇళ్లు కట్టేస్తున్నామని ఐరన్, సిమెంట్‌ పంపిణీ చేసి ఉడాయించేశారు. ఇంటిసామగ్రి తెస్తామని చెప్పి వెళ్లిన వారు రెండేళ్లుగా పత్తా లేకపోవడంతో బాధితులు చివరికి పోలీసుల్ని ఆశ్రయించగా అసలు విషయం బయటకొచ్చింది. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు జిల్లాల్లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.  

స్వచ్ఛంద సంస్థ పేరుతో వచ్చి... 
పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పి హోలీవర్డ్‌ సొసైటీ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ 2020లో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు జిల్లాల్లో కొంతమంది ఏజెంట్లను నియమించుకుంది. కేవలం రూ.4,50,000లకే 693 చదరపు అడుగుల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏజెంట్లను ఏజెన్సీ ప్రాంతాల్లోకి పంపించి ప్రచారం చేయించింది. వీరి మాటల్ని నమ్మేందుకుగాను పలుచోట్ల స్వచ్ఛంద సంస్థకు చెందిన అనుచరుల ఇళ్లను చూపించేవారు.

తాము నిర్మించబోయే ఇళ్లకు 120 గజాల స్థలం ఉంటే చాలని, మొదటి కిస్తీగా రూ.1,65,000 చెల్లిస్తే సరిపోతుందని ప్రచారం చేయడంతో వీరిని నమ్మి డబ్బులు కట్టేందుకు  మూడు జిల్లాల నుంచి గిరిజనులు ముందుకొచ్చారు. ఇలా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15వేల నుంచి రూ.1,80,000  వరకు కట్టించుకున్నారు. ఇలా డబ్బులు చేతికిరాగానే ఇళ్లు కట్టేస్తున్నామని చెబుతూ  కొంతమందికి ఐరన్, సిమెంట్‌ తెచ్చి పిల్లర్లు వేసి మిగతా వారిని కూడా నమ్మించారు. దీంతో మిగిలిన వారూ డబ్బులు  చెల్లించేందుకు ముందుకొచ్చారు. 

ఈ విధంగా మూడు జిల్లాల్లో మొత్తం రూ.20 కోట్ల మేర వసూళ్లు చేశారు.  రెండో కిస్తీ కట్టాకే మిగతా నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పి సంస్థకు చెందిన ఏజెంట్లను ఉద్యోగాల నుంచి తీసేశారు. తర్వాత సంస్థ అడ్రస్‌ను కూడా మార్చేశారు. సంస్థకు చెందిన ఫోన్లను కూడా స్విచ్ఛాఫ్‌ చేసేశారు. రెండేళ్లుగా వీరంతా పత్తా  లేకుండాపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన కొంతమంది  మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిగిలినవారు కూడా ఆయా జిల్లాల్లో ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement