మన్యంలో... మృత్యు ఘోష | Child And Mother Deaths In East Godavari Agency | Sakshi
Sakshi News home page

మన్యంలో... మృత్యు ఘోష

Published Tue, Aug 28 2018 12:59 PM | Last Updated on Tue, Aug 28 2018 12:59 PM

Child And Mother Deaths In East Godavari Agency - Sakshi

రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో జ్వరంతో చికిత్స పొందుతున్న గిరిజన పిల్లలు

రంపచోడవరం: తూర్పు ఏజెన్సీలో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో గిరిజనుల పరిస్ధి తి దయనీయంగా మారుతోంది. ఆగస్టు నెలలో వర్షాలతోపాటు సీజనల్‌ వ్యాధులు విజృంభించి లోతట్టున ఉన్న ప్రతి గ్రామంలో ప్రజలు రోగాలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో ఇప్పటి వరకూ ఏజెన్సీలో వైద్య సేవలు అందించిన తొమ్మిది మంది వైద్యులు రాజీనామా చేసి వెళ్లిపోవడంతో పరిస్ధితి దయనీయంగా మారింది. గత ఏడాది ఇదే సీజన్‌లో వై రామవరం మండలం చాపరాయిలో నెల రోజుల వ్యవధిలో16 మందికి పైగా గిరిజనులు మృత్యువాత పడినప్పటికీ వైద్య సేవలు మెరుగుపరచడంలో ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపించకపోవడం పట్ల గిరిజనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజెన్సీలో గైనకాలజిస్ట్‌లతోపాటు చిన్న పిల్లల వైద్యులు కూడా లేకపోవడంతో మాతాశిశు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక్కడ ఏజెన్సీలో గత ఆరేళ్లు కాలంలో దాదాపు వెయ్యికిపైగా శిశు మరణాలు సంభవించాయంటే ఆధ్వాన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 40 మంది వరకు తల్లులు మృత్యువాత పడ్డారు. మలేరియా జ్వరాలు బారిన పడ్డవారి సంఖ్య తక్కువేమీ లేదు. వ్యా«ధిని గుర్తించి సకాలంలో చికిత్స అందించకపోవడం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి.

ఇద్దరే రెగ్యులర్‌ వైద్యులు...
రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వాటిలో 42  మంది అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్స్‌ పనిచేయాలి. కానీ 33 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు మాత్రమే రెగ్యులర్‌ వైద్యులు ఉన్నారు. మిగిలిన వారు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇటీవల తొమ్మిది మంది పీహెచ్‌సీ వైద్యులు తమ పోస్టులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆరేళ్లు కాలం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ వైద్యులను రెగ్యులర్‌ చేసి బదిలీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడంతో వైద్యులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఏజెన్సీలో పీహెచ్‌సీల పనితీరును పర్యేవేక్షించే ఏజెన్సీ డీఎంహెచ్‌ఓ పోస్టు ఖాళీగా ఉంది. పీహెచ్‌సీ పరిధిలో వైద్యులు ఉండేందుకు ఎటువంటి వసతులు కల్పించడం లేదు.

ఆగని శిశు మరణాలు...
ఏజెన్సీలో శిశు మరణాలు ఆగడం లేదు. తాజాగా రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన పూసం రాము రెండు నెలల పసిపాప సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడింది. గత ఆరేళ్లు కాలంలో ఏజెన్సీలో మతాశిశు మరణాలు పరిశీలిస్తే ఏజెన్సీలో వైద్య సేవల దుస్థితి ఎలా ఉందో అద్దం పడుతుంది. ఏజెన్సీలో గర్భిణులను గుర్తించి వారిని సకాలంలో కాన్పు కోసం పీహెచ్‌సీలకు తరలించాలనే ఐటీడీఏ అధికారి ఆలోచన కార్యరూపం దాల్చడం లేదు. ప్రధానంగా గర్భిణీలకు పౌష్టికాహారం అందకపోవడం శాపంగా మారుతోంది. ఏజెన్సీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటలు ఆసుపత్రులుగా స్ధాయి పెంచిన వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఫలితంగా రాత్రి సమయంలో అత్యవసర వైద్యం కోసం వచ్చిన రోగులకు అక్కడ ఉన్న సిబ్బంది సేవలే గతి.

ఇంకా పూర్తికాని మలేరియా మందు పిచికారీ...
ఏజెన్సీలో దోమలు, లార్వా నివారణకు గ్రామాల్లో మలేరియా మందు పిచికారీ రెండో దశ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే రెండు రౌండ్లు మలేరియా మందు పిచికారీ పూర్తికావాలి. ఏజెన్సీలో 931 గ్రామాల్లో పిచికారీ పూర్తికా వాల్సి ఉండగా ప్రస్తుతం 636 గ్రా మాల్లో పూర్తి చేశారు. రంపచోడవ రం ఐటీడీఏ పరిధిలో గంగవరం, చవిటిదిబ్బలు, గుర్తేడు, వాడపల్లి, మారేడుమిల్లి పీహెచ్‌సీల పరిధి లోని కొన్ని గ్రామాల్లో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాడపల్లి పీహెచ్‌సీ పరిధిలో వాడపల్లి గ్రామంలో 602 మంది జ్వరాలు బారిన పడితే రక్త పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. బూసిగూడెంలో 274 మందికి జ్వర పీడితులకు రక్త పరీక్షలు నిర్వహించగా పది మందికి మలేరియా ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో సీజనల్‌ వ్యాధులు విభృంజించే అవకాశం ఉంది. పంచాయతీలకు మలేరియా నిర్మూలనకు ఫాగింగ్‌ యంత్రాలు  ఇచ్చినా నిరుపయోగంగా మారాయి. యంత్రాలు వినియోగించేందుకు పంచాయతీలకు ఎటువంటి డబ్బులు ఇవ్వకపోవడంతో వాటిని వాడేందుకు పెట్రోల్‌ కొనుగోలు చేయలేకపోతున్నారు.

గిరిజనులకు వైద్యం అందడం లేదు...
పీహెచ్‌సీ ద్వారా గిరిజనులకు వైద్యం అందడం లేదు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో కనీసం కాన్పులు కూడా చేయడం లేదు. ప్రతి కేసు రిఫర్‌ చేస్తున్నారు. గైనిక్‌ సేవలు అందడం లేదు. పూర్తిస్ధాయిలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. పీహెచ్‌సీలను 24 గంటల పీహెచ్‌సీలుగా ఆప్‌గ్రేడ్‌ చేసినా ఫలితం లేదు. అత్యవసర సమయంలో వైద్యం కోసం వెళ్లిన గిరిజనులకు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు.– జుత్తుక కుమార్, సీపీఐ డివిజన్‌ కన్వీనర్, రంపచోడవరం

వైద్య పోస్టుల భర్తీకి చర్యలు...
ఏజెన్సీ పరిధిలో పీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న తొమ్మిది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటాం. మంగంపాడు, గుర్తేడు, కొండమొదలు, జడ్డంగి, పెదగెద్దాడ, లాగరాయి, బోదులూరు, వాడపల్లి పీహెచ్‌సీల్లో ఒక్కో పోస్టు నింపేందుకు అన్ని చర్యలూ తీసుకున్నాం. గిరిజన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలు మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపడతాం.
– నిషాంత్‌కుమార్, రంపచోడవరం ఐటీడీఏ పీవో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement