నెల్లూరు సమీపంలో క్షతగాత్రులను తీసుకువస్తూ తిరగబడిన అంబులెన్సు
తూర్పుగోదావరి, పిఠాపురం: తీర్థ యాత్రలకు వెళ్లిన బస్సు మృత్యుశకటంగా మారింది. విధి వక్రించి ప్రమాదానికి గురై ప్రాణాపాయం నుంచి బయటపడి గాయాలతో బతుకుజీవుడా అంటు తమ స్వస్థలాలకు బయలుదేరిన క్షతగాత్రులను మరో ప్రమాదం వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురై గాయాలతో బాధపడుతున్న వారికే మళ్లీ తీవ్ర గాయాలయ్యాయి. హృదయ విధారకరమైన ఈ సంఘటన శబరిమలై యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న అయ్యప్ప స్వామి భక్తులకు ఎదురైంది. తమవారు ఇళ్లకు వచ్చేస్తున్నారని ప్రమాద విషాదం నుంచి తేరుకుంటున్న బంధువులకు క్షతగాత్రులు బోరున విలపిస్తూ తమ వారికి సమాచారం ఇవ్వడంతో బాధితుల స్వగ్రామాలైన కొత్తపల్లి, వాకతిప్పలో రెండో రోజు విషాద ఛాయలు అలుముకున్నాయి.
మొదటిరోజు ఇలా..
అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న యాత్రా బస్ ప్రమాదవశాత్తు తిరగబడడంతో ఒకరు మృతి చెందగా 30 మందికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప కొత్తపల్లికి చెందిన 40 మంది అయ్యప్ప భక్తులు ఈ నెల 2వ తేదీన ఒక టూరిస్టు బస్‌లో శబరిమలై యాత్రకు బయలుదేరి వెళ్లారు. వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించి శబరిమలై అయ్యప్ప దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో మంగళవారం రాత్రి మధురై మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని రాత్రి 12 గంటల సమయంలో తిరుపతికి బస్‌లో బయలు దేరారు. బస్‌కు తమిళనాడు రాష్ట్రం విరలిమలై పోలీసు స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున 2 గంటలకు వెల్లూరు తూత్తుకుడి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లి అక్కడి విద్యుత్ స్తంభాలను ఢీకొడుతూ తిరగబడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారికి చికిత్స అనంతరం క్షతగాత్రులను ప్రైవేటు వాహనాల్లో వారి స్వగ్రామాలకు తరలించారు. బస్ ప్రమాదంలో మృతి చెందిన అయిశెట్టి సూర్యావతి మృతదేహానికి గురువారం మధ్యాహ్నం ఆమె స్వగ్రామం వాకతిప్పలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆమె మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్సులో తీసుకురాగా బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.
స్వగ్రామాలు చేరిన బాధితులు
పిఠాపురం: తల్లిదండ్రులను చూసి పిల్లలు, తమ్ముడిని చూసి అన్నయ్య, పిల్లలను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ప్రసాదాలతో ఆనందంగా తిరిగి వస్తారనుకున్న తమ వారు గాయాలతో బ్యాండేజీలతో క్షతగాత్రులుగా రావడంతో వారి బంధువులు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. తమవారిని చూసి భోరునవిలపించారు. బుధవారం రాత్రి తమిళనాడులో బస్ ప్రమాదానికిగురై తీవ్ర గాయాలపాలైన కొత్తపల్లి వాకతిప్ప గ్రామాలకు చెందిన అయ్యప్ప భక్తులు గురువారం రాత్రికి తమ స్వగ్రామాలు చేరుకున్నారు. రెండు ప్రైవేటు వాహనాలలో వచ్చిన వారిని బంధువులు ఇళ్లకు తీసుకెళ్లారు. వారు ఇంటికి వస్తున్నారన్న సమాచారంతో సాయంత్రం నుంచి వేచిచూసిన బాధితుల బంధువులు తీవ్ర ఆందోళనకు గురవ్వడంతో స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కొన ఊపిరితో బయటపడ్డాం...
అందరూ రెండు ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు బయలుదేరగా ప్రమాదంలో చేయి విరిగిన నాకు తీవ్ర అస్వస్థతగా ఉండడంతో ఒక ప్రత్యేక అంబులెన్సు (మొబైల్ ఐసీయూ) మాట్లాడి నేనూ, ఇబ్బంది దుర్గాప్రసాద్, కాకి స్వామి బుధవారం రాత్రి ప్రమాద ప్రాంతం నుంచి కొత్తపల్లి బయలుదేరాం. గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో నెల్లూరు కావలి మధ్యలో వెళుతుండగా మేము గాయాల బాధతో నిద్రలో ఉన్నాం. ఇంతలో పెద్దగా శబ్దమైంది. ఏం జరిగిందని చూసేసరికి మేమంతా వాహనంలోంచి బయటకు విసిరేసినట్లు పడిపోయి ఉన్నాం. మేము ప్రయాణిస్తున్న అంబులెన్సు తిరగబడి ఉంది. స్టెచర్‌పై ఉండాల్సిన నేను కంకరగుట్టలపై పడి ఉన్నాను. నాపాత గాయాల నుంచి రక్తం కారుతూ కనిపించింది. నా శరీరంపై గునపాలతో పొడుస్తున్నట్టు భరించలేనంత బాధ. వేగంగా వస్తున్న అంబులెన్సు మంచు కమ్ముకోవడంతో రోడ్డు మరమ్మతుల కోసం వేసిన కంకర గుట్టను ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు చెప్పారు. నాకు ముందు జరిగిన ప్రమాదంలో చేయి విరిగి ఒళ్లంతా గాయాలు కాగా రెండో ప్రమాదంలో నా గాయాలకు వేసిన కుట్లు విడిపోయి కొత్తగా దవడ విరిగి పలు చోట్ల ఎముకలు దెబ్బతిన్నాయి. రెండోసారి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను. యువకులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆ దారిన వెళుతున్న వాహనదారుల సమాచారంతో మళ్లీ మమ్మల్ని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం చేశారు. తిరిగి సాయంత్రం మరో వాహనంలో ఇంటికి బయలుదేరాం.– పొన్నగంటి సత్యవతి, రెండోసారి ప్రమాదానికి గురైన బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment