సాక్షి, విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కాఫీ గింజలు సేకరిస్తున్నా.. క్యూరింగ్, ప్రాసెసింగ్ కోసం ప్రైవేట్ సంస్థల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సొంతంగానే ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేదిశగా జీసీసీ అడుగులు వేస్తోంది. నర్సీపట్నంలో ఈ యూనిట్ నెలకొల్పేందుకు చర్యలు చేపడుతోంది.
ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీ ఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి. ఈ ఎస్టేట్స్‌లోని కాఫీ గింజల్ని క్యూరింగ్ చేసిన తర్వాతే జీసీసీకి సంబంధించిన క్యూరింగ్ పనులు ప్రారంభిస్తారు. క్యూరింగ్, ప్రాసెసింగ్ ప్రక్రియల్ని ఇతర ప్రాంతాల్లో నిర్వహించడం వల్ల మార్కెటింగ్‌కు తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు సొంతంగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని జీసీసీ నిర్ణయించింది.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
నర్సీపట్నంలో ఉన్న జీసీసీ పెట్రోల్ బంక్ వెనుక ఉన్న 0.73 ఎకరాల్లో ఈ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మించాలని భావిస్తోంది. ఇక్కడ ప్రస్తుతం జీసీసీకి సంబంధించిన మూడు ఖాళీ గోదాములు ఉన్నాయి. ఒక్కో గోదాము 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించారు. దీంతోపాటు డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఉన్నాయి. మొత్తం రూ.3.50 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ని ప్రాధమికంగా ఏర్పాటు చేయవచ్చనే ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి అధికారులు పంపించారు.
ఈ యూనిట్‌కు అవసరమైన యంత్రాలకు సంబంధించి మంగుళూరుకు చెందిన అంతర్జాతీయ కాఫీ ప్రాసెసింగ్ సంస్థలతో సంప్రదింపులు జరిపిన అధికారులు దేశంలో ఉన్న యూనిట్స్‌లో దీన్ని కూడా నాణ్యమైన ప్రాసెసింగ్ యూనిట్‌గా తీర్చిదిద్దాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గోదాముల్ని యూనిట్‌కు అనుగుణంగా మార్పులు చేస్తే వీలైనంత త్వరగా ప్రాసెసింగ్ చేసేందుకు అవకాశం ఉంటుందని జీసీసీ భావిస్తోంది.
గిరిజనులకు మేలు జరుగుతుంది..
కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. మెషినరీకి దాదాపు రూ.3 కోట్లు అవుతుందని అంచనా వేశాం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే వీలైనంత త్వరగా యూనిట్ పనులు ప్రారంభిస్తాం. ఇది పూర్తయితే వీలైనంత త్వరగా కాఫీ రైతులకు పేమెంట్ చేసేందుకు అవకాశం కలుగుతుంది. ప్రాసెసింగ్ చేసిన కాఫీని త్వరితగతిన మార్కెట్‌కు పంపించేందుకు మార్గం సుగమమవుతుంది. – సురేష్‌కుమార్, ఎండీ, జీసీసీ
Comments
Please login to add a commentAdd a comment