coffee project
-
నర్సీపట్నంలో జీసీసీ కాఫీ యూనిట్!
సాక్షి, విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కాఫీ గింజలు సేకరిస్తున్నా.. క్యూరింగ్, ప్రాసెసింగ్ కోసం ప్రైవేట్ సంస్థల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సొంతంగానే ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేదిశగా జీసీసీ అడుగులు వేస్తోంది. నర్సీపట్నంలో ఈ యూనిట్ నెలకొల్పేందుకు చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీ ఎఫ్డీసీ) ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి. ఈ ఎస్టేట్స్‌లోని కాఫీ గింజల్ని క్యూరింగ్ చేసిన తర్వాతే జీసీసీకి సంబంధించిన క్యూరింగ్ పనులు ప్రారంభిస్తారు. క్యూరింగ్, ప్రాసెసింగ్ ప్రక్రియల్ని ఇతర ప్రాంతాల్లో నిర్వహించడం వల్ల మార్కెటింగ్‌కు తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు సొంతంగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని జీసీసీ నిర్ణయించింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు నర్సీపట్నంలో ఉన్న జీసీసీ పెట్రోల్ బంక్ వెనుక ఉన్న 0.73 ఎకరాల్లో ఈ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మించాలని భావిస్తోంది. ఇక్కడ ప్రస్తుతం జీసీసీకి సంబంధించిన మూడు ఖాళీ గోదాములు ఉన్నాయి. ఒక్కో గోదాము 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించారు. దీంతోపాటు డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఉన్నాయి. మొత్తం రూ.3.50 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ని ప్రాధమికంగా ఏర్పాటు చేయవచ్చనే ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి అధికారులు పంపించారు. ఈ యూనిట్‌కు అవసరమైన యంత్రాలకు సంబంధించి మంగుళూరుకు చెందిన అంతర్జాతీయ కాఫీ ప్రాసెసింగ్ సంస్థలతో సంప్రదింపులు జరిపిన అధికారులు దేశంలో ఉన్న యూనిట్స్‌లో దీన్ని కూడా నాణ్యమైన ప్రాసెసింగ్ యూనిట్‌గా తీర్చిదిద్దాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గోదాముల్ని యూనిట్‌కు అనుగుణంగా మార్పులు చేస్తే వీలైనంత త్వరగా ప్రాసెసింగ్ చేసేందుకు అవకాశం ఉంటుందని జీసీసీ భావిస్తోంది. గిరిజనులకు మేలు జరుగుతుంది.. కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. మెషినరీకి దాదాపు రూ.3 కోట్లు అవుతుందని అంచనా వేశాం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే వీలైనంత త్వరగా యూనిట్ పనులు ప్రారంభిస్తాం. ఇది పూర్తయితే వీలైనంత త్వరగా కాఫీ రైతులకు పేమెంట్ చేసేందుకు అవకాశం కలుగుతుంది. ప్రాసెసింగ్ చేసిన కాఫీని త్వరితగతిన మార్కెట్‌కు పంపించేందుకు మార్గం సుగమమవుతుంది. – సురేష్‌కుమార్, ఎండీ, జీసీసీ -
కాఫీకి అవినీతి చీడ
రూ.కోట్ల ప్రాజెక్టు అమలుకు తాత్కాలిక ఉద్యోగులు అందినకాడికి స్వాహా చేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది జవాబుదారీతనం లేకుండా పోతున్న వైనం ఆదివాసీ రైతుల ఆర్థిక ఆసరా కోసం బృహత్తర ఆశయంతో ఉపాధిహామీలో చేపట్టిన కాఫీ ప్రాజెక్టుకు అవినీతి చీడపట్టింది. రూ. వందల కోట్లు వెచ్చిస్తున్న దీని అమలు బాధ్యతను క్షేత్రస్థాయిలో తాత్కాలిక ఉద్యోగులకు అప్పగించడంతో జవాబుదారీతనం లేకుండా పోతోంది. మండలస్థాయిలో ఒకరిద్దరు పర్యవేక్షణ అధికారులు మినహాయిస్తే అందరూ కాంట్రాక్టు ఉద్యోగులే. వీరంతా అందినకాడికి బుక్కేయడంతో కాఫీ ప్రోత్సాహకాలు రైతులకు సక్రమంగా చేరడం లేదు. ఇలా ప్రాజెక్టు అమలులో వైఫల్యాలు, అక్రమాల వల్ల రైతులు నిలదొక్కుకోలేకపోతున్నారు. ఇదే తరహాలో మరో ప్రాజెక్టు అమలుకు ఐటీడీఏ సన్నాహాలు చేస్తోంది. దీని అమలుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాడేరు: మన్యంలో పెద్ద ఎత్తున సాగవుతున్న కాఫీ తోటల్లో నిర్లక్ష్యపు నీడ అలముకుంటోంది. ఐటీడీఏ ద్వారా గిరిజన రైతు ల భాగస్వామ్యంతో ఏటా వేలాది ఎకరా ల్లో చేపడుతున్న కాఫీ సాగుకు కాఫీబోర్డు సాంకేతిక సహకారం, నిధులు సమకూరుస్తోంది. కాఫీ తోటల పెంపకం బాధ్యతను ఐటీడీఏ నిర్వర్తిస్తోంది.ఇందుకు లైజన్ వర్కర్లను నియమించింది. 2009-10లో రూ.349 కోట్లతో ఎన్ఆర్ఈజీఎస్, కాఫీబోర్డు సంయుక్తంగా లక్ష ఎకరాల్లో సాగు లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. క్షేత్రస్థాయిలో అమలుకు లైజన్ వర్కర్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లోని వీఆర్పీ, టెక్నికల్ అసిస్టెంట్ వంటి తాత్కాలిక ఉద్యోగులను నియమించారు. ఒక్క జి.మాడుగుల మండలంలోనే రూ.83 లక్షలు అవినీతి వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో తాత్కాలిక ఉద్యోగులైన లైజన్ వర్కర్లు, ఉపాధిహామీ సిబ్బందిని తొలిగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఇంతవరకు 16 మందిని అరెస్టు చేశారు. బినామీ ఖాతాల్లో చేరిన సొమ్ము రికవరీ ఊసేలేదు. ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు తోటలు వేసిన కాఫీ రైతులకు వరుసగా రెండేళ్లు ప్రోత్సాహక సొమ్ము సక్రమంగా పంపిణీ కాలేదు. అప్పట్లో 2013 వరకు రూ.45.45 కోట్లు ప్రభుత్వం బ్యాంకుల నుంచి కాఫీ తోటల పెంపకం కోసం నిధులు విడుదల చేయగా ఇందులో రైతులకు సుమారు రూ.33 కోట్లు అందలేదు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. గిరిజన కాఫీ రైతులు ప్రోత్సాహక సొమ్ము కోసం ఐటీడీఏ వద్ద ఆందోళనలు చేపట్టారు. పెదబయలు, డుంబ్రిగుడ మండలాల్లో సామాజిక తనిఖీల్లో అక్రమాలు వెలుగు చూశాయి. దోషులను గుర్తించారు. ఏపీ గిరిజన సంఘం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విఎన్కే శాస్త్రి, ప్రొఫెసర్ ఎం.ప్రసాదరావు, రిటైర్డ్ సీఐ బాబూరావు, హైకోర్టు న్యాయవాది పార్థ సారధిలతో వేసిన నిజ నిర్ధారణ కమిటీ సుమారు 400 గ్రామాలలో పర్యటించింది. 10 వేల మంది రైతులను కలిసింది. చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు నిర్ధారించింది. ఐతే బాధ్యులపై ఎటువంటి చర్యలు లేవు. కాఫీ రైతుల ఆందోళనలతో సుమారు రూ.20 కోట్లు కొందరికి చెల్లించారు. ఈ పథకం కింద తొలుత గ్రామైక్య సంఘాల ద్వారా కాఫీ రైతులకు చేపట్టిన చెల్లింపులు చివరికి బ్యాంకు ఖాతాల ద్వారా చేపట్టినా అక్రమాలు ఆగలేదు. తోట వేసే ప్రతి రైతుకు వరుసగా నాలుగేళ్లు ప్రోత్సాహక సొమ్ము చెల్లించవలసి ఉంది. ఉపాధిహామీలో తోటలు వేసిన రైతుల కోసం మరో మూడేళ్లు ఈ పథకాన్ని కొనసాగించాలి. అయినప్పటికీ ఈ ఏడాదితో ఈ ప్రాజెక్టు అర్ధంతరంగా నిలిచిపోతోంది. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం కొత్తగా రూ.526 కోట్లతో మరో ప్రాజెక్టు అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. దీని అమలుకూ కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి ఐటీడీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులోనూ అక్రమాలకు తావుండకపోదన్న వాదన వ్యక్తమవుతోంది. -
ఒలికిపోతున్న ‘కాఫీ’
చింతపల్లి/జీకేవీధి, న్యూస్‌లైన్: మావోయిస్టులు పంపిణీ చేసిన ప్రభుత్వ కాఫీ తోటల్లో పండ్ల సేకరణ నిలిచిపోయింది. పక్వానికి వచ్చిన రూ.లక్షల విలువైన కాఫీ పండ్లు వృథాగా నేలపాలవుతున్నాయి. జీకే వీధి మండలం మర్రిపాకలు, కుంకుంపూడి, లంకపాకలు ఎస్టేట్ పరిధిలోనును, చింతపల్లి మండలం బలపం పంచాయతీ పరిధిలో సుమారు 200 హెక్టార్ల కాఫీ తోటలను మావోయిస్టులు మూడేళ్ల క్రితం స్వాధీనం చేసుకుని గిరిజనులకు పంపిణీ చేశారు. 1/70 చట్టం ప్రకారం స్థానికంగా ఉన్న గిరిజనులకే ఈ తోటలు చెందుతాయని,వాటి జోలికి రావద్దని పలుమార్లు ఏపీఎఫ్డీసీ అధికారులకు హెచ్చరించారు. దీంతో కాఫీ అధికారులు ఆయా తోటల జోలికి వెళ్లడం మానేశారు. మూడేళ్లుగా గిరిజనులే వాటిల్లో పండ్లు సేకరించి అమ్ముకుంటున్నారు. ఈ ఏడాదీ మాత్రం చుక్కెదురైంది. మావోయిస్టులు పంపిణీ చేసిన తోటల్లో సేకరించిన కాఫీ పండ్లను వ్యాపారులు కొనుగోలు చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. దీంతో కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో పండ్లు పక్వానికి వచ్చినప్పటికీ సేకరణకు గిరిజనులు ఆసక్తి చూపడం లేదు. వాటిని ఎవరికి విక్రయించాలో తెలియక గిరిజనులు డోలాయమానంలో పడ్డారు. రోజుల తరబడి సేకరించకపోవడంతో అవి నేలపాలవుతున్నాయి. కష్టాల్లో కాఫీబోర్డు విశాఖ మన్యానికి ప్రత్యేక గుర్తింపుతెచ్చిన రాష్ట్ర కాఫీ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్డీసీ) ప్రస్తుతం కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రతికూల వాతావరణం, తోటల్లో దొంగతనాలు, మావోయిస్టుల చర్యలు కారణంగా ఏటా సంస్థ నష్టాల్లో కూరుకుపోతోంది. ఈ ఏడాదీ అదే పరిస్థితి దాపురించింది. చింతపల్లి పరిధి దక్షిణ ప్రాంతంలో సుమారు 70 హెక్టార్ల కాఫీ తోటలను మావోయిస్టులు గిరిజనలకు పంపిణీకి రంగం సిద్ధం చేశారు. దీంతో ఆయా తోటల వైపు కన్నెత్తి చూసేందుకు కాఫీబోర్డు అధికారులు భయపడుతున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా 4,200 హెక్టార్లలో కాఫీ తోటలు సంస్థ అధీనంలో ఉన్నాయి. వీటిలో చింతపల్లి, జీకే వీధి మండలాల్లోనే 3,400 హెక్టార్లలో ఉన్నాయి. ఐదేళ్ల క్రితం జీకే వీధి మండలం మర్రిపాకలు ఎస్టేట్‌లో 64 హెక్టార్ల తోటలను, బలపంలోని 110 హెక్టార్ల కాఫీ తోటలను గిరిజనులకు మావోయిస్టులు పంపిణీ చేశారు. నాటి నుంచి సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వర్షాలు కారణంగా దిగుబడులు నామమాత్రంగా ఉన్నాయి. సౌత్ జోన్‌లోని 70 హెక్టార్ల కాఫీ తోటలను గిరిజనులకు పంపిణీ చేస్తున్నట్టు మావోయిస్టులు ఇటీవల కాఫీబోర్డు అధికారులకు సమాచారం పంపారు. దీంతో ఈ ఏడాది ఒక్క చింతపల్లి మండలంలోనే సుమారు రూ.1.2కోట్లు నష్టం తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమాలపై నిఘా మావోయిస్టులు పంపిణీ చేసిన కాఫీ తోటలపై పోలీసు నిఘా ఏర్పాటు చేశామని నర్సీపట్నం ఓఎస్డీ దామోదర్ తెలిపారు. కేవలం గిరిజనులకు ఉపాధి కల్పించేందుకే ఏపీఎఫ్డీసీ కాఫీ తోటల సాగు చేపట్టిందన్నారు. ప్రస్తుతం పండ్ల సేకరణ కూలి రేట్లు సైతం భారీగా పెంచిందన్నారు. తోటల్లో కూలి పనులు చేసుకుంటే గిరిజనుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందన్నారు. ఎప్పటిలాగే గిరిజనులు కాఫీ తోటల్లో పనులు చేసి ఉపాధి పొందితే తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వ కాఫీ తోటల్లో పండ్లను అక్రమంగా సేకరించి విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తామని ఓఎస్డీ తెలిపారు. - దామోదర్, నర్సీపట్నం ఓఎస్డీ -
కాఫీ ప్రాజెక్టులో అక్రమాలు వాస్తవమే
=కాఫీ ప్రాజెక్టులో అక్రమాలు వాస్తవమే =గిరిజనుల వద్దకు అన్ని పథకాలు =సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం =న్యూస్‌లైన్‌తో ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ పాడేరు, న్యూస్‌లైన్: మన్యంలో గిరిజనులకు మేలు చేకూర్చడానికి ఉద్దేశించిన కాఫీ ప్రాజెక్టులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని, అన్యాయానికి గురైన అడవిబిడ్డలకు మేలు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని ఐటీడీఏ పీవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ చెప్పారు. ఏజెన్సీలో ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసి సమగ్రాభివృద్ధి సాధించాలన్నది తన లక్ష్యమని చెప్పారు. గిరిజనులకు అందుతున్న సేవల్లో లోపాలపై విస్తృత పరిశీలన జరిపానని, సమస్యల పరిష్కారంపై ఇక దృష్టి సారిస్తానని బుధవారం న్యూస్‌లైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రశ్న: ఏజెన్సీలోని కాఫీ ప్రాజెక్టు అక్రమాలపై మీ స్పందన ఏమిటి? జవాబు: ఏజెన్సీలో 2009 నుంచి ఇంతవరకు నిర్వహించిన కాఫీ ప్రాజెక్టులో అక్రమాలు జరిగి నట్టు నిర్ధారణకు వచ్చా ను. అయితే పెండింగ్ చెల్లింపులు కూడా అధికంగా ఉన్నాయి. ఏ స్థాయిల్లో అక్రమాలు జరిగాయో విచారణ చేపడుతున్నాం. ప్రశ్న: బాధిత రైతులకు ఏం చేస్తారు? జవాబు: కాఫీ ప్రాజెక్టు ద్వారా కాఫీ సాగు చేపట్టిన రైతులందరికి న్యాయం చేస్తాం. వారికి చెల్లించాల్సిన ప్రోత్సాహక సొమ్మం తా అందిస్తాం. ప్రశ్న: కాఫీ సాగు అభివృద్ధి మాటేమిటి? జవాబు: అవినీతిని తుడిచిపెట్టి కాఫీ సాగు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నది లక్ష్యం. ఏజెన్సీలో కాఫీ సాగును మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కాఫీ, సిల్వర్‌ఓక్ నర్సరీల ఏర్పాటు ద్వారా గిరిజన రైతులకు అన్ని విధాలా సహాయ పడతాం. ప్రోత్సాహక చెల్లింపులన్నీ సక్రమంగా జరుపుతాం. ప్రశ్న : మౌలిక సౌకర్యాల కొరతను ఎలా అధిగమిస్తారు? జవాబు : గిరిజన ప్రాంతాలను మౌలిక సదుపాయాల కొర త తీవ్రంగా వేధిస్తోంది. ఇందుకు నిధుల సమస్య కూడా ప్రతి బంధకంగా ఉంది. ఐఏపీ, టీఎస్పీ నిధులు పాడేరు ఐ టీడీఏకు భారీగా రానున్నాయి. అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అంచనాలు తయారు చేస్తున్నాం. అందుకు తగ్గట్టు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం. ప్రశ్న : రహదారుల సమస్యపై చర్యలేమిటి? జవాబు : ఏజెన్సీలో రహదారుల అభివృద్ధికి దండిగా నిధులు మంజూరు అవుతున్నాయి. రహదారుల నాణ్యతపై దృష్టి పెడతాం. ప్రస్తుతం ఏజెన్సీలో 255 ముఖ్యమైన రోడ్డు పనులకు పీఎంజీఎస్‌వై ద్వారా భారీగా నిధులు మంజూరయ్యాయి. ఈ రోడ్డు పనులు సత్వరం పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తాం. ప్రశ్న : మన్యంలో విద్యాభివృద్ధికి చర్యలేమిటి? జవాబు : డ్రాపౌట్లు లేకుండా గ్రామాల్లో పిల్లలందరూ చదువుకోవాలనే లక్ష్యంతో ఉన్నాం. ప్రాథమిక పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రస్తుతం సర్వే చేపడుతున్నాం. ప్రశ్న : వైద్య సౌకర్యాల పరిస్థితి దయనీయంగా ఉంది.. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు? జవాబు : ఏజెన్సీలోని 3,559 గ్రామాల్లో వైద్య ఆరోగ్య కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తాం. రెండేళ్లుగా మలేరియా తగ్గుముఖం పట్టడం సంతోషదాయకం. ఇదే స్ఫూర్తి తో ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్య సౌకర్యాలు లభించేలా శ్రమిస్తాం. వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృ తం చేస్తాం. వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించేందుకు ప్రభుత్వానికి నివేదిస్తాం. తొందరలోనే 22 అంబులెన్స్‌లు కూడా ఏజెన్సీకి రానున్నాయి. -
‘కాఫీ’ కథ కంచికేనా?
పాడేరు, న్యూస్‌లైన్: ఉపాధి హామీ పథకం, కేంద్ర కాఫీ బోర్డు సంయుక్తంగా ఏజెన్సీలో అమలు చేస్తున్న కాఫీ ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ ఎప్పటి కి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. కాఫీ ప్రాజెక్టు కుంభకోణంపై సమ గ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని హామీలిస్తున్న కలెక్టర్లు బదిలీపై వెళ్లిపోతుండడంతో పరిస్థితి మళ్లీ మొదటికే వస్తోంది. గిరిజన రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదు. మన్యంలో 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన కాఫీ మొక్కల పెంపకానికి సంబంధించి ప్రోత్సాహక సొమ్ము పంపిణీలో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని రైతులతోపాటు గిరిజన సంఘం, వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళనలు చేశా రు. గిరిజన సంఘం గ్రామాల వారీగా సర్వేలు నిర్వహించి సుమారు రూ.21 కోట్ల మేర అక్రమాలు జరిగాయని పేర్కొంటూ అప్పటి కలెక్టర్ వి.శేషాద్రికి నివేదిక సమర్పించింది. దీనిపై ఆయన సమగ్ర విచారణకు ఆదేశించినప్పటికీ మొక్కుబడిగా విచారణ సాగింది. పెదబయలు మండలంలోని 5 మారుమూల పంచాయతీల్లో ప్రత్యేక సామాజిక తనిఖీలు చేపట్టి సుమారు రూ.60 లక్షల అవినీతి జరిగిందని నిర్ధారించా రు. ఐకేపీ, ఉపాధి హామీ పథకంలో పని చేస్తు న్న కింది స్థాయి ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. డుంబ్రిగుడ, హుకుం పేట, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి మండలాల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగినప్పటికీ ఇంతవరకు ప్రత్యేక సామాజిక తనిఖీలు నిర్వహించలేదు. హైదరాబాద్‌కు చెందిన అధికారుల బృందంతో విచారణ నిర్వహిస్తామని అప్పటి కలెక్టర్ ప్రకటించినప్పటికీ అది జరగలేదు. ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి న ఆరోఖ్యరాజ్‌కు కాఫీ ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరపాలని కోరుతూ గిరిజన సంఘం నేతలు వినతిపత్రం సమర్పించారు. విచారణకు ఆయన కూడా హామీ ఇచ్చిన ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. ఉన్నత స్థాయి అధికారులు ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉండడంతోనే విచారణను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ ఊసెత్తకుండా బడా రాజకీయ నేతలతో అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నట్టు తెలిసింది. కేంద్ర, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రులైన కిషోర్‌చంద్రదేవ్, పి.బాలరాజు కూడా కాఫీ అవినీతిపై విచారణకు ఆదేశించకపోవడం వెనుక చిదంబర రహస్యం ఏమిటో అంతుబట్టడం లేదు. దీనిపై సమగ్ర విచారణ కోరుతూ బాధిత రైతులు మరలా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. -
‘కాఫీ’అక్రమాలపై విచారణ
పాడేరు, న్యూస్‌లైన్: కాఫీ ప్రాజెక్టు అమలులో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి గిరిజన రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. జిల్లా కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా మంగళవారం ఏజెన్సీలో పర్యటించారు. ఐటీడీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాఫీ ప్రోత్సాహక నిధులు చెల్లింపుల్లో అవినీతి ఆరోపణలపై దృష్టిసారించామన్నారు. సామాజిక తనిఖీల బృందంతో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే పెదబయలు, డుంబ్రిగుడ మండలాల్లో విచారణ పూర్తయిందన్నారు. అరకులోయలోని పద్మాపురం గార్డెన్, ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు ఐటీడీఏ కార్యాలయంలో వివిధశాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ గిరిజనుల సంక్షేమానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్య ఆరోగ్యం, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖల అమలు తీరుపై ఆరా తీశారు. కాఫీ, జీసీసీ. గిరిజన విద్య, ఉపాధి హమీలో చెల్లింపులు, ప్రత్యేక చిన్ననీటి పారుదల శాఖ ద్వారా అమలవుతున్న అన్ని కార్యక్రమాలపై సమీక్షించారు. గిరిజనులకు వైద్యసేవలపై డీఎంహెచ్‌వో శ్యామల, ఏడీఎంహెచ్‌వో స్వప్నకుమారి, జిల్లా మలేరియా అధికారి ప్రసాద్రావులతో మాట్లాడారు. ఆరోగ్య పరిరక్షణకు ఏజెన్సీ వ్యాప్తంగా చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల వివరాలను సేకరించారు. ఎపిడమిక్ దృష్ట్యా అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. రెండేళ్లుగా మలేరియా తగ్గుముఖంపై సంతోషం వ్యక్తం చేశారు. మారుమూల తండాల్లోనూ సేవలు మరింత విస్తృతం చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే పరిస్థితులున్నందున ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. దోమల నివారణ మందు రెండో విడత పిచికారీ వేగవంతం చేయాలన్నారు. మాతశిశు ఆరోగ్య కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. కాఫీ సాగు లక్ష్యాలను అధిగమించాలి ఏజెన్సీలో కాఫీ సాగు లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సిల్వర్‌ఓక్, కాఫీ నర్సరీల వివరాలను తెలుసుకున్నారు. మన్యంలో సాగవుతున్న కాఫీ పంటల రకాలు, అంతరపంటలు,దిగుబడులు,అమ్మకాలతో రైతులకు వచ్చే గిట్టుబాటు ధరలపై సమీక్షించారు. గత రెండేళ్లలో అమలు చేసిన కాఫీ ప్రాజెక్టు ప్రగతి నివేదికలను తనకు వెంటనే అందజేయాలని ఆదేశించారు. ఏజెన్సీలోని కాఫీ రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, సామాజిక తనిఖీల వివరాలను సమీక్షించారు. ఏజెన్సీలోని ఇంజినీరింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. ఉపాధిహామీలో నిర్మించిన రోడ్లు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మారుమూల గ్రామాల్లో రహదారుల తీరును సమీక్షించారు. గిరిజన విద్యా కార్యక్రమాలను కూడా తెలుసుకున్నారు. హాస్టళ్లలో సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, అమలవుతున్న మెనూపై గిరిజన సంక్షేమ డీడీ మల్లికార్జునరెడ్డిని ఆరా తీశారు. మన్యంలోని అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో పాడేరు ఆర్డీవో ఎం. గణపతిరావు, ఐటీడీఏ ఏపీవో పీవీఎస్నాయుడు, గిరిజన సంక్షేమశాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డి, టీడబ్ల్యూ, పీఆర్ ఈఈలు ఎం.ఆర్.జె. నాయుడు, బి అప్పలనాయుడు, ఎస్ఎంఐ ఈఈ మల్లికార్జున రావు, పాడేరు క్లస్టర్ ఎస్పీహెచ్వో డాక్టర్ లీలాప్రసాద్, కాఫీ ఏడీ జి.రామ్మోహన్రావు పాల్గొన్నారు. పాడేరు వచ్చి పదేళ్లు.. తాను పాడేరు వచ్చి పదేళ్లు అయిందని, మరోసారి గిరిజనసంక్షేమానికి కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. అప్పటి రోజులతో పోల్చుకుంటే గిరిజన సంక్షేమ కార్యక్రమాలు అధికమయ్యాయన్నారు. మారుమూల ప్రాంతాలకు రోడ్లు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. కమ్యూనికేషన్ పరంగా కూడా ఏజెన్సీలో మార్పు వచ్చిందన్నారు.