పాడేరు, న్యూస్‌లైన్:
కాఫీ ప్రాజెక్టు అమలులో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి గిరిజన రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. జిల్లా కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా మంగళవారం ఏజెన్సీలో పర్యటించారు. ఐటీడీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాఫీ ప్రోత్సాహక నిధులు చెల్లింపుల్లో అవినీతి ఆరోపణలపై దృష్టిసారించామన్నారు. సామాజిక తనిఖీల బృందంతో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామన్నారు.
ఇప్పటికే పెదబయలు, డుంబ్రిగుడ మండలాల్లో విచారణ పూర్తయిందన్నారు. అరకులోయలోని పద్మాపురం గార్డెన్, ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు ఐటీడీఏ కార్యాలయంలో వివిధశాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ గిరిజనుల సంక్షేమానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్య ఆరోగ్యం, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖల అమలు తీరుపై ఆరా తీశారు. కాఫీ, జీసీసీ. గిరిజన విద్య, ఉపాధి హమీలో చెల్లింపులు, ప్రత్యేక చిన్ననీటి పారుదల శాఖ ద్వారా అమలవుతున్న అన్ని కార్యక్రమాలపై సమీక్షించారు. గిరిజనులకు వైద్యసేవలపై డీఎంహెచ్‌వో శ్యామల, ఏడీఎంహెచ్‌వో స్వప్నకుమారి, జిల్లా మలేరియా అధికారి ప్రసాద్‌రావులతో
మాట్లాడారు. ఆరోగ్య పరిరక్షణకు ఏజెన్సీ వ్యాప్తంగా చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల వివరాలను సేకరించారు. ఎపిడమిక్ దృష్ట్యా అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. రెండేళ్లుగా మలేరియా తగ్గుముఖంపై సంతోషం వ్యక్తం చేశారు.
మారుమూల తండాల్లోనూ సేవలు మరింత విస్తృతం చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే పరిస్థితులున్నందున ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. దోమల నివారణ మందు రెండో విడత పిచికారీ వేగవంతం చేయాలన్నారు. మాతశిశు ఆరోగ్య కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలన్నారు.
కాఫీ సాగు లక్ష్యాలను అధిగమించాలి
ఏజెన్సీలో కాఫీ సాగు లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సిల్వర్‌ఓక్, కాఫీ నర్సరీల వివరాలను తెలుసుకున్నారు. మన్యంలో సాగవుతున్న కాఫీ పంటల రకాలు, అంతరపంటలు,దిగుబడులు,అమ్మకాలతో రైతులకు వచ్చే గిట్టుబాటు ధరలపై సమీక్షించారు. గత రెండేళ్లలో అమలు చేసిన కాఫీ ప్రాజెక్టు ప్రగతి నివేదికలను తనకు వెంటనే అందజేయాలని ఆదేశించారు. ఏజెన్సీలోని కాఫీ రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, సామాజిక తనిఖీల వివరాలను సమీక్షించారు. ఏజెన్సీలోని ఇంజినీరింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. ఉపాధిహామీలో నిర్మించిన రోడ్లు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మారుమూల గ్రామాల్లో రహదారుల తీరును సమీక్షించారు. గిరిజన విద్యా కార్యక్రమాలను కూడా తెలుసుకున్నారు. హాస్టళ్లలో సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, అమలవుతున్న మెనూపై గిరిజన సంక్షేమ డీడీ మల్లికార్జునరెడ్డిని ఆరా తీశారు. మన్యంలోని అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో పాడేరు ఆర్డీవో ఎం. గణపతిరావు, ఐటీడీఏ ఏపీవో పీవీఎస్‌నాయుడు, గిరిజన సంక్షేమశాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డి, టీడబ్ల్యూ, పీఆర్ ఈఈలు ఎం.ఆర్.జె. నాయుడు, బి అప్పలనాయుడు, ఎస్‌ఎంఐ ఈఈ మల్లికార్జున రావు, పాడేరు క్లస్టర్ ఎస్పీహెచ్‌వో డాక్టర్ లీలాప్రసాద్, కాఫీ ఏడీ జి.రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.
పాడేరు వచ్చి పదేళ్లు..
తాను పాడేరు వచ్చి పదేళ్లు అయిందని, మరోసారి గిరిజనసంక్షేమానికి కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. అప్పటి రోజులతో పోల్చుకుంటే గిరిజన సంక్షేమ కార్యక్రమాలు అధికమయ్యాయన్నారు. మారుమూల ప్రాంతాలకు రోడ్లు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. కమ్యూనికేషన్ పరంగా కూడా ఏజెన్సీలో మార్పు వచ్చిందన్నారు.
‘కాఫీ’అక్రమాలపై విచారణ
Published Wed, Sep 11 2013 5:43 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
Advertisement
Advertisement