భోపాల్: నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు? అంటూ ట్రక్కు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటు పడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ జిల్లాలో జరిగింది. న్యాయ సంహిత బిల్లులోని హిట్ అండ్ రన్ నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ల సంఘం ప్రతినిధులతో షాజాపూర్ కలెక్టర్ కిశోర్ కన్యాల్ మంగళవారం సమావేశమయ్యారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదని, విధుల్లో చేరాలంటూ వారిని హెచ్చరించారు. తమతో సక్రమంగా మాట్లాడాలని ఓ ప్రతినిధి చెప్పగా, కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు. నీ స్థాయి ఎంత? అంటూ మండిపడ్డారు. తమకు ఏ స్థాయి లేదు కాబట్టే ఈ పోరాటం చేస్తున్నామని ఆ ప్రతినిధి బదులిచ్చాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు కలెక్టర్ కిశోర్ కన్యాల్‌ను ఆ పదవి నుంచి తొలగింగి, రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీగా బదిలీ చేసినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment