Truck Driver Moment
-
ట్రక్కు డ్రైవర్లకు కొత్త భవనాలు.. ప్రధాని కీలక నిర్ణయం
హైవేలపై ట్రక్కు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఆధునిక సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు , మొదటి దశలో 1,000 భవనాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానిమోదీ తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందిస్తోందని ప్రధాని శుక్రవారం అన్నారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘వాహన రంగంలో డ్రైవర్లది కీలక పాత్ర. చాలా గంటల పాటు వాహనాన్ని నడుపుతుంటారు. కానీ వాళ్లకు సరైన విశ్రాంతి ప్రాంతం దొరకడం లేదు. సరైన విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల రహదారి ప్రమాదాలకు దారి తీస్తోంది. దాంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం వారి బాధను అర్థం చేసుకుంది’ అన్నారు. ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్తపథకంలో భాగంగా ఏర్పాటు చేసే ప్రత్యేక భవనాల్లో ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వసతులు ఉండనున్నాయి. డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అన్ని వసతులు అభివృద్ధి చేయనున్నట్లు మోడీ చెప్పారు. ఈ పథకంలో భాగంగా మొదటి దశలో దేశవ్యాప్తంగా 1,000 భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. ఇదీ చదవండి: సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్! అక్టోబర్ 1, 2025న లేదా ఆ తర్వాత తయారు చేసే అన్ని కొత్త ట్రక్కుల్లో డ్రైవర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్లను ఏర్పాటు చేసేలా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు రోజుల పాటు జరిగే ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో 50కి పైగా దేశాల నుంచి 800 మంది ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు. -
నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు?
భోపాల్: నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు? అంటూ ట్రక్కు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటు పడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ జిల్లాలో జరిగింది. న్యాయ సంహిత బిల్లులోని హిట్ అండ్ రన్ నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ల సంఘం ప్రతినిధులతో షాజాపూర్ కలెక్టర్ కిశోర్ కన్యాల్ మంగళవారం సమావేశమయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదని, విధుల్లో చేరాలంటూ వారిని హెచ్చరించారు. తమతో సక్రమంగా మాట్లాడాలని ఓ ప్రతినిధి చెప్పగా, కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు. నీ స్థాయి ఎంత? అంటూ మండిపడ్డారు. తమకు ఏ స్థాయి లేదు కాబట్టే ఈ పోరాటం చేస్తున్నామని ఆ ప్రతినిధి బదులిచ్చాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు కలెక్టర్ కిశోర్ కన్యాల్‌ను ఆ పదవి నుంచి తొలగింగి, రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీగా బదిలీ చేసినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. -
Truck Drivers Protest: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ట్రక్కు డ్రైవర్ల సమ్మెపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. రోడ్ యాక్సిడెంట్ల కేసుల్లో శిక్షను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహిత చట్ట సవరణ చేయడాన్ని షెహన్షాకా ఫర్మానాగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు మంగళవారం రాహుల్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ‘150 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ప్రతిపక్షంతో చర్చించకుండా చట్టాలు చేయడం ప్రజాస్వామ్యంపై దాడే. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి డ్రైవర్లకు వ్యతిరేకంగా చేసిన చట్ట సవరణ వల్ల తీవ్ర పరిణామాలుంటాయి. కష్టపడి పనిచేసుకుని జీవితాలు గడిపే డ్రైవర్ల జీవితాలను చట్టాల పేరు చెప్పి ఇబ్బందుల పాలు చేయడం సరికాదు. ఈ చట్టాన్ని కొన్ని వ్యవస్థలు దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడే అవకాశం ఉంది’అని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ట్రక్కు డ్రైవర్ల సమ్మెతో సోమవారం(జనవరి 1) నుంచి దేశంలోని పలు నగరాల్లో బంకులకు పెట్రోల్, డిజిల్ సరఫరా ఆగిపోయింది. దీంతో ఆయా నగరాల్లో వాహనదారులు మంగళవారం ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్రోల్ కోసం ద్వి చక్ర వాహనదారులు బంకుల ముందు బారులు తీరారు. ఇదీచదవండి..ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం -
HYD: ట్యాంకర్ డ్రైవర్ల ధర్నా విరమణ.. బంకుల వద్ద రద్దీ
సాక్షి, హైదరాబాద్: ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు హైదరాబాద్‌లో చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో పెట్రోల్, డీజిల్ లోడులతో చర్లపల్లిలోని డిపోల నుంచి ట్యాంకర్లు బంకులకు బయలుదేరాయి. ఇవి బంకులకు చేరేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో కొద్దిసేపు అక్కడ వాహనదారుల రద్దీ కొనసాగనుంది. ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి బంకుల వద్ద వాహనదారులు ఇంధనం కోసం బారులు తీరారు. భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి జైలు శిక్షను ఇటీవల కేంద్రం భారీగా పెంచింది. దీనికి నిరసనగా ఆయిల్ ట్యాంకర్ల ఓనర్లు, డ్రైవర్లు సోమవారం(జనవరి 1) నుంచి ధర్నాకు దిగారు. దీంతో హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకులకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. బంకుల ముందు యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు అలర్డ్ అయ్యారు. తెరచి ఉన్న కొన్ని బంకుల ముందు ఒక్కసారిగా జనాలు క్యూ కట్టడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్‌లు అయ్యాయి. మంగళవారం సాయంత్రం ఆయిల్ ట్యాంకర్లు ధర్నా విరమించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదీచదవండి..తీహార్ జైళ్లో పుట్టిన పార్టీ కాంగ్రెస్ -
ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం
ఢిల్లీ: ట్రక్ డ్రైవర్ల ఆందోళనపై కేంద్రం స్పందించింది. రాత్రి 7 గంటలకు డ్రైవర్ల యూనియన్ తో చర్చలు జరుపనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. భారతీయ న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు విధించడంపై ట్రక్కు డ్రైవర్లు సోమవారం నుంచి ఆందోళన చేపడుతున్నారు. మంగళవారం ఆ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాతీయ రహదారులను ట్రక్కు డ్రైవర్లు దిగ్బంధించారు. రోడ్లపై రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్రక్కులు, ప్రైవేట్ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఇంధన కొరత.. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా చేసే ట్రక్కులు కూడా రాకపోకలను నిలిపివేశాయి. పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. బంకుల ముందు వాహనదారులు వందల మీటర్ల బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. చట్టంలో మార్పులేంటి..? భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్రం ఇటీవల భారత న్యాయ సంహితను తీసుకొచ్చింది. ఇందులో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన నిబంధనలు రూపొందించింది. చట్టం ప్రకారం.. రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశాన్ని కల్పించారు. ఇంతకుముందు ఐపీసీ(భారతీయ శిక్షా స్మృతి) ప్రకారం రెండేళ్లే జైలు శిక్ష ఉండేది. కొత్త నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు రెండు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ఈ కఠిన నిబంధనలకు భయపడి కొత్తవారు ఈ వృత్తిలోకి రావడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎన్నికల వేళ.. చేరికలపై బీజేపీ నూతన కమిటీ -
ఇంధన కొరతపై ఆర్మీని దించనున్న యూకే
లండన్: దేశాన్ని వణికిస్తున్న ఇంధన కొరత సమస్యను తీర్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించనుంది. సుమారు 200 మంది మిలటరీ వ్యక్తులను తాత్కాలిక ఇంధన సరఫరాకోసం నియోగించనున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇంధన కొరత కారణంగా పలు పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు భారీగా బారులు తీరుతున్నారు. దేశంలో ట్రక్ డ్రైవర్ల కొరత కారణంగా ఇంధన రవాణా కుంటుపడింది. ఆపరేషన్ ఎస్కాలిన్ పేరిట ఈ సమస్య పరిష్కారానికి మిలటరీ నుంచి కొందరిని నియమిస్తున్నామని, వీరు ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్నారని, సోమవారం నుంచి ఇంధన సరఫరా బాధ్యతలు చేపడతారని డిఫెన్స్ కార్యదర్శి డెన్ వాలెస్ చెప్పారు. ఈ వారంలో ఇంధన సమస్య చాలావరకు తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా సమస్య కనిపిస్తూనే ఉంది. సమస్య తీవ్రత క్రమంగా తగ్గుతోందని ప్రభుత్వం తెలిపింది. -
ట్రక్కు డ్రైవర్ గా మారిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రక్కు డ్రైవర్ అవతారం ఎత్తారు. శ్వేతభవనం ముందు పార్క్ చేసిన ట్రక్కులోకి ఎక్కి సందడి చేశారు. అగ్రదేశాధ్యక్షుడు ట్రక్కు నడుపుతున్న ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో సరదా కామెంట్లు పోటెత్తాయి. గురువారం ట్రక్కు డ్రైవర్లు, ఆ రంగానికి చెందిన ప్రతినిధులతో ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ ముందు పార్క్ చేసిన ట్రాక్టర్ ట్రైయిలర్ వాహనంలోకి ఎక్కిన ట్రంప్ కొద్ది నిమిషాల పాటు సందడి చేశారు. డ్రైవర్ సీటులో కూర్చుకుని ముందుగా హారన్ మోగించారు. స్టీరింగ్ పట్టుకుని తనదైన శైలిలో హావభావాలు పలికించారు. ‘ట్రక్కు డ్రైవర్లకు తెలిసినంతగా అమెరికా గురించి తెలియదు. రోజూ వారు కొండలు, లోయలు చూస్తారు. రోడ్లపై పూడ్చాల్సిన ప్రతి గొయ్యిను పరిశీలిస్తార’ని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ట్రక్కు డ్రైవర్ అవతారం ఎత్తిన ట్రంప్ ఫొటోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో ట్విటర్ లో నెటిజన్లు సరదా కామెంట్లు పెట్టారు.