సాక్షి, హైదరాబాద్: ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు హైదరాబాద్‌లో చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో పెట్రోల్, డీజిల్ లోడులతో చర్లపల్లిలోని డిపోల నుంచి ట్యాంకర్లు బంకులకు బయలుదేరాయి. ఇవి బంకులకు చేరేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో కొద్దిసేపు అక్కడ వాహనదారుల రద్దీ కొనసాగనుంది. ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి బంకుల వద్ద వాహనదారులు ఇంధనం కోసం బారులు తీరారు.
భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి జైలు శిక్షను ఇటీవల కేంద్రం భారీగా పెంచింది. దీనికి నిరసనగా ఆయిల్ ట్యాంకర్ల ఓనర్లు, డ్రైవర్లు సోమవారం(జనవరి 1) నుంచి ధర్నాకు దిగారు. దీంతో హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకులకు ఇంధన సరఫరా నిలిచిపోయింది.
బంకుల ముందు యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు అలర్డ్ అయ్యారు. తెరచి ఉన్న కొన్ని బంకుల ముందు ఒక్కసారిగా జనాలు క్యూ కట్టడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్‌లు అయ్యాయి. మంగళవారం సాయంత్రం ఆయిల్ ట్యాంకర్లు ధర్నా విరమించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment