న్యూఢిల్లీ: ట్రక్కు డ్రైవర్ల సమ్మెపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. రోడ్ యాక్సిడెంట్ల కేసుల్లో శిక్షను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహిత చట్ట సవరణ చేయడాన్ని షెహన్షాకా ఫర్మానాగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు మంగళవారం రాహుల్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.
‘150 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ప్రతిపక్షంతో చర్చించకుండా చట్టాలు చేయడం ప్రజాస్వామ్యంపై దాడే. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి డ్రైవర్లకు వ్యతిరేకంగా చేసిన చట్ట సవరణ వల్ల తీవ్ర పరిణామాలుంటాయి. కష్టపడి పనిచేసుకుని జీవితాలు గడిపే డ్రైవర్ల జీవితాలను చట్టాల పేరు చెప్పి ఇబ్బందుల పాలు చేయడం సరికాదు. ఈ చట్టాన్ని కొన్ని వ్యవస్థలు దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడే అవకాశం ఉంది’అని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
ట్రక్కు డ్రైవర్ల సమ్మెతో సోమవారం(జనవరి 1) నుంచి దేశంలోని పలు నగరాల్లో బంకులకు పెట్రోల్, డిజిల్ సరఫరా ఆగిపోయింది. దీంతో ఆయా నగరాల్లో వాహనదారులు మంగళవారం ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్రోల్ కోసం ద్వి చక్ర వాహనదారులు బంకుల ముందు బారులు తీరారు.
Comments
Please login to add a commentAdd a comment