rahulgandhi
-
రాహుల్‌గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
గువహతి:కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పోరాడుతోందని కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై అస్సాంలోని గువహతి పోలీస్ స్టేషన్లో ఆదివారం(జనవరి19) ఎఫ్ఐఆర్(FIR) నమోదైంది. మోన్‌జిత్ చాటియా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్య పరిమితులను దాటాయని,అవి జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని చాటియా తన ఫిర్యాదులో తెలిపారు. ఆయన వ్యాఖ్యలు అశాంతితో పాటు,వేర్పాటువాద భావాలు కలిగిన వారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్‌కు ఉందని చాటియా పేర్కొన్నారు. కాగా,ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ ఆరెస్సెస్ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు. తాము ఇప్పుడు బీజేపీ, ఆరెస్సెస్‌తోపాటు భారత దేశంపై కూడా పోరాడుతున్నామన్నారు. ఈవ్యాఖ్యలను పలువురు కేంద్ర మంత్రులు తప్పుబట్టారు.కాంగ్రెస్ అసలురూపం ఈ వ్యాఖ్యలతో బయటపడిందని బీజేపీ నేతలు విమర్శించారు. -
రాహుల్.. ‘శోక్’నగర్‌కు వెళ్లండి: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైరయ్యారు.ఈ మేరకు హరీశ్‌రావు మంగళవారం(నవంబర్ 5) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించింది.రాహుల్ గాంధీ మీరు సందర్శిస్తున్న ప్రదేశంలోనే విద్యార్థులను మీ ‘ప్రజా సర్కార్’ కొట్టిందని మీకు తెలుసా? వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో 10 శాతం కూడా భర్తీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చారు. అలాగే జాబ్ క్యాలెండర్‌ను ఉద్యోగం లేని క్యాలెండర్‌గా మార్చితే సరిపోయేది.యువ వికాసం కింద రూ.5 లక్షల హామీ ఖాళీ గ్యారెంటీగా మారడంతో తెలంగాణ యువతకు అభద్రతాభావం ఏర్పడింది.అశోక్ నగర్‌ని మళ్లీ సందర్శించండి.కాంగ్రెస్ ప్రభుత్వం అశోక్ నగర్ ను 'శోక్ నగర్’గా ఎలా మార్చిందో కళ్లారా చూడండి’అని హరీశ్‌రావు రాహుల్ హైదరాబాద్ పర్యటనపై సెటైర్లు వేశారు. ఇదీ చదవండి: రాహుల్ రెండు గంటల పర్యటన -
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
జమ్మూ: జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా కోసం పార్లమెంటుతో పాటు వీధుల్లోనూ పోరాడతామని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ అన్నారు.జమ్మూలో బుధవారం(సెప్టెంబర్25) జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడారు.‘జమ్మకశ్మీర్ను లెఫ్టినెంట్ గవర్నర్‌తో పరిపాలించాలని బీజేపీ అనుకుంటోంది.ఎల్జీ పరిపాలన ఉన్నంత కాలం జమ్మూకశ్మీర్ ప్రజలకు నష్టం తప్ప ఏమీ ఉండదు.రాష్ట్రహోదా సాధించడంతో పాటు ఇక్కడి స్థానిక పరిశ్రమలను కాపాడతాం.లోయలోని సామాన్యులకు మేలు చేస్తాం. ముందు జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా ఇస్తారనుకున్నాం. కానీ బీజేపీ ముందు ఎన్నికలకు వెళ్లింది.ఎన్నికల తర్వాత బీజేపీ గనుక రాష్ట్రహోదా ఇవ్వకపోతే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వం ఆ పనిచేస్తుంది’అని రాహుల్ మాటిచ్చారు. -
‘అగ్నివీర్’పై రాహుల్‌ది తప్పుడు ప్రచారం: అమిత్ షా
చండీగఢ్:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,హర్యానా మాజీ సీఎం భూపీందర్సింగ్హుడాపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. అగ్నివీర్ పథకంపై రాహుల్,హుడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(సెప్టెంబర్17)లోహారులో నిర్వహించిన ప్రచార సభలో అమిత్‌షా మాట్లాడారు. రాహుల్ ఏ భాషలోనైనా అబద్ధాలు చెప్పగలరని ఎద్దేవా చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఒకవేళ కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తే రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లాలు ఉగ్రవాదులందరినీ విడుదల చేస్తారని హెచ్చరించారు.జమ్మూకశ్మీర్‌లో ‘ఆర్టికల్ 370’ని రద్దు చేయడంపై రాహుల్ తన వైఖరిని స్పష్టం చేయాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ఆర్మీలో ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ పథకాన్ని అమలు చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ సీట్లకు అక్టోబర్5న పోలింగ్, 8న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇదీ చదవండి.. మోదీ వందరోజుల పాలన బుక్లెట్ విడుదల -
‘ఏఐ’తో ఉద్యోగాలు పోవు: రాహుల్‌గాంధీ
టెక్సాస్: కృత్రిమ మేధ(ఏఐ)తో నిరుద్యోగం ఏర్పడుతుందన్న వాదనను ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కొట్టి పారేశారు. ఏఐతో పాతవి పోయి కొత్త తరహా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పారు. అంతిమంగా ఏఐతో మంచే జరుగుతుందన్నారు. ఆదివారం(సెప్టెంబర్8) అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయమై మాట్లాడారు.‘క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు వచ్చినపుడు ఇలానే ఉద్యోగాలు పోతాయన్నారు. ఏమైంది. కొత్త ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఏం నష్టం జరగలేదు. అయితే ఏఐతో భారత్‌లో ప్రధానంగా ఐటీ రంగం సమస్య ఎదుర్కోబోతోంది. అదే సమయంలో స్కూటర్లు తయారు చేసే బజాజ్ కంపెనీకి ఏఐతో సమస్యేమీ లేదు. ఏఐ ఒక్కో రంగాన్ని ఒక్కోలా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఉద్యోగాలు పోయేలా చేస్తుంది. కొన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. మనం సరిగ్గా వాడుకుంటే ఏఐ కొత్త అవకాశాలను కల్పిస్తుంది’అని రాహుల్‌గాంధీ అభిప్రాయపడ్డారు. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల ఈ పర్యటనలో విద్యావేత్తలు, జర్నలిస్టులు, మేధావులు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు. ఇదీ చదవండి: రాహుల్‌గాంధీ పప్పు కాదు: శామ్ పిట్రోడా -
రాహుల్ గాంధీ క్షమాపణలు చెబుతారా?: రవిశంకర్‌ప్రసాద్
న్యూఢిల్లీ: నీట్ పరీక్షను రద్దు చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టంచేయడం అధికారపక్షానికి ఆయుధంగా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దేశంలో మొత్తం పరీక్షా విధానంపై రాహుల్ ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగిస్తున్నారని బీజేపీ సీనియర్‌నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.పరీక్షా విధానంపై తాను చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ రాహుల్ క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించారు. దేశంలోని పరీక్షా విధానాల్లో మోసం జరుగుంతోందంటూ రాహుల్ ఆరోపించారని ప్రసాద్ గుర్తుచేశారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ రాహుల్ దేశంలోని విద్యావ్యవస్థ పరువు తీయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నోసార్లు పేపర్ లీకులు జరిగాయన్నారని విమర్శించారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఇకనైనా రాహుల్ ఇటువంటి అసత్య ప్రచారాలను మానుకోవాలని సూచించారు. -
వైఎస్ఆర్ స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీ!
సాక్షి,న్యూఢిల్లీ: వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి అసలు సిసలైన ప్రజా నాయకుడని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కొనియాడారు. వైఎస్ఆర్ నుంచి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు. తాను దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ జోడో యాత్రకు వైఎస్ఆర్ పాదయాత్రే స్ఫూర్తి అని తెలిపారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సోమవారం(జులై 8) నివాళి అర్పించిన రాహుల్‌గాంధీ ప్రత్యేాక వీడియో విడుదల చేశారు. ప్రజల కోసమే జీవించిన నాయకుడు రాజశేఖర్‌రెడ్డి అని కీర్తించారు. ఆయన బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావన్నారు. My humble tributes to former Chief Minister of Andhra Pradesh, YS Rajasekhara Reddy ji, on his 75th birth anniversary.A true leader of the masses, his grit, dedication, and commitment to the upliftment and empowerment of the people of Andhra Pradesh and India has been a guiding… pic.twitter.com/iuGVsmsW8g— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2024 -
రాహుల్ వర్సెస్ బీజేపీ.. దద్దరిల్లిన లోక్‌సభ
ప్రతిపక్షనేతగా లోక్‌సభలో రాహుల్‌గాంధీ తన గళం విప్పారు. పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు వేదికగా నిలదీశారు. ప్రతిపక్షనేతగా ముందు ముందు తన శైలి ఎలా ఉండబోతుందనేదానిపై తొలి సెషన్లోనే సంకేతాలిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సభలో గందరగోళానికి కారణమయ్యాయి. ఈ సందర్భంగా మోదీ మొదలుకుని అమిత్ షా ఇతర బీజేపీ నేతలు రాహుల్‌పై ఎదురుదాడికి దిగారు. వీరికి సమాధానం చెబుతూనే అటు స్పీకర్ ఓంబిర్లాకు రాహుల్ పలు సూచనలు చేశారు. రాహుల్ ప్రసంగిస్తుండగా బీజేపీ ఎంపీలు పదే పదే అంతరాయం కలిగించారు. మొత్తంగా సోమవారం(జులై1)న లోక్‌సభలో రాహుల్ వర్సెస్ ఆల్ అన్నట్లుగా మారింది. పదేళ్లలో నేనూ బాధితుడినే.. దేశమంతా ఏకమై రాజ్యాంగాన్ని రక్షించేందుకు కృషి చేసిందని రాహుల్‌గాంధీ అన్నారు. గత పదేళ్లలో బీజేపీని ఎదుర్కొన్న లక్షలాదిమందిపై దాడి జరిగిందని ఆరోపించారు. తానూ బాధితుడినేనని తనపై చాలా కేసులు మోపారన్నారు. నాకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. నా ఇల్లు తీసేసుకున్నారు. ఈడీ విచారణను 55 గంటల పాటు ఎదుర్కొన్నానని రాహుల్ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్ ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. ప్రతిపక్షంలోనే సత్యం ఉందన్నారు. పవర్లో ఉండటం కంటే ఇదే గొప్పదన్నారు.శివుడి ఫొటో చూపిస్తూ మాటల తూటాలు..ప్రసంగంలో ఆర్ఎస్ఎస్, బీజేపీపై విమర్శల దాడి చేసిన రాహుల్ గాంధీ సభలో ఒక సందర్భంలో శివుని ఫొటో చూపించారు. శివుని ఎడమ చేతి వెనుక ఉన్న తత్రిశూలం హింసకు గుర్తు కాదన్నారు. హింసకే అయితే కుడిచేతిలో ఉండేదని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు రూల్స్ ఒప్పుకోవని స్పీకర్ ఓం బిర్లా రాహుల్‌కు చెప్పారు.ప్రధానితో సహా బీజేపీ నేతల ఎదురుదాడి.. ఇంతలో ప్రధాని మోదీ జోక్యం చేసుకుని రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. హిందువులను హింసావాదులుగా రాహుల్ పేర్కొనడం సరైనది కాదని దుయ్యబట్టారు. అటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారికి అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రధాని, షా వ్యాఖ్యలకు రాహుల్ స్పందించారు. తాను కేవలం బీజేపీని ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్లే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్ స్పష్టం చేశారు.రైతులకు కనీసం సంతాపం తెలపలేదు..రాష్ట్రపతి ప్రసంగంలో నీట్, అగ్నివీర్ల ప్రస్తావన లేదని, నీట్‌ను వాణిజ్య పరీక్షగా మార్చారని రాహుల్ ఆరోపించారు. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాల వల్ల 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారికి సంతాపంగా సభలో కనీసం మౌనం కూడా పాటించలేదని విమర్శించారు. బీజేపీ హయాంలో రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఫైర్ అయ్యారు. మీ విధానలతో ప్రజలకు ఒరిగిందేంటి..దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా ప్రధానే చెప్పిన విషయాన్ని రాహుల్ సభలో గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ను రెండు ముక్కలు చేసిందని మండిపడ్డారు. అల్లర్లతో మణిపుర్ అట్టుడికినా ప్రధాని అటువైపు వెళ్లలేదు.మణిపూర్‌లో తన కళ్లముందే పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిసిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.నోట్ల రద్దు వల్ల యువత ఉపాధి కోల్పోయిందన్నారు. జీఎస్టీ కారణంగా వ్యాపారులు, ప్రజలు అనేక బాధలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాల వల్ల దేశ ప్రజలకు కలిగిన లాభమేంటని రాహుల్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.స్పీకర్‌కూ రాహుల్ చురకలు..ప్రసంగిస్తుండగా తన మైక్‌ను మళ్లీ కట్ చేశారని రాహుల్‌గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సభలో మైకులు ఎవరి నియంత్రణలో ఉంటాయని ప్రశ్నించారు. మైక్ కట్ చేశారని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. అలాంటిదేమీ జరగలేదని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సభలో స్పీకర్ వ్యవహారశైలిని కూడా తప్పుబట్టారు రాహుల్ గాంధీ. తొలి రోజు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు స్పీకర్ తలవంచారని, తాను షేక్ హ్యాండ్ ఇస్తే నిటారుగా నిలుచున్నారని రాహుల్ గుర్తుచేశారు. తన కంటే వయసులో మోదీ పెద్దవారైనందునే తలవంచానని స్పీకర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. -
లోక్‌సభలో శివుని ఫొటో ప్రదర్శించిన రాహుల్‌గాంధీ
సాక్షి,ఢిల్లీ:లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ప్రసంగం వివాదానికి దారి తీసింది. సోమవారం(జులై1) ఆయన సభలో మాట్లాడుతూ బీజేపీపై లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. హిందుత్వ అంటే అబద్ధాలు ప్రచారం చేయడం, ద్వేషం పెంచడం కాదన్నారు.బీజేపీ మాత్రం ఇవే చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. హిందువులుగా చెప్పుకునే వాళ్లు హింస, అబద్ధాలు, ద్వేషం గురించే మాట్లాడతారు. ఇలాంటి వాళ్లు హిందువులు కాదన్నారు. సభలో శివుని ఫొటో ప్రదర్శించిన రాహుల్...స్పీకర్ అభ్యంతరం..అయితే రాహుల్ సభలో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ శివుని ఫొటోనూ సభలో ప్రదర్శించారు. దీనిని స్పీకర్ ఓంబిర్లా తప్పుపట్టారు. సభలో ప్లకార్డులు, ఫొటోలు ప్రదర్శించడానికి రూల్స్ ఒప్పుకోవని చెప్పారు. రాహుల్‌గాంధీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..నా ఇల్లు, పదవి లాగేసుకున్నారువిపక్ష నేతలను, ఈడీ, సీబీఐలతో బెదిరిస్తున్నారుఈడీ నుంచి 55 గంటల విచారణ ఎదుర్కొన్నాపరమతాత్మ మోదీతో నేరుగా మాట్లాడతారుఅదికారం కంటే నిజం గొప్పదిప్రతిపక్షంలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నా, గర్వపడుతున్నాశివుడి ఎడమ చేతి వెనక త్రిశులం ఉంటుందిత్రిశూలం హింసకు చిహ్నం కాదుఒకవేళ త్రిశూలం హింసకు చిహ్నం అయితే, శివుడి కుడి చేతిలో ఉండేదికొందరికి ఆ చిహ్నం అంటే భయంసభలో గురునానక్ ఫోటోను సైతం ప్రదర్శించిన రాహుల్హిందూ సమాజం అంటే ఒక్క మోదీ కాదుహిందువులంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ వారే కాదుసభలో ఉన్నావారు, బయటవారు కూడా హిందువులేరాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని ఆగ్రహం..లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద ప్రసంగంపై ప్రధాని మోదీ అభ్యంతరం తెలిపారు. హిందువులు హింసావాదులన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందువులపై దాడి అని మోదీ అని అభివర్ణించారు.అనంతరం మాట్లాడిన కేంద్రహోం మంత్రి అమిత్ షా రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నా మైక్ మళ్లీ కట్ చేశారు.. రాహుల్లోక్‌సభలో తన మైక్‌ను మళ్లీ కట్ చేశారని రాహుల్‌గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సభలో మైకులు ఎవరి నియంత్రణలో ఉంటాయని ప్రశ్నించారు. మైక్ కట్ చేశారని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ స్పందించారు. అలాంటిదేమీ జరగలేదని వివరణ ఇచ్చారు. రాహుల్ వర్సెస్ స్పీకర్లోక్సభలో స్పీకర్ వ్యవహారశైలిని కూడా తప్పుబట్టారు రాహుల్ గాంధీ.మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు తలవంచారని, తాను షేక్ హ్యాండ్ ఇస్తే నిటారుగా నిలబడే ఇచ్చారని రాహుల్ వ్యాఖ్యానించారు.దీనిపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. ‘ తన కంటే వయసులో మోదీ పెద్దవారు కాబట్టే తలవంచానని వివరణ ఇచ్చారు.రాజ్యాంగానికి మేము రక్షణగా నిలబడతాం: రాహుల్కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐలో పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు రాహుల్. ‘ఈడీ విచారణను 65 గంటలు ఎదుర్కొన్నా అధికారం కంటే నిజం గొప్పది’ అని రాహుల్ స్పష్టం చేశారు. -
‘నీట్’పై మాట్లాడితే రాహుల్ మైక్ కట్ చేశారు’’
సాక్షి,ఢిల్లీ: నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం(జూన్28) వాయిదా పడ్డాయి. అంతకుముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై మాట్లాడుతుండగానే ఆయన మైక్ కట్ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది.ఈమేరకు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది. మైక్రోఫోన్లో మాట్లాడేందుకు అనుమతించాలని స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ విజ్ఞప్తి చేయడం ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. నీట్‌పై ప్రధాని మోదీ ఏం స్పందించడం లేదని, సభలో యువత తరఫున రాహుల్ తన గొంతు వినిపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇలాంటి సీరియస్ అంశంలో కూడా మైక్ కట్‌చేసి యువత గొంతు నొక్కుతున్నారని ట్వీట్లో కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ చేసిన మైక్‌కట్ ఆరోపణలపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. తాను ఎంపీల మైక్రోఫోన్ స్విచ్చాఫ్ చేయనని, అలాంటి నియంత్రణ ఏదీ తన వద్ద లేదని స్పీకర్ స్పష్టంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సమయంలో ఇతర విషయాలేవీ రికార్డు కావని తెలిపారు. -
వయనాడ్ ప్రజలకు రాహుల్‌గాంధీ భావోద్వేగ లేఖ
న్యూఢిల్లీ: ఎంపీగా నియోజకవర్గాన్ని వదులుకున్న వేళ కేరళలోని వయనాడ్ ప్రజలకు ఆదివారం(జూన్23) రాహుల్ గాంధీ భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ‘వయనాడ్‌ను వదులుకున్నందుకు బాధగా ఉంది. ఇన్ని రోజులు మీరిచ్చిన సహకారానికి నా కృతజ్ఞతలు. మీరు ప్రియాంకను ఎంపీగా ఎన్నుకుంటే బాగా పనిచేస్తుంది. ఆమెను ఇక్కడి నుంచి పోటీ చేయమని నేనే ఒప్పించా. గతంలో నేనెవరో తెలియనపుడే మీరు నన్ను నమ్మారు. మీ గొంతను పార్లమెంటులో వినిపించినందుకు ఆనందంగా ఉంది. రాయ్‌బరేలి, వయనాడ్ రెండింటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. దేశంలో విద్వేషాన్ని హింసను రెచ్చగొట్టేవారిపై కలిసి పోరాడదాం’అని రాహుల్‌గాంధీ లేఖలో తెలిపారు. కాగా, ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, కేరళలోని వయనాడ్ రెండు నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలుపొందారు. దీంతో ఆయన ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వచ్చింది. -
ఎన్డీఏ ఎప్పుడైనా ముక్కలు కావచ్చు: రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు.అందులోని కొందరు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. తాజాగా ఓ జాతీయ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి మనుగడ కోసం ఇబ్బందిపడే అవకాశం ఉందన్నారు. ఎన్డీఏ బలహీనంగా ఉండటంతో ఏ చిన్న సమస్య అయినా ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విద్వేషపు ఆలోచనను ప్రజలు తిరస్కరించారన్నారు. ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటే ఇండియా కూటమి నిస్సందేహంగా మెజార్టీ దక్కించుకొని ఉండేదన్నారు. తమ చేతులు కట్టేసిన పరిస్థితుల్లోనూ తాము పోరాడామన్నారు. -
‘‘వయనాడ్, రాయ్‌బరేలీలో ఏది వదులుకోవాలి’’
తిరువనంతపురం: వయనాడ్, రాయ్‌బరేలీలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలో తెలియడం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. బుధవారం(జూన్12) కేరళలోని మల్లప్పురంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. ‘నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏమైనా కానీ.. వయనాడ్, రాయ్‌బరేలీల్లో ఒక నియోజకవర్గానికే నేను ఎంపీగా ఉండాలి. నా నిర్ణయంతో రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’అని రాహుల్ వ్యాఖ్యానించారు. రెండింటిలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలనే అంశంపై రాహుల్ పార్టీ పెద్దలకు ఇప్పటికే తన అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం. ఎంపీగా రెండు చోట్ల విజయం సాధించిన అనంతరం తొలిసారి బుధవారం కేరళలో రాహుల్ పర్యటించారు. -
వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే.. రాహుల్ సంచలన కామెంట్స్
లక్నో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.చెల్లి ప్రియాంక గాంధీ గనుక తన మాట విని వారణాసిలో ప్రధానిమోదీపై పోటీ చేసి ఉంటే భారీ మెజార్టీతో గెలిచి ఉండేదన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో మంగళవారం(జూన్11) నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వారణాసిలో ప్రధానమంత్రికి చావుతప్పి కన్నులొట్టబోయింది. నా చెల్లి ప్రియాంక నా మాట విని ఉంటే ఆమె చేతిలో వారణాసిలో మోదీ 2నుంచి3 లక్షల మెజార్టీతో ఓడిపోయేవారు.బీజేపీతో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు ఉందని ప్రజలు తెలుసుకోవడం వల్లే ఈ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడింది.’అని రాహుల్ అన్నారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్‌కు సహకారం అందించాడని చెప్పారు. గతంలోలా పొత్తుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నికలను ఎదుర్కొన్నామని చెప్పారు. -
ఎగ్జిట్‌పోల్స్‌పై రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. అవి ఎగ్జిట్‌పోల్ ఫలితాలు కాదని మోదీ మీడియా పోల్స్ అని రాహుల్ మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనేదానిపై చర్చించడానికి ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి 295 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఇండియా కూటమి ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెప్పాయి. -
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భవితవ్యంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకవేళ పరాజయం పాలైతే రాహుల్‌గాంధీ రాజకీయాల నుంచి కొంత కాలం విరామం తీసుకోవాలని సూచించారు. ‘మీ సొంత వ్యూహాల మీద మీరు ఎన్నికలకు వెళ్లారు. ఇలాంటప్పుడు మీ పార్టీ ఓడిపోతే మీరు విరామం తీసుకోవడం వ్యూహాత్మకంగా, నైతికంగా సరైనది’అని రాహుల్‌ను ఉద్దేశించి పీకే అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300 సీట్ల దాకా గెలుచుకునే అవకాశాలున్నాయని పీకే చెప్పుకొచ్చారు. -
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు అకౌంట్లలో నెలకు 2500 రూపాయలు వేస్తున్నామని రాహుల్ గాంధీ నిసిగ్గుగా నిర్మల్ సభలో చెప్పుకోవడాన్నితీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాహుల్ గాంధీ మాటలు రాజు గారు దేవతా వస్త్రాల కథను గుర్తుకు తెస్తున్నాయని ఎక్స్(ట్విటర్)లో హరీశ్‌రావు ట్వీట్ చేశారు.‘తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలపై రాహుల్ గాంధీకి కనీస అవగాహన లేదు. ఆయన దొంగలకు సద్ది కడుతున్నారు. గ్యారెంటీలకు గ్యారెంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ కంచే చేను మేసేలా ప్రవర్తిస్తే ఎట్లా? అమలు కానీ గ్యారెంటీలు అమలవుతున్నట్టు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పాలి.తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి లేదా తన మాట నిజమే అయితే గ్యారెంటీల అమలు పై నాతో బహిరంగ చర్చకు రావాలి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ వేయడంపై వయనాడ్ ప్రజలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘తప్పేముంది రాహుల్ ఇండియా కూటమిలో అగ్రనేత’ అని ఒకరు అనగా రాయ్‌బరేలీలో గెలిస్తే వయనాడ్ సీటును రాహుల్ వదిలేస్తారని మరొకరన్నారు. అయితే రాహుల్ వయనాడ్‌ను వదిలేయడం తమకు అంత మంచిది కాదని చెప్పాురు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని రాహుల్‌గాంధీ తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమికి మేలు చేస్తుందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)నేత కున్హలికుట్టి అన్నారు. ప్రధాని మోదీ కూడా గతంలో రెండు సీట్లలో పోటీ చేశారని కుట్టి గుర్తు చేశారు. -
రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
గువహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ పాకిస్తాన్లో పోటీచేస్తే ఖచ్చితంగా గెలుస్తారని ఎద్దేవా చేశారు.‘పాకిస్తాన్లో రాహుల్‌గాంధీ చాలా పాపులర్. ఒకవేళ పాకిస్తాన్లో ఎన్నికలు జరిగితే అక్కడ రాహుల్‌గాంధీ భారీ మెజారిటీతో గెలుస్తారు. రాహుల్‌ను పాకిస్థాన్‌లో మేం ఓడించలేం. అయితే పాకిస్తాన్లో ఏం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా భారత్‌లో జరుగుతుంది’అని హిమంత సెటైర్లు వేశారు. రాహుల్‌గాంధీ శుక్రవారం(మే3) తన పాత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన వేళ హిమంత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
మూగబోయిన మైకులు..రెండో దశ పోలింగ్‌కు కౌంట్‌డౌన్
న్యూఢిల్లీ,సాక్షి: రెండో విడత లోక్‌సభ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 స్థానాల్లో ఓట్ల పండుగకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రాహుల్ గాంధీ, శశి థరూర్, హేమామాలిని తదితరులు సెకండ్ ఫేజ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల రెండో దశ ప్రచారానికి బుధవారం(ఏప్రిల్24) సాయంత్రం తెరపడింది. దాదాపు నెల రోజులుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనుండగా.. శుక్రవారం(ఏప్రిల్26) రెండో దశ పోలింగ్ జరగనుంది. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్.ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం రెండో దశలో 89 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే, మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నుంచి బరిలోకి దిగిన బీఎస్పీ అభ్యర్థి అశోక్ భలవి మరణంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు రెండో విడతలో ఒకేసారి పోలింగ్ జరగనుంది.కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, బిహార్‌లో ఐదేసి, ఛత్తీస్‌గఢ్, బెంగాల్లో మూడు, మణిపుర్, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లో ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘంకాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశి థరూర్, కేంద్రమంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, గజేంద్ర సింగ్ షెకావత్, లోక్‌సభ మాజీ స్పీకర్ ఓంబిర్లా, వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాశ్ అంబేడ్కర్, టీవీ రాముడు అరుణ్ గోవిల్, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని, నటి నవనీత్ కౌర్ రాణా సహా పలువురు ప్రముఖులు రెండో దశ బరిలో ఉన్నారు.వరుసగా రెండోసారి కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్నారు రాహుల్ గాంధీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్, సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాతో తలపడుతున్నారు. ఏప్రిల్19న తొలి దశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. లోక్‌సభ బరిలో అఖిలేశ్.. మళ్లీ అక్కడి నుంచే -
కేరళ: రాహుల్‌గాంధీపై ప్రధాని సెటైర్లు
తిరువనంతపురం: ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల పాలనలో కేరళ పరిస్థితి దిగజారిపోయిందని ప్రధాని మోదీ ఆరోపించారు. కేరళలోని పాలక్కాడ్‌లో సోమవారం(ఏప్రిల్ 15) జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ నుంచి కేరళ దాకా లెఫ్ట్ ప్రభుత్వాలు ఎక్కడున్నా ఒకేలా వ్యవహరిస్తాయని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ యువరాజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఓట్లడుగుతాడు. కానీ కేరళ పజలకు ఉన్న ఒక్క సమస్యపైనా మాట్లాడడు’ అని రాహుల్‌గాంధీని ఉద్దేశించి ప్రధాని చురకంటించారు. మరోపక్క బీజేపీ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోపై సోమవారం తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఇదీ చదవండి.. బీజేపీ మేనిఫెస్టోపై రాహుల్‌గాంధీ విమర్శలు -
ఆ మాంత్రికుడు ఎక్కడున్నాడు: ప్రధాని మోదీ
భోపాల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. ఇన్నాళ్లూ ఈ రాయల్ మాంత్రికుడు ఎక్కడ దాక్కున్నాడని రాహుల్‌ను ఉద్దేశించి ప్రధాని ప్రశ్నించారు. దేశంలో పేదరికాన్ని ఒకే ఒక్క దెబ్బకు లేకుండా చేస్తానన్న రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని ఎద్దేవా చేశారు. ఆదివారం(ఏప్రిల్14) మధ్యప్రదేశ్‌లోని హొషాంగాబాద్లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి మేనిఫెస్టోలోని ప్రతీ హామీ దేశాన్ని దివాతా తీయిస్తుందని హెచ్చరించారు. కాగా, గత వారం రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఒకే ఒక దెబ్బతో దేశంలో పేదరికాన్ని లేకుండా చేస్తామన్నారు.‘మీరు గనుక దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే మీ ఖాతాల్లోకి లక్ష రూపాయాలు వచ్చి పడతాయి. డబ్బులు వస్తూనే ఉంటాయి మీ ఖాకతాల్లోకి. ఒకే ఒక్క దెబ్బకు పేదరికం లేకుండా పోవాలి’అని రాహుల్ ప్రజలకు హామీ ఇచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుంటుంబాల్లోని మహిళలకు ఒక్కొక్కరికి ఖాతాల్లో లక్ష రూపాయల చొప్పున జమ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల -
కాంగ్రెస్ మేనిఫెస్టో.. రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు ఏమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ కొత్తగా మ్యానిఫెస్టో విడుదల చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఆరు గ్యారంటీ ల అమలుపై చర్చించడానికి రావాలని రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘దేశంలో ఉన్న ప్రతి మహిలకు లక్ష రూపాయల భృతి ఇస్తామని అంటున్నారు. తెలంగాణ లో ఇస్తామని చెప్పిన నాలుగు వేల నిరుద్యోగ భృతి ఏమైంది ? ఉట్టికి ఎగరనివాడు ఆకాశానికి ఎగిరినట్లు ఉంది. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఇస్తామని చెప్పిన రైతు రుణ మాఫీ ఏమైంది ? రుణమాఫీ చేయకుండా.. గిట్టుబాటు ధర గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి.. ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష వేస్తాం -
కాంగ్రెస్ మేనిఫెస్టో: రాహుల్ గాంధీకి హరీశ్‌రావు లేఖ
సాక్షి,హైదరాబాద్: మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని, తర్వాత వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైరయ్యారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి శుక్రవారం(ఏప్రిల్ 5) ఒక బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ మోసాలు ఇప్పటికే అనేకసార్లు అనుభవపూర్వకంగా రుజువైనందున, మళ్లీ మేనిఫెస్టోల పేరుతో ప్రజలను మోసం చేయవద్దని సూచిస్తున్నామని లేఖలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని, వారికే ఎంపీ టికెట్ కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం హాస్యాస్పదమని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి అరచేతిలో స్వర్గం చూపిస్తూ హామీలివ్వడం తర్వాత చేతులు ఎత్తేయడం మీకు అలవాటేనని లేఖలో హరీశ్‌రావు చురకంటించారు. ‘కాంగ్రెస్ మోసం చరిత్రలో ఎన్నోసార్లు రుజువయింది. మీ నాయకత్వంలోనే 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. రెండు సందర్భాల్లోనూ అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్‌లో మీరే అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన అన్ని హామీలన్నింటిని విస్మరించారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి మళ్లీ మీరు తెలంగాణలో పర్యటిస్తున్నారు. అసలు మీ మేనిఫెస్టోలకు ఏమైనా విలువ ఉన్నదా ? ఒక్కదానినైనా అమలు చేశారా ? అలాంటి వారికి మేనిఫెస్టోలు ఎందుకు? ఈసారి మీ మేనిఫెస్టోలో చెప్పిన మాటలకు చేతలకు ఏమాత్రం పొంతనలేదని విషయం ఇప్పటికే రుజువైంది. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఇచ్చిన హామీలు అమలు చేయాలని మీరు చెప్పలేదు. హామీలు ప్రకటించడమే తప్ప వాటిని అమలు చేసే విషయంలో ఏమాత్రం శ్రద్ధ లేని మీకు, మళ్ళీ కొత్త హామీలను ఇచ్చే నైతిక హక్కు లేదు. తెలంగాణ ప్రజలను మళ్లీమళ్లీ మోసం చేయాలనుకునే మీ ఎత్తుగడలు ఇక ముందు సాగబోవు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా’ అని లేఖలో హరీశ్‌రావు తెలిపారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల -
రాహుల్ గాంధీపై ‘ఈసీ’కి బీజేపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ సోమవారం(ఏప్రిల్ 1) ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని, ఎన్నికలను బీజేపీ రిగ్గింగ్ చేస్తోందని రాహుల్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాహుల్‌గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అనంతరం పూరీ మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారు. ఈవీఎంలపైనా, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపైనా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంలో తన మనుషులను పెట్టిందని ఆరోపించారు. రాహుల్ పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకుగాను ప్రస్తుత ఎన్నికల్లో అతడి ప్రచారంపై ఆంక్షలు విధించాలి’ అని పూరీ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి.. ప్రధాని మోదీ దేశానికి చేస్తున్నది మంచిది కాదు.. కేజ్రీవాల్ -
రాహుల్‌కు త్వరలో అస్సాం సీఐడీ సమన్లు !
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు పంపనున్నట్లు సమాచారం. గత నెలలో గువహతిలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై రాహుల్‌ను అస్సాం సీఐడీ విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రాహుల్‌గాంధీతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు కేసి వేణుగోపాల్, జైరామ్ రమేష్, శ్రీనివాస్ బివి, కన్నయ్యకుమార్, గౌరవ్ గొగొయ్ తదితరుల పేర్లను పోలీసులు చేర్చారు. కాగా, గత నెలలో అస్సాంలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా రాజధాని గువహతిలో యాత్ర ప్రవేశిస్తే అరెస్టు చేస్తామని సీఎం హిమంత బిశ్వశర్మ వార్నింగ్ ఇచ్చారు. అయినా రాహుల్‌గాంధీ వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గువహతి శివార్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నాయకులపై స్వల్ప లాఠీఛార్జ్ కూడా చేశారు. బారికేడ్లను బద్దలు కొట్టినప్పటికీ యాత్ర గువహతిలోకి ప్రవేశించకుండా జాతీయ రహదారి(ఎన్‌హెచ్-27) మీద నుంచి వెళ్లిపోయింది. తాము బారికేడ్లను బద్దలు కొడతాం కాని నిబంధనలను ఉల్లంఘించమని రాహుల్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. తాము రాహుల్ గాంధీని ఈ కేసులో లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్టు చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. హోం మంత్రి కూడా తానే అయిన సీఎం హిమంత ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించారు. ఇదీ చదవండి.. కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. మళ్లీ మొదటికి -
Truck Drivers Protest: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ట్రక్కు డ్రైవర్ల సమ్మెపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. రోడ్ యాక్సిడెంట్ల కేసుల్లో శిక్షను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహిత చట్ట సవరణ చేయడాన్ని షెహన్షాకా ఫర్మానాగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు మంగళవారం రాహుల్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ‘150 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ప్రతిపక్షంతో చర్చించకుండా చట్టాలు చేయడం ప్రజాస్వామ్యంపై దాడే. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి డ్రైవర్లకు వ్యతిరేకంగా చేసిన చట్ట సవరణ వల్ల తీవ్ర పరిణామాలుంటాయి. కష్టపడి పనిచేసుకుని జీవితాలు గడిపే డ్రైవర్ల జీవితాలను చట్టాల పేరు చెప్పి ఇబ్బందుల పాలు చేయడం సరికాదు. ఈ చట్టాన్ని కొన్ని వ్యవస్థలు దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడే అవకాశం ఉంది’అని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ట్రక్కు డ్రైవర్ల సమ్మెతో సోమవారం(జనవరి 1) నుంచి దేశంలోని పలు నగరాల్లో బంకులకు పెట్రోల్, డిజిల్ సరఫరా ఆగిపోయింది. దీంతో ఆయా నగరాల్లో వాహనదారులు మంగళవారం ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్రోల్ కోసం ద్వి చక్ర వాహనదారులు బంకుల ముందు బారులు తీరారు. ఇదీచదవండి..ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం -
రాహుల్‌పై ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహించారా..?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహించారా అంటే అవుననే అంటున్నారు ప్రణబ్ కూతురు షర్మిష్ట ముఖర్జీ. ‘ప్రణబ్ మై ఫాదర్..ఎ డాటర్ రిమెంబర్స్’ అనే పేరుతో తన తండ్రితో జ్ఞాపకాలపై బుక్‌ను షర్మిష్ట లాంచ్ చేశారు. ఈసందర్భంగా ఆమె ప్రణబ్,రాహుల్‌గాంధీలకు సంబంధించిన ఆసక్తిర విషయం ఒకటి వెల్లడించారు. ‘యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో సుప్రీం కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏదైనా క్రిమినల్ కేసులో 2 ఏళ్లు, అంతకుపైగా శిక్ష పడితే వారిని పదవి నుంచి అనర్హులుగా ప్రకటించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పును అమలు కాకుండా అప్పటి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఆ ఆర్డినెన్స్ కాపీని 2013 సెప్టెంబర్‌లో ఎంపీ రాహుల్ గాంధీ మీడియా ఎదుటే చించి వేశారు. ఈ ఘటనను ముందుగా ప్రణబ్‌కు చెప్పింది నేనే. రాహుల్ ఆర్డినెన్స్ కాపీని చించివేయడంపై ప్రణబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆర్డినెన్స్‌పై పార్లమెంటులో చర్చ జరిగి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి రాహుల్ అలా ఆర్డినెన్స్ కాపీని చించివేయడం ఆయన మూర్ఖత్వం అని చాలా మంది అంటుంటారు. వారిలాగే మా నాన్న కూడా రాహుల్ చర్యను వ్యతిరేకించారు. రాహుల్ ప్రభుత్వ క్యాబినెట్లో కూడా లేరు. ఆయనెవరు ఆర్డినెన్స్‌ను చింపివేయడానికి అని ప్రణబ్ అన్నారు’ అని షర్మిష్ట అప్పటి జ్ఞాపకాలను వివరించారు. ఇదీచదవండి..ప్రధానిపై కథనం..సంజయ్ రౌత్‌పై కేసు -
హస్తం.. హోరు.. అనుకరించిన కాంగ్రెస్ నేతలు!
సాక్షి, వరంగల్: ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గ పర్యటనలు విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అధికార పార్టీ అవినీతిని వెలుగులోకి తెచ్చి సంపదను పేదలకు సంక్షేమ రూపంలో పంచుతామని చెప్పడంతో కార్యకర్తలు ఈలలు, కేకలతో హోరెత్తించారు. శుక్రవారం మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నుంచి 2 గంటలకు రాహుల్‌గాంధీ హెలికాప్టర్లో నర్సంపేటకు చేరుకున్నారు. తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం, ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, ఇనగాల వెంకట్రాంరెడ్డి పూలబొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో స్థానిక అంబేడ్కర్ సెంటర్‌కు చేరుకుని కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. అనంతరం హెలికాప్టర్లో మామూనూరులో దిగిన ఆయన అక్కడి నుంచి వరంగల్ చౌరస్తాకు చేరుకున్నారు. అభ్యర్థి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, పార్టీ నాయకులు స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. జనసంద్రంగా పాదయాత్ర! జనసంద్రంగా మారిన చౌరస్తాలో కారు దిగుతూనే రాహుల్ ప్రజలకు అభివాదం చేశారు. ప్రచారంలో భాగంగా వరంగల్ చౌరస్తా నుంచి జేపీఎన్ రోడ్డు, మండిబజార్, పోచమ్మమైదాన్ వరకు పాదయాత్ర సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రాహుల్‌తో పాదం కలిపారు. ప్రధాన రహదారిలో వేగంగా నడుస్తూ ఇరువైపులా వ్యాపార, వాణిజ్య సముదాయాలు, భవనాల ఎదుట, పైఅంతస్తుల్లో ఉన్న ప్రజలకు అభివాదం తెలుపుతూ రాహుల్‌గాంధీ ముందుకుసాగారు. పోచమ్మమైదాన్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌కు తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో జంక్షన్ జనంతో కిక్కిరిసిపోయింది. రాహుల్ స్పీచ్‌కు విశేష స్పందన.. రాహుల్‌గాంధీ ప్రసంగానికి పార్టీ శ్రేణులు, అభిమానులు నీరాజనాలు పలికారు. పీఎం నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ.. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక చెట్టు కొమ్మలేనని పేర్కొనడంతో ప్రజల నుంచి స్పందన కనిపించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రస్తావించగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కులగణన, పేదరిక నిర్మూలన, స్థానిక సంస్థల్లో కులాల లెక్కింపు, రాజకీయ ప్రాధాన్యత, ఆ మేరకు బడ్జెట్ కేటాయిస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరుగ్యారంటీలు, కేసీఆర్ అవినీతి అంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, నర్సంపేట, తూర్పు నుంచి పోటీ చేస్తున్న దొంతి మాధవరెడ్డి, కొండా సురేఖను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు డాల్వీ, దీపమున్సీ, కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, మాజీ కార్పొరేటర్లు తత్తరి లక్ష్మణ్, నాయకులు మీసాల ప్రకాశ్, నల్లగొండ రమేష్, గోపాల నవీన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేటలో.. నర్సంపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి గెలుపు కోసం నిర్వహించిన రోడ్‌షోలో ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలిరావడంతో నర్సంపేట పట్టణంలోని వరంగల్, నెక్కొండ, మల్లంపల్లి, పాకాల రోడ్లు పూర్తిగా నిండిపోయాయి. కాగా, మహేశ్వరం గ్రామంలోని సెయింట్‌థెరిస్సా పాఠశాల ఎదుట హెలిపాడ్‌ను ఏర్పాటు చేయగా కార్యకర్తలు, నాయకులు, భారీ సంఖ్యలో చేరుకున్నారు. మధ్యాహ్నం 2గంటలకు రాహుల్‌గాంధీ హెలికాప్టర్ దిగి అభివాదం చేస్తూ ప్రత్యేక వాహనంలో నర్సంపేటలోని అంబేడ్కర్ సెంటర్‌కు చేరుకుని కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. రాహుల్ రాకతో ట్రాఫిక్‌ను మళ్లించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. డీఎస్పీలు రవీందర్, మురళి ఆధ్వర్యంలో ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు బందోబస్తును నిర్వహించారు. రౌడీ రాజ్యం.. నియంత పాలన: కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ వరంగల్ తూర్పులో రౌడీ రాజ్యం, నియంత పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ విమర్శించారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దౌర్జన్యాలు, స్థలాల కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి మమ్ముల్ని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రెండుసార్లు ప్రజలను మభ్య పెట్టి, మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. ప్రజలకే మేలు జరగలేదని, కల్వ కుంట్ల కుటుంబం మాత్రం బాగుపడిందన్నారు. మళ్లీ ఎన్నికల్లో అధికారం కావాలని ముందుకొస్తున్నారని, ప్రజలు గుర్తించి తిప్పికొట్టాలని, కాంగ్రెస్‌ను ఆదరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇవి కూడా చదవండి: కారు.. జోరు! అంతటితో ఆగిపోదు.. అసలు ముచ్చట అప్పటినుంచే.. -
ఉమ్మడి వరంగల్‌లో.. మరోమారు రాహుల్‌గాంధీ!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఏఐసీసీ అగ్రనేత, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోమారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తున్నారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం, అంబట్పల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. గత నెల 18, 19 తేదీల్లో ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో బస్సుయాత్ర, సభలు నిర్వహించిన ఆయన.. సుమారు 15 రోజుల వ్యవధిలో రెండోసారి పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. అంబట్పల్లి సమీపంలో సుమారు ఐదువేల మందితో మహిళాసాధికారత సభను నిర్వహించుకునేందుకు అనుమతి లభించినా.. బుధవారం రాత్రి 9 గంటలకు హెలిపాడ్ ఏర్పాటు, హెలికాప్టర్ గ్రౌండ్స్ క్లియరెన్స్‌లు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా ఆదివాసీ ప్రాంతాలను ఎంచుకున్న రాహుల్‌గాంధీ.. ఉమ్మడి జిల్లాలో తొలి పర్యటన, సభలు ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లోనే మొదలెట్టారు. గత నెల 18న హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా రామప్ప ఆలయానికి చేరుకున్న రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ.. అక్కడినుంచే బస్సుయాత్ర ప్రారంభించారు. అనంతరం రామాంజాపూర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన తర్వాత చెల్పూర్ జెన్కో గెస్టుహౌస్‌లో రాత్రి బస చేశారు. 19న ఉదయం బైక్‌ర్యాలీగా బస్సుయాత్ర సాగగా, కాటారం వద్ద జరిగిన సభల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఉదయమే కార్యక్రమం.. హెలికాప్టర్ ద్వారా గురువారం ఉదయమే జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేరుకోనున్నారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు సైతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో రాహుల్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం నుంచే పోలీస్ బలగాలను మోహరించారు. గురువారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సభకు అనుమతి ఉండగా.. 8.30 గంటల నుంచి 11 గంటల వరకు మహిళలతో సదస్సు ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి శశిభూషణ్ కాచే తెలిపారు. కాగా, అంబట్పల్లి సభలో పాల్గొననున్న రాహుల్‌గాంధీ.. మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిపోయిన ప్రాంతాన్ని కూడా సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, రాహుల్ పర్యటన ఏర్పాట్లను మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఇవి చదవండి: ట్రిక్కులెన్ని చేసినా.. హ్యాట్రిక్ తప్పదు! : మంత్రి హరీశ్ రావు -
TS Election 2023: రాహుల్, ప్రియాంకగాంధీ పర్యటన.. కాంగ్రెస్ కేడర్‌లో కొత్త ఉత్సాహం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పర్యటన కాంగ్రెస్ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపింది. ములుగు జిల్లా రామాంజాపూర్ వద్ద బుధవారం జరిగిన విజయభేరి సభలో తెలంగాణ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అభ్యర్థులను గెలిపించుకునేందుకు అగ్రనేతలు రాహుల్, ప్రియాంకగాంధీ కాకతీయులు ఏలిన గడ్డ నుంచే పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం పాలంపేటలో రామప్ప ఆలయాన్ని సందర్శించిన రాహుల్, ప్రియాంక రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాశస్త్యాన్ని తెలుసుకున్న వారు అక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బస్సుయాత్ర ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలిసి బస్సుయాత్ర ద్వారా రామప్ప ఆలయం నుంచి రామాంజాపూర్ విజయభేరి సభ వద్దకు చేరుకున్నారు. బహిరంగ సభలో ప్రసంగించిన రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ను ఓడించడం కోసం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు కూటమిగా పని చేస్తున్నాయని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని బీజేపీ కోరుకుంటోందని, అందుకే విపక్ష నేతలందరిపై సీబీఐ, సీఐడీ, ఈడీ దాడులు చేయించి కేసులు పెట్టిన కేంద్రం అవినీతికి కేరాఫ్‌గా మారిన కేసీఆర్‌పై ఒక్క కేసు పెట్టలేదని విమర్శించారు. ఆదివాసీ గిరిజనులు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై దుమ్మెత్తి పోశారు. బహిరంగ సభలో మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించిన ప్రియాంకగాంధీ అధికారంలోకి వచ్చాక ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 అందజేస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలను ఇస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకు అన్నాచెల్లెళ్లు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పథకాలను వివరిస్తూ.. తెలంగాణలో అమలు చేయనున్నామని ప్రకటించారు. రాహుల్ ప్రసంగిస్తున్న సమయంలో పీఎం.. పీఎం రాహుల్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన సందర్భంగా ములుగు ఎస్పీ గాష్ ఆలం భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. 'ఆదివాసీ గిరిజనులతోపాటు అందరికీ ఆరాధ్య దైవాలైన సమ్మక్క, సారలమ్మ జాతర దేశంలోనే అతిపెద్దది. దేశంలో మేం అధికారంలోకి వస్తే జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తాం. కుంభమేళా తరహాలో నిర్వహిస్తాం.' – రాహుల్‌గాంధీ రామప్పలో పూజలు.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ సందర్శించారు. రామప్పకు సాయంత్రం 4 గంటలకు వారిద్దరు రావాల్సి ఉండగా, 37నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. ఆలయ ఆర్చకులు హరీష్‌శర్మ, ఉమాశంకర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు ఆశీర్వచనం అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం వారు ఆలయం చుట్టూ కలియదిరిగారు. టూరిజం గైడ్ విజయ్‌కుమార్ ఆలయ విశిష్టత గురించి వివరించారు. జనసంద్రంగా మారిన రామాంజాపూర్.. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ హాజరైన కాంగ్రెస్ విజయభేరి సభ సందర్భంగా రామాంజాపూర్ జనసంద్రంగా మారింది. ఇటు సీతక్క, అటు గండ్ర సత్యనారాయణ అభిమానులు అధికసంఖ్యలో తరలిరావడంతో గ్రామ పరిసరాలు కార్యకర్తలతో హోరెత్తాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఇబ్బందులు పడిన దొడ్ల, మొండాయి, మల్యాల, మేడారం, ఊరట్టం తదితర గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ‘సీఎం.. సీఎం’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో సీతక్కను దగ్గరకు తీసుకుని ఈమె ఎవరో తెలుసా.. నా సోదరి అంటూ నాలుగు సార్లు ఉచ్ఛరించి సభలో నూతన ఉత్తేజాన్ని నింపారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలపై ప్రజలను అభిప్రాయాన్ని అడగ్గా.. సానుకూలంగా స్పందించారు. సభలో పార్టీ తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్కం ఠాకూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, డి.శ్రీధర్‌రాబు, నాయకులు మధుయాష్కీగౌడ్, మల్లు రవి, తూర్పు జగ్గారెడ్డి, భూపాపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ, కొండా సురేఖ, నాయిని రాజేందర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాఘవరెడ్డి, పొదెం వీరయ్య, ఎర్రబెల్లి స్వర్ణ, మల్లాడి రాంరెడ్డి పాల్గొన్నారు. స్వాగతం పలికిన రాష్ట్ర నేతలు రామప్పలోని హెలిపాడ్ వద్ద అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణతోపాటు పలువురు నేతలు బొకేలు అందించి స్వాగతం పలికారు. రామప్ప ఆలయం ముందు అగ్రనేతలకు కోయ కళాకారులు కొమ్ము డాన్స్, గిరిజనులు లంబాడా నృత్యం ద్వారా స్వాగతం పలికారు. కేటీపీపీ అతిథి గృహంలో బస.. రాహుల్, ప్రియాంకగాంధీ బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లాకు చేరుకున్నారు. చెల్పూరు కేటీపీపీ అతిథి గృహంలో బస చేశారు. ప్రత్యేక గదిలో రాహుల్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పలువురు రాష్ట్రస్థాయి నాయకులతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం డైనింగ్ హాల్లో రాత్రి భోజనంలో కొంచెం బిర్యానిని టేస్ట్ చేసి మటన్ కబాబ్ తీసుకున్నారు. అలాగే చిన్న పుల్కాతో పాలక్ పప్పు తీసుకొని భోజనాన్ని ముగించారు. రాహుల్‌గాంధీ గురువారం ఉదయం 7 గంటలకు కేటీపీపీ అతిథి గృహం వద్ద వివిధ రాజకీయ పార్టీల నాయకులకు పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తారు. అనంతరం కేటీపీపీ ఉద్యోగులతో మాటాముచ్చట చేసి, వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటారు. అక్కడి నుంచి భూపాలపల్లి పట్టణంలోని బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాకు వెళ్తారు. ఇవి చదవండి: ప్లాట్ల విక్రయంలో.. బోథ్ ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు! Follow the Sakshi TV channel on WhatsApp: -
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న ఎంపీ రాహుల్‌గాంధీ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన బస్సుయాత్ర రెండోరోజు పెద్దపల్లిలో కొనసాగనుంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు విజయరమణారావుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. రాహుల్‌గాంధీ పాల్గొనే కార్యక్రమాలకు జాతీయ, రాష్ట్ర నాయకత్వం తరలిరానున్న నేపథ్యంలో భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మంథని–కరీంనగర్ పర్యటన ఇలా.. రాహుల్‌గాంధీ గురువారం ఉదయం భూపాలపల్లి జిల్లాలో పర్యటన ముగించుకొని బస్సులో పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రవేశించనున్నారు. అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలి కేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంథనిలో రోడ్ షో లో పాల్గొన్న అనంతరం రామగిరి మండలం సెంటినరీకాలనీలో మధ్యాహ్నం రాష్ట్ర నాయకులతో కలిసి భోజనం చేస్తారు. తర్వాత సింగరేణి కార్మికులు, రైతులతో సమావేశమవుతారు. వారితో మాట్లాడాక బస్సులో కమాన్‌పూర్ చౌరస్తాకు చేరుకొని, రోడ్ షోలో పాల్గొంటారు. సబ్బితం నుంచి బైక్ ర్యాలీ ద్వారా పెద్దపల్లి బహిరంగ సభకు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. భారీ బహిరంగ సభ అనంతరం రాత్రి 7 గంటలకు కరీంనగర్ చేరుకొని, 10 గంటల వరకు పాదయాత్ర చేయనున్నారు. 40 వేల మందితో భారీ బహిరంగ సభ.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల కు చెందిన సుమారు 40 వేల మంది పాల్గొననున్నా రు. సభా ప్రాంగణంలో భద్రత ఏర్పాట్లను రాహుల్‌గాంధీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు, పెద్దపల్లి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మాజీ ఎమ్మె ల్యే విజయరమణారావు సభాస్థలిని పరిశీలించారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాపై ఫోకస్.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఉమ్మడి కరీంనగర్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉమ్మడి జిల్లాలో బస్సు యాత్ర చేపడుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మొత్తం 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా అధిష్ఠానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సిటీలో రాహుల్ యాత్ర ఇలా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గురువారం కరీంనగర్లో పర్యటించనున్నారు. మొగ్దుంపూర్ వద్ద నేతలు స్వాగతం పలుకుతారు. నగరంలోని మారుతీనగర్ చౌరస్తా నుంచి రాత్రి ఏడు గంటలకు పాదయాత్రగా నాకా చౌరస్తా మీదుగా అశోక్‌నగర్ నుంచి రాజీవ్‌చౌక్ చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ.వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రోహిత్‌చౌదరి, క్రిస్టోఫర్తిలక్, జీవన్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి యాత్రలో పాల్గొననున్నారు. -
మెగా విద్వేష షాపింగ్ మాల్: నడ్డా
న్యూఢిల్లీ: ప్రేమ దుకాణం పేరిట రాహుల్ మెగా విద్వేష షాపింగ్ మాల్ తెరిచారంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మండిపడ్డారు. ‘‘మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనలో దేశం అభివృద్ధిని ప్రపంచమే గుర్తించింది. దాన్ని యువరాజు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు సర్జికల్ స్రైక్స్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తారు. హిందువులు, ముస్లింలను విడదీయడంపై మాట్లాడుతారు. సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తుంటారు. మరోవైపు ప్రేమ దుకాణం నడుపుతున్నానంటూ చెప్పుకుంటుంటారు. నిజానికది మెగా విద్వేష షాపింగ్ మాల్’’ అన్నారు. -
Rahul Gandhi:16 ఏళ్ల బాలుడి ప్రతిభకు రాహుల్ గాంధీ ఫిదా
జైపూర్: రాజస్థాన్ రాజ్‌సమంద్ జిల్లాలోని నందేస్క్రిప్ట్ గ్రామానికి చెందిన ఓ బాలుడి ప్రతిభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిదా అయ్యారు. ఆ కుర్రాడు చేసిన బౌలింగ్ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. అతడి కలలు నిజం చేసేందుకు సాయం అందించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ను కోరారు. దీపక్ శర్మ అనే వ్యక్తి పోస్టును షేర్ చేశారు రాహుల్. అందులో 16 ఏళ్ల భరత్ సింగ్ అనే కుర్రాడు.. చేల వల కట్టి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ‘దేశంలోని నలుమూల్లో అద్భుత ప్రతిభ దాగి ఉంది. అలాంటి వారిని గుర్తించి వెలుగులోకి తీసుకురావటం మన బాధ్యత. ఆ బాలుడి కలలు సాకారమయ్యేందుకు సాయపడాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ను కోరుతున్నాను.’ అని తన ట్విట్టర్లో రాసుకొచ్చారు రాహుల్ గాంధీ. ఆయన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు సీఎం గెహ్లోత్.‘తప్పకుండా.., ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి అవసరమైన సాయం చేస్తాము’ ట్వీట్ చేశారు. हमारे देश के कोने-कोने में अद्भुत प्रतिभा छिपी हुई है, जिसे पहचानना और बढ़ावा देना हमारा कर्तव्य है।@ashokgehlot51 जी से मेरा निवेदन है, इस बच्चे का सपना साकार करने के लिए कृपया उसकी सहायता करें। https://t.co/vlEKd8UkmS — Rahul Gandhi (@RahulGandhi) July 27, 2022 ఇదీ చదవండి: తినేందుకు రోటీ ఇవ్వలేదని గొడవ.. కత్తితో పొడిచి హత్య -
హరిద్వార్ ధర్మసంసద్ ప్రసంగాలపై కేసు నమోదు
డెహ్రాడూన్: మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వసీం రజ్వీ అలియాస్ జితేంద్ర నారాయణ్ త్యాగి, తదితరులపై కేసు నమోదైంది. వారిపై ఐపీసీ 153 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు హరిద్వార్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రకీందర్‌సింగ్ తెలిపారు. అదేవిధంగా, గత వారం హరిద్వార్‌లో ధర్మసంసద్ నిర్వహించి న, ప్రసంగించిన వారిపై చర్యలు తీసుకోవా లని టీఎంసీ ప్రతినిది సాకేత్ గోఖలే జ్వాలాపూర్లో ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు గర్హనీయం హిందుత్వవాదం పేరుతో కొందరు చేస్తున్న ద్వేషపూరిత వ్యాఖ్యల ద్వారా హింస జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దానికి అన్ని మతాలు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. హింసను ప్రేరేపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మాజీ ప్రధానిని హత్య చేయాలని పిలుపునివ్వడం, వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేయడం హీనమైన చర్యన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించేలా ఆ వ్యాఖ్యలున్నాయని ఆమె ట్వీట్ చేశారు. -
పన్నుల వసూళ్లులో కేంద్రం పీహెచ్డీ: రాహుల్
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల వసూలులో పీహెచ్డీ చేసిందని మండిపడ్డారు. ఆయన ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరు పై మండిపడ్డారు.ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నుల ద్వారా కన్నా పెట్రోలు, డీజిల్‌ల నుంచి ఎక్కువ ఆదాయాన్ని ప్రభుత్వం పొందుతోందని చెప్తున్న ఓ పత్రిక కథనాన్ని జత చేస్తూ ఈ ట్వీట్ చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలు ఒక రోజు నిలకడగా ఉన్నాయి. ఆ తర్వాత ఆదివారం మళ్ళీ పెరిగాయి. దేశంలోని చాలా నగరాల్లో లీటరు పెట్రోలు ధర రూ.100 దాటింది. మరికొన్ని నగరాల్లో ఈ ధర రూ.100కు చేరువలో ఉంది. భోపాల్‌లో అత్యధికంగా లీటరు పెట్రోలు ధర రూ. 105 గా వుంది. చదవండి:అత్యాచారం కేసు.. మాజీ మంత్రి అరెస్ట్ -
లవ్ యూ రాహుల్: ప్రియాంక
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ భాయ్ దూజ్((భగినీ హస్త భోజనం) పండుగ సందర్భంగా తన సోదరుడు రాహుల్ గాంధీతో దిగిన ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటి వరకు దిగిన ఫోటోలను ఓ ఫ్రేమ్‌లో అమర్చి ప్రియాంక షేర్ చేశారు. ఈ ఫ్రేమ్‌లో నానమ్మ ఇందిరాగాంధీ, తల్లిదండ్రులు రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీతో దిగిన ఫోటోలను సైతం ఆమె ట్వీట్ చేశారు. వీటికి ‘లవ్ యూ రాహుల్‌గాంధీ.. భాయ్‌దూజ్’ అంటూ సోదరుడిపై ఉన్న అప్యాయతను వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే రక్షబంధాన్ రోజు సైతం ప్రియాంకా.. రాహుల్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక ఈ భాయ్ దూజ్ వేడుక. ఉత్తర భారతదేశంలో దీపావళి పండుగ తర్వాత జరుపుకునే ఈ వేడుక సందర్భంగా సోదర, సోదరీవమణులు ఒకరికొకరు ఆశీస్సులు పొందడం, బహుమతులు ఇచ్చిపుచ్చకోవడం అనవాయితీ. కాగా సినీ ఇండస్ట్రీలో సైతం సెలబ్రిటీలు ఈ బాయ్ దూజ్ వేడుకలను నిర్వహించుకొని వారి సోదరిలపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. love you @RahulGandhi ❤❤❤❤#भाईदूज pic.twitter.com/GxR4Og4P4d — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 29, 2019 -
10న రాహుల్ గాంధీ అమేథీ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ అమేథీ పర్యటన ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత రాహుల్ మొదటిసారిగా జూలై 10న అమేథీలో పర్యటించనున్నారు. ముందుగా లక్నోకు చేరుకుని గౌరీగంజ్‌లో అక్కడి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిలపడటానికి గల కారణాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత శివమహేశ్ మెడికల్ కళాశాల వేడుకకు హాజరు కానున్నారు. 15 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ కుటుంబీకులు అమేథీలో విజయబావుటా ఎగురవేస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌గాంధీ పరాజయం పాలయ్యారు. కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. దేశమంతటా కాంగ్రెస్ తక్కువ స్థానాలకు పరిమితం కావటంతో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. 2017లో కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ బాధ్యతలు చేపట్టారు. -
నా యుద్ధం ఉగ్రవాదంపై... విపక్షాల దాడి నాపై
అహ్మదాబాద్/అదాలజ్/ధర్: పొరుగుదేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమివేయాలని తాను యుద్ధం చేస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం తనపై దాడి చేయాలని చూస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. మంగళవారం ప్రధాని గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ‘నేను ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లు (ప్రతిపక్షాలు) నన్ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. పేదరికంపై నేను పోరాడుతుండగా వాళ్లు చౌకీదార్‌ను తొలగించేందుకు చూస్తున్నారు. నిజాయతీపరుడైన ఈ చౌకీదార్‌తో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వాళ్లు మోదీ హఠావో అంటూ అరుస్తున్నారు’ అని చెప్పారు. పాక్‌కు బుద్ధి చెప్పాం పాక్‌లోకి ప్రవేశించి ఉగ్రశిబిరాలపై దాడులు చేయడం ద్వారా ఆ దేశానికి తగ్గిన బుద్ధి చెప్పామని ప్రధాని అన్నారు. ‘పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్‌లో ప్రవేశించి అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం ద్వారా ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాం. తీరు మారకుంటే తలెత్తే పరిణామాలేమిటో పాక్‌కు ముందే చెప్పాం’ అని అన్నారు. కానీ, ఎయిర్‌స్ట్రైక్ పాక్‌పై జరిగినా భారత్‌లో ఉన్న కొందరికి ఆ దెబ్బ తగిలిందని ఎద్దేవా చేశారు. ‘పుల్వామాకు ప్రతీకారంగా మనం చేసిన దాడిని ప్రపంచమంతా మద్దతు పలుకుతుండగా అత్యంత కల్తీ కూటమి(ప్రతిపక్ష మహాకూటమి) నేతలు మాత్రం పాక్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. రాహుల్ ‘ఆకలి బాధ’ వ్యాఖ్యలపై.. ఒక్క పూట కూడా ఖాళీ కడుపుతో నిద్రించని వారు మాత్రమే ఆకలి బాధ మానసికమైందని అంటారంటూ మోదీ ఎద్దేవా చేశారు. ‘పేదరికం పేరుతో ఓట్లు దండుకుని దేశాన్ని 55 ఏళ్లపాటు పాలించిన వీళ్లకు పేదరికం అనేది కేవలం మానసిక భావన’ అని 2013లో రాహుల్ చేసిన ప్రకటనను ఉదహరిస్తూ వ్యాఖ్యానించారు. అన్నీ ప్రభుత్వమే చేయాలనుకుంటున్నారు ‘ప్రభుత్వమే ప్రతీ పనినీ చేపట్టాలని ప్రజలు భావిస్తున్నారు. ఫలానా పనిని ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. ఇది కొత్త ఒరవడి’ అని అన్నారు. -
దేశ్కా చౌకీదార్’ మాత్రమే దొంగ
రాంచీ: ‘కాపలాదార్లంతా దొంగలు కారు.. దేశానికి కాపలాదారు (దేశ్కా చౌకీదార్) మాత్రమే దొంగ’అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాంచీలో శనివారం జరిగిన బహిరంగ సభ ‘పరివర్తన్ ఉల్గులన్ మహా ర్యాలీ’లో రాహుల్ మాట్లాడుతూ.. ‘కొందరు కాపలాదార్లు ఆ (చౌకీదార్ చోర్ హై)నినాదంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తామంతా నిజాయతీ పరులమనీ, ఆ నినాదాన్ని మార్చుకోవాలని సూచించారు. అయితే, ఆందోళన చెందవద్దని వారికి చెప్పా. కాపలాదారే దొంగ నినాదం ప్రధాని మోదీని ఉద్దేశించిందేనన్న విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. దేశానికి కాపలాదారు మాత్రమే దొంగ. ఈ ఒక్క కాపలాదారు కారణంగా అందరికీ అప్రతిష్ట వచ్చిపడింది’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని మోదీ రూ.30 వేల కోట్ల మేర తన సన్నిహితుడైన అనిల్ అంబానీకి అక్రమంగా లాభం కలిగేలా చేశారంటూ రాహుల్ ఆరోపిం చారు. ‘వాయుసేన దేశాన్ని రక్షిస్తుండగా మన ప్రధాని మాత్రం సైన్యం నుంచి డబ్బు దోచుకుంటున్నారు’ అని రాహుల్ ఆరోపించారు. రైతులు, విద్యార్థులు, చిన్న దుకాణదారులను పట్టించుకోని ప్రధానమంత్రి పారిశ్రామికవేత్తలకు బ్యాంకు లిచ్చిన రూ.3.5 లక్షల కోట్ల రుణాలను మాత్రం రద్దు చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకాన్ని అమలు చేసి, పేదల బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా డబ్బును జమ చేస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు వాగ్దానాలు, తప్పుడు గిమ్మిక్కులు చేసే కాపలాదారు(ప్రధాని) మళ్లీ విఫల మయ్యారని రాహుల్ మండిపడ్డారు. -
ఐదు నిమిషాలు ఉండలేరు
ధులే: పుల్వామా దాడి తర్వాత దేశమంతా ఐక్యమైందంటూనే మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ మండిపడ్డారు. అప్పుడే ఐక్యతారాగం.. అంతలోనే రాజకీయం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. పబ్లిసిటీ లేకుండా కేవలం 5 నిమిషాలు కూడా ప్రధాని ఉండలేరని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలోని ధులే జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కాగితపు విమానాలు కూడా తయారు చేయలేరని ఎగతాళి చేశారు. ‘పుల్వామా దాడి తర్వాత ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించొద్దని మా పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెప్పాను. మనదేశం చేస్తున్న పోరాటానికి అందరం అండగా నిలవాలి’అని ఆయన అన్నారు. ‘పుల్వామా ఉగ్రదాడుల తర్వాత దేశం మొత్తం ఒక్కటైందని మీడియా ముందు చెబుతారు. వెనువెంటనే ఢిల్లీలో జరిగిన అమర వీరుల స్మారకం ప్రారంభోత్సవంలో మమ్మల్ని విమర్శిస్తారు. ఈ ప్రధాని పబ్లిసిటీ లేకుండా 5 నిమిషాలు ఉండలేరు’ అని విమర్శించారు. పీఎం కిసాన్ సమ్మన్ పథకం ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి రోజుకు రూ.17 అందుతాయన్నారు. ‘కుటుంబంలోని ఒక్కొక్కరికి విడిగా లెక్కేస్తే రూ.3.5 వస్తుంది. రూ.3.5 లక్షల పంట రుణం ఉంటే మరోవైపు రూ.3.5 ఇవ్వడానికి మోదీ సిగ్గుపడాలి’ అని అన్నారు. -
కమలనాథులకు తగ్గిపోనున్న ప్రత్యామ్నాయాలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు వైరి పక్షాలైన ఎస్పీ, బీఎస్పీలు రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం చేతులు కలపడంతో బీజేపీ ముందున్న ప్రత్యామ్నాయాలు తగ్గిపోయే అవకాశాలున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్ని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీల మధ్య పోరుగా చిత్రీకరించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అందుకే విపక్షాలనన్నింటిని కలిపి మహాకూటమిగా అభివర్ణిస్తూ, ఎన్నికల్ని మోదీ పాలనపై రిఫరెండంగా ప్రచారం చేయాలనుకుంటోంది. అదే జరిగితే మోదీకి తిరుగుండదని, ప్రజాదరణలో మోదీని ఓడించడం కష్టమని కాషాయ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఎస్పీ–బీఎస్పీ కూటమితో బీజేపీకి కొత్త తలనొప్పులు తలెత్తే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో సార్వత్రిక ఎన్నికలకు ఏదో ఒకే అంశాన్ని ప్రచారాస్త్రంగా ఎంచుకుని బరిలోకి దిగేవారు. కానీ ఇప్పుడు జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ప్రాథమ్యాలు మారి పోయాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎజెండా, ప్రచారాస్త్రంతో పోటీకి దిగడం జాతీయ పార్టీకి కత్తిమీద సాముగా మారింది. అసలే దక్షిణాదిలో బీజేపీ కేడర్ అంతంత మాత్రమే. ఎస్పీ–బీఎస్పీ బాటలోనే ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా నడిస్తే బీజేపీ అవకాశాలు మరింత కుంచించుకుపోతాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్ని మోదీ పాలనకు రిఫరెండంగా భావించే పరిస్థితి కూడా ఉండదు. అప్పుడలా..ఇప్పుడిలా.. కాగితంపై చూస్తే ఎస్పీ–బీఎస్పీ కూటమికి బీసీలు, దళితులు, ముస్లింలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో ఈ రెండు పార్టీ లు విడివిడిగా పోటీచేయడంతో ఓట్ల చీలికతో బీజేపీ లబ్ధి పొందిందన్నది కాదనలేని వాస్తవం. 1993 అసెంబ్లీ ఎన్నికల్లో జతకట్టిన ఎస్పీ–బీఎస్పీలు అప్పటికే బలోపేతమైన బీజేపీని ఓడించిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. ఇక 2014 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఎస్పీ, బీఎస్పీల ఉమ్మడి ఓటు షేరు 42.1 శాతం కాగా, బీజేపీకి 42.6 శాతం ఓట్లు దక్కాయి. ప్రస్తుతం బీజేపీ ఓట్ల శాతం ఒకటో, రెండో పాయింట్లు పడిపోయి ఉంటుందని అంచనావేస్తున్నారు. తన ఓట్లను ఎస్పీకి బదిలీచేయగలనని గతేడా ది జరిగిన ఉపఎన్నికలో బీఎస్పీ నిరూపించింది. మాయావతి ప్రధాని అభ్యర్థిత్వానికి అఖిలేశ్ మద్దతుపలకడం, ఆమెను అవమానిస్తే తననూ అవమానించినట్లేనని పార్టీ కార్యకర్తలకు సూచించడం ద్వారా ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు కలసి పనిచేసేలా ప్రోత్సహించారు. ‘వర్ణ’ రాజకీయాలే కీలకం: 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో అధిక సీట్లు గెలుచుకోవడమే బీజేపీకి మొదటి సవాల్. ఇందుకోసం ఆ పార్టీ వేర్వేరు వ్యూహాలు అనుసరించాల్సి ఉంటుంది. దళితులు, అధిక సంఖ్యాక ఓబీసీల్లో పార్టీ పట్ల ఉన్న వ్యతిరేక భావాన్ని ఎదుర్కోవడం ప్రధానమైంది. కానీ, యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక బీజేపీలోనే ఓబీసీ రాజకీయాలు చాపకింద నీరులా పెరిగిపోవడం అసలు సమస్యగా మారింది. అగ్రవర్ణాల్లో ఉన్న పార్టీ వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మోదీ నిరుపేదలకు 10 శాతం కోటా తీసుకువచ్చారు. అయోధ్యలో రామాలయాన్ని బీజేపీ నిర్మించనుందనే అంచనాలు హిందుత్వ ఓటర్లలో పెరిగిపోయాయి. కుంభమేళా సందర్భంగా జరిగే ధర్మ సంసద్‌లో హిందుత్వ వాదులు తమ గళాన్ని మరింత తీవ్రంగా వినిపించే అవకాశాలున్నాయి. అదే జరిగితే బీజేపీ వైఖరికి, హిందుత్వ అతివాదానికి మధ్య మోదీ సయోధ్య ఎలా కుదుర్చుతారో వేచి చూడాలి. తగ్గనున్న కాంగ్రెస్ స్థాయి ఎస్పీ, బీఎస్పీ కూటమి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒకే నినాదం, ఒకే అజెండాతో ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. మాయావతి, అఖిలేశ్ కలిసి కాంగ్రెస్‌ను కూటమిలో చోటివ్వక పోవడం ద్వారా ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లయింది. మిగతా ప్రాంతీయ పార్టీల నేతలు కూడా ఇదే బాటను అనుసరిస్తూ కాంగ్రెస్‌ను పక్కనబెట్టడమో లేదా ఇష్టం లేకున్నా రాష్ట్ర స్థాయిలో పొత్తులు పెట్టుకోవడమో చేసేందుకు ఈ పరిణామం దోహదపడింది. అఖిలేశ్, మాయావతి కలయిక.. మోదీని ఓడించేందుకు కాంగ్రెస్ వంటి జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం అక్కర్లేదు.. రాష్ట్ర స్థాయిలో ఏకమైతే చాలనే సందేశాన్ని మిగతా పార్టీలకు పంపింది. -
పాలకుల మనస్తత్వంతోనే అసహనం
దుబాయ్: గత నాలుగన్నరేళ్లలో భారతదేశం చాలా ఎక్కువ మొత్తంలో అసహనం, కోపానికి సాక్ష్యంగా నిలిచిందనీ, అధికారంలో ఉన్నవారి మనస్తత్వాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం అన్నారు.యూఏఈలో పర్యటిస్తున్న రాహుల్ శనివారం ఐఎంటీ దుబాయ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు. ‘సహనం భారతీయుల సంస్కృతిలో మిళితమై ఉంది. అయితే గత నాలుగున్నరేళ్లుగా భారత్‌లో జరుగుతున్నది చూస్తుంటే విచారంగా ఉంది. వివిధ కులాలు, వర్గాలు, మతాల మధ్య చాలా ఎక్కువ స్థాయిలో అసహనం, కోపం, విభజనలను మనం చూశాం. పాలిస్తున్నవారి మనస్తత్వాల నుంచి ఇవి వస్తున్నాయి’ అని రాహుల్ ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని సమూలంగా సంస్కరించాల్సిన అవసరం ఉందనీ, ప్రస్తుతం భారత వ్యవసాయ రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానమై లేదని రాహల్ తెలిపారు. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థను కూడా మార్చి, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఆర్థిక వనరులు కల్పించి అవి దిగ్గజ కంపెనీలుగా ఎదిగేందుకు తోడ్పడాల్సిన అవసరం ఉందన్నారు. యూఏఈ సాంస్కృతిక, యువజన, సామాజికాభివృద్ధి శాఖల మంత్రిని రాహుల్ కలిశారు. -
నేడే కమల్‌నాథ్ ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని జంబోరీ మైదానంలో ఈ వేడుక ఉంటుందనీ, ప్రమాణ స్వీకారానికి ముందు సర్వమత ప్రార్థనలు ఉంటాయని కాంగ్రెస్ నాయకురాలు శోభా ఓజా ఆదివారం చెప్పారు. కమల్‌నాథ్ ప్రమాణం చేశాక గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆ ప్రాంగణం నుంచి వెళ్లిపోతారనీ, అనంతరం కమల్‌నాథ్‌తోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని శోభా చెప్పారు. ఇతర మంత్రులెవరూ లేకుండా కమల్‌నాథ్ మాత్రమే సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవె గౌడ, కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి తదితరులు ప్రమాణ స్వీకార వేడుకకు రానున్నారని ఓజా చెప్పారు. ఇటీవలి మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించి సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగిపోయినప్పటికీ బీఎస్పీ, ఎస్పీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. 15 వరుస సంవత్సరాల బీజేపీ పాలన తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే ఏర్పాటు కాబోతోంది. వింధ్య ప్రాంతంలో ఓటింగ్ సరళిపై విచారణ మధ్యప్రదేశ్‌లోని వింధ్య ప్రాంతంలో కాంగ్రెస్‌కు అతి తక్కువ సీట్లు రావడంతో ఈ ప్రాంతంలోని ఓటింగ్ సరళిపై విచారణ జరిపించనున్నట్లు కమల్‌నా«ద్ తెలిపారు. ఇక్కడి ఈవీఎంలపై తమకు అనుమానాలున్నాయన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 30 శాసనసభ నియోజకవర్గాలుండగా కాంగ్రెస్‌కు కేవలం 6 సీట్లే దక్కాయి. -
ఈవీఎంలు జాగ్రత్త!
న్యూఢిల్లీ: రాజస్తాన్, తెలంగాణల్లో హోరాహోరీ పోరు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఈ రెండు రాష్ట్రాల పార్టీ నేతలు ఈవీఎంల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘మధ్యప్రదేశ్‌లో ఈవీఎంలు వింతగా ప్రవర్తిస్తున్నాయి. కొన్ని ఈవీఎంలు స్కూల్ బస్సును ఎత్తుకెళ్తే మరికొన్ని రెండు రోజులపాటు కనిపించకుండాపోయాయి. ఇంకాకొన్ని ఓ హోటల్లో తాగుతూ కనిపించాయి. మోదీ హయాంలో ఈవీఎంలకు అతీంద్రియ శక్తులుంటాయి’అంటూ వ్యంగ్యంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. నవంబర్ 28వ తేదీన మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయిన 48 గంటల తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంకు చేరాయన్న వార్తలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అయితే, ఆ ఈవీఎంలు అదనంగా ఉంచినవే తప్ప పోలింగ్‌కు వాడినవి కాదని ఈసీ పేర్కొంది. స్ట్రాంగ్ రూంలలోని ఈవీఎంలకు తాము కల్పించిన మూడంచెల భద్రతపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసిందని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా తెలిపారు. -
మోదీ రెండు భారత్‌లను నిర్మిస్తున్నారు
న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ సంక్షోభానికి ప్రధాని మోదీ కారణమంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. మోదీ రెండు భారత్‌లను నిర్మిస్తున్నారని, ఒకటి అంబానీ కోసం, మరొకటి రైతుల కోసం అని సోమవారం ట్వీట్ చేశారు. ‘ఒక్క విమానాన్ని కూడా నిర్మించకుండా అంబానీ రూ.30,000 కోట్ల రఫేల్ కాంట్రాక్టును పొందారు. కానీ నాలుగు నెలలు కష్టపడ్డ రైతులకు మాత్రం 750 కిలోల ఉల్లిపాయలకు రూ.1,040 వచ్చాయి’ అని మహారాష్ట్ర ఘటనను ఉదహరించారు. మరోవైపు ప్రభుత్వం తన విధానాలతో రైతులను ఒత్తిడి గురిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
మోదీజీ మీరెలాంటి హిందువు
జైపూర్: రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో నేతల మాటల వాడి పెరిగింది. శనివారం ఉదయ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ..‘తను హిందూనంటూ ప్రధాని మోదీ చెబుతుంటారు. కానీ, ఆయనకు హిందూయిజం మూలాలు అర్థం కావు. ఆయన ఎలాంటి హిందువు?’ అని ప్రశ్నించారు. ‘హిందూయిజం సారం ఏమిటి? ప్రతి ఒక్కరిలోనూ విజ్ఞానం ఉంటుంది. మన చుట్టూతా విజ్ఞానం ఉంది. ప్రతి జీవికీ విజ్ఞానం ఉంటుంది. ఇదే కదా భగవద్గీత చెబుతోంది?’ అని అన్నారు. 2016లో భారత్ బలగాలు పాక్ భూభాగంపై చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌ను కూడా ప్రధాని మోదీ అప్పటి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వాడుకున్నారని రాహుల్ ఆరోపించారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉండగా ఇలాంటి సైనిక చర్యలు మూడు జరిగినా అవి బయటకు వెల్లడికాలేదని తెలిపారు. యూపీఏ హయాంలో నిరర్ధక ఆస్తులు రూ.2 లక్షల కోట్ల మేర ఉండగా బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.12 లక్షల కోట్లకు పెరిగిపోయాయని విమర్శించారు. ఆ అగత్యం రాకూడదు?: సుష్మ మంత్రి సుష్మా స్వరాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘హిందూయిజం గురించి రాహుల్ గాంధీ ద్వారా తెలుసుకోవాల్సిన ఆగత్యం ప్రజలకు రాకూడదని కోరుకుంటున్నా. ఆయన మతం, కులం ఏమిటో తెలియక రాహుల్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా అయోమయంలో ఉన్నాయి’ అని ఎద్దేవా చేశారు. -
‘ఓఆర్ఓపీ’కి కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: ఒకే ర్యాంకు–ఒకే పెన్షన్ (ఓఆర్ఓపీ) అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాజీ సైనికులతో రాహుల్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సైనికుల సంక్షేమం, ఓఆర్ఓపీ అమలు తదితర అంశాలపై వారితో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఓఆర్ఓపీ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపడితే ఓఆర్‌ఓపీతో సహా సైనికుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రఫేల్ వ్యవహారంలో అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు కేటాయించిన మోదీ సర్కార్‌కు సైనికుల డిమాండ్ల పరిష్కారానికి మాత్రం చేతులు రావటం లేదని విమర్శించారు. జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని, దీని వల్ల సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాహుల్ విమర్శలకు అధికార బీజేపీ దీటుగా సమాధానం ఇచ్చింది. అధికారంలో ఉండగా ఎన్నడూ సైనికుల సంక్షేమంపై మాట్లాడని రాహుల్ ఇప్పుడు తమను విమర్శించటం సిగ్గుచేటని బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బరూనీ విమర్శించారు. అధికారం కోల్పోయి నాలుగున్నరేళ్ల తర్వాత గానీ ఆయనకు సైనికులు గుర్తుకు రాలేదని ఎద్దేవా చేశారు. -
జైట్లీ కుమార్తె ఖాతాలోకి చోక్సీ డబ్బు
రాయ్‌పూర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లక్ష్యంగా సోమవారం విమర్శలు గుప్పించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీ నుంచి జైట్లీ కుమార్తె రూ.24 లక్షలు తీసుకుందని ఆరోపించారు. ఈ విషయాన్ని బయటపెట్టేందుకు మీడియా భయపడుతోందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సోమవారం జరిగిన రైతుల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. ‘దేశం నుంచి రూ.35,000 కోట్ల నిధులతో విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల గురించి మీరు వినే ఉంటారు. చోక్సీ రూ.24 లక్షలను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశారు. కానీ ప్రముఖ మీడియా సంస్థలేవీ ఈ విషయాన్ని ప్రసారం చేయడం లేదు. నిజాన్ని బయటపెట్టాల్సిన మీడియా సంస్థలు బెదిరింపులకు, అణచివేతకు గురవుతున్నాయి’ అని తెలిపారు. రఫేల్ ఫైటర్ జెట్ల కాంట్రాక్టు నుంచి ప్రభుత్వ రంగ హాల్ సంస్థను తప్పించిన ప్రధాని మోదీ.. కనీసం కాగితపు విమానాన్ని తయారుచేసిన అనుభవం కూడా లేని రిలయన్స్ సంస్థకు కాంట్రాక్టును అప్పగించారని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేవలం 10 రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని రాహుల్ ప్రకటించారు. పనామా పేపర్లలో ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్ పేరు రావడంపై స్పందిస్తూ.. ‘పనామా వ్యవహారంలో పేరు వచ్చినందుకు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏకంగా జైలు పాలయ్యారు. కానీ ఇక్కడ మాత్రం అభిషేక్ సింగ్‌పై కనీసం చర్యలు కూడా తీసుకోలేదు’ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే ప్రతి జిల్లాలో ఓ ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి, అవకాశాలు మెరుగవుతాయని వెల్లడించారు. ఆదివాసీ, రైతుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాలన్నింటిని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ప్రజల్లోకి వెళ్లి బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని పార్టీ కార్యకర్తలను కోరిన రాహుల్.. కార్యకర్తల అభీష్టం మేరకే ఎమ్మెల్యే టికెట్లను కేటాయిస్తామనీ, చివరి నిమిషంలో కాంగ్రెస్‌లోకి వచ్చినవారికి ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి వచ్చే నెల 12న, 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 11న ప్రకటించనున్నారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేదు చెన్నై: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల కూటమి విజయం సాధిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని కాంగ్రెస్ చెప్పలేదని ఆ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడంతో పాటు కేంద్రంలో ప్రగతిశీల ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ ముందున్న లక్ష్యమని వెల్లడించారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించలేదు. రాహుల్ కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. ఒకరిద్దరు నేతలు ఈ విషయమై మాట్లాడినా, ఇకపై దీనిపై చర్చించరాదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారికి సూచించింది. విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై మాకు పట్టింపులేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మిత్రపక్షాలతో చర్చించి ఈ విషయమై నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. -
‘రాఫెల్’ ఒప్పందం రద్దు ప్రశ్నేలేదు
న్యూఢిల్లీ/పారిస్: రాఫెల్ ఒప్పందంపై అధికార, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. తాజాగా, ‘రాఫెల్’ ఒప్పందం రద్దు ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే డసో ఏవియేషన్, రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ (ఆర్డీఎల్) ఒప్పందం విషయంలో భారత, ఫ్రెంచి ప్రభుత్వాలకు ఎటువంటి ప్రమేయం లేదని పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ స్పందిస్తూ.. ప్రధాని, జైట్లీ అబద్ధాలు మాని, నిజానిజాలు తేల్చేందుకు జేపీసీని నియమించాలని డిమాండ్ చేశారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఫెల్ ఒప్పందంపై అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ..ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ చేసిన పొంతనలేని ప్రకటనలే అనుమానాలకు తెరలేపాయన్నారు. ‘రిలయన్స్‌తో ఒప్పందం చేసుకోవాలని డసోను భారత ప్రభుత్వమే కోరిందని రెండ్రోజుల క్రితం హోలండ్ ప్రకటించారు. ఇప్పుడు భారత ప్రభుత్వం లాబీ చేసిందో లేదో తనకు తెలియదంటూ ఆయన మాటమార్చారు. హోలండ్ ప్రకటనలకు, రాహుల్ విమర్శలకు సంబంధం ఉంది. రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్‌లో బాంబులు పేలనున్నాయంటూ ఆగస్టు 30నే రాహుల్ ట్వీట్ చేశారు. వారి అనుబంధం విషయంలో నా వద్ద ఆధారాలు లేనప్పటికీ, ఏదో లంకె ఉందనే అనుమానం మాత్రం ఉంది. హోలండ్ ముందుగా ఒక ప్రకటన, దానికి విరుద్ధమైన మరో ప్రకటన చేశారు. ఈ విషయం రాహుల్‌కు 20 రోజులకు ముందుగానే ఎలా తెలిసింది?’ అని జైట్లీ ప్రశ్నించారు. 2019 ఎన్నికల నేపథ్యంలో రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారా అని ప్రశ్నించగా..‘ఒప్పందం నుంచి వైదొలిగే ప్రశ్నేలేదు’ అని స్పష్టం చేశారు. హోలండ్ మొదటి ప్రకటనను ఫ్రెంచి ప్రభుత్వం, డసో ఏవియేషన్ సంస్థ ఇప్పటికే ఖండించాయని జైట్లీ తెలిపారు. కాగా డసోతో తమ కాంట్రాక్టు విషయంలో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం లేదని రిలయన్స్ గ్రూప్ స్పష్టం చేసింది. అసత్యాలు మానండి: రాహుల్ రాఫెల్ ఒప్పందం విషయంలో ప్రధాని మోదీ, జైట్లీ అబద్ధాలు చెప్పడం మానాలని రాహుల్ అన్నారు. ఈ ఒప్పందం విషయంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని నియమించాలని డిమాండ్ చేశారు. ‘తాను చెప్పిందే నిజమని వాదించగల పటిమ, నిజాలను అబద్ధాలుగా నమ్మించగల సామర్థ్యం జైట్లీ ప్రత్యేకత. ప్రధాని, రక్షణ మంత్రి అబద్ధాలు ఆపాలి’ అని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. రాఫెల్ వివరాల్ని అనిల్ అంబానీకి వెల్లడించి రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ప్రధాని ఉల్లంఘించారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ విమర్శించారు. ఫ్రాన్స్ ఆందోళన రాఫెల్ ఒప్పందంపై హోలండ్ వ్యాఖ్యలు భారత్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపడంపై ఫ్రాన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత్‌తో సంబంధాలపై ప్రభావం చూపుతోందని భావిస్తోంది. ఫ్రాన్సు ఉప విదేశాంగ మంత్రి జీన్–బాప్టిస్ట్ లెమోయెన్ స్పందిస్తూ.. ‘హోలండ్ వ్యాఖ్యలు ఎవరికీ ఉపయోగకరం కాదు..ముఖ్యంగా ఫ్రాన్సుకు విదేశాలతో సంబంధాల విషయంలో ఇబ్బందికరంగా మారుతాయని అనుకుంటున్నా. పదవిలో లేని వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు’ అని అన్నారు. -
కాపలాదారుడే దొంగయ్యాడు
డూంగర్పూర్: ప్రధానిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు దేశమంతటా వీధుల్లో ఒకే మాట వినిపిస్తోందనీ, దేశ కాపలాదారుడు (మోదీ) దొంగగా మారాడని వారంటున్నారని ఎద్దేవా చేశారు. దేశానికి ప్రధానిలా కాకుండా కాపలదారుడిలా తాను పనిచేస్తానని గతంలో పలుమార్లు మోదీ అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో రాహుల్ గురువారం పర్యటించారు. డూంగర్పూర్ జిల్లాలో ఓ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో మోదీ మౌనంగా ఉన్నారనీ, బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యాను వెనక్కు రప్పించడంలోనూ విఫలమయ్యారని అన్నారు. ఈ అంశాలపై తాను పార్లమెంటులో ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేదనీ, ఈ కారణాల వల్లే ప్రధానిని అంతా దొంగ అంటున్నారని పేర్కొన్నారు. 15 మంది పారిశ్రామిక వేత్తలు తీసుకున్న 2.3 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం.. అప్పుల్లో కూరుకుపోయిన రైతు రుణాలను మాఫీ చేసేందుకు ఒప్పుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను సంప్రదించి, కష్టపడి పనిచేస్తున్న నాయకులకే ఈసారి టికెట్లు ఇస్తామన్నారు. హాస్య యువరాజు రాహుల్: జైట్లీ, స్మృతి మోదీని రాహుల్ దొంగ అనడంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆయనకు ప్రధాని పదవి అంటే గౌరవం లేకుండా పోయిందని వారు విమర్శించారు. రాహుల్ హాస్య యువరాజుగా మారారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఎద్దేవా చేశారు. రాహుల్‌పై ఎదురుదాడి చేస్తూ ఫేస్బుక్లో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. రాహులే అన్ని విషయాల్లోనూ తన ప్రభుత్వం గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జైట్లీ ఆరోపించారు. జైట్లీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా స్పందించింది. జైట్లీ విదూషకుడిలా వ్యవహరిస్తున్నారంది. -
అతిపెద్ద కుంభకోణం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక విడుదల చేసిన వేళ ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు దేశచరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. గురువారం రాహుల్ మీడియాతో మాట్లాడారు. పారిశ్రామికవేత్తలైన స్నేహితులకు డబ్బులు సమకూర్చేందుకే సామాన్యులపై మోదీ నోట్ల రద్దు అస్త్రాన్ని ప్రయోగించారని విమర్శించారు. ‘పెద్ద నోట్ల రద్దు కారణంగా చెల్లకుండాపోయిన నగదంతా బ్యాంకులకు తిరిగివచ్చేసింది. ఇది భారీ కుంభకోణానికి ఏమాత్రం తక్కువకాదు’ అని వ్యాఖ్యానించారు. ‘దాదాపు 20 మంది పారిశ్రామికవేత్తలైన ఆయన మిత్రులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని ఉద్దేశపూర్వకంగా నోట్ల రద్దుతో సామాన్యులపై దాడికి పాల్పడ్డారు.గత ఎన్నికల్లో ప్రచారానికి భారీగా డబ్బులు ఖర్చుపెట్టిన పారిశ్రామికవేత్తలకు సాయం చేయడమే ఆయన లక్ష్యం’ అని రాహుల్ మండిపడ్డారు. బీజేపీ చీఫ్ అమిత్ షా డైరెక్టర్‌గా ఉన్న గుజరాత్‌లోని ఓ సహకార బ్యాంకులో ఏకంగా రూ.700 కోట్ల విలువైన రద్దయిన నోట్లను కొందరు మార్చుకోవడంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకులో ఎవరి నగదు మార్పిడి జరిగిందో విచారణ జరిపారా? అని ప్రశ్నించారు. రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని ఆర్థికమంత్రి జైట్లీకి తాము పెట్టిన డెడ్‌లైన్ గడువు ముగుస్తోందన్నారు. రాహుల్‌తో కుమారస్వామి భేటీ కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాహుల్‌గాంధీని కర్ణాటక సీఎం కుమారస్వామి ఢిల్లీలో కలిశారు. కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై ఇద్దరు నేతలు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై త్వరలో∙నిర్ణయం తీసుకుంటామని అనంతరం కుమారస్వామి మీడియాతో అన్నారు. -
‘ఓయ్ పిల్లాడా ! ప్రియా వారియర్ కంటే..’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా వివిధ దేశాధినేతలను ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలి ఆలింగనంతో (బేర్ హగ్) చిత్తు చేస్తే, ఆయనకు విపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రూపంలో ఆలింగనంలో పోటీ ఎదురైందనే సరదా చర్చ సాగుతోంది. శుక్రవారం లోక్‌సభలో ఎన్డీఏ సర్కార్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ తన ప్రసంగంతో, ఆ తర్వాత మోదీని ఆప్యాయంగా కౌగిలించుకుని, ఆ వెంటనే సహచర ఎంపీలను ఉత్సాహపరుస్తూ కొంటెగా కన్నుగీటడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాహుల్ చేష్టలన్నింటినీ వివిధ జాతీయ టీవీ ఛానళ్లు పదేపదే చూపాయి. ఈ ఘట్టాలు ట్విట్టర్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో హాస్యపూర్వక వ్యాఖ్యలు, చర్చలకు దారితీశాయి. ► ‘ఓయ్ పిల్లాడా ! ప్రియా ప్రకాష్ వారియర్ (కన్నుగీటిన సీన్ల ద్వారా పాపులర్ అయిన మలయాళీ నటి) కంటే మెరుగ్గా రాహుల్ కన్నుగీటారు. మున్నాభాయ్ కంటే బాగా ఆలింగనం చేసుకున్నారు. దీనికి ఆస్కార్ అవార్డ్ రావొచ్చేమో?’ నంటూ గౌతమ్ జోషి ట్వీట్ చేశారు. ► ‘ప్రియా వారియర్ కంటే కూడా నిట్టనిలువునా మనిషిని పడగొట్టేలా కన్నుకొట్టడమంటే ఇదే’నని ఆకాష్ సిన్హా పేర్కొన్నారు ► ఈ కౌగిలింత ప్రభావం ఎంతో తీవ్రంగా ఉండబోతోంది. ప్రియా వారియర్ కంటే కూడా ఈ కన్నుగీటడం మరింత ఎక్కువగా అంటురోగంగా వ్యాపిస్తుందేమోనన్న సందేహాన్ని గీతాశర్మ వెలిబుచ్చారు. ► అయితే రాహుల్ కన్నుగీటడంపై స్వయంగా ప్రియా వారియర్ ‘ఈ విధంగా కన్నుగీటడం తియ్యటి సంజ్ఞ, చేష్ట. ఇది నాకు సంతోషాన్ని కలిగించింది’ అంటూ స్పందించింది. ► అవిశ్వాసంపై చర్చను పక్కన పెట్టి మోదీపై దాడే రాహుల్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రసంగం బదులు ప్రదర్శన ఇచ్చారు. చిన్నపిల్లాడి మాదిరిగా అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేయడం తప్ప ఓ విజనూ లేదూ, రోడ్డు మ్యాపూ లేదు’ అంటూ మరో ట్విటరాటీ సంజూ శర్మ విరుచుకుపడ్డారు ► ప్రధానిని రాహుల్‌గాంధీ ఆలింగనం చేసుకోవడం, ఆ తర్వాత చౌకబారుగా కన్నుగీటడం ఆయన అపరిపక్వతను, స్థాయి లేమి తనాన్ని స్పష్టం చేస్తోంది’ అంటూ ఘోస్ స్పాట్ అకౌంట్ ట్వీట్ చేశారు. ► ముఖ్యమైన అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ మర్యాదను, నిబంధనలను రాహుల్ తక్కువచేశారు. జప్పీ (కౌగిలింత) తర్వాత కన్నుగీటడం చూస్తుంటే ఆయన ప్రతిపక్ష నేతా లేక మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి పాత్రా? సిగ్గుచేటు...షెహజాద్ జై హింద్ ట్విటర్ అకౌంట్ నుంచి పేర్కొన్నారు ► ఆలింగనం తర్వాత కన్నుకొట్టడమా? భారతీయులను మూర్ఖులను చేయాలనే యత్నం వద్దు రాహుల్. పార్ల మెంట్లో కామెడీ షో ఏం జరగడం లేదు. పార్లమెంట్లో వాస్తవాలు మాట్లాడేటపుడు సీరియస్‌గా వ్యవహరించు. ప్లీజ్ పరిణతి ప్రదర్శించు...బర్ఖా ట్రెహాన్ ట్వీట్ చేశారు. ► ‘వావ్..వావ్ ! ఏమి హగ్ అండీ. ఎంత అద్భుతమైన రోజు ఇది’ అని సంజుక్త బసు వ్యాఖ్యానించారు. ► ‘న్యూ వైల్డ్ స్టోన్ యాడ్ మాదిరిగా ఉంది ఇది’ అని ఓజాస్ ట్వీటారు. ► రాహుల్ తన ప్రసంగంలో బీజేపీ వైఫల్యాలు ఎండగట్టి, ఆ తర్వాత ఆలింగనం చేసుకోవడం ద్వారా మోదీ, బీజేపీ కంటే తాను, కాంగ్రెస్‌పార్టీ ఏ విధంగా భిన్నమైందో చెప్పారు అని శ్రీవత్స పేర్కొన్నారు. -
హంతకులకు కేంద్ర మంత్రి సన్మానం!
హజారీబాగ్: కేంద్ర మంత్రి జయంత్ సిన్హా వివాదంలో చిక్కుకున్నారు. గతేడాది ఓ మాంస వ్యాపారిని కొట్టి చంపిన కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులకు శుక్రవారం ఆయన పూల మాలలు వేసి సన్మానించారు. ప్రతిపక్షాలు మంత్రి చర్యను ఖండించాయి. నిందితులకు మిఠాయిలు తినిపించిన జయంత్ సిన్హా..న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని, తప్పకుండా న్యాయం జరుగుతుందని వారికి భరోసా ఇచ్చారు. తన నియోజకవర్గానికి చెందిన వారంతా విడుదలవడం ఎంతో సంతోషంగా ఉందని, వారికి న్యాయం జరిగేలా చూడటం తన బాధ్యత అని పేర్కొన్నారు. తమకు లాయర్‌ను ఏర్పాటుచేసిన మంత్రికి 8 మంది నిందితులు ధన్యవాదాలు తెలిపారు. విద్వేషపూరిత, విభజన రాజకీయాలు సమాజాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. జయంత్ సిన్హా తీరు హేయమైనదని జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రణబ్‌కు ఇఫ్తార్ ఆహ్వానం పంపాం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ బుధవారం ఢిల్లీలోని తాజ్ప్యాలెస్ హోటల్లో ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆహ్వానం పంపామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా స్పష్టంచేశారు. ఈ ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించారన్నారు. ఇటీవల నాగపూర్‌లో ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లిన ప్రణబ్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇస్తున్న ఇఫ్తార్ విందుకు ప్రణబ్‌కు ఆహ్వానం అందలేదని వార్తలొచ్చాయి.ఈ విందులో పాల్గొనేందుకు ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం, జేడీయూ తిరుగుబాటు నేత శరద్‌యాదవ్, ఎన్సీపీ అధినేత పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానాలు అందినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. -
ముగ్గురి చేతుల్లో దేశం బానిస
న్యూఢిల్లీ: బీజేపీ–ఆర్ఎస్ఎస్కు చెందిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ చేతుల్లో దేశం బానిసగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఆరు నెలల నుంచి ఏడాదిలోగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయని చెప్పారు. అతి త్వరలోనే దేశం శక్తిసామర్థ్యాలు ఏమిటో మోదీ, అమిత్, భాగవత్ గ్రహించేలా చేస్తామన్నారు. ఢిల్లీలో తల్కాతోరా మైదానంలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఏర్పాటు చేసిన ఓబీసీల సమావేశంలో రాహుల్ మాట్లాడారు. వెనుకబడిన వర్గాల ప్రజల శక్తిసామర్థ్యాలను కాంగ్రెస్ గుర్తించిందని, వారికి అవకాశాలివ్వడం ద్వారా రాజకీయంగా వారు ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటోందని చెప్పారు. ఓబీసీలను శక్తివంతులుగా మారు స్తామన్నారు. తాము వారిని బస్సులో మాట్లాడకుండా కూర్చో బెట్టబోమని, వారికే తాళాలు ఇచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడతామని చెప్పారు. దేశంలో నైపుణ్యాలకు కొదవలేదని, వెనుకబడిన వర్గాల వారిలో నైపుణ్యాలు ఇంకా ఎక్కువ ఉంటాయని, అవకాశాలు ఇవ్వకపోవడం వల్లే వెనుకబడిపోయారన్నారు. బీజేపీ 15–20 మంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేలా విధానాలను అనుసరిస్తోందని, ప్రధాని మోదీని మార్కెట్ చేసేందుకు వారు కోట్లు కుమ్మరిస్తున్నందుకు ప్రతిఫలంగా వారికి సహకరిస్తోందన్నారు. మోదీ విధానాలపై విమర్శలకు మరింత పదును పెట్టిన రాహుల్‌గాంధీ అమెరికా పారిశ్రామికవేత్తలకు కొత్త పేర్లు పెట్టారు. కోకా–కోలా వ్యవస్థాపకుడిని షికంజి విక్రేతగా, మెక్ డొనాల్డ్స్‌ను దాబావాలాగా, ఫోర్డ్, మెర్సిడెస్, హోండా వ్యవస్థాపకులను మెకానిక్స్‌గా పేర్కొన్నారు. -
లాలూ కొడుకు పెళ్లికి రాహుల్
రాంచీ/పట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా హాజరు కానున్నారు. పెళ్లికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తదితరులను ఆహ్వానించారు. తేజ్ ప్రతాప్æ వివాహం ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్యతో శనివారం జరగనుంది. లాలూకు 6 వారాల బెయిల్ దాణా స్కాంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు 6 వారాల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. మూడు రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన లాలూ గురువారం సాయంత్రం పట్నా చేరుకున్నారు. లాలూకు రాందేవ్ ఆరోగ్య సూచనలు బిహార్‌లోని నలంద, గయా జిల్లాల్లో మంగళవారం నుంచి యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న యోగా గురువు బాబా రాందేవ్ శుక్రవారం లాలూ నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునేందుకు నిత్యం యోగా చేయాలని లాలూకు సూచించారు. -
బెంగళూరుపై మోదీ కక్ష సాధింపు: రాహుల్
సాక్షి, బెంగళూరు: ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ బెంగళూరుపై కక్ష సాధిస్తున్నారు. సిలికాన్ సిటీని చెత్త నగరంగా మార్చారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఇక్కడ ఎన్నోమార్లు పర్యటించినా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు’ అని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన బెంగళూరు నగరంలో రోడ్ షో నిర్వహించారు. పలుచోట్ల తన ప్రసంగాల్లో మోదీపై ఎదురుదాడికి దిగారు. మోదీ ప్రసంగాలకు ఎవరూ మోసపోరన్నారు. మోదీ ప్రధాని పదవిలో ఉన్నాననే సంగతి మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు 2019లో తాను ప్రధాని కూడా అవుతానని పునరుద్ఘాటించారు.హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా కాంగ్రెస్‌లో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిన బీజేపీకి అవకాశం ఇవ్వరాదని ప్రజలను కోరారు. అనంతరం బసవనగుడిలో ప్రాచీన దొడ్డ గణపతి ఆలయంలో రాహుల్ పూజలు చేశారు. చిక్కపేటె ప్రాంతంలో హజరత్ మసీదులో ప్రార్థనల్లో పాల్గొన్నారు. అవినీతి విషయంలో కర్ణాటకలో ప్రస్తుత కాంగ్రెస్‌పై గత బీజేపీ పాలనే తేలిగ్గా విజయం సాధిస్తుందని రాహుల్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ హయాం (2008–13)లో జరిగిన అవినీతిని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో పోల్చుతూ పలు గణాంకాలను ట్విటర్లో విడుదల చేశారు. -
బెంగళూరును అవమానించారు
సాక్షి, బెంగళూరు: ప్రధాని మోదీ బెంగళూరును చెత్త నగరంగా సంబోధించి అవమానించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు. ‘ప్రియమైన మోదీజీ.. మీరు బెంగళూరును నేరాల నగరి అని, చెత్త నగరం అని సంబోధించి అవమానించారు. అబద్ధాలు చెప్పడం మీకు సహజంగానే అబ్బింది. మీకంటే యూపీఏ ప్రభుత్వం 1,100% ఎక్కువ నిధులు కర్ణాటక నగరాల అభివృద్ధికి కేటాయించింది. కర్ణాటకకు కాంగ్రెస్ రూ.6,570 కోట్లు కేటాయిస్తే.. బీజేపీ ప్రభుత్వం కేవలం రూ.598 కోట్లు మాత్రమే ఇచ్చింది’ అని అన్నారు. రాహుల్ గజేంద్రగఢ్, కల్గి, హావేరీల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో మాట్లాడారు. దళితులపై అత్యాచార ఘటనలు కొనసాగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మోదీని ప్రశ్నించారు. కొందరు పారిశ్రామికవేత్తలకు మాత్రం మోదీ కొమ్ముకాస్తూ బలహీనవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ గురించి తరచూ మాట్లాడే మోదీ ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో దళిత నేత ఖర్గే పలు కీలక అంశాలను ప్రస్తావించబోగా అడ్డుకున్నారని ఆరోపించారు. బీజేపీ అనుబంధ సంస్థల కార్యకర్తలు దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నా మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని పేర్కొన్నారు. మైనింగ్ అక్రమాలకు పాల్పడిన రెడ్డి సోదరులను తమ ప్రభుత్వం జైలుకు పంపిస్తే..బీజేపీ ప్రభుత్వం వారిని విడుదల చేయించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలనే బీజేపీ తన మేనిఫెస్టోలో నింపేసిందన్నారు. అంతకుముందు రాహుల్ బీదర్ జిల్లాలోని గురుద్వారాను సందర్శించి ప్రార్థనలు చేశారు. మహిళా సాధికారితపై ప్రధాని మోదీ మాటలు మాని.. చేతల్లో చూపాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మహిళల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను ఆయన ట్వీటర్లో ఉదహరించారు. బీజేపీ అభ్యర్ధి ఆకస్మిక మృతి, ఎన్నిక వాయిదా సిట్టింగ్ ఎమ్మెల్యే, జయనగర్ బీజేపీ అభ్యర్థి బీఎన్ విజయ్‌కుమార్‌ఆకస్మికంగా మృతి చెందారు. శుక్రవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో ఉండగానే గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి చనిపోయారని పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. దీంతో అక్కడ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. -
భయంతోనే వ్యక్తిగత దాడి
ఔరాద్ (కర్ణాటక): ప్రధాని మోదీకి భయం పట్టుకున్న ప్రతీసారి తనపై వ్యక్తిగత దాడికి దిగుతారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. తాము లేవనెత్తిన యుద్ధ విమానాల ఒప్పందం, బ్యాంకులకు రూ. వేల కోట్లు కుచ్చుటోపి పెట్టిన నీరవ్ మోదీ తదితర అంశాలపై బదులివ్వలేకే వ్యక్తిగత దాడికి దిగుతున్నారని విమర్శించారు. గురువారం రాహుల్ కర్ణాటకలోని బీదర్ జిల్లా ఔరాద్లో జరిగిన ర్యాలీ మాట్లాడారు. ‘నా గురించి ఆయన (మోదీ) ఏదైనా మాట్లాడనివ్వండి. అది తప్ప యినా, ఒప్పయినా పెద్ద విషయం కాదు. ఆయన దేశానికి ప్రధాని. అందువల్ల ఆయనపై నేను వ్యక్తిగత విమర్శలు చేయను’ అని అన్నా రు. తనపై మోదీ చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గవి కావని రాహుల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గబ్బర్ సింగ్ గ్యాంగ్ మోదీ.. గాలి జనార్దన్‌రెడ్డి సోదరులకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడాన్ని రాహుల్ తప్పుపట్టారు. ‘షోలే సినిమాలో గబ్బర్ సింగ్ ఉన్నాడు. మీరు ఇప్పటికే గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీకి వ్యంగ్య వ్యాఖ్య) తెచ్చారు. కానీ ఈసారి ఇంకా ముందుకెళ్లిపోయారు. కర్ణాటక ఎన్నికల్లో మొత్తం గబ్బర్‌సింగ్ గ్యాంగ్‌ను దించేశారు. గబ్బర్ సింగ్లా యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి సోదరులు తయారయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పే మీరు.. జైలుకు వెళ్లి వచ్చిన రెడ్డి సోదరులను అసెంబ్లీకి పంపాలని ప్రయత్నిస్తున్నారు’అని ఎద్దేవా చేశారు. మోదీకి ‘ఎఫ్’ గ్రేడ్ మోదీపై రాహుల్ ట్వీట్ల దాడికి దిగారు. కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలోని వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాముఖ్యం విషయంలో మోదీ ప్రోగ్రెస్ కార్డుకు తాను ‘ఎఫ్’గ్రేడ్ ఇస్తానంటూ ట్వీట్ చేశారు. దీంతోపాటు మద్దతు ధరకు సంబంధించిన చార్ట్‌ను కూడా పోస్ట్ చేశారు. దేవేగౌడను అవమానించలేదు రాహుల్ జేడీ(ఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడను అవమానించలేదని, అది కాంగ్రెస్ సంస్కృతి కాదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ చెప్పారు. రాహుల్ దేవెగౌడను అవమానించారని మోదీ వ్యాఖ్యానించిన నేప థ్యంలో శర్మ ఈ మేరకు వివరణ ఇచ్చారు. -
ఎయిమ్స్ నుంచి లాలూ డిశ్చార్జ్
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం మధ్యాహ్నం ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన వీల్‌చైర్‌లో ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు. తనను బలవంతంగా డిశ్చార్చ్ చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు అందిస్తున్న చికిత్స ఇంకా పూర్తి కాలేదని, బలవంతంగా పంపిస్తున్నారని అన్నారు. ’ఇది అన్యాయం. నా ఆరోగ్యం క్షీణింప చేసేందుకు జరుగుతున్న కుట్ర. నేను ఇంకా కోలుకోలేదు. ఎలాంటి సౌకర్యాలు లేని చోటకు నన్ను తరలిస్తున్నారు. అయినా దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. లాలూ డిశ్చార్చ్ సందర్భంగా పెద్దఎత్తున ఆర్జేడీ అభిమానులు ఎయిమ్స్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అక్కడి సెక్యూరిటీ గార్డ్‌కు గాయాలయ్యాయి. లాలూను చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. ఆయన ఆరోగ్యం కుదుటపడకుండానే పంపేస్తున్నారని ఆర్జేడీ ఎంపీ జయప్రకాశ్ నారాయణ యాదవ్ ఆరోపించారు. మరోవైపు లాలూ ఆరోగ్యం మెరుగుపడిందని, అందుకే ఆయనను రాంచీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామని ఎయిమ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన డిశ్చార్చ్ వెనుక కుట్ర, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలను ఎయిమ్స్ వైద్యులు ఖండించారు. డిశ్చార్జి సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్‌కు లాలూ లేఖ రాశారు. ‘నాకు ఏదైనా జరిగితే ఎయిమ్స్ బృందం బాధ్యత వహించా ల్సి ఉంటుంది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. రాహుల్ పరామర్శ: అంతకుముందు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించి.. కాసేపు మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో లాలూతో రాహుల్ -
ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు సృష్టిస్తాం
మంగళూరు: కర్ణాటకలో రాబోయే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలను సృష్టిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. వ్యవసాయ రంగంపై రూ.1.25 లక్షల కోట్లను వెచ్చిస్తామని హామీ ఇచ్చారు. మంగళూరులో శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. ‘2025 నాటికి నవకర్ణాటక నిర్మాణ సంకల్పం’ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రధాని తన మనసులో మాట(మన్‌కీ బాత్)ను ప్రజలు వినాలని కోరుకుంటారనీ, తాము మాత్రం కర్ణాటక ప్రజల మనసులోని మాటను మేనిఫెస్టోలో చేర్చామని పేర్కొన్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో 95 శాతాన్ని సిద్దరామయ్య ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. పర్యటనలో భాగంగా ధర్మస్థలలో మంజునాథేశ్వరున్ని రాహుల్ దర్శించుకున్నారు. భారీస్థాయిలో వ్యవసాయ కారిడార్ కర్ణాటకలో రూ.1.25 లక్షల కోట్లతో 10 ఆగ్రో–జోన్లతో వ్యవసాయ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ తెలిపింది. దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకత పెంపు, ధరల స్థిరీకరణ, సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేయడం వీలవుతుందని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం, పోలీస్ విభాగంలో 33 శాతం మహిళా ఉద్యోగులు భర్తీ అయ్యేలా చర్యలు తీసుకుంటామంది. వివిధ ప్రాజెక్టులకు సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీచేస్తామని తెలిపింది. కావేరీ బేసిన్లో అదనంగా ఉన్న 80 టీఎంసీల నీటిని వాడుకోవడం ద్వారా రాష్ట్రంలో ఆహార భద్రతను సాధిస్తా మని వెల్లడించింది. రాష్ట్రంలో ఐటీ సెక్టార్‌ను మరింతగా అభివృద్ధి చేస్తామనీ, స్టార్టప్‌లకు సబ్సిడీలు అందజేస్తామని పేర్కొంది. స్కూళ్లతో పాటు ప్రభుత్వ సాయం పొందే కోచింగ్ సెంటర్లలో నాణ్యత పెంచుతామంది. రాహుల్ విమాన ఘటనపై దర్యాప్తు బెంగళూరు: రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఘటనపై దర్యాప్తు కోసం డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఇద్దరు నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఘటనపై కర్ణాటక పోలీసులూ దర్యాప్తు ప్రారంభించారు. కర్ణాటకలోని హుబ్బలి ఎయిర్‌పోర్ట్‌లో గురువారం రాహుల్ విమానం ల్యాండింగ్‌కు ముందు అనుమానాస్పద ఘటనలు జరిగాయని కాంగ్రెస్ నేత ఒకరు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ సమయంలో విమానం ఒక్కసారిగా ఎడమ వైపునకు ఒరిగిపోయిందని, వాతావరణం బాగానే ఉన్నా.. అనుమానాస్పదంగా ల్యాండ్ అయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ధ్యాసంతా మళ్లీ పీఎం కావాలనే
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం సహా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటులో తాను 15 నిమిషాలు మాట్లాడితే ప్రధాని మోదీ సభ నుంచి పారిపోతారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో సోమవారం ప్రారంభమైన సేవ్ ది కాన్స్టిట్యూషన్(రాజ్యాంగాన్ని కాపాడండి) కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా, మైనారిటీలపై దాడులు, దళితుల హక్కులకు భంగం కలిగినా, చివరికి దేశం తగలబడిపోయినా మోదీకి పట్టదని మండిపడ్డారు. మోదీ ధ్యాసంతా మళ్లీ ప్రధాని కావడం మీదే ఉంటుందన్నారు. కేంద్రం అన్ని వ్యవస్థలను ఆర్ఎస్ఎస్ నేతలతోనే నింపేస్తోందని దుయ్యబట్టారు. మోదీ గతంలో ఇచ్చిన ‘బేటీ బచావో–బేటీ పఢావో’ నినాదం ప్రస్తుతం ‘బీజేపీ నేతల నుంచి మీ కుమార్తెల్ని కాపాడుకోండి’గా మారిపోయిందన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మోదీకి తమ మనసులోని మాటను(మన్‌కీ బాత్) చెబుతారని ఆయన చురకలంటించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించగల సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కథనాలు రాసినా, విమర్శించినా మీడియాకు అండగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మీడియాకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొద్ది రోజుల్లో మీడియా స్వేచ్ఛగా మాట్లాడే రోజులొస్తాయన్నారు. వంశపారంపర్యాన్ని కాపాడే కార్యక్రమం.. వంశపారంపర్యమైన పాలనను కాపాడుకోవడానికే రాహుల్ ‘సేవ్ ది కాన్స్టిట్యూషన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాకుండా వంశపారంపర్య పాలను కోరుకుంటోందని ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ రూపొందించిందని రాహుల్ చెప్పడం బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడమేనని షా విమర్శించారు. కాగా, రెండు లోక్‌సభ ఎన్నికల్లో అంబేడ్కర్ ఓటమికి నెహ్రూ వ్యక్తిగతంగా కృషి చేశారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. -
నేటి నుంచి కాంగ్రెస్ ‘సేవ్ ది కాన్స్టిట్యూషన్’
న్యూఢిల్లీ: బీజేపీ హయాంలో దేశంలో రాజ్యాంగంతోపాటు దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపిస్తూ సోమవారం నుంచి కాంగ్రెస్ ‘రాజ్యాంగాన్ని రక్షించండి’ (సేవ్ ది కాన్స్టిట్యూషన్) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన బీఆర్ అంబేడ్కర్ జయంతి వరకు కొనసాగనున్న ఈ ప్రచార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టనున్నారు. 2019 ఎన్నికల్లో దళితులకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా పార్టీ చేపట్టే ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ , ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్, సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, సుశీల్ కుమార్ షిండే తదితరులు పాల్గొననున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ దళిత నేతలు వివిధ స్థాయిల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రస్తుత బీజేపీ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించి, ప్రజాభిప్రాయాన్ని కూడగడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
వాళ్లా పాండవులు?
న్యూఢిల్లీ: గతంలో రాముడి అస్తిత్వాన్నే ప్రశ్నించిన పార్టీ నేడు తమను తాము పాండవులుగా చెప్పుకుంటారా అని బీజేపీ నేత, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. ప్లీనరీలో రాహుల్ విమర్శలను తిప్పికొడుతూ.. సిక్కుల ఊచకోతకు, లక్షలకోట్ల కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ నేతలు.. పాండవులమని చెప్పుకోవటం విడ్డూరన్నారు. నరేంద్ర మోదీకి.. నీరవ్, లలిత్ మోదీలతో సంబంధమున్నట్లు చూపించే ప్రయత్నం పూర్తిగా అర్థరహితమని మంత్రి తెలిపారు. ‘నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన రాహుల్ గాంధీ.. మహాత్ముని ఇంటిపేరుతో ఉన్నారు. దీన్నెలా చూడాలి?’ అని ప్రశ్నించారు. ‘ఓ కేసులో తనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినపుడు ఇం దిరా గాంధీ న్యాయవ్యవస్థపై ఎలా వ్యవహరించారో నేను గుర్తుచేయాలా? 1988లో రాజీవ్ గాంధీ ప్రెస్ హక్కులను కాలరాసే బిల్లును తీసుకొచ్చినంత పనిచేశారు. ఎమర్జెన్సీలో ఇందిర మీడియాతో ఎలా వ్యవహరించారు? ఆమె మనుమడు ఇప్పుడు మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడటం విడ్డూరం’ అని ఆమె పేర్కొన్నారు. -
తీర్మానాలకు తుదిరూపు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. వచ్చే ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణకు పార్టీ సీనియర్ నేతలు తొలిరోజు తుది రూపునిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భావ సారుప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని రాజకీయ తీర్మానంలో పొందుపర్చారు. ఏఐసీసీ, పీసీపీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనే నేటి ప్లీనరీని ఉద్దేశించి పార్టీ అధ్యక్షుడు రాహుల్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ప్లీనరీలో నేతల కంటే కార్యకర్తలపైనే ఎక్కువ దృష్టి పెడతామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించగా.. నేటి సమావేశంలో కార్యకర్తలు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనున్నారు. నేడు రాజకీయ తీర్మానంతో పాటు వ్యవసాయం, ఉద్యోగాలు, పేదరిక నిర్మూలనపై మరొక తీర్మానాన్ని ఆమోదిస్తారు. పార్టీకి దిశానిర్దేశం చేయడంతో పాటు మోదీ ప్రభుత్వ వైఫల్యాల్ని ఈ సమావేశాల్లో ప్రధానంగా ఎండగడతారని తెలుస్తోంది. అలాగే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేసేలా ఈ ప్లీనరీని వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ ప్లీనరీలో సోనియా గాంధీ కూడా ప్రసంగిస్తారని సమాచారం. శుక్రవారం రాహుల్ నేృతృత్వంలో జరిగిన సబ్జెక్ట్స్ కమిటీ సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు సహా సీనియర్ నేతలతో పాటు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా, మన్మోహన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో అనేక సలహాలు, సూచనలు వచ్చాయని, తీర్మానాల్లో వాటిని పొందుపర్చాలని కమిటీల చైర్మన్లను రాహుల్ గాంధీ ఆదేశించారని పార్టీ తెలిపింది. -
ఏఐసీసీ కమిటీలో పొన్నంకు చోటు
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించిన రాజ కీయ సబ్‌కమిటీలో చోటు కల్పించారు. ఎ.కె.ఆంటోని అధ్యక్షతన నియమించిన ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల కమిటీలో అన్ని రాష్ట్రాల నుంచి 25మంది సభ్యులుండగా, అందులో పొన్నంకు అవకాశం కల్పిం చారు. మాజీ ప్రధాని మన్మోహన్ అధ్యక్ష తన నియమించిన డ్రాఫ్ట్ కమిటీలోనూ పొన్నంకు అవకాశం వచ్చింది. కాగా కీలక కమిటీల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించడం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
కనీసం ‘లోక్‌పాల్’ కూడా లేదు
సాక్షి, బెంగళూరు (బెళగావి): అవినీతిపై పోరాటం అంటూ ప్రసంగాల్లో ఊదరగొట్టే ప్రధాని మోదీ లోక్‌పాల్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రశ్నించారు. సోమవారం కర్ణాటకలో బెళగావి రామదుర్గ బహిరంగసభలో ప్రసంగిస్తూ కనీసం ఢిల్లీలో కూడా లోక్‌పాల్‌ను మోదీ ఏర్పాటు చేయలేకపోయారన్నారు. దేశంలో అతి పెద్ద మోసాలు, నేరాలు సంభవిస్తుంటే ప్రధాని నోరు మెదపడం లేదన్నారు. మోదీ కర్ణాటక రాష్ట్రానికి వచ్చి తమ సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతి కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన యడ్యూరప్ప, బీజేపీ మాజీ మంత్రులు పక్కనే కూర్చొని ఉండడాన్ని మరచినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని కార్పొరేట్ శక్తుల కోసమే మోదీ పనిచేస్తున్నారన్నారు. కర్ణాటకలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని రాహుల్ చెప్పారు. రాష్ట్రంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని, వారే తమను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మూడు రోజుల రెండో విడత జనాశీర్వాద యాత్ర సోమవారంతో ముగిసింది. -
200 షెల్ కంపెనీలు, బినామీ ఆస్తులు
-
200 షెల్ కంపెనీలు, బినామీ ఆస్తులు
న్యూఢిల్లీ/ముంబై: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీలు పీఎన్బీని రూ. 11,400 కోట్లకు మోసగించిన కేసులో దర్యాప్తు సంస్థలు దాదాపు 200 షెల్(నకిలీ) కంపెనీలు, బినామీ ఆస్తుల్ని గుర్తించాయి. భారత్‌తో పాటు విదేశాల్లోని ఈ కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు నెరపి.. స్థలాలు, బంగారం, విలువైన రాళ్ల రూపంలో బినామీ ఆస్తుల్ని కూడగట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఐటీ శాఖలు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ, ఐటీ శాఖల అధికారులు బృందంగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వరుసగా నాలుగోరోజైన ఆదివారం కూడా మోదీ, చోక్సీల ఆస్తులపై ఈడీ దాడులు కొనసాగించింది. దేశవ్యాప్తంగా 15 నగరాల్లోని 45 చోట్ల నగల దుకాణాలు, తయారీ కేంద్రాల్లో సోదాలు నిర్వహించి రూ. 20 కోట్ల మేర వజ్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దాదాపు 24 స్థిరాస్తుల్ని గుర్తించి మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద అటాచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ కేసులో ఈడీ రూ. 5,674 కోట్ల మేర వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన రాళ్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఆదాయపు పన్ను శాఖ తాత్కాలికంగా అటాచ్ చేసిన 29 ఆస్తుల విలువను కూడా అంచనా వేస్తున్నాం. త్వరలో మరిన్ని ఆస్తుల్ని అటాచ్ చేస్తాం’ అని ఈడీ తెలిపింది. అందరికీ పర్సంటేజీలు.. మెహుల్ చోక్సీ ప్రమోటర్‌గా ఉన్న గీతాంజలి గ్రూప్ కంపెనీల అనుబంధ సంస్థల ఆస్తిఅప్పుల పట్టీని ఆదివారం తనిఖీ చేసిన సీబీఐ.. కస్టడీలో ఉన్న పీఎన్బీ ఉద్యోగులు గోకుల్ నాథ్ శెట్టి (రిటైర్డ్), మనోజ్ ఖారత్, నీరవ్ హామీదారు హేమంత్ భట్‌ను ప్రశ్నించింది. విచారణలో శెట్టి, ఖారత్లు పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించినట్లు సమాచారం. నీరవ్ , చోక్సీలకు ‘లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్ఓయూ), లెటర్ ఆఫ్ క్రెడిట్ల జారీ కోసం మంజూరు చేసిన మొత్తానికి అనుగుణంగా పర్సంటేజీలు వసూలు చేసేవారని, కుంభకోణంతో ప్రమేయమున్న అందరు అధికారులకు ఆ మొత్తాన్ని పంచేవారని తెలుస్తోంది. పీఎన్బీ కుంభకోణానికి కేంద్ర బిందువైన ముంబైలోని బ్రాడీ రోడ్డు బ్రాం చ్‌ను సీబీఐ దాదాపుగా తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. సోమవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరో ఆరుగురు వ్యక్తుల్ని విచారించిన దర్యాప్తు సంస్థ.. వారి పేర్లు చెప్పేందుకు నిరాకరించింది. వారిలో పలువురు బ్యాంకు అధికారులుండగా.. ఒకట్రెండు రోజుల్లో వారిని మరోసారి విచారించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకు సర్వర్ల నుంచి స్వా«ధీనం చేసుకున్న రికార్డుల్ని అధ్యయనం చేస్తున్నామని, క్విడ్ ప్రో కో కోణంలో కూడా దర్యాప్తు ఉంటుందని.. ప్రస్తుతం దృష్టంతా కేసును పూర్తిగా వెలికితీసి.. నిధులు ఎక్కడికి మళ్లాయో తెలుసుకోవడంపైనే ఉందని సీబీఐ వెల్లడించింది. శ్వేతపత్రం విడుదల చేయాలి: కాంగ్రెస్ దేశంలోని ఆర్థిక మోసగాళ్లతో బీజేపీ అగ్ర నాయకత్వానికి సంబంధాలున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గత ఐదేళ్లలో రూ. 61 వేల కోట్ల మేర బ్యాంకు కుంభకోణాలు చోటుచేసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించిందని, ఆ ఐదేళ్లలో నాలుగేళ్లు ఎన్డీఏనే అధికారంలో ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ఢిల్లీలో పేర్కొన్నారు. ఆర్థిక మోసగాళ్లకు, బీజేపీ అగ్ర నాయకత్వానికి సంబంధాలు.. దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర సందేహాల్ని రేకెత్తిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల లోపు బ్యాంకింగ్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, బ్యాంకుల నుంచి కోట్ల రుణాలు తీసుకొని మోసగించిన సంస్థలు, ప్రమోటర్లు, కార్పొరేట్ సంస్థల యజమానుల వివరాల్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు బయటపెట్టేలా కేంద్రం ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఉన్న ఎన్పీఏలు(నిరర్ధక ఆస్తులు), బ్యాంకుల్ని మోసగించిన సంస్థల వివరాల్ని వెబ్సైట్లలో ప్రజలకు తెలిసేలా అన్ని బ్యాంకులు ఉంచాలన్నారు. కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకు మోసాలకు బీజం పడిందంటున్న బీజేపీ గత నాలుగేళ్ల కాలంలో వాటిపై ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఎన్పీఏల మొత్తం విలువ రూ. 8,36,782 కోట్లు కాగా.. ఈ విషయంలో ప్రపంచంలో భారత్ ఐదో స్థానంలో ఉందని, ఎన్‌పీఏల్లో కార్పొరేట్ కంపెనీల వాటా 77 శాతమని తివారీ తెలిపారు. రెండు నిమిషాలు కూడా మాట్లాడలేరా?: రాహుల్ పీఎన్బీ కుంభకోణంలో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు నోరు విప్పాలని, తప్పు చేసిన వారిలా ప్రవర్తించవద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. ‘పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణులవ్వాలో విద్యార్థులకు ప్రధాని మోదీ రెండు గంటలు పాఠాలు చెప్పారు. అయితే రూ.22 వేల కోట్ల బ్యాంకింగ్ కుంభకోణంపై మాత్రం రెండు నిమిషాలు కూడా మాట్లాడరు. జైట్లీ దాక్కుంటున్నారు’ అని ట్వీటర్లో ఎద్దేవా చేశారు. -
ఆర్మీని అవమానించారు
న్యూఢిల్లీ: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యలు అవమానకరమనీ, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం డిమాండ్ చేశారు. భాగవత్ ఆదివారం బిహార్‌లో ఆరెస్సెస్ స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘సైనిక సిబ్బందిని సన్నద్ధం చేయడానికి ఆర్మీకి ఆరేడు నెలలు పట్టచ్చేమో కానీ ఆరెస్సెస్‌కు మూడు రోజులు చాలు’ అని అన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్ మాట్లాడుతూ ‘భాగవత్ అలా అనడం తప్పు. ఆర్మీని ఆయన అవమానించారు. ఆ మాటలు నాకు బాధ కలిగించాయి. మన సైనికులు సరిహద్దుల్లో నిల్చొని రక్తం చిందిస్తున్నారు. భాగవత్ తన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలి’ అని అన్నారు. ఆర్మీ సామర్థ్యాన్ని భాగవత్ తక్కువ చేసి మాట్లాడారనీ, ఇలాంటి వ్యాఖ్యలు సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ అన్నారు. అవమానించలేదు: ఆరెస్సెస్ భాగవత్ వ్యాఖ్యలను వక్రీకరించారనీ, ఆయన ఆర్మీని అవమానించలేదంటూ ఆరెస్సెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. సంఘ్ స్వయం సేవకులతో సైనికులను భాగవత్ పోల్చలేదని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఈ అంశాన్ని కావాలని రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. అధికారంలోకి వస్తే రుణమాఫీ సాక్షి, బళ్లారి/రాయచూరు రూరల్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా పంట రుణాలు మాఫీ చేయడంతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీనిచ్చారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు ఎరువులు, పురుగు మందులపై రాయితీ ఇస్తామన్నారు. కర్ణాటకలో జనాశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం రాయచూరు, యాదగిరి, గుల్బర్గాల్లో రాహుల్ పర్యటించారు. -
‘రాఫెల్’ అవినీతిపై మోదీ బదులేది?
సాక్షి, బళ్లారి: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ విమర్శలను తీవ్రం చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణమనీ, ఎంతో అనుభవమున్న ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను రాఫెల్ కాంట్రాక్టు నుంచి తప్పించి తన సన్నిహితుడికి ఎందుకు అప్పగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా హొసపేటలో జరిగిన ఎన్నికల ‘జనాశీర్వాద్ యాత్ర’లో రాహుల్ మాట్లాడారు. ‘రాఫెల్’ వ్యవహారంపై తాను సంధించిన 3 ప్రశ్నలకు మోదీ జవాబివ్వలేకపోయారన్నారు. వెనుక నుంచి వచ్చే వాహనాలను అద్దంలో గమనిస్తూ నడిపే వాహనదారు మాదిరిగా.. ప్రధాని మోదీ గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తూ నోట్ల రద్దు, జీఎస్టీ వంటి తప్పిదాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వెనుక వాటిని చూస్తూ వాహనాన్ని ముందుకు నడిపితే ప్రమాదాలు తప్పవని వ్యాఖ్యానించారు. ముందు చూపుతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్యను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. మోదీ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. కాగా, బళ్లారి, కొప్పాల్, రాయిచూర్, కలబురిగి, బీదర్ జిల్లాల్లో నాలుగు రోజుల ఎన్నికల ప్రచారంలో రాహుల్ బస్సులో ప్రయాణిస్తూ సభలు, ర్యాలీల ద్వారా ప్రజలను కలుసుకుంటున్నారు. కాగా, యూపీఏ హయాంలో 126 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందమే కుదరలేదని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి. -
ప్రణబ్ దగ్గర నేర్చుకోండి!
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. రాఫెల్ యుద్ధ విమానం, దీంతోపాటు కొనుగోలు చేసిన యుద్ధ సామగ్రి వివరాలన్నీ దేశ భద్రతకు సంబంధించిన అంశాలని దీనిపై వివరాలు కోరటం హాస్యాస్పదమన్నారు. ‘మాజీ రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ దగ్గర జాతీయ భద్రతపై పాఠాలు నేర్చుకోండ’ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కి సూచించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా విపక్షాలు రాఫెల్ వివరాలు వెల్లడించాలని పట్టుబడ్డటంపై జైట్లీ ఈ విధంగా స్పందించారు. ‘మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై మీరు రాజీ పడ్డారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంపైనా అవినీతి బురద చల్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగేళ్లుగా మోదీ స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అందుకే ఓ సంక్షోభాన్ని, ఓ వివాదాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే రాఫెల్ వివరాలు వెల్లడి చేయాలని వివాదం చేస్తున్నారు’ అని జైట్లీ రాజ్యసభలో పేర్కొన్నారు. 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి భారత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రామాయణ వ్యాఖ్యలపై దుమారం కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిపై ప్రధాని మోదీ చేసిన ‘రామాయణ’ వ్యాఖ్యలపై గురువారం రాజ్యసభలో దుమారం రేగింది. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన మోదీ క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. దీనికి తోడు మోదీ తనపై వ్యంగ్యంగా మాట్లాడుతున్న వీడియో క్లిప్‌ను హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేయటంపై రేణుక మండిపడ్డారు. ప్రధాని హోదాకు తగ్గట్లుగా మోదీ వ్యవహరించలేదని.. ఆయన క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ నేత సుష్మితాదేవ్ డిమాండ్ చేశారు. రేణుక వ్యాఖ్యలపై దుమారం కారణంగా రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. మోసపూరిత ఆర్థిక విధానంతో.. అంతకుముందు, రాజ్యసభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత చిదంబరం కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వ్యవసాయ సంక్షోభాన్ని పట్టించుకోవటం లేదని, ఉపాధికల్పనను పూర్తిగా విస్మరించిందని.. ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానం పూర్తిగా మోసపూరితమని.. దేశంలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పోతోందని తీవ్రంగా దుయ్యబట్టారు. తాజా బడ్జెట్ ద్వారా వేతన జీవులు, వయోవృద్ధలుకు రూ.12వేల కోట్ల లబ్ధి చేకూరిందని ఆర్థిక మంత్రి జైట్లీ లోక్‌సభలో వెల్లడించారు. దీర్ఘకాల మూలధన రాబడి పన్ను పెంచటాన్ని సమర్థించుకున్న జైట్లీ.. దీని కారణంగా తలెత్తే సమస్యలను ఎలా ఎదుర్కొవాలో ప్రభుత్వానికి తెలుసన్నారు. ప్రణబ్, ఆంటోనీలూ చెప్పలేదు రూ.58వేల కోట్ల ఒప్పందాన్ని బహిర్గతం చేసేందుకు విముఖత చూపిన జైట్లీ.. యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి రక్షణ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఏకే ఆంటోనీలు 15 సందర్భాల్లో ఇలాంటి వివరాలు వెల్లడించలేదని గుర్తుచేశారు. అప్పుడు దేశ భద్రత, జాతి ప్రయోజనాలను వారు కారణంగా చూపించారని సభకు వెల్లడించారు. ‘ధరలు, ఇతర వివరాలను బయటపెట్టడం ద్వారా.. సదరు హెలికాప్టర్/ఆయుధానికి సంబంధించిన సాంకేతిక వివరాలన్నీ బయటకొస్తాయి. అది మన రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్నీ వెల్లడిస్తుంది. ఇది శత్రువుకు తెలియజేయటానికి రక్షణ వ్యవస్థ, ప్రభుత్వం ఒప్పుకోవు’ అని జైట్లీ వెల్లడించారు. అయితే జాతి భద్రతకు సంబంధించిన వివరాలను తాము అడగటం లేదని.. పారదర్శకతను మాత్రమే కోరుతున్నామని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు. -
ఇది సెన్సెక్స్ అవిశ్వాస తీర్మానం: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో సెన్సెక్స్ 840 పాయింట్లు కోల్పోవడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ వ్యంగ్యంగా స్పందించారు. ‘పార్లమెంటరీ పరిభాషలో చెప్పాలంటే మోదీ బడ్జెట్‌పై సెన్సెక్స్ 800 పాయింట్ల బలమైన అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కేంద్రం గడువు ఇంకో ఏడాది ఉండటాన్ని గుర్తుచేస్తూ.. ‘మరో ఏడాదే మిగిలింది’ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. బడ్జెట్ దెబ్బకు బీఎస్ఈ సెన్సెక్స్ రెండున్నరేళ్లలో ఎన్నడూ లేనంతగా 840 పాయింట్లు, ఎన్ఎస్సీ 256 పాయింట్లను కోల్పోయింది. -
కొంతైనా నల్లధనం తెచ్చారా: రాహుల్
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..తిరిగి వస్తూ విమానంలో కొంతైనా నల్లధనాన్ని తీసుకువచ్చారా అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు అక్రమంగా దాచిన నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తానన్న మోదీ ఎన్నికల హామీపై ఆయన ట్వీటర్లో ఈ వ్యంగ్యాస్త్రం సంధించారు. మీరు స్విట్జర్లాండ్ నుంచి నల్లధనం తెస్తారని ఇక్కడి యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఎద్దేవాచేశారు. దావోస్ వేదికపై ప్రసంగించిన మోదీ.. దేశంలోని సంపదలో 73 శాతం ఒక్క శాతం ఉన్న ధనికుల వద్దే ఎందుకు పోగుపడిందనే విషయంపైనా ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. దీనిపై రిఫరెన్స్ కోసం.. సంబంధిత ఆక్స్‌ఫామ్ సంస్థ నివేదికను కూడా జతపరుస్తున్నట్లు పేర్కొన్నారు. -
మళ్లీ మోదీయే బాద్షా!
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని రిపబ్లిక్ టీవీ, సీ–వోటర్ సర్వే పేర్కొంది. మొత్తం 543 స్థానాల్లో 335 సీట్లను ఈ కూటమి చేజిక్కించుకుంటుందని వెల్లడించింది. అటు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ 89 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే అభిప్రాయపడింది. ఇటు, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి, అధికార టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనీ సర్వే తెలిపింది. రాజకీయ వాతావరణం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతోందని పేర్కొంది. ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 13 చోట్ల విజయం సాధిస్తుందని.. టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే 12 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. గతంలో కంటే వైఎస్సార్సీపీ అదనంగా ఐదు స్థానాలు గెలుచుకోనుందని పేర్కొంది. ఇటు తెలంగాణ (17 స్థానాలు)లో టీఆర్ఎస్ 11 స్థానాల్లో, బీజేపీ 3, కాంగ్రెస్ రెండు చోట్ల, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తాయని వెల్లడించింది. తమిళనాట రజనీమాట... అమ్మలేని లోటు స్పష్టంగా కనబడుతున్న తమిళనాడు రాజకీయాలను ఇకపై రజనీకాంత్ శాసిస్తారని సర్వే అభిప్రాయపడింది. ఈ రాష్ట్రంలోని 39 ఎంపీ స్థానాల్లో రజనీకాంత్ పార్టీకి 23 సీట్లు వస్తాయని పేర్కొంది. ద్రవిడ రాజకీయాలను కాదని అన్నాడీఎంకే, డీఎంకే వంటి పక్షాలను పక్కనపెట్టి 33 శాతం తమిళ ఓటర్లు రజనీకి పట్టంగడతారని తెలిపింది. అటు డీఎంకే 14 సీట్లతో రెండో స్థానంలో అన్నాడీఎంకే రెండు చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఒకవేళ రజనీ సార్వత్రిక ఎన్నికల రంగంలోకి దిగని పక్షంలో డీఎంకే 32 సీట్లను గెలుచుకుంటుందని.. అప్పుడు అన్నాడీఎంకే 6 సీట్లు, బీజేపీ ఒకచోట విజయం సాధిస్తాయని పేర్కొంది. మోదీకే పగ్గాలు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వే వెల్లడించింది. ప్రధాని మోదీ చరిష్మా కారణంగా 41.4 శాతం ఓట్లతో ఎన్డీయేకి 335 సీట్లు వస్తాయని పేర్కొంది. యూపీఏ 27.7 శాతం ఓట్లతో 89 సీట్లు సాధిస్తుందని పేర్కొంది. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓట్ల శాతంతోపాటు సీట్లలోనూ స్వల్ప తగ్గుదల కనబడుతోంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీయేతర ఇతర పార్టీలు స్వల్ప ఆధిక్యాన్ని పొందే అవకాశముందని సర్వే పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ దూసుకుపోతుండటంతో ఇక్కడ కోల్పోయిన స్థానాలను మిగిలిన ప్రాంతాల్లో గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. అటు ప్రధాని పీఠంపై ఎవరు కూర్చోవాలన్న విషయంలో మోదీకి 62.7 శాతం మంది ఓటేయగా.. రాహుల్ 12.6 శాతం మంది అభిమానాన్ని పొందగలిగారు. కన్నడ, మరాఠీ రాష్ట్రాల్లోనూ.. పొరుగున ఉన్న కర్ణాటకలోనూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరచనుందని అంచనా. మొత్తం 28 సీట్లలో బీజేపీ 22 చోట్ల, యూపీఏ 5, జేడీఎస్ ఒక స్థానంలో గెలుస్తుందని సర్వే పేర్కొంది. మహారాష్ట్రలో మాత్రం ఎన్డీయేకు సర్వే భారీ మెజారిటీని కట్టబెట్టింది. మొత్తం 48 సీట్లలో ఎన్డీయేకే 44 స్థానాలొస్తాయని పేర్కొంది. ఇక్కడ కాంగ్రెస్‌కు 2, ఎన్సీపీకి రెండు సీట్లు దక్కుతాయని తెలిపింది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీచేస్తే ఎన్డీయేకే 35 సీట్లే రావొచ్చని అభిప్రాయపడింది. దీనికితోడు ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన శివసేన నిత్యం కత్తులు నూరుతున్న నేపథ్యంలో బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీ చేస్తే.. మరిన్ని తక్కువ సీట్లు రావొచ్చని అభిప్రాయపడింది. ఈశాన్యరాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో బీజేపీ దాదాపుగా అన్ని సీట్లను గెలచుకుంటుందని సర్వే పేర్కొంది. అయితే ఐఎన్ఎల్డీ, ఎన్సీపీ, జార్ఖండ్ ముక్తిమోర్చా, తృణమూల్ కాంగ్రెస్, జేడీఎస్ వంటి ప్రాంతీయ పార్టీలతో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పొత్తుపెట్టుకుంటే యూపీఏ సీట్లలో పెరుగుదల కనబడుతుందని సర్వే పేర్కొంది. ప్రత్యర్థుల కోటల్లో కమలవికాసం ఇన్నాళ్లుగా బీజేపీ విస్తరించేందుకు ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతాల్లో 2019 ఎన్నికల్లో ఈ పార్టీ గణనీయమైన సీట్లు సాధించేందుకు వీలున్నట్లు అర్థమవుతోంది. గత ఎన్నికల్లో ఒడిశాలో ఒక సీటు మాత్రమే గెలిచిన బీజేపీ ఈసారి 13 చోట్ల విజయం సాధిస్తుందని.. అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ (బీజేడీ) పార్టీ సీట్లలో నుంచి బీజేపీ భారీగా లాభం పొందుతుందని సర్వే తెలిపింది. అటు పశ్చిమ బెంగాల్ (42)లో బీజేపీ 12 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా.. అధికార తృణమూల్ 29 సీట్లలో గెలుస్తుందని అంచనా వేసింది. అత్యధిక ఎంపీ సీట్లున్న యూపీలో ఈ సారి బీజేపీ ఆధిపత్యానికి యూపీఏ గండికొట్టనుంది. మొత్తం 80 సీట్లలో బీజేపీ 60 స్థానాలను గెలుచుకోనుండగా యూపీఏ 18 చోట్ల, ఇతరులు రెండుచోట్ల గెలుస్తారని సీ–వోటర్, రిపబ్లిక్ సర్వే వెల్లడించింది. మొత్తంమీద ఒక్క పంజాబ్‌లోనే ఎన్డీయే కన్నా యూపీఏ ఎక్కువ స్థానాలు గెలుచుకోనున్నట్లు సమాచారం. -
రాజ్యాంగంపై బీజేపీ దాడి
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై బీజేపీ దాడికి పాల్పడుతోందని, రాజకీయ లబ్ధి కోసం అసత్యాల్ని ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ మాత్రం సత్యాన్ని పరిరక్షించేందుకు పోరాటం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ 133వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. రాజ్యాంగాన్ని సవరించాలన్న కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే వ్యాఖ్యల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘రాజ్యాంగం అమల్లోకి వచ్చిన క్షణాలు భారతదేశ చరిత్రలో ఎంతో ముఖ్యమైనవి. చివరికి ఆ రాజ్యాంగంపై కూడా దాడి చేస్తున్నారు. దేశానికి పునాదిగా ఉన్న రాజ్యాంగం, అంబేడ్కర్ మనకిచ్చిన రాజ్యాంగంపై దాడి బాధ కలిగిస్తోంది. వెనుక నుంచి దొంగతనంగా దాడి చేస్తున్నారు. అయితే రాజ్యాంగాన్ని, ప్రతీ వ్యక్తికున్న హక్కులు, అభిప్రాయాల్ని పరిరక్షించడం కాంగ్రెస్ పార్టీదే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత’ అని రాహుల్ పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం అసత్య ప్రచారం అసత్యాలతో బీజేపీ మోసపూరిత వలను అల్లుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని వాడుకుంటోందని ఆయన విమర్శించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా, ఎన్నికల్లో ఓడినా సరే సత్య మార్గాన్ని వదిలిపెట్టబోదని, దానిని పరిరక్షిస్తూనే ఉంటుందని చెప్పారు. సత్యమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య సిద్ధాంతమని.. దానిని కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గత విజయాలను ప్రస్తావించిన రాహుల్.. శతాబ్దానికి పైగా కాంగ్రెస్ దేశ ప్రయోజనాల కోసం పాటుపడుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా ఆయన గురువారం అక్బర్ రోడ్డులోని కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీడబ్ల్యూసీ సభ్యులు సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు. -
మోదీ నమూనా ఒక అపోహ
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ అభివృద్ధి నమూనాను ప్రజలు ఒక అపోహగా తిరస్కరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఎద్దేవా చేశారు. తమ పార్టీ కార్యకర్తలు సమర్థంగా పనిచేశారని, బీజేపీని ఘెరావ్ చేసినంత పనిచేశారని, తమ ప్రశ్నలకు బీజేపీ బదులివ్వలేకపోయిందని అన్నారు. తదుపరి ఎన్నికలు జరిగే 2022లో 135 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారం రాష్ట్ర నాయకులతో సమావేశమై గుజరాత్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. తాజా ఎన్నికల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మనం ఈ ఎన్నికల్లో ఓడినా గెలిచినట్లే. ఎందుకంటే బీజేపీ డబ్బు, పారిశ్రామికవేత్తలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రచారంతో గెలిస్తే మనం సత్యంతో పోటీచేశాం’ అని రాహుల్ అన్నారు. అంతకుముందు, సోమ్‌నాథ్ ఆలయంలో పూజలు చేశారు. -
అబద్ధాలే బీజేపీ పునాదులు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: అధికార బీజేపీకి అబద్ధాలే పునాదులని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ విరుచుకుపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ తొలిసారిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో..లక్షలాది కోట్ల రూపాయల 2జీ స్కాం అంటూ మోదీ,æజైట్లీ తప్పుడు సమాచారంతో యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేశారన్నారు. ఒక అబద్ధాన్ని కల్పించటం, దానిని ప్రచారం చేయటం, ప్రజలు నమ్మేదాకా పదేపదే అదే అబద్ధాన్ని చెప్పటం..ఇదే బీజేపీ కుట్ర అని చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశాజనకమైన ఫలితాలను సాధించటం, యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేసిన భారీ కుంభకోణం 2జీ కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన మర్నాడే ఈ సమావేశం జరగటం గమనార్హం. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సన్నద్ధతపైనా చర్చించారు. పార్టీలో క్రమశిక్షణ అంశం, నిర్మాణాత్మకంగా పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిన పార్టీ నేతల వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా పార్టీకి మార్గదర్శకత్వం వహించి, ఎనలేని సేవలు అందించిన మాజీ అధినేత్రి సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ సీడబ్ల్యూసీ ఒక తీర్మానంచేసింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇకపై రాహుల్ సీడబ్ల్యూసీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఆజాద్, తదితరులతోపాటు రాష్ట్రాల అధ్యక్షులు హాజరయ్యారు. -
రాహుల్ అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ
న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రాహుల్‌గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి తొలిసారి అధ్యక్షత వహించనున్నారు. దీంతో నూతన సారథికి సీడబ్ల్యూసీ ఘన స్వాగతం పలకనుంది. ఈ భేటీ శుక్రవారం ఉదయం పదిన్నరకు ప్రారంభమవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ తెలిపారు. కాగా ఈ సమావేశ అజెండా అధికారికంగా వెల్లడి కానప్పటికీ దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఇందులో చర్చించ నున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనబరిచిన ప్రభావవంతమైన పనితీరును పార్టీకి భవిష్యత్‌లో ఎలా అన్వయించాలో యోచించనున్నట్లు తెలిపారు. 2జీ కేసులో నిందితులందరూ నిర్దోషులన్న కోర్టు తీర్పుపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, నరేంద్ర మోదీ ఈ కేసును ప్రచారాస్త్రంగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో అవినీతి జరగలేదన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ఈ మేరకు ప్రణాళిక రూపొందించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వివరించాయి. గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గైర్హాజరీలో పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ సీడబ్ల్యూసీ సమావేశానికి అధ్యక్షత వహించినప్పటికీ పూర్తి స్థాయి అధ్యక్షుడిగా మాత్రం ఇదే తొలి భేటీ కావడం గమనార్హం. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ డిసెంబర్ 11న ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 16న బాధ్యతలు చేపట్టారు.