ఆదివారం అహ్మదాబాద్‌లో ఓ కౌంటింగ్ కేంద్రం వద్ద మోహరించిన బలగాలు
అహ్మదాబాద్/సిమ్లా: దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. సొంత రాష్ట్రం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ సామర్థ్యానికి గుజరాత్ ఫలితాలు పరీక్షగా నిలవనున్నాయి. గుజరాత్‌లో వరుసగా ఆరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ.. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడ్డాయి. కాగా ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రం గుజరాత్‌తో పాటు, హిమాచల్ ప్రదేశ్‌లోను బీజేపీదే విజయమని తేల్చి చేప్పేశాయి. హిమాచల్ ఫలితాలు కూడా నేడే వెలువడనున్నాయి.
ఉదయం 8 గంటల ప్రాంతంలో మొదలయ్యే ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను 37 చోట్ల కౌంటింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 నియోజకవర్గాలకు గాను డిసెంబర్ 9న 89 స్థానాల్లో, డిసెంబర్ 14న 93 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. రెండు విడతల్లో 68.41 శాతం పోలింగ్ నమోదైంది. 2012తో పోల్చితే ఈ సారి 2.91 శాతం ఓటింగ్ తగ్గింది.
వేడి పుట్టించిన ఎన్నికల ప్రచారం
ఈ ఫలితాలు 2019 పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనుండటంతో బీజేపీ, కాంగ్రెస్‌లు దీటుగా తలపడ్డాయి. ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీల నేతలు పరస్పరం ఘాటైన విమర్శలు చేసుకున్నారు. ఒక దశలో వ్యక్తిగత విమర్శలు తారస్థాయికి చేరాయి. బీజేపీ ప్రచారానికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ ప్రచారానికి రాహుల్ గాంధీ నేతృత్వం వహించారు. రామ మందిరం అంశంతో పాటు గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోదీపై ‘నీచ్ ఆద్మీ’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మణి శంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గుజరాత్ భవిష్యత్తు గురించి మాట్లాడటం లేదని, రాష్ట్ర ప్రజల ప్రధాన సమస్యల్ని పక్కనపెట్టారని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, బీజేపీని రాహుల్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో పటీదార్, ఓబీసీ, దళిత నేతలైన హార్దిక్ పటేల్, అల్పేశ్ ఠాకూర్, జిగ్నేష్ మేవానీలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. బీజేపీని చిత్తుగా ఓడించాలని.. కాంగ్రెస్‌కు ఓటేయాలని పటీదార్ వర్గానికి హార్దిక్ పిలుపునిచ్చారు.
హిమాచల్‌లోనూ..
గుజరాత్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా నేడు జరగనుంది. ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధూమల్‌తో సహా 337 మంది అభ్యర్థుల జాతకాలు తేలనున్నాయి. మొత్తం 68 నియోజకవర్గాలకు గాను 42 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తారు. రాష్ట్రంలో నవంబర్ 9న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 75.28 శాతం ఓటింగ్ నమోదు కాగా.. బీజేపీదే విజయమని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పేశాయి.
150 మంది ఇంజనీర్లతో ఈవీఎంల హ్యాకింగ్: హార్దిక్
గుజరాత్ ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగే అవకాశముందని హార్దిక్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేవుడు చేసిన సంక్లిష్ట మానవ శరీరంలోనే మార్పులు చేయగలిగినప్పుడు.. మానవులు తయారుచేసిన ఈవీఎంల్ని ట్యాంపరింగ్ చేయలేమా?’ అని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పటీదార్ ప్రాబల్య ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ఈవీఎంల హ్యాకింగ్‌కు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. అహ్మదాబాద్‌కు చెందిన ఒక కంపెనీ నుంచి 150 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. 5000 ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు యత్నిస్తున్నారని శనివారం హార్దిక్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా ఈవీఎంల హ్యాకింగ్, ట్యాంపరింగ్ జరిగే అవకాశముందని కమ్రేజ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఫిర్యాదు మేరకు సూరత్‌లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వైఫై సేవల్ని రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment