న్యూఢిల్లీ/ దహేగామ్: గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలదాడిని తీవ్రతరం చేశారు. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను పాక్ గృహనిర్బంధం నుంచి విడుదల చేయడంపై స్పందిస్తూ.. ‘ నరేంద్ర భాయ్.. పని పూర్తికాలేదు. ఉగ్ర సూత్రధారి(సయీద్) స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. పాక్‌లో లష్కరే ఉగ్రవాదులను ఏరివేయడానికి ఆ దేశ సైన్యానికి ఇస్తున్న నిధుల్ని అమెరికా కాంగ్రెస్ నిలిపివేసింది. మీ కౌగిలింతల దౌత్యం విఫలమైంది.
చూస్తుంటే మరిన్ని కౌగిలింతల అవసరం పడేట్లు ఉంది’ అని ట్వీటర్‌లో చురకలంటించారు. మరోవైపు ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు, అమిత్ షా కుమారుడు జయ్‌షా ఆస్తులపై విపక్షాలను ఎదుర్కొనే ధైర్యంలేకే ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్ని వాయిదా వేసిందన్నారు. గుజరాత్‌లోని దహేగామ్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. రాఫెల్ ఒప్పందాన్ని అధిక ధరకు మళ్లీ ఎందుకు కుదుర్చుకున్నారో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment