హవేరిలో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ
సాక్షి, బెంగళూరు: ప్రధాని మోదీ బెంగళూరును చెత్త నగరంగా సంబోధించి అవమానించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు. ‘ప్రియమైన మోదీజీ.. మీరు బెంగళూరును నేరాల నగరి అని, చెత్త నగరం అని సంబోధించి అవమానించారు. అబద్ధాలు చెప్పడం మీకు సహజంగానే అబ్బింది. మీకంటే యూపీఏ ప్రభుత్వం 1,100% ఎక్కువ నిధులు కర్ణాటక నగరాల అభివృద్ధికి కేటాయించింది. కర్ణాటకకు కాంగ్రెస్ రూ.6,570 కోట్లు కేటాయిస్తే.. బీజేపీ ప్రభుత్వం కేవలం రూ.598 కోట్లు మాత్రమే ఇచ్చింది’ అని అన్నారు.
రాహుల్ గజేంద్రగఢ్, కల్గి, హావేరీల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో మాట్లాడారు. దళితులపై అత్యాచార ఘటనలు కొనసాగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మోదీని ప్రశ్నించారు. కొందరు పారిశ్రామికవేత్తలకు మాత్రం మోదీ కొమ్ముకాస్తూ బలహీనవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ గురించి తరచూ మాట్లాడే మోదీ ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో దళిత నేత ఖర్గే పలు కీలక అంశాలను ప్రస్తావించబోగా అడ్డుకున్నారని ఆరోపించారు. బీజేపీ అనుబంధ సంస్థల కార్యకర్తలు దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నా మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని పేర్కొన్నారు.
మైనింగ్ అక్రమాలకు పాల్పడిన రెడ్డి సోదరులను తమ ప్రభుత్వం జైలుకు పంపిస్తే..బీజేపీ ప్రభుత్వం వారిని విడుదల చేయించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలనే బీజేపీ తన మేనిఫెస్టోలో నింపేసిందన్నారు. అంతకుముందు రాహుల్ బీదర్ జిల్లాలోని గురుద్వారాను సందర్శించి ప్రార్థనలు చేశారు. మహిళా సాధికారితపై ప్రధాని మోదీ మాటలు మాని.. చేతల్లో చూపాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మహిళల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను ఆయన ట్వీటర్‌లో ఉదహరించారు.
బీజేపీ అభ్యర్ధి ఆకస్మిక మృతి, ఎన్నిక వాయిదా
సిట్టింగ్ ఎమ్మెల్యే, జయనగర్ బీజేపీ అభ్యర్థి బీఎన్ విజయ్‌కుమార్‌ఆకస్మికంగా మృతి చెందారు. శుక్రవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో ఉండగానే గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి చనిపోయారని పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. దీంతో అక్కడ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment