పేదల కోసం పోరాడుతున్నందునే..
న్యూఢిల్లీ: సమాజంలో పేదలు, ఇతర బలహీన వర్గాల కోసం తాను పోరాడుతున్నందున.. తనకు వ్యతిరేకంగా మాజీ సహచర నేత జయంతి నటరాజన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రయోగించారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆయన బుధవారం ఢిల్లీలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. 'ఓ రోజు నేను మోదీ గురించి ఏదో అన్నా.. మరుసటి రోజు ఆయన నటరాజన్‌ను (నాకు వ్యతిరేకంగా) నిలబెట్టారు' అని పేర్కొన్నారు. పర్యావరణ అనుమతుల విషయంలో రాహుల్ జోక్యం చేసుకునేవారని కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ ఇటీవల చేసిన ఆరోపణలపై రాహుల్ స్పందించటం ఇదే తొలిసారి.
జయంతి గత శనివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 'నేను పేదలు, ఆదివాసీలకోసం పోరాడాను. పర్యావరణం, పేదలు, ఆదివాసీల సంక్షేమాన్ని పట్టించుకోవాలని నేను నటరాజన్‌కు చెప్పాను. పేదలు, గుడిసెవాసులు, బలహీన వర్గాల కోసం నేను పోరాటం కొనసాగిస్తా' అని రాహుల్ తాజాగా పేర్కొన్నారు. మోదీ కేవలం తన పారిశ్రామిక మిత్రుల ప్రయోజనం కోసమే పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. తాను సమాజంలోని పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, వ్యాపారవేత్తలకు ప్రయోజనం కలిగించేందుకు కాదని చెప్పారు.
భూసేకరణ చట్టం యూపీఏను దెబ్బతీసింది..
దేశంలో అత్యంత అవినీతి భూమికి సంబంధించే జరుగుతోందని.. ఈ సమస్య గురించి ఇతరులు కేవలం మాటలు చెప్తే.. కాంగ్రెస్ మాత్రం దానిని అరికట్టేందుకు భూసేకరణ బిల్లు తేవటం ద్వారా చర్యలు చేపట్టిందని రాహుల్ పేర్కొన్నారు. భూసేకరణ బిల్లును బీజేపీ వ్యతిరేకించిందని.. కానీ తాము అది ఆమోదం పొందేలా కృషిచేశామని చెప్పారు. బహుశా యూపీఏ-2 హయాంలో ఇదే అత్యంత కష్టమైన పని కావచ్చని అభివర్ణించారు. ఈ చట్టం యూపీఏకు రాజకీయంగా నష్టం కలిగించిందని.. ఈ చట్టం వల్ల నష్టాలపాలయిన శక్తులు తమకు వ్యతిరేకంగా నిలిచారని రాహుల్ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖచిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ మార్చివేసిందన్నారు. అయితే పార్టీ సరిచేసుకోవాల్సిన లోపాలు కొన్ని ఉన్నాయని అంగీకరించారు.
ప్రధానిది 'మేక్ ఇన్ యూకే' సూటు
ప్రధాని నరేంద్ర మోదీ 'మేక్ ఇన్ ఇండియా' ప్రచారాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తూర్పారబట్టారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా మోదీ రూ. పది లక్షల విలువ చేసే ఖరీదైన సూట్ ధరించారని, అది కూడా యూకేలో తయారైందని రాహుల్ వెల్లడించారు. ప్రధాని కేవలం నలుగురైదుగురు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారని కూడా ఆరోపించారు.
'యువతకు ఉపాధి కల్పిస్తామని మోదీ అంటున్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దీనివల్ల ఏమైనా ఫలితం ఉందా? ఆయన మాత్రం రూ. పది లక్షల సూట్ ధరిస్తారు. అది కూడా భారత్‌లో తయారైంది కాదని, మేక్ ఇన్ యూకే అని పత్రికలు పేర్కొంటున్నాయి. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా చేతికి చీపుర్లు ఇచ్చి శుభ్రం చేయమని మోదీ చెబుతున్నారు. దానివల్ల మీ బాధలు ఏమైనా తగ్గాయా?' అని రాహుల్ ప్రశ్నించారు. నల్లధనాన్ని వెనక్కితెస్తామని ప్రజలకిచ్చిన మాటను ప్రధాని నిలబెట్టుకోలేదన్నారు.