నీరవ్ మోదీ
న్యూఢిల్లీ/ముంబై: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీలు పీఎన్‌బీని రూ. 11,400 కోట్లకు మోసగించిన కేసులో దర్యాప్తు సంస్థలు దాదాపు 200 షెల్(నకిలీ) కంపెనీలు, బినామీ ఆస్తుల్ని గుర్తించాయి. భారత్‌తో పాటు విదేశాల్లోని ఈ కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు నెరపి.. స్థలాలు, బంగారం, విలువైన రాళ్ల రూపంలో బినామీ ఆస్తుల్ని కూడగట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఐటీ శాఖలు నిర్ధారణకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఈడీ, ఐటీ శాఖల అధికారులు బృందంగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వరుసగా నాలుగోరోజైన ఆదివారం కూడా మోదీ, చోక్సీల ఆస్తులపై ఈడీ దాడులు కొనసాగించింది. దేశవ్యాప్తంగా 15 నగరాల్లోని 45 చోట్ల నగల దుకాణాలు, తయారీ కేంద్రాల్లో సోదాలు నిర్వహించి రూ. 20 కోట్ల మేర వజ్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దాదాపు 24 స్థిరాస్తుల్ని గుర్తించి మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద అటాచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ కేసులో ఈడీ రూ. 5,674 కోట్ల మేర వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన రాళ్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఆదాయపు పన్ను శాఖ తాత్కాలికంగా అటాచ్ చేసిన 29 ఆస్తుల విలువను కూడా అంచనా వేస్తున్నాం. త్వరలో మరిన్ని ఆస్తుల్ని అటాచ్ చేస్తాం’ అని ఈడీ తెలిపింది.
అందరికీ పర్సంటేజీలు..
మెహుల్ చోక్సీ ప్రమోటర్‌గా ఉన్న గీతాంజలి గ్రూప్ కంపెనీల అనుబంధ సంస్థల ఆస్తిఅప్పుల పట్టీని ఆదివారం తనిఖీ చేసిన సీబీఐ.. కస్టడీలో ఉన్న పీఎన్‌బీ ఉద్యోగులు గోకుల్ నాథ్ శెట్టి (రిటైర్డ్), మనోజ్ ఖారత్, నీరవ్ హామీదారు హేమంత్ భట్‌ను ప్రశ్నించింది. విచారణలో శెట్టి, ఖారత్‌లు పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించినట్లు సమాచారం. నీరవ్ , చోక్సీలకు ‘లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌ఓయూ), లెటర్ ఆఫ్ క్రెడిట్‌ల జారీ కోసం మంజూరు చేసిన మొత్తానికి అనుగుణంగా పర్సంటేజీలు వసూలు చేసేవారని, కుంభకోణంతో ప్రమేయమున్న అందరు అధికారులకు ఆ మొత్తాన్ని పంచేవారని తెలుస్తోంది.
పీఎన్‌బీ కుంభకోణానికి కేంద్ర బిందువైన ముంబైలోని బ్రాడీ రోడ్డు బ్రాం చ్‌ను సీబీఐ దాదాపుగా తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. సోమవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరో ఆరుగురు వ్యక్తుల్ని విచారించిన దర్యాప్తు సంస్థ.. వారి పేర్లు చెప్పేందుకు నిరాకరించింది. వారిలో పలువురు బ్యాంకు అధికారులుండగా.. ఒకట్రెండు రోజుల్లో వారిని మరోసారి విచారించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకు సర్వర్ల నుంచి స్వా«ధీనం చేసుకున్న రికార్డుల్ని అధ్యయనం చేస్తున్నామని, క్విడ్ ప్రో కో కోణంలో కూడా దర్యాప్తు ఉంటుందని.. ప్రస్తుతం దృష్టంతా కేసును పూర్తిగా వెలికితీసి.. నిధులు ఎక్కడికి మళ్లాయో తెలుసుకోవడంపైనే ఉందని సీబీఐ వెల్లడించింది.
శ్వేతపత్రం విడుదల చేయాలి: కాంగ్రెస్
దేశంలోని ఆర్థిక మోసగాళ్లతో బీజేపీ అగ్ర నాయకత్వానికి సంబంధాలున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గత ఐదేళ్లలో రూ. 61 వేల కోట్ల మేర బ్యాంకు కుంభకోణాలు చోటుచేసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించిందని, ఆ ఐదేళ్లలో నాలుగేళ్లు ఎన్డీఏనే అధికారంలో ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ఢిల్లీలో పేర్కొన్నారు. ఆర్థిక మోసగాళ్లకు, బీజేపీ అగ్ర నాయకత్వానికి సంబంధాలు.. దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర సందేహాల్ని రేకెత్తిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వచ్చే పార్లమెంటు సమావేశాల లోపు బ్యాంకింగ్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, బ్యాంకుల నుంచి కోట్ల రుణాలు తీసుకొని మోసగించిన సంస్థలు, ప్రమోటర్లు, కార్పొరేట్ సంస్థల యజమానుల వివరాల్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు బయటపెట్టేలా కేంద్రం ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఉన్న ఎన్పీఏలు(నిరర్ధక ఆస్తులు), బ్యాంకుల్ని మోసగించిన సంస్థల వివరాల్ని వెబ్‌సైట్లలో ప్రజలకు తెలిసేలా అన్ని బ్యాంకులు ఉంచాలన్నారు. కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకు మోసాలకు బీజం పడిందంటున్న బీజేపీ గత నాలుగేళ్ల కాలంలో వాటిపై ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఎన్పీఏల మొత్తం విలువ రూ. 8,36,782 కోట్లు కాగా.. ఈ విషయంలో ప్రపంచంలో భారత్ ఐదో స్థానంలో ఉందని, ఎన్పీఏల్లో కార్పొరేట్ కంపెనీల వాటా 77 శాతమని తివారీ తెలిపారు.
రెండు నిమిషాలు కూడా మాట్లాడలేరా?: రాహుల్
పీఎన్‌బీ కుంభకోణంలో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు నోరు విప్పాలని, తప్పు చేసిన వారిలా ప్రవర్తించవద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. ‘పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణులవ్వాలో విద్యార్థులకు ప్రధాని మోదీ రెండు గంటలు పాఠాలు చెప్పారు. అయితే రూ.22 వేల కోట్ల బ్యాంకింగ్ కుంభకోణంపై మాత్రం రెండు నిమిషాలు కూడా మాట్లాడరు. జైట్లీ దాక్కుంటున్నారు’ అని ట్వీటర్‌లో ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment