న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్ష కాంగ్రెస్, అధికార బీజేపీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఓ వ్యాపారవేత్తకు ప్రయోజనం చేకూర్చేలా బీజేపీ మొత్తం ఒప్పందంలోనే మార్పులు చేసిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ఆరోపించారు. వీటిని బీజేపీ అంతే దీటుగా తిప్పికొట్టింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఆ పార్టీ కీలక నేతలు విచారణ ఎదుర్కొనే అవకాశాలున్నందున ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసింది.
ఇటీవలే ఏర్పాటైన అఖిల భారత అసంఘటిత రంగ కార్మికుల కాంగ్రెస్ (ఏఐయూడబ్ల్యూసీ) సమావేశం తరువాత రాహుల్ మాట్లాడుతూ... ఓ వ్యాపారవేత్తకు అనుకూలంగా వ్యవహరించేందుకే రాఫెల్ ఒప్పందంలో మార్పులు చేసిన ప్రధాని మోదీని నిలదీయాలని మీడియాను కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమిత్ షా కొడుకు జయ్ షా కంపెనీ లాభాలు అనూహ్యంగా పెరిగాయని ఈ విషయంపై కూడా ప్రశ్నించాలన్నారు. ‘మీరు నన్ను అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తా.
రాఫెల్ ఒప్పందంపై మోదీని ఎందుకు ప్రశ్నించరు? జయ్ షా కంపెనీ గురించి ఎందుకు అడగరు?’ అని అన్నారు. ఏరోస్పేస్ రంగంలో ఎలాంటి అనుభవంలేని రిలయన్స్ కంపెనీని రఫేల్ ఒప్పందంలో భాగం చేయ డంపై ప్రధాని వివరణ ఇవ్వాలన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ...తమ పాలనలో ఒక్క అవినీతి కేసు కూడా నమోదుకాలేదన్న నిజాన్ని కాంగ్రెస్ అంగీకరించలేకపోతోందన్నారు.
రిలయన్స్‌తో ఒప్పందం: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ప్రయోజనాలను దెబ్బతీశారని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ఇటీవలే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్ విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ హెచ్‌ఏఎల్‌కు సాంకేతికతను బదిలీచేయడానికి నిరాకరించి రిలయన్స్ డిఫెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ఫలితంగా రెండు సంస్థలు ఓ సంయుక్త సంస్థనూ ఏర్పాటుచేశాయి. యూపీఏ హయాంలో నిర్ధారించిన ధర కన్నా చాలా ఎక్కువకు విమానాలు కొనుగోలు చేస్తున్నారని సుర్జేవాలా ఆరోపించారు. కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమని రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ కొట్టిపారేసింది. ఇది రెండు ప్రైవేట్ కంపెనీల మధ్య ఒప్పందమని, ఇందులో ప్రభుత్వ పాత్ర లేదని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment