
రాహుల్‌కు సీఈసీ డిమాండ్
ఈసీ భుజాల మీదుగా ఓటర్లపై గురి
విపక్షాల తీరుపై జ్ఞానేశ్ మండిపాటు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో లక్షలాది ఓట్లను తొలగించి పరోక్షంగా ఓటుహక్కును అపహరించారన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణలను ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆయన ఆరోపణల మేరకు ఓటు చోరీపై ఏడు రోజుల్లో సమగ్ర అఫిడవిట్ సమరి్పంచాలి.
లేని పక్షంలో దేశప్రజలకు తక్షణం క్షమాపణ చెప్పాలి’’ అని ఆదివారం ప్రెస్ మీట్‌లో డిమాండ్ చేశారు. ‘‘ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్న వారికి ఏడు రోజుల గడువిస్తున్నా. వారి ఆరోపణలపై ఆలోపు ప్రమాణపత్రం సమరి్పంచాలి. లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పడం మినహా మరో దారి లేదు. ఎలాంటి రుజువులూ లేకుండా మీరు చేస్తున్న ఈ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు. అబద్ధాలతో కొన్ని పార్టీలు ఈసీ భుజాల మీదుగా ఓటర్లకు తుపాకీ గురి పెడుతున్నాయి. ’’ అన్నారు.
పారదర్శకంగా ఎస్‌ఐఆర్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ చేపట్టిన ఓటు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) అత్యంత పారదర్శకంగా సాగుతోందని సీఈసీ చెప్పారు. ‘‘దీనిపై కొన్ని విపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయి. శాశ్వత స్థిరనివాసంలో ఒకటి, వేరే ప్రాంతానికి వలస వెళ్లడం వల్ల మరోటి... ఇలా కొందరికి రెండు ఓటర్ గుర్తింపు కార్డులు ఉండొచ్చు. ఇలాంటి తప్పిదాలను సరిచేసేందుకు పోలింగ్ యంత్రాంగం కృషిచేస్తోంది.
ప్రతి ఎన్నికకు ముందూ ఓటరు జాబితాలో తప్పులు దిద్దడం ఈసీ విధి. సవరణపై సలహాలిచ్చేందుకు ఈసీ తలుపులు అందరికీ తెరచే ఉంటాయి’’ అని సీఈసీ అన్నారు. ‘‘అధికార, విపక్షాలనే తేడా లేకుండా అందరినీ ఈసీ ఒకేలా పరిగణిస్తుంది. విపక్ష పార్టీలపై ఎలాంటి వివక్షా ఉండదు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఆరోపణలు, ఫిర్యాదులు సెప్టెంబర్ 1 లోపే చేసేయండి. తర్వాత స్వీకరించబోం’’ అన్నారు.
వాళ్ల ఇంటి నంబర్ సున్నాయే
‘‘దొంగ, నకిలీ ఓట్లను చేర్చి వాటి చిరునామాలో ఇంటి నంబర్‌ను సున్నాగా పేర్కొన్నట్టు రాహుల్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఇల్లు లేని, వంతెనలు, ఫుట్‌పాత్‌లు, వీధి దీపాలు, అనధికార కాలనీల్లో నివసించే వారికి నిర్దిష్టమైన చిరునామా, నంబర్ ఉండవు. అందుకే ఆ కాలమ్‌ను ఖాళీగా వదిలేయకుండా ఇంటి నంబర్‌ను ‘సున్నా’గా పేర్కొంటాం. ఓటేసేందుకు చిరునామా ముఖ్యంకాదు. ఓటరు ఏ బూత్‌లో ఓటేస్తాడనేదే ముఖ్యం’’ అన్నారు.
‘‘వేర్వేరు బూత్‌ల్లో ఒకే వ్యక్తి పేర్లు నమోదైనట్లు ఆరోపణలే తప్ప ఆ మేరకు ఇప్పటిదాకా ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. గత ఆరు నెలల్లో బిహార్‌లో 22 లక్షల మంది ఓటర్లు చనిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఇవన్నీ గత 20 ఏళ్లలో సంభవించినవి. ఎస్‌ఐఆర్ వల్లే ఈ గణాంకాలు వెలుగు చూస్తున్నాయి. మెషీన్ రీడబుల్ ఓటర్ జాబితా ఫార్మాట్‌ను పార్టీలకు ఇచ్చే ప్రసక్తే లేదు. అలా ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఫార్మాట్‌లో డేటా బయటికొస్తే ఓటర్ల గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదముంది’’ అని చెప్పారు.