words of war
-
చిచ్చురేపుతున్న నేపాల్!
మిత్ర దేశాల మధ్య చిచ్చు రేగింది. భారత్, నేపాల్ సరిహద్దు వివాదం... సరికొత్త మలుపులు తిరుగుతోంది. నేపాల్ కొత్త మ్యాపుతో మంట రేగుతోంది. ఏమిటీ వివాదం ? ఎందుకు ముదురుతోంది ? వివాదం మొదలైంది ఇలా ... జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చూపిస్తూ గత ఏడాది నవంబర్‌లో భారత్ ఒక మ్యాప్ విడుదల చేసింది. అందులో కాలాపానీ ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ భూభాగంలో ఉన్నట్టుగానే చూపించింది. అప్పట్లోనే నేపాల్‌లో అక్కడక్కడా నిరసన స్వరాలు వినిపించాయి. ఆ తర్వాత మానససరోవర్‌కు వెళ్లే యాత్రికుల ప్రయాణ దూరాన్ని తగ్గించడానికి లిఫులేఖ్ ప్రాంతంలో నిర్మించిన 80.కి.మీ. రహదారిని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నెల 8న ప్రారంభించారు. దీంతో నేపాల్ ఒక్కసారిగా కస్సుమంది. లిఫులేఖ్, కాలాపానీ, లింపియాథురా ప్రాంతాలను తమ దేశ భూభాగంగా చూపిస్తూ కొత్త దేశ పటాన్ని విడుదల చేసింది. దానికి రాజ్యాంగబద్ధతను తీసుకురావడానికి పార్లమెంటులో తీర్మానం కూడా చేసింది. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతాలు తమవేనని నేపాల్‌కు స్పష్టం చేసింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నేపాల్ బుసల వెనుక డ్రాగన్ ? నేపాల్‌కు ఏ చిన్న కష్టమొచ్చినా నేనున్నానంటూ భారత్ ఆదుకుంటుంది. ఎన్నో అంశాల్లో నేపాల్ భారత్‌పైనే ఆధారపడి ఉంది. కానీ ఈ మధ్య కాలంలో నేపాల్ చీటికీ మాటికీ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్ నుంచి వచ్చిన వారితో విస్తరించిన కరోనా వైరస్ చైనా కంటే డేంజర్ అంటూ నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పడు సరిహద్దు వివాదానికి తెరతీశారు. దీని వెనుక చైనా హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి. నేపాల్ ప్రధానమంత్రి ఓలి ఏకపక్ష నిర్ణయాలతో అక్కడ రాజకీయ సంక్షోభం తీవ్రతరమైంది.. ఓలి రాజీనామా చేయాలని ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) డిమాండ్ చేసింది. ఆ సమయంలో చైనా ఓలికి అండగా నిలబడింది. నేపాల్‌లో చైనా రాయబారి ఆ పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించినట్టుగా కథనాలు వచ్చాయి. ప్రతిఫలంగా ఓలి చైనాకు కొమ్ముకాస్తూ భారత్ రక్షణని ప్రమాదంలో పడేసే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కోవిడ్–19ని అరికట్టడంలో వైఫల్యం, పార్టీలోనూ, ప్రజల్లోనూ పట్టు కోల్పోతున్న ఓలి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి కాలాపానీ అంశాన్ని పెద్దది చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాలాపానీ చరిత్రలోకి వెళితే ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్ జిల్లాలో నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతమే కాలాపానీ. సముద్రమట్టానికి 3,600 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. 35 చదరపు కిలో మీటర్లు ఉండే ఈ ప్రాంతం మహాకాలీ నది జన్మస్థావరం. ఎప్పట్నుంచో ఇది భారత్‌లో అంతర్భాగంగానే ఉంది. ఈ మార్గం ద్వారానే భారతీయ యాత్రికులు అత్యంత సాహసోపేతమైన మానస సరోవర్ యాత్రకి వెళతారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో భారత్ అక్కడ 18 సైనిక శిబిరాల్ని ఏర్పాటు చేసింది. 1969లో నేపాల్‌తో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంతో కాలాపానీలో మినహా మిగిలిన సైనిక శిబిరాలన్నీ తొలగించింది. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలపై నిఘా పెట్టాలంటే కాలాపానీ ప్రాంతంలో సైనిక శిబిరం అత్యంత ముఖ్యం. అయితే కాలాపానీ ప్రాంతం తమదేనని నేపాల్ వాదిస్తోంది. నేపాల్‌కు, ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య 1816లో జరిగిన సుగౌలీ ఒప్పందం ప్రకారం కాలీ నది నేపాల్‌లో ప్రవహిస్తోందని చెప్పారని, ఆ నది పుట్టిన భూభాగం తమదేనన్నది ఆ దేశం వాదన. దేశ పటాన్ని మార్చడంలో నేపాల్ ఏకపక్ష నిర్ణయానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. సరిహద్దు వివాదాలు దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కారమవుతాయన్న భావనకు వ్యతిరేకంగా ఓలి సర్కార్ వ్యవహరిస్తోంది. సరిహద్దు రేఖల్ని తమ ఇష్టారాజ్యంగా మార్చేస్తామంటే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి -
అవసరమైతే చైనాతో తెగదెంపులు: ట్రంప్
వాషింగ్టన్/లండన్/ఢాకా: కోవిడ్–19 సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య సంబంధాలు బీటలు వారుతున్నట్టుగానే కనిపిస్తోంది. అవసరమైతే చైనాతో తెగతెంపులు చేసుకోవడానికి కూడా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిందని ఇప్పటికే పలు మార్లు ఆరోపించిన ట్రంప్ కోవిడ్–19 కట్టడి చర్యల్లో చైనా వైఫ్యలంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫాక్స్ బిజినెస్ నెట్వర్క్ బ్రాడ్‌కాస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై పునః చర్చలకు ఇక ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడాలన్న ఆసక్తి కూడా తనకి లేదన్నారు. చైనాతో సంబంధాల అంశంలో ఇంకా చాలా చేయాల్సి ఉందని, అసలు పూర్తిగా సంబంధాలు తెంపుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే జరిగితే అమెరికాకు 50 వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయన్నారు. కోవిడ్‌పై సహకరించుకోవాలి: చైనా చైనాతో తెగదెంపులౖకైనా సిద్ధపడతానని ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఆ దేశం ఆచితూచి స్పందించింది. కోవిడ్–19ను ఎదుర్కోవడంలో ఇరుదేశాల ప్రజల సంక్షేమానికే పెద్ద పీట వేసి, కలిసి పనిచేయాలని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్‌లో 5.80 లక్షల సర్జరీలు రద్దు? కోవిడ్ విజృంభణ నేపథ్యంలో భారత్‌లో 5 లక్షల 80 వేలకు పైగా సర్జరీలు రద్దు కావచ్చని, లేదంటే వాయిదా పడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ సర్జరీ భారత్‌లో శస్త్రచికిత్సలపై ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. బంగ్లాదేశ్ రోహింగ్యా శిబిరాల్లో కరోనా బంగ్లాదేశ్ దక్షిణ ప్రాంతంలో ఉన్న రోహింగ్యా శరణార్థి శిబిరంలో తొలి కరోనా కేసు నమోదైంది. బంగ్లాలో రోహింగ్యాల శిబిరాలు అత్యంత రద్దీతో ఉంటాయి. కాక్స్ బజార్ జిల్లాలోని ఒక శిబిరంలో తలదాచుకుంటున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన రేపుతోంది. బంగ్లాలో వివిధ శరణార్థి శిబిరాల్లో 10 లక్షల మంది తలదాచుకుంటున్నారు. -
మళ్లీ ప్రపంచ మార్కెట్లు క్రాష్..!
టోక్యో/న్యూయార్క్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల వృద్ధికి తీవ్రంగానే విఘాతం కలిగిందన్న తాజా గణాంకాల కారణంగా ఆస్ట్రేలియా, జపాన్, బ్రిటన్, అమెరికా మార్కెట్లు శుక్రవారం పతనమయ్యాయి. కార్మికుల దినోత్సవం సందర్భంగా చాలా మార్కెట్లలో ట్రేడింగ్ జరగలేదు. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కారణంగా మన మార్కెట్‌కు సెలవు కావడంతో భారీ పతనం తప్పిందని నిపుణులంటున్నారు. పతనం ఎందుకంటే...: ఆస్ట్రేలియాలో తయారీ రంగం 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతేకాకుండా కరోనా వైరస్ మూలం ఎక్కడో విచారణ చేయాలన్న అంశంపై ఆస్ట్రేలియా, చైనాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆస్ట్రేలియా నుంచి దిగుమతులపై ఆంక్షలు వి«ధించడం వంటి చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. మరోవైపు నిరుద్యోగ భృతి కోసం అమెరికాలో దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య భారీగా పెరిగింది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఆరు వారాల్లో మూడు కోట్లకు చేరింది. ఈ ఏడాది మార్చిలో అమెరికాలో వినియోగదారుల వ్యయం రికార్డ్ స్థాయికి పడిపోయింది. కాగా యూరోజోన్ వృద్ధి ఈ క్యూ1లో 3.8 శాతం తగ్గింది. ఈ గణాంకాలు మొదలైనప్పటి (1995) నుంచి చూస్తే, ఇదే అత్యంత అధ్వాన క్షీణత. ఆస్ట్రేలియా స్టాక్ సూచీ 5 శాతం పడిపోగా, జపాన్ నికాయ్ 3 శాతం నష్టపోయింది. బ్రిటన్ ఎఫ్టీఎస్సీ 2 శాతం మేర క్షీణించింది. రాత్రి గం.11.30 ని.సమయానికి అమెరికా స్టాక్ సూచీలు 3–4 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మన నిఫ్టీకి ప్రతిరూపమైన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ పగటి పూట ట్రేడింగ్‌లో 5 శాతం మేర నష్టపోయి, 9,300 పాయింట్ల దరిదాపుల్లోకి వచ్చింది. గురువారం నిఫ్టీ 306 పాయింట్లు లాభపడి 9,860 పాయింట్ల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం మన మార్కెట్లో ట్రేడింగ్ జరిగిఉంటే, సెన్సెక్స్ 1,000 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్ల మేర నష్టపోయి ఉండేవని నిపుణులంటున్నారు. -
అమెరికా విచారణకు చైనా నో!
బీజింగ్/ప్యారిస్/కరాచీ: కరోనా వైరస్ పుట్టుకపై విచారణకు తమ దేశ బృందాలను అనుమతించాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన డిమాండ్‌ను చైనా సోమవారం తోసిపుచ్చింది. మేము కరోనా బాధితులమేగానీ, నేరస్తులం కాదంటూ స్పష్టం చేసింది. వూహాన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పినా ఆ దేశం నుంచి స్పందన లేదని ఆదివారం ట్రంప్ వ్యాఖ్యానించడం తెల్సిందే. కరోనా వైరస్ చైనాలోని వూహాన్లో ఒక పరిశోధనశాల నుంచి తప్పించుకుందా? అనే కోణంలో అమెరికా విచారణ ప్రారంభించింది. ఈ పరిణామాలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ సోమవారం స్పందిస్తూ.. ‘వైరస్ మానవాళి మొత్తానికి శత్రువు. అది ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రత్యక్షం కావచ్చు. ఏ దేశంపైనైనా విరుచుకు పడవచ్చు. మేమూ బాధితులమే. నేరస్తులం కాదు. ఈ వైరస్‌ను తయారు చేసిన వాళ్లలో మేము లేము’అని అన్నారు. సకాలంలో వైరస్ సమాచారం ఇవ్వని చైనాపై చర్యలు తీసుకోవాలని అమెరికా నేతలు డిమాండ్ చేయడంపై గెంగ్ మాట్లాడుతూ..‘వూహాన్లో తొలిసారి వైరస్‌ను గుర్తించింది మొదలు ఇప్పటివరకూ చైనా అన్ని అంశాలను పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహిస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటోంది’అని తెలిపారు. వైరస్ కట్టడికి సంబంధించి చైనా అంతర్జాతీయ సమాజానికి విలువైన సమాచారాన్ని ఇచ్చిందని చెప్పారు. ప్రపంచవ్యాప్త మరణాలకు చైనాపై దావా వేయాలన్న అమెరికా నేతల మాటలకు స్పందిస్తూ.. ఇలాంటి ఘటన ఏదీ గతంలో జరగలేదని, 2009లో హెచ్1ఎన్1 అమెరికాలో బయటపడిందని, హెచ్ఐవీ/ఎయిడ్స్, 2008 నాటి ఆర్థిక సంక్షోభం అమెరికాలో మొదలై ప్రపంచాన్ని కుదిపేశాయని గెంగ్ గుర్తు చేశారు. అప్పట్లో ఎవరైనా అమెరికా బాధ్యత ఏమిటని అడిగారా? అని ప్రశ్నించారు. కరోనా వైరస్‌పై చైనాలో అంతర్జాతీయ బృందం ఒకటి విచారణ జరపాలన్న ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలమంత్రి మరైస్ పేన్ పిలుపును గెంగ్ కొట్టివేశారు.. యూరప్‌లో 11లక్షల మందికి.. యూరప్ మొత్తమ్మీద 11.83 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. సోమవారం వరకూ దాదాపు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసియాలో 1.66 లక్షల మంది కోవిడ్–19తో బాధపడుతూంటే సుమారు ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ► పాకిస్తాన్‌లోని సింధ్‌లో ఓ నిండు గర్భిణి ఆకలికి బలైంది. దేశవ్యాప్త లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో సుగ్రా బీబీ(30) గత వారం మరణించినట్లు వార్తలొచ్చాయి. దినసరి కూలీలమైన తమకు లాక్డౌన్ కారణంగా పని దొరకలేదని, ఆరుగురు పిల్లలున్న తమ కుటుంబానికి ఆహారం అందడం కష్టమైందని సుగ్రా భర్త చెప్పాడు. కేసులు తగ్గాయి: చైనా తమదేశంలో కొత్తగా కరోనా కేసులు తగ్గిపోతున్నాయని చైనా తెలిపింది. తాజాగా మొత్తం 12 కొత్త కేసులు బయటపడగా ఇందులో 8 విదేశాల నుంచి వచ్చిన చైనీయులవేనని అధికారులు చెప్పారు. చైనాలో ఆదివారం కోవిడ్ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇదే సమయానికి విదేశాల నుంచి వచ్చిన చైనీయులు 1,583 మందికి వ్యాధి సోకింది. వీరిలో 43 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. -
‘పుల్వామా’పై రాజకీయ దాడి
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగొన్న దాడి ఘటనకు ఏడాదైన సందర్భంగా భారత్‌లో రాజకీయ చిచ్చు రాజుకుంది. కాంగ్రెస్, వామపక్షాలు దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పిస్తూనే కేంద్రంపై మాటల తూటాలు విసిరాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి సూటిగా మూడు ప్రశ్నలు సంధించారు. 1. ఈ దాడి నుంచి ఎక్కువగా లబ్ధి పొందిందెవరు? 2. ఈ దాడిపై విచారణ ఎంతవరకు వచ్చింది? 3. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి.. భద్రతా వైఫల్యానికి బీజేపీలో ఎవరిది బాధ్యత? ఈ మూడు ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబివ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్‌కు మద్దతుగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గళం విప్పారు. పుల్వామా దాడిలో బతికి బయటపడిన వారికి ఎలాంటి సాయం అందించారని, మృతుల కుటుంబాలకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, బీజేపీ.. జవాన్ల మృతదేహాలతో రాజకీయం చేసి ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. ఉగ్రవాదుల సానుభూతిపరుడు రాహుల్: బీజేపీ జాతి యావత్తూ పుల్వామా దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తుంటే రాహుల్ ఇలా మాట్లాడడం సిగ్గు చేటని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల సానుభూతి పరుడైన రాహుల్ కేంద్రంతో పాటు భద్రతా బలగాలను కూడా టార్గెట్ చేయడం దారుణమని అన్నారు. దోషి అయిన పాక్‌ను రాహుల్ ఎప్పుడూ ప్రశ్నించరెందుకని నిలదీశారు. రాహుల్ తన వ్యాఖ్యల ద్వారా అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను ఇరుకున పెట్టడానికి ఒక ఆయుధం ఇస్తున్నారని ట్వీట్ చేశారు. పుల్వామా దాడిపై విచారణ పురోగతి కష్టమే పుల్వామా దాడిపై విచారణ ముందుకు వెళ్లడానికి అన్ని మార్గాలు మూసుకుపోయినట్టే కనిపిస్తోంది. ఈ దాడితో ప్రమేయం ఉన్న అయిదుగురు ఉగ్రవాదులు భద్రతా బలగాలు చేపట్టిన వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. 2008లో ముంబైపై ఉగ్రవాదుల దాడి తర్వాత ఏర్పాటైన ఉగ్రవాద నిరోధక విచారణ సంస్థ (ఎన్ఐఏ)కు ఈ దాడి వెనుక సూత్రధారి, ఇతర కుట్రదారులెవరు వంటి వివరాలు తెలుసుకోవడానికి కచ్చితమైన సమాచారమేదీ లేదు. ‘‘ఈ కేసులో ఎన్నో అంశాలున్నాయి. కానీ వేటికి ఆధారాలు లేవు. కోర్టుల్లో ఏదైనా సాక్ష్యాధారాలతోనే సమర్పించాలి. అందుకే ఈ కేసులో పురోగతి సాధించలేం’’అని విచారణ బృందంలో ఉన్న అధికారి ఒకరు చెప్పారు. సరిగ్గా ఏడాది క్రితం కరడు గట్టిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భారత్‌పై విద్వేషం వెళ్లగక్కారు. కశ్మీర్లో పుల్వామా సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కారుబాంబుతో దాడి జరిపారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆత్మాహుతి దాడి కోసం వినియోగించిన ఆ కారు యజమాని ఎవరన్నదే ఇప్పటికీ విచారణ బృందానికి సవాల్‌గానే మారింది. మీ బలిదానాన్ని మరువలేం: ప్రధాని ‘పుల్వామా’అమరవీరులకు శుక్రవారం ప్రధాని మోదీ నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసి, చివరికి ప్రాణత్యాగం చేసిన వారికి సాటి, పోటీ ఎవరూ లేరని కొనియాడారు. భారతీయులు ఎన్నటికీ ఆ వీర సైనికుల బలిదానాన్ని మరువలేరని మోదీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ హర్దీప్ పూరీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తదితరులు పుల్వామా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. పుల్వామా స్మారకం ఆవిష్కరణ పుల్వామా దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది స్మృత్యర్థం లెత్పోరా సైనిక శిబిరంలో స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. సీఆర్పీఎఫ్ జవాన్ల సేవ, నిజాయితీలకు గుర్తుగా ఈ స్థూపాన్ని ఆవిష్కరించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్ల ఫోటోలను వారి పేర్లతో సహా ఆ స్థూపంపై చెక్కారు. అమరవీరుల కుటుంబాలకు తాము ఎంతో చేస్తున్నామని సీఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ తెలిపారు. ఇక మహారాష్ట్రకు చెందిన ఉమేష్ గోపీనాథ్ అనే వ్యక్తి మొత్తం 61 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, అమరవీరుల ఇళ్లకు వెళ్లి అక్కడ మట్టిని తీసుకువచ్చి సీఆర్పీఎఫ్ ఏర్పాటు చేసిన స్మారక స్తూపం వద్ద నివాళిగా ఉంచారు. -
మాటల యుద్ధం
న్యూఢిల్లీ/రాయ్‌పూర్/కోల్‌కతా/ముంబై/సిమ్లా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్) దేశవ్యాప్త అమలు ప్రతిపాదనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. సీఏఏను జీవించి ఉండగా అమలు కానివ్వనంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతినబూనగా ఎన్పీఆర్, ఎన్నార్సీలను పేదల జేబులు గుల్లచేయడానికే ప్రభుత్వం తీసుకువచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ అనే మూడింటిని త్రిశూలంగా మార్చి బీజేపీ ప్రభుత్వం ప్రజలపై దాడికి పూనుకుందని సీపీఎం నేత బృందా కారత్ విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాగా, సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల అమలును వ్యతిరేకంగాదేశంలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు కొనసాగాయి. ఇవి పన్ను భారం వంటివే ‘దేశ ప్రజల హక్కులను ఎవరూ లాగేసుకోలేరు. నేను బతికి ఉన్నంత కాలం రాష్ట్రంలో సీఏఏను అమలు కానివ్వను. బెంగాల్లో ఎలాంటి నిర్బంధ కేంద్రాలు లేవు’ అని నైహటిలో జరిగిన ర్యాలీలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్పీఆర్, ఎన్నార్సీలు ప్రజలపై పన్ను భారం వంటివేనన్నారు. ‘నోట్ల రద్దు సమయంలో ప్రజల వద్ద డబ్బును బ్యాంకులు లాగేసుకున్నాయి. అదంతా మోదీకి సన్నిహితులైన 15, 20 మంది పారిశ్రామిక వేత్తల జేబుల్లోకి వెళ్లింది. తాజాగా ఎన్పీఆర్, ఎన్నార్సీలు అమలైతే పేద ప్రజలు వివిధ పత్రాల కోసం అధికారులకు లంచాల రూపంలో మరోసారి డబ్బు ముట్టజెప్పే పరిస్థితి రానుంది’ అని వ్యాఖ్యానించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సామూహిక కృషి, ఐక్యతతోనే దేశం ముందుకు వెళ్తుందన్నారు. రాహుల్ అబద్ధాలు మానలేదు రాహుల్ ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. ‘ఎన్పీఆర్ ధ్రువీకరణల కోసం ప్రజలు ఎవరికీ డబ్బు చెల్లించాల్సిన పనిలేదు. సర్వేలో సేకరించిన సమాచారంతో నిజమైన పేదలను గుర్తించి సంక్షేమ పథకాలను వారికే అందేలా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి కార్యక్రమం కాంగ్రెస్ హయాంలో 2010లో జరిగింది’ అని చెప్పారు. ‘కాంగ్రెస్ చీఫ్‌గా ఉండగా రాహుల్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఆ పదవి లేకున్నా ఆయన అబద్ధాలు ఆపట్లేరు. ‘ఈ ఏడాది అబద్ధాల కోరు ఎవరైనా ఉన్నారూ అంటే.. అతడు రాహుల్ గాంధీయే’ అని ఢిల్లీలో మీడియాతో అన్నారు. సీఏఏ విషయంలో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, పౌరసత్వం కోల్పోతారంటూ ముస్లింల్లో వదంతులు రేపుతున్నాయని సిమ్లాలో హోం మంత్రి అమిత్‌షాఆరోపించారు. ‘సీఏఏలో పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు సంబంధించి ఏవైనా నిబంధనలు ఉంటే చూపించాలని రాహుల్ బాబాకు సవాల్ చేస్తున్నా’ అని అన్నారు. ప్రతిపక్షాలవి ఓటు బ్యాంకు రాజకీయాలు ముంబై మహా నగరం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)లపై అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలకు శుక్రవారం వేదికగా మారింది. బీజేపీకి చెందిన సంవిధాన్ సమ్మాన్ మంచ్ నేతృత్వంలో చారిత్రక క్రాంతి మైదాన్‌లో చేపట్టిన ర్యాలీలో బీజేపీ నేత, మాజీ సీఎం ఫడ్నవీస్ పాల్గొని ప్రసంగించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఎన్నార్సీ, సీఏఏలపై వదంతులు, దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. భీమ్ ఆర్మీ ర్యాలీ అడ్డగింత భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేతులను బంధించుకుని ప్రధాని మోదీ నివాసం వైపు ర్యాలీగా తరలివస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. జోర్‌బాగ్‌లోని దర్గా షా–ఇ–మర్దన్ నుంచి శుక్రవారం ప్రార్థనల అనంతరం చేతులను బంధించుకుని కొందరు ప్రధాని నివాసం లోక్‌కల్యాణ్ మార్గ్ వైపుగా ర్యాలీగా కదలివచ్చారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. -
ట్రంప్– గ్రెటా ట్వీట్ వార్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుజేసుకున్నారు. పర్యావరణ యువ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ను ప్రఖ్యాత పత్రిక ‘టైమ్’ పర్సన్ ఆఫ్ ది ఈయర్‌గా ప్రకటించడంపై మండిపడ్డారు. అది తెలివితక్కువ నిర్ణయమని టైమ్ పత్రికను విమర్శించారు. ‘గ్రెటా ముందు తన కోపాన్ని అదుపులో ఉంచుకోవడంపై దృష్టిపెట్టాలి. ఆ తరువాత ఓ ఫ్రెండ్‌తో కలిసి మంచి సినిమాకు వెళ్లాలి. చిల్.. గ్రెటా చిల్!’ అని గురువారం ట్రంప్ ట్వీట్ చేశారు. దీనికి స్పందనగా గ్రెటా థన్‌బర్గ్ తన ట్విట్టర్ బయోడేటాను మార్చారు. ‘నేను కోపాన్ని అదుపులో పెట్టుకోవడంపై దృష్టి పెట్టిన ఒక టీనేజర్‌ను. ప్రస్తుతం ఒక ఫ్రెండ్ తో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను’ అని ట్రంప్‌నకు రిటార్ట్ ఇచ్చారు. -
మాలో ఏం జరుగుతోంది?
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ లో ఏం జరుగుతోంది? అన్నది ఆదివారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నటుడు వీకే నరేశ్ అధ్యక్షతన కొత్త కార్యవర్గం ఏర్పడిన సంగతి తెలిసిందే. కొత్త కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు కూడా కాకముందే కార్యవర్గ సభ్యుల మధ్య అంతరాలు పెరగడంతో ఇటీవల వివాదాలు తలెత్తుతున్నాయని పలువురు భావిస్తున్నారు. ‘మా’లో అటు నరేశ్, ఇటు ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ల వర్గాలు తయారయ్యాయని సమాచారం. ఆదివారం ‘మా’ సభ్యుల మీటింగ్ ఉందంటూ ‘మా’ జనరల్ సెక్రటరీ జీవిత, రాజశేఖర్‌లు ‘మా’ సభ్యులకు, ఈసీ మెంబర్లకు మెసేజ్‌లు పంపడంపైనా వివాదం నెలకొంది. ఫిల్మ్‌చాంబర్‌లో ఆదివారం నిర్వహించిన ‘మా’ సమావేశం నరేశ్, రాజశేఖర్ వర్గాల మధ్య మాటల యుద్ధంతో వాడి వేడిగా సాగిందని టాక్. అధ్యక్షుడి స్థానంలో ఉన్న నరేశ్ ‘మా’ కి నిధుల సేకరణ కార్యక్రమాలు చేపట్టకపోగా, ‘మా’లోని 5.5కోట్ల మూల ధనం నుంచి ఖర్చు చేస్తున్నారని పలువురు సభ్యులు మండిపడ్డారని భోగట్టా. ఇరువర్గాల వారిని ‘మా’ ట్రెజరర్ పరుచూరి గోపాలకృష్ణ సముదాయించేందుకు ప్రయత్నించినా, ఆయన మాట వినకపోవడంతో సమావేశం నుంచి బయటకు వచ్చేశారట. కాగా, కోర్టు ఆర్డర్ ప్రకారం ఇది ‘మా’ జనరల్ బాడీ మీటింగ్ కాదని కేవలం ఫ్రెండ్లీ మీటింగే అని, త్వరలో జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని జీవితా–రాజశేఖర్‌లు చెప్పారు. నటుడు, ‘మా’ ఈసీ మెంబర్ పృథ్వీ మాట్లాడుతూ– ‘‘మా’లో కొందరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలా ఫీలవుతున్నారు. కృష్ణంరాజుగారు, చిరంజీవిగారు వంటి సినీ పెద్దలు జోక్యం చేసుకుంటేనే ‘మా’ సమస్యకి పరిష్కారం అవుతుంది’’ అన్నారు. సమావేశం అనంతరం బయటికి వచ్చిన ‘మా’ సభ్యులు ఎవరికి తోచింది వారు మీడియా ముందు చెప్పడం విశేషం. -
వృద్ధికి చర్యలు లోపించాయి..
న్యూఢిల్లీ: ట్విట్టర్ వేదికపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వృద్ధికి మద్దతునిచ్చే చర్యలు లోపించాయంటూ షా విమర్శించారు. ట్విట్టర్‌పై విమర్శలకు సహజంగా బదులివ్వని నిర్మలా సీతారామన్.. షా విమర్శలకు మాత్రం స్పందించారు. ‘‘మీరు గమనించే ఉంటారు ఆర్థిక మంత్రిగా నేను ఆ పనే చేస్తున్నాను. ఆర్థిక రంగానికి సంబంధించి తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉన్నాను’’ అని సీతారామన్ ట్వీటిచ్చారు. ముఖ్యంగా బుధవారం సీతారామన్ మీడియా సమావేశం పెట్టి ఈ సిగరెట్లను నిషేధిస్తున్నట్టు ప్రకటించడాన్ని షా తప్పుబట్టారు. ఆమేమీ వైద్య మంత్రి కాదుగా అన్నది ఆమె ఆశ్చర్యం. ‘‘ఈ సిగరెట్లను నిషేధించినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ చెప్పారు. ఇది వైద్య మంత్రిత్వ శాఖ నుంచి రాలేదు? గుట్కా నిషేధం గురించి ఏమిటి? ఆర్థిక రంగ పునరుద్ధరణకు కావాల్సిన చర్యలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ప్రకటనలు ఏవి?’’ అని షా ట్వీట్ చేశారు. దీనికి సీతారామన్ స్పందిస్తూ... మంత్రుల బృందానికి అధిపతిగా తాను బుధవారం మీడియా సమావేశం నిర్వహించినట్టు వివరణ ఇచ్చారు. ‘‘కిరణ్ జీ, ఈ మీడియా సమావేశాన్ని గ్రూపు ఆఫ్ మినిస్టర్స్ చైర్ హోదాలో దీన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పే మొదలుపెట్టాను’’ అని సీతారామన్ చెప్పారు. వైద్య మంత్రి హర్షవర్దన్ విదేశీ పర్యటనలో ఉన్నట్టు తెలిపారు. -
మోదీ.. ఓ మురికి కాలువ!
న్యూఢిల్లీ: లోక్‌సభలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య సోమవారం మాటలయుద్ధం నడిచింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ అత్యంత అరుదైన రాజకీయ నేత అని, స్వామి వివేకానందుడి వంటివారని కితాబిచ్చారు. దీన్ని పలువురు కాంగ్రెస్ ఎంపీలు తప్పుపట్టారు. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరీ ప్రధాని మోదీని ‘మురికి కాలువ’గా అభివర్ణించారు. తుకడే తుకడే గ్యాంగ్‌లను సహించబోం.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి సారంగి లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘నాటి యూపీఏ సర్కారు ప్రభుత్వ వైఫల్యానికి పర్యాయపదంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఎంతలా సాగిలపడిపోయిందంటే ప్రధానిని కూడా యాక్సిడెంటల్ అని పిలిచేవారు’ అని మాజీ ప్రధాని మన్మోహన్‌ను ప్రస్తావించారు. ‘ఎవరైతే వందేమాతరం గేయాన్ని ఆలపించరో, వారికి భారత్‌లో ఉండే హక్కు ఉందా? దేశాన్ని ముక్కలుముక్కలుగా విభజించాలనుకునే తుకడే– తుకడే గ్యాంగ్‌లను సహించబోం. ప్రధాని మోదీని దూషించడం అంటే హిమాలయాలను తలతో ఢీకొట్టడమే. కొందరు ప్రతిపక్ష నేతలు పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై చేసిన దాడులకు సాక్ష్యాలను అడుగుతున్నారు. ‘నీ తండ్రి ఇతనే’ అని తల్లి చెబితే అందుకు ఎవరైనా సాక్ష్యాలు చూపించమని అడుగుతారా?’ అని వ్యాఖ్యానించారు. ఇందిర ఎక్కడ.. మోదీ ఎక్కడ?: కాంగ్రెస్ మోదీ భజనలో తరించిన సారంగి అన్ని హద్దులు దాటేశారని కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘బీజేపీ ప్రభుత్వం ‘పొలిటికల్ ప్లాగరిజం సిండ్రోమ్’ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ఉన్నవాళ్లు గత ప్రభుత్వం ఏమీ చేయలేదనీ, అన్నీ తామే చేశామని భ్రమపడుతుంటారు. హరిత విప్లవం(వ్యవసాయం), శ్వేత విప్లవం(పాల దిగుబడి పెంపు), టెక్నాలజీ విప్లవం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. ఓఎన్జీసీ, ఐవోసీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, హాల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు మా హయాంలోనే ఏర్పడ్డాయి. చివరికి బీజేపీ ప్రభుత్వం పాక్‌పై ప్రయోగించిన క్షిపణులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తయారయ్యాయి. మన ప్రధాని పెద్ద సేల్స్‌మ్యాన్. మేం మా ఉత్పత్తులను సరిగ్గా మార్కెట్ చేసుకోలేకపోయాం. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాం’’ అని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ జోక్యం చేసుకుంటూ..‘మేం ఇందిరానే ఇండియా.. ఇండియానే ఇందిర’ అనేంతగా దిగజారిపోలేదు అని విమర్శించారు. దీంతో సహనం కోల్పోయిన రంజన్ చౌదరి ‘గంగామాత ఎక్కడ? మురికికాలువ ఎక్కడ?’ అని వ్యాఖ్యానించి సభలో ఒక్కసారిగా దుమారం రేపారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఖండించారు. 125 కోట్ల మంది ప్రజలెన్నుకున్న ప్రధానిని కాంగ్రెస్ అవమానించిందనీ, ఈ అహంకారమే ఆ పార్టీని అంతం చేస్తుందని హెచ్చరించారు. దీంతో చివరికి అధిర్ స్పందిస్తూ..‘నాకు హిందీ మరీ అంత బాగా రాదు. భారీ గంగానది ఎక్కడ? మామూలు కాలువ ఎక్కడ?’ అని మాత్రమే నేను చెప్పబోయా. ఒకవేళ నా మాటలకు ప్రధాని నొచ్చు కుని ఉంటే క్షమాపణలు కోరుతున్నా’ అని వివరణ ఇచ్చారు. నవభారతాన్ని మీరే తీసుకోండి రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్ కేంద్ర ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేశారు. నవభారతంలో మనుషులు అడవిని చూసి కాకుండా తోటి మనుషుల్ని చూసి భయపడుతున్నారనీ, గాంధీజీ హంతకులను బీజేపీ ఎంపీ ప్రశంసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మోదీ నవభారతంలో చిన్నారులపై అత్యాచారాలు ఆమాంతం పెరిగాయి. నిరుద్యోగం ఆల్‌టైం గరిష్టానికి చేరింది. కాబట్టి మీ నవభారతాన్ని(బీజేపీ ఎన్నికల నినాదం) మీరే ఉంచుకోండి. ప్రేమ, ఆప్యాయతలకు నిలయమైన మా ఇండియాను మాకు తిరిగిచ్చేయండి’ అని వ్యాఖ్యానించారు. -
బెంగాల్లో వేడెక్కిన రాజకీయం
కోల్‌కతా/బశీర్హట్/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కింది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేది, వ్యతిరేక గళం విన్పించేది ఒక్క తానేనని, ఈ నేపథ్యంలో తన గొంతు నొక్కాలని ఆ పార్టీ భావిస్తోందని అన్నారు. తన ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర విజయవంతం కాదని చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బెంగాల్లో హింసను ప్రేరేపించేందుకు కేంద్రం, అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వివిధ సామాజిక మాధ్యమ వెబ్సైట్ల ద్వారా తప్పుడు వార్తలు వ్యాపింపజేసేందుకు కోట్లకు కోట్ల డబ్బును వ్యయం చేస్తున్నారని చెప్పారు. ఏ రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లినా, దాడులు జరిగినా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత బాధ్యత ఉంటుందో కేంద్రానికి కూడా అంతే సమాన బాధ్యత ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ కేంద్ర హోం శాఖ సలహా ఇవ్వడం.. అప్రజాస్వామిక, అనైతిక, రాజ్యాంగ వ్యతిరేక పద్ధతుల్లో బీజేపీ చేస్తున్న పకడ్బందీ కుట్రగా టీఎంసీ సెక్రటరీ జనరల్, బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ అభివర్ణించారు. ఈ మేరకు మంత్రి అమిత్ షాకు సోమవారం లేఖ రాశారు. నిజానిజాలేమిటో పరిశీలించకుండానే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నివేదిక తీసుకోకుండానే కేంద్ర హోంశాఖ ఓ నిర్ధారణకు రావడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, హోం శాఖ తన సలహాను తక్షణం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా టీఎంసీ ఆరోపణలు ఆధార రహితమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. బీజేపీ నిరసన ర్యాలీలు శనివారం ఘర్షణలు జరిగిన బశీర్హట్ (సందేశ్‌ఖలి) ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ కార్యకర్తల హత్యను, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితికి నిరసనగా బీజేపీ 24 పరగణాల జిల్లాల బశీర్హట్ సబ్ డివిజన్లో బ్లాక్ డేతో పాటు 12 గంటల షట్‌డౌన్ పాటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా బీజేపీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మోదీతో గవర్నర్ భేటీ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు వివరించినట్లు బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి తెలిపారు. భేటీ వివరాలు వెల్లడించలేనని ఆయన ఢిల్లీలో మీడియాతో అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంపై తన సమావేశాల్లో చర్చించలేదని స్పష్టం చేశారు. -
బెంగాలీ సెంటిమెంట్‌పై ‘ఎన్నికల దాడి’
లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశ వేడెక్కింది. కోల్‌కతాలో మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల ర్యాలీలో జరిగిన విధ్వంసంతో దేశం దృష్టి యావత్తు బెంగాల్‌పైకి మళ్లింది. అమిత్ షా ర్యాలీకి మమత సర్కారు అడ్డంకులు కల్పించడం, ర్యాలీని తృణమూల్, సీపీఎం శ్రేణులు అడ్డుకోవడం, ప్రతిగా బీజేపీ కార్యకర్తలు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మాటల యుద్దం నుంచి దాడుల వరకు... సాధారణంగా బిహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాలు కొన్నింటిలో ఎన్నికలప్పుడు అల్లర్లు, హింస జరగడం గత ఎన్నికల్లో చూశాం. అయితే, ఈ సారి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు చెప్పుకోతగ్గ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరగ్గా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హింస, అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఇంత వరకు జరిగిన వివిధ దశల పోలింగులో హింస జరగడం ఒక ఎత్తయితే, తాజాగా అమిత్‌షా మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో ఇరు పక్షాలు విధ్వంసానికి పాల్పడటంతో ఎన్నికల ప్రచార కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈశ్వర్ చంద్ర విగ్రహ విధ్వంసానికి కారకులు మీరంటే మీరంటూ తృణమూల్, బీజేపీలు ఆరోపణలు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ ఎన్నికల నియమావళిని యథేచ్చగా ఉల్లంఘిస్తున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేత అమిత్ షా మండి పడ్డారు. తృణమూల్ అభివృద్ధి, ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీ అంటూ ప్రధాని మోదీ దుయ్యబట్టారు. అమిత్‌షా పొరుగు రాష్ట్రాల నుంచి గూండాలను తీసుకొచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాలపై బీజేపీ దాడి చేసిందంటూ మండి పడ్డారు. ఘటనపై ఇరు పక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. బుధవారం పరిస్థితిని సమీక్షించిన ఎన్నికల సంఘం తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిషేధించింది. తృణమూల్ బలప్రయోగం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మమతా బెనర్జీ, ప్రధాని మోదీల మధ్య పోరుగా మారాయి. వీలయినన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంటే, కమలనాథులకు అవకాశం దక్కకుండా చేసేందుకు దీదీ అన్ని మార్గాలు అవలంబిస్తోంది. అధికారాన్ని ఉపయోగించుకుని విపక్ష నేతల పర్యటనలకు, ఎన్నికల ప్రచారాలకు, ర్యాలీలకు మోకాలడ్డుతోంది. అంతే కాకుంగా, విపక్ష నేతలకు పట్టున్న జిల్లాల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లను అనుమతించడం లేదు. తృణమూల్ చేస్తున్న ఈ ప్రయత్నాలను అడ్డుకునే క్రమంగా తరచు హింస,అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ తీవ్ర పోరుకి కారణం... తృణమూల్, బీజేపీలు రెండూ ఇంతటి తీవ్ర స్థాయి పోరుకు దిగడానికి కారణం బెంగాల్లో విజయం ఇద్దరికీ తప్పనిసరి కావడమే. దేశంలో తృణమూల్ అధికారంలో ఉన్నది ఒక్క బెంగాల్లోనే. ఇక్కడ అధికారం కోల్పోతే దాని మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో తృణమూల్ శ్రేణుల పెత్తనం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. మరోవైపు 34 ఏళ్ల తమ అధికారాన్ని కొల్లగొట్టిన తృణమూల్‌పై సీపీఎం కన్నెర్రగా ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మమతాని మట్టి కరిపించాలని సీపీఎం శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం అవసరమైతే బీజేపీకి సహకరించడానికి కూడా కమ్యూనిస్టులు సిద్దపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ గెలుపు కోసం ప్రత్యర్థులను బల ప్రయోగంతో అణచివేయడానికి తృణమూల్ వెనుకాడటం లేదు. మమత మేనల్లుడు పోటీ చేస్తున్న డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో తృణమూల్, బీజేపీల మధ్య వరసగా కొన్ని రోజుల పాటు ఘర్షణలు జరగడం దీనికి నిదర్శనం. మరోవైపు బీజేపీకి కూడా బెంగాల్లో మెజారిటీ సీట్లు సాధించడం జాతీయ రాజకీయాల దృష్ట్యా అవసరం. రెండో సారి కేంద్రంలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న కమలనాధులకు హిందీ బెల్ట్‌లో గతంలోలా ఈ సారి మెజారీటీ స్థానాలు రావని తేలిపోయింది. అక్కడి నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి అత్యధిక లోక్‌సభ స్థానాలున్న బెంగాల్లో పట్టు సాధించడం బీజేపీకి అనివార్యం. అందుకే బెంగాల్లో వీలైనన్ని సీట్లు సాధించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. తృణమూల్‌పై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం, తృణమూల్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తున్న కమ్యూనిస్టుల సహాయం తీసుకోవడం ద్వారా దీదీకి చెక్ చెప్పేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇది కూడా ఇరు పక్షాల మధ్య ఘర్షణలకు దారి తీస్తోంది. సత్తా చాటుకునేందుకే... తమ సత్తా చాటేందుకు మమత, మోదీలు పరోక్షంగా ప్రయత్నించడం రెండు పార్టీల మధ్య రాజకీయ పోరాటానికి దారి తీసింది. చివరిదశ పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఇరు పక్షాలు ఎన్నికల నిబంధనలను, సంప్రదాయాలను పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. తాజా అల్లర్లు, విధ్వంసాలు రెండు పార్టీల్లో నైరాశ్యం ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తృణమూల్–బీజేపీల మధ్య జరిగిన తాజా ఘర్షణల్లో ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ విగ్రహం విధ్వంసం బెంగాల్ ప్రజల భావోద్వేగాలపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇది బెంగాలీ సంస్కృతిపై దాడిగా పలువురు అభివర్ణిస్తున్నారు.ఈ ఘటనను సీపీఎం సహా అనేక పార్టీలు తీవ్రంగా ఖండించడం, తృణమూల్ నేతలు తమ ఫేస్బుక్ ప్రొఫైల్స్‌ను మార్చడం ఈ ఘటన ప్రాధాన్యతను వెల్లడిస్తున్నాయి. విగ్రహ ధ్వంసానికి కారణమెవరైనా మరో 4 రోజుల్లో జరగనున్న పోలింగ్‌పై దీని ప్రభావాన్ని తోసి పుచ్చలేమని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. హద్దులు దాటిన ప్రచార యుద్ధం యూపీ మాదిరిగానే బెంగాల్‌లోని 42 సీట్లకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. చివరి దశలో మిగిలిన 9 లోక్‌సభ స్థానాలకు మే 19వ తేదీన పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో నాలుగు, ఐదు, ఆరు దశల పోలింగ్ సరళిని బట్టి చూస్తే బీజేపీ బలపడుతోందని, ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. తృణమూల్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వారు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పశ్చిమ బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుందని రాష్ట్ర సీపీఎం నేత ఒకరు అన్నారు. బెంగాల్‌ను 34 ఏళ్లు పాలించిన సీపీఎం బాగా బలహీనం కావడం, కాంగ్రెస్ బలం ఊహించని స్థాయిలో కుంచించుకుపోవడంతో బీజేపీకి మమతా బెనర్జీ పెద్ద సవాలుగా మారారు. ఇద్దరూ ఇద్దరే... మోదీ ఆరెసెస్‌లో, తర్వాత బీజేపీలో సంస్థాగత పదవులు సమర్థంగా నిర్వహించి నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. చివరికి ప్రధాని పదవి చేపట్టారు. వామపక్ష పాలనలో మమత వీధి పోరాటాలతో రాటుదేలారు. సీపీఎం భౌతిక దాడులను సైతం తట్టుకుని హింసకు హింసతోనే ఆమె జవాబిచ్చారు. 1998లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి తృణమూల్ కాంగ్రెస్ స్థాపించాక బీజేపీతో చేతులు కలిపారు. వరుసగా 1998, 99, 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పోటీచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన మమత రాష్ట్రంలో తృణమూల్‌కు గట్టి పునాదులు వేయగలిగారు. చివరికి 2011 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవి కైవసం చేసుకున్నారు. ఆమె తన రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే క్రమంలో సీపీఎం, కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరై బలం కోల్పోయాయి. ఈ పరిణామాలను అనుకూలంగా మలచుకున్న బీజేపీ రాష్ట్రంలో తృణమూల్‌కు ప్రత్యామ్నాయంగా అవతరించింది. ఆరో దశ పోలింగ్‌కు ముందు మేదినీపూర్ ఎన్నికల ర్యాలీలో మమత ప్రసంగిస్తూ, ‘‘1942లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నడిచిన క్విట్ ఇండియా ఉద్యమం లాంటివే 2019 లోక్‌సభ ఎన్నికలు. ఫాసిస్టు మోదీ సర్కారును అధికారం నుంచి కూలదోయడానికే మా పార్టీ పోరాడుతోంది,’’ అని ప్రకటించారు. మోదీ ఇటీవల బెంగాల్లో ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, ‘‘ మమత అనగానే ‘టీ’ అక్షరంతో మొదలయ్యే మూడు పదాలు గుర్తుకొస్తాయి. అవి తణమూల్, టోల్‌బాజీ(బలవంతపు వసూళ్లు) టాక్స్. అన్నారు. బుధవారం కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టిన తృణమూల్ చీఫ్, సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో మౌన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న కేంద్రమంత్రి నిర్మల, ఇతర సీనియర్ బీజేపీ నేతలు -
మీ గూండాలే.. కాదు మీ వాళ్లే
సాక్షి, న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసపై అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. దాడికి కారకులు మీరంటే మీరేనంటూ ఇరు పార్టీలూ పరస్పరారోపణలు చేసుకుంటున్నాయి. బెంగాల్లో ఏం జరుగుతున్నా ఎన్నికల సంఘం (ఈసీ) మౌనం వహించి, చూస్తూ ఉంటోంది తప్ప చర్యలు తీసుకోవడం లేదని ఇరు పార్టీలూ బుధవారం ఆరోపించాయి. చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈసీకి పరస్పరం ఫిర్యాదు చేశాయి. తత్వవేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది టీఎంసీ కార్యకర్తలేనని అమిత్ షా ఆరోపించగా, బీజేపీ కార్యకర్తలు కళాశాల గోడలు దూకి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియోలను టీఎంసీ విడుదల చేసింది. హింసకు మమతదే బాధ్యత: అమిత్ షా కోల్‌కతాలో తన ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలు టీఎంసీ గూండాల పనేనని అమిత్ షా ఆరోపించారు. అమిత్ బుధవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తూ దాడులకు తెగబడుతున్నారని, అక్రమంగా పోలింగ్ బూత్‌లలోకి చొరబడుతూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. తత్వవేత్త ఈశ్వర్ చంద్ర విగ్రహాన్ని కూడా టీఎంసీ కార్యకర్తలే ధ్వజం చేశారని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంత హింసను వ్యాప్తి చేసినా ఎన్నికల్లో గెలవబోదనీ, ఎంత బురదజల్లినా అందులోంచి కమలం తప్పక వికసిస్తుందని షా వ్యాఖ్యానించారు. ‘సేవ్ బెంగాల్.. సేవ్ డెమోక్రసీ’ పేరుతో బీజేపీ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది. ఈసీకి ఆధారాలు సమర్పించిన టీఎంసీ విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది బీజేపీ కార్యకర్తలే అన్న తమ ఆరోపణలకు ఆధారాలను ఈసీకి టీఎంసీ బుధవారం సమర్పించింది. టీఎంసీ నేతలు డెరెక్ ఒబ్రెయిన్, సుఖేందు శేఖర్ రే, మనీశ్ గుప్తా, నదీముల్ హాక్‌ల బృందం ఎన్నికల సంఘాన్ని కలిసింది. అంతకుముందు ఒబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ ‘కోల్‌కతా వీధులను విస్మయం, ఆగ్రహం ఆవహించింది. మంగళవారం జరిగిన ఘటన బెంగాలీల గౌరవాన్ని దెబ్బతీసింది. అమిత్ షా ర్యాలీలో చెలరేగిన హింసకు సంబంధించిన 44 వీడియోలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పారు. -
మోదీ, మాయా మాటల యుద్ధం
కుషీనగర్/డియోరియా/లక్నో (యూపీ)/ఖాండ్వా (మధ్యప్రదేశ్): రాజస్తాన్‌లోని అల్వార్‌లో గ్యాంగ్‌రేప్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి మధ్య ఆదివారం మాటల తూటాలు పేలాయి. మాయా మొసలికన్నీరు కారుస్తున్నారని మోదీ విమర్శిస్తే, చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రధానిపై మాయావతి విరుచుకుపడ్డారు. ఈ విషయంలో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని మోదీ సవాల్ విసిరితే.. దళితులపై గతంలో జరిగిన అత్యాచారాలకు నైతిక బాధ్యత వహించి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని మాయావతి డిమాండ్ చేశారు. రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఎస్పీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఏప్రిల్ 26న మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న దంపతుల్ని అటకాయించిన దుండగులు నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి భర్తను కొట్టి అతని కళ్ల ముందే భార్యపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణంపై ఆలస్యంగా ఈ నెల 2న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దళిత మహిళ భర్త ఆరోపించాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతివ్వకండి ఈ నేపథ్యంలో ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్, డియోరియాల్లో ఎన్నికల సభల్లో మాట్లాడిన మోదీ.. బీఎస్పీ అధినేత్రిపై, రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దళిత మహిళకు జరిగిన అన్యాయంపై ‘అయ్యిందేదో అయ్యింది..’ అన్నట్టుగా పార్టీ తీరు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసును నీరుగార్చాలని చూస్తోందని అన్నారు. ‘ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ల కల్తీ కూటమి ఎలా పని చేస్తోందో చెప్పడానికి రాజస్తాన్ ఒక ఉదాహరణ, లక్నో గెస్ట్‌హౌస్ ఘటన (1995లో మాయావతిపై ఎస్పీ కార్యకర్తల దాడి) జరిగినప్పుడు యావత్ దేశం బాధపడింది. ఇప్పుడు మీకలాంటి బాధ కలగకపోవడాని కారణమేంటి? ఇప్పుడొక దళిత మహిళ లైంగిక దాడికి గురైంది. ఆడపడుచుల ఆత్మగౌరవంపై మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తూ రాజస్తాన్ గవర్నర్‌కు లేఖ రాయండి..’ అని విపక్షాలను డిమాండ్ చేశారు. కేవలం ప్రకటనల జారీకే పరిమితమవుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా బీజేపీ ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. కానీ అవినీతి, ధరల పెరుగుదల, సిక్కుల ఊచకోత ఏదైనా సరే జరిగిందేదో జరిగింది అన్నట్టుగా కాంగ్రెస్ తీరు ఉందని దుయ్యబట్టారు. ప్రజలు సమర్ధవంతమైన, నిజాయితీ ప్రభుత్వానికి ఓట్లు వేస్తున్నారని, ఈ ఎన్నికల్లో విపక్షాలు మట్టి కరవడం ఖాయమని మోదీ అన్నారు. మోదీ రాజీనామా చేయాలి: మాయా దళిత మహిళ గ్యాంగ్‌రేప్ ఘటన నేపథ్యంలో ప్రధాని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాయావతి విమర్శించారు. ఈ కేసులో కఠినమైన, చట్టపరంగా సరైన చర్యలు తీసుకోనిపక్షంలో త్వరలోనే తగిన రాజకీయ నిర్ణయం తీసుకునేందుకు బీఎస్పీ సిద్ధమని తెలిపారు. ఈ మేరకు లక్నోలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఊన, రోహిత్ వేముల వంటి దళితులపై గతంలో జరిగిన అనేక దాడులు, అత్యాచారాలను ప్రస్తావిస్తూ.. వీటికి మోదీ నైతిక బాధ్యత వహించాలని, ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వం బాధిత మహిళ కుటుంబాన్ని భయపెట్టి అక్కడ ఎన్నికలు పూర్తయ్యే వరకు విషయం వెలుగులోకి రాకుండా చూసిందని మాయావతి శనివారం ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత మహిళకుతగిన న్యాయం జరిగేలా, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని సుప్రీంకోర్టును కోరుతున్నామన్నారు. -
పార్లమెంటుకు అబద్ధం చెప్పారు
న్యూఢిల్లీ: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు నిధుల కొరత ఏర్పడిందన్న అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య మరో మాటల యుద్ధానికి దారితీసింది. హెచ్ఏఎల్కు రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు అబద్ధం చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ప్రాజెక్టులకు సాక్ష్యాలు చూపలేకపోతే ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలనీ, హెచ్ఏఎల్, ప్రభుత్వం మధ్య రూ. లక్ష కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లుగా తానెప్పుడూ చెప్పలేదని నిర్మల స్పష్టం చేశారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తూ యద్ధ విమానాలు, హెలికాప్టర్లు, జెట్ ఇంజిన్లు తదితరాలను తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉందంటూ శనివారం ఓ వార్తా కథనం రావడం తెలిసిందే. సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలో రూ. వెయ్యి కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందనీ, ప్రభుత్వం నుంచి తమకు ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని హెచ్ఏఎల్ ఉన్నతాధికారులు చెప్పినట్లుగా ఈ కథనం వెల్లడించింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రాజెక్టులో భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామిగా ప్రభుత్వరంగ, అనుభవం ఉన్న హెచ్ఏఎల్ను కాదనీ, కొత్తదైన ప్రైవేటు సంస్థ రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేయడంపై ఇప్పటికే కేంద్రంపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేస్తుండటం తెలిసిందే. అంబానీకి ప్రయోజ నం చేకూర్చేందుకే ప్రధాని మోదీ రిలయన్స్‌ను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేసి, ప్రభుత్వ సంస్థల ఉసురు తీస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పార్లమెంటు ముందు దస్త్రాలు ఉంచండి హెచ్ఏఎల్కు రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చిన దానికి సంబంధించిన దస్త్రాలను సోమవారం నిర్మల పార్లమెంటుకు సమర్పించాలనీ, లేని పక్షంలో ఆమె రాజీనామా చేయాలని రాహుల్ ఆదివారం డిమాండ్ చేశారు. ‘ఒక్క అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చడానికి మరెన్నో అబద్ధాలు చెబుతూ ఉండాలి. మోదీ రఫేల్ ‘అబద్ధం’ను కప్పిపుచ్చేందుకు ఇప్పుడు రక్షణ మంత్రి పార్లమెంటుకే అబద్ధం చెప్పారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. హెచ్ఏఎల్ను కాదని రిలయన్స్‌కు రఫేల్ ప్రాజెక్టు ఇచ్చినందుకు కాంగ్రెస్ మొదటి నుంచి కేంద్రంపై విమర్శలు చేస్తోంది. శనివారం కూడా మోదీ తన సూటు–బూటు స్నేహితుడి (అనిల్ అంబానీ)కి సాయం చేసేందుకు హెచ్ఏఎల్ను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. హెచ్ఏఎల్ ఏమంటోంది.. హెచ్ఏఎల్ ఈ అంశంపై స్పందిస్తూ.. 83 తేలికపాటి యుద్ధవిమానాలు, 15 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల ప్రాజెక్టులపై కీలక దశల్లో ఉన్నాయనీ, త్వరలో తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని తెలిపింది. మార్చి వరకు ఖర్చుల కోసం రూ. 962 కోట్లను ప్రస్తుతం అప్పుగా తీసుకున్నామంది. పూర్తిగా చదివి మాట్లాడాలి: నిర్మల వార్తా కథనాన్ని పూర్తిగా చదివిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడాలని నిర్మల హితవు చెప్పారు. ఆ కథనంలోనే ఉన్న వివరాలను ఆమె ఉటంకిస్తూ ‘ఈ ఒప్పందాలు పూర్తయినట్లుగా నిర్మల పార్లమెంటుకు చెప్పలేదు. ఆ దిశగా పనులు జరుగుతున్నాయని మాత్రమే ఆమె వెల్లడించినట్లు లోక్‌సభ రికార్డులు చెబుతున్నాయి’ అని పేర్కొన్నారు. రాహుల్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తుండటం సిగ్గుచేటని ఆమె అన్నారు. ఆ తర్వాత నిర్మల కార్యాలయం ఓ ట్వీట్ చేస్తూ ‘రాహుల్ గాంధీ, మీరు ఏబీసీల నుంచి అన్నీ నేర్చుకోవాలి. ప్రజలను తప్పుదారి పట్టిం చేందుకు ఉత్సాహం చూపుతున్న మీలాంటి వారే పూర్తిగా కథనాన్ని చదవకుండానే, అదే కథనం ఆధారంగా ఆరోపణలు చేస్తారు. అబద్ధం చెబుతున్నది మీరే రాహుల్. 2014–18 మధ్య హెచ్ఏఎల్, ప్రభుత్వం మధ్య రూ. 26,570.8 కోట్ల ఒప్పందాలు జరిగాయి. మరో రూ. 73 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కూడా ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు మీరు దేశ ప్రజలకు పార్లమెంటులో క్షమాపణ చెప్పి మీ పదవికి రాజీనామా చేస్తారా?’ అంటూ ఘాటుగా స్పందించింది. -
పాక్ కనుసన్నల్లో కశ్మీర్ పార్టీలు
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్ అసెంబ్లీ రద్దయ్యాక గురువారం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పాకిస్తాన్ ప్రోద్బలంతోనే బద్ధ శత్రువులైన పీడీపీ, ఎన్సీలు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయన్న బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ వ్యాఖ్యలపై ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణల్ని రుజువుచేయాలని లేదంటే క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో రామ్ మాధవ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిగే అవకాశాలున్నాయని వచ్చిన నివేదికల్ని బహిర్గతం చేయాలని గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను ఒమర్ కోరారు. కశ్మీర్ ప్రాంతీయ పార్టీలు పాక్ కనుసన్నల్లో పనిచేస్తున్నాయన్న బీజేపీ వ్యాఖ్యలపై రాష్ట్ర మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడు మాత్రం పీడీపీ, ఎన్సీల దేశభక్తి, విశ్వసనీయతను ఆ పార్టీ ప్రశ్నించలేదని అన్నారు. ‘ఒక పార్టీ జాతీయవాదం, దేశభక్తిని ఎలా నిర్ణయిస్తారు. కేంద్రంతో ఉంటే దేశభక్తులు.. లేకుంటే జాతి వ్యతిరేకులా?’ అని సూటిగా ప్రశ్నించారు. కలసి పోటీచేయగలరా?: రామ్ మాధవ్ బీజేపీ, ఎన్సీల మధ్య ట్వీటర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. పీడీపీ, ఎన్సీల స్నేహం నిజమైనదైతే వచ్చే ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు కలసి పోటీచేయాలని కశ్మీర్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జీ రామ్ మాధవ్ సవాలు విసిరారు. ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరావాలని కశ్మీర్ ప్రాంతీయ పార్టీలకు పాక్ నుంచి ఆదేశాలు అందాయన్నారు. పాక్ సూచనల మేరకు ఎన్సీ, పీడీపీలు స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించాయన్నారు. మాధవ్ ఆరోపణల్ని ఒమర్ అబ్దుల్లా తిప్పికొడుతూ ‘ ఐబీ, రా, సీబీఐ లాంటి సంస్థలు మీ నియంత్రణలోనే ఉన్నాయి. ధైర్యముంటే మీ ఆరోపణల్ని నిరూపించే సాక్ష్యాలు బయటపెట్టండి’ అని డిమాండ్ చేశారు. దీనికి మాధవ్ బదులిస్తూ ‘ మీ దేశభక్తిని శంకించడం లేదు. కానీ పీడీపీ, ఎన్సీల మధ్య హఠాత్తుగా పుట్టుకొచ్చిన ప్రేమ సందేహాలకు తావిస్తోంది. విదేశీ ఒత్తిడి లేదని లేదంటున్నారు కాబట్టి నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేసి మీ మధ్య స్నేహం నిజమైనదే అని నిరూపించండి’ అని అన్నారు. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు.. కేంద్రం ఒత్తిడితోనే అసెంబ్లీని రద్దుచేశారన్న ఆరోపణల్ని గవర్నర్ తోసిపుచ్చారు. ‘భారీ స్థాయిలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నివేదికలొస్తున్నాయి. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. తెరచాటుగా చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సాకుతో బెదిరిస్తున్నారని మెహబూబా ఆరోపించారు. మరో వర్గం ఎమ్మెల్యేలకు గుర్తుతెలియని వారు భారీగా డబ్బు ఆశ చూపారు. ఈ బేరసారాలు 20 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి’ అని మీడియాకు వివరించారు. మే లోపే ఎన్నికలు: సీఈసీ కశ్మీర్లో మే లోపు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్‌సభ ఎన్నికల కన్నా ముందే అక్కడ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ రద్దయితే ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాలి. కశ్మీర్ విషయంలో ఆ గడువు మే వరకు ఉంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే పోలింగ్ తేదీల్ని ఖరారుచేస్తామని రావత్ చెప్పారు. అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోందని, తెలంగాణలోనూ ఇదే నియమాన్ని వర్తింపజేస్తున్నామని తెలిపారు. మెహబూబాకే మేలు! కశ్మీర్ రాజకీయ డ్రామాలో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీదే విజయమా? కాంగ్రెస్, ఎన్సీ మద్దతుతో ఆమె ముఖ్యమంత్రి కాకుండా గవర్నర్ సత్యపాల్ మాలిక్ అడ్డుకోవడం తాత్కాలికమేనా? అంటే..అసెంబ్లీ రద్దు పరోక్షంగా బీజేపీకి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జన్ గని లోన్ని సీఎం చేసి కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకున్న బీజేపీ ప్రయత్నాలకు అసెంబ్లీ రద్దుతో గండిపడినట్లయింది. పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్‌లు తమకున్న ఎమ్మెల్యేల బలంతోనే ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నాయని, ఈ ఆలోచన ప్రతిపాదిత కూటమికి మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జూన్ 19న పీడీపీ–బీజేపీ సంకీర్ణం కుప్పకూలిన తరువాత పీడీపీ అస్తిత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జన్ గని బీజేపీతో చేతులు కలిపి సీఎం అవుతారనే ప్రచారంతో..కొందరు పీడీపీ సభ్యులు ఆయన గూట్లో చేరారు. బుధవారం మధ్యాహ్నం వరకు అత్యంత నిరాశాజనకంగా ఉన్న పీడీపీ శిబిరంలో ఒక్కసారిగా ఆశావహ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీల మద్దతు తనకు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ రాయడం ద్వారా ముఫ్తీ.. సజ్జద్ ఫ్రంట్‌లోకి మరిన్ని వలసల్ని నిలువరించారు. గవర్నర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని మెహబూబా యోచిస్తున్నట్లు సమాచారం. -
సిధాంతాల్లేవ్.. విలువల్లేవ్!
-
అతనితో పని చేయొద్దు
కంగనా రనౌత్, హృతిక్ రోషన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని బాలీవుడ్ మీడియాకు తెలిసిందే. వీలు కుదిరినప్పుడల్లా హృతిక్‌పై మాటల తూటాలు పేల్చుతూనే ఉంటారు కంగనా. తాజాగా ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా మాట్లాడుతూ హృతిక్‌తో ఎవ్వరూ పని చేయకూడదు అని సంచలన వాఖ్యలు చేశారామె. ‘‘దర్శకుడు వికాస్ బాల్ విషయంలో వస్తున్న ఆరోపణలన్నీ నిజమే. మన ఇండస్ట్రీలో స్త్రీలతో సరిగ్గా ప్రవర్తించనివాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లందర్నీ శిక్షించాలి. తమ భార్యలను పతకాలుగా ఉంచుకొని యవ్వనంలో ఉన్న స్త్రీలను గర్ల్‌ఫ్రెండ్‌గా భావించేవాళ్లను కూడా శిక్షించాలి’’ అన్నారు. మీరు ఎవర్ని ఉద్దేశించి అంటున్నారు అని అడగ్గా ‘‘నేను హృతిక్ రోషన్ గురించే మాట్లాడుతున్నాను. అతనితో కలసి పని చేయడం మానేయాలి’’ అన్నారు. -
దమ్ముంటే అరెస్టు చేసుకోండి!
న్యూఢిల్లీ/కోల్‌కతా: బీజేపీ చీఫ్ అమిత్ షా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం పెరిగింది. అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) తుది ముసాయిదా విడుదలపై మమత ఎక్కువగా స్పందించడం, తదుపరి ఎన్నార్సీ పశ్చిమ బెంగాల్లో∙ఉండొచ్చన్న వార్తలతో బీజేపీ, టీఎంసీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 11న కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ యువమోర్చా నిర్ణయించింది. ఈ ర్యాలీలో అమిత్ షా పాల్గొననున్నారు. అస్సాం తరహాలో బెంగాల్లో అక్రమంగా ఉన్న బంగ్లాదేశీయులను పంపించేస్తామని షా ప్రకటిస్తే ఇది రాజకీయంగా పెను ప్రభావం చూపుతుందనే కారణంతో ఈ ర్యాలీకి అనుమతివ్వబోమని మొదట కోల్‌కతా పోలీసులు ప్రకటించారు. దీనిపై షా స్పందిస్తూ.. ‘ఆగస్టు 11న ర్యాలీ నిర్వహిస్తాం. దమ్ముంటే అరెస్టు చేసుకోండి’ అని సవాల్ విసిరారు. తర్వాత పోలీసులు ర్యాలీకి ఓకే చెప్పారు. భారత్–బంగ్లా స్నేహానికి ఇబ్బంది! సరైన ఓటర్లను ఎన్నార్సీలో కలపకుండా బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయం చేస్తోందని మమత విమర్శించారు. రేపు తననూ చొరబాటుదారు అంటారేమోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ‘నా తల్లిదండ్రులు ఇక్కడే పుట్టారనే జనన ధ్రువీకరణ పత్రాల్లేవు. అదృష్టవశాత్తూ నా వద్ద ఆ పత్రాలున్నాయి. కానీ నా తల్లిదండ్రులకు లేవని నన్ను చొరబాటుదారు అంటారేమో?’ అని మమత ఎద్దేవా చేశారు. ‘2019లో విపక్షాలు ఏకమవుతాయి. బీజేపీ పని అయిపోయినట్లే’ అని ఆమె అన్నారు. ‘నన్ను బీజేపీ ఆపలేదు. నేను వారి పనిమనిషిని కాను’ అని∙ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నార్సీ కారణంగా బంగ్లాదేశ్‌తో భారత్‌కున్న సత్సంబంధాలు దెబ్బతింటాయని ఆమె పేర్కొన్నారు. తాను ప్రధాని పదవిని ఆశించడం లేదని.. విపక్షాలన్నీ కలిసే ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటాయన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా సహా వైఎస్సార్సీపీ, ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ సహా పలు పార్టీల నేతలను కలిశారు. బీజేపీ నేత అడ్వాణీ, బీజేపీ నుంచి సస్పెండైన కీర్తీ ఆజాద్‌లను కలిశారు. ఎన్నార్సీపై రచ్చ అస్సాం ఎన్నార్సీ విషయంలో పార్లమెంటులో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఎన్నార్సీపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ సహా పలువురు ఎంపీలు ఈ డిమాండ్‌తో సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. అయితే రికార్డులను పరిశీలిస్తానని చైర్మన్ వెంకయ్య నాయుడు కాంగ్రెస్ ఎంపీలకు భరోసా ఇచ్చారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కు తగ్గకపోవడంలో సభ పలుమార్లు వాయిదా పడింది. లోక్‌సభలోనూ తృణమూల్ ఎంపీలు ప్రభుత్వం తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. -
‘ఎన్నార్సీ’పై మాటల యుద్ధం
న్యూఢిల్లీ: అస్సాంలో అక్రమ వలసదారులను గుర్తించేందుకు విడుదలచేసిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్నార్సీ) ముసాయిదా జాబితాపై రాజకీయ రభస కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ అంశంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో అధికార పార్టీ తరఫున బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వివరణ ఇస్తూ.. అక్రమ వలసదారులను గుర్తించే సాహసాన్ని కాంగ్రెస్ చేయలేకపోయిందన్నారు. నిజమైన భారతీయుల పేర్లను జాబితా నుంచి తొలగించబోమని హామీ ఇచ్చారు. అస్సాంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవని, ఎన్నార్సీలో చోటుదక్కని వారంతా విదేశీయులు కారని కాంగ్రెస్ పేర్కొంది. మానవతా దృక్పథాన్ని అవలంబించాలని, భారతీయులకు జాబితాలో చోటు నిరాకరించొద్దని సూచించింది. వివాదాస్పద ఎన్ఆర్సీ జాబితాతో దేశంలో సివిల్ వార్, రక్తపాతం జరుగుతాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరించారు. అక్రమ వలసదారులను కాపాడతారా?: షా ప్రశ్నోత్తరాలను రద్దుచేసి ఎన్నార్సీపై చర్చ నిర్వహించేందుకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అంగీకరించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ.. అక్రమ వలసదారులను గుర్తించి భారతీయుల జాబితాను తయారుచేసేందుకే ఎన్ఆర్సీ కసరత్తు చేపట్టామన్నారు. 1985, ఆగస్టు 14న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సంతకంచేసిన అస్సాం ఒప్పందం ప్రకారమే ఎన్నార్సీ జాబితాను రూపొందించాల్సిందని, కానీ ఆ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయిందని మండిపడ్డారు. అక్రమ వలసదారులను గుర్తించే ధైర్యం ఆ పార్టీకి లేకపోయిందని ఆరోపించారు. అక్రమంగా వలసొచ్చిన బంగ్లాదేశీయులను కాపాడటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా? అని ప్రశ్నించారు. ‘సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఎన్ఆర్సీ రూపుదిద్దుకుంటోంది. 40 లక్షల మందికి ముసాయిదా జాబితాలో చోటుదక్కలేదు. ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారినా?’ అని అసహనం వ్యక్తం చేశారు. నిజమైన భారతీయులెవరూ ఆందోళనచెందనక్కర్లేదని, వారి పేర్లను ఎన్ఆర్సీ నుంచి తొలగింబోచమని హామీ ఇచ్చారు. షా వ్యాఖ్యలపై కాంగ్రెస్, తృణమూల్, ఇతర విపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో తొలుత పది నిమిషాలు, తరువాత రోజంతటికీ సభ వాయిదాపడింది. అంతర్జాతీయంగా ప్రభావం: కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ రాజ్యసభలో చర్చను ప్రారంభిస్తూ.. ఎన్నార్సీ మానవతా సమస్య అని, పలానా కులం, మతానికి సంబంధించినది కాదని పేర్కొన్నారు. ‘ఎవరినీ దేశం నుంచి తరిమికొట్టాలని మేము కోరుకోవడం లేదు. ఇది కేవలం 40 లక్షల మందికి సంబంధించిన సమస్య కాదు. వారి కుటుంబం, పిల్లలను కూడా కలుపుకుంటే ఆ సంఖ్య 1.5 కోట్లకు చేరుతుంది. ఎన్నార్సీతో అంతర్జాతీయంగా, ముఖ్యంగా బంగ్లాదేశ్‌పై, ప్రభావం పడుతుంది. పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యత కేవలం పౌరులపైనే కాకుండా ప్రభుత్వంపై కూడా ఉండాలి’ అని ఆజాద్ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ స్పందిస్తూ ఎన్ఆర్సీ జాబితాలో చోటుదక్కనివారిలో హిందువులు, ముస్లింలు, బిహార్, యూపీ ప్రజలు కూడా ఉన్నారని అన్నారు. మాజీ రాష్ట్రపతి కుటుంబీకులకు చోటేదీ? ఎన్నార్సీ జాబితాలో దివంగత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సోదరుడు లెఫ్టినెంట్ ఎక్రముద్దీన్ అలీ అహ్మద్ కుటుంబ సభ్యులకు చోటు దక్కలేదు. ఆ కుటుంబం అస్సాంలోని కామరూప్ జిల్లా రాంగియా పట్టణంలో నివసిస్తోంది. ‘నేను ఫక్రుద్దీన్ సోదరుడి కుమారుడిని. మా నాన్న పేరు వారసత్వ డేటాలో లేకపోవడంతో మాకు ఎన్ఆర్సీ జాబితాలో చోటు దక్కలేదు. ఈ విషయంలో మాకు చాలా ఆందోళనగా ఉంది‘ అని జియా ఉద్దీన్ అంటున్నారు. పూర్వీకులకు సంబంధించిన స్థానికత పత్రాలు సమర్పించలేకపోయిన వారెవరికీ ఈ జాబితాలో చోటు దక్కలేదు. జాబితాలో 40 లక్షల మందికి చోటు కల్పించకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం గోప్యత పాటిస్తోంది. ఎన్నికల సంఘం అనుమానాస్పద ఓటర్లుగా గుర్తించిన వారిని, పౌరసత్వంపై ఇప్పటికే విదేశీ ట్రిబ్యునల్స్‌లో సవాల్ చేసిన వారిని జాబితాలో చేర్చలేదు. తదుపరి బెంగాల్లోనా? అస్సాం మాదిరిగానే పశ్చిమబెంగాల్లోనూ ఎన్నార్సీ జాబితా ను రూపొందించే ఉద్దేశం ఉందా? అని ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ నుంచి స్పష్టత కోరారు. మంగళవారం ఆమె రాజ్‌నాథ్‌ను కలసిన తరువాత విలేకర్లతో మాట్లాడుతూ..‘అస్సాం ఎన్నార్సీ గురించి మాట్లాడటానికే ఢిల్లీ వచ్చా. జాబితాలో చోటుదక్కని 40 లక్షల మంది వివరాలు సమర్పించాను. తదుపరి ఎన్ఆర్సీ బెంగాల్లోనే అని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలను ఆయన దృష్టికి తీసుకెళ్లా. అలాంటి ప్రకటనలు చేసే అధికారం వారికి ఎవరు ఇచ్చారు?’ అని మమత అన్నారు. బెంగాల్లో అక్రమ వలసదారులు కోట్లలో ఉంటారని, తదుపరి ఎన్నార్సీ బెంగాల్లో చేపట్టే అవకాశాలున్నాయని బీజేపీ నేత కైలాశ్ చెప్పారు. ఇప్పుడే చర్యలు వద్దు: సుప్రీం ఎన్నార్సీ జాబితాను ఆధారంగా చేసుకుని ఎలాంటి బలవంతపు చర్యలకు దిగొద్దని కేంద్రం, అస్సాం ప్రభుత్వాల్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది కేవలం ముసాయిదా జాబితానే అంది. అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రామాణిక అమలు విధానాన్ని(ఎస్ఓపీ) రూపొందించాలని కేంద్రానికి సూచించింది. పేర్ల తొలగింపును సవాలుచేసేందుకు బాధితులకు న్యాయబద్ధ అవకాశం కల్పిస్తూ ఎస్ఓపీని ఆగస్టు 16 నాటికి తమ ముందు ఉంచాలని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్‌ల బెంచ్ ఆదేశించింది. జాబితాలో చోటుదక్కని 40 లక్షల మంది తప్పు డు పత్రాలతో ఇతర రాష్ట్రాలకెళ్లకుండా వారి బయోమెట్రిక్ వివరాలు సేకరించాలనుకుంటున్నట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. అలాంటి వారు తమ రాష్ట్రంలోకి ప్రవేశిస్తారని పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలు ఆందోళనచెందుతున్నాయంది. మోరీగావ్‌లో తుది జాబితాలో తమ పేరు చెక్‌చేసుకునేందుకు క్యూలో నిల్చున్న జనం -
అసహనంతోనే బంగ్లా ధ్వంసం
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన విషయంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. లక్నోలో అఖిలేశ్ ఇన్నాళ్లూ నివసించిన ఆ బంగ్లా ఇప్పుడు బాగా ధ్వంసమైందనీ, ఇది ఆయనకు వచ్చిన అసహనానికి నిదర్శనమని బీజేపీ ఆరోపించింది. యూపీ మాజీ సీఎంలంతా ప్రభుత్వ అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. మాజీ సీఎంలు ములాయం సింగ్, కల్యాణ్ సింగ్, రాజ్‌నాథ్, మాయవతి, అఖిలేశ్ ఆయా భవనాలను ఖాళీ చేశారు. అయితే అఖిలేశ్ బంగ్లాను ఖాళీ చేశాక, దాని ఫొటోలు తీసుకోవడానికి అధికారులు ఫొటోగ్రాఫర్లను అనుమతించారు. సైకిల్ ట్రాక్, ఏసీలు పెట్టిన గోడలు, బ్యాడ్మింటన్ కోర్టు తదితరాలు బాగా దెబ్బతిన్నట్లు చిత్రాల్లో తెలుస్తోంది. నివాసం ఖాళీ చేయాల్సిరావడంతో అఖిలేశ్ కావాలనే బంగ్లాను ధ్వంసం చేశారనే కోణంలో బీజేపీ ఆరోపణలు చేయగా, అవన్నీ సాధారణంగా దెబ్బతిన్నవేననీ, కల్యాణ్ సింగ్, రాజ్‌నాథ్‌ల బంగ్లాల ఫొటోలను ఎందుకు బయటకు రానివ్వలేదని ఎస్పీ నాయకులు ప్రశ్నించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, పెరిగిన అఖిలేశ్ ప్రజాదరణతో బీజేపీ ఆరోపణలు చేస్తోందని ఎస్పీ నాయకులు ఎదురుదాడి చేశారు. -
బిగ్‌బాస్..ఛోటా భీమ్
న్యూఢిల్లీ: ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారం దుర్వినియోగంపై కాంగ్రెస్–బీజేపీల మధ్య మాటల యుద్ధం సద్దుమణగక ముందే మొబైల్ యాప్స్ ద్వారా డేటా లీకేజీ వివాదం వేడిపుట్టిస్తోంది. ఫ్రెంచ్ హ్యాకర్ ఎలియట్ అల్డర్సన్ (మారుపేరు) ఈ సమాచార చౌర్యాన్ని వెలుగులోకి తీసుకురాగా.. రెండు జాతీయ పార్టీలు సోమవారం ట్విటర్ వేదికగా ఆరోపణలు గుప్పించుకున్నాయి. ప్రధాని మోదీ అధికారిక ‘నమో’ యాప్ నుంచి వ్యక్తిగత సమాచారం యూజర్ల అనుమతి లేకుండా మూడో పార్టీకి చేరుతోందని ఎలియట్ ఆరోపణలతో ఈ వివాదానికి బీజం పడగా...నమో యాప్‌పై ఆరోపణల్ని బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ యాప్ ‘విత్ ఐఎన్‌సీ’ నుంచి కూడా వ్యక్తిగత సమాచారం తరలిపోతోందని బీజేపీ ప్రత్యారోపణలు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లోని సభ్యత్వ నమోదు లింక్‌ను తొలగించారని, కాంగ్రెస్ ఏదో దాస్తోందని బీజేపీ ఆరోపించింది. సరిగా పనిచేయనందునే లింక్ తొలగించామని కాంగ్రెస్ కౌంటరిచ్చింది. గతంలో ఆధార్ సాఫ్ట్‌వేర్‌లోని లొసుగుల్ని బయటపెట్టిన ఎలియట్ అల్డర్సన్ ‘నమో’ యాప్ యూజర్ల సమాచారం నుంచి అమెరికాలోని కంపెనీకి తరలిపోతోందని శనివారం వరుసగా ట్వీట్లు చేశారు. ఆదివారం మరో ట్వీట్ చేస్తూ.. తన ట్వీట్లతో అప్రమత్తమై నమో యాప్‌లోని ప్రైవసీ పాలసీలో ఎవరికీ అనుమానం రాకుండా మార్పులు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ యాప్ నుంచి కూడా వ్యక్తిగత సమాచారం తరలిపోయిందని అల్డర్సన్ తప్పుపట్టారు. ‘డిలీట్‌నమోయాప్’ : రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ‘నమో’ యాప్‌పై సోమవారం ఆరోపణల్ని కొనసాగిస్తూ .. ‘ఆడియో, వీడియోలు, మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల కాంటాక్ట్‌లను మోదీ ‘నమో’ యాప్ రికార్డు చేయడంతో పాటు మీరు ఎక్కడ ఉన్నారన్నదీ జీపీఎస్ ద్వారా తెల్సుకుంటున్నారు. భారతీయులపై గూఢచర్యం చేసేందుకు ఇష్టపడే బిగ్‌బాస్ మోదీ’ అని ట్వీట్ చేశారు. మన పిల్లల సమాచారాన్ని మోదీ కోరుకుంటున్నారని, 13 లక్షల ఎన్సీసీ క్యాడెట్స్‌తో బలవంతంగా నమో యాప్‌ను డౌన్లోడ్ చేయించారని పేర్కొంటూ ‘డిలీట్‌నమోయాప్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు. ‘నమో యాప్‌లోని కోట్లాది భారతీయుల డేటాతో తన వ్యక్తిగత డేటాబేస్‌ను రూపొందించేందుకు మోదీ తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో దేశంతో సంభాషించాలని ఆయన కోరుకుంటే ఎలాంటి సమస్యా లేదు. అయితే అందుకు అధికారిక పీఎంఓ యాప్‌ను వాడుతున్నారు. ఈ డేటా దేశానిది. మోదీది కాదు’ అని విమర్శించారు. ఫేస్బుక్ సమాచారం దుర్వినియోగంలో కేంబ్రిడ్జ్ అనలిటికాతో కాంగ్రెస్ సంబంధాలపై వాస్తవాల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రాహుల్ ట్వీట్లను బీజేపీ కూడా తిప్పికొట్టింది. యాప్‌ని ఎందుకు తొలగించారు: బీజేపీ రాహుల్ ఆరోపణలల్నిమంత్రి స్మృతీ ఇరానీ ట్విటర్లో ఎద్దేవా చేశారు. ‘రాహుల్ జీ.. యాప్స్ ఇన్స్టాల్ సమయంలో అడిగే సాధారణ అనుమతులు గూఢచర్యంతో సమానం కాదని ‘చోటా భీమ్’కి కూడా తెలుసు. ‘డిలీట్‌నమోయాప్’కి బదులు చివరకు మీ కాంగ్రెస్ యాప్‌నే తొలగించారు. సింగపూర్ సర్వర్లకు మీ యాప్ ద్వారా కాంగ్రెస్ ఎందుకు సమాచారం పంపుతుందో జవాబిస్తారా?’ అని ప్రశ్నించారు. బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జ్ అమిత్ మాల్వీయ ట్వీట్ చేస్తూ.. ‘కాంగ్రెస్ సభ్యత్వ నమోదు వెబ్సైట్ లింక్ తొలగించారు. membership.inc.in లింక్‌లోకి వెళ్లి సభ్యత్వ నమోదుకు ప్రయత్నిస్తే ‘స్వల్ప మార్పులు చేస్తున్నాం. తర్వాత ప్రయత్నించండి’ అని సందేశమొస్తుంది. ఏం దాచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’ అని తప్పుపట్టారు. ‘హాయ్.. నా పేరు రాహుల్. దేశంలోని పురాతన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిని.. మీరు మా అధికారిక యాప్‌లోకి సైనప్ అయితే మీ సమాచారాన్ని సింగపూర్‌లోని నా స్నేహితులకు చేరవేస్తా’ అని ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ వంటి సాంకేతిక నిరక్షరాస్యుడిని భారత రాజకీయాల్లో చాలా అరుదుగా చూస్తామని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. నమో యాప్ ద్వారా మోదీ, బీజేపీలు ఈవీఎంలకు అనుంధానమై హ్యాక్ చేయడం వల్లే వరుసగా ఎన్నికల్లో గెలుస్తున్నారని కూడా రాహుల్ ఆరోపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ‘విత్ఐఎన్సీ’ యాప్‌ని ఐదు నెలలుగా వాడడం లేదు: కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ దివ్య స్పందన స్పందిస్తూ.. ‘ కాంగ్రెస్ సభ్యత్వ లింకు పేజీ సరిగా పనిచేయడం లేదు. అందువల్ల కాంగ్రెస్ వెబ్సైట్ ద్వారానే కొద్దికాలం సభ్యత్వ నమోదు అందుబాటులో ఉంటుంది’ తెలిపారు. కాంగ్రెస్ కూడా ట్వీట్ చేస్తూ ‘విత్ఐఎన్సీ’ యాప్ గత ఐదునెలలుగా వాడడం లేదని.. నవంబర్ 16, 2017 నుంచి సభ్యత్వ నమోదును http://www.inc.in వెబ్‌సైట్‌కు మార్చామని తెలిపింది. ఒక ప్రభుత్వ యాప్ 15 అంశాల్లో అనుమతి కోరుతోందని, నమో యాప్ మాత్రం 22 అంశాల్లో అనుమతి అడుగుతోందని ఆ పార్టీ నేత అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. 10 వేల ఏటీఎంల డేటా లీక్ అయిందని, 32 లక్షల ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుదారుల సమాచారం పక్కదారి పట్టిందన్న ఆరోపణల్ని ఆయన ఉదహరించారు. -
ఫేస్బుక్ వార్!
న్యూఢిల్లీ: ఫేస్బుక్ డేటా లీకేజ్ వివాదం భారత్‌కూ పాకింది. కోట్లాది ఫేస్బుక్ వినియోగదారుల వివరాలను పలు దేశాల్లో రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాల రూపకల్పనకు అక్రమంగా వినియోగించిన సంస్థ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ)’తో భారత్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధం ఉందన్న వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ తదితర పార్టీలు తమ క్లయింట్లేనంటూ ఆ సంస్థ భారతీయ భాగస్వామి ఓబీఐ (ఒవలెనొ బిజినెస్ ఇంటలిజెన్స్) తన వెబ్సైట్లో ప్రకటించడం సంచలనం రేకెత్తించింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. సీఏతో అంటకాగింది, సంబంధాలు కొనసాగిస్తోంది మీరంటే.. మీరంటూ ఒకరిపై ఒకరు ఆరోపణాస్త్రాలు సంధించారు. సోషల్‌మీడియాలో రాహుల్ విస్తృతి వెనుక ఉన్నది ‘సీఏ’నేనని, ఓటర్లను ఆకర్షించేందుకు ఆ సంస్థ సేవలను కాంగ్రెస్ వాడుకుంటోందని బీజేపీ నేత, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. మరోవైపు, బిహార్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ ఈ సంస్థ సేవలను వినియోగించుకుందంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేందుకు ఉద్దేశించిన ‘బ్రెగ్జిట్’ ఉద్యమంలో ‘సీఏ’ పాత్రపై వివాదం చెలరేగి, పలు దేశాల్లో దర్యాప్తులు కొనసాగుతున్న వేళ.. భారత్‌నూ ఈ అంశం కుదిపేయడం రానున్న రోజుల్లో సోషల్ మీడియా ప్రభావాన్ని కళ్లకు కడుతోంది. కాంగ్రెస్ జవాబివ్వాలి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతిలో కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకున్న సంబంధమేంటో రాహుల్ గాంధీ చెప్పాలని రవిశంకర్ డిమాండ్ చేశారు. ‘ఈ డేటా విశ్లేషణ సంస్థ సెక్స్, అనైతిక మార్గాలు, అసత్యపు వార్తల ద్వారా ఎన్నికలను ప్రభావితం చేస్తుందని నిరూపితమైంది. ఇలాంటి సంస్థతో కాంగ్రెస్ కలిసి పనిచేస్తోంది’ అని ఆయన ఆరోపించారు. ‘2019 ఎన్నికల ప్రచారంలో మోదీపై కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం అంటూ మీడియాలోని ఓ వర్గం ప్రచారం చేస్తుంటే ఏమో అనుకున్నాం. అది ఇదేనా. సీఏ సంస్థ అమ్మాయిలను ఎరగా వేసి, డబ్బులు ఆశజూపి రాజకీయ నాయకులను ఉచ్చులోకి దించుతుంది, ఫేస్బుక్ డేటాను చోరీ చేస్తుంది. ఇదేనా కాంగ్రెస్ చేయాలనుకున్నది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సంస్థ డేటా విశ్లేషణ వివరాల ద్వారానే ఓటర్లను ఆకర్షిస్తోందా?’ అని ప్రశ్నించారు. ఫేస్బుక్కూ వార్నింగ్ ఫేస్బుక్ వినియోగిస్తున్న 20 కోట్ల మంది భారతీయ వినియోగదారుల వివరాలను దుర్వినియోగం చేసినట్లు తెలిస్తే.. ఫేస్బుక్ సంస్థపై కఠిన చర్యలు తప్పవని రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. ఫేస్బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాలు కూడా ఎన్నికల విధానాన్ని అనైతిక పద్ధతుల్లో ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. భారత ప్రభుత్వం మీడియా, భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తుందని, సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకోవటం తప్పుకాదన్న మంత్రి.. దీన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం ఊరుకోబోమన్నారు. ‘దేశ ప్రయోజనాలు, దేశ భద్రతకు సంబంధించిన విషయమిది. భారత ప్రజాస్వామ్య విధానాన్ని ప్రభావితం చేసే ఏ అంశాన్నైనా సీరియస్‌గా తీసుకుంటాం. అవసరమైతే.. జుకర్‌బర్గ్‌ను భారత్‌కు రప్పించి విచారిస్తాం’ అని ఆయన అన్నారు. బీజేపీతోనే సంబంధాలు బీజేపీయే ఈ సంస్థతో సంబంధాలు పెట్టుకుందని.. అనవసరంగా తమపై ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ పేర్కొంది. బిహార్, గుజరాత్ ఎన్నికల సమయంలో ఈ సంస్థ సేవలను బీజేపీ వినియోగించుకుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. పార్టీకి గానీ, రాహుల్‌కు గానీ సీఏ సంస్థతో సంబంధాల్లేవన్నారు. ఇతర సమస్యలనుంచి దేశం దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోందన్నారు. ‘అవాస్తవాలను ప్రచారం చేయటంలో దిట్ట అయిన బీజేపీ నేడు మరో అసత్యాన్ని తెరపైకి తెచ్చింది. అబద్ధపు ప్రెస్ కాన్ఫరెన్స్, అసత్యాల ఎజెండా, అనైతిక వ్యూహం, అసత్య ప్రకటనలు బీజేపీ, న్యాయంలేని న్యాయశాఖ మంత్రి దినచర్యలో భాగమయ్యాయి’ అని సుర్జేవాలా విమర్శించారు. బిహార్ ఎన్డీయే నేత కుమారుడే సీఏ భారతీయ సంస్థ ఓవిలేనో బిజినెస్ ఇంటెలిజెన్స్ (ఓబీఐ)ను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. యూఎస్, యూకేల్లో విచారణలు ఐదుకోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల వివరాలను తస్కరించడంపై అమెరికా, బ్రిటన్ సహా పలు యూరోపియన్ దేశాలు విచారణకు ఆదేశించాయి. తమ ముందు విచారణకు హాజరవ్వాలంటూ ఇప్పటికే ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆదేశించాయి. అమెరికాలో ఈ కేసును ఆ దేశ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) విచారిస్తోంది. విచారణకు తమ ముందు హాజరవ్వాలని అమెరికన్ కాంగ్రెస్ జుకర్‌బర్గ్‌కు నోటీసులు పంపింది. బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ 2016 ఎన్నికల్లో ట్రంప్ తరపున ప్రచార బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించింది. చిత్తశుద్ధితో చేస్తున్నాం: ఫేస్బుక్ ఫేస్బుక్ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని.. అందువల్ల ఈ సంస్థపై 40వేల డాలర్ల (దాదాపు రూ. 26 లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్టు ఓ కథనంలో పేర్కొంది. తాజా వార్తల నేపథ్యంలో ఫేస్బుక్ షేర్లు బుధవారం మరో 2.6 శాతం పడిపోయాయి. కాగా, ఓ రాజకీయ కన్సల్టెన్సీ తమ వినియోగదారుల డేటా చోరీ చేయటంపై ఆందోళనలో ఉన్నట్లు ఫేస్బుక్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘మేం మోసపోయామని అర్థమైంది. మా పాలసీలకు అనుగుణంగా వినియోగదారుల భద్రతను కాపాడేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. జుకర్‌బర్గ్ సహా మిగిలిన ఉన్నతాధికారులంతా రాత్రింబవళ్లు ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఫేస్బుక్ పేర్కొంది. ‘డిలీట్ ఫేస్బుక్’ ఉద్యమం వ్యక్తిగత డేటా లీకేజీ ఘటన అనంతరం.. ఫేస్బుక్ అకౌంట్‌ను తొలగించాలంటూ వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ పేర్కొన్నారు. ‘డిలీట్ ఫేస్బుక్.. ఇదే సరైన సమయం’ అని బ్రయాన్ ఆక్టన్ పేర్కొన్నారు. అటు డిలీట్ ఫేస్బుక్ ప్రచారం మిగిలిన సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది. పలు మీడియా సంస్థలు కూడా ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాలిఫోర్నియాకు చెందిన వాట్సాప్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ 2009లో వాట్సాప్ సేవలను ప్రారంభించింది. 2014లో ఫేస్బుక్ సంస్థ 19 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.2 లక్షల కోట్లు)కు ఈ సంస్థను కొనుగోలు చేసింది. కాగా, గతేడాది సెప్టెంబర్‌లోనే బ్రయాన్ ఫేస్‌బుక్‌ను వదిలి కొత్త సంస్థలో చేరారు. ఫేస్బుక్ డేటాతో ఏం చేస్తారు? స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారిలో దాదాపు ప్రతీ ఒక్కరు ఫేస్బుక్ అకౌంట్ ఉన్నవారే. తమ వ్యక్తిగత, వృత్తిగత వివరాలను అందులో పొందుపర్చినవారే. రాజకీయం, సామాజికం, సాహిత్యం సహా దాదాపు అన్ని సమకాలీన అంశాలు, ఘటనలపై తమ అభిప్రాయాలను పంచుకున్నవారే. ఫేస్బుక్ వినియోగదారుల వివరాలతో కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ ఏం చేసింది? ఆ వివరాలను ఎందుకు, ఎలా వినియోగించింది? దాంతో తమకేం నష్టం?.. ఇలాంటి సందేహాలు, ప్రశ్నలు ఎన్నో వినియోగదారులను వేధిస్తున్నాయి. అలెగ్జాండర్ నిక్స్ సీఏ చేసే పనేంటి? స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ లాబొరేటరీస్ (ఎస్సీఎల్) అనే సంస్థ బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తోంది. దీనికి అనుబంధంగా కేంబ్రిడ్జ్ అనలిటికా (సీఏ) అనే సంస్థ ఉంది. ఇది క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా డేటా విశ్లేషణలో సహకరిస్తుంది. ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకుని తమ క్లయింట్ల ఎన్నికల ప్రచారానికి వ్యూహాలను సీఏ రూపొందిస్తుంది. ఏ పార్టీకి అనుకూలంగా ఓటర్లు ఉన్నారనే అంతర్గత సమాచారం, వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా క్లయింట్ల వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఎన్నికల్లో గెలిచేందుకు అసత్యవార్తలను ఫేస్బుక్లో ప్రచారం చేయటం, మాజీ గూఢచారులతో వ్యూహాలు రూపొందించటం కూడా సీఏ పనే. అవసరమైతే ప్రత్యర్థి అభ్యర్థులపై హానీట్రాప్ (అమ్మాయిలను ఎరగావేయటం)కూ వెనుకాడరని ఈ సంస్థపై ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. సీఏ సీఈఓ అలెగ్జాండర్ నిక్స్ బీబీసీ ఛానెల్ 4 ‘స్టింగ్ ఆపరేషన్’లో అడ్డంగా దొరికిపోవడం ద్వారానే ఈ డొంకంతా కదిలింది. అమెరికా ఎన్నికలు, బ్రెగ్జిట్తోపాటు, బ్రిటన్, ఇజ్రాయిల్‌లలో రాజకీయ నేతల తెరవెనక సమాచార సేకరణ కోసం మాజీ గూఢచారుల సేవలను వినియోగించుకున్నామని కూడా నిక్స్ వెల్లడించాడు. యాప్‌లతో కొట్టేస్తారు.. ఫేస్బుక్లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఈ సంస్థ సేకరించి అధ్యయనం చేస్తుంది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ అనే కంపెనీ ‘పర్సనాలిటీ క్విజ్’ అనే యాప్‌ను రూపొందించింది. దీన్ని దాదాపు 3 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌ను తెరిచేందుకు ఫేస్‌బుక్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు.. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులతోపాటు వారి ఫేస్బుక్ మిత్రుల (మొత్తం సంఖ్య కోట్లలోనే) వివరాలు, వారి ఇష్టాయిష్టాలను ఈ సంస్థ తెలుసుకోగలిగింది. ఇలా అక్రమంగా సేకరించిన సమాచారంతో సీఏ ‘సైకలాజికల్ ప్రొఫైల్స్’ను సృష్టించి విశ్లేషిస్తుంది. ఏం చేస్తే ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చు? వ్యతిరేకతనుంచి గట్టెక్కేందుకు ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేయాలి? అనే వివరాలనూ ఈ సంస్థ సూచిస్తుంది. ట్రంప్ వెనకా, బ్రెగ్జిట్ ముందూ.. సీఏనే! ఒక్కో అమెరికా ఓటర్ నాడిని, మానసిక స్థితిని తెలుసుకోవటం కోసమే.. 2016 అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో సీఏ పనిచేసిందని స్పష్టమైంది. తద్వారా ట్రంప్ అనుకూల ఎన్నికల ప్రచార వ్యూహాలు సిద్ధం చేసింది. అటు, బ్రెగ్జిట్ సందర్భంగా బ్రిటన్ ఓటర్లనూ ప్రభావితం చేయడంపై బ్రిటన్ విచారణ జరుపుతోంది. భారత్‌లో ఇప్పటికే పునాదులు భారత్‌లోని ఒవిలెనో బిజినెస్ ఇంటెలిజెన్స్ (ఓబీఐ) గ్రూపు.. సీఏ మాతృ సంస్థ అయిన ఎస్సీఎల్తో 2010 నుంచి కలిసి పనిచేస్తుంది. 2014 ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు కోసం ఈ సంస్థ బీజేపీ, కాంగ్రెస్‌లను సంప్రదించినా డీల్ కుదరలేదని సమాచారం. 2019 ఎన్నికల కోసం ప్రస్తుతం ఈ రెండు పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. భారత్‌లోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తమ క్లయింట్లేనని ఓబీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. 2016లో ఓ ప్రాంతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా గ్రూపు ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడలేదు’ అని ఒబీఐ హెడ్ అమ్రిష్ త్యాగి (జేడీయూ మాజీ రాజ్యసభ సభ్యుడు కేసీ త్యాగి కుమారుడు) పేర్కొన్నారు. 2010 బిహార్ ఎన్నికల్లో.. 2010 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ‘లోతైన ఎన్నికల విశ్లేషణ’ జరిపినట్టు ఓబీఐ పేర్కొంది. ఈ కాంట్రాక్ట్‌లో భాగంగా వివిధ పార్టీల వైపు ఆసక్తి చూపే ఓటర్లను గుర్తించామని తెలిపింది. తమ సంస్థ పనిచేసిన సీట్లలో 90 శాతానికి పైగా స్థానాల్లో తమ క్లయింట్ విజయం సాధించినట్టు ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. అత్యధిక యువ ఓటర్లున్న భారత్‌లో యువత వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనుంది. 2019 ఎన్నికల్లో దేశంలోని 13.30 కోట్ల మంది ఓటర్లు తొలిసారి పోలింగ్ బూత్‌లకు రానున్న నేపథ్యంలో వారి నాడిని పసిగట్టేందుకు సామాజిక మాధ్యమాలే కీలకం కానున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘రాఫెల్’పై మాటల యుద్ధం
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్ష కాంగ్రెస్, అధికార బీజేపీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఓ వ్యాపారవేత్తకు ప్రయోజనం చేకూర్చేలా బీజేపీ మొత్తం ఒప్పందంలోనే మార్పులు చేసిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ఆరోపించారు. వీటిని బీజేపీ అంతే దీటుగా తిప్పికొట్టింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఆ పార్టీ కీలక నేతలు విచారణ ఎదుర్కొనే అవకాశాలున్నందున ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసింది. ఇటీవలే ఏర్పాటైన అఖిల భారత అసంఘటిత రంగ కార్మికుల కాంగ్రెస్ (ఏఐయూడబ్ల్యూసీ) సమావేశం తరువాత రాహుల్ మాట్లాడుతూ... ఓ వ్యాపారవేత్తకు అనుకూలంగా వ్యవహరించేందుకే రాఫెల్ ఒప్పందంలో మార్పులు చేసిన ప్రధాని మోదీని నిలదీయాలని మీడియాను కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమిత్ షా కొడుకు జయ్ షా కంపెనీ లాభాలు అనూహ్యంగా పెరిగాయని ఈ విషయంపై కూడా ప్రశ్నించాలన్నారు. ‘మీరు నన్ను అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తా. రాఫెల్ ఒప్పందంపై మోదీని ఎందుకు ప్రశ్నించరు? జయ్ షా కంపెనీ గురించి ఎందుకు అడగరు?’ అని అన్నారు. ఏరోస్పేస్ రంగంలో ఎలాంటి అనుభవంలేని రిలయన్స్ కంపెనీని రఫేల్ ఒప్పందంలో భాగం చేయ డంపై ప్రధాని వివరణ ఇవ్వాలన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ...తమ పాలనలో ఒక్క అవినీతి కేసు కూడా నమోదుకాలేదన్న నిజాన్ని కాంగ్రెస్ అంగీకరించలేకపోతోందన్నారు. రిలయన్స్‌తో ఒప్పందం: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ప్రయోజనాలను దెబ్బతీశారని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ఇటీవలే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్ విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ హెచ్ఏఎల్కు సాంకేతికతను బదిలీచేయడానికి నిరాకరించి రిలయన్స్ డిఫెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ఫలితంగా రెండు సంస్థలు ఓ సంయుక్త సంస్థనూ ఏర్పాటుచేశాయి. యూపీఏ హయాంలో నిర్ధారించిన ధర కన్నా చాలా ఎక్కువకు విమానాలు కొనుగోలు చేస్తున్నారని సుర్జేవాలా ఆరోపించారు. కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమని రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ కొట్టిపారేసింది. ఇది రెండు ప్రైవేట్ కంపెనీల మధ్య ఒప్పందమని, ఇందులో ప్రభుత్వ పాత్ర లేదని వెల్లడించింది. -
‘ఆకలి’పై రాహుల్ వర్సెస్ స్మృతి
న్యూఢిల్లీ: ప్రపంచ ఆకలి సూచీలో భారత్ పనితీరు తీసికట్టుగా ఉందంటూ ఇటీవల ఓ నివేదిక విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య మాటల యుద్ధం జరిగింది. కేంద్రాన్ని విమర్శిస్తూ రాహుల్ చేసిన ట్వీట్‌కు స్మృతి అదే స్థాయిలో బదులిచ్చారు. తొలుత రాహుల్...‘ఆకలేస్తే ఓపిగ్గా ఉండండి. తిండి లేకపోతేనేం. ఇదే విషయంపై ఢిల్లీలో చర్చ నడుస్తోంది’ అని హిందీ కవి దుష్యంత్ కుమార్ కవితను ఉటంకించారు. దీనిపై స్మృతి స్పందిస్తూ...‘అధికారమనే ఆకలితో ఉన్న మీరు ఓపిక వహించండి. సంఖ్యాబలం లేకుంటేనేం స్వార్థపరులతో కలసి దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా నానా యాగీ చేస్తున్నారు’ అని ట్వీట్‌చేశారు. బీజేపీ మహిళా వ్యతిరేకి కాదు: సుష్మ బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అన్న ప్రతిపక్షాల విమర్శల్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తిప్పికొట్టారు. మోదీ ప్రభుత్వంలో ఆరుగురు మహిళా మంత్రులున్నారని శనివారం జరిగిన ‘మహిళా టౌన్‌హాల్ కార్యక్రమం’లో గుర్తుచేశారు. కీలకమైన భద్రతపై కేబినెట్ కమిటీలో ఇద్దరు మహిళలకు చోటుందని తెలిపారు.