ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి రవిశంకర్, మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత సూర్జేవాలా
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ డేటా లీకేజ్ వివాదం భారత్‌కూ పాకింది. కోట్లాది ఫేస్‌బుక్ వినియోగదారుల వివరాలను పలు దేశాల్లో రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాల రూపకల్పనకు అక్రమంగా వినియోగించిన సంస్థ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ)’తో భారత్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధం ఉందన్న వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ తదితర పార్టీలు తమ క్లయింట్లేనంటూ ఆ సంస్థ భారతీయ భాగస్వామి ఓబీఐ (ఒవలెనొ బిజినెస్ ఇంటలిజెన్స్) తన వెబ్‌సైట్లో ప్రకటించడం సంచలనం రేకెత్తించింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. సీఏతో అంటకాగింది, సంబంధాలు కొనసాగిస్తోంది మీరంటే.. మీరంటూ ఒకరిపై ఒకరు ఆరోపణాస్త్రాలు సంధించారు.
సోషల్‌మీడియాలో రాహుల్ విస్తృతి వెనుక ఉన్నది ‘సీఏ’నేనని, ఓటర్లను ఆకర్షించేందుకు ఆ సంస్థ సేవలను కాంగ్రెస్ వాడుకుంటోందని బీజేపీ నేత, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. మరోవైపు, బిహార్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ ఈ సంస్థ సేవలను వినియోగించుకుందంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేందుకు ఉద్దేశించిన ‘బ్రెగ్జిట్’ ఉద్యమంలో ‘సీఏ’ పాత్రపై వివాదం చెలరేగి, పలు దేశాల్లో దర్యాప్తులు కొనసాగుతున్న వేళ.. భారత్‌నూ ఈ అంశం కుదిపేయడం రానున్న రోజుల్లో సోషల్ మీడియా ప్రభావాన్ని కళ్లకు కడుతోంది.
కాంగ్రెస్ జవాబివ్వాలి
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతిలో కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకున్న సంబంధమేంటో రాహుల్ గాంధీ చెప్పాలని రవిశంకర్ డిమాండ్ చేశారు. ‘ఈ డేటా విశ్లేషణ సంస్థ సెక్స్, అనైతిక మార్గాలు, అసత్యపు వార్తల ద్వారా ఎన్నికలను ప్రభావితం చేస్తుందని నిరూపితమైంది. ఇలాంటి సంస్థతో కాంగ్రెస్ కలిసి పనిచేస్తోంది’ అని ఆయన ఆరోపించారు. ‘2019 ఎన్నికల ప్రచారంలో మోదీపై కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం అంటూ మీడియాలోని ఓ వర్గం ప్రచారం చేస్తుంటే ఏమో అనుకున్నాం. అది ఇదేనా. సీఏ సంస్థ అమ్మాయిలను ఎరగా వేసి, డబ్బులు ఆశజూపి రాజకీయ నాయకులను ఉచ్చులోకి దించుతుంది, ఫేస్‌బుక్ డేటాను చోరీ చేస్తుంది. ఇదేనా కాంగ్రెస్ చేయాలనుకున్నది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సంస్థ డేటా విశ్లేషణ వివరాల ద్వారానే ఓటర్లను ఆకర్షిస్తోందా?’ అని ప్రశ్నించారు.
ఫేస్‌బుక్‌కూ వార్నింగ్
ఫేస్‌బుక్ వినియోగిస్తున్న 20 కోట్ల మంది భారతీయ వినియోగదారుల వివరాలను దుర్వినియోగం చేసినట్లు తెలిస్తే.. ఫేస్‌బుక్ సంస్థపై కఠిన చర్యలు తప్పవని రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. ఫేస్‌బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాలు కూడా ఎన్నికల విధానాన్ని అనైతిక పద్ధతుల్లో ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. భారత ప్రభుత్వం మీడియా, భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తుందని, సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకోవటం తప్పుకాదన్న మంత్రి.. దీన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం ఊరుకోబోమన్నారు. ‘దేశ ప్రయోజనాలు, దేశ భద్రతకు సంబంధించిన విషయమిది. భారత ప్రజాస్వామ్య విధానాన్ని ప్రభావితం చేసే ఏ అంశాన్నైనా సీరియస్‌గా తీసుకుంటాం. అవసరమైతే.. జుకర్‌బర్గ్‌ను భారత్‌కు రప్పించి విచారిస్తాం’ అని ఆయన అన్నారు.
బీజేపీతోనే సంబంధాలు
బీజేపీయే ఈ సంస్థతో సంబంధాలు పెట్టుకుందని.. అనవసరంగా తమపై ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ పేర్కొంది. బిహార్, గుజరాత్ ఎన్నికల సమయంలో ఈ సంస్థ సేవలను బీజేపీ వినియోగించుకుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. పార్టీకి గానీ, రాహుల్‌కు గానీ సీఏ సంస్థతో సంబంధాల్లేవన్నారు. ఇతర సమస్యలనుంచి దేశం దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోందన్నారు. ‘అవాస్తవాలను ప్రచారం చేయటంలో దిట్ట అయిన బీజేపీ నేడు మరో అసత్యాన్ని తెరపైకి తెచ్చింది. అబద్ధపు ప్రెస్ కాన్ఫరెన్స్, అసత్యాల ఎజెండా, అనైతిక వ్యూహం, అసత్య ప్రకటనలు బీజేపీ, న్యాయంలేని న్యాయశాఖ మంత్రి దినచర్యలో భాగమయ్యాయి’ అని సుర్జేవాలా విమర్శించారు. బిహార్ ఎన్డీయే నేత కుమారుడే సీఏ భారతీయ సంస్థ ఓవిలేనో బిజినెస్ ఇంటెలిజెన్స్ (ఓబీఐ)ను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
యూఎస్, యూకేల్లో విచారణలు
ఐదుకోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల వివరాలను తస్కరించడంపై అమెరికా, బ్రిటన్ సహా పలు యూరోపియన్ దేశాలు విచారణకు ఆదేశించాయి. తమ ముందు విచారణకు హాజరవ్వాలంటూ ఇప్పటికే ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆదేశించాయి. అమెరికాలో ఈ కేసును ఆ దేశ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) విచారిస్తోంది. విచారణకు తమ ముందు హాజరవ్వాలని అమెరికన్ కాంగ్రెస్ జుకర్‌బర్గ్‌కు నోటీసులు పంపింది. బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ 2016 ఎన్నికల్లో ట్రంప్ తరపున ప్రచార బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించింది.
చిత్తశుద్ధితో చేస్తున్నాం: ఫేస్‌బుక్
ఫేస్‌బుక్ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని.. అందువల్ల ఈ సంస్థపై 40వేల డాలర్ల (దాదాపు రూ. 26 లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్టు ఓ కథనంలో పేర్కొంది. తాజా వార్తల నేపథ్యంలో ఫేస్‌బుక్ షేర్లు బుధవారం మరో 2.6 శాతం పడిపోయాయి. కాగా, ఓ రాజకీయ కన్సల్టెన్సీ తమ వినియోగదారుల డేటా చోరీ చేయటంపై ఆందోళనలో ఉన్నట్లు ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘మేం మోసపోయామని అర్థమైంది. మా పాలసీలకు అనుగుణంగా వినియోగదారుల భద్రతను కాపాడేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. జుకర్‌బర్గ్ సహా మిగిలిన ఉన్నతాధికారులంతా రాత్రింబవళ్లు ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఫేస్‌బుక్ పేర్కొంది.
‘డిలీట్ ఫేస్‌బుక్’ ఉద్యమం
వ్యక్తిగత డేటా లీకేజీ ఘటన అనంతరం.. ఫేస్‌బుక్ అకౌంట్‌ను తొలగించాలంటూ వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ పేర్కొన్నారు. ‘డిలీట్ ఫేస్‌బుక్.. ఇదే సరైన సమయం’ అని బ్రయాన్ ఆక్టన్ పేర్కొన్నారు. అటు డిలీట్ ఫేస్‌బుక్ ప్రచారం మిగిలిన సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది. పలు మీడియా సంస్థలు కూడా ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాలిఫోర్నియాకు చెందిన వాట్సాప్ ఇన్‌కార్పొరేటెడ్ కంపెనీ 2009లో వాట్సాప్ సేవలను ప్రారంభించింది. 2014లో ఫేస్‌బుక్ సంస్థ 19 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.2 లక్షల కోట్లు)కు ఈ సంస్థను కొనుగోలు చేసింది. కాగా, గతేడాది సెప్టెంబర్‌లోనే బ్రయాన్ ఫేస్‌బుక్‌ను వదిలి కొత్త సంస్థలో చేరారు.
ఫేస్‌బుక్ డేటాతో ఏం చేస్తారు?
స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారిలో దాదాపు ప్రతీ ఒక్కరు ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్నవారే. తమ వ్యక్తిగత, వృత్తిగత వివరాలను అందులో పొందుపర్చినవారే. రాజకీయం, సామాజికం, సాహిత్యం సహా దాదాపు అన్ని సమకాలీన అంశాలు, ఘటనలపై తమ అభిప్రాయాలను పంచుకున్నవారే. ఫేస్‌బుక్ వినియోగదారుల వివరాలతో కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ ఏం చేసింది? ఆ వివరాలను ఎందుకు, ఎలా వినియోగించింది? దాంతో తమకేం నష్టం?.. ఇలాంటి సందేహాలు, ప్రశ్నలు ఎన్నో వినియోగదారులను వేధిస్తున్నాయి.
అలెగ్జాండర్ నిక్స్
సీఏ చేసే పనేంటి?
స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ లాబొరేటరీస్ (ఎస్‌సీఎల్) అనే సంస్థ బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తోంది. దీనికి అనుబంధంగా కేంబ్రిడ్జ్ అనలిటికా (సీఏ) అనే సంస్థ ఉంది. ఇది క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా డేటా విశ్లేషణలో సహకరిస్తుంది. ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకుని తమ క్లయింట్ల ఎన్నికల ప్రచారానికి వ్యూహాలను సీఏ రూపొందిస్తుంది. ఏ పార్టీకి అనుకూలంగా ఓటర్లు ఉన్నారనే అంతర్గత సమాచారం, వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా క్లయింట్ల వ్యూహాలను సిద్ధం చేస్తుంది.
ఎన్నికల్లో గెలిచేందుకు అసత్యవార్తలను ఫేస్‌బుక్‌లో ప్రచారం చేయటం, మాజీ గూఢచారులతో వ్యూహాలు రూపొందించటం కూడా సీఏ పనే. అవసరమైతే ప్రత్యర్థి అభ్యర్థులపై హానీట్రాప్ (అమ్మాయిలను ఎరగావేయటం)కూ వెనుకాడరని ఈ సంస్థపై ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. సీఏ సీఈఓ అలెగ్జాండర్ నిక్స్ బీబీసీ ఛానెల్ 4 ‘స్టింగ్ ఆపరేషన్’లో అడ్డంగా దొరికిపోవడం ద్వారానే ఈ డొంకంతా కదిలింది. అమెరికా ఎన్నికలు, బ్రెగ్జిట్‌తోపాటు, బ్రిటన్, ఇజ్రాయిల్‌లలో రాజకీయ నేతల తెరవెనక సమాచార సేకరణ కోసం మాజీ గూఢచారుల సేవలను వినియోగించుకున్నామని కూడా నిక్స్ వెల్లడించాడు.
యాప్‌లతో కొట్టేస్తారు..
ఫేస్‌బుక్‌లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఈ సంస్థ సేకరించి అధ్యయనం చేస్తుంది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ అనే కంపెనీ ‘పర్సనాలిటీ క్విజ్’ అనే యాప్‌ను రూపొందించింది. దీన్ని దాదాపు 3 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌ను తెరిచేందుకు ఫేస్‌బుక్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు.. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారులతోపాటు వారి ఫేస్‌బుక్ మిత్రుల (మొత్తం సంఖ్య కోట్లలోనే) వివరాలు, వారి ఇష్టాయిష్టాలను ఈ సంస్థ తెలుసుకోగలిగింది. ఇలా అక్రమంగా సేకరించిన సమాచారంతో సీఏ ‘సైకలాజికల్ ప్రొఫైల్స్’ను సృష్టించి విశ్లేషిస్తుంది. ఏం చేస్తే ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చు? వ్యతిరేకతనుంచి గట్టెక్కేందుకు ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేయాలి? అనే వివరాలనూ ఈ సంస్థ సూచిస్తుంది.
ట్రంప్ వెనకా, బ్రెగ్జిట్ ముందూ.. సీఏనే!
ఒక్కో అమెరికా ఓటర్ నాడిని, మానసిక స్థితిని తెలుసుకోవటం కోసమే.. 2016 అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో సీఏ పనిచేసిందని స్పష్టమైంది. తద్వారా ట్రంప్ అనుకూల ఎన్నికల ప్రచార వ్యూహాలు సిద్ధం చేసింది. అటు, బ్రెగ్జిట్ సందర్భంగా బ్రిటన్ ఓటర్లనూ ప్రభావితం చేయడంపై బ్రిటన్ విచారణ జరుపుతోంది.
భారత్‌లో ఇప్పటికే పునాదులు
భారత్‌లోని ఒవిలెనో బిజినెస్ ఇంటెలిజెన్స్ (ఓబీఐ) గ్రూపు.. సీఏ మాతృ సంస్థ అయిన ఎస్‌సీఎల్‌తో 2010 నుంచి కలిసి పనిచేస్తుంది. 2014 ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు కోసం ఈ సంస్థ బీజేపీ, కాంగ్రెస్‌లను సంప్రదించినా డీల్ కుదరలేదని సమాచారం. 2019 ఎన్నికల కోసం ప్రస్తుతం ఈ రెండు పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. భారత్‌లోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తమ క్లయింట్లేనని ఓబీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 2016లో ఓ ప్రాంతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా గ్రూపు ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడలేదు’ అని ఒబీఐ హెడ్ అమ్రిష్ త్యాగి (జేడీయూ మాజీ రాజ్యసభ సభ్యుడు కేసీ త్యాగి కుమారుడు) పేర్కొన్నారు.
2010 బిహార్ ఎన్నికల్లో..
2010 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ‘లోతైన ఎన్నికల విశ్లేషణ’ జరిపినట్టు ఓబీఐ పేర్కొంది. ఈ కాంట్రాక్ట్‌లో భాగంగా వివిధ పార్టీల వైపు ఆసక్తి చూపే ఓటర్లను గుర్తించామని తెలిపింది. తమ సంస్థ పనిచేసిన సీట్లలో 90 శాతానికి పైగా స్థానాల్లో తమ క్లయింట్ విజయం సాధించినట్టు ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అత్యధిక యువ ఓటర్లున్న భారత్‌లో యువత వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనుంది. 2019 ఎన్నికల్లో దేశంలోని 13.30 కోట్ల మంది ఓటర్లు తొలిసారి పోలింగ్ బూత్‌లకు రానున్న నేపథ్యంలో వారి నాడిని పసిగట్టేందుకు సామాజిక మాధ్యమాలే కీలకం కానున్నాయి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment