న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ ఖాతాదారుల సమాచారం దుర్వినియోగంపై కాంగ్రెస్–బీజేపీల మధ్య మాటల యుద్ధం సద్దుమణగక ముందే మొబైల్ యాప్స్ ద్వారా డేటా లీకేజీ వివాదం వేడిపుట్టిస్తోంది. ఫ్రెంచ్ హ్యాకర్ ఎలియట్ అల్డర్‌సన్ (మారుపేరు) ఈ సమాచార చౌర్యాన్ని వెలుగులోకి తీసుకురాగా.. రెండు జాతీయ పార్టీలు సోమవారం ట్విటర్ వేదికగా ఆరోపణలు గుప్పించుకున్నాయి. ప్రధాని మోదీ అధికారిక ‘నమో’ యాప్ నుంచి వ్యక్తిగత సమాచారం యూజర్ల అనుమతి లేకుండా మూడో పార్టీకి చేరుతోందని ఎలియట్ ఆరోపణలతో ఈ వివాదానికి బీజం పడగా...నమో యాప్‌పై ఆరోపణల్ని బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ యాప్ ‘విత్ ఐఎన్‌సీ’ నుంచి కూడా వ్యక్తిగత సమాచారం తరలిపోతోందని బీజేపీ ప్రత్యారోపణలు చేసింది.
కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లోని సభ్యత్వ నమోదు లింక్‌ను తొలగించారని, కాంగ్రెస్ ఏదో దాస్తోందని బీజేపీ ఆరోపించింది. సరిగా పనిచేయనందునే లింక్ తొలగించామని కాంగ్రెస్ కౌంటరిచ్చింది. గతంలో ఆధార్ సాఫ్ట్‌వేర్‌లోని లొసుగుల్ని బయటపెట్టిన ఎలియట్ అల్డర్‌సన్ ‘నమో’ యాప్ యూజర్ల సమాచారం నుంచి అమెరికాలోని కంపెనీకి తరలిపోతోందని శనివారం వరుసగా ట్వీట్లు చేశారు. ఆదివారం మరో ట్వీట్ చేస్తూ.. తన ట్వీట్లతో అప్రమత్తమై నమో యాప్‌లోని ప్రైవసీ పాలసీలో ఎవరికీ అనుమానం రాకుండా మార్పులు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ యాప్ నుంచి కూడా వ్యక్తిగత సమాచారం తరలిపోయిందని అల్డర్‌సన్ తప్పుపట్టారు.
‘డిలీట్‌నమోయాప్’ : రాహుల్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ‘నమో’ యాప్‌పై సోమవారం ఆరోపణల్ని కొనసాగిస్తూ .. ‘ఆడియో, వీడియోలు, మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల కాంటాక్ట్‌లను మోదీ ‘నమో’ యాప్ రికార్డు చేయడంతో పాటు మీరు ఎక్కడ ఉన్నారన్నదీ జీపీఎస్ ద్వారా తెల్సుకుంటున్నారు. భారతీయులపై గూఢచర్యం చేసేందుకు ఇష్టపడే బిగ్‌బాస్ మోదీ’ అని ట్వీట్ చేశారు. మన పిల్లల సమాచారాన్ని మోదీ కోరుకుంటున్నారని, 13 లక్షల ఎన్‌సీసీ క్యాడెట్స్‌తో బలవంతంగా నమో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారని పేర్కొంటూ ‘డిలీట్‌నమోయాప్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు.
‘నమో యాప్‌లోని కోట్లాది భారతీయుల డేటాతో తన వ్యక్తిగత డేటాబేస్‌ను రూపొందించేందుకు మోదీ తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో దేశంతో సంభాషించాలని ఆయన కోరుకుంటే ఎలాంటి సమస్యా లేదు. అయితే అందుకు అధికారిక పీఎంఓ యాప్‌ను వాడుతున్నారు. ఈ డేటా దేశానిది. మోదీది కాదు’ అని విమర్శించారు. ఫేస్‌బుక్ సమాచారం దుర్వినియోగంలో కేంబ్రిడ్జ్ అనలిటికాతో కాంగ్రెస్ సంబంధాలపై వాస్తవాల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రాహుల్ ట్వీట్లను బీజేపీ కూడా తిప్పికొట్టింది.
యాప్‌ని ఎందుకు తొలగించారు: బీజేపీ
రాహుల్ ఆరోపణలల్నిమంత్రి స్మృతీ ఇరానీ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. ‘రాహుల్ జీ.. యాప్స్ ఇన్‌స్టాల్ సమయంలో అడిగే సాధారణ అనుమతులు గూఢచర్యంతో సమానం కాదని ‘చోటా భీమ్’కి కూడా తెలుసు. ‘డిలీట్‌నమోయాప్’కి బదులు చివరకు మీ కాంగ్రెస్ యాప్‌నే తొలగించారు. సింగపూర్ సర్వర్లకు మీ యాప్ ద్వారా కాంగ్రెస్ ఎందుకు సమాచారం పంపుతుందో జవాబిస్తారా?’ అని ప్రశ్నించారు. బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జ్ అమిత్ మాల్వీయ ట్వీట్ చేస్తూ.. ‘కాంగ్రెస్ సభ్యత్వ నమోదు వెబ్‌సైట్ లింక్ తొలగించారు. membership.inc.in లింక్‌లోకి వెళ్లి సభ్యత్వ నమోదుకు ప్రయత్నిస్తే ‘స్వల్ప మార్పులు చేస్తున్నాం.
తర్వాత ప్రయత్నించండి’ అని సందేశమొస్తుంది. ఏం దాచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’ అని తప్పుపట్టారు. ‘హాయ్.. నా పేరు రాహుల్. దేశంలోని పురాతన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిని.. మీరు మా అధికారిక యాప్‌లోకి సైనప్ అయితే మీ సమాచారాన్ని సింగపూర్‌లోని నా స్నేహితులకు చేరవేస్తా’ అని ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ వంటి సాంకేతిక నిరక్షరాస్యుడిని భారత రాజకీయాల్లో చాలా అరుదుగా చూస్తామని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. నమో యాప్ ద్వారా మోదీ, బీజేపీలు ఈవీఎంలకు అనుంధానమై హ్యాక్ చేయడం వల్లే వరుసగా ఎన్నికల్లో గెలుస్తున్నారని కూడా రాహుల్ ఆరోపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు.
‘విత్‌ఐఎన్‌సీ’ యాప్‌ని ఐదు నెలలుగా వాడడం లేదు: కాంగ్రెస్
బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ దివ్య స్పందన స్పందిస్తూ.. ‘ కాంగ్రెస్ సభ్యత్వ లింకు పేజీ సరిగా పనిచేయడం లేదు. అందువల్ల కాంగ్రెస్ వెబ్‌సైట్ ద్వారానే కొద్దికాలం సభ్యత్వ నమోదు అందుబాటులో ఉంటుంది’ తెలిపారు. కాంగ్రెస్ కూడా ట్వీట్ చేస్తూ ‘విత్‌ఐఎన్‌సీ’ యాప్ గత ఐదునెలలుగా వాడడం లేదని.. నవంబర్ 16, 2017 నుంచి సభ్యత్వ నమోదును http://www.inc.in వెబ్‌సైట్‌కు మార్చామని తెలిపింది. ఒక ప్రభుత్వ యాప్ 15 అంశాల్లో అనుమతి కోరుతోందని, నమో యాప్ మాత్రం 22 అంశాల్లో అనుమతి అడుగుతోందని ఆ పార్టీ నేత అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. 10 వేల ఏటీఎంల డేటా లీక్ అయిందని, 32 లక్షల ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుదారుల సమాచారం పక్కదారి పట్టిందన్న ఆరోపణల్ని ఆయన ఉదహరించారు.
Comments
Please login to add a commentAdd a comment