నేడు మరింత హాట్‌హాట్‌గా లోక్‌సభ! | Parliament Winter Sessions 2024 Dec 14th Live Updates And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

రాహుల్‌ వర్సెస్‌ మోదీ.. నేడు మరింత హాట్‌హాట్‌గా లోక్‌సభ!

Published Sat, Dec 14 2024 10:14 AM | Last Updated on Sat, Dec 14 2024 11:11 AM

Parliament Sessions Dec 14th Live Updates

Live Updates..

న్యూఢిల్లీ: రాజ్యాంగంపై కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం పార్లమెంటుకు చేరింది. ఇరుపక్షాల మధ్య మధ్య ఇవాళ లోక్‌సభలో వాడీవేడి చర్చ జరగనుంది. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక చర్చలో ప్రధాని మోదీ- ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఇవాళ మాట్లాడనున్నారు. 

లోక్‌సభ చేపట్టిన రెండు రోజుల చర్చలో.. ఇవాళ కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. రాజ్యాంగంపై చర్చలో.. రాహుల్‌ గాంధీ, ఇతర పార్టీల నేతలూ మాట్లాడతారు. సాయంత్రం.. ఆఖర్లో ప్రధాని ప్రసంగంతో ఈ చర్చ ముగియనుంది. ఈ క్రమంలో  నిన్న ప్రియాంక గాంధీ.. ఇవాళ రాహుల్‌ గాంధీ వేసిన ప్రశ్నలకు, విమర్శలకు మోదీ స్పందించనున్నారు.

పార్లమెంట్‌ వద్ద ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ.. విపత్తుకు గురైన వయనాడ్‌కు స్పెషల్‌ ప్యాకేటీ ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. హిమాచల్‌లో కూడా ఇలాంటి విపత్తే సంభవించింది. ఈ మేరకు సాయం కేంద్రాన్ని కోరాం. ఈ మేరకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశాం. కానీ, విన్నపాన్ని వారు పట్టించుకోలేదు. విపత్తును కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అక్కడ నివస్తున్న వాళ్లు కూడా భారతీయలే అని కామెంట్స్‌ చేశారు.

 తొలిరోజు.. శుక్రవారం బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ అధికారంపైనే యావ అని, అందుకోసం రాజ్యాంగానికి నిరంతరం తూట్లు పొడుస్తూ వచ్చిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్‌ తన దశాబ్దాల పాలనలో వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని ఎన్నడూ సహించింది లేదు. రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి పాతర వేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. అలాంటి పార్టీ నోట రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు వినడం ఎబ్బెట్టుగా ఉంది’’ అంటూ ఎత్తిపొడిచారు. 

ఆయన విమర్శలకు కాంగ్రెస్‌ తరఫున నూతన ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా గట్టిగా కౌంటరిచ్చారు. పార్లమెంట్‌లో తొలి ప్రసంగం చేసిన ఆమె.. బీజేపీపై ఎదురుదాడి చేశారు. అసలు దేశానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచానికి నిలువునా తూట్లు పొడిచిందే మోదీ ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు.

ఎల్లుండి జమిలి బిల్లు
సోమవారం లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్  బిల్లును ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు వన్ నేషనల్ వన్ ఎలక్షన్ బిల్ వెళ్లనుంది. 129వ రాజ్యాంగ  సవరణ బిల్లుగా సోమవారం లోక్‌సభ బిజినెస్‌లో లిస్ట్ జమిలి ఎన్నికల బిల్లును చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 82, 83, 172, 327కు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లు రూపకల్పన చేశారు.  

లోక్‌సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా బిల్లును ప్రతిపాదించారు. మధ్యలో అసెంబ్లీలు రద్దయినప్పటికీ మిగిలిన కాలానికే  ఎన్నికల నిర్వహణ జరిగేలా బిల్లులో సవరణలు చేశారు. అసెంబ్లీలు ఉన్న ఢిల్లీ, జమ్మకశ్మీర్, పాండిచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతాల కోసం మరొక సవరణ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. అపాయింటెడ్‌ డే  తర్వాత ఒకే సారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా ప్లాన్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. అపాయింటెడ్‌ డే 2029 కంటే ముందే ఉంటుందా? లేదా అనేదానిపై భిన్నమైన చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సహకరిస్తేనే జమిలి ఎన్నికల బిల్లు చట్ట రూపం దాల్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement