Weekly Roundup : పార్లమెంట్‌ చిత్రం | Weekly roundup : 18th lok Sabha MPs oath Speaker Election Neet 2024 Issue | Sakshi
Sakshi News home page

Weekly Roundup : పార్లమెంట్‌ చిత్రం

Published Sun, Jun 30 2024 7:17 AM | Last Updated on Sun, Jun 30 2024 12:04 PM

Weekly roundup : 18th lok Sabha MPs oath Speaker Election Neet 2024 Issue

18వ లోక్ సభ కొలువుదీరింది. పార్లమెంట్ తాత్కాలిక సమావేశాల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో పలువురు ఎంపీలు  చేసిన నినాదాలపై ఎన్డీయే కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది. 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్‌కు ఎన్నిక జరిగింది. స్పీకర్ ఓం బిర్లా ఎన్నిక, రాష్ట్రపతి ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు చేశారు.  

రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా నీట్‌ పరీక్ష పేపర్ లీక్‌పై చర్చ జరగాలని ప్రతి పక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉభయ సభలు హోరెత్తిరిపోవడంతో సోమవారానికి (జులై 1)కి వాయిదా పడ్డాయి.

 

  • 18వ లోక్‌సభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ప్రధాని మోదీతో సహా 262 మంది ఎంపీలు ప్రమాణం చేశారు.

  • ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్‌సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది.

  • మోదీ ప్రమాణం చేసేటప్పుడు ఎన్డీయే నేతలు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష నేతలంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు.

  • ఏపీ నుంచి కేంద్రమంత్రిగాఉన్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ కు పంచె కట్టులో వెళ్లారు.

  • రైతు నేత వీపీఐ (ఎం) ఆమ్రా రామ్ ట్రాక్టర్‌లో పార్లమెంట్ కు వచ్చారు.

  • తీహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు.

  • పార్లమెంట్‌ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్‌ హౌజ్‌కు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సైకిల్‌పై చేరుకున్నారు. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టిన అప్పలనాయుడు, ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకున్నారు.

  • ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకార సమయంలో నీట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. నీట్ ఫెయిల్డ్ మినిస్టర్‌ అని నినాదాలు చేశారు.


రెండో రోజు ప్రమాణ స్వీకారాలు..

  • రెండో రోజు 274 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.

  • రెండో రోజు ప్రమాణ స్వీకారంలో భాగంగా స్వతంత్ర సభ్యుడు రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ' నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి' అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో క్రిష్ణగిరి ఎంపీగా గోపీనాథ్ 1,92, 486 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన జయప్రకాష్ పై గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టారు.

  • రెండో రోజు  సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.

  • హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఉర్ధూలో ప్రమాణం చేస్తూ.. జై భీం, జై తెలంగాణ, జై పాలస్తీనా, అల్లాహో అక్బర్‌ అంటూ ప్రమాణం పూర్తి చేశారు. 

  • ఇక అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదం ఇవ్వడంపై పలువురు మంత్రులు, బీజేపి సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్‌ సింగ్‌ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని, నిబంధనలు పరిశీలించి.. రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని సభ్యులకు సూచించారు.

  • ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసి.. 'జై హింద్, జై సంవిధాన్'  అని నినదించారు. ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సందర్శకుల గ్యాలరీ నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ

  • దాదాపు పదేళ్ల తర్వాత లోక్‌సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేబినెట్‌ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు. 

  • లోక్‌సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా.. ఈసీ, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలకు బాస్‌ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు.

  • 2014, 2019లలో మొత్తం సీట్లలో 10 శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో రెండుసార్లు ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌కు ఆ హోదా దక్కింది.

 

  • మూడో రోజు సమావేశాల్లో మూజూవాణి ఓటు ద్వారా బుధవారం స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక అయ్యారు.

  • అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్ కు ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి కోట ఎంపీ మరోసారి స్పీకర్‌గా ఎన్నిక అయ్యారు.

  • స్పీకర్ తొలి ప్రసంగంలో ఎమర్జెన్సీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యంతం తెలపగా.. ఎన్డీయే ఎంపీలు అనుకూలంగా నినాదాలు చేశారు. రాష్ట్రపతి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో  దోషులపై కఠిన  చర్యలు తీసుకుంటామని అన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ప్రస్తావించారు.

  • మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు 61 ఏళ్ళ ఓం బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.

  • స్పీకర్ ఎన్నిక అయ్యక బిర్లాను పోడియం వరకు తీసుకువెళ్లే సందర్భంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు.

  • స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. తెలుపు రంగు లాల్చీ పైజామ ధరించి లోక్ సభకు వచ్చారు.

  • స్పీకర్ బాధ్యతలు చెబడుతూనే ఓం బిర్లా తీసుకున్న తొలి నిర్ణయం లోక్ సభ కాక రేపింది.1975 నాటి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధానాన్ని ఖండిస్తూ  స్పీకర్ స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఎమర్జెన్సీ ప్రస్తావన నిరసిస్తూ ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం..

  •  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉభయ సభలను ఉదేశిస్తూ ప్రసంగించారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని  చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.

  • రాష్ట్రపతి ప్రసంగం పూర్తిగా ప్రభుత్వ స్క్రిప్ట్. తప్పుల తడక అని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. చివరికి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఎమర్జెన్సీ ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటు. నిజానికి మోదీ పదేళ్ల పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విపక్షాలు దుయ్యబట్టాయి. 

  • ప్రధాని మోదీ మంత్రి వర్గ సభ్యులను ఎగువ సభకు పరిచయం చేశారు.

పార్లమెంట్ లో నీట్ రగడ..

  • శుక్రవారం నీట్ పరీక్ష లో అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్ సభ స్పీకర్ , రాజ్య సభలో చైర్మన్ అంగీకరించలేదు. దీంతో  ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.

  • నీట్ పరీక్షపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేస్తోందని రాజ్య సభలో విపక్షాలు నిలదీశాయి. నీట్‌పై చర్చించాలని 22  నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకువెళ్లారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.  రాజ్య సభ మూడు సార్లు వాయిదా పడింది.

  • ప్రతి పక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్‌లోకి దూసుకురావటంపై రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు చేశారు. అనంతరం నీట్ రగడ నడుమ ఉభయ సభలు సోమవారానికి (జులై 1) వాయిదా పడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement