ఢిల్లీ: అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో 18వ పార్లమెంట్‌లోని లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. ఇవాళ లోక్‌సభ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. అయితే రెండురోజులు పాటు పార్లమెంట్‌లో ఎంపీల ప్రమాణ స్వీకారం జరగ్గా.. మరో ఏడుగురు సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయలేదు. ఇది ఇవాళ్టి ఓటింగ్‌పై ప్రభావం చూపబోతుందా? అనే చర్చ నడుస్తోంది.
ఎంపీలుగా ప్రమాణం చేయని వాళ్లలో ఇండియా కూటమికి చెందినవారే ఐదుగురు ఉండగా, మిగతా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు. శశిథరూర్, శతృఘ్న సిన్హాలాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఎంపీలుగా ప్రమాణం చేయలేదు కాబట్టి ఇవాళ స్పీకర్ ఎన్నికలో ఈ ఏడుగురు ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే..
ఓటింగ్‌పై ఇది ప్రభావం చూపెట్టే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు చెబుతున్నారు. సభకు హాజరయ్యే సభ్యుల ఆధారంగనే ఓటింగ్ మెజార్టీని లెక్కగడతారని వారంటున్నారు. అదే సమయంలో.. ఎన్డీయే కూటమి 293 సీట్లతో మెజార్టీలో ఉంది. స్పీకర్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 269గా ఉంది. మరోవైపు బీజేపీ విజ్ఞప్తి మేరకు వైఎస్సార్‌సీపీ సానుకూలంగానే స్పందించింది. ఇక.. ఇండియా కూటమిలో మొత్తం 232గాను 227 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. అంటే ఇండియా కూటమికి మెజార్టీ లేదనే చెప్పాలి. దీంతో స్పీకర్ ఎన్నిక ఎన్డీయే వైపు ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
ఇక.. స్పీకర్ ఎన్నిక కోసం మెజార్టీ ఎంపీలు ఉన్నప్పటికీ బీజేపీ స్పీకర్ ఎన్నికలో 300 ఎంపీల ఓట్ల కోసం టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో లేని పార్టీలను సైతం బీజేపీ మద్దతు కోరింది. స్పీకర్ ఎన్నికకు ఎన్డీయే కూటమి మాజీ స్పీకర్ కోటా ఎంపీ ఓం బిర్లాను, ఇడియా కూటమి కేరళ ఎంపీ కే. సురేష్‌ను బరిలోకి దింపాయి. ఇవాళ 11 గంటలకు స్పీకర్ ఓటింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment