
కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో.. రెండు మానాడులు, సామాజిక యాత్రలో భాగంగా ర్యాలీలు నిర్వహించినా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం చూసుకోలేకపోయారంటూ తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా ఆ పార్టీ నేత ఒకరు చేసిన పని ఆ పార్టీని మరింత ఇబ్బంది పెడుతోంది.
శ్రీలంక, నేపాల్‌లో జెన్‌జీ నిరసనలు ప్రభుత్వాల్ని గద్దె దించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో.. తమిళ యువత కూడా డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగాలంటూ విజయ్ పేరిట ఓ ప్రచారం నడుస్తోంది. అయితే కరూర్ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఇది తెరపైకి రావడంతో.. ఇటు రాజకీయ ప్రత్యర్థులు, అటు నెటిజన్లు విజయ్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో..
టీవీకే(TVK) అధికారికంగా స్పందించింది. ఆ ప్రకటనతో విజయ్‌కిగానీ, పార్టీకిగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. విజయ్ ఏనాడూ ప్రజలను రెచ్చగొట్టరని, హింసకు ప్రేరేపించే ప్రయత్నాలు చేయబోరని ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ కూడా ఈ సిద్ధాంతానికే కట్టుబడి ఉందని ప్రకటించింది. అయితే ఈ ప్రకటన టీవీకే సీనియర్ నేత ఆధవ్ అర్జున చేయడం చేసిన సోషల్ మీడియా పోస్టుతో వైరల్ అయ్యింది.
కరూర్ ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే యువతను రెచ్చగొట్టేలా ఆధవ్ అర్జున(TVK Aadhav Arjuna) పోస్ట్ చేశారంటూ అధికార డీఎంకే మండిపడింది. 41 మందిని బలిగొన్న కూడా ఆ పార్టీ ఇంకా బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తోంది. యువతను ఉసిగొల్పి హింసను ప్రేరేపించాలని చూస్తే సహించేది లేదు అని డీఎంకే ఎంపీ కనిమొళి(Kanimozhi) హెచ్చరించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన ఆ ట్వీట్ డిలీట్ చేశారు. అయితే.. ఆ ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. దీని ఆధారంగా డీఎంకే ఫిర్యాదునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్న ఆధవ్ అర్జున.. కరూర్ ఘటనలో కుట్ర కోణం ఉందంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఘటనపై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ కోర్టును కోరారాయన. అలాగే బాధిత కుటుంబాలను విజయ్ పరామర్శించేందుకు అనుమతించాలంటూ రిక్వెస్ట్ చేశారు కూడా. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కరూర్ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో కమిటీ కూడా వేసింది.
ఇదీ చదవండి: కరూర్ ఘటన 21 మందిపై కేసు.. తొలి అరెస్ట్