ravishankar prasad
-
రాహుల్ గాంధీ క్షమాపణలు చెబుతారా?: రవిశంకర్‌ప్రసాద్
న్యూఢిల్లీ: నీట్ పరీక్షను రద్దు చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టంచేయడం అధికారపక్షానికి ఆయుధంగా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దేశంలో మొత్తం పరీక్షా విధానంపై రాహుల్ ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగిస్తున్నారని బీజేపీ సీనియర్‌నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.పరీక్షా విధానంపై తాను చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ రాహుల్ క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించారు. దేశంలోని పరీక్షా విధానాల్లో మోసం జరుగుంతోందంటూ రాహుల్ ఆరోపించారని ప్రసాద్ గుర్తుచేశారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ రాహుల్ దేశంలోని విద్యావ్యవస్థ పరువు తీయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నోసార్లు పేపర్ లీకులు జరిగాయన్నారని విమర్శించారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఇకనైనా రాహుల్ ఇటువంటి అసత్య ప్రచారాలను మానుకోవాలని సూచించారు. -
కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్
-
కొత్త సీజేఐ పేరును సూచించండి
-
కొత్త సీజేఐ పేరును సూచించండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అంటే మరో నెల రోజులే ఆయన పదవిలో ఉంటారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది. నూతన ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఎవరైతే బాగుంటుందో మీరే సూచించాలని జస్టిస్ బాబ్డేను కేంద్ర ప్రభుత్వం కోరినట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జస్టిస్ బాబ్డేకు ఒక లేఖ పంపారు. నిబంధనల ప్రకారం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. నూతన ప్రధాన న్యాయమూర్తిని నియమించే విషయంలో పదవీ విరమణ చేయబోయే ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రతిపాదనలు స్వీకరించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరి పేరును ఆయన ప్రతిపాదిస్తే కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. ప్రధానమంత్రి కూడా అంగీకారం తెలియజేస్తే సదరు సీనియర్ న్యాయమూర్తి చీఫ్ జస్టిస్‌గా ఎంపికైనట్లే. ఆయనను నియమించాలని కోరుతూ రాష్ట్రపతికి ప్రధానమంత్రి సిఫార్సు చేస్తారు. ఒకవేళ సీనియర్ మోస్ట్ జడ్జి ఈ పోస్టుకు అర్హుడు కాడని భావిస్తే.. ఇతర న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి, ఒకరి పేరును ఎంపిక చేస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎన్.వి.రమణ అత్యంత సీనియర్. 2022 ఆగస్టు 26 వరకూ జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ కాలం ఉంది. -
సోషల్ మీడియా సంస్థలకు వార్నింగ్!
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసనలపై ట్విటర్లో తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్న వారి అకౌంట్లు బ్లాకింగ్ వివాదాస్పదమైన నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సామాజిక మాధ్యమాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. వ్యాపారం చేయడానికి వచ్చిన వారు ఎఫ్‌డీఐలు తెచ్చి, భారత చట్టాలను గౌరవించాలని చెప్పారు. ట్విట్టర్లో విద్వేషపూరిత ట్వీట్లు పెడుతున్న వారందరి ఖాతాలను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించినప్పటికీ ఆ సంస్థ సంపూర్ణంగా ఆ పని నిర్వహించకపోవడంతో రవిశంకర్ సోషల్ మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి సమయంలో ఒక రకంగా, ఎర్రకోటపై దాడి ఘటనలో మరో రకంగా ఎలా స్పందిస్తారని ట్విట్టర్‌ను సూటిగా ప్రశ్నించారు. క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన సమయంలో పోలీసులకు అండగా ఉండి విద్వేషాన్ని వెళ్లగక్కేవారి ఖాతాలను సస్పెండ్ చేసిన సామాజిక మాధ్యమాలు ఎర్రకోట ఘటన సమయంలో అదే తరహాలో ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు తమ దగ్గర కుదరవని అన్నారు. ‘తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దు. మీరు ఇక్కడ వ్యాపారం కోసం వచ్చారు. అదే చేసుకోండి. చట్టాలకు కట్టుబడి వ్యవహరించండి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం’అని హెచ్చరించారు. -
అందరికీ న్యాయం.. డబ్బే అడ్డంకి: కోవింద్
న్యూఢిల్లీ: అందరికీ న్యాయాన్ని అందించడంలో ప్రధాన అడ్డంకి డబ్బేనని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. సుప్రీంకోర్టు నిర్వహించిన 71 వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమయంలో కూడా అందరికీ న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థ, బార్‌కౌన్సిల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కృషి చేశాయన్నారు. ఉన్నత న్యాయస్థానం తమ తీర్పులను వివిధ ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవడం అభినందించదగిన విషయమని చెప్పారు. ఉన్నత ప్రమాణాలూ, ఆదర్శాలూ, కీలక తీర్పులతో న్యాయవ్యవస్థ బలోపేతం అయ్యిందని, సుప్రీంకోర్టు ప్రతిష్ట పెరిగిందని అన్నారు. పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను సాధించడం గురించి రాజ్యాంగ పీఠికలో రాసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమణ్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు దుష్యంత్ దావేలు కూడా ఉపన్యసించారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పాల్గొన్నారు. -
బెట్టింగ్‌లపై పోలీస్ బెత్తం
సాక్షి, అమరావతి: సమాజంలో వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమ్‌లు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లపై సర్కారు ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వీటిని నిషేధించింది. ఇదే విషయమై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కొద్ది రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ గేమ్‌లు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లు నిర్వహించే 135 వెబ్సైట్లపై ఆన్లైన్ నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో వైఎస్ జగన్ కోరారు. సీఎం ఆదేశాలతో బెట్టింగ్‌లపై పోలీసులు బెత్తం ఝుళిపిస్తున్నారు. ఇటీవల కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేసి క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు. క్లబ్‌లు, కల్చరల్ క్లబ్‌లు, అతిథి గృహాల్లో పేకాట, కోతాట, గ్యాంబ్లింగ్ వంటివి నిర్వహించకుండా నోటీసులు ఇవ్వడంతో అవి మూతపడ్డాయి. పోలీసులు హెచ్చరించినా వినకుండా వాటిని నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసి కేసులు పెడుతున్నారు. ఫలితంగా గత ఐదేళ్ల కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. -
కేంద్ర మంత్రికి సీఎం జగన్ లేఖ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల ఎంతో మంది ఆత్మహత్యల పాలవుతున్నారు. డబ్బు పోగొట్టుకోవడంతో పాటు దానికి తీవ్రమైన బానిసలవుతున్నారు. దీనిలో భాగంగానే ఏపీ గేమింగ్ యాక్ట్-1974ను సవరించామని తెలిపారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చామని పేర్కొన్నారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆయా సైట్లను బ్లాక్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఏపీలో ఆయా సైట్లు, యాప్‌లను బ్లాక్ చేసేలా ఆదేశించాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను సీఎం వైఎస్ జగన్ లేఖలో విజ్ఞప్తి చేశారు. చదవండి: ఎస్వీబీసీ చైర్మన్‌గా సాయికృష్ణ యచేంద్ర -
హైకోర్టు జడ్జీల సంఖ్య పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి బుధవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసి కోరారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి, న్యాయ సేవలు వేగంగా అందడానికి వీలుగా ఈ చర్య తోడ్పడుతుందని వివరించారు. తెలంగాణ హైకోర్టులో 24 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 14 మందే ఉన్నారని తెలిపారు. పెండింగ్ కేసులు భారీగా ఉన్నాయని, కొత్తగా పెద్ద సంఖ్యలో కేసులు వస్తుండడంతో న్యాయవ్యవస్థపై భారం పడుతోందని చెప్పారు. హైకోర్టులో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు 46 నుంచి 48 మంది జడ్జీలు పనిచేయడానికి అనువుగా ఉన్నాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐటీలోని చిన్న కంపెనీలను ఆదుకోండి
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. హైదరాబాద్‌లో సుమారు 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారని, కరోనా ప్రభావం వీరిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పడిందన్నారు. ఐటీ, అనుబంధ పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు మంత్రి కేటీఆర్ గురువారం లేఖ రాశారు. రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులతో ఇటీవల రవిశంకర్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణను భాగస్వామి చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలు అంశాలను కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. మినహాయింపులివ్వాలి.. ప్రస్తుత కరోనా సంక్షోభ ప్రభావం చిన్న తరహా ఐటీ కంపెనీలపై ఎక్కువగా పడే అవకాశమున్నందున పలు మినహాయింపులివ్వాలని కేటీఆర్ కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన ఐటీ, జీఎస్టీ పన్ను రిఫండ్‌ను పరిష్కరించడం, రూ.25 లక్షల కంటే తక్కువున్న ఆదాయ పన్ను బకాయిల్లో కనీసం 50 శాతం విడుదల చేయడం వంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు. జీఎస్టీ చెల్లింపు విషయంలో కంపెనీలకు సహకరించచేందుకు ఐటీ విభాగంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి వివిధ శాఖలతో సమన్వయం చేయాలని కోరారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కనీసం 50 శాతం మేర వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పించడం ద్వారా మూడు నాలుగు నెలల పాటు ఆయా సంస్థల ఉద్యోగులకు వేతనాలు చెల్లించే అవకాశం కలుగుతుందన్నారు. రుణాల చెల్లింపునకు కనీసం ఏడాది పాటు గడువు ఇవ్వాలని లేఖలో సూచించారు. ఆ గడువు ఏడాది పాటు పెంచాలి.. ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) ప్రత్యక్ష ప్రయోజనాలు పొందేందుకు ఈ ఏడాది మార్చి 31 వరకు విధించిన గడువును ఏడాది పాటు పొడిగించాలని కేటీఆర్ కోరారు. ప్రస్తుతం చాలా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే కార్యాలయ విస్తీర్ణం తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో ఒక్కో ఉద్యోగికి వంద నుంచి 125 చదరపు అడుగులు లెక్కన కార్యాలయాలు ఉండేలా కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు. ఐటీ పార్కులు, సెజ్‌లలో స్టాండర్డ్ హెల్త్ కోడ్‌ను తప్పనిసరి చేయాలని తన లేఖలో కేటీఆర్ సూచించారు. -
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన సూక్ష్మ, మధ్యస్థాయి పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు. కేంద్ర వద్ద పెండింగ్ ఉన్న జీఎస్టీ, ఆదాయపన్ను రిఫండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఐటీ పార్కులు, సెజ్‌ల కార్యాలయాలకు ఆరోగ్య మార్గదర్శకాలతో స్టాండర్డ్ హెల్త్ కోడ్ ప్రవేశపెట్టాలన్నారు. పలు కంపెనీల్లో ఉద్యోగుల సాంద్రత కార్యాలయ స్థలంతో పోలిస్తే ఎక్కువగా ఉందన్నారు. దీన్ని ఒక్కో ఉద్యోగికి 100 నుంచి 125 చదరపు అడుగులు ఉండేలా నిర్దేశించాలని పేర్కొన్నారు. (చదవండి : కేంద్ర నిర్ణయంపై తెలంగాణ సర్కార్ అసంతృప్తి) -
స్ట్రాటజీ గ్రూప్‌ను ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన పరిశ్రమలను చైనా నుంచి భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కే.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా దేశంలో పెద్దెత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కరోనా నేపథ్యంలో జపాన్ లాంటి దేశాలు తమ కంపెనీలను చైనా నుంచి ఇతర దేశాలకు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వస్తున్న ప్రకటనలను ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులతో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత సంక్షోభంలోనూ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయని, అందుకు అనుగుణంగా కేంద్రం సహకరించాలని సూచించారు. స్ట్రాటజీ గ్రూప్‌ను ఏర్పాటు చేయండి... కరోనా కట్టడి, లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వ్యాపార, వాణిజ్య రంగాల నిర్వహణకు సంబంధించి పలు దేశాలు పారిశ్రామికవేత్తలు, మేధావులతో స్ట్రాటజీ గ్రూప్‌లను (వ్యూహ బృందాలు) ఏర్పాటు చేసిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. దేశంలోనూ ఐటీ పరిశ్రమకు సంబంధించి స్ట్రాటజీ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పిస్తున్నందున, సమీప భవిష్యత్తులోనూ ఇది కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఇంటర్నెట్ వినియోగం పెరిగినందున బ్రాడ్ బ్యాండ్, నెట్‌వర్క్‌ల బలోపేతానికి కేంద్రం చొరవ తీసుకోవాలన్నారు. భారత్ నెట్ ప్రాజెక్టుకు అవసరమైన సహకారం అందించాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. మరో రెండు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు... రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మరో రెండింటిని మంజూరు చేయాలని కేటీఆర్ కోరారు. ప్రస్తుతం బయోటెక్నాలజీ, మెడికల్ డివైజెస్, ఫార్మా వంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉత్పన్నం అవుతున్నట్లు చెప్పారు. ఈ రంగాల్లో ఐటీ ఆధారిత అవకాశాలు లేదా అయా రంగాల సమ్మిళితం ద్వారా వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కామర్స్ రంగం మరింత విస్తరించే అవకాశం ఉన్నందున ప్రోత్సాహం అందించాలన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లోని ఎంఎస్ఎంఈలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున జీఎస్టీ, ఆదాయ పన్ను తదితరాల్లో మినహాయింపులు ఇవ్వాలన్నారు. అమెరికా, యూరప్ ఆర్థిక వ్యవస్థలు భారతీయ ఐటీ, అనుబంధ రంగాలపై ప్రభావం చూపే పక్షంలో, అందులోని మానవ వనరులను ఇతర రంగాలకు తరలించేలా ప్రణాళికలు అవసరమని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో ప్రత్యేక పోర్టల్ కరోనా వైరస్ కట్టడి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆదర్శవంతమైన పద్ధతులు, కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మిగిలినవారు ఉపయోగించుకోవడానికి వీలుగా ఒక ప్రత్యేక పోర్టల్‌ను మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హామీ ఇచ్చారు. ఈ కామర్స్ రంగానికి చేయూతను అందిస్తామన్నారు. -
దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ రంగాల్లో నూతన ఉపాధి అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులతో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు మినహాయింపులు ఇవ్వాలని ఆయన కోరారు. కేటీఆర్ మాట్లాడుతూ.. వివిధ రంగాల కన్వర్జెన్స్ ద్వారా అనేక కొత్త అవకాశాలు రానున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ రంగంలో నూతన అవకాశాలుంటాయన్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్రాలు ముందుకు కదలాలని సూచించారు. తెలంగాణకు మరో రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. -
అప్పట్లో సచిన్, ఇప్పుడు విరాట్: సత్య నాదెళ్ల
న్యూఢిల్లీ: చాలా మంది భారతీయుల్లాగే సత్య నాదెళ్లకు క్రికెట్ అంటే ప్రేమే. కంప్యూటర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు సీఈఓగా వ్యహరిస్తున్న నాదెళ్లకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదో మీరు ఊహించగలరా ? లెక్కలు, లేదా సైన్స్ అని ఊహిస్తే, మీరు పప్పులో కాలేసినట్లే. ఆయనకు ఇష్టమైన సబ్జెక్ట్.. చరిత్ర. ఇక కోడింగ్.. కవిత్వం లాంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరితో పిచ్చాపాటిగా జరిపిన సంభాషణలో ఆసక్తికరమైన విషయాలను సత్య నాదెళ్ల వెల్లడించారు. ఎక్కడ ఉన్నా, మదిలో అదే...! సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలో ఎవర్ని ఎన్నుకుంటారని అనంత్ అడుగగా, అప్పట్లో సచిన్ టెండూల్కర్ అని, ఇప్పుడైతే విరాట్ కోహ్లి అని సత్య నాదెళ్ల బదులిచ్చారు. తన పుస్తకం హిట్ రిఫ్రెష్‌లో క్రికెట్ ఆట తన వ్యక్తిగత, వృత్తిగత జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిందో ఆయన పేర్కొన్నారు. తాను ఎక్కడ ఉన్నా, తన మదిలో క్రికెడ్ క్రీడ మెదులుతూనే ఉంటుందని వివరించారు. కోడింగ్ కవిత్వం లాంటిదేనని పేర్కొన్నారు. -
'న్యాయ వ్యవస్థతోనే అన్ని సమస్యలు పరిష్కారం'
సాక్షి, ఢిల్లీ : రెండు రోజల పాటు ఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, నిరంతర అధ్యయనంతోనే కొత్త విషయాలు తెలుసుకోవచ్చన్నారు. న్యాయవ్యవస్థ ద్వారానే సమస్యలు సులభంగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపారు. నేడు 130 కోట్ల మంది భారతీయులు తమ సమస్యలను న్యాయవ్యవస్థల ద్వారానే పరిష్కరించుకుంటున్నారని వెల్లడించారు. ఇటీవలే న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించిదన్నారు. ఈ సందర్భంగా తలాక్, మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులు,దివ్యాంగ హక్కులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అందరూ ప్రశంసించారన్నారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు న్యాయ వ్యవస్థ సముచిత న్యాయం కల్పించిదని కొనియాడారు. (కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది: ఉద్ధవ్ ఠాక్రే) ప్రస్తుతం డేటా భద్రత, సైబర్ క్రైమ్ వంటి నేరాలు పెరిగిపోతూ న్యాయవ్యవస్థకు సవాలుగా నిలిచిందని పేర్కొన్నారు. వీటిని పరిష్కరించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఉగ్రవాదం, సైబర్ క్రైహ్ అనేవి ప్రస్తుతం ప్రధాన సమస్యలుగా ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కొత్త ఆలోచనలతో న్యాయ వ్యవస్థ ముందుకు రావాలని, సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి పని చేస్తే బాగుంటుందని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే, ఇతర కేంద్ర మంత్రులు,పలువురు సుప్రీంకోర్టు జడ్జిలు, న్యాయవాదులు, వివిధ దేశాల న్యాయనిపుణులు హాజరయ్యారు. -
టెలికంలో అసాధారణ సంక్షోభం..
న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) ప్రాతిపదికన టెల్కోలు భారీ బకాయిలు కట్టాల్సి రావడం .. టెలికం పరిశ్రమలో గతంలో ఎన్నడూ చూడని విధంగా, అసాధారణ సంక్షోభం తలెత్తిందని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బాకీలను కట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని, సాధ్యమైనంత త్వరగా మిగతా చెల్లింపులు జరుపుతామని ఆయన చెప్పారు. తమకు మార్చి 17 దాకా సమయం ఉన్నప్పటికీ.. ఈలోగానే కట్టేస్తామని వివరించారు. గురువారం కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయిన తర్వాత మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. భేటీ సందర్భం గా పరిశ్రమపై భారీ పన్నుల భారం ఉంటోందని, వీటిని తగ్గించాలని ఆయన కోరారు. మరో రూ. 1,000 కోట్లు కట్టిన వొడాఫోన్ ఏజీఆర్ బకాయిల కింద టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా గురువారం మరో రూ. 1,000 కోట్లు.. టెలికం శాఖకు (డాట్) చెల్లించింది. సోమవారమే కంపెనీ 2,500 కోట్లు కట్టిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఐడియా మొత్తం రూ. 53,000 కోట్ల బాకీలు కట్టాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, టాటా టెలీసర్వీసెస్ నుంచి మిగతా బాకీల వసూలుకు ఒకటి.. రెండు రోజుల్లో నోటీసులు పంపించనున్నట్లు వివరించాయి. డాట్ లెక్కల ప్రకారం టాటా టెలీ సర్వీసెస్ దాదాపు రూ. 14,000 కోట్లు కట్టాల్సి ఉండగా..ఆ సంస్థ సోమవారం నాడు రూ. 2,197 కోట్లు మాత్రమే కట్టింది. ఏజీఆర్ లెక్కల మదింపులో కేంద్రం.. ఇక ఏజీఆర్ బాకీలు డాట్ చెబుతున్న దానికంటే చాలా తక్కువగా ఉంటాయని టెల్కోలు చెబుతున్న నేపథ్యంలో టెలికం శాఖ ఈ అంశంపై దృష్టి సారించింది. మార్చి 17లోగా టెల్కోల లెక్కలను టెలికం శాఖ మదింపు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్ని టెల్కోల గణాంకాలను టెస్ట్ చెక్ చేయనున్నప్పటికీ.. మొత్తం బాకీలు కట్టేశామంటున్న సంస్థలతో ముందుగా ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు వివరించాయి. డాట్ సొంత లెక్కలు, టెల్కోల లెక్కలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను కనిపెట్టేందుకు ఇది ఉపయోగపడనుంది. టెలికం సంస్థలు కట్టాల్సిన లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను లెక్కించేందుకు టెలికంయేతర కార్యకలాపాల ద్వారా కూడా వచ్చిన ఆదాయాలను పరిగణనలోకి తీసుకోవచ్చంటూ డాట్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు గతేడాది ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం టెలికం సంస్థలు ఏకంగా రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి రానుంది. గతంలో విధించిన జనవరి 23 డెడ్‌లైన్‌ను టెల్కోలు ఉల్లంఘించడంపై ఆగ్రహించిన సుప్రీం కోర్టు తాజాగా దీనిపై విచారణను మార్చి 17కి వాయిదా వేసింది. అందరికీ ప్రయోజనంపై కేంద్రం దృష్టి.. ఏజీఆర్ బాకీల విషయంలో అటు సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేస్తూనే.. ఇటు టెలికం రంగం.. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెలికం సంస్థలు ఇప్పటిదాకా రూ. 16,000 కోట్ల ఏజీఆర్ బాకీలు చెల్లించినట్లు వివరించాయి. మరో 7–8 రోజుల్లో మరిన్ని చెల్లింపులు జరుపుతామని టెల్కోలు చెప్పాయని ఓ అధికారి పేర్కొన్నారు. టెల్కోల బాకీల్లో వడ్డీ, పెనాల్టీలే అధికం.. టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు బాకీల కింద కట్టాల్సినది రూ. 22,589 కోట్లని.. అయితే వడ్డీ, పెనాల్టీలు కలిపితే ఇది రూ. 92,641 కోట్లకు పెరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు కట్టాల్సినది రూ. 16,746 కోట్లు ఉంటుందని పేర్కొన్నాయి. భారతి ఎయిర్టెల్ బాకీలు రూ. 5,529 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 6,871 కోట్లు, టాటా గ్రూప్ రూ. 2,321 కోట్లు, టెలినార్ (ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో విలీనమైంది) రూ. 529 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ. 614 కోట్లు, ఎంటీఎన్ఎల్ బకాయిలు రూ. 876 కోట్లు ఉంటాయని వివరించాయి. ఈ లెక్కలను జూలైలో తయారు చేశారని, తాజాగా మరోసారి లెక్కింపు ప్రక్రియ జరుగుతోందని ఓ అధికారి తెలిపారు. డాట్ లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజుతో పాటు టెలికం సంస్థలు దాదాపు రూ. 55,054 కోట్ల మేర స్పెక్ట్రం యూసేజి చార్జీలు కూడా కట్టాల్సి ఉంది. -
హైకోర్టు తరలింపునకు చర్యలు తీసుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: వికేంద్రీకరణలో భాగంగా కర్నూలుకు హైకోర్టును తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర న్యాయ, ఐటీ, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు 55 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. న్యాయ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి నివేదించిన అంశాలు ఇవీ.. అభివృద్ధి వికేంద్రీకరణకు వీలుగా.. ‘రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించాం. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడిషియల్ కేపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ కేపిటల్‌గా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా హైకోర్టును కర్నూలుకు తరలించడానికి కేంద్ర న్యాయ శాఖ తగిన చర్యలను తీసుకోవాలి. రాయలసీమలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ దృష్ట్యా ఆ మేరకు వెంటనే తరలింపునకు చర్యలు తీసుకోవాలి’ అని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ‘మండలి’ రద్దును ఆమోదించాలి శాసన మండలి రద్దు అంశాన్ని కూడా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను ‘మండలి’ అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని వివరించారు. ఈ నేపథ్యంలో.. మూడింట రెండు వంతుల మెజారిటీతో శాసనసభ.. మండలిని రద్దు చేస్తూ సిఫారసు చేసిందని, కేంద్ర న్యాయ శాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలను నియంత్రించేందుకు రూపొందించిన దిశ చట్టం వెంటనే అమలులోకి వచ్చేలా కేంద్రం నుంచి తీసుకోవాల్సిన చర్యలు వేగవంతం చేయాలని కోరారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌కు వినతి పత్రం ఇస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీలైనంత త్వరగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చేలా న్యాయ శాఖ తరఫున ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూలంకషంగా వివరించారు. అంతకు ముందు ఉదయం పార్టీ ఎంపీలు పలువురు వైఎస్ జగన్‌తో ఆయన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నందిగం సురేష్ ఉన్నారు. కాగా, శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. ప్రధాని, హోంమంత్రితో భేటీలో పలు అంశాలపై చర్చ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి, శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, తాజా పరిస్థితుల గురించి ప్రధానికి కూలంకషంగా వివరించారు. ఆ రోజు దాదాపు గంటా నలభై నిమిషాల పాటు సాగిన సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి గురించి సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేయాలని ప్రధానిని ఆహ్వానించారు. సవరించిన పోలవరం అంచనాలను, దిశ చట్టాన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా కేంద్రం పరిధిలోనిదేనన్న ఆర్థిక సంఘం సిఫారసులను ప్రస్తావిస్తూ రాష్ట్రానికి హోదా ఇవ్వాలని కోరారు. అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళిక, శాసన మండలి రద్దు గురించి కూడా వివరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీలో ప్రధానంగా దిశ చట్టం త్వరితగతిన అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 40 నిమిషాలపాటు సాగిన సమావేశంలో రాష్ట్రంలో పోలీస్ అకాడమి ఏర్పాటు, పోలీస్ సంస్థాగత సామర్థ్యం పెంపునకు సహకరించాలని కోరారు. -
ముఖ్యమంత్రి x కేంద్రమంత్రి
తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సంబంధించి కేరళ ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. కేరళలో సీఏఏ అమలుచేయబోమన్న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడింది. పౌరసత్వంపై చట్టాలను రూపొందించే అధికారం కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుందని.. కేరళసహా మరే ఇతర రాష్ట్రానికి ఉండబోదన్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ఆరోపించారు. రవిశంకర్ వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీలకు కూడా సొంత హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ హక్కులకు ప్రత్యేక రక్షణ ఉంటుందని.. వాటిని ఎవరూ ఉల్లంఘించరాదని తేల్చిచెప్పారు. రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే తీరుగా ఉన్న పౌరసత్వ చట్టాన్ని అమలు చేసేది లేదని తీర్మానించిన తొలి రాష్ట్రం కేరళ అని అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిందేనని రవిశంకర్ అన్నారు. పార్లమెంట్ చట్టాలను అమలుచేయబోమని చెప్పే అధికారం రాష్ట్రాలకు లేదని తేల్చిచెప్పారు. కాగా.. సీఏఏ అమలు చేయబోమని కేరళ ప్రభుత్వం తీర్మానించడం పార్లమెంటరీ అధికారాల ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు లేఖ రాశారు. -
అవసరమైతే తీసుకుంటాం
న్యూఢిల్లీ: కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎన్పీఆర్పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎన్పీఆర్ డేటాను ఎన్‌ఆర్‌సీకోసం ఉపయోగించుకునే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఆయన ఆదివారం ప్రకటించారు. ఎన్పీఆర్కి, ఎన్ఆర్సీకి ఎలాంటి సంబంధం ఉండబోదని గతవారం హోంమంత్రి అమిత్‌షా ప్రకటించిన నేపథ్యంలో రవిశంకర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లభించింది. ‘జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) కోసం సేకరించిన డేటాను జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అవసరాల కోసం ఉపయోగించొచ్చు.. లేదా ఉపయోగించకపోవచ్చు’అని రవిశంకర్ ప్రసాద్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘పాస్‌పోర్ట్‌లు, పాన్ కార్డు కోసం డేటా సేకరించినప్పుడు లేని సమస్య ఎన్ఆర్సీకి మాత్రమే ఎందుకు వస్తోంది, ప్రజలు ప్రభుత్వ విధానాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు’అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. -
టెక్ స్టార్టప్‌లలో భారీ నియామకాలు
న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలోని స్టార్టప్స్ (అంకుర సంస్థలు) ఈ ఏడాదిలో 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సాఫ్ట్వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. ఐటీ మంత్రిత్వ శాఖ, పరిశ్రమ సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్’ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలియజేసింది. నాస్కామ్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దేశంలోని టాప్ 15 కంపెనీలు నిరంతరం ఉద్యోగాలను కల్పిస్తూనే ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. -
రెండేళ్లలో బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ విలీనం పూర్తి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ల విలీన ప్రక్రియ వచ్చే 18 నుంచి 24 నెలల్లోనే పూర్తికానుందని టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఆయన ఈ విషయాన్ని స్పష్టంచేశారు. భారీ నష్టాలతో కుదేలవుతున్న ఈ సంస్థలను విలీనం చేసేందుకు అక్టోబర్ 23న కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని వివరించారు. 2010 నుంచి బీఎస్ఎన్ఎల్ నష్టాల్లో ఉండగా.. గత పదేళ్ల నుంచి ఎంటీఎన్ఎల్ నష్టాలను ప్రకటిస్తోందని చెప్పారు. ఇరు సంస్థల రుణ భారం రూ. 40,000 కోట్లుగా ఉందన్నారు. బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్)కు 77,000 మందికి పైగా, ఎంటీఎన్ఎల్ వీఆర్ఎస్కు 13,532 మంది ఉద్యోగులు దరఖాస్తు చేశారు. -
ఆ కంపెనీలు బకాయిలు చెల్లించాల్సిందే..
కోల్కత్తా: ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు మినహాయింపులు ఇవ్వొద్దని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రిలయన్స్ జియో రెండో లేఖ రాసింది. వడ్డీ చెల్లింపులు, పెనాల్టీలను తగ్గించాలన్న వొడాఫోన్ ఐడియా అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయాన్ని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో గుర్తు చేసింది. కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం కంపెనీలకు మినహాయింపులు ఇచ్చే అవకాశమే లేదని జియో స్పష్టం చేసింది. చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే సుప్రీం తీర్పును ఉల్లంఘించినట్లేనని జియో తెలిపింది. మరోవైపు ఐడియా వొడాఫోన్లు ఆర్థికంగా బలంగా ఉన్నాయని ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా ఆ కంపెనీలకు ఉందని జియో తెలిపింది. కాగా ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా పెనాల్టీలు, వడ్డీ చెల్లింపులు, లైసెన్స్ రుసుములు పరంగా 81,000కోట్లు చెల్లించాలని టెలికాం వర్గాలు తెలిపాయి. -
ఆ మద్దతు మాకొద్దు: రవిశంకర్ ప్రసాద్
చత్తీస్గడ్: హర్యాణాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వివాదాస్పద ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తీసుకోబోదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. చత్తీస్‌గడ్‌లో విలేఖర్ల సమావేశంలో భాగంగా రవిశంకర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ(46) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతోంది. అయితే, దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి మద్దతిస్తారని తెలిపారు. మరోవైపు కందా మాత్రం తన కుటుంబానికి రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో విస్తృత సంబంధాలు దృష్యా బీజేపీకి బేషరత్తుగా మద్దతిస్తానని తెలపడం గమనార్హం. కాగా, కందా లైంగిక ఆరోపణలు, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న విషయం విదితమే.ఈ నేపథ్యంలోనే గోపాల్ కందా మద్దతును బీజేపీ కోరబోదని రవిశంకర్ పేర్కొన్నారు. -
5జీ వేలం ఈ ఏడాదే..
న్యూఢిల్లీ: 5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రం వేలాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిర్వహించనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. స్పెక్ట్రం ధరలకు సంబంధించి సంస్కరణలు ఉంటాయని టెలికం పరిశ్రమకు హామీ ఇచ్చారు. సోమవారం ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2019 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘టెలికం పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రభుత్వానికి తెలుసు. స్పెక్ట్రం వేలం ఈ ఆర్థిక సంవత్సరంలోనే జరుగుతుంది. ధరకు సంబంధించి కొన్ని సంస్కరణలు చేపడుతున్నాం‘ అని ప్రసాద్ చెప్పారు. మరోవైపు, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వదంతుల వ్యాప్తి అంశంపై స్పందిస్తూ ఎన్క్రిప్షన్ను ప్రభుత్వం కూడా గౌరవిస్తుందని చెప్పారు. అయితే, హింసను ప్రేరేపించే విధమైన తప్పుడు వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు .. దర్యాప్తు సంస్థలు వాటి మూలాలను కచ్చితంగా కనుగొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకు అనువైన వ్యవస్థ ఉండటం తప్పనిసరన్నారు. స్పెక్ట్రం రేటును సంస్కరిస్తామంటూ ప్రసాద్ ప్రకటించడాన్ని సెల్యులార్ సంస్థల సమాఖ్య సీవోఏఐ స్వాగతించింది. ఇది టెలికం కంపెనీలకు ‘భారీ ఊరట‘ ఇస్తుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ చెప్పారు. తగినంత స్పెక్ట్రం, సరైన ధర ఉంటే రాబోయే వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు టెల్కోలు కూడా ఆసక్తి చూపుతాయని పేర్కొన్నారు.5జీ స్పెక్ట్రం వేలానికి రూ. 4.9 లక్షల కోట్ల బేస్ ధరను నిర్ణయించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) గతేడాది సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న టెలికం పరిశ్రమ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. తొలి రోజున 5జీ టెక్నాలజీ మెరుపులు.. దేశీ టెలికం సంస్థలకు కీలక కార్యక్రమమైన ఐఎంసీ అక్టోబర్ 16 దాకా మూడు రోజుల పాటు సాగనుంది. ఈసారి ఒక లక్ష మంది దాకా దీన్ని సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు. ఇందులో 500 పైచిలుకు కంపెనీలు, 250 స్టార్టప్‌లు, 110 మంది విదేశీ కొనుగోలుదారులు పాల్గొంటున్నారు. తొలి రోజున వివిధ టెలికం దిగ్గజాలు పలు కొత్త కాన్సెప్ట్స్‌ను సందర్శకులకు ప్రదర్శించాయి. గాయకులు ఒక చోట పాడుతుంటే, మ్యూజిక్ కంపోజర్ మరోచోట కంపోజ్ చేస్తుండగా..రెండింటినీ అనుసంధానం చేసి ఏకకాలంలో పూర్తి పాటను లైవ్‌లో వినిపించే 5జీ టెక్నాలజీ కాన్సెప్ట్‌ను ఎరిక్సన్, ఎయిర్టెల్ ప్రదర్శించాయి. స్మార్ట్ వాహనాల్లో 5జీ టెక్నాలజీ వినియోగాన్ని వొడాఫోన్ ఐడియా ప్రదర్శించింది. వైద్యం, విద్యా రంగాల్లో లైవ్ 3డీ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్‌ను చూపించింది. రిలయన్స్ జియో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో కాల్ అసిస్టెంట్‌ను ప్రదర్శించింది. రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ, భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఈసారి హాజరు కాకపోవడం గమనార్హం. నియంత్రణ వ్యవస్థ తోడ్పాటు ఉండాలి: బిర్లా కొత్త డిజిటల్ భారతదేశాన్ని నిర్మించాలంటే టెలికం రంగం కీలకమని వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. ఈ రంగం వృద్ధికి నియంత్రణ వ్యవస్థ తోడ్పాటు ఉండాలని, ప్రభుత్వం ఇందుకు అనువైన పరిస్థితులు కల్పించాలని పేర్కొన్నారు. మరోవైపు, భారీ స్పెక్ట్రం ధరలు, నెట్వర్క్ విస్తృతికి భారీగా వ్యయాలు చేయాల్సి వస్తుండటం టెలికం రంగంపై మరింత భారం మోపుతోందని భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ భారతి మిట్టల్ చెప్పారు. 5జీ స్పెక్ట్రంనకు ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న రిజర్వ్ ధర మిగతా దేశాలతో పోలిస్తే ఏకంగా ఏడు రెట్లు అధికమన్నారు. 5జీ లో భారత్ లీడరుగా ఎదగాలంటే స్పెక్ట్రం ధర సహేతుకంగా ఉండేలా చూడటం అవసరమని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా తెలిపారు. -
మంత్రి గారూ సినిమాల నుంచి బయటకు రండి..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థను బాలీవుడ్‌తో ముడిపెడుతూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. కేంద్ర మంత్రి సినీ జీవితం నుంచి బయటపడాలని, వాస్తవ పరిస్థితి నుంచి ఆయన తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, ప్రజల సొమ్ముతో ఎదిగిన బ్యాంకులు దీనస్థితిలో ఉన్నాయని ఈ స్థితిలో ప్రభుత్వం వారి సమస్యలను విస్మరించడం విచారకరమని అన్నారు. సినిమాలు సాధించే లాభాలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు. మంత్రి గారూ సినిమాల నుంచి బయటకు రండి..వాస్తవాన్ని అంగీకరించేందుకు సిగ్గు పడకండ’ని ప్రియాంక ట్వీట్ చేశారు. దేశంలో ఆర్థిక మందగమనం లేదని, ఇటీవల విడుదలైన మూడు సినిమాలు తొలిరోజే బాలీవుడ్లో రూ 120 కోట్ల వసూళ్లు సాధించడమే ఇందుకు నిదర్శనమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాదచేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలపై పెను దుమారం రేగడంతో కేంద్ర మంత్రి ఆదివారం తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు. -
ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని మరింత విస్తృతం చేయాలని, మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచి్చంది. అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు ఉన్నా భారత ఆరి్థక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నా యని పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)/ విదేశీ మారక నిల్వలు దండిగా ఉన్నాయంటూ, వీటిని తమ ఆరి్థక రంగ బలానికి నిదర్శనంగా చూపించారు. యాపిల్, డెల్, ఒప్పో, శామ్సంగ్, తదితర దిగ్గజ ఎల్రక్టానిక్స్, మొబైల్ కంపెనీల సీఈవోలతో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం ఢిల్లీలో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. భారత్ తయారీకి అంతర్జాతీయ కేంద్రంగా నిలుస్తోందని పేర్కొంటూ, భారత్ పట్ల మరింత శక్తితో, నిబద్ధతతో వ్యవహరించాలని వారిని కోరారు. కేవలం మొబైల్, ఆటోమోటివ్ ఎల్రక్టానిక్స్‌లోనే కాకుండా వ్యూహాత్మక, రక్షణ, వైద్య సంబంధిత ఎల్రక్టానిక్స్, రోబోటిక్స్‌పైనా పెట్టుబడులు పెంచాలని మంత్రి వారికి పిలుపునిచ్చారు. భారత్‌ను అంతర్జాతీయ ఎగుమతులకు కేంద్రంగా చేసుకోవాలని కోరారు. 5జీతో వృద్ధి మరింత పరుగు వృద్ధి అనుకూల ప్రభుత్వం, పెట్టుబడులకు అనుకూల విధానాలు, భారత మార్కెట్ బలం, నైపుణ్య మానవ వనరులు, డిజిటల్ సామర్థ్యాలు కలిగిన భారత్.. ఎల్రక్టానిక్స్ తయారీ, ఎగుమతుల కేంద్రంగా అవతరిస్తుందన్న నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు. 2025 నాటికి 400 బిలియన్ డాలర్ల (రూ.28.43 లక్షల కోట్లు) ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని కేంద్రం విధించుకున్న విషయం గమనార్హం. వృద్ధికి 5జీ నూతన సరిహద్దుగా పేర్కొన్నారు. 5జీ విజ్ఞాన ఆధారిత ఆరి్థక వ్యవస్థగా అవతరించాలని భారత్ కోరుకుంటోందన్నారు. -
నెహ్రూ తప్పును మోదీ సరిదిద్దారు
అహ్మదాబాద్: స్వాతంత్య్రానంతరం కశ్మీర్ విషయంలో భారత తొలి ప్రధాని నెహ్రూ చేసింది తప్పనీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసింది సరైనదనీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసి ప్రధాని మోదీ అలనాటి చారిత్రక తప్పిదాన్ని సరిచేశారన్నారు. ఆర్టికల్ 370 విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాన్ని సరిదిద్దేందుకు మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అభినందించాయన్నారు. భారత్ చర్యని బ్రిటన్, రష్యా, అమెరికా, ఫ్రాన్స్‌లు అభినందించాయని గుర్తుచేశారు. చివరకు చైనా సైతం భారత్ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించలేకపోయిందన్నారు. కశ్మీర్ అంశంలో కాంగ్రెస్ అభిప్రాయం ఏమిటన్నది ఇప్పటి వరకు అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ భారీ బహిరంగ సభ ఏర్పాటుపై చేసిన ప్రకటన పట్ల స్పందిస్తూ ముందు ఆ ప్రాంతంలో నివసిస్తోన్న ప్రజల ప్రజాస్వామిక హక్కులను గురించి మాట్లాడాలని పాక్ ప్రధానికి సూచించారు. పాక్ఆక్రమిత కశ్మీర్లో నివసిస్తోన్న ప్రజలకు నిజంగా ప్రజాస్వామిక హక్కులున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించారా? అని ఇమ్రాన్‌ను ప్రశ్నించారు. -
తెలుగుసహా 9 భాషల్లోకి ‘సుప్రీం’ తీర్పులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పులు దేశంలోని తొమ్మిది ప్రాంతీయ భాషల్లోకి అనువాదమవుతున్నాయని, వాటిని కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నామని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడంలో కృత్రిమ మేధస్సును ఉపయోగించేందుకు యోచిస్తున్నామని, దానికోసం ఒక కమిటీని ఏర్పాటు చేశామని లోక్‌సభలో చెప్పారు. ‘సుప్రీంకోర్టు తీర్పులు ప్రస్తుతం, తొమ్మిది స్థానిక భాషలలోకి అనువదిస్తున్నాం. అస్సామీ, బెంగాలీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తున్నాం’ అని చెప్పారు. కార్మిక, అద్దె ఒప్పందం, భూములు, సర్వీస్ మేటర్స్, నష్టపరిహారం, నేరాలు, కుటుంబ వివాదాలు, సాధారణ సివిల్ కేసులు, వ్యక్తిగత, ఆర్థిక, కౌలు రైతుల వివాదాలు, వినియోగదారుల హక్కుల సంరక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులను ప్రాంతీయ భాషల్లో అందుబాటు ఉంచుతామని మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. -
అమిత్ షా వస్తానని రాకపోతే...
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీల్లో చాలా మంది తరచుగా పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టేవారిని నిశితంగా కనిపెడుతున్నామని హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కీలక చర్చలు జరుగుతున్న సమయంలోనూ ఎంపీల హాజరు శాతంతక్కువగా ఉండటాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘మీరు నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి అమిత్ షా వస్తానని, చివరి నిమిషంలో రాకుండా ఉంటే మీకు ఎలా ఉంటుంది. ఒకవేళ 2 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచిన మీకు సన్నిహిత మిత్రుడు ఓటు వేయలేదని తెలిస్తే ఎలా ఫీలవుతారు? పార్లమెంట్లో మన ఎంపీలు తక్కువగా ఉన్నప్పుడు నేను కూడా అలాగే ఫీలవుతాన’ని మోదీ అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరై చర్చల్లో పాలుపంచుకోవడం అలవాటుగా మార్చుకోవాలని ఎంపీలకు సూచించారు. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పహ్లాద్ జోషి మాట్లాడుతూ... ఎంపీలు సమయపాలన పాటించాలని కోరారు. ట్రిఫుల్ తలాక్ బిల్లు గురించి న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. -
షాట్‌గన్ వర్సెస్ రవిశంకర్ ప్రసాద్?
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని పట్నా సాహీబ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తిరుగుబాటుదారుడు శతృఘ్నసిన్హాని పోటీ చేయించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇదే విషయం బిహార్ రాజకీయాలను కుదిపేస్తోంది. పట్నా సాహీబ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ని నిలబెడుతున్న తరుణంలో కాంగ్రెస్ శతృఘ్నసిన్హాను ముందుకు తెస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పట్నా సాహీబ్ నుంచి ఎట్టిపరిస్థితుల్లో పోటీచేసి తీరుతానని ఇప్పటికే శతృఘ్న ప్రకటించారు. ‘షాట్ గన్’గా అభిమానులు పిలుచుకునే శతృఘ్న బీజేపీ ప్రస్తుత ఎంపీ అయినా.. కొన్నేళ్లుగా బీజేపీపై, మోదీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గత వారం జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హాజరై, రవిశంకర్‌ప్రసాద్‌ను ఇక్కడ నిలబెట్టాలని చర్చించినట్టు తెలుస్తోంది. బీజేపీ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఆర్కే సిన్హా పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవలే పార్టీని వీడిన బీజేపీ మాజీ నేత, క్రికెటర్ కీర్తీ ఆజాద్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయవచ్చని తెలుస్తోంది. కీర్తీ ఆజాద్ బిహార్‌లోని దర్భంగ నియోజకవర్గానికి బీజేపీ తరఫున లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
‘అయోధ్య’పై మధ్యవర్తిత్వం
న్యూఢిల్లీ/చెన్నై/బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దశాబ్దాలుగా నలుగుతున్న రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. రాజకీయంగా సున్నితమైన ఈ కేసులో మధ్యవర్తిత్వం వహించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కోర్టు నియమించింది. ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌తోపాటు సీనియర్ న్యాయవాది, మధ్యవర్తిగా మంచి పేరు గడించిన శ్రీరామ్ పంచు ఈ త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉంటారు. మరో వారంలో మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించి 8 వారాల్లో ముగించాలని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. అయోధ్యకు 7 కిలో మీటర్ల దూరంలోని ఫైజాబాద్‌లో మధ్యవర్తిత్వ చర్చలు జరుగుతాయనీ, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చూడాలని యూపీ సర్కార్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఈ చర్చలన్నీ చాలా రహస్యంగా జరుగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. చర్చలకు సంబంధించిన వివరాలు పత్రికల్లో, టీవీల్లో రాకూడదని తాము కోరుకుంటున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అవసరమనుకుంటే ఈ మధ్యవర్తిత్వ చర్చలపై వార్తలను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా పత్రికలు, టీవీ చానళ్లను నిలువరించేలా ఆదేశాలు ఇచ్చేందుకు జస్టిస్ కలీఫుల్లాకు కోర్టు అధికారం కల్పించింది. పురోగతిపై నాలుగు వారాల్లో నివేదిక.. మధ్యవర్తిత్వ చర్చలు ప్రారంభించిన తర్వాత వాటిలో ఎంత వరకు పురోగతి వచ్చిందో తెలుపుతూ చర్చలు మొదలు పెట్టిన నాలుగు వారాల్లో ఓ నివేదికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతించడంలో న్యాయపరమైన చిక్కులేమీ తమకు కనిపించలేదని పేర్కొంది. ‘మధ్యవర్తులుగా ఎవరు ఉండాలన్న దానిపై ఈ కేసులో భాగస్వామ్య పక్షాలు ఇచ్చిన సిఫారసులను మేం పరిశీలించాం. త్రిసభ్య కమిటీని నియమించాలని నిర్ణయించాం. అవసరమనుకుంటే మరికొందరిని ఈ కమిటీలో భాగం చేసుకునేందుకు ప్రస్తుత మధ్యవర్తులకు స్వేచ్ఛనిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం ప్రతిపాదన వచ్చినప్పుడు ముస్లిం సంస్థలు దానిని సమర్థించగా, నిర్మోహి అఖాడా మినహా మిగిలిన హిందూ సంస్థలన్నీ వ్యతిరేకించాయి. అయితే మధ్యవర్తులుగా ఎవరు ఉండాలన్న దానిపై హిందూ సంస్థలు కూడా పేర్లను సిఫారసు చేశాయి. కాగా, చర్చల సమయంలో వివిధ భాగస్వామ్య పక్షాలు తెలిపే అభిప్రాయాలను అత్యంత రహస్యంగా ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో ఏమైన సమస్యలు ఎదురైనా మధ్యవర్తిత్వ కమిటీ చైర్మన్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి తెలియజేయవచ్చనీ, ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి ఏం కావాలో అడగొచ్చని కూడా న్యాయమూర్తులు తెలిపారు. అయోధ్యలో వివాదంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని నిర్మోహి అఖాడా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డ్‌లకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. ఇక మధ్యవర్తిత్వంలో ఈ కేసు ఎంత వరకు తేలుతుందో వేచి చూడాల్సిందే. ఆలయ నిర్మాణం జరగాల్సిందే: బీజేపీ అయోధ్య అంశంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయాన్ని తాము గౌరవిస్తామనీ, అయితే రామాలయ నిర్మాణం ఒక్కటే ఈ కేసుకు పరిష్కారమని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉమా భారతి మాట్లాడుతూ ‘అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మేం కట్టుబడి ఉన్నాం. మసీదును ఆలయానికి దూరంగా ఎక్కడైనా కట్టుకోవచ్చు’ అని అన్నారు. ‘సమస్యను పరిష్కరించడం ముఖ్యమే. కానీ శ్రీరామ జన్మభూమి వద్ద గుడి కట్టడం మరింత ముఖ్యం. ఎక్కువ కాలం ఈ విషయాన్ని నాన్చడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు పేర్కొన్నారు. పిటిషన్‌దారుల్లో ఒకరైన సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ ఆలయ నిర్మాణం జరగకపోవడం అన్న ప్రశ్నే లేదనీ, వీలైనంత త్వరలో గుడి కట్టాలని బీజేపీ పట్టుదలతో ఉందని చెప్పారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాం: కాంగ్రెస్ అయోధ్య అంశంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తెలిపింది. కేసు పరిష్కారానికి ఇదే చివరి ప్రయత్నం కావాలనీ, అన్ని పార్టీలు ఈ మధ్యవర్తిత్వంలో వచ్చే ఫలితానికి కట్టుబడి ఉండాలని ఆకాంక్షించింది. మతాలకు సంబంధించిన అంశాన్ని బీజేపీ గత 27 సంవత్సరాలుగా రాజకీయాలకు వాడుకుంటోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఈ వివాదాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ 1992 నుంచి ప్రతీ ఎన్నికలోనూ లబ్ధి పొందుతోందనీ, ఎన్నికలు పూర్తవ్వగానే ఆ అంశాన్ని మరుగున పడేస్తోందని ఆయన మండిపడ్డారు. రవిశంకర్‌కు చోటు విచారకరం మధ్యవర్తిత్వం చేసే త్రిసభ్య కమిటీలో రవిశంకర్‌కు చోటు కల్పించడం విచారకరమని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన తటస్థ వ్యక్తి కాదనీ, గతంలో ఈ అంశంపై రవిశంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. ‘వివాదాస్పద స్థలంపై ముస్లింలు మొండిపట్టు పడితే ఇండియా కూడా సిరియాలా తయారవుతుందని రవిశంకర్ 2018 నవంబర్ 4న వ్యాఖ్యానించారు. ఆయన ఏ పక్షం తరఫున ఉన్నారో గతంలోనే చెప్పారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు మధ్యవర్తిగా పెట్టడం విచారకరం’ అని ఒవైసీ అన్నారు. అయితే ఈ కేసులో మధ్యవర్తిత్వాన్ని అనుమతించాలన్న కోర్టు నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని చెప్పారు. మధ్యవర్తులు ఎవరంటే.. జస్టిస్ కలీఫుల్లా గతంలో ప్రఖ్యాత లాయర్‌గా పేరొందిన ఈయన 2016లో సుప్రీంకోర్టు జడ్జిగా 2016లో రిటైర్‌అయ్యారు. 2000 సంవత్సరంలో మద్రాసు హైకోర్టుకి శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. కశ్మీర్ హైకోర్టు సీజేగానూ చేశారు. 2012లో ఆయన సుప్రీం కోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. పదవిలో ఉండగా ఎన్నో చరిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ (బీసీసీఐ)లో సంస్కరణల తీర్పు ప్రముఖమైనది. భారతీయ యూనివర్సిటీల్లో జాతకశాస్త్రంపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించే కోర్సులు ప్రవేశపెట్టడాన్ని సమర్థిస్తూ తీర్పు చెప్పారు. శ్రీశ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు ప్రపంచవ్యాప్తంగా అనుచరులున్నారు. అయోధ్య సమస్య పరిష్కారానికి ఆయన 25 ఏళ్లుగా పని చేస్తున్నారు. ఎన్నో హిందూ, ముస్లిం సంఘాలతో మాట్లాడారు. 2017 సంవత్సరంలో ఆయన అయోధ్యలో పర్యటించి వివిధ వర్గాలతో, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపారు. సంక్షోభాలు నెలకొన్న దేశాల్లో ఆయన శాంతి స్థాపన కోసం అంబాసిడర్‌గా పనిచేశారు. కొలంబియా, ఇరాక్, ఐవరీకోస్ట్, బిహార్‌ల్లో వివాదాల పరిష్కారానికి ఇరుపక్షాలను ఒక్క చోటికి చేర్చి నేర్పుగా సంప్రదింపులు జరపడం ఆయనకు ఎనలేని పేరు తెచ్చింది. శ్రీరామ్ పంచు సీనియర్ న్యాయవాది అయిన శ్రీరామ్ పంచు మధ్యవర్తిత్వానికి మారుపేరు. భారత న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వం అనే ప్రక్రియను ప్రవేశపెట్టింది ఆయనే. 2005లో తొలిసారిగా భారత్‌లో కోర్టు వ్యవహారాలకు సంబంధించి మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభించారు. అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాల మధ్య 500 చదరపు కిలోమీటర్లకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి శ్రీరామ్ పంచుని సుప్రీంకోర్టు మధ్యవర్తిగా నియమించింది. దేశంలో అత్యంత కీలకంగా వ్యవహరించే మధ్యవర్తుల్లో శ్రీరామ్ పంచు ఒకరిగా గుర్తింపు పొందారు. బోర్డు ఆఫ్ ఇంటర్నేషనల్ మీడియేషన్ ఇనిస్టిట్యూషన్‌కు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. జస్టిస్ కలీఫుల్లా, శ్రీశ్రీరవిశంకర్, శ్రీరామ్ పంచు -
లైసెన్స్‌కూ ‘ఆధార’మే!
జలంధర్: దేశంలో డ్రైవింగ్ లైసెన్సులు పొందేందుకు త్వరలోనే ఆధార్‌ను తప్పనిసరి చేస్తామని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దీనివల్ల నకిలీ, డూప్లికేట్ లైసెన్సుల జారీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. డ్రైవింగ్ లైసెన్సులను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంటులో పెండింగ్‌లో ఉందని ప్రసాద్ వెల్లడించారు. ‘పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న మోటార్ వాహనాల చట్టంలో మరో కీలక సవరణ చేయబోతున్నాం. త్వరలోనే మోటార్ వాహనాల లైసెన్సులకు ఆధార్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి కానుంది. వ్యక్తుల గుర్తింపును ధ్రువీకరించడంలో ఆధార్ అన్నది గొప్ప పరిణామం’ అని పేర్కొన్నారు. ఆధార్–డ్రైవింగ్ లైసెన్సు అనుసంధానంతో వచ్చే ప్రయోజనాలపై మాట్లాడుతూ..‘ఉదాహరణకు ఓ తాగుబోతు వాహనం నడుపుతూ నలుగురు వ్యక్తులను గుద్ది చంపేశాడనుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో అతను పంజాబ్ నుంచి మరో రాష్ట్రానికి పారిపోయి తప్పుడు డాక్యుమెంట్లతో కొత్త డ్రైవింగ్ లైసెన్సు పొందగలడు. కానీ ఆధార్‌తో డ్రైవింగ్ లైసెన్సును అనుసంధానిస్తే.. ఇలాంటి ఘటనలు నిలిచిపోతాయి. ఓ వ్యక్తి మహా అయితే తన పేరును మార్చుకోగలడు తప్ప చేతి వేలిముద్రలను మార్చుకోలేడు. ఎవరైనా వ్యక్తులు నకిలీ పేరుతో డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు యత్నిస్తే.. కొత్త వ్యవస్థ బయోమెట్రిక్ ఆధారంగా సదరు వ్యక్తికి ఇప్పటికే లైసెన్స్ ఉందని హెచ్చరిస్తుంది. అంతేకాకుండా వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలు, జరిమానాలు ఆధార్‌తో అనుసంధానం అవుతాయి. దీనివల్ల జరిమానాలు కట్టకుండా వాహనాలు నడపడం కష్టమవుతుంది. ప్రస్తుతం దేశంలో 124 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి’ అని పేర్కొన్నారు. -
సోషల్ మీడియాకు సంకెళ్లు
గత ఏడాది ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో షికార్లు చేసిన పుకార్లు.. దేశంలో పలుచోట్ల అల్లర్లు, మూక హత్యలకు అసలు కారణంగా నిలిచాయి. దీంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, పుకార్లను కట్టడిచేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు కదిలింది. కొత్త సంవత్సరంలో ఈ దిశగా ఐటీ చట్టాన్ని సవరిస్తోంది. భారీగా జరిమానాలు వేసి అసత్యవార్తలు, అశ్లీల సమాచారాన్ని వ్యాప్తి చేసే మాధ్యమాలను నియంత్రించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలకు భారత్‌లో ఖాతాదారులు చాలా ఎక్కువ. గత ఏడాది అనుభవాలతో ఇవి కొన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ఫేక్ న్యూస్‌పై ప్రజలకు అవగాహన కలిగిస్తూ, హెచ్చరిస్తూ భారీస్థాయిలో ప్రకటనలు ఇస్తున్నాయి. అసభ్య, అసత్య సందేశాలు, సమాచారం పంపకుండా ఖాతాదారులను కట్టడి చేసేందుకు యత్నిస్తున్నాయి. కేంద్రం హెచ్చరికలు ఖాతాదారుల సమాచారాన్ని దొంగిలించి తద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీ మంత్రి రవి శంకర్ ఫేస్బుక్, వాట్సాప్‌లను హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో తమ మాధ్యమం ద్వారా అనైతిక సమాచారం వ్యాప్తి కాకుండా ఫేస్బుక్ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో ఎన్నికల ప్రకటనలు పోస్టుచేసే వారు వారి వివరాలు, ఎక్కడ నుంచి పోస్టు చేస్తున్నారనేవి విధిగా వెల్లడించాల్సిందే. 15 కోట్ల వరకు జరిమానా వదంతులు, అశ్లీల సమాచారాన్ని, దృశ్యాలను నియం త్రించడంలో విఫలమైన వెబ్సైట్లు, యాప్‌లపై భారీ జరిమానా విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ‘ డేటా ప్రొటెక్షన్ బిల్లు’ పేరుతో ముసాయిదాను ఖరారు చేసింది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, గూగుల్ వంటి సోషల్ మీడియా, ఇంటర్నెట్ సంస్థల అధిపతులతో ఐటీ శాఖ అధికారులు సమావేశమయ్యారు. మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టి, వాటి జవాబుదారీతనాన్ని పెంచే మార్గాలపై చర్చించారు. ‘అసత్య, అశ్లీల సమాచా రం సోషల్ మీడియాలోకి ఎక్కడ నుంచి వస్తోందో గుర్తించాలి, దాన్ని తొలగించాలి. ఈ దిశగా ప్రభుత్వం చట్టాన్ని సవరించనుంది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండాలి’ అని ఓ ఉన్నతాధికారి అన్నారు. నిబంధలను ఉల్లంఘించిన కంపెనీలపై రూ. 15 కోట్లు లేదా వాటి ప్రపంచవ్యాప్త టర్నోవర్‌లో 4శాతం ఈ రెండింటిలో ఏది ఎక్కువయితే దాన్ని జరిమానాగా విధించాలని ప్రతిపాదించారు. -
వారికి కచ్చితంగా మరణశిక్ష పడుతుంది!
న్యూఢిల్లీ : పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే నేరస్తులకు మరణశిక్ష విధించేలా పోక్సో(లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం) చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడే నేరగాళ్లకు మరణశిక్ష విధించడమే సరైందని పేర్కొన్నారు. ఈ మేరకు పోక్సో చట్టానికి సవరణలు చేసినట్లు తెలిపారు. పిల్లలను మేజర్లుగా చిత్రీకరించేందుకు హార్మోన్లు ఎక్కించడాన్ని కూడా తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడే వ్యక్తులకు కూడా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. Union Law Minister, Ravi Shankar Prasad: Cabinet has approved death penalty in aggravated sexual offences under the Protection of Children from Sexual Offences (POCSO) Act. pic.twitter.com/E1JB8xCOOq — ANI (@ANI) December 28, 2018 కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో సవరణ చేసిన విషయం తెలిసిందే. ఈ సవరణలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే రేపిస్టులకు గరిష్టంగా మరణశిక్ష విధిస్తారు. -
‘తలాక్’ బిల్లుకు లోక్ సభ ఓకే
న్యూఢిల్లీ: తక్షణ విడాకులిచ్చే ఇస్లాం సంప్రదాయం ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే తాజా బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు–2018 పేరిట తెచ్చిన ఈ బిల్లుకు 245 మంది సభ్యులు అనుకూలంగా, 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లును మరింత లోతుగా పరిశీలించేందుకు జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల వినతిని కేంద్రం తోసిపుచ్చడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశాయి. తాజా బిల్లుతో ఇంతకు ముందే లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో అపరిష్కృతంగా ఉన్న పాత బిల్లు రద్దయింది. దీంతో ఏడాది వ్యవధిలో ఒకే బిల్లు రెండుసార్లు లోక్‌సభ ఆమోదం పొందినట్లయింది. ఇక తాజా బిల్లు తదుపరి దశలో రాజ్యసభ ఆమోదానికి వెళ్తుంది. అక్కడ కూడా గట్టెక్కి రాష్ట్రపతి ఆమోదముద్ర లభిస్తే చట్టరూపం దాలుస్తుంది. ఈ చట్టం ప్రకారం.. తక్షణ విడాకులు కోరుతూ ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరం, చట్ట విరుద్ధం. ఆ నేరానికి పాల్పడే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించారన్న విపక్షాల వాదనల్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. బిల్లు రాజ్యాంగ విరుద్ధం: విపక్షాలు ప్రస్తుతం అమలవుతున్న ఆర్డినెన్స్ స్థానంలో ఈ నెల 17నే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా, గురువారం సభ పరిశీలనకు వచ్చింది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. బిల్లులోని పలు నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, మరింత అధ్యయనం నిమిత్తం బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇలాంటి బిల్లుపై లోక్‌సభ ఇది వరకే చర్చించి ఆమోదం తెలిపిందని, కాబట్టి ఇంకా అభ్యంతరాలేమైనా ఉంటే వాటిని చర్చించాలి కానీ హఠాత్తుగా బిల్లును మరో కమిటీకి పంపాలని కోరొద్దని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులకు సూచించారు. తాజా బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని, పలు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ముస్లిం మహిళల సాధికారత కాదని, ముస్లిం పురుషుల్ని శిక్షించడమేనని మరో కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్ ఎద్దేవా చేశారు. రాజకీయంతో చూడొద్దు: రవిశంకర్ తలాక్ బిల్లుపై రాజకీయాలు చేయొద్దని, ఇది ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తెచ్చింది కాదని న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఈ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆక్షేపించారు. ‘రాజకీయ కొలమానంలో ఈ బిల్లును చూడొద్దు. ఇది మానవత్వం, సమన్యాయానికి సంబంధించింది’ అని పేర్కొన్నారు. మరింత అధ్యయనం కోసం బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న విపక్షాల డిమాండ్‌పై స్పందిస్తూ..సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాల్ని ప్రభుత్వం ఇది వరకే పరిశీలించి అందుకు అనుగుణంగా బిల్లులో సవరణలు చేసిందని వెల్లడించారు.2017 జనవరి నుంచి 477 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని, ఓ ప్రొఫెసర్ వాట్సప్‌లో తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ర్యాలీకి హాజరైన భార్యకు వ్యక్తి ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులిచ్చిన దృష్టాంతాలూ ఉన్నాయని గుర్తుచేశారు. ప్రసాద్ వివరణ ముగిసిన వెంటనే కాంగ్రెస్, తృణమూల్, ఏఐఏడీఎంకే, ఆర్జేడీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఇది తలాక్ 2.0 బిల్లు తొలి తలాక్ బిల్లు గతేడాది డిసెంబర్ 28న లోక్‌సభలో ఆమోదం పొందినా, ప్రతిపక్షాల వ్యతిరేకతతో రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. విపక్షాలు పలు అభ్యంతరాలు లేవనెత్తడంతో కొన్ని సవరణలు చేస్తూ సెప్టెంబర్ 17న ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ సవరణలు చేరుస్తూ తాజాగా తెచ్చిన బిల్లు ప్రకారం..నిందితులకు బెయిల్ ఇచ్చే వెసులుబాటును కల్పించారు. తలాక్‌ను కాంపౌం డబుల్ నేరంగా ప్రకటించారు. అంటే.. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిరితే కేసును వెనక్కి తీసుకోవచ్చు. బాధితురాలు, ఆమె దగ్గరి సంబంధీకులు ఫిర్యాదుచేస్తేనే కేసు నమోదు చేస్తారు. ఎప్పుడేం జరిగింది? ► 2016, ఫిబ్రవరి 5: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహు భార్యత్వంల రాజ్యాంగబద్ధతపై దాఖలైన పిటిషన్ల విచారణలో అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సహకారం కోరిన సుప్రీంకోర్టు. విడాకుల కేసుల్లో ముస్లిం మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారా? అని సందేహించిన కోర్టు ► 2016, జూన్ 29: రాజ్యాంగమే గీటురాయిగా ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని పరిశీలిస్తామన్న అత్యున్నత న్యాయస్థానం ► 2016, అక్టోబర్ 7: ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తున్నట్లు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు ► 2017, ఫిబ్రవరి 16: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ బెంచ్ ఏర్పాటు ► 2017, ఏప్రిల్ 16: ట్రిపుల్ తలాక్ అంశాన్ని తొలిసారి లేవనెత్తిన ప్రధాని మోదీ..ముస్లిం మహిళలకు న్యాయం చేస్తామని హామీ ► 2017, ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధం, చెల్లుబాటు కాదని 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ► 2017, డిసెంబర్ 28: ట్రిపుల్ తలాక్ నేరానికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్‌సభ ► 2018, ఆగస్టు 10: రాజ్యసభలో తలాక్ బిల్లు. ప్రవేశపెట్టిన కేంద్రం. విపక్షాల వ్యతిరేకతతో లభించని ఆమోదం. ► 2018, సెప్టెంబర్ 19: విపక్షాల సూచనల్ని పరిగణనలోకి తీసుకుని ఆర్డినెన్స్ జారీ ► 2018, డిసెంబర్ 27: సవరించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం. కీ పాయింట్స్ ► మూడు సార్లు వరుసగా తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వడాన్ని శిక్షార్హ నేరమని సంబంధిత బిల్లులో ప్రతిపాదించారు. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నించిన నేరానికిగానూ భర్తకు మూడేళ్ల జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధించవచ్చు. బాధిత మహిళకు మెయింటెనెన్స్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. ► తాజా ట్రిపుల్ తలాక్ బిల్లుపై గురువారం మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ నాలుగు గంటల పాటు కొనసాగింది. ► ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. దీనివల్ల మహిళలకే నష్టం కలుగుతుందని వాదించాయి. తలాక్ చెప్పిన భర్తకు జైలు శిక్ష విధించకూడదన్న వాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. నిందితుడిని బెయిల్‌పై విడుదల చేసే అధికారం స్థానిక పోలీసు అధికారికి కాకుండా, మేజిస్ట్రేట్ స్థాయి అధికారికే ఉండాలన్న విజ్ఞప్తినీ ప్రభుత్వం తోసిపుచ్చింది. ► ప్రతిపాదిత చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశముందన్న విపక్షాల ఆందోళనలతో.. ప్రభుత్వం ఈ బిల్లులో మూడు సవరణలను ప్రతిపాదించింది. అవి 1. బాధిత మహిళ కానీ, ఆ మహిళ దగ్గరి బంధువు కానీ తక్షణ తలాక్ చెప్పిన భర్తపై పోలీసు కేసు పెట్టాలి. 2. దంపతులిద్దరూ రాజీకి వస్తే ఆ మహిళ కేసును ఉపసంహరించుకోవచ్చు. 3. బాధిత మహిళ వాదన విన్నాకే ఆ భర్తకు బెయిల్ ఇవ్వాలో, వద్దో మేజిస్ట్రేట్ నిర్ణయించాలి. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ ఈ సెప్టెంబర్‌లో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. గత సంవత్సరం ఆగస్ట్‌లో ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ట్రిపుల్ తలాక్ నిరంకుశ విధానమని, అది ఇస్లామిక్ సంప్రదాయం కాదని, ఇస్లాం మత విధానాల్లో ట్రిపుల్ తలాక్ భాగం కాదని 3–2 మెజారిటీతో అత్యున్నత న్యాయస్థానంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ బిల్లు ప్రమాదకరం విపక్షాలు, హక్కుల కార్యకర్తల ఆందోళన న్యూఢిల్లీ: లోక్‌సభ ఆమోదించిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుపై ముస్లిం సంస్థలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువమంది ఈ బిల్లును వ్యతిరేకించగా కొందరు మాత్రమే స్వాగతించారు. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం చేయాలి: ఒవైసీ స్వలింగ సంపర్కం నేరం కాదంటున్న ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ నేరం అని వాదించడం వెనుక గల ఉద్దేశాన్ని వెల్లడి చేయాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ట్రిపుల్తలాక్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఒవైసీ మాట్లాడారు. ‘అక్రమసంబంధాలు నేరం కాదన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకోకుండా పురుషులను ఆపే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు ట్రిపుల్ తలాక్ మాత్రం నేరమని అంటున్నారు. స్వలింగ సంపర్కం నేరం కానపుడు ట్రిపుల్ తలాక్ నేరం ఎలా అవుతుంది? ఈ బిల్లును ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగానే తీసుకువచ్చింది. రాజ్యాంగంలోని సెక్షన్–377 ప్రకారం లింగపరమైన మైనారిటీలకు హక్కులున్నప్పడు, మతపరమైన మైనారిటీలకు ఎందుకు ఉండవు? మీ విశ్వాసం మీకున్నప్పుడు. మా విశ్వాసం కూడా మాదే అవుతుంది. మీ (ప్రభుత్వం) ఉద్దేశం సరిగా లేదు’ అని అన్నారు. ఎన్నికల దృష్టితో తెచ్చిన బిల్లు: కాంగ్రెస్ వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తలాక్ బిల్లు తెచ్చిందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ‘సంబంధిత వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రవేశపెట్టిన ఈ బిల్లులోని అంశాలు రాజ్యాంగానికి, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లులో మాదిరి కఠిన నిబంధనలు మరే చట్టంలోనూ లేవు. ఈ బిల్లును ఆమోదించటానికి ముందుగా పార్లమెంట్ జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపి అభిప్రాయం తీసుకోవాలి’ అని కోరారు. నేర పూరితం అనడం తగదు: కారత్ వ్యక్తిగత అంశాన్ని కూడా నేరం అనడం తగదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అభిప్రాయపడ్డారు. ‘ఏ మతం కూడా ఇలాంటి కారణంపై అరెస్టు చేయాలని చెప్పలేదు. ముస్లిం మహిళల హక్కులను కాపాడటానికి బదులుగా మైనారిటీల్లో విభేదాలను సృష్టించడమే ఈ బిల్లు వెనుక ప్రభుత్వ వాస్తవ ఉద్దేశం. ఈ బిల్లు వల్ల ముస్లిం మహిళలకు మరిన్ని కష్టాలు తప్పవు’ అని ఆమె పేర్కొన్నారు. ఒక్కోమతానికి ఒక్కో చట్టమా? మతాన్ని బట్టి చట్టాలు ఎలా మారుతాయని ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ సెక్రటరీ కవితా కృష్ణన్ ప్రశ్నించారు. ‘భార్యను వదిలివేయడం వంటి చర్యలకు ముస్లిమేతరులు పాల్పడితే నేరం కానప్పుడు, ముస్లింలైతే నేరం ఎందుకు అవుతుంది’ అని అన్నారు. న్యాయ మంత్రి బదులివ్వలేకపోయారు ‘ఈ బిల్లులోని అంశాలపై ప్రతిపక్షాలు అడిగిన అనేక ప్రశ్నలకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానాలు చెప్పలేకపోయారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేయడమే ప్రభుత్వం ఉద్దేశం’ అని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యురాలు ఆస్మా జెహ్రా ఆరోపించారు. తలాక్‌ను ప్రభుత్వం లేకుండా చేసినప్పుడు ఇంకా చర్చ ఎందుకని ఆల్ ఇండియా ఉలేమా కౌన్సిల్ కార్యదర్శి మౌలానా మహ్మూద్ దర్యాబా దీ ప్రశ్నించారు. తలాక్ చెప్పిన కారణంగా భర్త జైలుకు వెళితే, ఎలాంటి ఆర్థిక ఆసరాలేని అతని భార్య, సంతానం సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. ఈ బిల్లును ‘భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్’ సంస్థ సభ్యురాలు స్వాగతించారు. బహుభార్యత్వం, చిన్నారుల సంరక్షణ వంటి అంశాల్లో స్పష్టత తెచ్చేందుకు హిందూ వివాహ చట్టం మాదిరిగా ముస్లిం వివాహ చట్టాన్నీ తేవాలన్నారు. సుప్రీం ఏం చెప్పింది? ముస్లింలు పాటిస్తున్న ట్రిపుల్ తలాక్ (తలాక్ ఏ బిద్దత్) సంప్రదాయం చెల్లదనీ, అది రాజ్యాంగవిరుద్ధమని 2017, ఆగస్టు 22న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3–2 మెజారిటీతో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్రిపుల్ తలాక్‌ను కొట్టివేసేందుకు అనుకూలంగా జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ తీర్పు ఇవ్వగా, అప్పటి సీజేఐ జస్టిస్ ఖేహర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ మెజారిటీ తీర్పుతో విభేదించారు. ట్రిపుల్ తలాక్‌పై ఆర్నేల్లు నిషేధం విధించాలనీ, ఆలోగా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకురావాలని తీర్పు ఇచ్చారు. రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ చివరికి ట్రిపుల్ తలాక్‌ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ ఖేహర్ 395 పేజీల తీర్పును వెలువరించారు. ఈ సందర్భంగా జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నారిమన్, జస్టిస్ యు.యు.లలిత్ మెజారిటీ తీర్పును వెలువరిస్తూ..‘ట్రిపుల్ తలాక్ ఆచారంలో భాగమైనప్పటికీ అది లోపభూయిష్టమైనది. పునరాలోచనకు ఆస్కారం లేకుండా వెనువెంటనే చెప్పేసే ట్రిపుల్ తలాక్ కారణంగా వివాహబంధాలు విచ్ఛిన్నం అవుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14(సమానత్వపు హక్కు)ను ఇది ఉల్లంఘించడమే’ అని ముగ్గురు జడ్జీలు మెజారిటీ తీర్పు ఇచ్చారు. ‘తమకు న్యాయం చేయాలంటూ ముస్లిం మహిళలు న్యాయస్థానం మెట్లు ఎక్కితే చేతులు ముడుచుకుని కూర్చోవడం కోర్టులకు సాధ్యం కాదు. తలాక్ ఎ బిద్దత్ సహా మూడు రకాల విడాకులను ముస్లిం పర్సనల్ అప్లికేషన్ చట్టం–1937లో చేర్చడంతో పాటు గుర్తింపునిచ్చారు. షరియా చట్టంలో చేర్చినంత మాత్రాన అది ప్రాథమిక హక్కులకు అతీతమైనదేమీ కాదు. రాజ్యాంగరచన కంటే ముందు లేదా తర్వాత రూపొందిన ఏ చట్టమైనా సరే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 13(1) చెబుతోంది. ముస్లిం పురుషుడు ఇష్టానుసారం, జవాబుదారీతనం లేకుండా ఏకపక్షంగా తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు తలాక్ ఆస్కారం కల్పిస్తోంది’ అని తన తీర్పులో జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ పేర్కొన్నారు. తలాక్ బిల్లుకు సంబంధించి లోక్‌సభ డిస్ప్లే బోర్డుపై కనిపిస్తున్న ఓట్లు లోక్‌సభలో బిల్లుపై మాట్లాడుతున్న రవిశంకర్ ప్రసాద్, మల్లికార్జున్ ఖర్గే, అసదుద్దీన్ ఒవైసీ -
రాహుల్ సుప్రీంకోర్టు కంటే గొప్పవాడా?
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. రాఫెల్ డీల్‌పై విచారణ చేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. దేశానికి కాపలాదారు (చౌకీదార్)గా ఉంటానన్న ప్రధాని మోదీ పెద్ద దొంగ అని రాహుల్ మీడియా సమావేశంలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. (ఖర్గేకు తెలియకుండా వేరే పీఏసీ ఉందా : రాహుల్) ‘రాహుల్ తనకు తాను చాలా గొప్పగా ఊహించుకుంటున్నాడు. సుప్రీం తీర్పును గౌరవించకుండా.. దేశ ప్రధాని హోదాను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్ నోటిని అదుపులో పెట్టుకో. రాహుల్ సుప్రీంకోర్టు కంటే గొప్పవాడా. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు కంటే కూడా గొప్పదని భావిస్తోందా. రాఫెల్ వ్యవహారంలో కాంగ్రెస్ దిక్కుమాలిన రాజకీయాలు చేయాలని చూస్తోంది.’ అని ధ్వజమెత్తారు. -
సోషల్ మీడియా
సొమ్మెవరిది? ‘‘మొదట ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 597 అడుగుల సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం నిర్మించారు, తర్వాత ముంబైలోని సముద్ర తీరాన 696 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం నిర్మిస్తామన్నారు. ఇప్పుడు తాజాగా అయోధ్యలో 495 అడుగుల రాముని విగ్రహం నిర్మిస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అంటున్నారు. మీరు, నేను చెల్లించే ట్యాక్స్‌లన్నీ ఈ భారీ విగ్రహాల కోసమేనా?’’ – ప్రీతిష్ నంది, జర్నలిస్ట్ మారిన హామీలు ‘‘నాలుగేళ్ల క్రితం అధికారం చేపట్టినప్పుడు అభివృద్ధి, ఉద్యోగాల పేరు చెప్పారు. ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామన్నారు. ఐదేళ్లు గడిచిపోయినా ఏమీ జరగలేదు. ఇప్పుడు భారీ దేవాలయాలు నిర్మిస్తామని, పెద్దపెద్ద విగ్రహాలు నెలకొల్పుతామని హామీలిస్తున్నారు’’ – చిదంబరం,కేంద్ర మాజీ మంత్రి బెగ్గింగ్ కాదు ‘‘పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా పర్యటనలో చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేయడంలో పొరపాటు దొర్లింది. డేట్ లైన్ బీజింగ్ బదులు బెగ్గింగ్ అని తప్పుగా వచ్చింది. ఇది తెరపై 20 సెకన్లపాటు కనబడింది. తర్వాత తొలగించారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం’’ – పీటీవీ న్యూస్ మూగబోయిన మోదీ! ‘‘ఢిల్లీలో రాజకీయ అత్యవసర పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దేశరాజధానిలో కాలుష్యంతో జనం తల్లడిల్లుతుంటే అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్రప్రభుత్వం పరస్పరం నిందించుకోవడంతో సరిపెట్టుకోవటం దారుణం. కాలుష్యాన్ని పరిష్కరించడం ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన అంశం కాగా, ప్రధాని స్వచ్ఛభారత్ గురించి మాట్లాడటం సమంజసమేనా? ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ముద్రపడిన ఢిల్లీ సమస్యకు మోదీ చూపే పరిష్కారం ఏమిటి?’’ – అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ ప్రతినిధి ఇదీ లెక్క ‘‘గాంధీ కుటుంబ సభ్యుల పేరు మీద 11 కేంద్ర, 52 రాష్ట్ర పథకాలు, 19 స్టేడియాలు, 5 ఎయిర్‌పోర్ట్‌లు, 10 విద్యా సంస్థలు, 17 అవార్డులు, 9 స్కాలర్షిప్లు, 10 ఆసుపత్రులు ఉన్నాయి. కానీ, పటేల్ విగ్రహమే వారికి సమస్యగా మారింది’’ – రవి శంకరప్రసాద్, కేంద్ర మంత్రి -
రైల్వే ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దసరా సందర్భంగా ఈ ఏడాది కూడా 78రోజులకు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పీఎల్బీ) కింద రూ. 2,044.31 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి రవిశంకర్‌ప్రసాద్ బుధవారం వెల్లడించారు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ లభించనుంది. దీని కింద ఉద్యోగులు తమ వేతనంతో పాటు రూ.17,951 అదనంగా బోనస్ కింద పొందనున్నారు. పీఎల్బీ బోనస్ కింద సుమారు 12.26లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(ఆర్పీఎస్ఎఫ్) ఉద్యోగులకు ఇది వర్తించదు. -
సుప్రీం సూచనలతో ఆధార్‌లో మార్పులు
న్యూఢిల్లీ: ఆధార్ రాజ్యాంగబద్ధమేనంటూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు పలు సూచనలు చేసిన నేపథ్యంలో వీటిని అమలుచేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రైవేటు సంస్థలు ఆధార్ డేటాను వినియోగించడాన్ని నియంత్రించడంతోపాటు కోర్టు చేసిన సూచనలు అమలుచేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలని యూఐడీఏఐ అధికారులకు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ఆదేశించారు. ఐటీ శాఖ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవో అజయ్‌సహా ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఉన్నారు. ఈ సమావేశంలో విస్తృతాంశాలపై చర్చ జరిగిందని ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘1,400 పేజీల తీర్పులో కోర్టు ప్రస్తావించిన చాలా అంశాలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. దీనిపై న్యాయ నిపుణుల అభిప్రాయంకోరే ముందు యూఐడీఏఐ మార్పులు చేపట్టనుంది’ అని ఆయన పేర్కొన్నారు. -
ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ట్రిపుల్ తలాక్’పై నరేంద్ర మోదీ సర్కార్ మరో అడుగు ముందుకేసింది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందకపోవడంతో ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకరావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ‘ట్రిపుల్ తలాక్’పై ఆర్డినెన్స్‌తో పాటు పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి వర్గ నిర్ణయాలను న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకనే ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తీసుకువచ్చామని వివరించారు. తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలు, భార్యకు భరణం ఇచ్చేలా ఆర్డినెన్స్ రూపొందించామన్నారు. ఆర్డినెన్స్ కింద అరెస్టయిన వ్యక్తికి మెజిస్ట్రేట్ వద్ద బెయిల్ పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. భార్య, రక్తసంబంధీకులు, స్నేహితులు మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, భార్య వాదనలు విన్న తర్వాతే బెయిల్‌పై మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 430 ట్రిపుల్ తలాక్ కేసులు సుప్రీం కోర్టు ఉత్తర్వుల తర్వాత 430 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని, రాజ్యాంగపరంగా అత్యవసరం కాబట్టే ఆర్డినెన్స్ తెచ్చామని వివరించారు. బిల్లు కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరేందుకు ప్రయత్నించామని పేర్కొన్నారు. ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతున్నా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతివ్వడంలేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఈ కేసులు నమోదయ్యాయన్నారు. మహిళలకు న్యాయం చేసేందుకే, వారి గౌరవం కోసమే ఈ బిల్లు తెచ్చామని అన్నారు. సోనియా, మాయావతి, మమతా బెనర్జీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు వీడి ఈ బిల్లుకు మద్దతివ్వాలని రవిశంకర్ ప్రసాద్ కోరారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల జీతాల పెంపు అంగన్ వాడీ వర్కర్లు, సహాయక సిబ్బంది, ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ.3000 నుంచి రూ.4500కు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రాఫెల్ ఒప్పందంపై జెపిసి, సీఏజీ విచరణ అవసరం లేదని స్సష్టం చేశారు. రాఫెల్ విమానాల కొనుగోలుపై ఏ నిర్ణయం తీసుకోకుండా పదేళ్లు నానబెట్టారని గత కాంగ్రెస్ పాలకులపై మండిపడ్డారు. -
నాశనం చేయడం సులభం; సీజేఐ మిశ్రా
న్యూఢిల్లీ: ‘ఓ వ్యవస్థను విమర్శించడం, దానిపై దాడులు చేయడం, నాశనం చేయడం చాలా సులభం. కానీ ఆ వ్యవస్థ పనిచేసేలా మార్చ డం సవాళ్లతో కూడుకున్న కష్టమైన పని’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జస్టిస్ మిశ్రా మాట్లాడారు. వ్యవస్థలోని వ్యక్తులు తమ వ్యక్తిగత కోర్కెలు, లక్ష్యాలను అధిగమించి సానుకూల దృక్పథంతో, హేతుబద్ధతతో, పరిణతి, బాధ్యతలతో నిర్మాణాత్మక చర్యలు చేపట్టినప్పుడే వ్యవస్థ మరింత ఉన్నత స్థానానికి చేరుతుందని అన్నారు. ‘న్యాయవ్యవస్థను బలహీన పరిచేందుకు కొన్ని శక్తులు పనిచేస్తుండొచ్చు. మనమంతా కలసి వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి’ అని పేర్కొన్నారు. న్యాయ దేవత చేతిలోని త్రాసు సమన్యాయాన్ని సూచిస్తుందనీ, ఆ సమానత్వానికి భంగం కలిగించే ఎవరైనా ఆ దేవతను బాధ పెట్టినట్లేనని జస్టిస్ మిశ్రా అన్నారు. న్యాయ దేవత కన్నీరు కార్చేందుకు తాము ఒప్పుకోమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాహిత వ్యాజ్యాల (పిల్) విస్తృతి దెబ్బతినకుండా ఉండాలంటే కొంత పరిశీలన తప్పనిసరన్నారు. తక్కువ విస్తృతి కలిగిన అంశాలపై పిల్ వేసేందుకు చెల్లించాల్సిన రుసుమును సుప్రీంకోర్టు ఇటీవల భారీగా పెంచడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ తదితర గొప్పవాళ్ల గుర్తుగా ఉన్న ప్రదేశాలను సందర్శించినప్పుడు వారిని పొగడాలని రవి శంకర్ కోరగా, జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ ‘వారంతా దేశం కోసం పోరాడారు. మన పొగడ్తల కోసం కాదు’ అని అన్నారు. -
వాట్సాప్‌కు మళ్లీ నోటీసులు
న్యూఢిల్లీ: వదంతులు, బూటకపు వార్తలు వ్యాప్తిచెందకుండా తగిన పరిష్కార మార్గాలు కనుగొనాలని కేంద్రం వాట్సాప్‌ను మరోసారి కోరింది. లేబలింగ్ ఫార్వర్డ్స్(ఫార్వర్డ్ చేసిన సందేశాలను గుర్తించే విధానం)ని మించిన మరింత ప్రభావశీల చర్యలతో ముందుకు రావాలని ఆదేశిస్తూ గురువారం లేఖ రాసింది. వదంతుల ప్రచారానికి ఉపయోగపడుతున్న వేదికలను కూడా ప్రేరేపకాలుగానే భావిస్తామని, అవి ప్రేక్షక పాత్ర వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. ‘కొందరు పోకిరీలు వదంతులను ప్రచారం చేస్తున్నారు. అందుకు వారు వాడుతున్న సాధనాలు తమ బాధ్యత, జవాబుదారీతనం నుంచి తప్పించుకోజాలవు. ప్రేక్షకులుగా మిగిలిపోయే అలాంటి వేదికలను ప్రేరేపకాలుగా భావిస్తూ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని సమాచార, సాంకేతిక శాఖ వాట్సాప్‌ను హెచ్చరించింది. నకిలీ వార్తలను గుర్తించి, అవి వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న లేబలింగ్ ఫార్వర్డ్స్ కన్నా మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. సోషల్ మీడియా దుర్వినియోగంపై రాజకీయ పార్టీలు సహా అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించి తగిన విధానాలు రూపొందిస్తామని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో వెల్లడించారు. -
గంట కూడా అధికారాన్ని వదులుకోం!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: షెడ్యూల్ ప్రకారమే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని ముందస్తుకు అవకాశమే లేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. లోక్‌సభతో పాటు 13 రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల తలెత్తిన గందరగోళానికి తెరదించాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలేదని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఐదేళ్లు అధికారంలో కొనసాగేలా ప్రజలు తీర్పునిచ్చారని, అందుకు కనీసం గంట ముందు కూడా గద్దెదిగబోమని తేల్చిచెప్పాయి. దేశవ్యాప్తంగా 51 శాతం ఓట్లు గెలుచుకోవడమే తమ లక్ష్యమని, ప్రతిపక్షాల ఐక్యతను చెడగొట్టే ఉద్దేశం లేదని తెలిపాయి. మోదీకి రాహుల్ గాంధీ సరితూగరని, ఆయన్ని కాంగ్రెస్ తన ప్రధాని అభ్యర్థిగా నిలబెడితే, అది తమకు లాభమే చేకూరుస్తుందని అన్నాయి. ఇందుకు ఉత్తరప్రదేశ్‌లోని కైరానా ఉప ఎన్నికల్లో బీజేపీ 47 శాతం ఓట్లు పొందడాన్ని ఉదహరించాయి. 14 కోట్ల మంది కార్యకర్తలతో సైన్యం బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నామని, ఒక్కో బూత్‌లో 25 మంది చొప్పున మొత్తం 7 లక్షల బూత్‌లలో కార్యకర్తలను నియమించుకున్నట్లు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది కార్యకర్తలు బీజేపీ కోసం పనిచేస్తున్నారని, వారందరి ఫోన్ నంబర్లు, ఓటరు గుర్తింపు కార్డులు, ఇతర వివరాలు అధ్యక్షుడు అమిత్ షా వద్ద ఉన్నాయని చెప్పాయి. కార్యకర్తలతో షా తరచూ సమావేశమవుతూ వారిని ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారని తెలిపాయి. బీజేపీ ఎంపీలంతా అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొనేందుకు అందుబాటులో ఉండేలా గురువారం, శుక్రవారం వారికి భోజనాలు, ఇతర ఏర్పాట్లు చేయాలని పార్టీ విప్‌లను ఆదేశించినట్లు వెల్లడించాయి. సభకు హాజరై అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేసేలా తమ పార్టీ సభ్యులందరికీ విప్ జారీచేశామని, దాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించాయి. -
రేప్‌కు మరణదండన!
న్యూఢిల్లీ: 12 ఏళ్ల లోపున్న బాలికలపై అత్యాచారం చేసిన కేసులో దోషులకు మరణశిక్ష ప్రతిపాదిస్తూ బిల్లును కేంద్రం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ప్రధాని నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోం శాఖ ఈ మేరకు రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర పడింది. తాజా బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే ఆర్డినెన్స్ రద్దవుతుంది. ఈ బిల్లులోని ముఖ్యాంశాలు.. ► 12 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న చిన్నారిపై రేప్‌కు పాల్పడి దోషిగా తేలితే కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష(జీవితఖైదుగా పొడిగించొచ్చు) లేదా మరణ దండన విధిస్తారు. సామూహిక అత్యాచారం చేస్తే జీవితఖైదు లేదా ఉరిశిక్ష వేస్తారు. ► మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టేవారికి కనీసం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. ఈ శిక్షను జీవితఖైదుగా పొడిగించే వెసులుబాటు కల్పించారు. ► 16 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న బాలికలపై రేప్‌కు పాల్పడితే కనీస జైలు శిక్షను 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచారు. దీన్ని కూడా జీవితఖైదుగా మార్చొచ్చు. ► అత్యాచారాలకు సంబంధించిన అన్ని కేసుల విచారణను 2 నెలల్లో పూర్తిచేయాలి. ► అప్పీళ్లను 6 నెలల్లోగా పరిష్కరించాలి. ► 16 ఏళ్ల లోపున్న బాలికపై రేప్, గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులకు ముందస్తు బెయిల్ జారీ చేయడంపై ఎలాంటి ప్రస్తావన లేదు. ► ఒకవేళ వారికి బెయిల్ మంజూరీపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, 15 రోజుల ముందే బాధితురాలి తరఫు లాయరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు కోర్టు నోటీసులు. కేబినెట్ ఇతర నిర్ణయాలు ► ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపనకు ఆమోదం. ► చెరకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.20 పెంపు. దీంతో అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే సీజన్ నుంచి మిల్లులు రైతులకు క్వింటాలు చెరకుకు కనీసం రూ.275 చెల్లించాలి. ► జైలులో శిక్ష అనుభవిస్తున్న వృద్ధ ఖైదీలకు కేంద్రం క్షమాబిక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. శిక్షను కనీసం సగం పూర్తిచేసుకున్న 55 ఏళ్లకు పైబడిన మహిళలు, 60 ఏళ్లకు పైబడిన పురుషులను మూడు విడతల్లో విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ అక్టోబర్ 2, వచ్చే ఏడాది ఏప్రిల్ 10, వచ్చే ఏడాది అక్టోబర్ 2న దఫాల్లో వారికి విముక్తి కలిగించనున్నారు. అయితే వరకట్న హత్యలు, అత్యాచారాలు, మనుషుల అక్రమ రవాణా, పోటా, టాడా, ఫెమా లాంటి తీవ్ర నేరాల్లోని దోషులకు ఈ పథకం వర్తించదు. ► మహారాష్ట్రలోని కరువు ప్రాంతాలైన విదర్భ, మరాఠ్వాడాల్లో 81 సాగునీటి ప్రాజెక్టులకు రూ.13 వేల కోట్ల సాయానికి అనుమతి. ► మైనారిటీ విద్యార్థులకు ప్రిమెట్రిక్, పోస్ట్ మెట్రిక్, ప్రతిభ ఆధారిత ఉపకార వేతనాలను 2020 వరకు కొనసాగించాలని నిర్ణయం. ఇందుకోసం రూ.5 వేల కోట్లకు వ్యయం కానుంది. -
కోటలో లక్ష మందితో...
కోట/జైపూర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజస్తాన్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమం గిన్నిస్ రికార్డుకెక్కింది. యోగా గురు రామ్‌దేవ్ సారథ్యంలో గురువారం కోటలో జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష మందికి పైగా ప్రజలు యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేతోపాటు ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఒకేసారి 1.05 లక్షలకు పైగా ప్రజలతో యోగా కార్యక్రమం నిర్వహించి రాజస్తాన్ ప్రభుత్వం, పతంజలి యోగా పీఠ్, కోట జిల్లా యంత్రాంగం ప్రపంచ రికార్డు నెలకొల్పాయి’ అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పేర్కొంది. గిన్నిస్ సంస్థ ప్రతినిధులు సర్టిఫికెట్‌ను సీఎం రాజే, రామ్‌దేవ్‌లకు అందజేశారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 6.30 నుంచి 7 గంటల వరకు 15 రకాల యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు రెండు లక్షలకు పైగా ప్రజలు కోటలోని ఆర్ఏసీ గ్రౌండ్‌కు తరలివచ్చారు. 2017లో మైసూర్లో 55,524 మంది యోగాసనాలు వేసి రికార్డు సృష్టించగా తాజాగా ఆ రికార్డును కోట అధిగమించింది. రాజస్తాన్‌లోని ప్రతి జిల్లాలో ‘ఆచార్య’ పేరుతో యోగా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వసుంధరా రాజే ప్రకటించారు. యూరోపియన్ పార్లమెంట్లో రవిశంకర్ బెంగళూరు: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా వేడుకల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ యోగా గురువు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్ పాల్గొన్నారు. బెల్జియంలో భారత రాయబార కార్యాలయం, ఆర్ట్ ఆఫ్ లివింగ్, యూరోపియన్ పార్లమెంట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, ఎంబసీ అధికారులు, 250 మంది పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసంగిస్తూ..నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు ముఖ్యమైన సమస్యలైన విద్వేషం, కుంగుబాటును యోగా మాదిరిగా మరే మార్గం పరిష్కరించలేదని అన్నారు. -
యోగా వేడుకలు ప్రారంభం
వాషింగ్టన్/న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అంతర్జాతీయ యోగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహకంగా పలు దేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఆసనాలు వేశారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌తోపాటు న్యూయార్క్‌లోని గవర్నర్స్ ఐలాండ్‌లో జరిగిన ముఖ్య కార్యక్రమాల్లో అమెరికాలో భారత రాయబారితోపాటు దౌత్యాధికారులు, అమెరికా కాంగ్రెస్ సభ్యులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. న్యూయార్క్‌లోని గవర్నర్స్ ఐలాండ్‌లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ సమీపంలో యోగా ఉత్సవాలు రెండు గంటలపాటు జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వారు, తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. నెదర్లాండ్స్‌లో రవిశంకర్ నేతృత్వంలో.. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్ నెదర్లాండ్స్‌లో యోగా వేడుకలను ప్రారంభించారు. రాజధాని అమ్‌స్టర్‌డ్యామ్‌లోని మ్యూజియం స్క్వేర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. నేపాల్‌లోని ముక్తినాథ్ ఆలయంలో, పారిస్‌లోని ఈఫిల్ టవర్ సమీపంలో, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్, దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లలో నిర్వహించిన యోగా వేడుకల్లో ప్రజలు పాల్గొని ఆసనాలు వేశారు. పారిస్‌లో ఈఫిల్ టవర్ ముందు యోగాసనాలు వేస్తున్న ఔత్సాహికులు -
‘తెలంగాణలో ట్రిపుల్ తలాక్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ట్రిపుల్ తలాక్ ఆచారం కొనసాగుతోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా నగరంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లో ఉన్నా తెలంగాణలో మాత్రం ఆ ఆచారం కొనసాగుతోందని అన్నారు. ముస్లిం దేశమైన పాకిస్తాన్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాలు తలాక్‌ని నిషేదించాయని, మనం ఎందుకు నిషేదించకుడదని ప్రశ్నించారు. ముస్లిం మహిళల అత్మగౌరవాన్ని కాపాడేందుకు రూపొందించిన తలాక్ బిల్లుకి పార్లమెంట్లో సోనియా గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ అడ్డుపడ్డారని విమర్శించారు. మహిళలను వేధించిన వారికి ముడేళ్ల శిక్ష అన్ని మతాల వారికి వర్తింస్తుందని కేవలం మతం ఆధారంగా చుడరాదని కోరారు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 15 లింగ సమానత్వం అందరికి వర్తిస్తుందని కేవలం మతం ఆధారంగా కఠిన చట్టాలు ఉండడానికి వీళ్లేదన్నారు. మోదీ ప్రభుత్వం నాలుగేళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నిర్వహించిన సమావేశాల్లో రవిశంకర్ పాల్గొన్నారు. నాలుగేళ్ల కాలంలో మోదీ సర్కార్ సాధించిన విజయాలపై డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. కొద్ది కాలంలోనే మోదీ ప్రపంచ నేతగా ఎదిగారని పేర్కొన్నారు. -
‘భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది’
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘మోదీ సర్కార్ నాలుగేళ్ల పాలన’ పై హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ..భారత్ మాట కోసం ప్రపంచం ఎదురుచూసేలా మోదీ దేశ గౌరవాన్ని పెంచారన్నారు. రష్యా, చైనా దేశాలు ప్రధాని మోదీని స్వయంగా ఆహ్వానించాయని రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాలుగేళ్ల నుంచి దేశ ఆర్థికస్థితి స్థిరంగా, వేగంగా పెరుగుతోందన్నారు. రెండులక్షల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ నాలుగేళ్లలో వెయ్యగలిగామని పేర్కొన్నారు. 120 కంపెనీలు స్వదేశంలోనే మొబైల్స్ తయారు చేస్తున్నాయని, గ్రామీణ, పట్టణ రహదారులు వేగంగా నిర్మించామని తెలిపారు. 50కోట్ల మందికి 5లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నామన్నారు. ఆధార్ వాడకంలో ప్రైవసీ, సెక్యూరిటీని పెంచామని, సర్టికల్ స్ట్రైక్ లాంటి గట్టి నిర్ణయాలు మోదీ సర్కార్ తీసుకుందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాద విషయంలో పాకిస్తాన్‌ను ప్రపంచంలో ఒంటరి చేశామని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా ఇలా ప్రతి పథకం ప్రజల కోసమే అమలు చేశామన్నారు. దేశంలో అందరికి జన్‌ధన్ ఖాతా తెరిపించి డిజిటల్ పరిపాలన పెంచామని ఆయన పేర్కొన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ వర్సిటీకి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశ్వవిద్యాలయానికి ‘ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ’గా నామకరణం చేశారు. అనంతపురం జిల్లా జంతులూరులో రూ. 902.07 కోట్లతో వర్సిటీ ఏర్పాటు కానుంది. పూర్తిస్థాయిలో భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాల్లో వర్సిటీని కొనసాగించాలని నిర్ణయించింది. ఈ వర్సిటీకి నిధుల విడుదల ప్రక్రియను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షించాలని సూచించింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. -
కొలీజియం’ను ప్రశ్నించిన మంత్రి
న్యూఢిల్లీ: కర్ణాటకలోని జిల్లా జడ్జి పి.కృష్ణభట్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సరైన రీతిలో దర్యాప్తు జరగలేదని, విశాఖ కేసులో సుప్రీంకోర్టు పొందుపరిచిన నిబంధనల మేరకు ఆ ఫిర్యాదును విచారించలేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ మిశ్రాకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేఖ రాశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై జరుగుతున్న నిష్పాక్షిక విచారణలో ఆ జడ్జి నిర్దోషిగా తేలేవరకూ హైకోర్టు జడ్జిగా నియమించాలన్న సిఫార్సుల్ని సుప్రీంకోర్టు కొలీజియం నిలుపుదల చేయలేదా? అని లేఖలో ప్రశ్నించారు. జడ్జి కృష్ణభట్పై జూనియర్ న్యాయాధికారి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్ని కర్ణాటక హైకోర్టు తప్పుగా తేల్చిందని.. అయితే కర్ణాటక హైకోర్టు సీజే మళ్లీ విచారణ జరపడాన్ని సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి జస్టిస్ చలమేశ్వర్ ఇటీవల ప్రశ్నించడం తెల్సిందే. లేఖలో న్యాయ శాఖ మంత్రి ప్రసాద్ స్పందిస్తూ.. ‘న్యాయవ్యవస్థ సిఫార్సుల్ని కార్యనిర్వాహక వ్యవస్థ అడ్డుకుంటోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. జడ్జిపై జూనియర్ మహిళా న్యాయాధికారి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సంక్షిప్త విచారణ పలు తీవ్ర సందేహాల్ని రేకెత్తించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో జాగ్రత్తగా విచారణ చేయించడాన్ని కూడా సరైన, తగిన, తిరుగులేని దర్యాప్తుగా పరిగణించాలి’ అని ప్రసాద్ పేర్కొన్నారు. -
భారత్ బంద్: దిగొచ్చిన కేంద్రం!
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నారంటూ దళిత సంఘాలు దేశ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పుపై రివ్యూకు వెళుతున్నట్టు స్పష్టం చేసింది. ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై మేం సమగ్ర పిటిషన్‌ను దాఖలు చేశాం. ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్లు వాదనలు వినిపించనున్నారు’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం మీడియాకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కులం ఆధారంగా అమాయకులను వేధించేందుకు ఉపయోగించరాదని పేర్కొంటూ.. ఈ చట్టం అమలు విషయంలో పలు మార్పులు సూచిస్తూ జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గత నెల 20న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు తీర్పు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు సోమవారం దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల కారణంగా ఎస్సీ, ఎస్టీల అత్యాచారాల నిరోధక చట్టం బలహీనపడుతుందని కేంద్రం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ చట్టం–1989 ప్రకారం.. వేధింపుల ఘటనల్లో అరెస్టులు, కేసు నమోదు వెనువెంటనే జరగాల్సి ఉంటుంది. కానీ, తక్షణ అరెస్టులు, కేసుల నమోదు ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వు ఫలితంగా బలహీన వర్గాలకు రక్షణగా నిలిచేందుకు ఉద్దేశించిన ఈ చట్టం నిరుపయోగంగా మారుతుందనీ, ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు పెరుగుతాయని ప్రభుత్వం తన పిటిషన్లో సుప్రీంకోర్టుకు తెలుపింది. అంతేకాకుండా, దళితులు, షెడ్యూల్ తెగల వారికి న్యాయం అందించటంలో తాజా ఉత్తర్వు ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించింది. -
జుకర్ బర్గ్‌ను భారత్‌కు రప్పిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ : కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ) సేవలను ఉపయోగించుకున్నట్లు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు బుధవారం పరస్పరం పార్లమెంట్లో ఆరోపణలు చేసుకున్నాయి. ఫేస్బుక్ నుంచి సేకరించిన అమెరికా ఓటర్ల డేటాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ ఉపయోగించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఈ సందర్భంలోనే మన కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ జోక్యం చేసుకొని ఫేస్బుక్ ప్రొఫైల్‌ను భారత్‌లో అనుమతిస్తామని, అయితే ఇలా ఖాతాదారుల డేటాను ఇతరులకు అందజేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అవసరమైతే ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను భారత్‌కు రప్పిస్తామని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి ఉత్తుత్తి బెదిరింపులను మనం తాటాకు చప్పుళ్లు చేయడం అని చెప్పవచ్చు. దేశంలో తగినన్ని క్రిమినల్ చట్టాలు ఉన్నప్పటికీ విదేశాలకు పారిపోయిన నేరస్థులు నీరవ్ మోదీ, లలిత్ మోదీలను భారత్‌కు రప్పించలేక పోతున్నాం. ఇక భారతీయుల డేటా పరిరక్షిణకు దేశంలో తగిన చట్టాలే లేనప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ లాంటి వారిని భారత్‌కు రప్పిస్తామంటూ హెచ్చరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి! పైగా ఇదే మంత్రిగారి ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు ఇటీవల ‘ప్రైవసీ’ ప్రాథమిక హక్కు కాదని వాదించింది. కేవలం ఐదు వందల రూపాయలకు ఆధార్ కార్డు వివరాలు ఎవరికైనా అందుబాటులో ఉండే ఈ దేశంలో పౌరుల వ్యక్తిగత వివరాలకు భద్రత ఎంతో ఊహించవచ్చు! కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన ఒకే ఒక ఐటీ సమాచార చట్టం కింద పౌరుల వ్యక్తిగత డేటాకు భద్రతను కల్పిస్తోంది. ఇది కూడా కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఫేస్బుక్ వ్యక్తం చేసే అభిప్రాయలలాంటివాటికి భద్రత ఉండదు. ఈ చట్టం కింద భద్రంగా ఉంచాల్సిన అంశాలు 1. పాస్వర్డ్ 2. ఆర్థిక సమాచారం అంటే, బ్యాంక్ ఖాతాల వివరాలు, ఆర్థిక చెల్లింపు సాధనాలు 3. ఆరోగ్య పరిస్థితి 4. వైద్య రికార్డులు, హిస్టరీ 5.లైంగిక దక్పథం. 6. బయోమెట్రిక్ సమాచారం. ఈ ఆరు అంశాలకు తగిన భద్రత కల్పించాలని, అందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉందిగానీ ఈ అంశాలను తస్కరించిన వారికి, అందుకు సహకరించిన వారికి ఎలాంటి శిక్షలు విధించాలో లేదు. బిహార్ ఎన్నికల్లో ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ఇదే కేంబ్రిడ్జి సంస్థ, ఫేస్బుక్లో భారతీయుల వివరాల డేటాను ఉపయోగించుకుంది. అలాంటప్పుడు ఈ 2000–ఐటీ చట్టం కింద భారత ప్రభుత్వం జూకర్ బర్గ్‌ను భారత్‌కు రప్పించగలదా? అన్నది కోటి రూకల ప్రశ్న. -
ఫేస్బుక్ వార్!
న్యూఢిల్లీ: ఫేస్బుక్ డేటా లీకేజ్ వివాదం భారత్‌కూ పాకింది. కోట్లాది ఫేస్బుక్ వినియోగదారుల వివరాలను పలు దేశాల్లో రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాల రూపకల్పనకు అక్రమంగా వినియోగించిన సంస్థ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ)’తో భారత్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధం ఉందన్న వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ తదితర పార్టీలు తమ క్లయింట్లేనంటూ ఆ సంస్థ భారతీయ భాగస్వామి ఓబీఐ (ఒవలెనొ బిజినెస్ ఇంటలిజెన్స్) తన వెబ్సైట్లో ప్రకటించడం సంచలనం రేకెత్తించింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. సీఏతో అంటకాగింది, సంబంధాలు కొనసాగిస్తోంది మీరంటే.. మీరంటూ ఒకరిపై ఒకరు ఆరోపణాస్త్రాలు సంధించారు. సోషల్‌మీడియాలో రాహుల్ విస్తృతి వెనుక ఉన్నది ‘సీఏ’నేనని, ఓటర్లను ఆకర్షించేందుకు ఆ సంస్థ సేవలను కాంగ్రెస్ వాడుకుంటోందని బీజేపీ నేత, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. మరోవైపు, బిహార్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ ఈ సంస్థ సేవలను వినియోగించుకుందంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేందుకు ఉద్దేశించిన ‘బ్రెగ్జిట్’ ఉద్యమంలో ‘సీఏ’ పాత్రపై వివాదం చెలరేగి, పలు దేశాల్లో దర్యాప్తులు కొనసాగుతున్న వేళ.. భారత్‌నూ ఈ అంశం కుదిపేయడం రానున్న రోజుల్లో సోషల్ మీడియా ప్రభావాన్ని కళ్లకు కడుతోంది. కాంగ్రెస్ జవాబివ్వాలి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతిలో కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకున్న సంబంధమేంటో రాహుల్ గాంధీ చెప్పాలని రవిశంకర్ డిమాండ్ చేశారు. ‘ఈ డేటా విశ్లేషణ సంస్థ సెక్స్, అనైతిక మార్గాలు, అసత్యపు వార్తల ద్వారా ఎన్నికలను ప్రభావితం చేస్తుందని నిరూపితమైంది. ఇలాంటి సంస్థతో కాంగ్రెస్ కలిసి పనిచేస్తోంది’ అని ఆయన ఆరోపించారు. ‘2019 ఎన్నికల ప్రచారంలో మోదీపై కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం అంటూ మీడియాలోని ఓ వర్గం ప్రచారం చేస్తుంటే ఏమో అనుకున్నాం. అది ఇదేనా. సీఏ సంస్థ అమ్మాయిలను ఎరగా వేసి, డబ్బులు ఆశజూపి రాజకీయ నాయకులను ఉచ్చులోకి దించుతుంది, ఫేస్బుక్ డేటాను చోరీ చేస్తుంది. ఇదేనా కాంగ్రెస్ చేయాలనుకున్నది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సంస్థ డేటా విశ్లేషణ వివరాల ద్వారానే ఓటర్లను ఆకర్షిస్తోందా?’ అని ప్రశ్నించారు. ఫేస్బుక్కూ వార్నింగ్ ఫేస్బుక్ వినియోగిస్తున్న 20 కోట్ల మంది భారతీయ వినియోగదారుల వివరాలను దుర్వినియోగం చేసినట్లు తెలిస్తే.. ఫేస్బుక్ సంస్థపై కఠిన చర్యలు తప్పవని రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. ఫేస్బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాలు కూడా ఎన్నికల విధానాన్ని అనైతిక పద్ధతుల్లో ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. భారత ప్రభుత్వం మీడియా, భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తుందని, సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకోవటం తప్పుకాదన్న మంత్రి.. దీన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం ఊరుకోబోమన్నారు. ‘దేశ ప్రయోజనాలు, దేశ భద్రతకు సంబంధించిన విషయమిది. భారత ప్రజాస్వామ్య విధానాన్ని ప్రభావితం చేసే ఏ అంశాన్నైనా సీరియస్‌గా తీసుకుంటాం. అవసరమైతే.. జుకర్‌బర్గ్‌ను భారత్‌కు రప్పించి విచారిస్తాం’ అని ఆయన అన్నారు. బీజేపీతోనే సంబంధాలు బీజేపీయే ఈ సంస్థతో సంబంధాలు పెట్టుకుందని.. అనవసరంగా తమపై ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ పేర్కొంది. బిహార్, గుజరాత్ ఎన్నికల సమయంలో ఈ సంస్థ సేవలను బీజేపీ వినియోగించుకుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. పార్టీకి గానీ, రాహుల్‌కు గానీ సీఏ సంస్థతో సంబంధాల్లేవన్నారు. ఇతర సమస్యలనుంచి దేశం దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోందన్నారు. ‘అవాస్తవాలను ప్రచారం చేయటంలో దిట్ట అయిన బీజేపీ నేడు మరో అసత్యాన్ని తెరపైకి తెచ్చింది. అబద్ధపు ప్రెస్ కాన్ఫరెన్స్, అసత్యాల ఎజెండా, అనైతిక వ్యూహం, అసత్య ప్రకటనలు బీజేపీ, న్యాయంలేని న్యాయశాఖ మంత్రి దినచర్యలో భాగమయ్యాయి’ అని సుర్జేవాలా విమర్శించారు. బిహార్ ఎన్డీయే నేత కుమారుడే సీఏ భారతీయ సంస్థ ఓవిలేనో బిజినెస్ ఇంటెలిజెన్స్ (ఓబీఐ)ను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. యూఎస్, యూకేల్లో విచారణలు ఐదుకోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల వివరాలను తస్కరించడంపై అమెరికా, బ్రిటన్ సహా పలు యూరోపియన్ దేశాలు విచారణకు ఆదేశించాయి. తమ ముందు విచారణకు హాజరవ్వాలంటూ ఇప్పటికే ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆదేశించాయి. అమెరికాలో ఈ కేసును ఆ దేశ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) విచారిస్తోంది. విచారణకు తమ ముందు హాజరవ్వాలని అమెరికన్ కాంగ్రెస్ జుకర్‌బర్గ్‌కు నోటీసులు పంపింది. బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ 2016 ఎన్నికల్లో ట్రంప్ తరపున ప్రచార బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించింది. చిత్తశుద్ధితో చేస్తున్నాం: ఫేస్బుక్ ఫేస్బుక్ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని.. అందువల్ల ఈ సంస్థపై 40వేల డాలర్ల (దాదాపు రూ. 26 లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్టు ఓ కథనంలో పేర్కొంది. తాజా వార్తల నేపథ్యంలో ఫేస్బుక్ షేర్లు బుధవారం మరో 2.6 శాతం పడిపోయాయి. కాగా, ఓ రాజకీయ కన్సల్టెన్సీ తమ వినియోగదారుల డేటా చోరీ చేయటంపై ఆందోళనలో ఉన్నట్లు ఫేస్బుక్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘మేం మోసపోయామని అర్థమైంది. మా పాలసీలకు అనుగుణంగా వినియోగదారుల భద్రతను కాపాడేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. జుకర్‌బర్గ్ సహా మిగిలిన ఉన్నతాధికారులంతా రాత్రింబవళ్లు ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఫేస్బుక్ పేర్కొంది. ‘డిలీట్ ఫేస్బుక్’ ఉద్యమం వ్యక్తిగత డేటా లీకేజీ ఘటన అనంతరం.. ఫేస్బుక్ అకౌంట్‌ను తొలగించాలంటూ వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ పేర్కొన్నారు. ‘డిలీట్ ఫేస్బుక్.. ఇదే సరైన సమయం’ అని బ్రయాన్ ఆక్టన్ పేర్కొన్నారు. అటు డిలీట్ ఫేస్బుక్ ప్రచారం మిగిలిన సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది. పలు మీడియా సంస్థలు కూడా ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాలిఫోర్నియాకు చెందిన వాట్సాప్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ 2009లో వాట్సాప్ సేవలను ప్రారంభించింది. 2014లో ఫేస్బుక్ సంస్థ 19 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.2 లక్షల కోట్లు)కు ఈ సంస్థను కొనుగోలు చేసింది. కాగా, గతేడాది సెప్టెంబర్‌లోనే బ్రయాన్ ఫేస్‌బుక్‌ను వదిలి కొత్త సంస్థలో చేరారు. ఫేస్బుక్ డేటాతో ఏం చేస్తారు? స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారిలో దాదాపు ప్రతీ ఒక్కరు ఫేస్బుక్ అకౌంట్ ఉన్నవారే. తమ వ్యక్తిగత, వృత్తిగత వివరాలను అందులో పొందుపర్చినవారే. రాజకీయం, సామాజికం, సాహిత్యం సహా దాదాపు అన్ని సమకాలీన అంశాలు, ఘటనలపై తమ అభిప్రాయాలను పంచుకున్నవారే. ఫేస్బుక్ వినియోగదారుల వివరాలతో కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ ఏం చేసింది? ఆ వివరాలను ఎందుకు, ఎలా వినియోగించింది? దాంతో తమకేం నష్టం?.. ఇలాంటి సందేహాలు, ప్రశ్నలు ఎన్నో వినియోగదారులను వేధిస్తున్నాయి. అలెగ్జాండర్ నిక్స్ సీఏ చేసే పనేంటి? స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ లాబొరేటరీస్ (ఎస్సీఎల్) అనే సంస్థ బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తోంది. దీనికి అనుబంధంగా కేంబ్రిడ్జ్ అనలిటికా (సీఏ) అనే సంస్థ ఉంది. ఇది క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా డేటా విశ్లేషణలో సహకరిస్తుంది. ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకుని తమ క్లయింట్ల ఎన్నికల ప్రచారానికి వ్యూహాలను సీఏ రూపొందిస్తుంది. ఏ పార్టీకి అనుకూలంగా ఓటర్లు ఉన్నారనే అంతర్గత సమాచారం, వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా క్లయింట్ల వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఎన్నికల్లో గెలిచేందుకు అసత్యవార్తలను ఫేస్బుక్లో ప్రచారం చేయటం, మాజీ గూఢచారులతో వ్యూహాలు రూపొందించటం కూడా సీఏ పనే. అవసరమైతే ప్రత్యర్థి అభ్యర్థులపై హానీట్రాప్ (అమ్మాయిలను ఎరగావేయటం)కూ వెనుకాడరని ఈ సంస్థపై ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. సీఏ సీఈఓ అలెగ్జాండర్ నిక్స్ బీబీసీ ఛానెల్ 4 ‘స్టింగ్ ఆపరేషన్’లో అడ్డంగా దొరికిపోవడం ద్వారానే ఈ డొంకంతా కదిలింది. అమెరికా ఎన్నికలు, బ్రెగ్జిట్తోపాటు, బ్రిటన్, ఇజ్రాయిల్‌లలో రాజకీయ నేతల తెరవెనక సమాచార సేకరణ కోసం మాజీ గూఢచారుల సేవలను వినియోగించుకున్నామని కూడా నిక్స్ వెల్లడించాడు. యాప్‌లతో కొట్టేస్తారు.. ఫేస్బుక్లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఈ సంస్థ సేకరించి అధ్యయనం చేస్తుంది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ అనే కంపెనీ ‘పర్సనాలిటీ క్విజ్’ అనే యాప్‌ను రూపొందించింది. దీన్ని దాదాపు 3 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌ను తెరిచేందుకు ఫేస్‌బుక్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు.. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులతోపాటు వారి ఫేస్బుక్ మిత్రుల (మొత్తం సంఖ్య కోట్లలోనే) వివరాలు, వారి ఇష్టాయిష్టాలను ఈ సంస్థ తెలుసుకోగలిగింది. ఇలా అక్రమంగా సేకరించిన సమాచారంతో సీఏ ‘సైకలాజికల్ ప్రొఫైల్స్’ను సృష్టించి విశ్లేషిస్తుంది. ఏం చేస్తే ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చు? వ్యతిరేకతనుంచి గట్టెక్కేందుకు ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేయాలి? అనే వివరాలనూ ఈ సంస్థ సూచిస్తుంది. ట్రంప్ వెనకా, బ్రెగ్జిట్ ముందూ.. సీఏనే! ఒక్కో అమెరికా ఓటర్ నాడిని, మానసిక స్థితిని తెలుసుకోవటం కోసమే.. 2016 అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో సీఏ పనిచేసిందని స్పష్టమైంది. తద్వారా ట్రంప్ అనుకూల ఎన్నికల ప్రచార వ్యూహాలు సిద్ధం చేసింది. అటు, బ్రెగ్జిట్ సందర్భంగా బ్రిటన్ ఓటర్లనూ ప్రభావితం చేయడంపై బ్రిటన్ విచారణ జరుపుతోంది. భారత్‌లో ఇప్పటికే పునాదులు భారత్‌లోని ఒవిలెనో బిజినెస్ ఇంటెలిజెన్స్ (ఓబీఐ) గ్రూపు.. సీఏ మాతృ సంస్థ అయిన ఎస్సీఎల్తో 2010 నుంచి కలిసి పనిచేస్తుంది. 2014 ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు కోసం ఈ సంస్థ బీజేపీ, కాంగ్రెస్‌లను సంప్రదించినా డీల్ కుదరలేదని సమాచారం. 2019 ఎన్నికల కోసం ప్రస్తుతం ఈ రెండు పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. భారత్‌లోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తమ క్లయింట్లేనని ఓబీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. 2016లో ఓ ప్రాంతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా గ్రూపు ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడలేదు’ అని ఒబీఐ హెడ్ అమ్రిష్ త్యాగి (జేడీయూ మాజీ రాజ్యసభ సభ్యుడు కేసీ త్యాగి కుమారుడు) పేర్కొన్నారు. 2010 బిహార్ ఎన్నికల్లో.. 2010 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ‘లోతైన ఎన్నికల విశ్లేషణ’ జరిపినట్టు ఓబీఐ పేర్కొంది. ఈ కాంట్రాక్ట్‌లో భాగంగా వివిధ పార్టీల వైపు ఆసక్తి చూపే ఓటర్లను గుర్తించామని తెలిపింది. తమ సంస్థ పనిచేసిన సీట్లలో 90 శాతానికి పైగా స్థానాల్లో తమ క్లయింట్ విజయం సాధించినట్టు ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. అత్యధిక యువ ఓటర్లున్న భారత్‌లో యువత వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనుంది. 2019 ఎన్నికల్లో దేశంలోని 13.30 కోట్ల మంది ఓటర్లు తొలిసారి పోలింగ్ బూత్‌లకు రానున్న నేపథ్యంలో వారి నాడిని పసిగట్టేందుకు సామాజిక మాధ్యమాలే కీలకం కానున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పది పార్టీలు పోరాడుతున్నా పట్టించుకోరా?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు జరుగుతున్న ఆందోళనలను మోదీ సర్కారు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ విమర్శించారు. రాజ్యసభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ... పది పార్టీలు ఒకే అంశంపై పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీ అమలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తక్షణం చర్చ చేపట్టి ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆజాద్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. తమను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని ఎదురుదాడి చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టకుండా ఇప్పుడు తమను అడుగుతారా అని ప్రశ్నించారు. కాగా, ప్రత్యేక హోదా అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది. -
నామినేషన్ సమర్పించిన కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర న్యాయ, సమాచారశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. అరుణ్‌జైట్లీ ఉత్తర ప్రదేశ్ నుంచి, రవిశంకర్ ప్రసాద్ తన సొంత రాష్ట్రం బిహార్ నుంబి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. రెండు రోజుల క్రితమే పార్టీ అభ్యర్థుల పేర్లును ప్రకటించడంతో మంత్రులు ఇవాళ నామినేషన్లు వేశారు. కాగా మంత్రి రవిశంకర్ ప్రసాద్ నామినేషన్ వేయడానికి బయలుదేరే ముందు తల్లి ఆశీర్వాదాలు అందుకుని ఆమెతో కలిసి దిగిన ఫోటోను ట్విటర్ లో షేర్ చేశారు. Took the blessings of my mother again before going to file my nomination for Rajya Sabha, today. The love of my 86 year old mother Mrs Bimla Prasad is my biggest strength. May God give her a long and healthy life. pic.twitter.com/uTg1oAvRRn — Ravi Shankar Prasad (@rsprasad) 12 March 2018 గాంధీనగర్: గుజరాత్ నుంచి రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ యామీ యాజ్నిక్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన నామినేషన్‌కు అధిష్టానం నుంచి రెండు రోజుల క్రితమే గ్రీన్‌సిగ్నల్ రావడంతో నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్: కేంద్ర పెట్రోలియం, సహజ వనరులశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రథాన్ నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కలిసి సోమవారం నాడు భోపాల్‌లో నామినేషన్ పత్రాలను సమర్పించారు. మరో కొన్ని రోజుల్లో తన రాజ్యసభ పదవికాలం ముగియనుండడంతో మంత్రి మరోసారి రాజ్యసభకు ఎన్నికకానున్నారు. కాగా రాష్ట్రంలో బీజేపీకి స్పష్టమైన మేజారిటీ ఉండటంతో ఆయన ఎన్నిక నల్లేరు మీద నడకే. ముంబాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మహారాష్ట్ర సీనియర్ జర్నలిస్ట్ కుమార్ ఖేత్కర్ రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. జర్నలిజంలో విశేష అనుభవం కలిగిన కుమార్‌కు రాహుల్ గాంధీ అవకాశం కల్పించారు. ఖేత్కర్ మొదటి సారి చట్ట సభలో అడుగుపెట్టనున్నారు. -
‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: తక్షణ ట్రిపుల్ తలాక్‌ను చట్టవ్యతిరేకంగా గుర్తించి భర్తకు మూడేళ్ల జైలుశిక్ష విధించే ‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు’కు గురువారం లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ పలు పక్షాల ఎంపీల ఆందోళనల మధ్యే.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మహిళా హక్కులను కాపాడే దిశగా దేశ చరిత్రలో ఇదో గొప్ప రోజని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూనే.. విడాకులు పొందిన ముస్లిం మహిళలకు న్యాయం జరిగేలా మరిన్ని నిర్దిష్టమైన అంశాలను బిల్లులో చేర్చాలని పట్టుబట్టింది. బిల్లుపై వెంటనే ఓటింగ్ పెట్టకుండా స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అయితే ఇది ముస్లింల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటంతోపాటు, ముస్లిం మహిళలకు అన్యాయం చేసేలా ఉందంటూ మజ్లిస్ ఎంపీ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. అయితే.. బిల్లుపై చర్చ సందర్భంగా ఒవైసీ సహా పలువురు విపక్ష సభ్యులు సూచించిన సవరణలను తిరస్కరించిన అనంతరం లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు, ఏకాభిప్రాయ సాధనతోనే ఈ బిల్లును ఆమోదించుకోవాలని ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో సూచించారు. ఆందోళనలతో ఆరంభం గురువారం సభ ప్రారంభం కాగానే.. బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని స్పీకర్‌ను మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు. దీనికి అనుమతివ్వటంతోనే బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగించాయి. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా, ఇండియన్ ముస్లిం లీగ్, బీజేడీ, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ తదితర పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాయి. దీంతో గందరగోళం మధ్యే.. మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ‘మహిళా సాధికారత, మహిళల హక్కులను గౌరవించే దిశగా చరిత్రలో ఇది చాలా గొప్పరోజు’ అని ఆయన పేర్కొన్నారు. ఇది మతం, సమాజానికి సంబంధించిన విషయం కాదని.. కేవలం మహిళలను గౌరవిస్తూ వారికి న్యాయం చేసేదిగా మాత్రమే చూడాలని విపక్షాలను కోరారు. ఈ వ్యాఖ్యలపై ఒవైసీ సహా పలువురు విపక్ష సభ్యులు మండిపడ్డారు. ఈ బిల్లు ముస్లింల ప్రాథమిక హక్కులను కాలరాసేదిగా ఉందని విమర్శించారు. దీనికి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిస్తూ.. ‘మహిళల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతున్న సమయంలో పార్లమెంటు నిశ్శబ్దంగా ఉండొచ్చా?’ అని ప్రశ్నించారు. ఈ బిల్లు ఏ మతానికీ ఉద్దేశించినది కాదని.. దేశంలో మహిళలకు గౌరవం, భద్రత, న్యాయం కల్పిస్తామని చెప్పాల్సిన తరుణమొచ్చిందన్నారు. సుప్రీంకోర్టు కూడా ట్రిపుల్ తలాక్ అమానవీయమని.. సరైన చట్టం తీసుకురావటం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించొచ్చని సూచించిన విషయాన్నీ రవిశంకర్ ప్రసాద్ గుర్తుచేశారు. యూపీలోని రాంపూర్‌లో గురువారం ఉదయం కూడా ఓ మహిళ ఆలస్యంగా నిద్రలేవటంతో భర్త తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పిన విషయాన్ని సభలో మంత్రి ప్రస్తావించారు. భర్త జైలుకెళ్తే భార్యకు మెహర్ ఎవరిస్తారన్న విపక్షాల ప్రశ్నలకు రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. ‘ఈ కేసు విషయంలో ముస్లిం మహిళలు కోర్టుకెళ్లాల్సిన పనిలేదు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేయవచ్చు. అయితే ఈ కేసులో బెయిల్ ఇచ్చే విచక్షణ కోర్టుకే ఉంటుంది. భర్త సంపాదన ఆధారంగా జీవనభృతిని న్యాయమూర్తే నిర్ణయిస్తారు’ అని వెల్లడించారు. ముస్లిం షరియాలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని.. కేవలం తక్షణ ట్రిపుల్ తలాక్ (తలాక్–ఈ–బిద్దత్)పై మాత్రమే చర్చిస్తోందని ఆయన తెలిపారు. వ్యతిరేకించిన జాబితాలో అన్నాడీఎంకే! ఈ బిల్లు తీసుకురావాలనుకునే ఆలోచనే అర్థరహితమని బీజేడీ ఎంపీ భర్తృహరి మహతబ్ మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తే.. మెహర్ (భరణం) చెల్లించేదవరని ఆయన ప్రశ్నించారు. ఆర్జేడీ, మజ్లిస్, బీజేడీ, ఇండియన్ ముస్లిం లీగ్, అన్నాడీఎంకే పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ముందుగానే నోటీసులిచ్చాయి. కాంగ్రెస్, వామపక్షాలు నోటీసులివ్వకపోవటంతో వీరికి మాట్లాడే అవకాశాన్ని కల్పించలేదు. కాగా, కొంతకాలంగా ఈ బిల్లు ముసాయిదాను వ్యతిరేకించిన తృణమూల్ కాంగ్రెస్.. చర్చ జరుగుతున్నప్పడు మాత్రం మాట్లాడలేదు. కాంగ్రెస్‌కు ఓకే.. కానీ! స్వల్ప మార్పులతో బిల్లుకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. తలాక్ తర్వాత మహిళలు, వారి పిల్లల హక్కులను కాపాడేందుకు భరోసా కల్పించేలా బిల్లులో మార్పులు తీసుకురావాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిరోధించే ఏ చర్యకైనా కాంగ్రెస్ మద్దతుంటుందన్నారు. భర్త జైల్లో ఉంటే జీవన భృతి ఇవ్వటంపై స్పష్టత కల్పించాలన్నారు. ఈ బిల్లు ముస్లింల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటమేనని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర న్యాయ మంత్రి ఖుర్షీద్ విమర్శించారు. మిగిలిన మతాల్లో లేరా: ఒవైసీ ముస్లింల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే బిల్లును చట్టంగా చేసే హక్కు పార్లమెంటుకు లేదని ఒవైసీ విమర్శించారు. ‘ఈ బిల్లు ముస్లింల ప్రాథమిక హక్కులను హరించివేస్తుంది. ముస్లిం మహిళలకు అన్యాయం చేస్తుంది. బిల్లును రూపొందిస్తున్నప్పుడు ముస్లింలను సంప్రదించలేదనే విషయం స్పష్టమవుతోందని’ ఒవైసీ మండిపడ్డారు. నేరుగా మోదీపై విమర్శలు చేస్తూ.. ఇతర మతాల్లోని దాదాపు 20 లక్షల మంది మహిళలూ భర్తల వేధింపులకు గురవుతున్నారని వారి హక్కుల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. మధ్యవర్తిత్వం ద్వారా ట్రిపుల్ తలాక్‌ను పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పుడు ఈ బిల్లు తీసుకురావాల్సిన అవసరమేముందని పలు విపక్షాలు ప్రశ్నించాయి. ఈ బిల్లు ముస్లింల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని ముస్లిం లీగ్ ఎంపీ ఈటీ మహ్మద్ బషీర్ విమర్శించారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన బిల్లులా అర్థమవుతోందన్నారు. బిల్లుపై స్పందనలు.. బంగ్లాదేశ్, పాక్, మొరాకోసహా పలు ఇస్లామిక్ దేశాలు ఎప్పుడో ట్రిపుల్ తలాక్‌ను నియంత్రించా యి. భారత్ కూడా ఈ దిశగా అడుగులు వేయాలి. ఈ బిల్లును రాజకీయ కోణంలో కాకుండా సామాజిక అంశంగా చూడాలి. ముస్లిం మహిళలపై వేధింపులను చూస్తూ ఊరుకుందామా? మేం షరియాలో జోక్యం చేసుకోవాలనుకోవటం లేదు. – రవిశంకర్ ప్రసాద్, న్యాయశాఖ మంత్రి. జాతి ప్రయోజనాల కోసం ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి ఇవ్వాలి. హడావుడిగా కాకుండా విస్తృత చర్చల ద్వారా తుది నిర్ణయం తీసుకోవాలి. ముస్లిం మహిళలకు సాధికారత ఇవ్వటంలో బీజేపీకి ఇంత తొందరెందుకు? – మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ విపక్షనేత. ఈ బిల్లు ముస్లిం మహిళల జీవితాల్లో కొత్త ఆశలు, ఉత్సాహం నింపుతుంది. – బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ బిల్లును సవరించడానికి లేదా రద్దుచేయడానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకుసాగుతాం. – ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టంగా మారితే కోట్లాది ముస్లిం మహిళలకు రక్షణ కలుగుతుంది. – విదేశాంగ సహాయ మంత్రి అక్బర్ బిల్లులో ఏముంది.. ట్రిపుల్ తలాక్ చట్టంగా పేర్కొంటోన్న ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ )బిల్లులో పలు కఠిన నిబంధనల్ని పొందుపరిచారు. చట్టాన్ని అతిక్రమించి ముస్లిం పురుషుడు తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం భార్యకు ట్రిపుల్ తలాక్ చెపితే మూడేళ్ల జైలు శిక్షకు అవకాశం కల్పించారు. బిల్లు చట్టంగా మారితే కశ్మీర్ తప్ప దేశమంతటా అమల్లోకి వస్తుంది. ► రాతపూర్వకంగా లేక మొబైల్, ఈమెయిల్ వంటి ఎలక్ట్రానిక్ విధానంలో సహా ఏ రూపంలో చెప్పినా ట్రిపుల్ తలాక్ చెల్లదు. అలాగే చట్ట వ్యతిరేకం కూడా. ► బిల్లులో ట్రిపుల్ తలాక్‌ను కేసు పెట్టదగిన(కాగ్నిజబుల్), నాన్ బెయిలబుల్ నేరంగా పేర్కొన్నారు. భార్యకు తలాక్ చెప్పిన భర్తకు జరిమానాతో సహా గరిష్టంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. బాధిత మహిళ తన కోసం, పిల్లల కోసం భర్త నుంచి జీవన భృతిని కోరే హక్కును బిల్లులో కల్పించారు. కేసును విచారించే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జీవన భృతి మొత్తాన్ని నిర్ణయిస్తారు. ► మైనర్ పిల్లల్ని తన కస్టడీకి అప్పగించమని బాధిత మహిళ కోరే హక్కును బిల్లులో పొందుపరిచారు. పిల్లల కస్టడీపై మేజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారు. ► తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం ముస్లిం పురుషుడు చెప్పే ట్రిపుల్ తలాక్ లేక ఇతర రూపాల్లో చెప్పే తలాక్ పద్ధతుల్ని బిల్లులో తలాక్‌గా నిర్వచించారు. ముస్లిం వ్యక్తిగత చట్టాలకు అనుగుణంగా ట్రిపుల్ తలాక్‌ను ఆచరిస్తున్నారు. దాని ప్రకారం.. ముస్లిం పురుషుడు తన భార్యకు అప్పటికప్పుడు మూడు సార్లు తలాక్ చెపితే తక్షణం విడాకులు మంజూరవుతాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది ట్రిపుల్ తలాక్ ద్వారా అప్పటికప్పుడు ముస్లిం పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని ఈ ఏడాది ఆగస్టు 22న సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ట్రిపుల్ తలాక్ ఖురాన్‌కు వ్యతిరేకమనీ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనంలోని జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ నారిమన్, జస్టిస్ లలిత్‌లు ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించగా.. జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లు మాత్రం ట్రిపుల్ తలాక్‌ను షరియా చట్టాలు ఆమోదిస్తున్నందున.. అది మత స్వేచ్ఛను ప్రసాదిస్తున్న ఆర్టికల్ 25 కిందకు వస్తుందని పేర్కొన్నారు. చివరకు 3–2 తేడాతో ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీం తీర్పునిచ్చింది. ట్రిపుల్ తలాక్‌పై ఆర్నెల్ల నిషేధం విధించాలనీ, రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనబెట్టి చట్టం చేసేలా ఏకతాటిపైకి రావాలని సుప్రీం సూచించింది. ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు ‘ఆర్టికల్ 25 నుంచి తలాక్–ఎ–బిద్దత్ విడదీయరానిది. సున్నీల్లోని హనాఫీ ముస్లింలు 1,400 ఏళ్లుగా దీన్ని ఆచరిస్తున్నందున మతాచారంలో భాగమైంది. రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి తగినట్లుగా లేదని చెప్పి ట్రిపుల్ తలాక్‌ను కోర్టు తోసిపుచ్చలేదు’ అని అప్పటి సీజేఐ జస్టిస్ ఖేహర్ అభిప్రాయపడ్డారు. జస్టిస్ ఖేహర్ అభిప్రాయంతో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకీభవిస్తూ.. న్యాయస్థానం తీర్పు ద్వారా ట్రిపుల్ తలాక్‌ను తోసిపుచ్చలేరని... చట్టం ద్వారానే ఇది జరగాలన్నారు. ‘షరియా చట్టంలో ఉంటే అది ప్రాథమిక హక్కులకు అతీతంకాదు. ఇష్టారాజ్యంగా ముస్లిం పురుషుడు విడాకులు ఇవ్వడం ఏకపక్షం, అహేతుకం... దానికి ఆర్టికల్ 25 కింద రక్షణ లేదు’ అని జస్టిస్ నారిమన్ తీర్పు ఇవ్వగా జస్టిస్ లలిత్ ఏకీభవించారు. -
అందుకు కూడా ఎవరైనా విడాకులిస్తారా..?
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ విధానంలో మార్పులు తెచ్చే బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టే రోజు కూడా ఓ ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ముస్లిం వ్యక్తి తన భార్య ఆలస్యంగా నిద్ర లేస్తుందనే కారణంతో ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తలాక్ అని చెప్పేశాడు. దాంతో ఇప్పుడు ఆమె తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ జరుగుతుండగా ప్రస్తావించారు. ఆలస్యంగా నిద్ర లేచినందుకు కూడా విడాకులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాజా ట్రిపుల్ తలాక్ కేసుపై ఆయన చెప్పిన వివరాలు ఏమిటంటే.. ఖాసీం అనే వ్యక్తి ఓ ట్రక్కు డ్రైవర్. అతడు గుల్ అఫ్షాన్ అనే యువతి నాలుగేళ్ల కిందట ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. కానీ, రెండో రోజు నుంచే ఆమెను ప్రతి రోజు కొట్టడం ప్రారంభించాడు. పైగా ఆలస్యంగా నిద్ర లేస్తుందనే ఒకే కారణాన్ని చూపి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ నాలుగేళ్ల బంధానికి ట్రిపుల్ తలాక్‌తో స్వస్తి చెప్పాడు. దీంతో గుల్ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదు. పైగా ఖాసీం ఎక్కడికి వెళ్లాడో తెలియదు. తాజాగా ట్రిపుల్ తలాక్ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న విషయం తెలసిందే. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే తలాక్ చెప్పడం నేరం అవుతుంది. -
హైకోర్టు విభజనపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. విభజన చేస్తే ప్రస్తుత హైకోర్టు తెలంగాణకు చెందుతుందని తెలిపారు. ఏపీ హైకోర్టు ఆ రాష్ట్ర కొత్త రాజధానిలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేయడానికి నాలుగు భవనాలు సిద్ధంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారని తెలిపారు. అందులో ఏదో ఒకటి ఖరారు చేయాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారని వివరించారు. భవనాలు సిద్ధంగా ఉన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరపాలని, హైకోర్టును తాత్కాలికంగా మార్చగలం కానీ శాశ్వతంగా మార్చడానికి చాలా సమయం పడుతుందని వెల్లడించారు. అంతవరకు పరస్పరం ప్రేమాభిమానాలతో కలిసి ఉండాలని రెండు రాష్ట్రాలను కోరుతున్నానని విన్నవించారు. న్యాయమూర్తుల నియామకం, పదోన్నతులు తమ పరిధిలోని అంశం కాదని, నియామకలన్నీ కొలీజియమే చేస్తుందని పేర్కొన్నారు. పదోన్నతులు నిలిపివేయాలన్న విషయంపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేమని చెప్పారు. నాలుగు భవనాలను ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఏపీ ప్రభుత్వం కూడా ఈ దిశగా ముందుకు రావడం సంతోషం అయితే విభజన జరిగే వరకు న్యాయమూర్తుల పదోన్నతులు చేయవద్దని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్ రెడ్డి కేంద్రమంత్రికి విన్నవించారు. హైకోర్టు విభజన ఒక్కటే సమస్య కాదు. విభజన చట్టంలో అనేక పెండింగ్ అంశాలున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో పాటు రెవెన్యూ లోటు, ఇంకా చాలా అంశాలు పరిష్కరించాల్సి ఉన్నాయని మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాలని, ఆ సమావేశం ఏర్పాటు చేసేందుకు తాము రెడీగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. -
ఎన్నికల ఫలితాలపై నేతల రియాక్షన్
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై పలువురు కేంద్ర మంత్రులు, నేతలు స్పందించారు. గుజరాత్ ప్రజలు మరోసారి బీజేపీనే విశ్వసించారని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా వల్లే బీజేపీకి ఘన విజయం దక్కిందన్నారు. అభివృద్ధికే గుజరాత్ ప్రజలు పట్టం కట్టారని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. కుల రాజకీయాలు పని చేయలేదు పటీదార్ ఉద్యమనేతల ప్రభావం గుజరాత్ ఎన్నికలపై లేదని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కాంగ్రెస్ కుల రాజకీయాలు ఎన్నికల్లో పని చేయలేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధికే పెద్దపీట.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఇది సంతోషించదగ్గ పరిణామం అని, కార్యకర్తలు, ప్రజల విజయమని స్మృతి అభివర్ణించారు. రాహుల్ పోరాటం అద్భుతం ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోరాటం అద్భుతమని శివసేన ప్రశంసలు కురిపించింది. ఎన్నికల ప్రచారానికి ప్రధాని, ముఖ్యమంత్రులు దూరంగా ఉండేలా చట్టం తీసుకురావాలని ఆ పార్టీ అభిప్రాయపడింది. బీజేపీపై తీవ్ర ఆగ్రహం ఉంది అధికార భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. అయితే ఆ ప్రజాగ్రహాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకోలేక పోయిందని ఆయన అన్నారు. బీజేపీ నాయకత్వం, కార్యకర్తల కృషి వల్లే.. కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలను ప్రజలు తోసిపుచ్చారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బీజేపీ నాయకత్వం, కార్యకర్తల కృషి వల్లే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో తమ పార్టీ గెలిచిందన్నారు. -
ఆ మూడింటిది ఒకే కుటుంబం
న్యూఢిల్లీ: న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే కుటుంబానికి చెందినవనీ, అవి మూడు ఒకదానినొకటి బలోపేతం చేసుకునేలా పనిచేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ మూడు వ్యవస్థల మధ్య ఉండే సమన్వయమే రాజ్యాంగానికి వెన్నెముకని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఈ మూడు వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏ ఆధికారానికైనా ఓ హద్దు ఉంటుందంటూ నాడు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను మోదీ గుర్తుచేశారు. పాలనలో న్యాయవ్యవస్థ పాత్రపై న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరగడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మారిన కాలానికి అనుగుణంగా ఎలా ముందుకెళ్లాలనేదానిపై మూడు వ్యవస్థలూ లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు వ్యవస్థలూ మీది తప్పంటే మీది తప్పంటూ పరస్పరం విమర్శించుకోవాల్సిన అవసరం లేదనీ, ఏదేనీ ఒక వ్యవస్థలోని లోపాలు, బలాబలాలు...మిగతా రెండు వ్యవస్థల్లోని వారికీ తెలుసని అన్నారు. జాతీయ న్యాయదినోత్సవం సందర్భంగా రెండు రోజులపాటు సుప్రీంకోర్టు, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ముగింపు ప్రసంగం చేశారు. పౌరులు హక్కుల కోసం పోరాడటంతోపాటు బాధ్యతలను కూడా విస్మరించరాదని హితవు పలికారు. మోదీ కన్నా ముందు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అధికారాల విభజనపై న్యాయవ్యవస్థను ఉద్దేశించి మాట్లాడారు. ‘అధికార విభజన సిద్ధాంతానికి కార్యనిర్వాహక వ్యవస్థ ఎలా కట్టుబడి ఉంటుందో, న్యాయవ్యవస్థ కూడా అలానే ఉండాలి. చట్టాల రూపకల్పన అంశాన్ని ఎన్నికైన ప్రభుత్వాలకే వదిలేయాలి. పరిపాలన అనేది ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వమే చేయాలనీ, వారే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జాతి నిర్మాతలు స్పష్టంగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు స్వతంత్రత ఎంతో ముఖ్యమైనదే. కానీ న్యాయవ్యవస్థలో జవాబుదారీ తనం, నిజాయితీ కూడా ముఖ్యమైనవే. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని ప్రభుత్వం ఆమోదిస్తుంది. అయితే న్యాయమూర్తుల నియామకాలను పరిశీలించాలన్న సలహా కూడా అభినందించదగ్గదే’ అని రవిశంకర్ అన్నారు. న్యాయ గడియారాల ఏర్పాటు: మోదీ కోర్టులు కేసులను పరిష్కరిస్తున్న వేగాన్ని బట్టి వాటికి ర్యాంకులిచ్చేలా దేశంలోని వివిధ కోర్టుల పరిసరాల్లో ‘న్యాయ గడియారాల’ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మోదీ సూచించారు. దీనివల్ల కేసులను త్వరితగతిన పరిష్కరించడంలో న్యాయమూర్తుల మధ్య పోటీ కూడా ఏర్పడుతుందనీ, తద్వారా కేసుల సంఖ్య తగ్గుతుందని మోదీ పేర్కొన్నారు. మరొకరు తలదూర్చకూడదు... రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు నిర్వహించిన మరో కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు వాటి స్వేచ్ఛ పరిధి గురించి అప్రమత్తతతో ఉండాలనీ, ఆయా వ్యవస్థల స్వతంత్రతను కాపాడుకోవడానికి అవి పాటుపడాలని అన్నారు. ఈ మూడు వ్యవస్థల మధ్య అధికారాల విభజనను గుర్తెరిగి నడచుకోవాలనీ, ఒకరి విధుల్లో మరొకరు తలదూర్చకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రాజ్యాంగం అంటే కాగితాలు కాదనీ, ప్రాణమున్న పత్రమని కోవింద్ పేర్కొన్నారు. విధానాలను తనిఖీ చేసే అధికారం మాకుంది: సీజేఐ రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యలపై సీజేఐ జస్టిస్ మిశ్రా స్పందిస్తూ ‘మూడు వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం ఉండాలి. ఈ మూడింటిలో మాకున్న అధికారాలే గొప్పవంటూ ఏ వ్యవస్థా చెప్పుకోవడానికి లేదు. మేం ఏ విధానాలనూ తీసుకురావడం లేదు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను తనిఖీ చేసే, అవి అమలయ్యేలా చూసే అధికారం మాకు ఉంది. రాజ్యాంగమే పరిపాలనాధిపతి అని సుప్రీంకోర్టులో మేం విశ్వసిస్తాం. పాటిస్తాం. చట్టాలకు లోబడి ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని సరిచూసేందుకు అవసరమైన అధికారాలిస్తూ, రాజ్యాంగానికి తుది రక్షణదారుగా న్యాయవ్యవస్థను రాజ్యాంగమే నిలిపింది’ అని మిశ్రా పేర్కొన్నారు. పాలనాపరమైన విధానాలు తీసుకురావడానికి ప్రజాహిత వ్యాజ్యాలను దుర్వినియోగం చేస్తున్నారన్న వ్యాఖ్యలను జస్టిస్ మిశ్రా తిరస్కరించారు. పౌరుల ప్రాథమిక హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. -
చర్చలతోనే అన్ని సమస్యలకు పరిష్కారం
లక్నో: ఎలాంటి సమస్యలనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. రామ జన్మభూమి వివాద పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆయన శుక్రవారం అయోధ్యలో పలువురు ముస్లిం మతపెద్దలతో సమావేశమయ్యారు. ఫారంగి మహల్ ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా రెక్టర్, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డులో సీనియర్ సభ్యుడైన మౌలాని ఖాలిద్ రషీద్ ఫారంగిమహలి రవిశంకర్‌ను కలుసుకున్న వారిలో ఉన్నారు. ఈ వివాద పరిష్కారం ఇప్పటికే ఆలస్యమైందని, త్వరలోనే దీనికి ముగింపు పలకాలని కోరుకుంటున్నట్లు రవిశంకర్ తెలిపారు. -
కశ్మీర్ బాధిత కుటుంబాలతో రవిశంకర్ భేటీ
బెంగళూరు: కశ్మీర్ గొడవల్లో చనిపోయిన జవాన్లు, స్థానికులు, ఉగ్రవాదుల కుటుంబాలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ శుక్రవారం ఒక్కచోటుకు చేర్చారు. పైగామ్–ఎ–మొహబ్బత్ (ప్రేమ సందేశం) పేరుతో ఆయన బెంగళూరులో ఓ కార్యక్రమం నిర్వహించారు. చనిపోయిన వారి కుటుంబాలకు సాంత్వన కలిగించేందుకు, వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి దాదాపు 200 బాధిత కుటుంబాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ప్రియమైన వారిని పోగొట్టుకున్న వీరి హృదయాలు బాధను అనుభవిస్తుంటాయనీ, ఓదార్చి గాయాలను మాన్పకపోతే వీరూ హింసా మార్గంలో వెళ్లే వీలుందని రవిశంకర్ అన్నారు. -
‘95 మొబైల్ కంపెనీలను తీసుకొచ్చాం’
సాక్షి, న్యూఢిల్లీ : తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 95 మొబైల్ తయారీ కంపెనీలు దేశంలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేశాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీకి భారత్ హబ్‌గా మారుతున్నదని అన్నారు. భారత్‌కు వచ్చిన మొబైల్ తయారీ ప్లాంట్ల్లో 32 ప్లాంట్లు నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలో ఏర్పాటయ్యాయని తెలిపారు. సిలికాన్‌వ్యాలీలో జరిగే ఐటీ నూతన ఆవిష్కరణల్లో 14 శాతం భారత్‌కు చెందిన వారి మేథోశక్తి ఫలితమేనని అన్నారు. ఐఐటీల్లో చదివి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉద్యోగాలను వదిలి దేశానికి తిరిగివస్తున్నారని, వారు స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారని మంత్రి తెలిపారు.న్యాయ ప్రక్రియ వేగవంతానికి డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్న సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. -
పరిపాలనను ప్రభుత్వాలకు వదిలేయండి
న్యూఢిల్లీ: పరిపాలన, చట్టాల రూపకల్పన వంటి విషయాలను న్యాయ వ్యవస్థ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు వదిలివేయాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సూచించారు. ‘ఈ మధ్యకాలంలో పరిపాలనా సంబంధమైన విషయాల్లో న్యాయస్థానాల జోక్యం పెరిగిపోవడాన్ని మనం చూస్తున్నాం. పరిపాలనను ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు వదిలివేయాలి’ అని ప్రసాద్ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) నిర్వహించిన సెమినార్లో కమిషన్ చైర్మన్, సుప్రీం మాజీ సీజేఐ జస్టిస్ హెచ్ఎల్ దత్తుతో కలిసి ప్రసాద్ పాల్గొన్నారు. -
ధోనీ భార్య.. కేంద్ర మంత్రి.. ఓ ఆధార్ వివాదం!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన ఆధార్ సమాచారాన్ని అప్డేట్ చేసుకున్నాడు. ఇందుకోసం ఆయన సీఎస్సీ (కామన్ సర్వీసెస్ సెంటర్) వాళ్ల సేవలు వినియోగించుకున్నాడు. ఆ విభాగం వాళ్లు దాన్ని ఫొటో తీసుకుని ప్రచారం చేసుకున్నారు. అంతవరకు అంతా బాగానే ఉంది. కానీ, ధోనీ ఫొటోతో పాటు.. ఆయన దరఖాస్తు ఫొటో్ కూడా వాళ్లు ట్వీట్ చేయడంతో ధోనీ భార్య సాక్షి సింగ్‌కు ఎక్కడలేని కోపం వచ్చింది. తమ వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని బహిరంగపరిచే హక్కు ఎవరిచ్చారంటూ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేశారు. దానికి ప్రసాద్ కూడా వెంటనే స్పందించారు. మంత్రిగారు కూడా ధోనీ తన ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకుంటున్న ఫొటోను ట్వీట్ చేశారు. దాంతో సాక్షిసింగ్ రావత్ ఆయన్ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. దానికి మంత్రి వెంటనే స్పందించారు. తాను పెట్టిన ఫొటోలో వ్యక్తిగత సమాచారం ఏముందని ప్రశ్నించారు. అప్పుడు.. సీఎస్సీ ఈగవర్నెన్స్ వాళ్లు చేసిన ట్వీట్లో ధోనీ దరఖాస్తు ఉన్న విషయాన్ని స్క్రీన్ షాట్ తీసి మరీ సాక్షి సింగ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంలో రవిశంకర్ ప్రసాద్, సాక్షి సింగ్‌ల మధ్య వరుసపెట్టి ట్వీట్ల జోరు కొనసాగింది. వెంటనే ఆ విషయాన్ని గమనించిన మంత్రి.. ఆ శాఖ చేసిన తప్పును గ్రహించి, తగిన చర్యలు తీసుకుంటామని సాక్షి సింగ్‌కు హామీ ఇచ్చారు. విషయాన్ని తన దృష్టికి తెచ్చినందుకు థాంక్స్ చెప్పారు. వ్యక్తిగత సమాచారాన్ని బయట పెట్టడం నేరమని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. దాంతో ఆమె కూడా శాంతించి, తగిన సమాధానం ఇచ్చినందుకు మంత్రిగారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం తెలియగానే సీఎస్సీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ధోనీ అప్లికేషన్ కనిపించే ఫొటోను డిలీట్ చేసేశారు. VLE of @CSCegov_ delivers #Aadhaar service to @msdhoni. Legendary cricketer's #Digital hook (shot). pic.twitter.com/Xe62Ta63An — Ravi Shankar Prasad (@rsprasad) 28 March 2017 @rsprasad @CSCegov_ is there any privacy left ??? Information of adhaar card including application is made public property!#disappointed — Sakshi Singh -
కోటి దాటిన ‘డిజిధన్ అభియాన్’ శిక్షణదారులు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంచే కార్యక్రమం ‘డిజిధన్ అభియాన్’లో కేవలం 20 రోజుల్లోనే సుమారు కోటికి పైగా గ్రామీణులు చేరారని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం తెలిపారు. ‘డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతపై ఉమ్మడి సేవా కేంద్రాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో 80 లక్షల మంది ప్రజలు, 25 లక్షల మంది వ్యాపారులకు చేరువకావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దాన్ని అదిగమించి 20 రోజుల్లోనే 1.05 కోట్ల ప్రజలకు శిక్షణ అందించామ’ని చెప్పారు. 476 జిల్లాలు, 2782 బ్లాకుల్లో ఈ కార్యక్రమం అమలవుతున్నట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 15 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో నమోదుచేసుకున్నారు. 12.5 లక్షల మందితో ఛత్తీస్‌గఢ్ తరువాతి స్థానంలో నిలిచింది. పెద్దనోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. నవంబర్ 8–డిసెంబర్ 26 మధ్య కాలంలో రూపే కార్డు లావాదేవీలు 445 శాతం వృద్ధి చెందాయి. పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) చెల్లింపుల పరిమాణం 95 శాతం ఎగబాకింది. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 3 లక్షల మంది వ్యాపారులు డిజిటల్ రూపంలో చెల్లింపులు స్వీకరించడం ప్రారంభించారు. డిజిటల్ వ్యవస్థను పటిష్టపరచడానికి సమాచార సాంకేతికత(ఐటీ) చట్టాన్ని బలోపేతం చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని ప్రసాద్ పేర్కొన్నారు. -
చీఫ్ జస్టిస్ వర్సెస్ సెంటర్
జడ్జీల నియామకం విషయంలో న్యాయవ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హైకోర్టులలో 500 వరకు జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని ప్రభుత్వం భర్తీ చేయడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మండిపడ్డారు. ఈపాటికి పనిచేస్తూ ఉండాల్సిన 500 మంది జడ్జీలు పనిచేయడం లేదన్నారు. అసలు నియామకాలే జరగలేదని తాను అనట్లేదని.. ఇప్పటికి 121 మందిని నియమించారని ఆయన అన్నారు. అయితే ఇప్పటికీ భారీసంఖ్యలో ప్రతిపాదనలు పెండింగులోనే ఉన్నాయని, ప్రభుత్వం వాటిని కూడా పట్టించుకుంటుందనే భావిస్తున్నానని చెప్పారు. అడ్వాన్స్ రూలింగ్ చైర్మన్ లేరని, సాయుధ దళాల అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ పదవి ఖాళీగా ఉందని, కాంపిటీషన్ కమిషన్‌కు కూడా చైర్మన్ లేరని అన్నారు. కొంతమంది ఈ పదవులు చేపట్టడానికి నిరాకరిస్తున్న మాట వాస్తవమేనని.. ఎందుకంటే ప్రభుత్వం చైర్మన్లు కూర్చోడానికి గౌరవప్రదమైన స్థానం కూడా కల్పించలేకపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను గతంలో ప్రభుత్వానికి ఈ అంశంపై లేఖ రాశానని.. నిబంధనలు మార్చాలని లేదా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కూడా ఇలాంటి నియామకాలకు అర్హులుగా చేయాలని చెప్పానన్నారు. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి ట్రిబ్యునళ్లకు అధ్యక్షత వహించేందుకు సుప్రీంకోర్టు జడ్జి ఒక్కరూ అందుబాటులో లేకపోవచ్చని ఆయన చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. చీఫ్ జస్టిస్ అంటే తమకు చాలా గౌరవం ఉందని, కానీ జడ్జీల నియామకంలో మాత్రం ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించలేమని ఆయన అన్నారు. ఈ ఏడాదే తాము 120 మంది హైకోర్టు జడ్జీలను నియమించామని చెప్పారు. -
జడ్జీల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా?
జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయన్న అనుమానాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తం చేశారు. అయితే ఆయన ఆరోపణలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెంటనే ఖండించారు. ''ఫోన్లో మాట్లాడొద్దు, అవి ట్యాప్ అవుతున్నాయి'' అంటూ ఇద్దరు జడ్జీలు మాట్లాడుకోవడం తాను విన్నానని, ఇలా జడ్జీల ఫోన్లను ట్యాప్ చేయడం సరికాదని కేజ్రీవాల్ చెప్పారు. అది నిజమో కాదో తనకు తెలియదు గానీ.. ఒకవేళ నిజమైతే మాత్రం చాలా ప్రమాదకరమైన పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా జరిగితే అసలు న్యాయవ్యవస్థకు స్వాతంత్ర్యం ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఎవరైనా జడ్జి ఏదైనా తప్పు చేసినా, అప్పుడు కూడా వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయకూడదని.. సాక్ష్యాలు సేకరించడానికి ఇంకా చాలా రకాల మార్గలున్నాయని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో ఇప్పటివరకు జడ్జీల ఫోన్లను అసలు ట్యాప్ చేయలేదన్న విషయాన్ని తాను కచ్చితంగా చెప్పగలనని ఆయన అన్నారు. -
ఇంటి వద్దకే పోస్టల్ ఏటీఎంలు: రవిశంకర్ ప్రసాద్
కాకినాడ: కోర్ బ్యాంకింగ్ ను వచ్చే ఏడాది నుంచి అన్ని తపాలా కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. వికాస్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పోస్టల్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు లక్షా ముఫ్పై మూడు వేల హ్యండ్ ఏటీఎంలను పోస్ట్ మ్యాన్ లకు అందజేయనున్నట్లు వివరించారు. దీంతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం మరింత సులుభతరం అవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 900 పోస్టల్ ఏటీఎంలను ప్రారంభించామని చెప్పారు. ఈ-కామర్స్ బూమ్ ద్వారా తపాలా శాఖ 80 శాతం ఆదాయాన్ని పెంచుకుందన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో రానున్న మూడేళ్లలో సుమారు 50 లక్షల మందికి ఉపాధి చేకూరుతుందని చెప్పారు. -
కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పిరికిపంద, సైకో అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా సీఎంవో కార్యాలయంపై సీబీఐ దాడుల ఘటనకు సంబంధించి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సీబీఐ దాడులకు ముఖ్యమంత్రి అనుమతి అవసరం లేదన్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని కేజ్రీవాల్ సమర్థించడం సరికాదన్నారు. అవినీతి ఆరోపణలు ఉంటేనే సీబీఐ దాడులు చేస్తుందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ దాడులు చేయలేదని, తప్పుడు విమర్శలు చేస్తున్న కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు. మరోవైపు కేజ్రీవాల్ కార్యాలయంలో దాడులు జరిపినట్లు వచ్చిన వార్తలను సీబీఐ ఖండించింది. దాడులు జరపినట్లు వచ్చిన వార్తలు నిరాధారమైనవంటూ సీబీఐ అధికారులు కొట్టిపారేశారు. -
ఐటీఐఆర్‌కు మరిన్ని నిధులివ్వండి
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఐటీఐఆర్‌కు ఈ ఏడాది కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని, మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. శనివారం సచివాలయంలో కేసీఆర్‌ను రవిశంకర్ ప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా.. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక తపాలా సర్కిల్‌ను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. ప్రత్యేక సర్కిల్‌తోపాటు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పోస్టుకు కూడా అనుమతినిచ్చినట్లు ఆయన వెల్లడించారు. కాగా.. కేంద్రం ప్రకటించిన ‘సాంకేతిక, సమాచార పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్)’ కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాంతాలను గుర్తించిందని.. విద్య, వైద్య సంబంధిత మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇక్కడున్న పలు సాఫ్ట్వేర్ కంపెనీలు కోరుతున్నాయని సీఎం కేసీఆర్ రవిశంకర్‌ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఐటీఐఆర్‌కు మొదటి దశ కింద ఈ ఏడాది కేంద్రం కేటాయించిన రూ. 165 కోట్లు ఏమాత్రం సరిపోవని... మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ ప్రపంచంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపునిచ్చిందని కూడా కేంద్ర మంత్రికి వివరించారు. దీనిపై రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ... జాతీయంగా, అంతర్జాతీయంగా హైదరాబాద్ ఐటీ హబ్‌గా, మేధావుల కేంద్రంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఐటీ ఐఆర్‌కు సంబంధించి కేంద్రం నుంచి నిధులు రావాలంటే.. అందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని ముఖ్యమంత్రికి సూచించారు. భారీ పెట్టుబడులు వస్తాయి.. ఐటీఐఆర్ ప్రాంతంలో సాంకేతిక సమాచారం, ఐటీ సంబంధిత సర్వీసులు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ వివరించారు. హైదరాబాద్ చుట్టూ 202 చదరపు కిలోమీటర్ల పరిధి (49,913 ఎకరాలు)లో దీనిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఐటీఐఆర్ పరిధిలో మొత్తం రూ. 2,19,440 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందులో ఒక్క ఐటీ, ఐటీ ఈఎస్ విభాగాల్లోనే రూ. 1,18,355 కోట్లు, ఈహెచ్ఎమ్ సెక్టార్లో రూ. 1,01,085 కోట్ల పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఐటీఐఆర్‌లో మౌలిక సదుపాయాల కోసం కేంద్రం మొత్తంగా రూ. 4,863 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిందని... మొదటి దశలో రూ. 942 కోట్లు, రెండో దశలో రూ. 3,921 కోట్లు ఇస్తామని తెలిపిందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పారిశ్రామిక విధానం గురించి వివరించారు. పారిశ్రామిక విధాన ప్రతిని కేంద్ర మంత్రికి అందించారు. కాగా ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై కేంద్ర మంత్రి అభినందించారు. ఐటీకి సంబంధించి ఎలాంటి సాయం కావాలన్నా.. సహకరించడానికి సిద్ధమని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భవిష్యత్‌లో ఐటీ, బయోటెక్నాలజీ కేంద్రాలుగా పేరు తెచ్చుకుంటాయని కేంద్ర టెలీకమ్యూనికేషన్స్,ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన ఏపీ, తెలంగాణ సీఎంలను కలసిన అనంతరం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్లో విభజన పనులు పూర్తిచేసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదించిందన్నారు. అలాగే, చిత్తూరు, కాకినాడ, తెలంగాణలోని మహేశ్వరం, మెదక్‌లలో ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు తట్టుకోవడం లేదన్నారు. అందుకే ఎన్డీయే కూటమిని బలహీనపరిచేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు బద్దం బాల్‌రెడ్డి, ప్రేమ్‌సింగ్ రాథోడ్, మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి, దళిత్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు. -
కిరాణాకొట్లతో అమెజాన్ సరుకుల రవాణా!
అమెజాన్ డాట్ ఇన్.. ప్రస్తుతం భారతదేశంలో శరవేగంగా దూసుకెళ్తున్న ఈ కామర్స్ సైట్. స్థానికంగా ఉండే కిరాణా కొట్లను కూడా తన నెట్‌వర్క్‌లో చేర్చుకోవాలని ఇప్పుడు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. తమ వ్యాపారంలో కిరాణాకొట్లను కూడా చేర్చాలనుకుంటున్నట్లు అమెజాన్ తనకు తెలిపిందని, తమ సరుకులను కిరాణాకొట్ల ద్వారా రవాణా చేస్తామని, దానివల్ల ఆయా కొట్లకు ఎక్కువ మంది వచ్చి, వాళ్ల వ్యాపారం కూడా పెరుగుతుందని అమెజాన్ ప్రతినిధులు వివరించినట్లు మంత్రి చెప్పారు. అమెజాన్ ఇండియా ఎండీ అమిత్ అగర్వాల్ తదితరులు రవిశంకర్ ప్రసాద్‌ను మంగళవారం కలిశారు. భారతదేశంలో తమ డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అమెజాన్ ప్రతినిధులు ఆయనకు చెప్పారు. ఆ నిర్ణయాన్ని తాము సాదరంగా స్వాగతిస్తామన్నారు. -
నిత్యావసర వస్తువుల చట్టం కిందకు ఉల్లి, బంగాళదుంపలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉల్లి ,బంగాళ దుంపలను నిత్యావసర వస్తువుల చట్టం కిందకు తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలియజేశారు. ఉల్లి,బంగాళ దుంపలను అక్రమంగా నిల్వఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. 50 లక్షల టన్నుల బియ్యాన్ని దారిద్ర్య రేఖకు దిగువ,ఎగువ కుటుంబాలకు పంపిణి చేస్తామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. -
ఆనంద్ రీజెన్సీ అధినేత మృతిపై సీబీఐ విచారణ!
యానాం : ఆనంద్ రీజెన్సీ గ్రూప్ సంస్థలు, ఆనంద్ సినీ సర్వీసెస్ అధినేత ఎం.రవిశంకర్ ప్రసాద్ మరణంపై చెన్నైకు చెందిన సీబీఐ అధికారుల బృందం విచారణ చేపట్టినట్లు సమాచారం. సీబీఐ అధికారులు విచారణ నిమిత్తం యానాం వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలై 7వ తేదీన రవిశంకర్ ప్రసాద్ స్థానిక బైపాస్ రోడ్లో ఉన్న ఆనంద్ రీజెన్సీ హోటల్‌కు వచ్చి, రాత్రి అక్కడ బస చేశారు. మరుసటి రోజు వేకువజామున యానాం-ఎదుర్లంక వారధిపై గొడుగును పట్టుకుని మార్నింగ్ వాక్కు వెళ్లినట్లు టోల్‌గేట్‌లోని సీసీ కెమెరా పుటేజిలో ఉంది. అప్పుడు అదృశ్యమైన రవిశంకర్ ప్రసాద్ జూలై 13న ఐ.పోలవరం మండలం గుత్తినదీవి శివారు గోగుల్లంక సమీపంలోని రేవులో విగతజీవిగా కనిపించారు. దీనిపై ఐ.పోలవరం పోలీసు స్టేషన్లో అనుమానాస్పద మృతి కేసు నమోదు అయ్యింది. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఆదేశాల మేరకు చెన్నైకు చెందిన సీబీఐ అధికారులు ఈ కేసు విచారణ చేపట్టినట్లు సమాచారం. రవిశంకర్ ప్రసాద్ మరణానికి కారణాలపై విచారణ జరుపుతున్నారు. -
విదేశాల్లో నల్లధనంపై సిట్
-
'విదేశాల్లోనల్లధనంపై సిట్ ను ఏర్పాటు చేస్తున్నాం'
ఢిల్లీ: విదేశాల్లో నల్లధనాన్ని తీసుకురావడంపై తొలి కేబినెట్ లో చర్చించామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంగళవారం నరేంద్ర మోడీ కేబినెట్ కొలువుదీరిన తరువాత జరిగిన మంత్రుల తొలి సమావేశం రెండు గంటలకు పైగా సాగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన రవిశంక్ ప్రసాద్.. విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకురావడంపై ప్రధానంగా చర్చించామన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి వైస్ చైర్మన్ గా జస్టిస్ అర్జిత్ పసాయత్ ఉంటారన్నారు. ఇందులో రెవిన్యూ ఇంటెలిజెన్స్ సెక్రటరీ, రిజర్వ్‌బ్యాంకు డిప్యూటీ గవర్నర్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, సీబీఐ డైరెక్టర్, ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారన్నారు. అత్యున్నత వ్యక్తులను సిట్‌లో సభ్యులుగా నియమించామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా, పోలవరం ముంపు గ్రామాలపై ఇంకా ఎలాంటి చర్చా జరగలేదని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. -
'మోడీ ప్రత్యర్థులకు డిపాజిట్లు రావు'
వారణాసి: ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ దీమా వ్యక్తం చేశారు. మోడీకి లక్షల సంఖ్యలో మెజారిటీ వస్తుందన్నారు. మిగతా అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. కాశీలో రాహుల్ గాంధీ నేడు నిర్వహించిన రోడ్ షోకు స్పందన అంతంత మాత్రంగానే ఉందని మరో బీజేపీ నేత షాహనాజ్ హుస్సేన్ ఎద్దవా చేశారు. రోడ్ షోకు వచ్చిన వారిలో ఏ మాత్రం ఉత్సాహం లేదన్నారు. నరేంద్ర మోడీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయానికి వచ్చేశారని చెప్పారు.