న్యూఢిల్లీ: తక్షణ ట్రిపుల్ తలాక్‌ను చట్టవ్యతిరేకంగా గుర్తించి భర్తకు మూడేళ్ల జైలుశిక్ష విధించే ‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు’కు గురువారం లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ పలు పక్షాల ఎంపీల ఆందోళనల మధ్యే.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మహిళా హక్కులను కాపాడే దిశగా దేశ చరిత్రలో ఇదో గొప్ప రోజని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూనే.. విడాకులు పొందిన ముస్లిం మహిళలకు న్యాయం జరిగేలా మరిన్ని నిర్దిష్టమైన అంశాలను బిల్లులో చేర్చాలని పట్టుబట్టింది.
బిల్లుపై వెంటనే ఓటింగ్ పెట్టకుండా స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అయితే ఇది ముస్లింల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటంతోపాటు, ముస్లిం మహిళలకు అన్యాయం చేసేలా ఉందంటూ మజ్లిస్ ఎంపీ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. అయితే.. బిల్లుపై చర్చ సందర్భంగా ఒవైసీ సహా పలువురు విపక్ష సభ్యులు సూచించిన సవరణలను తిరస్కరించిన అనంతరం లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు, ఏకాభిప్రాయ సాధనతోనే ఈ బిల్లును ఆమోదించుకోవాలని ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో సూచించారు.
ఆందోళనలతో ఆరంభం
గురువారం సభ ప్రారంభం కాగానే.. బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని స్పీకర్‌ను మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు. దీనికి అనుమతివ్వటంతోనే బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగించాయి. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా, ఇండియన్ ముస్లిం లీగ్, బీజేడీ, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ తదితర పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాయి. దీంతో గందరగోళం మధ్యే.. మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
‘మహిళా సాధికారత, మహిళల హక్కులను గౌరవించే దిశగా చరిత్రలో ఇది చాలా గొప్పరోజు’ అని ఆయన పేర్కొన్నారు. ఇది మతం, సమాజానికి సంబంధించిన విషయం కాదని.. కేవలం మహిళలను గౌరవిస్తూ వారికి న్యాయం చేసేదిగా మాత్రమే చూడాలని విపక్షాలను కోరారు. ఈ వ్యాఖ్యలపై ఒవైసీ సహా పలువురు విపక్ష సభ్యులు మండిపడ్డారు. ఈ బిల్లు ముస్లింల ప్రాథమిక హక్కులను కాలరాసేదిగా ఉందని విమర్శించారు. దీనికి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిస్తూ.. ‘మహిళల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతున్న సమయంలో పార్లమెంటు నిశ్శబ్దంగా ఉండొచ్చా?’ అని ప్రశ్నించారు.
ఈ బిల్లు ఏ మతానికీ ఉద్దేశించినది కాదని.. దేశంలో మహిళలకు గౌరవం, భద్రత, న్యాయం కల్పిస్తామని చెప్పాల్సిన తరుణమొచ్చిందన్నారు. సుప్రీంకోర్టు కూడా ట్రిపుల్ తలాక్ అమానవీయమని.. సరైన చట్టం తీసుకురావటం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించొచ్చని సూచించిన విషయాన్నీ రవిశంకర్ ప్రసాద్ గుర్తుచేశారు. యూపీలోని రాంపూర్‌లో గురువారం ఉదయం కూడా ఓ మహిళ ఆలస్యంగా నిద్రలేవటంతో భర్త తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పిన విషయాన్ని సభలో మంత్రి ప్రస్తావించారు.
భర్త జైలుకెళ్తే భార్యకు మెహర్ ఎవరిస్తారన్న విపక్షాల ప్రశ్నలకు రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. ‘ఈ కేసు విషయంలో ముస్లిం మహిళలు కోర్టుకెళ్లాల్సిన పనిలేదు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేయవచ్చు. అయితే ఈ కేసులో బెయిల్ ఇచ్చే విచక్షణ కోర్టుకే ఉంటుంది. భర్త సంపాదన ఆధారంగా జీవనభృతిని న్యాయమూర్తే నిర్ణయిస్తారు’ అని వెల్లడించారు. ముస్లిం షరియాలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని.. కేవలం తక్షణ ట్రిపుల్ తలాక్ (తలాక్–ఈ–బిద్దత్)పై మాత్రమే చర్చిస్తోందని ఆయన తెలిపారు.
వ్యతిరేకించిన జాబితాలో అన్నాడీఎంకే!
ఈ బిల్లు తీసుకురావాలనుకునే ఆలోచనే అర్థరహితమని బీజేడీ ఎంపీ భర్తృహరి మహతబ్ మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తే.. మెహర్ (భరణం) చెల్లించేదవరని ఆయన ప్రశ్నించారు. ఆర్జేడీ, మజ్లిస్, బీజేడీ, ఇండియన్ ముస్లిం లీగ్, అన్నాడీఎంకే పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ముందుగానే నోటీసులిచ్చాయి. కాంగ్రెస్, వామపక్షాలు నోటీసులివ్వకపోవటంతో వీరికి మాట్లాడే అవకాశాన్ని కల్పించలేదు. కాగా, కొంతకాలంగా ఈ బిల్లు ముసాయిదాను వ్యతిరేకించిన తృణమూల్ కాంగ్రెస్.. చర్చ జరుగుతున్నప్పడు మాత్రం మాట్లాడలేదు.
కాంగ్రెస్‌కు ఓకే.. కానీ!
స్వల్ప మార్పులతో బిల్లుకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. తలాక్ తర్వాత మహిళలు, వారి పిల్లల హక్కులను కాపాడేందుకు భరోసా కల్పించేలా బిల్లులో మార్పులు తీసుకురావాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిరోధించే ఏ చర్యకైనా కాంగ్రెస్ మద్దతుంటుందన్నారు. భర్త జైల్లో ఉంటే జీవన భృతి ఇవ్వటంపై స్పష్టత కల్పించాలన్నారు. ఈ బిల్లు ముస్లింల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటమేనని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర న్యాయ మంత్రి ఖుర్షీద్ విమర్శించారు.
మిగిలిన మతాల్లో లేరా: ఒవైసీ
ముస్లింల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే బిల్లును చట్టంగా చేసే హక్కు పార్లమెంటుకు లేదని ఒవైసీ విమర్శించారు. ‘ఈ బిల్లు ముస్లింల ప్రాథమిక హక్కులను హరించివేస్తుంది. ముస్లిం మహిళలకు అన్యాయం చేస్తుంది. బిల్లును రూపొందిస్తున్నప్పుడు ముస్లింలను సంప్రదించలేదనే విషయం స్పష్టమవుతోందని’ ఒవైసీ మండిపడ్డారు. నేరుగా మోదీపై విమర్శలు చేస్తూ.. ఇతర మతాల్లోని దాదాపు 20 లక్షల మంది మహిళలూ భర్తల వేధింపులకు గురవుతున్నారని వారి హక్కుల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. మధ్యవర్తిత్వం ద్వారా ట్రిపుల్ తలాక్‌ను పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పుడు ఈ బిల్లు తీసుకురావాల్సిన అవసరమేముందని పలు విపక్షాలు ప్రశ్నించాయి. ఈ బిల్లు ముస్లింల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని ముస్లిం లీగ్ ఎంపీ ఈటీ మహ్మద్ బషీర్ విమర్శించారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన బిల్లులా అర్థమవుతోందన్నారు.
బిల్లుపై స్పందనలు..
బంగ్లాదేశ్, పాక్, మొరాకోసహా పలు ఇస్లామిక్ దేశాలు ఎప్పుడో ట్రిపుల్ తలాక్‌ను నియంత్రించా యి. భారత్ కూడా ఈ దిశగా అడుగులు వేయాలి. ఈ బిల్లును రాజకీయ కోణంలో కాకుండా సామాజిక అంశంగా చూడాలి. ముస్లిం మహిళలపై వేధింపులను చూస్తూ ఊరుకుందామా? మేం షరియాలో జోక్యం చేసుకోవాలనుకోవటం లేదు.
– రవిశంకర్ ప్రసాద్, న్యాయశాఖ మంత్రి.
జాతి ప్రయోజనాల కోసం ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి ఇవ్వాలి. హడావుడిగా కాకుండా విస్తృత చర్చల ద్వారా తుది నిర్ణయం తీసుకోవాలి. ముస్లిం మహిళలకు సాధికారత ఇవ్వటంలో బీజేపీకి ఇంత తొందరెందుకు?
– మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ విపక్షనేత.
ఈ బిల్లు ముస్లిం మహిళల జీవితాల్లో కొత్త ఆశలు, ఉత్సాహం నింపుతుంది.
– బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా
ఈ బిల్లును సవరించడానికి లేదా రద్దుచేయడానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకుసాగుతాం.
– ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు
ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టంగా మారితే కోట్లాది ముస్లిం మహిళలకు రక్షణ కలుగుతుంది.
– విదేశాంగ సహాయ మంత్రి అక్బర్
బిల్లులో ఏముంది..
ట్రిపుల్ తలాక్ చట్టంగా పేర్కొంటోన్న ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ )బిల్లులో పలు కఠిన నిబంధనల్ని పొందుపరిచారు. చట్టాన్ని అతిక్రమించి ముస్లిం పురుషుడు తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం భార్యకు ట్రిపుల్ తలాక్ చెపితే మూడేళ్ల జైలు శిక్షకు అవకాశం కల్పించారు. బిల్లు చట్టంగా మారితే కశ్మీర్ తప్ప దేశమంతటా అమల్లోకి వస్తుంది.
► రాతపూర్వకంగా లేక మొబైల్, ఈమెయిల్ వంటి ఎలక్ట్రానిక్ విధానంలో సహా ఏ రూపంలో చెప్పినా ట్రిపుల్ తలాక్ చెల్లదు. అలాగే చట్ట వ్యతిరేకం కూడా.
► బిల్లులో ట్రిపుల్ తలాక్‌ను కేసు పెట్టదగిన(కాగ్నిజబుల్), నాన్ బెయిలబుల్ నేరంగా పేర్కొన్నారు. భార్యకు తలాక్ చెప్పిన భర్తకు జరిమానాతో సహా గరిష్టంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. బాధిత మహిళ తన కోసం, పిల్లల కోసం భర్త నుంచి జీవన భృతిని కోరే హక్కును బిల్లులో కల్పించారు. కేసును విచారించే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జీవన భృతి మొత్తాన్ని నిర్ణయిస్తారు.
► మైనర్ పిల్లల్ని తన కస్టడీకి అప్పగించమని బాధిత మహిళ కోరే హక్కును బిల్లులో పొందుపరిచారు. పిల్లల కస్టడీపై మేజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారు.
► తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం ముస్లిం పురుషుడు చెప్పే ట్రిపుల్ తలాక్ లేక ఇతర రూపాల్లో చెప్పే తలాక్ పద్ధతుల్ని బిల్లులో తలాక్‌గా నిర్వచించారు. ముస్లిం వ్యక్తిగత చట్టాలకు అనుగుణంగా ట్రిపుల్ తలాక్‌ను ఆచరిస్తున్నారు. దాని ప్రకారం.. ముస్లిం పురుషుడు తన భార్యకు అప్పటికప్పుడు మూడు సార్లు తలాక్ చెపితే తక్షణం విడాకులు మంజూరవుతాయి.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది
ట్రిపుల్ తలాక్ ద్వారా అప్పటికప్పుడు ముస్లిం పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని ఈ ఏడాది ఆగస్టు 22న సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ట్రిపుల్ తలాక్ ఖురాన్‌కు వ్యతిరేకమనీ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనంలోని జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ నారిమన్, జస్టిస్ లలిత్‌లు ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించగా.. జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లు మాత్రం ట్రిపుల్ తలాక్‌ను షరియా చట్టాలు ఆమోదిస్తున్నందున.. అది మత స్వేచ్ఛను ప్రసాదిస్తున్న ఆర్టికల్ 25 కిందకు వస్తుందని పేర్కొన్నారు. చివరకు 3–2 తేడాతో ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీం తీర్పునిచ్చింది. ట్రిపుల్ తలాక్‌పై ఆర్నెల్ల నిషేధం విధించాలనీ, రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనబెట్టి చట్టం చేసేలా ఏకతాటిపైకి రావాలని సుప్రీం సూచించింది.
ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు
‘ఆర్టికల్ 25 నుంచి తలాక్–ఎ–బిద్దత్ విడదీయరానిది. సున్నీల్లోని హనాఫీ ముస్లింలు 1,400 ఏళ్లుగా దీన్ని ఆచరిస్తున్నందున మతాచారంలో భాగమైంది. రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి తగినట్లుగా లేదని చెప్పి ట్రిపుల్ తలాక్‌ను కోర్టు తోసిపుచ్చలేదు’ అని అప్పటి సీజేఐ జస్టిస్ ఖేహర్ అభిప్రాయపడ్డారు. జస్టిస్ ఖేహర్ అభిప్రాయంతో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకీభవిస్తూ.. న్యాయస్థానం తీర్పు ద్వారా ట్రిపుల్ తలాక్‌ను తోసిపుచ్చలేరని... చట్టం ద్వారానే ఇది జరగాలన్నారు. ‘షరియా చట్టంలో ఉంటే అది ప్రాథమిక హక్కులకు అతీతంకాదు. ఇష్టారాజ్యంగా ముస్లిం పురుషుడు విడాకులు ఇవ్వడం ఏకపక్షం, అహేతుకం... దానికి ఆర్టికల్ 25 కింద రక్షణ లేదు’ అని జస్టిస్ నారిమన్ తీర్పు ఇవ్వగా జస్టిస్ లలిత్ ఏకీభవించారు.
Comments
Please login to add a commentAdd a comment