సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకూ జరగనున్నాయి. గురు వారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పౌరసత్వ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు, ప్రజా ప్రాతినిథ్య చట్టం–2017 బిల్లు, కంపెనీల చట్టం బల్లు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలన్న కృతనిశ్చయంతో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. అయితే ఈ బిల్లులపై జేడీయూ సహా పలు మిత్రపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. అయోధ్య చుట్టూ వివాదాస్పదం కాని స్థలాన్ని యజమానులకు తిరిగి ఇచ్చేస్తామని కేంద్రం చెప్పడంపైనా చర్చ సాగే అవకాశముంది. కాగా, తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు సమావేశాల నేపథ్యంలో రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశమయ్యారు. ఈ లోక్‌సభ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment