![Insolvency And Bankruptcy Code Amendment Bill Passed By Parliament - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/2/ISB.jpg.webp?itok=BaL1_wz3)
న్యూఢిల్లీ: డిఫాల్టయిన సంస్థల ఆస్తుల వేలం ద్వారా వచ్చే నిధుల వినియోగంపై మరింత స్పష్టతనిచ్చేలా దివాలా స్మృతి సవరణల బిల్లు (2019)కి పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే దీనికి రాజ్యసభ ఆమోదం తెలపగా.. తాజాగా లోక్‌సభలో కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. స్మృతిలోని ఏడు సెక్షన్లలో సవరణలు ప్రతిపాదించారు. వీటి ప్రకారం డిఫాల్టయిన సంస్థ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన నిధులపై రుణదాతల కమిటీకి పూర్తి అధికారాలు లభించనున్నాయి. ఐబీసీ పరిధిలోకి వచ్చిన కేసులను 330 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది.
రుణ పరిష్కార ప్రణాళికపై ఎన్నాళ్లలోగా నిర్ణయం తీసుకోవాలి, ఆర్థిక రుణదాతలను ఏ వర్గంగా పరిగణించాలి తదితర నిబంధనలపై ఈ సవరణలతో మరింత స్పష్టత వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) ప్రారంభమైన తర్వాత 330 రోజుల్లోగా కేసు పూర్తి కావాల్సి ఉంటుందని ఆమె వివరించారు. అలాగే రుణ పరిష్కార ప్రణాళిక ఒకసారి ఆమోదం పొందిన తర్వాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ అధికారిక సంస్థలు కూడా దానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది.
గృహ కొనుగోలుదారులకు మరిన్ని హక్కులు
తాజా సవరణలతో గృహ కొనుగోలుదారులకు మరిన్ని హక్కులు సంక్రమించగలవని నిర్మలా సీతారామన్ చెప్పారు. బిల్డర్ల ఆగడాలతో సతమతమవుతున్న కొనుగోలుదారులకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వివాదాస్పద జేపీ గ్రూప్ సంస్థల నుంచి గృహాలు కొనుగోలు చేసిన వారి సమస్యలు పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. మరోవైపు, దివాలా స్మృతి పనితీరు మిశ్రమంగా ఉందని చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. కంపెనీల వేలం..ముఖ్యంగా రియల్టీ వంటి రంగాల సంస్థల విక్రయం వల్ల కష్టార్జితం పెట్టి ఇళ్లు కొనుక్కున్న కొనుగోలుదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment