త్వరలో నగరానికి కొత్త బస్సులు
న్యూఢిల్లీ: ఎల్లో బస్సుల (స్టాండర్డ్) స్థానంలో కొత్త బస్సులు రానున్నాయి. ఇందుకు సంబంధించి ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) త్వరలో ఇండియన్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ (ఐఏఎంసీ)తో ఓ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ విషయాన్ని డీటీసీ అధికార ప్రతినిధి ఆర్.ఎస్.మిన్హాస్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘1,380 సెమీ లో-ఫ్లోర్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలనుంచి టెండర్లను ఆహ్వానించాం. టాటా మోటార్స్ సంస్థ ఇందుకు ఆసక్తి చూపించింది.
బిడ్ పత్రాన్ని పుణేలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టు (సీఐఆర్టీ) సంస్థకు పంపాం. సాంకేతిక సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ఆ సంస్థను కోరాం’ అని అన్నారు. కాగా 1,380 సెమీఫ్లోర్ శీతలేతర బస్సులు, 345 లో-ఫ్లోర్ శీతల బస్సుల కొనుగోలు కోసం డీటీసీ గతంలో టెండర్లను ఆహ్వానించింది. అయితే ఇందుకు ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. ఎల్లో బస్సుల (స్టాండర్డ్) స్థానంలో ఈ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిని ఔటర్ ఢిల్లీతోపాటు గ్రామీణ ప్రాంతాల ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు వీటిని వినియోగించనుంది. గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ఈసారి బస్సులను కొనుగోలు ప్రక్రియ ఆగదని డీటీసీ అధికారులు ధీమాతో ఉన్నారు.
‘సెమీ లోఫ్లోర్ బస్సులు గ్రామీణ ప్రాంతాలతోపాటు ఔటర్ ఢిల్లీవాసులకు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాం. ఈ రెండు ప్రాంతాల్లో రహదారులు సరిగా ఉండవు. సెమీ లో-ఫ్లోర్ బస్సులు నగర ప్రయాణికులతోపాటు గ్రామీణ, ఔటర్ ఢిల్లీవాసుల అవసరాలను తీర్చగలుగుతాయి’అని మిన్హాస్ పేర్కొన్నారు. డీటీసీ అధికారులు అందించిన వివరాల ప్రకారం మొత్తం 600 లోఫ్లోర్ బస్సులను దశలవారీగా సేవలనుంచి తప్పించనున్నారు. మరో 1,275 లోఫ్లోర్ బస్సుల నిర్వహణ కాలపరిమితి ముగిసింది.
వాటి స్థానంలో కొత్త సెమీలోఫ్లోర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. వాస్తవానికి డీటీసీకి ప్రస్తుతం 11 వేల బస్సులు అవసరం. డీటీసీ, ఢిల్లీ ఇంటిగ్రే టెడ్ మల్టీమోడల్ ట్రాన్సిట్ సిస్టం (డీఐఎంటీఎస్) సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు నగరవ్యాప్తంగా చెరో 5,500 బస్సులను నడపాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దాదాపు 4,937 బస్సులను డీటీసీ నగరవ్యాప్తంగా నడుపుతోంది. ఇక డీఐఎంటీఎస్ వద్ద కేవలం 1,157 బస్సులే ఉన్నాయి.