బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024ను లోక్‌సభ ఆమోదించింది. ప్రధానంగా బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతాలకు గరిష్టంగా నలుగురు నామినీలను కలిగి ఉండేలా ఈ బిల్లు అనుమతిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.
"ప్రతిపాదిత సవరణలు బ్యాంకింగ్ రంగంలో పాలనను బలోపేతం చేస్తాయి. నామినేషన్, డిపాజిట్‌దారుల రక్షణకు సంబంధించి కస్టమర్ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి" అని సీతారామన్ బిల్లును ప్రవేశ పెడుతూ చెప్పారు. బిల్లులోని ప్రతిపాదనల ప్రకారం బ్యాంకులో ఖాతాదారు గరిష్టంగా నలుగురు నామినీలను ఏర్పాటు చేసుకోవచ్చు. వీరిని ఒకేసారి కానీ, వివిధ సందర్భాల్లో గానీ చేర్చుకోవచ్చు. ఎవరెవరికి ఎంత వాటా అన్నది కూడా ఖాతాదారు పేర్కొనవచ్చు.
పాలనా ప్రమాణాలను మెరుగుపరచడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బ్యాంకులు నివేదించడంలో స్థిరత్వాన్ని అందించడం, డిపాజిటర్లకు, ఇన్వెస్టర్లకు మెరుగైన రక్షణ కల్పించడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆడిట్ నాణ్యతను మెరుగుపరచడం, నామినీల విషయంలో కస్టమర్ సౌలభ్యాన్ని పెంచడం, సహకార బ్యాంకుల్లో డైరెక్టర్ల పదవీకాలం పెంచడం వంటి వాటికి సంబంధించి 19 సవరణలను ఈ బిల్లులో ప్రతిపాదించారు.
ప్రతిపాదిత కీలక మార్పులు
బ్యాంకు ఖాతాలకు నామినీల సంఖ్య పెంపుతోపాటు మరికొన్ని కీలక మార్పులు బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024లో ఉన్నాయి.బ్యాంకులకు సంబంధించిన అన్‌క్లెయిమ్డ్ డివిడెండ్‌లు, షేర్, వడ్డీ లేదా బాండ్ల రిడెమ్షన్‌ను ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (IEPF)కి బదిలీ చేస్తారు. సంబంధిత వ్యక్తులు ఎకరైనా ఉంటే అక్కడి నుంచి క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.
డైరెక్టర్‌షిప్స్‌కు సంబంధించి సబ్‌స్టాన్షియల్ ఇంట్రస్ట్ పరిమితి రూ.2 కోట్లకు పెరుగుతుంది. ఇది ప్రస్తుత రూ.5 లక్షలుగా ఉంది. దీన్ని సుమారు 6 దశాబ్దాల కిందట నిర్ణయించారు.
సహకార బ్యాంకుల డైరెక్టర్ల (ఛైర్మన్, ఫుల్‌టైమ్ డైరెక్టర్ మినహా) పదవీ కాలం ఎనిమిదేళ్ల నుంచి పదేళ్లకు పెరుగుతుంది.
కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరు రాష్ట్ర సహకార బ్యాంకు బోర్డులో కూడా సభ్యుడిగా ఉండేందుకు అనుమతి.
Comments
Please login to add a commentAdd a comment