
నేడే లోక్‌సభకు సమర్పణ
నిరుపయోగ నిబంధనలకు గుడ్‌బై
అర్థం కాని పదబంధాలకు స్వస్తి
622 పేజీలకు కుదింపు
న్యూఢిల్లీ: అర్థం చేసుకునేందుకు, ఆచరణకు సులభతరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త ఆదాయపన్ను బిల్లును (ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు, 2025) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభకు సమర్పించనున్నట్టు సమాచారం. ఇందులో ఎలాంటి కొత్త పన్నుల్లేవు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), ఇతరులకు సంబంధించిన ఆదాయపన్ను ముసాయిదా చట్టం ఇది.
చిన్న వ్యాక్యాలతో, చదివేందుకు వీలుగా, టేబుళ్లు, ఫార్ములాలతో ఉంటుంది. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో తీసుకువస్తున్న ఈ నూతన బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలన, పార్లమెంట్ ఆమోదం అనంతరం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ‘‘1961 నాటి ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఎన్నో సవరణలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రాథమిక నిర్మాణమే మారిపోయింది. భాష సంక్లిష్టంగా ఉండడంతో, నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులపై వ్యయ భారం పెరిగింది. ఇది పన్ను యంత్రాంగం సమర్థతపైనా ప్రభావం చూపిస్తోంది’’అని కొత్త బిల్లు తీసుకురావడానికి గల కారణాలను ప్రభుత్వం వివరించింది.
బిల్లులోని అంశాలు..
ట్యాక్స్ ఇయర్: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (పీవై) రిటర్నులు దాఖలు చేసే సంవత్సరాన్ని అసెస్‌మెంట్ సంవత్సరంగా (ఏవై) ప్రస్తుతం పిలుస్తున్నారు. ఇకపై పీవై, ఏవై పదాలు ఉండవు. వీటి స్థానంలో ఏప్రిల్ 1 నుంచి 12 నెలల కాలాన్ని (ఆర్థిక సంవత్సరాన్ని) ‘ట్యాక్స్ ఇయర్’గా సంభాషిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి 2024–25 అసెస్‌మెంట్ సంవత్సరం అవుతుంది.
సైజు కుదింపు: 1961 నాటి చట్టం 880 పేజీలు, 298 సెక్షన్లు, 23 చాప్టర్లు, 14 షెడ్యూళ్లతో ఉంది. కొత్త బిల్లును 622 పేజీలకు కుదించారు. అదే సమయంలో సెక్షన్లను 526కు, షెడ్యూళ్లను 16కు పెంచారు. చాప్టర్లు 23గానే ఉన్నాయి.
టేబుళ్ల రూపంలో: టీడీఎస్, ప్రిజంప్టివ్ ట్యాక్స్, వేతనాలు, మినహాయింపులకు సులభంగా అర్థం చేసుకునేందుకు టేబుళ్లను ఇచ్చారు. టీడీఎస్ సెక్షన్లు అన్నింటికీ ఒకే క్లాజు కిందకు తీసుకొస్తూ అర్థం చేసుకునేందుకు సులభమైన టేబుళ్ల రూపంలో ఇచ్చినట్టు నాంజియా ఆండర్సన్ ఎల్‌ఎల్‌పీ ఎంఅండ్‌ఏ ట్యాక్స్ పార్ట్‌నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు.
→ వేతనాల నుంచి స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, ఎల్‌టీసీ తదితర తగ్గింపులన్నింటినీ వేర్వేరు సెక్షన్ల కింద కాకుండా ఒకే చోట ఇచ్చారు.
→ ‘నాత్ విత్ స్టాండింగ్’ (అయినప్పటికీ) అన్న పదం ప్రస్తుత చట్టంలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. దీని స్థానంలో ఇర్రెస్పెక్టివ్ (సంబంధంలేకుండా)ప్రవేశపెట్టారు. ఇలా అనవసర పదాలు తొలగించారు.
→ ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లకు (ఈసాప్) సంబంధించి పన్నులో స్పష్టత తీసుకొచ్చారు.
→ పన్ను చెల్లింపుదారుల చాప్టర్‌లో.. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలను వివరంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment