New income tax rates
-
ఆదాయపన్నులో మార్పులు.. తరచూ అడిగే ప్రశ్నలు
ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు సందేహాల నివృత్తి కోసం తరచుగా అడిగే ప్రశ్నలకు జవాబులు కూడా పొందుపర్చారు. ఇలా చేయటంతో డిపార్టుమెంటువారీ స్నేహభావం, సన్నద్ధంగా ఉండే విధానం రెండూ తెలుస్తున్నాయి. వ్యక్తుల ఆదాయపు పన్ను వరకు 21 ప్రశ్నలు ఉన్నాయి. వాటి సారాంశమే ఈ వారం కథనం.కొత్త విధానం అంటే ఏమిటి?కొత్త విధానంలో రాయితీ ఉండే పన్ను రేట్లు, ఉదారమైన శ్లాబులుంటాయి. స్టాండర్డ్ డిడక్షన్ మినహా ఎటువంటి మినహాయింపులు ఉండవు.రేట్లు, శ్లాబులుగతంలో ఈ శ్లాబులు, రేట్ల గురించి తెలియజేశాం. ఇక్కడ బేసిక్ లిమిట్ రూ.3,00,000 నుంచి రూ.4,00,000కు పెంచారు. రూ.4 లక్షల వరకు పన్ను ఉండదు. రూ.12 లక్షలు దాటిన వారికి మాత్రం రూ.4,00,000 నుంచి పన్ను శ్లాబుల ప్రకారం వడ్డిస్తారు. శ్లాబుల విషయంలో నాలుగో ఎక్కం.. రేట్ల విషయంలో ఐదో ఎక్కం గుర్తు పెట్టుకుంటే చాలు. ప్రతి రూ.ఒక లక్ష ఆదాయం పెరుగుదలకు ఎంత పన్ను భారం ఏర్పడుతుంది? ప్రస్తుతం ఎంత? ప్రతిపాదనల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది? అనే విషయాలను అంకెలతో ఉదాహరణగా పట్టిక పొందుపరిచారు.ఎంత వరకు పన్ను చెల్లించనక్కర్లేదు?కొత్త విధానంలో రూ.12,00,000 వరకు పన్ను భారం ఏర్పడదు.పన్ను భారం ‘నిల్‘గా ఉండాలంటే ఏం చేయాలి?రూ.12,00,000 వరకు ఆదాయంపై పన్ను భారం నిల్‌గా ఉండాలంటే కొత్త విధానాన్ని విధిగా ఎంచుకోవాలి. ఆ మేరకు రిటర్నులు దాఖలు చేయాలి. కొత్త విధానం ఎవరికి వర్తిస్తుంది?కొత్త విధానం వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు, వ్యక్తుల కలయిక లేదా సంస్థలకు వర్తిస్తుంది.పన్నెండు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఏమిటి ప్రయోజనం?ఒకప్పుడు రూ.12,00,000 ఆదాయం ఉన్న వారు రూ.80,000 వరకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు వారు ఏమీ చెల్లించనక్కర్లేదు.ఆదాయ పరిమితిని పెంచినట్లా?అవుననే చెప్పాలి. నిల్‌గా పన్ను భారం రావాలంటే రూ.12,00,000 లోపల ఆదాయం ఉండాలి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ట్యాక్సబుల్ పరిమితిని పెంచినట్లు. అంటే రిబేటును పూర్తిగా వాడుకున్నట్లు.గతంలో ‘నిల్’కి లిమిట్ ఎంత ఉంది?ఒకప్పుడు ఇటువంటి లిమిట్ రూ.7,00,000గా ఉండేది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.12,00,000కు పెంచారు.కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ తగ్గిస్తారా?కొత్త విధానంలో ఉద్యోగస్తులకు రూ.75,000 తగ్గిస్తారు. ఈ తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగస్తులకు రూ.12,75,000 వరకు పన్ను ఉండదు.పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ఎంత?పాత విధానంలో రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే. ఎటువంటి పెంపుదల లేదు. మార్జినల్ రిలీఫ్‌ను ఎలా లెక్కించాలి?రూ.12,00,000 దాటితే రూ.4,00,000 నుంచి పన్ను భారం లెక్కించాలి. మీ ఆదాయం రూ.12,10,000 అనుకోండి, సాధారణంగానైతే పన్ను భారం రూ.61,500. ఇటువంటి వారికి ఇచ్చే ఉపశమనాన్నే మార్జినల్ రిలీఫ్ అంటారు. ఈ రిలీఫ్ వల్ల స్వల్పంగా అదనపు ఆదాయం ఉన్నా అధిక పన్ను చెల్లించనక్కర్లేదు. ఇలాంటప్పుడు పన్నుభారం రూ.10,000 మాత్రమే. ఇలా రూ.12,75,000 వరకు రిలీఫ్ కల్పించారు. ఈ మేరకు చక్కటి, సంపూర్ణమైన ఉదాహరణ ఇచ్చారు.ఎంత మొత్తం రిబేటు ఉంటుంది?రిబేటు రూ.60,000 దాటి ఇవ్వరు.రిబేటుకి మార్జినల్ రిలీఫ్‌కి తేడా ఏమిటి?రూ.12,00,000 లోపు ఆదాయం ఉన్నప్పుడు ఇచ్చేది రిబేటు. రూ.12,00,000 దాటిన తర్వాత (రూ.12,75,000 వరకు) వచ్చేది మార్జినల్ రిలీఫ్.ఇదీ చదవండి: ఫండ్ పనితీరు మదింపు ఇలా..ఇతర ఆదాయాలకు రిబేటు వర్తిస్తుందా?మూలధన లాభాలు, లాటరీ మొదలైన వాటి వల్ల ఏర్పడ్డ ఆదాయాలకు ఈ రిబేటు వర్తించదు. ఏ ఆదాయం మీద స్పెషల్ రేటు ఉందో, దాని మీద రిబేటు రాదు.ఎంత మంది లబ్ధిదార్లు ఉన్నారు?గత సంవత్సరం 8.75 కోట్ల మంది కొత్త విధానంలో రిటర్నులు వేశారు. వారందరికీ ఇప్పుడు లాభం చేకూరుతుంది.ఎంత ఆదా అవుతుంది?ఈ మార్పుల వల్ల సుమారుగా రూ.లక్ష కోట్లు ట్యాక్స్‌పేయర్స్ చేతిలో మిగులుతుంది. అదే వినియోగం పెరిగేందుకు నాంది.-కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
కొత్త పన్ను చట్టం.. ఎంతో సులభతరం!
న్యూఢిల్లీ: అర్థం చేసుకునేందుకు, ఆచరణకు సులభతరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త ఆదాయపన్ను బిల్లును (ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, 2025) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభకు సమర్పించనున్నట్టు సమాచారం. ఇందులో ఎలాంటి కొత్త పన్నుల్లేవు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), ఇతరులకు సంబంధించిన ఆదాయపన్ను ముసాయిదా చట్టం ఇది. చిన్న వ్యాక్యాలతో, చదివేందుకు వీలుగా, టేబుళ్లు, ఫార్ములాలతో ఉంటుంది. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో తీసుకువస్తున్న ఈ నూతన బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలన, పార్లమెంట్ ఆమోదం అనంతరం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ‘‘1961 నాటి ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఎన్నో సవరణలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రాథమిక నిర్మాణమే మారిపోయింది. భాష సంక్లిష్టంగా ఉండడంతో, నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులపై వ్యయ భారం పెరిగింది. ఇది పన్ను యంత్రాంగం సమర్థతపైనా ప్రభావం చూపిస్తోంది’’అని కొత్త బిల్లు తీసుకురావడానికి గల కారణాలను ప్రభుత్వం వివరించింది. బిల్లులోని అంశాలు.. ట్యాక్స్ ఇయర్: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (పీవై) రిటర్నులు దాఖలు చేసే సంవత్సరాన్ని అసెస్మెంట్ సంవత్సరంగా (ఏవై) ప్రస్తుతం పిలుస్తున్నారు. ఇకపై పీవై, ఏవై పదాలు ఉండవు. వీటి స్థానంలో ఏప్రిల్ 1 నుంచి 12 నెలల కాలాన్ని (ఆర్థిక సంవత్సరాన్ని) ‘ట్యాక్స్ ఇయర్’గా సంభాషిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి 2024–25 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. సైజు కుదింపు: 1961 నాటి చట్టం 880 పేజీలు, 298 సెక్షన్లు, 23 చాప్టర్లు, 14 షెడ్యూళ్లతో ఉంది. కొత్త బిల్లును 622 పేజీలకు కుదించారు. అదే సమయంలో సెక్షన్లను 526కు, షెడ్యూళ్లను 16కు పెంచారు. చాప్టర్లు 23గానే ఉన్నాయి. టేబుళ్ల రూపంలో: టీడీఎస్, ప్రిజంప్టివ్ ట్యాక్స్, వేతనాలు, మినహాయింపులకు సులభంగా అర్థం చేసుకునేందుకు టేబుళ్లను ఇచ్చారు. టీడీఎస్ సెక్షన్లు అన్నింటికీ ఒకే క్లాజు కిందకు తీసుకొస్తూ అర్థం చేసుకునేందుకు సులభమైన టేబుళ్ల రూపంలో ఇచ్చినట్టు నాంజియా ఆండర్సన్ ఎల్ఎల్పీ ఎంఅండ్ఏ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. → వేతనాల నుంచి స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, ఎల్టీసీ తదితర తగ్గింపులన్నింటినీ వేర్వేరు సెక్షన్ల కింద కాకుండా ఒకే చోట ఇచ్చారు. → ‘నాత్ విత్ స్టాండింగ్’ (అయినప్పటికీ) అన్న పదం ప్రస్తుత చట్టంలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. దీని స్థానంలో ఇర్రెస్పెక్టివ్ (సంబంధంలేకుండా)ప్రవేశపెట్టారు. ఇలా అనవసర పదాలు తొలగించారు. → ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లకు (ఈసాప్) సంబంధించి పన్నులో స్పష్టత తీసుకొచ్చారు. → పన్ను చెల్లింపుదారుల చాప్టర్లో.. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలను వివరంగా పేర్కొన్నారు. -
ఆదాయపన్ను.. ఆదా ఎలా!
ఆదాయపన్ను పాత, కొత్త విధానాల్లో ఏది అనుకూలం? ఎక్కువ మందిని వేధిస్తున్న సందేహం ఇది. 2024–25 కేంద్ర బడ్జెట్లో కొన్ని సవరణలు ప్రతిపాదించడం ద్వారా ఎక్కువ మందిని నూతన పన్ను విధానం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు విత్త మంత్రి. శ్లాబుల పరిమితుల్లో మార్పులతోపాటు.. స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా పెంచారు. దీనివల్ల కొత్త విధానంలో రూ.17,500 వరకు ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో ప్రకటించారు. కానీ, పాత పన్ను వ్యవస్థలో వివిధ సెక్షన్ల కింద పన్ను ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే ఇంతకంటే ఎక్కువే ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ, అధిక ఆదాయం పరిధిలోని వారికి నూతన పన్ను విధానమే అనుకూలమన్నది విశ్లేషకుల నిర్వచనం. మధ్యాదాయ వర్గాలకు, మినహాయింపు ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే పాత విధానం అనుకూలం. తమ ఆదాయం, పెట్టుబడులు తదితర వివరాల ఆధారంగానే తమకు ఏది అనుకూలమన్నది నిర్ణయించుకోగలరు. ఇందుకు సంబంధించిన వివరాలను అందించే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది. కొత్త విధానంలో తాజా మార్పులు నూతన విధానంలో 5 శాతం పన్ను, 10 శాతం పన్ను శ్లాబుల్లో రూ.లక్ష చొప్పున అదనంగా పరిమితి పెంచారు. అలాగే నూతన విధానంలో వేతన జీవులు, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు. → నూతన విధానంలో మొదటి రూ.3లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. → స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి చూసుకుంటే రూ.7.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.3–7లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.15,000 ఉంటే రూ.25,000 చేశారు. అంటే ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారు రూ.7,25,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు. మినహాయింపులు → నూతన పన్ను విధానంలో కేవలం కొన్ని మినహాయింపులే ఉన్నాయి. సెక్షన్ 80సీసీడీ(2) కింద ఎన్పీఎస్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఉద్యోగితోపాటు, ఉద్యోగి తరఫున సంస్థలు ఈపీఎఫ్ చందాలను జమ చేస్తుండడం తెలిసిందే. అదే విధంగా ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు సైతం సంస్థలు జమ చేయవచ్చు. ఉద్యోగి మూలవేతనం, కరువు భత్యంలో 10 శాతం గరిష్ట పరిమితి ఇప్పటి వరకు ఉంటే, దీన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 14 శాతం చేశారు. కనుక ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతా తెరిచి, సంస్థ ద్వారా అందులో జమ చేయించుకోవడం ద్వారా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. → సెక్షన్ 24 కింద నూతన పన్ను విధానంలోనూ ఇంటి రుణంపై పన్ను ప్రయోజనం ఉంది. కాకపోతే ఆ ఇంటిని అద్దెకు ఇవ్వాలి. అప్పుడు ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీ మొత్తంపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. → కన్వేయన్స్ అలవెన్స్, సెక్షన్ 10(10సీ) కింద స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజనం గరిష్టంగా రూ.5లక్షలు, సెక్షన్ 10(10) కింద గ్రాట్యుటీ రూ.20లక్షలపైనా పన్ను లేదు. → ఉద్యోగి రాజీనామా లేదా పదవీ విరమణ సమయంలో సెలవులను నగదుగా మార్చుకోవడం వల్ల వచ్చే మొత్తం రూ.25 లక్షలపైనా సెక్షన్ 10(10 ) పన్ను లేదు. పాత పన్ను విధానం → రూ.5 లక్షల వరకు ఆదాయంపై 87ఏ కింద రిబేట్ ఉంది. దీంతో 60 ఏళ్ల వయసులోని వారికి రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.5.50 లక్షల వరకు పన్ను చెల్లించక్కర్లేదు. → 60–80 ఏళ్ల వయసులోని వారికి రూ.3 లక్షల వరకు, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే కనీస పన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటారు. మినహాయింపులు →గృహ రుణం తీసుకుని దాని అసలుకు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా చెల్లించే రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను లేదు. →సెక్షన్ 24(బి) కింద గృహరుణం వడ్డీకి చెల్లించే మొత్తం రూ.2లక్షల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని వేరొకరికి అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయం నుంచి.. రుణానికి చెల్లించే వడ్డీ మొత్తాన్ని మినహాయించుకోవచ్చు. →సెక్షన్ 80ఈఈ కింద మొదటిసారి ఇంటిని రుణంపై సమకూర్చుకున్న వారు ఏటా రూ.50,000 అదనపు మొత్తాన్ని వడ్డీ చెల్లింపుల నుంచి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొనుగోలు చేసిన ఇంటి ధర రూ.45 లక్షల్లోపు ఉంటే ఈ పరిమితి సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.50లక్షలుగా ఉంది. → సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల ఆదాయపన్ను మినహాయింపు కోసం.. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులతోపాటు, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ఎన్పీఎస్, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఐదేళ్ల ట్యాక్స్‌ఫ్రీ బ్యాంక్ ఎఫ్డీ, ఈఎల్ఎస్ఎస్, యులిప్ ప్లాన్‌లో పెట్టుబడులు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకోవచ్చు. → పెన్షన్ ప్లాన్‌లో (ఎన్పీఎస్)లో పెట్టుబడికి సైతం గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80సీసీడీ(1) కింద మినహాయింపు పొందొచ్చు. కాకపోతే సెక్షన్ 80సీలో భాగంగానే ఇదీ ఉంటుంది. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 వరకు అదనంగా ఎన్పీఎస్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం ఉంది. అంటే మొత్తం రూ.2లక్షలు. → సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.25,000 మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ60 ఏళ్లలోపు తల్లిదండ్రులకు ప్రీమియం చెల్లిస్తుంటే, మరో రూ.25,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి హెల్త్ ప్రీమియం రూ.50,000 వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వ్యాధి నివారణ పరీక్షల కోసం చేసే వ్యయాలు రూ.5,000పైనా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేని తల్లిదండ్రుల వైద్య చికిత్సల కోసం చేసే వ్యయం రూ.50,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు కోరొచ్చు. → సెక్షన్ 80డీడీబీ కింద కేన్సర్, డిమెన్షియా తదితర తీవ్ర వ్యాధుల్లో చికిత్సలకు చేసే వ్యయాలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లలోపు వారికి రూ.40వేలు కాగా, అంతకుమించిన వయసు వారి చికిత్స కోసం ఈ పరిమితి రూ.లక్షగా ఉంది. → బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80 టీటీఏ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80టీటీబీ కింద 60 ఏళ్లు నిండిన వారికి బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ పరిమితి రూ.50,000గా ఉంది. → సెక్షన్ 80ఈ కింద ఉన్నత విద్య కోసం తీసుకున్న రుణానికి చేసే వడ్డీ చెల్లింపులపై పూర్తి పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. 8 ఏళ్లపాటు ఈ ప్రయోజనం ఉంటుంది. → అద్దె ఇంట్లో ఉంటూ, పనిచేస్తున్న సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందే వారు, ఆ మొత్తంపై సెక్షన్ 10(13ఏ) కింద పన్ను ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. 1. పనిచేస్తున్న సంస్థ నుంచి ఒక ఏడాదిలో పొందిన వాస్తవ హెచ్ఆర్ఏ మొత్తం. 2. వాస్తవంగా చెల్లించిన అద్దె నుంచి తమ వార్షిక వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. 3. మెట్రోల్లో నివసించే వారి మూల వేతనంలో 50 శాతం/ పల్లెల్లో నివసించే వారు అయితే మూల వేతనంలో 40 శాతం. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే అంత మేర తమ ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసించే శ్రీరామ్ నెలవారీ స్థూల వేతనం రూ.50,000 (సంవత్సరానికి రూ.6లక్షలు). అతడి మూలవేతనం, డీఏ కలిపి రూ.30,000. హెచ్ఆర్ఏ కింద సంస్థ ప్రతినెలా రూ.10,000 ఇస్తోంది. కానీ శ్రీరామ్ రూ.12,000 కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఉదాహరణలో శ్రీరామ్ రూ.84,000ను హెచ్ఆర్ఏ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. → ఇంకా సెక్షన్ 80సీ కింద గుర్తింపు పొందిన సంస్థలకు విరాళాలతోపాటు మరికొన్ని మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిపుణులు ఏమంటున్నారు? ఎంత మేర పన్ను తగ్గింపులు, మినహాయింపులు క్లెయిమ్ చేసుకుంటారన్న అంశం ఆధారంగానే పాత, కొత్త పన్ను విధానంలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. ఒక పేపర్‌పై తమ ఆదాయం, పెట్టుబడులు, బీమా ప్రీమియం వివరాలను నమోదు చేసుకుని, హెచ్ఆర్ఏ లెక్క తేలి్చన అనంతరం ఏ విధానం అనుకూలమో నిర్ణయించుకోవాలి. మొత్తం ఆదాయంలో ఎంత మేర పన్ను తగ్గింపులను క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఏ విధానం అనుకూలమో స్పష్టత తెచ్చుకున్న తర్వాతే రిటర్నుల దాఖలుకు ముందుకు వెళ్లాలి. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మేర ఇన్వెస్ట్ చేస్తూ.. ఇంటి రుణం, విద్యా రుణం తీసుకుని చెల్లింపులు చేస్తూ.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంతోపాటు, హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అధిక ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారికి సైతం పాత విధానమే మెరుగని షేర్ డాట్ మార్కెట్ బిజినెస్ హెడ్ వైభవ్ జైన్ తెలిపారు. ఈ క్లెయిమ్‌లు చేసుకోని వారికి కొత్త విధానాన్ని సూచించారు. నూతన విధానంలో పెద్దగా పన్ను ప్రయోజనాలు లేకపోయినా సరే.. కొత్తగా ఉద్యోగంలో చేరి, రూ.7 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ఎంతో ప్రయోజనమని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లోహిత్భాటియా తెలిపారు. ఎంపికలో స్వేచ్ఛ..ఆదాయపన్ను రిటర్నులు వేసే సమయంలో కొంత శ్రద్ధ వహించక తప్పదు. ఎందుకంటే కొత్త పన్ను విధానమే డిఫాల్ట్‌గా ఎంపికై ఉంటుంది. నూతన విధానంలోనే రిటర్నులు వేసే వారు అన్ని వివరాలు నమోదు చేసి సమరి్పంచొచ్చు. పాత విధానంలో కొనసాగాలనుకుంటే కచి్చతంగా ‘నో ఫర్ ఆప్టింగ్ అండర్ సెక్షన్ 115బీఏసీ’’ అని సెలక్ట్ చేసుకోవాలి. వేతన జీవులు ఏటా రిటర్నులు వేసే సమయంలో రెండు పన్ను విధానాల్లో తమకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం ఇలా ఏదో ఒకటి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదు. వీరు పాత విధానంలోనే కొనసాగదలిస్తే ఫారమ్ 10–ఐఈఏ సమరి్పంచాలి. కాకపోతే జీవితంలో ఒక్కసారి మాత్రం నూతన పన్ను విధానానికి మారిపోయే ఆప్షన్ ఉంటుంది. ఒక్కసారి ఈ అవకాశం వినియోగించుకుని నూతన విధానంలోకి మారితే, తిరిగి పాత విధానంలోకి వెళ్లే అవకాశం ఉండదు. ఇప్పటికే 66 శాతం మేర నూతన పన్ను విధానంలో రిటర్నులు వేస్తున్నట్టు సీబీడీటీ చెబుతోంది. ఏది ప్రయోజనం..? → కేవలం స్టాండర్డ్ డిడక్షన్ వరకే క్లెయిమ్ చేసుకునేట్లయితే రూ.7,75,000 లక్షల్లోపు ఆదాయం ఉన్న వేతన జీవులు, పెన్షనర్లకు నిస్సందేహంగా నూతన విధానమే మెరుగని ఇక్కడి టేబుల్ చూస్తే అర్థమవుతుంది. స్వ యం ఉపాధి, ఇతరులకు రూ.7లక్షల వరకు నూతన విధానంలో పన్ను లేదు. పాత విధానంలో అయితే స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని రూ.5.50లక్షల మొత్తంపై వేతన జీవులు, పెన్షనర్లకు పన్ను వర్తించదు. ఆ తర్వాత ఆదాయంపై 20% పన్ను పడుతోంది. → రూ.7,75,000 ఆదాయం కలిగి.. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలతోపాటు, సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు కలిపి మొత్తం రూ.7 లక్షల వరకే పన్ను ఆదాయంపై మినహాయింపులను క్లెయిమ్ చేసు కునే వారికీ నూతన పన్ను విధానం లాభం. → రూ.7 లక్షలకు మించకుండా ఆదాయం కలిగిన వారు పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ సహా రూ.2లక్షలకు పైన పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అందులో కొనసాగొచ్చు. క్లెయిమ్ చేసుకోలేని వారికి కొత్త విధానం నయం. → అలాగే, రూ.11 లక్షల ఆదాయం కలిగిన వారు రూ.3,93,700కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని) క్లెయిమ్ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం. → రూ.16 లక్షల పన్ను ఆదాయం కలిగిన వారు రూ.4,83,333కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని) క్లెయిమ్ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం. → రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు, 24(బీ) కింద గృహ రుణ వడ్డీ రూ.2 లక్షలు, హెచ్ఆర్ఏ ప్రయోజనం రూ.80వేలు (రూ.50వేల వేతనంపై సుమారు), హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.25వేలు, ఎన్పీఎస్ పెట్టుబడి రూ.50వేలను క్లెయిమ్ చేసుకుంటే పాత విధానంలో నికరంగా రూ.10.55 లక్షల ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు. నోట్: మూడు టేబుళ్లలో ఉన్న గణాంకాలు 60ఏళ్లలోపువారికి ఉద్దేశించినవి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఏప్రిల్ 1 విడుదల
అమలులోకి వచ్చిన కొత్త ఆదాయ పన్ను రేట్లు - లక్షలాది మంది ఉద్యోగుల ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు - ఉద్యోగులకు స్వల్పంగా తగ్గనున్న ఆదాయపన్ను భారం - పెరగనున్న కార్లు, మోటార్ సైకిళ్లు, ఆరోగ్య బీమా ప్రీమియంలు - జూలై 1 నుండి పాన్ దరఖాస్తు.. ఐటీ రిటర్నులకు ఆధార్ తప్పనిసరి - లక్షలాది మంది ఖాతాదారులపై జరిమానాలకు సిద్ధమైన ఎస్బీఐ ఏప్రిల్ ఒకటి.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల ఆర్థిక వ్యవహారాలను ఎంతోకొంత మార్చే తేదీ. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంతో వ్యక్తిగత ఆదాయ పన్నుల స్లాబులు మారడం దీనికి ప్రధాన కారణం. 2017–18 ఆర్థిక సంవత్సరానికి కూడా ఐటీ స్లాబుల్లో మార్పులను కేంద్రం ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించింది. మార్చి నెలాఖరు కల్లా లోక్‌సభ బడ్జెట్ కసరత్తును పూర్తిచేసి ఆర్థిక బిల్లును, దానికి ప్రతిపాదించిన సవరణలను ఆమోదించింది. ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి అమలులోకి వచ్చిన ఆదాయ పన్ను రేట్లు, దానికి సంబంధించిన ఇతర అంశాల్లో ముఖ్యమైనవి ఇవీ.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ 2017–18 ఆదాయ పన్ను మార్పులివీ.. ► ఉద్యోగుల చేతుల్లో ఎక్కువ నగదు ఉండేలా చూడటం కోసం.. రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షల వరకూ వార్షిక ఆదాయం గల ఉద్యోగులపై ఆదాయ పన్ను రేటును కేంద్రం సగానికి తగ్గించింది. పది శాతం పన్ను రేటును ఐదు శాతానికి కుదించింది. దీనివల్ల వారికి ఏటా రూ.12,500 వరకూ ఆదా అవుతుంది. ► అలాగే.. రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న వారికి ఏటా రూ.12,900 పన్ను ఆదా అవుతుంది. ఇక వార్షిక ఆదాయం రూ.1 కోటి కన్నా ఎక్కువ ఉన్న వారికి సైతం.. సర్‌చార్జీ, సెస్సులు సహా రూ.14,806 మేర పన్ను తగ్గుతుంది. ► రూ.5 లక్షల వరకూ ఆదాయం(వాణిజ్య ఆదాయం మినహాయించి) గల పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి సరళమైన ఒక పేజీ ఫామ్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ కేటగిరీలో మొదటిసారిగా ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసే వారిని ఐటీ విభాగం తనిఖీ చేయబోదు. ► ఈ ఆర్థిక సంవత్సరానికి (2017–18) ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయడంలో జాప్యం జరిగి.. 2018 డిసెంబర్ 31వ తేదీ లోపు దాఖలు చేస్తే రూ.5,000 జరిమానా విధిస్తారు. ఆ తేదీ కూడా దాటితే జరిమానా ఇంకా ఎక్కువ ఉంటుంది. అయితే.. రూ.5 లక్షల వరకూ ఆదాయం గల చిన్న పన్ను చెల్లింపుదారులకు ఈ జరిమానాను రూ.1,000కి పరిమితం చేశారు. ► రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీమ్‌లో పెట్టుబడులకుగానూ 2018–19 అసెస్మెంట్ సంవత్సరం నుండి పన్ను మినహాయింపు లభించదు. సెక్యూరిటీల మార్కెట్లో తొలిసారి పెట్టుబడిదారులను ప్రోత్సహించడం కోసం గత యూపీఏ ప్రభుత్వం 2012–13 బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ► స్థిరాస్తికి గల దీర్ఘకాల హోల్డింగ్ కాలపరిమితిని మూడేళ్ల నుండి రెండేళ్లకు తగ్గించారు. కనుక, కొత్తగా రాబోయే చట్టం వల్ల.. రెండేళ్లకు పైగా హోల్డింగ్‌లో ఉన్న స్థిరాస్తిపై పన్ను 20 శాతానికి తగ్గుతుంది. పునఃపెట్టుబడులకు వివిధ మినహాయింపులకు అర్హత కూడా ఉంటుంది. ► దీర్ఘకాలిక పెట్టుబడి రాబడులపై పన్ను ప్రయోజనం ఆశించడం నెరవేరకపోవచ్చు. ఎందుకంటే.. ప్రయోజనాలు జతకావడం వల్ల అమ్మకాలపై లాభాలు తగ్గుతాయి. ప్రభుత్వం వ్యయ సూచీ మూల సంవత్సరాన్ని 1981 ఏప్రిల్ 1 నుండి 2001 ఏప్రిల్ 1వ తేదీకి మార్చింది. ► వ్యక్తులకు పెట్టుబడి రాబడులను.. ఎన్హెచ్ఏఐ, ఆర్ఈసీ బాండ్లకు అదనంగా నోటిఫై చేసిన రిడీమబుల్ బాండ్లలో మళ్లీ పెట్టుబడి పెట్టడంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ► నెలకు రూ.50,000 మించిన అద్దె చెల్లింపులకు.. వ్యక్తులు ఐదు శాతం టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) మినహాయించాల్సి ఉంటుంది. దీని వల్ల అద్దె ఆదాయం ఎక్కువగా ఉన్న వారిని ప్రభుత్వం పన్ను పరిధిలోకి తీసుకురాగలుగుతుంది. ఇది 2017 జూన్ 1 నుండి అమలులోకి వస్తుంది. జూలై 1 నుండి పాన్(శాశ్వత ఖాతా నంబరు)కు దరఖాస్తు చేసేటపుడు, ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేటపుడు ఆధార్ తప్పనిసరి చేసింది. నిజానికి.. వ్యవస్థలో నల్లధనాన్ని తొలగించేందుకు నగదు లావాదేవీలను రూ.మూడు లక్షలకు పరిమితం చేయాలని తొలుత ప్రతిపాదించిన ప్రభుత్వం.. ఆ పరిమితిని రూ. రెండు లక్షలకు తగ్గించింది. ► వ్యక్తులు జాతీయ పింఛను వ్యవస్థ(ఎన్పీఎస్) నుండి పాక్షిక ఉపసంహరణలు జరిపినట్లయితే ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతిపాదిత మార్పుల వల్ల.. ఎన్పీఎస్ ఖాతాదారులు పదవీ విరమణ కన్నా ముందుగా తమ ఖాతా నుండి 25 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. పదవీ విరమణ చేసినపుడు 40 శాతం విత్‌డ్రా చేసుకుంటే దానిపైనా పన్ను ఉండదు. ► ఆదాయ పన్ను రేట్లలో ఈ మార్పులకు తోడు.. ఈ ఆర్థిక సంవత్సరం నుండి కార్లు, మోటార్‌సైకిళ్లు, ఆరోగ్య బీమా ప్రీమియంలు పెరగనున్నాయి. ఏజెంట్ల కమిషన్‌ను బీమా సంస్థలు సవరించడానికి బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ అనుమతివ్వడం దీనికి కారణం. సవరించిన తర్వాత ప్రీమియంలో మార్పు ప్రస్తుత రేట్లకు ఐదు శాతం ఎక్కువ లేదా తక్కువకు పరిమితం చేస్తారు. అలాగే ఈ నెల మొదటి తేదీ నుండి వాహనాలకు థర్డ్ పార్టీ బీమా రేట్లు కూడా పెరగనున్నాయి. ► భారతదేశపు అతి పెద్ద వాణిజ్య బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన లక్షలాది మంది వినియోగదారులకు ఏప్రిల్ 1 నుండి పలు జరిమానాలు వర్తించనున్నాయి. వారి ఖాతాల్లో ప్రతి నెలా కనీసం రూ.5,000 నిల్వ నిర్వహించకపోతే జరిమానా పడుతుంది. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో.. కనీస నిల్వ మొత్తమైన రూ.5,000లో 75 శాతంకన్నా తగ్గితే.. రూ.100, దానిపై సేవా పన్నుతో కలిపి చార్జీ వసూలు చేస్తారు. కనీస నిల్వ 50 శాతం కన్నా తగ్గితే రూ.50, దానిపై సేవా పన్ను కలిపి జరిమానా విధిస్తారు.