
ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు సందేహాల నివృత్తి కోసం తరచుగా అడిగే ప్రశ్నలకు జవాబులు కూడా పొందుపర్చారు. ఇలా చేయటంతో డిపార్టుమెంటువారీ స్నేహభావం, సన్నద్ధంగా ఉండే విధానం రెండూ తెలుస్తున్నాయి. వ్యక్తుల ఆదాయపు పన్ను వరకు 21 ప్రశ్నలు ఉన్నాయి. వాటి సారాంశమే ఈ వారం కథనం.
కొత్త విధానం అంటే ఏమిటి?
కొత్త విధానంలో రాయితీ ఉండే పన్ను రేట్లు, ఉదారమైన శ్లాబులుంటాయి. స్టాండర్డ్ డిడక్షన్ మినహా ఎటువంటి మినహాయింపులు ఉండవు.
రేట్లు, శ్లాబులు
గతంలో ఈ శ్లాబులు, రేట్ల గురించి తెలియజేశాం. ఇక్కడ బేసిక్ లిమిట్ రూ.3,00,000 నుంచి రూ.4,00,000కు పెంచారు. రూ.4 లక్షల వరకు పన్ను ఉండదు. రూ.12 లక్షలు దాటిన వారికి మాత్రం రూ.4,00,000 నుంచి పన్ను శ్లాబుల ప్రకారం వడ్డిస్తారు. శ్లాబుల విషయంలో నాలుగో ఎక్కం.. రేట్ల విషయంలో ఐదో ఎక్కం గుర్తు పెట్టుకుంటే చాలు. ప్రతి రూ.ఒక లక్ష ఆదాయం పెరుగుదలకు ఎంత పన్ను భారం ఏర్పడుతుంది? ప్రస్తుతం ఎంత? ప్రతిపాదనల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది? అనే విషయాలను అంకెలతో ఉదాహరణగా పట్టిక పొందుపరిచారు.
ఎంత వరకు పన్ను చెల్లించనక్కర్లేదు?
కొత్త విధానంలో రూ.12,00,000 వరకు పన్ను భారం ఏర్పడదు.
పన్ను భారం ‘నిల్‘గా ఉండాలంటే ఏం చేయాలి?
రూ.12,00,000 వరకు ఆదాయంపై పన్ను భారం నిల్‌గా ఉండాలంటే కొత్త విధానాన్ని విధిగా ఎంచుకోవాలి. ఆ మేరకు రిటర్నులు దాఖలు చేయాలి.
కొత్త విధానం ఎవరికి వర్తిస్తుంది?
కొత్త విధానం వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు, వ్యక్తుల కలయిక లేదా సంస్థలకు వర్తిస్తుంది.
పన్నెండు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఏమిటి ప్రయోజనం?
ఒకప్పుడు రూ.12,00,000 ఆదాయం ఉన్న వారు రూ.80,000 వరకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు వారు ఏమీ చెల్లించనక్కర్లేదు.
ఆదాయ పరిమితిని పెంచినట్లా?
అవుననే చెప్పాలి. నిల్‌గా పన్ను భారం రావాలంటే రూ.12,00,000 లోపల ఆదాయం
ఉండాలి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ట్యాక్సబుల్ పరిమితిని పెంచినట్లు.
అంటే రిబేటును పూర్తిగా వాడుకున్నట్లు.
గతంలో ‘నిల్’కి లిమిట్ ఎంత ఉంది?
ఒకప్పుడు ఇటువంటి లిమిట్ రూ.7,00,000గా ఉండేది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.12,00,000కు పెంచారు.
కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ తగ్గిస్తారా?
కొత్త విధానంలో ఉద్యోగస్తులకు రూ.75,000 తగ్గిస్తారు. ఈ తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగస్తులకు రూ.12,75,000 వరకు పన్ను ఉండదు.
పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ఎంత?
పాత విధానంలో రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే. ఎటువంటి పెంపుదల లేదు.
మార్జినల్ రిలీఫ్‌ను ఎలా లెక్కించాలి?
రూ.12,00,000 దాటితే రూ.4,00,000 నుంచి పన్ను భారం లెక్కించాలి. మీ ఆదాయం రూ.12,10,000 అనుకోండి, సాధారణంగానైతే పన్ను భారం రూ.61,500. ఇటువంటి వారికి ఇచ్చే ఉపశమనాన్నే మార్జినల్ రిలీఫ్ అంటారు. ఈ రిలీఫ్ వల్ల స్వల్పంగా అదనపు ఆదాయం ఉన్నా అధిక పన్ను చెల్లించనక్కర్లేదు. ఇలాంటప్పుడు పన్నుభారం రూ.10,000 మాత్రమే. ఇలా రూ.12,75,000 వరకు రిలీఫ్ కల్పించారు. ఈ మేరకు చక్కటి, సంపూర్ణమైన ఉదాహరణ ఇచ్చారు.
ఎంత మొత్తం రిబేటు ఉంటుంది?
రిబేటు రూ.60,000 దాటి ఇవ్వరు.
రిబేటుకి మార్జినల్ రిలీఫ్‌కి తేడా ఏమిటి?
రూ.12,00,000 లోపు ఆదాయం ఉన్నప్పుడు ఇచ్చేది రిబేటు. రూ.12,00,000 దాటిన తర్వాత (రూ.12,75,000 వరకు) వచ్చేది మార్జినల్ రిలీఫ్.
ఇదీ చదవండి: ఫండ్ పనితీరు మదింపు ఇలా..
ఇతర ఆదాయాలకు రిబేటు వర్తిస్తుందా?
మూలధన లాభాలు, లాటరీ మొదలైన వాటి వల్ల ఏర్పడ్డ ఆదాయాలకు ఈ రిబేటు వర్తించదు. ఏ ఆదాయం మీద స్పెషల్ రేటు ఉందో, దాని మీద
రిబేటు రాదు.
ఎంత మంది లబ్ధిదార్లు ఉన్నారు?
గత సంవత్సరం 8.75 కోట్ల మంది కొత్త విధానంలో రిటర్నులు వేశారు. వారందరికీ ఇప్పుడు లాభం చేకూరుతుంది.
ఎంత ఆదా అవుతుంది?
ఈ మార్పుల వల్ల సుమారుగా రూ.లక్ష కోట్లు ట్యాక్స్‌పేయర్స్ చేతిలో మిగులుతుంది. అదే వినియోగం పెరిగేందుకు నాంది.
-కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య
ట్యాక్సేషన్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment