ఆలుమగలిద్దరూ ఉద్యోగస్తులైతే.. పన్నుభారం తగ్గించుకోవడం ఎలా? | How To Reduce Tax Burden If Both Husband And Wife Are Employed, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఆలుమగలిద్దరూ ఉద్యోగస్తులైతే.. పన్నుభారం తగ్గించుకోవడం ఎలా?

Published Mon, Dec 23 2024 7:02 AM | Last Updated on Mon, Dec 23 2024 10:16 AM

How to Reduce Tax Burden if Both Husband and Wife Are Employed

గతవారం ఉద్యోగస్తులకు సంబంధించి వారి ఆదాయం విషయంలో కొత్త విధానమా.. పాత పద్ధతా.. ఏది మంచిది.. ఏ విధంగా అయితే పన్నుభారం తక్కువ అవుతుందనేది ఉదాహరణపూర్వకంగా తెలుసుకున్నాం. ఈవారం ఒకే కుటుంబంలో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఎలా ఆలోచించాలో ఎలా ప్లాన్‌ చేయాలో తెలుసుకుందాం. ఇద్దరూ ఉద్యోగస్తులైనా.. ఇద్దరూ రిటైర్‌ అయినా.. ఒకరు రిటైర్‌ అయి ఒకరు ఉద్యోగంలో ఉన్నా ఈ ఆలోచనలను అమలుపరచవచ్చు.

ఇద్దరూ గవర్నమెంటుకు సంబంధించిన వారయితే..
గవర్నమెంటు నుండి జీతం/పెన్షన్‌ పుచ్చుకున్న వారైతే వారి వారి జీతభత్యాల విధానం వల్ల ఎటువంటి వెసులుబాటు ఉండదు. పే స్కేల్, వేతన ప్రమాణాలు, పే స్ట్రక్చర్‌.. అన్నీ నిర్దిష్టంగా ఉంటాయి. ఉద్యోగి తనకు అనుకూలంగా మార్చుకునే వెసులాటు ఉండదు. అన్నీ ప్రీ ఫిక్సిడ్‌. కాలానుగుణంగా పే రివిజన్‌ ప్రకారం మారతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదాయం వచ్చినదంతా లెక్కించాల్సిందే. ఇద్దరి జీతభత్యాలను, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోండి. ఇద్దరికి ఇంచు మించు సమానమైన జీతభత్యాలు ఉంటే పెద్దగా ఆలోచించే పని లేదు. అంటే ఇద్దరూ ఒకే శ్లాబులో ఉంటే పన్నుభారం మారదు. ఎవరూ కట్టినా ఒకటే! పెద్దగా వెసులుబాటు ఉండదు. ఆస్కారం ఉండదు.

కానీ జీతభత్యాల్లో తేడాలుండి.. ఆ తేడాల వల్ల శ్లాబులు మారే అవకాశం ఉంటే ఏదైనా ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. 
➤ఒకరు జీరో.. ఒకరు 10 శాతం
➤ఒకరు 10 శాతం.. ఒకరు 20 శాతం
➤ఒకరు 20 శాతం.. ఒకరు 30 శాతం
ఎక్కువ శ్లాబులో ఉన్నవారైతే కంపల్సరీగా సేవింగ్స్‌ ఉంటాయి. పీఎఫ్‌ మొదలైనవి నిర్దిష్టంగా.. అంటే మీ ప్లానింగ్‌తో నిమిత్తం లేకుండా ఉంటాయి. అవి విధిగా చెల్లించవలసిందే. ఎక్కువ శ్లాబులో ఉన్నా వీలున్నంత వరకు సేవ్‌ చేసి మినహాయింపులు పొందండి. తక్కువ/చిన్న శ్లాబులో కంపల్సరీ సేవింగ్స్‌ని దాటి వెళ్లొద్దు.

సొంత ఇల్లు ఉండి.. దాని మీద రుణం.. వడ్డీ ఉంటే.. ఎక్కువ శ్లాబున్న వారి అకౌంట్లో పేమెంట్లు జరగాలి. క్లెయిమ్‌ చేసే వారి బ్యాంకు అకౌంట్లోనే డెబిట్లు ఉండాలి. దస్తావేజుల్లో ఇద్దరి పేర్లు ఉంటే సమానంగా క్లెయిమ్‌ చేయండి. ఒక్కరి పేరే ఉంటే ఆ ఒక్కరే క్లెయిమ్‌ చేయండి.

ఈ మేరకు, కాగితాలు, ప్లాన్లు సబ్మిట్ చేసినప్పటి నుంచి అప్రూవల్, బ్యాంకు పేమెంట్లు, బిల్లులు, ఒప్పందాలు, రశీదులు, రిజిస్ట్రేషన్‌ అన్నింటి వరకు అలాగే ఉండేలా జాగ్రత్తపడండి. అలాగే రుణ సౌకర్యంతో కట్టించిన ఇంటి మీద ఆదాయం, వచ్చిన అద్దె సమానంగా అకౌంటు చేయండి. ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటే ఎవరో ఒకరు, ఎక్కువ శ్లాబులో ఉన్నవారు, ఇంటద్దె అలవెన్స్‌ మినహాయింపు పొందండి. ఇద్దరూ విడివిడిగా ఒకే ఊరిలో ఉద్యోగం ఉంటే క్లెయిమ్‌ చేయకండి. వేరు వేరు ప్రాంతాల్లో ఉంటే ఎటువంటి తప్పు లేదు. ప్లానింగ్‌ వల్ల నాలుగు రూపాయలు మిగులుతాయి అని అనుకోకుండా మీకు మనశ్శాంతి ఉండేలా ఉండండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement